సూఫీలు మనకి అర్థం కానేలేదు!

 

 

(గత గురువారం తరువాయి)

రాణీ శివశంకర శర్మ

రాణీ శివశంకర శర్మ

ఈ రాజ్యాధికారభావన, ఆధిపత్యవాంఛ పెరగడంతో సూఫీలూ పూర్వరుషులూ చేసిన కృషి మరుగున పడిపోతోంది. బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెరిటోరియల్ భావన, హద్దులు గీసుకొనే నైజం దేశంలోని బహుళత్వాన్ని రద్దు చేసింది. ఒకేజాతి అనే భావనకి దారితీసింది. ముస్లింలు పరాయివాళ్ళయ్యారు. ఇలాంటి ఏకశిలా సదృశ జాతి నిర్మాణం పూర్తిగా ఆధునికం. అంబేద్కర్ వంటి మేధావి కూడా ఈ ఉచ్చులో చిక్కుకు పోయాడు. ముస్లింలు ప్రమాదకరమైన వాళ్ళని, జనాభా మార్పిడే పరిష్కారమని ఆయన అన్నాడు.

భారతదేశపు బహుళత్వం జాతి నిర్మాణం లేకపోవడం వల్లే సాధ్యమైంది. జాతి నిర్మాణానికి బహుళత్వం సమిధగా మారింది. ఒకే జాతిని నిర్మించాలన్న ఆతృతే బ్రాహ్మణీయ హిందూయిజానికి ఆధారభూమిక.

అంబేద్కర్ కానీ, అంబేద్కర్ని విమర్శించిన రంగనాయకమ్మ కానీ సంస్కృత బ్రాహ్మణ గ్రంధాల్నే టార్గెట్ చేయడం ద్వారా అవే భారతీయ సంస్కృతికీ, నీతికీ, చట్టాలకీ ప్రాతినిధ్యం వహిస్తాయనే భావనని పెంచి పోషించారు. నిజానికి బ్రిటిష్ పూర్వ సమాజంలో స్థానిక పంచాయతీలు తీర్పులు చెప్పేవి. అవి చాలా బహుళమైనవి. ఈ పంచాయతీలలో ఏ కులానికి ఆ కులంగా విడివిడిగానూ, మొత్తం గ్రామానికి అన్ని కులాల సభ్యులతో కలిసినట్టివీ జ్యూరీలుండేవి. చాలా మంది పొరబడుతున్నట్టు బ్రాహ్మణులకు వీటి మీద పెత్తనమేమీ ఉండేది కాదు.

నిజానికి అన్ని గ్రామాల్లోనూ బ్రాహ్మణులు ఉండే అవకాశమే లేదు. ఉన్నా అందరికీ సంస్కృతం రాదు. విలియం జోన్స్ అనే ఇంగ్లీషు దొర మనుస్మృతిని ఆంగ్లంలోకి అనువదించాడు. దానిప్రకారం బ్రిటిష్ వాళ్ళు హిందూలాని సృష్టించారు. సదరు విలియం జోన్స్ చేతిలో బైబిల్ బదులు మనుస్మృతిని పట్టుకొని ఇంగ్లాండ్ లోని సెయింట్ పాల్ చర్చి ముందు విగ్రహంగా మారాడు. మనుస్మృతిని పట్టుకున్న పెద్దమనిషి విగ్రహం ఇండియాలో మాత్రం కనబడదు అని రాశారు వెండీ దోనిగర్.

అంబేద్కర్ ప్రతికూల పద్ధతిలో మనుస్మృతికి ప్రాచుర్యం కల్పించారు. ఆయన పంచాయతీ చట్టాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాదు, సూఫీయిజం ఆయన అధ్యయనం చెయ్యలేదనీ అందుకే ముస్లింలని మతతత్వవాదులుగా చిత్రీకరించారని గెయిల్ ఆమ్ వెద్ కు ఒప్పుకోక తప్పలేదు. బ్రిటిష్ వారు బ్రాహ్మలకి, వారి గ్రంధాలకి, ప్రాధాన్యం పెంచారు. ఇటువంటి సంస్కర్తలు వారినే అనుసరించారు.

రంగనాయకమ్మనే తీసుకోండి. రామాయణ విషవృక్షం పేరుతో సంస్కృత వాల్మీకి రామాయణంపై ప్రతి వాక్య ఖండన చేశారు. హిందూవాదుల దృష్టిలోనూ రంగనాయకమ్మ దృష్టిలోనూ రామాయణమంటే సంస్కృత రామాయణమే. హిందూవాదులకి ఎ.కె.రామానుజన్ మీద వచ్చినంత ఆగ్రహం రంగనాయకమ్మ పైన రాకపోవడానికి కారణం అదే. లోపల్లోపల ఇద్దరి మధ్యా ఒక అంగీకారం వుంది. ఎకె రామానుజన్ వివిధ దృష్టులతో రాయబడ్డ అనేక వేల రామాయణాల గురించి మాట్లాడాడు. అవి కేవలం సంస్కృత భాషలోనివి కావు. ప్రజల నాల్కలపై నాట్యం చేసే రకరకాల కథనాలవి. బహుళత్వం అంటే భయపడే హిందూవాదులు రామానుజన్ కి వ్యతిరేకంగా తీవ్ర గందరగోళం సృష్టించారు.

రంగనాయకమ్మ, అంబేద్కర్ లాంటి ఆధునిక సంస్కరణ వాదులు సంస్కృత పురాణాలకీ, సంస్కృత బ్రాహ్మణ ధర్మశాస్త్ర గ్రంధాలకీ తీవ్ర ప్రాచుర్యం కల్పించారు. దీన్నే వైరభక్తి అంటారు. అసలు హిందూయిజం అంటే యేమిటి? దాన్నెలా నిర్వచిస్తారు? అని నిలదీయకుండా హిందూయిజం ఇలాంటిది అలాంటిది అని నిందించడం ద్వారా లెఫ్టిస్టులు హిందూవాదుల వలలో చిక్కిపోయారు. వారికి ప్రాచుర్యం కల్పించారు.

అంబేద్కర్ జనసామాన్యంలోని జానపదాల్లోని ఆచార వ్యవహారాల గురించి యేమీ మాట్లాడలేదు. తన కుటుంబానికి చెందిన కబీర్ పంథీ గురించే నోరు విప్పలేదు. తద్వారా సూఫీ సంస్కృతిని నిర్లక్ష్యం చేశాడు. అందువల్లనే ముస్లింల గురించి హిందూవాదుల్ని మించి నిందించాడు. మౌఖిక సూఫీ సంప్రదాయాన్ని పక్కన బెట్టి మళ్ళీ గ్రంథస్థ బౌద్ధంలో సాంత్వన కోరాడు.

ప్రొటెస్టెంటిజం గ్రంధానికి ప్రాధాన్యం పెంచింది. కేథలిక్ క్రైస్తవంలోనివి కానీ, క్రైస్తవ పూర్వ సమాజాలకు చెందినవి కానీ, గ్రంథేతర బహుళ కథనాల్ని చిన్నచూపు చూసింది, రూపుమాపింది. దాన్నే ఆదర్శంగా తీసుకున్నారు ఆధునిక మేధావులు. పుస్తకాల పురుగులుగా మారిపోయారు. కళ్ళకీ చెవులకీ అందే వాటిని చిన్నచూపు చూశారు. ఈ ప్రొటెస్టెంటిజం ప్రభావం మన కొంప కూడా ముంచింది. మన సంస్కరణ భావాలకు కూడా ఈ ప్రొటెస్టెంటిజమే మూలం. ప్రకృతిని స్వేచ్ఛగా పరిశీలించిన పరిశోధకులను కాథలిక్కుల కంటే ప్రొటెస్టెంట్లు ఎక్కువ హింసించారని అంటాడు మార్క్సు.

చరిత్ర పుస్తకాలకి పరిమితమైతే పురాణం జీవితాల్లోకి విస్తరిస్తుంది. పౌరాణిక ఊహలకు విస్తృతీ పరిధీ ఎక్కువ. పురాణానికి వాస్తవమనే పరిధి లేదు. అది వాస్తవాన్నే ప్రభావితం చేస్తుంది. వాస్తవాన్ని సృష్టిస్తుంది. మహారాష్ట్రలోని వొక గ్రామంలో ఉన్న సీత గుడికి వొక కథ ఉంది. పట్టాభిషిక్తుడైన రాముడు సీతను విడిచిపెట్టినప్పుడు ఆమె ఆ గ్రామంలో ఆశ్రయం కోరింది. ఆ గ్రామస్తులు నిరాకరించారు. దానికి పశ్చాత్తాపంగా సీతకి గుడి కట్టి పూజిస్తున్నారని స్థల పురాణం. ఒక స్వచ్ఛంద కార్యకర్త అక్కడికి వెళ్లి సీత పట్ల చూపిన అనుచిత వైఖరికి ప్రాయశ్చిత్తంగా స్త్రీలకి ఆస్తిహక్కు కల్పించాలని కోరగానే అక్కడి పురుషులు అందుకంగీకరించి ఆస్తి హక్కు కల్పించారు (Hinduism – An alternative history).

అందువల్ల పాజిటివ్ పద్ధతిలో పురాణకల్పనల్ని జోడించడం సమాజానికి చాలా మేలు చేస్తుంది. అందుకే చారిత్రక పురుషులకన్నా పురాణపురుషులు ఎక్కువ ప్రభావశీలురని రాం మనోహర్ లోహియా అంటాడు. భారతదేశంలో పురాణం చరిత్రని తనలో కలిపేసుకుంటుంది. అందుకే ఫక్తు చారిత్రక పురుషుల జ్ఞాపకాలు మనకు తక్కువ. స్వచ్ఛత వాస్తవికత అనే భ్రమల నుంచి భారతీయులు ఎప్పుడో బయట పడ్డారు. వాస్తవాలకి తమ దృష్టి కోణాన్ని జోడించి, శుష్క వాస్తవంలో జీవించడం కాక కల్పనని వాస్తవంగా మలచుకోవాలని, కలలని నిజం చేసుకోవాలనేది భారతీయ తత్త్వం. దీన్ని భారతీయుల అజ్ఞానంగా భావించేవాళ్ళే అజ్ఞానులు. దీన్ని చీకటిగా చరిత్రహీనతగా భావించే వాళ్ళే దివాంధులు.

అందుకే గాంధీ పురాణపురుషులనే స్మరించాడు. కబీర్ లా ఈశ్వర్ అల్లా తేరే నామ్ అన్నాడు. అంతేకానీ అశోకుడినో అక్బర్ నో తలవలేదు. శ్రీశ్రీ కి కూడా ఈ రహస్యం తెలుసు. అందుకే అతని కవితల్లో పురాణ ప్రతీకలే కనిపిస్తాయి కానీ చారిత్రక ప్రతీకలు కనిపించవు. పురాణంలో చరిత్ర లీనమై గాఢమైన స్మృతిగా మారింది. అది మెలకువకీ స్వప్నానికీ సంధి కుదిర్చింది. చరిత్రనీ పురాణాన్నీ అభేదం చేసింది. అందుకే దళిత కవులు కూడా పురాణప్రతీకల చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. పురాణాలని సరికొత్తగా వ్యాఖ్యానించాలని చూస్తున్నారు. గ్రీసులోలా మనకి పురాణం గతం కాదు, వర్తమానం.

పురాణం స్థలకాలాల్ని అధిగమించేలా చేసింది. మతాల సరిహద్దుల్ని చెరిపేసింది. వెంకటేశ్వరస్వామికీ బీబీనాంచారికీ పెళ్లి చేసింది. పీర్లపండగని సృష్టించింది. చరిత్రకీ శక్తి లేదు. చరిత్ర కార్యకారణ సంబంధం లో బంధిస్తుంది. ఓడిపోవడం గెలవడం అనే భావాల్ని బలం చేస్తుంది. స్వర్ణయుగం చీకటియుగం అంటూ కాలాన్ని స్పష్టంగా విభజిస్తుంది. మార్క్సు లాంటి వాళ్ళు కూడా దీనికి అతీతంగా లేరు.

ఈ కాలవిభజన ఏం చేస్తుంది? బ్రిటిష్ కి పూర్వం చీకటి రాజ్యం చేసిందని, ముస్లింలు రాకపూర్వం ఎప్పుడో స్వర్ణయుగం వుందని భావించేలా చేస్తుంది. ఆ పూర్వయుగాన్ని ఆ స్వర్ణయుగాన్ని హిందూ వాదులు హిందూ యుగం అన్నారు, దళితవాదులు బౌద్ధయుగం అన్నారు. అందరూ కలిసి ఇండో అరబిక్ కల్చర్ కి గల ప్రాధాన్యాన్ని తుంగలో తొక్కారు. ఇదే మతతత్వానికి పునాది.

ఈ పాశ్చాత్య క్రైస్తవ సంకుచిత దృష్టిపై ధ్వజమెత్తాడు దళితకవి పైడి తెరేష్ బాబు.

వచ్చే ప్రతిదాన్నీ స్వాగతించాలన్న ఉదారత్వంతో

ఎక్కువ సార్లు స్వాగతించింది పతనాన్నే  (నేనూ నా వింతలమారి ప్రపంచమూ)

‘వచ్చెనిదే బంగారుకాలం’ అని సంస్కర్త గురజాడ చేసిన కీర్తనలకి పూర్తివిరుగుడు తెరేష్ బాబు వాక్యం.

అమ్మానాన్నలను మమ్మీడాడీలుగా మార్చినదానా

అమ్ముకోవడంలో ఉందన్నమాట

అసలు జన్మ సార్ధకం

ఇక్కణ్ణుంచి చేపలు మాంసము చలువరాయి తదితరాలు

ఎగుమతి అయినట్లే

నేనూ నీకోసం ఎగుమతి కావడం

ఎంతమధురం!

పడ్డాం కదా కొట్టుకుపోదాం అనడమే

అసలు సిసలు ప్రవాహ స్పృహ.

ఈ వాక్యాలకి వ్యాఖ్యానాలు అనవసరం. సుదీర్ఘ కాలపు పాశ్చాత్య ఆధిపత్యం మనని స్వంత ఆలోచన లేనివారిగా మార్చేసింది. “ఇక్కడి చర్మం కింద అక్కడి చైతన్యం విషాదం” యీ విషాదం నుంచే హిందూవాదులూ కంచె ఐలయ్య లాంటి వలసవాద బహుజనవాదులూ పుట్టుకొస్తున్నారు. “మరో రెండు వందలేళ్ళు మనం బ్రిటిష్ వలస పాలనలో ఉంటే దేశంలోని శూద్ర ఛండాల శక్తులు మరిన్ని అవకాశాలు పొందగలిగేవి” అంటారు కంచె ఐలయ్య (ప్రజాతంత్ర మార్చ్ 25, 2001). దళిత మేధావి గెయిల్ ఆమ్ వెట్ భారీడ్యాం లను మోన్ శాంటో కంపెనీని ప్రపంచీకరణను సమర్ధించారని బి. చంద్రశేఖర్ రాశాడు (చంద్రయానం). అంబేద్కర్ కూడా పాశ్చాత్యం తీసుకువచ్చిన మెగా ప్రాజెక్టుల విధానాన్ని సమర్ధించాడని అరుంధతీరాయ్ విమర్శించింది (ఆనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ కి ముందుమాట).

నన్ను భీభత్సాల పాలు చేసి

నా జవసత్వాల్ని పీల్చేందుకు

నా నట్టనడి గుండెలో

నీ ప్రతినిధుల్ని భద్రంగా నాటావు.

యీ పరిస్థితిలో ఆత్మజ్ఞానం ఎలా సాధ్యం? రమణమహర్షి ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని పదేపదే చెప్పడానికి యీ వలసవాద పరాయీకరణ కారణమైందా? అసలు మనం కార్యకారణ సంబంధాన్ని చూసే తీరే వలసవాద కలుషితమైంది. వలసవాద అభివృద్ధి నమూనాని ప్రశ్నించే శక్తిని మనం కోల్పోయాం.

ఆ యీ పరిస్థితుల్లో గాంధీ పాశ్చాత్యంలో ప్రాచ్యాన్ని కనుగొనవలసి వచ్చింది. పాశ్చాత్యం భారతదేశపు గుండెల్లో తన ప్రతినిధుల్ని నాటడం వల్ల పరాయీకరణ మొదలైంది. దాంతో టాల్ స్టాయ్, థోరో వంటి పాశ్చాత్యుల నుంచి గాంధీ స్ఫూర్తి పొందవలసి వచ్చింది.

పాశ్చాత్య అభివృద్ధి నమూనాకి ప్రత్యామ్నాయాన్ని వెదకడం కష్టమై పోయింది. స్థానికంగా వెదకడం మరీ కష్టమై పోయింది. ఏమంటే, స్థానికుల్లో చాలామంది తమ గతమంతా చీకటిగా భావించారు. యింకా చెప్పాలంటే తమ గతం విచ్ఛిన్నమైపోయిందని, తమ స్మృతులు పూర్తిగా చెదిరిపోయాయని భావించారు. స్మృతులలో ఉమ్మడితనాన్ని మినహాయించడమంటే స్మృతుల్నే ధ్వంసం చేయడమనే సత్యాన్ని విస్మరించారు. అలాగే తమ గత స్మృతుల్ని అవమానకరంగా భావించారు. గతంలో అవమానం, హింస వుండొచ్చు. అవమానమూ హింసలే గతం కాదు. స్మృతుల్ని మొత్తంగా దహనం చెయ్యడం ఆత్మ విచ్ఛిత్తికి దారితీసింది. తెరేష్ బాబు మాటల్లో ‘పాశ్చాత్యమే నా ప్రేయసి’ అని ప్రకటించుకొని ముద్దులతో మూతి కాల్చుకోవలసి వచ్చింది.

పాశ్చాత్య ప్రేయసిని ముద్దాడడం వల్ల మన కార్యకారణ సంబంధం పరిశీలన అనేది ఎంతగా కలుషితమైందో ఎంతగా పాశ్చాత్య వలస వాద పంక నిమగ్నమైందో తెలుస్తుంది. ఇస్లాంను విశ్లేషించే టప్పుడు అంబేద్కర్ ముస్లింలు ఉండటంవల్ల జరిగిన దౌర్జన్యాలను పెద్దవిచేసి చూపించారు. ఉమ్మడి సంస్కృతి, సంక్లిష్ట సంస్కృతిలోని ప్రధాన అంశాలను, మొగలులు రాజపుత్రులు సాధించిన రాజకీయ ఐక్యతను, సూఫీలు సన్యాసుల బోధనలను ఆయన విస్మరించారు. ఆయనకు ఇస్లాం మీద అంత సానుభూతి యేమీ లేదు. టర్కీ ముస్లిం దాడుల సమయంలో బౌద్ధారామాలను నాశనం చేసినందువల్లే ఇండియా నుంచి బౌద్ధం కనుమరుగైందని ఆయన భావించాడు. హిందూ జాతీయవాదులు భావించినట్లు గానే ముస్లిం దురాక్రమణ దారులు బలవంతపు మతమార్పిడులకి ఒడిగట్టారని అంబేద్కర్ భావించాడు (Ambedkar-Towards an Enlightened India by Gail omvedt).

ఈ అభిప్రాయాలు హిందూవాదులకి వుపయోగించాయని దళిత మేధావి గెయిలీ ఆమ్ వెట్ అంగీకరించారు. ఉమ్మడి సంస్కృతి, సూఫీలు సన్యాసుల బోధలు మన మేధావుల చెవికెక్కలేదు. అందుకే ఏకశిలాసదృశ జాతి నిర్మాణం కోసం కలలు, ఆ క్రమంలో బౌద్ధం పేరుతోనో మరో పేరుతోనో ముస్లిం జాతి వ్యతిరేకత వంటి యూరోపీయ ప్రొటెస్టెంట్ ఫాసిస్టు భావజాలం రాజ్యం చేసింది. దానినుంచే హిందూ ఫాసిజం పురుడు పోసుకుంది. హిందూ ఫాసిజం బహుళ సంస్కృతుల స్థానాన్ని దురాక్రమించింది.

“అసలు విశ్వజనీనమైన అభివృద్ధి నమూనాలోనే దానికి అపరిచితమైన జీవన విధానాలను అర్ధం చేసుకోలేని లోపం ఉంది. తనకు తెలీని దాన్ని, ఇతరాన్ని అది భరించలేదు” (డి.ఆర్.నాగరాజు)

*

 

మీ మాటలు

 1. Lalitha P says:

  రంగనాయకమ్మ రామానుజన్ ల మధ్య తేడాని బాగా ఎత్తి చూపించారు.

  మహారాష్ట్రలో సీత గుడి ఉన్న గ్రామం పేరు చెప్తారా? ఉత్తరప్రదేశ్ లో ఒక గ్రామం ఉంది సీతామడి అని. అది పురాతనం కాదు గానీ అక్కడ సీత విగ్రహాలు ఒంటరిగా ఉంటాయి రాముడూ, రావణుడూ, పిల్లలూ ఎవరూ లేకుండా. గుడి, సీత విగ్రహాల ఈస్తటిక్స్ మాట అటుంచితే కొన్ని ఎకరాల స్థలంలో సీతే ఆక్రమించి ఉండటం ఒక చిత్రం. ఆ ఆవరణకి విడిగా కొంత దూరంలో పెద్ద హనుమంతుడి రంగుల సిమెంట్ విగ్రహం, ఆ పక్కన ఒక గుహలో మాత్రమే కొంచెంగా రామకథ కనిపిస్తాయి. దగాపడ్డ, లేదా తిరగబడ్డ అణగారిన స్త్రీలకు గుడులు కట్టి సామూహికంగా వారిని పూజించటం గ్రామదేవతలకి సంబంధించిన సంస్కృతి. అగ్రవర్ణ స్త్రీగానే ఎక్కువగా నిలిచి, విడిగా పూజలు అందుకోని సీత సీతామడిలో మాత్రం దేవతగా పూజలు అందుకుంటోంది. అలాగే ఉత్తరాఖండ్ లో రావణుడి గ్రామం ఉంది. ఇంత విభిన్నమైన సంస్కృతిని ఏకంగా అర్థం చేసుకోవటం కుదరని పని. ఎవరి దృష్టికోణం నుంచీ వాళ్ళు చెప్తుంటారు. నాగరాజుగారి కొటేషన్ చాలా అర్థవంతం.

 2. Srinivas Vuruputuri says:

  @LALITHA P.: “మహారాష్ట్రలో సీత గుడి ఉన్న గ్రామం పేరు చెప్తారా?”

  “However, there is at least one Sita mandir that I personally know of where Sita presides without Ram. I was introduced to it by the workers of Shetkari Sangathana. This is in Raveri village of Yeotmal district in Maharashtra.” (డానిగర్ ఇచ్చిన మధు కిష్వర్ వ్యాసం నుంచి)

 3. RANI SIVA SANKARA SARMA says:

  రావేరి గ్రామాన్ని గురించే నెను ప్రస్తావించాను. కరక్టే సార్ . యిక్కడ సీత శాపం . పశ్చాతాపం వంటి ప్రాచీన విశ్వాసాలు గ్రామీణులలో మానసిక పరివర్తనకి కారణ మయ్యాయి. స్త్రీల పేర్లతో ఆస్తులని రిజిస్టరు చేయడం మొదలుపెట్టారు. శరద్ జోషి అనే సంస్కర్త రామకతని హృద్యంగా బోధించేవాడు. ఆన్ని సామాజిక పాత్రలని పురుషుడు విజయవంతంగా నిర్వహించడం సులభమే కాని మహిళ పట్ల న్యాయంగా వ్యవహరించడమే కష్టం. యిదే వాల్మీకి రామకత సారం అనిబోధించేవాడు శరద్ జోషి. యిటువంటి బోధనలే గ్రా మీణులలో మార్పు తెచ్చాయి. దానికి శాపం, చేసినదానికి ప్రాయశ్చిత్తం వంటి విశ్వాసాలు తోడై మార్పు సులభమయిది. . యిక్కడ చట్టాలు కాదు. పురాణ కథనాలు. వాటికి తోడు పురాణ విశ్వాసాలు కలిసి ఫలితాలను యిచ్చాయి. అంతేకాని సంస్కృత గ్రంధాలని తిట్టిపోయడమో , లేక స్థానిక విశ్వాసాలు సహజ భాషా సంస్కృతీ ఏమాత్రం తెలియకుండా కృతక రోడ్ద కొట్టుడు భాషలో పురాణ కతలు రాసే పాశ్చాత్య భావ దాసులకి కాని యిటువంటి మంచి పని సాధ్యం కాదు.

 4. శర్మ గారు, మీ వ్యాసం చాలా బాగుంది. సూఫీలు మనకి అర్థం కానేలేదు! అంట్టున్నారు కదా! ఇక్కడ “మనం” అంటే ఎవరు?

 5. Hartahi Vageeshan says:

  ఏకరూప జాతీయ వాదం అనేది ఆధునిక యూరోపు లో పుట్టిన భావం . కేథలిక్ చర్చి కొంత బలహీనపడుతూ విశాల భూములున్న రాచరికాలు ప్రభావం కోల్పోతున్న కాలంలో ప్రజల మధ్య దగ్గరితనాన్ని రాజకీయ విధేయతనూ కల్పించే నూతన దినుసు జాతీయత. ఇది ఒక నైసర్గికత తో ఒక మనిషికి ఉండే ఆత్మిక మైన అభిమానం అనే పురాస్మృతి కంటే భిన్నమైనది . ఈ జాతీయత దగ్గరి తనాన్ని పుట్టించే గుణం ఒక లక్షణం ఐతే ఉమ్మడి శత్రువుని నిర్మించడం మరో దుర్మాగామైన లక్షణం అందుకే ఆధునిక జాతీయత మారణ హోమాలను చేసింది చేస్తూ ఉన్నది. ఈ సత్యాని ఆనాటి టాగూర్ లాంటి కళా తాత్వికులూ , మన కాలపు చింతానా పరులైన ఎర్నెస్ట్ గెల్నర్ వంటి మేధావులూ గుర్తించారు . హిందుత్వ భారత జాతీయత అనే వలస పాలనా కాలపు దినుసు కూడా ఐరోపీయ అవలక్షణాలు కలిగినదే ( ఇక్కడ నేను ఐరోపా అంతా అవలక్షణాల పుట్ట అని అనడం లేదు).బంకించంద్ర నుండి సావర్కరూ గోల్వల్కరూ చేసిన జాతీయ తా ప్రకటన సారాంశంలో ఇస్లాం వ్యతిరేకత అనేది నిజం ( ఇస్లాం పట్ల తత్వ జిజ్ఞ్యాస తో జరిగే విమర్శన కాదు). భారతీయత అంటే అది బ్రాహ్మణీయత మాత్రమె అన్న అతివ్యాప్తిని వలస పాలన ఎంతో ప్రోత్సహించింది.ఇది బ్రాహ్మణ సంబధం లేనిదీ , బ్రాహ్మణీయ గుడ్డి తన్నాన్ని తిరస్కరించి పక్కకు పెట్టినదీ ఐన “విశాల బహులత్వేమే భారతీయత” అనే ప్రాపంచికత కు జరిగిన ద్రోహం. ఎదో రూపంలో ఇస్లాం పట్ల క్రిటికల్ గా (వ్యతిరేకంగా కాకపోయినా) ఉన్న ప్రతి వారినీ ఈ బ్రాహ్మణీయ హిందూ జాతీయ వాదులు తమ మిత్రులు అని చెప్పుకుంటారు. ఇస్లాము పట్ల పెద్ద గౌరవం లేని బాబాసాహెబ్ అంబేద్కర్ ,పాకిస్తాను రూపకల్పన అనేది కాగ్తాలమీద ,కలం పోట్లతో తేల కూడదనీ, పాకిస్తాన్ అనే పేరిట ప్రచారం చేయబడుతున్న ప్రాతం లోని ప్రజలు వోటు ద్వారా మాత్రమె ఆ విషయం తేల్చాలని రాసాడు అది అయన ప్రజాస్వామిక చైతన్యానికి చిరునామా . నిజం ఇది కాగా , ఆయన పాకిస్తాన్ను సమర్థించాడు అని, బ్రాహ్మణీయ హిందూ జాతీయ వాదులు ఆయనను ప్రేమించ పూనుతారు . “కేంద్రీకృత ఆధునిక అఖండ భారతంలో” నవవయాన బౌద్ధా నైతిక సామాజిక జీవితం ద్వారా దళిత దాస్యమూ ,దేశంలోని ఇతర అమానవీయతలూ అంతం అవుతాయన్నది బాబాసాహెబ్ భావన. హిందూ సంస్కరణ వాదం దళితులకూ , ఉపేక్షితులకూ, దేశానికి చేసే మేలు ఏమి లేదు అనేది అంబేద్కర్ అభిప్రాయం . భారతీయ బహులత్వం పట్ల అంబేద్కర్ ఆలోచనలు ఏమిటో ఇంకా తెలుసుకోవలిసే ఉన్నది. హిందూ జాతీయ వాదం తొలి రూపమైన ఆర్య సమాజ ప్రేరితుదు భాయి పరమానంద్ వంటి హిందూ వాదులే 1905నాటికే ఈ దేశపు వాయువ్య భాగం ముస్లిం ప్రాతంగా ప్రకటించ బడాలె అని వాదించారు జిన్నా కన్నా ముందు కథ. ఈ రకంగా ముస్లిం లను శత్రువులుగా చూడటం మామూలు విషయంగా చేయడం హిదూ జాతీయవ వాదుల రోజు వారీ పని -శతాబ్దానికి పైగా . ఇస్లాము భారతీయ జన జీవనంలో తెచ్చిన మార్పులు గానీ , భక్తి తాత్వికత , సూఫీ తత్వాలు ఒకదానిపై మరొకటి వేసుకున్న ప్రభావాల గురించి న మాటలు వినిపించని స్థితి. హేతువు నూ కార్య కారణ సంబంధాన్ని మాత్రమే పరమ విలువలుగా భావించే వారు దార్మికతనూ మతాన్ని వాటికవే పనికి మాలిన,నీచ విషయాలు అని చూసిన తీరులోనే , ఈ ఆధునిక జాతీయ వాదులు తమ శత్రువులను నీచులుగా చూస్తారు. దానికి ఈదేశపు బ్రాహ్మనీయ హిందుత్వ వాదులు మినహాయింపు కాదు. వారికి తనకాలపు సూఫీ తాత్వికులతో కూడా సంవాదించిన రామకృష్ణ పరమ హంస వంటి యోగీ కనిపించడు. మహా పండితుడూ, రస గంగాగాధారం ,గంగాలహరి ల కర్త , మొగల్ పాదుషా జహంగీర్ కొలువులో గౌరవం పొందిన జగన్నాథ పండిత రాయలునూ బ్రాహ్మణీయ హిందూ వాదులు నీచుడు అని ముద్ర వేస్తారు . అటువంటి వాలకు దారా షికో ఎట్లా అర్థమౌతాడు? ఎం ఎం రాయ్ 1937 లో రాసిన ది హిస్టారిక్ రోల్ ఆఫ్ ఇస్లాం ఎట్లా కనిపిస్తుంది? ఉమ్మడి శతృవు ను పుట్టించి పోషించే ఏకరూప జతీయత అనేది ఆధునికత తెచ్చిన జబ్బులలో ఒకటి. బహులత్వం నిండి ఉన్న సమాజాలలో ఈ జబ్బు ను ఎట్లా ఎదురుకుంటాము అనేది సవాలు. ఆ జబ్బుకు విరుగుడు దినుసులకోసం ఆధునికతా పూర్వ జీవితపు అధ్యనంలోకి పోవడమూ ,ఆధునికత లో వెతుకడమూ రెండూ అవసరం అవుతాయి అనిపిస్తున్నది. ఆధిపత్య క్రైస్తవ మతత ధోరణల తోనూ , ఆధునిక పదార్థ వాద దురహంకారo తో నిండిన పశ్చిమ దేశాల ఆలోచనా ఆచరణా ప్రపంచాన్నీ దాని తో పేగు బంధం ఉన్న దేశీయ కుహనా స్వాభిమాన వాదాన్ని గానీ ఆశామాశీగా తీసుకోలేని స్థితి ఉపఖండం లో ఉన్నది అనిపిస్తున్నది . వైదిక వాజ్ఞ్మయం తో బాటు అనేక దేశీయ వాజ్ఞ్మయాలలో స్మృతులలో కి ప్రవాహించ వలసి ఉన్నది.శర్మ గారూ మీది మంచి రచన చర్చకు అవకాశం ఇచ్చారు . ఇతి శం .

 6. rani siva sankara sarma says:

  వాగీశన్ గారూ
  హిందూ జాతీయ వాదం లోని పరిమితులని రోహిత్ గుర్తించాడు. ఉమ్మడి శత్రువుని నిర్మించుకొనే దాని స్వభావాన్ని బట్ట బయలు చేశాడు. దాని ద్వారా అంబేద్కరిజం లోని పరిమితులని కూదా స్పష్టం చేశాడు.

 7. “సైన్సు కూడా విశ్వాసాల పుట్ట.” నిజంగా? తీరిక ఉన్నప్పుడు ఈ విశ్వాసాల గురించి వివరించండి”

  శర్మ గారు,

  రెండు రోజుల క్రితం ఒక పెద్ద వ్యాఖ్యను రాశాను. అది ఇక్కడ కనపడటం లేదు. Pls read this book
  and watch his presentation.

  The Science Delusion / Science Set Free by Rupert Sheldrake, Ph.D.
  https://www.youtube.com/watch?v=GkWPOIbsldE (1hr:20min)

  http://www.sheldrake.org/books-by-rupert-sheldrake/the-science-delusion-science-set-free

  About Rupert Sheldrake
  Rupert Sheldrake is a biologist and author of more than 80 scientific papers and ten books. He was among the top 100 Global Thought Leaders for 2013, as ranked by the Duttweiler Institute, Zurich, Switzerland’s leading think tank. He studied natural sciences at Cambridge University.

  From 1974 to 1985 he was Principal Plant Physiologist and Consultant Physiologist at the International Crops Research Institute for the Semi-Arid Tropics (ICRISAT) in Hyderabad, India, where he helped develop new cropping systems now widely used by farmers. While in India, he also lived for a year and a half at the ashram of Fr Bede Griffiths in Tamil Nadu, where he wrote his first book, A New Science of Life, published in 1981.

  • వృద్ధుల కల్యాణ రామారావు says:

   రాణీ శివశంకర శర్మ గారు హిందూయిజం యొక్క బహుళత్వం గురించి చెప్పినది పూర్తి సత్యం. సంఘ్ పరివార్ వారు రాజకీయ కారణాల వల్ల, అంబేద్కర్ బ్రాహ్మణుల మీద కోపంతోను, వామపక్ష చరిత్ర కారులు అవగాహనా లోపంతోను బ్రాహ్మణ సంస్కృతిని, సంస్కృతం భాషని హిందూయిజం కు మూలస్థంభం గా భావించేరు. అన్ని సమస్యలకు మూలం అదే.

 8. వృద్ధుల కల్యాణ రామారావు says:

  హిందూయిజం తాలూకా బహుళత్వాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే మనకు లభ్యమవుతున్న ఒక చక్కని గ్రంధం దేవీ ప్రసాద్ చట్టోపాధ్యాయ రాసిన “లోకాయత- ఏ హిస్టరీ ఆఫ్ ఏన్సెన్ట్ ఇండియన్ మెటీరియలిజం”. ఆయన అకడమిక్ మార్క్సిస్ట్. దాస్ గుప్త, రాధాకృష్ణన్ ల గ్రంథాలలోని విషయాలు ఎన్నింటినో తప్పులుగా చూపించేడు. రాణిశివశంకర శర్మ గారి వ్యాసం కూడా హిందూ బహుళత్వం గురించే వివరిస్తోంది. ఆయనను అభినందిస్తున్నాను.

 9. గొప్ప వ్యాసం. నా అవగాహనను పెంచింది. ధన్యవాదాలు.

 10. సాయి.గోరంట్ల says:

  ముందు వ్యాసానికి కోనసాగింపు మరింత వివరంగా వుంది.శర్మ గారు.
  ధన్యవాదాలు…
  సూఫీయిజం గురించి మరింత అవగాహన పెరిగింది

 11. chandolu chandrasekhar says:

  సాయి గారు sufism is the essential core of all religions .ఎక్కడైనా ఏమతమైన మనుగడ సాగిస్తుంది అంటే sufism మే .మానవులు మారేకొద్దీ మతాలూ కూడా సంస్కా రించా బడతాయి

మీ మాటలు

*