కొంత చరిత్రా, కొంత కల్పన – “ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం”

 

~ కొల్లూరి సోమ శంకర్

~

కొల్లూరి సోమ శంకర్

11 సెప్టెంబర్ 2001 – చరిత్ర గతిని మార్చిన రోజు. ప్రత్యక్షంగా అగ్రరాజ్యాన్ని, పరోక్షంగా ఎందరో సామాన్యులని ప్రభావితం చేసిన రోజు. ఉగ్రవాదులు న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క ట్విన్ టవర్స్‌ను విమానాలతో కూల్చేయడంతో అమెరికాలో ప్రారంభమైన భయం – ప్రపంచంలోని చిన్నా, పెద్దా దేశాలకు పాకిపోయింది. తీవ్రవాదులు ప్రయాణీకుల వేషంలో దాడి చేయచ్చనే భయం నుంచి మొదలైన అనుమానాలు పెనుభూతాలై, భద్రతాచర్యలు విపరీతమయ్యాయి. కొత్త చట్టాల ఏర్పాటుకు నాంది పలికాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాలలో అనుమానస్పదంగా కనబడే ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారించడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎందరో అమాయకులను అనుమానితులుగా భావించి, వారిని అరెస్ట్ చేసి, విచారణ జరిపి తాపీగా విడుదల చేయడాలు ఎక్కువైపోయాయి. అంతేకాదు, విమానం గాల్లో ఉన్నప్పుడు కొందరు ప్రయాణీకుల ప్రవర్తన నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా భయపడడం, ఉగ్రవాదాన్ని ఓ మతానికి ఆపాదించి – నామరూపాలు విభిన్నంగా ఉంటే – వాళ్ళని అరెస్ట్ చేయడం వంటివి ఎన్నో విమానాశ్రాయాలలో కలకలం రేపాయి.

ప్రముఖ రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారి నవల “ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం” కూడా ఈ నేపథ్యంలోనే సాగుతుంది. “రోజురోజుకూ పెరుగుతున్న మత తీవ్రవాదపు పరిణామాలేమిటో అర్థమయింది. ఈ ఆందోళనల్లో సామాన్యుడి జీవితమెంత అతలాకుతలంగా తయారవుతుందో చూపెట్టడంతో బాటూ దీనికంతా మూలకారణమైన మతం, దాని పుట్టుక, స్వభావం గురించిన అన్వేషణకు కూడా నేనీ నవలను రాయడానికి పూనుకున్నాను.” అని చెబుతారు రచయిత.

అనుకోని ఘటనల వల్ల ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో ముప్ఫయి గంటలకి పైగా చిక్కుకుపోయిన ప్రయాణీకులలో ఇద్దరి ద్వారా ఈ కథ సాగుతుంది. మెక్సికోలోని ఓ అంతర్జాతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న సెమినార్‌లో పేపర్ ప్రెజెంట్ చేయడానికి వెడుతున్న ఓ తెలుగు ప్రొఫెసర్‌కి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పరిచయమవుతాడు ఓ హిందీ భాషీయుడు దమ్మలాల్ చోప్రా. అతనికి ఇంగ్లీషు అంతంత మాత్రంగానే వచ్చు. ప్రొఫెసర్ గారికి హిందీ అంత బాగా రాదు. వీరిద్దరి సంభాషణలు, ఇతరులతో వీరి సంభాషణలు పాఠకులను ఆకట్టుకుంటాయి. దమ్మలాల్ తనకు మార్మిక సంకేతాలు అందుతున్నాయని నమ్మే వ్యక్తి. మన ప్రొఫెసర్ గారేమో హద్దుల్లేకుండా పెరుగుతున్న నేటి సాంకేతిక ప్రపంచం పట్ల అబ్బురపడే మనిషి. మరి వీరిద్దరికి ఎలా పొసుగుతుంది? దమ్మలాల్ చర్యల వల్ల ప్రొఫెసర్ గారు ఏ ఇబ్బందులు పడ్డారు?  అసలీ భయాలకి మూలం ఏమిటి? తోటివారి ప్రాణాలు తీయమని ఏ మతమైనా చెబుతుందా? మత విశ్వాసాలకు విపరీత భాష్యాలు ఎలా మొదలయ్యాయి? ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలు పాఠకుల మనస్సుల్లో అలజడి కలిగిస్తాయి.

దమ్మలాల్ చోప్రా ప్రవర్తన ప్రొఫెసర్ గారికి అసమంజసంగా అనిపించినా, అతనికి మాత్రం తన నడవడికలో ఏ లోపమూ కనిపించదు. పైగా తాను స్వాభావికంగా ఉన్నట్లే ప్రవర్తిస్తాడు. ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో అద్భుతం జరగబోతోందని భావిస్తూంటాడు. అదే మాట పదే పదే వల్లిస్తూంటాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూర్చుని ఉన్నప్పుడు తాము 22 గంటల పాటు ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉండాల్సి వస్తోందని ప్రొఫెసర్ గారు వాపోయినప్పుడు తోటి ప్రయాణీకుడైన చైతన్య అనే తెలుగు కుర్రాడు, “ఆమ్‌స్టర్‌డాంలో కాలం గడపడమంటే అదొక పెద్ద అవకాశమంకుల్…. ఆ యెయిర్‌పోర్టొక మాయాబజార్…. యిక ఆ వూరే పెద్ద అమ్యూజ్‌మెంట్ పార్కు. యెన్ని పార్కులూ, యెన్ని కాఫీ షాపులూ, యెన్ని మ్యూజియంలూ…. వొక్క రోజేం చాలుతుంది? యువార్ లక్కీ!…” అని అంటాడు. “వూళ్ళోకి వెళ్ళడానికి మాకు వీసా లేదు… యెయిర్‌పోర్ట్‌లోనే కాలంతోయాలి..” అని ప్రొఫెసర్ గారు విచారంగా జవాబిస్తే, “అయినా పర్వాలేదంకుల్! వోన్లీ ట్వెంటీ హవర్స్…. వొక్కో షాపును చూడ్డానికో అరగంట వేసుకోండి. మీరెంత వేగంగా తిరిగినా షాపులే మిగిలిపోతాయి…” అని అంటాడు. వీళ్ళ దృక్పథాలలో ఎంతటి వ్యత్యాసం? బహుశా అనుభవాలే మనిషికి ధైర్యాన్ని, భయాన్నీ కూడా కలిగిస్తాయేమో!

ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో ఆగినప్పుడు రెస్ట్ రూంకి వెళ్ళాల్సివస్తుంది దమ్మలాల్ చోప్రాకి. ఆ సమయంలోనే చైతన్య వాలెట్ పోతుంది. దాన్ని వెతకడానికి చోప్రాని సహాయంగా తీసుకువెడతారు చైతన్య మిత్రబృందం. గంటల సమయం గడిచిపోతూంటుంది. దమ్మలాల్ రాడు. ప్రొఫెసర్ గారికి టెన్షన్ పెరిగిపోతుంది. ఆయన ఎక్కాల్సిన విమానానికి బోర్డింగ్ ఎనౌన్స్ చేస్తారు. ఇద్దరిదీ కలిపి జాయింట్ టికెట్ కావడంతో తన తోటి ప్రయాణీకుడు రాకపోతే ఏమంటారో అని భయపడతాడు. చివరికి తెగించి సెక్యూరిటీ చెక్ ముగించుకుని విమానం ఎక్కేస్తాడు. అదే సమయంలో దమ్మలాల్ కూడా విమానంలోకి వచ్చేస్తాడు. ఎందుకాలస్యం అంటే… ఓ అద్భుతానికి నాందీ ప్రస్తావన జరిగిందని చెబుతాడు? ఏమిటా సంఘటన? అతను అద్భుతానికి టీజర్‌గా భావించిన ఆ ఘటన యొక్క అసలు స్వరూపం తెలిసాక ప్రొఫెసర్ గారికి ఒళ్ళు జలదరిస్తుంది.

***

తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఆమ్‌స్టర్‌డాం సమీపిస్తుంటారు. ఇక్కడ విమానం భూమి మీదకి దిగడం గురించి రచయిత చెప్పిన తీరులోని భావుకత పాఠకులను మైమరపిస్తుంది. “విమానం మేఘాల దొంతరలను చీల్చుకుంటూ కిందకి దిగసాగింది. కిటికీలోంచీ కనబడుతున్న భూమి క్రమంగా దగ్గరవసాగింది. నగరాన్ని పాయలు పాయలుగా కమ్ముకున్న నదీ, నదీ పాయల మధ్య పెరుగుతున్న చెట్లూ, చెట్ల మధ్యలో యిండ్లూ, యిండ్ల మధ్యలో యెండిన కాలవల్లాంటి రోడ్లూ, రోడ్లపైన పరిగెడుతున్న వాహనాలూ, అన్నీ క్రమంగా దగ్గరకు వచ్చాక, నిర్జనమైన విమానాశ్రయపు రన్‌వే పైకొచ్చిన విమానం, అలవోకగా టైర్లు దించి, రోడ్డు పైన పరిగెత్తసాగింది.” ఈ వాక్యాలు చదువుతున్న పాఠకులు స్వయంగా తామూ ఆ విమానంలో ఉన్నట్లు, ఆకాశం నుంచి నేలకు దిగుతున్నట్లు భావిస్తారు కదూ?

సరే, మొత్తానికి విమానం నేలని తాకుతుంది. కానీ ప్రయాణీకులెవరూ కిందకి దిగడానికి అనుమతి లభించదు. కారణం, ప్రయాణీకులలోని కొందరి ప్రవర్తన. ఎయిర్ మార్షల్స్ వారిని అదుపులోకి తీసుకుని, దూరంగా తీసుకెళ్ళాక గాని మిగతా ప్రయాణీకులకి విముక్తి లభించదు. వీళ్ళిద్దరూ ఓ మూల లాంజ్‌లో కూర్చుంటారు. సెక్యూరిటీ చెక్‍లో దమ్మలాల్ సంచీలో ఉన్న మందులు, పుస్తకాలు తీసుకుంటారు విమానాశ్రయపు అధికారులు. సమయం గడుస్తూ ఉంటుంది. దమ్మలాల్ చోప్రా డైరీలోని రాతలని చదివి అర్థం చెప్పమని ప్రొఫెసర్‌ని పిలుస్తారు అధికారులు. డైరీలో రాసి ఉన్నది కవిత్వమనీ… ఆ కవితల భావాన్ని వివరిస్తాడు ప్రొఫెసర్. “అనంతమెపుడూ యేకవచనమే! అనంతమెపుడూ అద్వయితమే! అనంతానికి మధ్యవర్తులెందుకు? అనంతానికి చేతులెందుకు? అనంతానికి మాటలెందుకు?” అని రాసున్న ఓ కవితని చదివి వినిపిస్తే, “టెల్ మీ ది ఆన్సర్ ఆల్సో!” అంటూ అడ్డు తగులుతాడో సెక్యూరిటీ ఆఫీసర్. అప్పుడక్కడ జరిగిన ఉదంతం పాఠకులని ఉక్కిరిబిక్కిరి చేసేలా నవ్విస్తుంది.

జరగబోయే అద్భుతం కోసం ఎదురుచూస్తున్న దమ్మలాల్ తన మాటలతో, చేష్టలతో ప్రొఫెసర్ గారిని బెంబేలెత్తిస్తాడు. జేబుల్లో ఉన్న నాలుగువేల రూపాయల ఇండియన్ కరెన్సీ ఇక్కడ చెల్లకపోవడం పట్ల అంతర్జాతీయ విప్లవం లేవదీయాలనుకుంటాడు. అతని మాటలకు జాలి చూపెడుతూ, సానుభూతి చెందుతూ, కంగారు పడుతూ, వంత పాడుతాడు ప్రొఫెసర్. అద్భుతం జరగబోతోందంటూ ఊదరగొడతాడు దమ్మలాల్. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఓ హోటల్లో హౌస్ అరెస్ట్ లాగా పడేస్తారు అధికారులు. “మేము తీవ్రవాదులయివుంటామనే అనుమానం, దేశాల ఎంబసీలే చేయలేని పనిని చిటికెలో చేసి పారేసింది. యిప్పుడిక్కడ మాకు పైసా ఖర్చు లేకుండా, అయిదు నక్షత్రాల హోటల్లో వసతీ, భోజనమూ దొరుకుతున్నాయి. యింతకంటే చిత్రమేముంటుంది? మొదటి నుంచీ దమ్మలాల్ చోప్రా చెబుతున్న అద్భుతం యిదేనేమో!” అనుకుంటాడా ప్రొఫెసర్.

చివరికి ఢిల్లీ వెళ్ళే విమానం ఎక్కి కూర్చుంటారు. ఈ విమానం కూడా సమయానికి ఎగరదు. ప్రయాణీకులందరూ ఎక్కినా విమానం బయల్దేరదు. ఓ పిల్లాడి దుందుడుకు చర్య వల్ల బాగా ఆలస్యం అవుతుంది. చివరికి విమానం గాల్లోకి ఎగురుతుంది. ప్రయాణం కొనసాగి ఢిల్లీ సమీపిస్తుంది. ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం జరిగిపోయిందని అంటాడు దమ్మలాల్ చోప్రా. “యింత ప్రమాదకరమైన పరిస్థితులలో, చివరకు సెక్యూరిటీ వాళ్ళు మనల్ని అనుమానించినా, తప్పకుండా తీవ్రవాదులే అనిపించే వ్యక్తులతో బాటూ మనం కలిసి తిరగవలసి వచ్చినా, యిలా తప్పించుకుని తిరిగీ మనం మన దేశానికి చేరుకుంటున్నాం చూడూ, అదీ అదీ అద్భుతం!” అంటాడు ప్రొఫెసర్.

విమానం ఢిల్లీలో లాండవుతుందనగా… వాళ్ళిద్దరు అప్పటిదాక దాచివుంచిన తమ మనోభావాలను వెల్లడించుకుంటారు. పాకిస్తానీలాగానో, అఫ్ఘనిస్తాన్ వాడిలానో అనిపించే దమ్మలాల్‌తో కలసి ప్రయాణం చేసినందుకు ప్రొఫెసర్ భయపడినట్లే, ముస్లిం అయిన ప్రొఫెసర్‌తో కలసి ప్రయాణించినందుకు దమ్మలాల్ భయపడతాడు. అయితే ఇందుకు తామిద్దరం కారణం కాదని అంటాడు ప్రొఫెసర్. మరెవరు కారణం?

***

కారణాలను, కారకాలను అన్వేషించే ప్రశ్నలతో పాఠకులను ఆకట్టుకుంటుందీ పుస్తకం. ఉత్కంఠగా చదివించే ఈ నవలని 2013లో “కథాకోకిల ప్రచురణలు” వారు ప్రచురించారు. 100 పేజీలున్న ఈ నవల వెల రూ.60/- (ప్రస్తుతం ధర మారి ఉండచ్చు). ప్రచురణకర్తల వద్ద, విశాలాంధ్ర వారి అన్ని కేంద్రాలలోనూ ప్రింట్ బుక్ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

 

ప్రచురణకర్తల చిరునామా:

Kathakokila Prachuranalu

15-54/1, Padmavathi Nagar,

Tirupati West – 517 502

Phone: 0877-2241588

 

మీ మాటలు

*