సినిమా కథ కాదు!

 

  -బమ్మిడి జగదీశ్వరరావు

~

bammidi ఒరే బాబూ.. బాబూరావూ..

మీరందరూ నవ్వొచ్చు గాక.. నేనేమి సిగ్గుపడ్డం లేదు.. గర్వంగా ఫీలవుతున్నా..! ఔను, మొన్న రిలీజయిన సిన్మాలో వెంకటేశ్వర స్వామికున్న రెండు చేతులకి వెనకన వున్న రెండు చేతులు నావే! ఈ అవకాశం రావడం వెనుక యెంత కథ వుందో కష్టముందో మీకు తెలీదు! పదేళ్లుగా వున్న ఫ్రెండొకడు ప్రొడక్షన్ మేనేజరు అవబట్టి.. వాడితో స్నేహం నిలుపుకోబట్టి.. వాడికి నాలుగేళ్ళుగా తాగబెట్టి.. వాడికి యివ్వాల్సిన గౌరవము యివ్వబట్టి.. వాడికి చేయాల్సిన సర్వీసు చేయబట్టి.. కొట్టిన గోల్డెన్ ఛాన్సు యిది! ఫస్ట్ టైము తెర మీద భగవంతుడిగా, ..కాకపోయినా భగవంతుడి చేతులుగానైనా కనిపించడం.. మిమ్మల్ని అదే చేతులతో దీవించడం.. మీ నా పూర్వజన్మల పుణ్యమే తప్పితే అలాటప్పా విషయమేమీ కాదు! ఏ బ్యాకప్పూ లేకుండా సినిమాల్లో అవకాశము దొరకడం అంత వీజీ విషయమేమీ కాదు గాక కాదు!

ఇప్పుడు యిక్కడ యింటికి యిరవై మంది హీరోలు వున్నారు! ఈ పరిస్థితుల్లో నువ్వు నిజంగా హీరోవి అయినా హీరోవి కాలేవ్! అంత సీనూ లేదు.. అంత స్క్రీనూ లేదు..! నువ్వూ నేనూ కాదు, కొత్తగా బయటినుండి వొచ్చి సినిమాల్లో చెయ్యమను, చూస్తాను? అరగని తిండీ జరగని మాటలూ యెందుకు గానీ.. భవిష్యత్తులో మనకి జూనియర్ ఆర్టిస్టు వేషాలు కూడా దొరకవు! నిజం.. వొట్టూ.. యింటికి యిరవై మంది పోటీ పడితే జూనియర్ ఆర్టిస్టుల వేషాలు మనదాకా వస్తాయా? నువ్వు యిండస్ట్రీకి రావడం యిష్టం లేక కాదు! నాకేదో పోటీ అయిపోతావనీ కాదు! నీకు పోటీ దారులు యెంతమంది వున్నారో కళ్ళు తెరుచుకు చూడు!

మన టాలీవుడ్లో వున్నదంతా వంశాల చరిత్రే! వారసత్వ సంపదే! నందమూరి వంశంలో- అలనాటి హీరో యన్టీ రామారావు. కొడుకు హరిక్రిష్ణ హీరో. మరో కొడుకు మోహన క్రిష్ణ కెమెరా మెన్.  చిన్న కొడుకు బాలకృష్ణ హీరో. తరువాత తరంలో మనవలూ హీరో హరిక్రిష్ణ కొడుకులూ కళ్యాణ్ రామ్, జూనియర్ యన్టీఆరూ.. మోహన క్రిష్ణ కొడుకు తారక రత్న అందరూ హీరోలే! అభిమానులు ఎదురు చూస్తున్న మరో మనవడు హీరో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ వుడ్ బీ హీరో! మునిమనవడూ జూ ఎన్టీర్ కొడుకూ అభయ్ రామ్ మన రేపటి హీరో! కూతురు పురందరేశ్వరి రాజకీయ రంగంలో వారసురాలిగా వుండిపోయారు!

మరి హీరో అక్కినేని వంశంలో- హీరో నాగేశ్వరరావు పెద్ద కొడుకు వెంకట్ ప్రొడ్యూసర్, చిన్న కొడుకు నాగార్జున హీరో. మనవడు సుమంత్ హీరో. మనవరాలు సుప్రియ హీరోయిన్. మరో మనవడు సుశాంత్ హీరో. మనవలూ నాగార్జున కొడుకులూ నాగాచైతన్యా అఖిల్ యిద్దరూ హీరోలే!

ఇంకా ఘట్టమనేని వంశంలో- హీరో క్రిష్ణ వాళ్ళన్నయ్య ఆదిశేషగిరిరావు ప్రొడ్యూసర్. పెద్దకొడుకు రమేష్ బాబు వొకప్పుడు హీరో, తర్వాత నిర్మాత కూడా! కూతురు మంజుల హీరొయిన్. కొడుకు మహేష్ బాబు చెప్పక్కర్లేదు హీరోలకి హీరో. పెద్దల్లుడు సంజయ్ స్వరూప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. చిన్నల్లుడు సుధీర్ బాబు హీరో. మనవడు గౌతం కృష్ణ రేపటి హీరో, అప్పుడే ‘వన్ నేనోక్కడినే’ లో చేసాడు కదా? ఇక హీరోయిన్ విజయనిర్మలగారి అబ్బాయి నరేష్ హీరో. నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరో!

విలనూ కం హీరో కృష్ణంరాజు! అన్న యువీ సూర్యనారాయణరాజు ప్రొడ్యూసర్. వారి పెద్ద కొడుకు బాహుబలి హీరో ప్రభాష్!

చిరంజీవి మెగా హీరో. పెద్దతమ్ముడు నాగబాబు హీరో తప్ప అన్నీ. చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ హీరో. బావమర్దీ.. అల్లూ రామలింగయ్య కొడుకు అల్లు అరవింద్ నిర్మాతా నటుడు. అల్లుడు అల్లూ అర్జున్ స్టైలిష్ హీరో. చిన్న అల్లుడు అల్లూ శిరీష్ అప్ కమింగ్ హీరో. కొడుకు రామ్ చరణ్ హీరో. మేనల్లుడు సాయి ధర్మతేజ కూడా హీరో. పెద తమ్ముడు వరుణ్ తేజ్ హీరో. కూతురు నిహారిక త్వరలో హీరోయిన్!?

మరి మంచు వారి కుటుంబంలో మోహన్ బాబుగారి అబ్బాయిలు యిద్దరూ మంచు విష్ణు వర్ధన్ బాబూ మంచ్ మనోజ్ బాబూ హీరోలే! హీరోయిన్ మంచు లక్ష్మిదీ కీరోలే! తోడు సోదరుడు ఎం. కృష్ణగారు ప్రొడ్యూసరే!

నిర్మాతా నటుడూ రామానాయ్డు పెద్ద కొడుకు సురేష్ బాబు నిర్మాతా డిస్ట్రిబ్యూటర్. చిన్న కొడుకు హీరో వెంకటేష్. మనవడు దగ్గుబాటి రానా హీరో కం విలనూ!

పీజే శర్మ నటులైతే, వారి శ్రీమతి కృష్ణజ్యోతి శర్మ డబ్బింగ్ ఆర్టిస్టు. పెద్ద కొడుకు సాయి కుమార్ హీరో విలనూ అన్నీ. నడిపి కొడుకు రవిశంకర్ నటుడూ అనువాద రచయిత. చిన్న కొడుకు అయ్యప్ప పి శర్మ నటుడూ దర్శకుడూ. మనవడు ఆది హీరో!

శివ శక్తి దత్తా విజయేంద్ర ప్రసాదు వరుసకు అన్నదమ్ములు. కథా రచయితా దర్శకులు విజయేంద్ర ప్రసాదు గారి అబ్బాయి రాజమౌళి. రామా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్. మరి శివశక్తి దత్త కొడుకు మన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి. కీరవాణి తమ్ముడు కాంచీ నటుడూ రచయిత. చిన్నతమ్ముడు కళ్యాణ్ మాలిక్ మరో మ్యూజిక్ డైరెక్టర్. చిన్నాన్న కూతురు ఎం.ఎం. శ్రీలేఖ యింకో మ్యూజిక్ డైరెక్టర్!

నటులు కమలహాసన్ వారసురాళ్ళు శృతిహాసన్, అక్షరహాసన్ యిద్దరూ హీరోయిన్లే! జయసుధ కొడుకు శ్రియాన్ హీరో! జయప్రద (అక్క) కొడుకు సిద్దార్థ హీరో! రావుగోపాలరావు కొడుకే రావు రమేషు, హీరో లాంటి విలన్! బ్రహ్మానందం కొడుకు హీరో! ఎమ్మెస్ నారాయణ కొడుకు హీరో, కూతురు డైరెక్టర్! హీరో శ్రీకాంత్ హీరొయిన్ ఊహల కూతురు ఆల్రెడీ రుద్రమదేవిలో నటించింది, కొడుకు కాబోయే హీరో! హీరో రాజశేఖర్ హీరోయిన్ జీవితల పెద్ద పాప హీరోయిన్ గా వస్తుందిట?!

దర్శకులు దాసరి నారాయణరావు కొడుకు దాసరి అరుణ్ కుమార్ హీరో. ఈవీవీ సత్యన్నారాయణ కొడుకులు పెద్దాడు ఆర్యన్ రాజేష్ హీరో, చిన్నాడు అల్లరి నరేష్ హీరో. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి రాం శంకర్ హీరో. కొడుకు ఆకాష్ పూరీ హీరోయే! టి. కృష్ణ కొడుకు గోపీచంద్ విలన్ను దాటి హీరో. సుకుమార్ అన్న కొడుకు హీరోగా రాబోతున్నాడట?!

నిర్మాతలు వీబీ రాజేంద్రప్రసాద్ కొడుకే కదా హీరో జగపతి బాబు. ఎమ్మెస్ రెడ్డి కొడుకు శ్యాం ప్రసాదరెడ్డి నిర్మాత. మనవరాలు కూడా నిర్మాతే! అశ్వినీదత్తు కూతుళ్ళూ నిర్మాతలే! ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ హీరో. స్రవంతి రవికిశోర్ (అన్న) కొడుకు రామ్ హీరో! కేఎస్ రామారావు కొడుకు వల్లభ హీరో, ప్రొడ్యూసర్! ప్రొడ్యూసరూ డిస్ట్రిబ్యూటరూ యెన్ సుధాకరరెడ్డి కొడుకు హీరో నితిన్! బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో, పక్కన ఫస్ట్ సినిమాకే సమంతా హీరోయిన్. ఐటమ్ సాంగ్ కు హీరోయిన్ తమన్నానే దించేసారు!

సంగీత దర్శకులు టీవీ రాజు కొడుకు రాజ్. సాలూరి రాజేశ్వరరావు కొడుకు కోటి. కోటి కొడుకూ హీరోయే! రైటర్ సత్యమూర్తి కొడుకు మన దేవిశ్రీ ప్రసాద్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకో కొడుకు గాయకుడు. బాలూ గారి చెల్లలే శైలజ. కొడుకే సింగర్ చరణ్. పాటల రచయిత సీతారామ శాస్త్రి వొక కొడుకు హీరో. యింకో కొడుకు డైరెక్టర్. కెమెరామెన్ ఛోటా కే నాయ్డు మేనల్లుడే హీరో సందీప్ కిషన్!

ఏ బ్యాక్ గ్రౌండ్ లేదని చెప్పే రాం గోపాల్ వర్మ వాళ్ళ నాన్న అన్నపూర్ణ స్టుడియోలో సౌండ్ యింజనీర్! మీనాన్న కనీసం ప్యూను కూడా కాదుగదా, నీకు గేటులోపలకి రానిస్తారా చెప్పు? ఈ సాక్ష్యాలు చాలవా చెప్పు?

సో.. ఈ సొదంతా.. సోదంతా నీకు ఎందుకు చెపుతున్నానో తెలుసా? మా ఫ్రెండ్ అసోసియేట్ డైరెక్టర్ దగ్గరుండి ఈ రిలేషన్లు తెలిసినంతవరకు యెందుకు చెప్పాడో తెలుసా? రియలైజ్ అవుతావని! నువ్వు పేరుకి బాబువే గాని.. మీ బాబువల్ల నువ్వయితే బాబువి కావు, కాలేవు. ఇండస్ట్రీని యేలలేవు. వొద్దురా.. నాలాంటి వాడిని తెలియక సినిమా యిండస్ట్రీ కొచ్చేసాను. చాలా దూరం వచ్చేసానని తెలుసు. ఇంకెంత దూరముందో తెలీదు. ఇక్కడ అందరూ అంటే యెక్కువ మంది నాలా థర్టీ యియర్స్ యిండస్ట్రీ గాళ్ళే!

లేదూ పెట్టేబేడా సర్దుకొని ఎవరి మాటా వినకుండా వస్తానంటే రా.. సంకనాకి పోదువు. పెళ్లి కాకుండా వచ్చావో నీకు భవిష్యత్తులో కాదు, యీ జన్మలోనే పెళ్లికాదు! అందుకని పెళ్లి చేసుకొని వచ్చావో మీయావిడ డైవోర్సు తీసుకున్నా ఆశ్చర్యపోకు! మీసాలు వచ్చినప్పుడు వచ్చాను, యిప్పుడు నెత్తిమీద వెంట్రుకలూ మిగల్లేదు!

నీ మీద నీకు నమ్మకం వుండడం మంచిదే. కానీ యితరుల అందాలతో పోల్చుకోవడం ప్రమాదం. ఎందుకంటే నీ వుత్తరం చదివితే వూపిరి ఆగిపోయింది. “నాగార్జున బిగినింగ్ లో విక్రం, అరణ్య కాండ సినిమాల అప్పుడు ఎలా వున్నాడు? యిప్పుడు యిండస్ట్రీకే ‘మన్మధుడు’ కాలేదా? జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. ఫస్ట్ సినిమాలకి యెలావున్నారు? యిప్పుడు యెలావున్నారు? మహేష్ బాబులో యెంత మార్పు వచ్చింది? మరి రాం చరణ్ మాటేమిటి?” అని రాశావ్. నటిస్తూ నేర్చుకుంటాననీ రాశావ్. ఈ లోగా ప్రేక్షకులు అలవాటు పడతారనీ అన్నావ్. నీకు యేమి చూసి యీ మెడపోత్రమో నాకేమీ అర్థం కావడం లేదు!?

ఓరే.. పిచ్చనాకొడకా.. నీ నుండి మీ అమ్మానాన్నా ఆరోగ్యం పాడై పోయిందని మీ అక్క ఫోన్ చేసింది. నీ యెర్రికి మందు లేదంది. సిన్మా వోళ్ళంతా చదువు సరిగ్గా అబ్బక.. యిల్లోదిలి మద్రాసు బండి యెక్కిన వాళ్ళేనని గర్వంగా చెపుతున్నావట. ఏ అపరాత్రి అర్ధరాత్రి నువ్వు రైలు యెక్కేస్తావేమోనని అందరూ నువ్వు వుచ్చకి లెగిసినా దొడ్డికి లెగిసినా భయపడి చస్తున్నారట! చాలక భూమి అమ్మేయమని, ఆస్తి రాసి యిమ్మని నువ్వూ నీ ఫ్రెండు కలిసి ముందు సీరియల్ తరువాత సినిమా తీస్తారట. ఒరే పద్దుకుమాలినోడా.. యిక్కడ టీవీల్లో కూడా వీజీ కాదురా. ఆల్రెడీ- ఆర్కే డైరెక్టర్ రాఘవేంద్రరావు వాళ్ళదీ.. అర్కా వాళ్ళ అల్లుడిదీ.. అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళదీ.. జయసుధ వాళ్ళదీ.. రాధిక వాళ్ళదీ.. మల్లె మాల మనవరాళ్ళదీ.. దత్తు కూతుళ్ళదీ.. మంచు లక్ష్మి వాళ్ళదీ.. క్రిష్ వాళ్ళ నాన్నగారిదీ.. తాజాలూ మాజీలూ అందరూ మఠం దిద్ది కూర్చున్నారురా.. ఒక్కో సీరియల్ వెయ్యీ రెండు వేల ఎపిసోడ్లు.. ఒకసారి వస్తే స్లాటు వదులుకోరు. నీవంతు వచ్చేసరికి నీకు సష్టి పూర్తి వయసు వొచ్చేస్తుంది. అంచేత చెప్పిన మాట విను.. భూమిని అమ్మి ఆస్తి లాక్కొని పీక్కొని వొచ్చి యిక్కడ వూడబోడిచింది యేమీలేదు!

నీ వేషాలు మానుకో.. ఇక్కడ హండ్రెడ్ పెర్సెంట్ రిజర్వు అయిపోయింది. నీ సామాజిక వర్గము అనబడు కులమునకు యిక్కడ తత్కాల్ సౌకర్యమూ లేదు. హీరో ఛాన్సు లేదు. రాదు. అందుకే మన సామాజిక వర్గపు హీరో వొక్కడూ లేడు! ఒక్కడూ రాడు! ఆ నలుగురి చేతిలో థియేటర్లు వున్నాయంటారు. నిజానికి అన్ని పాత్రలూ వేషాలూ విద్యలూ ఆ నాలుగు సామాజిక వర్గాల వాళ్ళదే!

ఇక్కడ రాణించాలంటే పట్టుదల, కష్టపడే గుణం, సాధన.. యివి వుంటే చాలవు. కులమూ ధనమూ బలగమనే బలమూ బ్యాకప్  వుండాలి. లేకపోతే ప్యాకప్పే! నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్యాటరీ బ్యాకప్ వున్నప్పుడే సెల్లు పనిచేస్తుంది అవునా?, అప్పుడు కూడా నీకు సిగ్నలింగ్ వ్యవస్థ బాగుండాలి! అన్ని వేళలా సపోర్ట్ చెయ్యాలి! అది కనెక్టింగ్ ది పీఆర్ కావాలి! వర్కౌట్ అవ్వాలి! అదృష్టం పాత మాట, టైమింగ్ కుదరాలి! నెలనెలా మీ యింటి నుండి డబ్బులు పంపుతూ వుండాలి! అప్పులు నాల్రోజులకి నాల్గు నెలలకి పుడతాయి, పోనీ నాలుగు సంవత్సరాల వరకు పుడతాయి! మరి పద్నాలుగు సంవత్సరాలకి పుడతాయా? పుట్టవు! పుట్టగతులు వుండవు!

అంతా అనుకోకుండా జరిగి అవకాశము రావాలి! ఆట ఆడాలి! ఇక్కడ ఆడకుండా ఓడిన వాళ్ళమే యెక్కువ! ఆడి.. బాగా ఆడి.. హిట్టు వస్తే నీ అంత పోటుగాడు లేడు. హిట్టు పక్కనే ఫ్లాప్ కూడా వున్నట్టే.. హిట్టు పక్కనే ఫ్లాప్ వొస్తుంది. వొచ్చిందా గొర్రె చచ్చింది. మళ్ళీ మన ముఖం యెవడూ చూడడు! ఈ లోపల పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేస్తాయి! మూటాముల్లె సర్దుకొని వెనక్కి వెళ్లి పోవడమే!

మరి కాదని మనలాంటి వాళ్ళం బతకడం యెలా అనా? మనకి యిక్కడ కొన్ని ఆల్రెడీ రిజర్వు చేసినవి వున్నాయి. హీరోని ఎలివేటు చెయ్యడానికి చక్రాలకింద టైర్లకింద హీరో చేతులకు బదులు మన చేతులు పెట్టడం, అగ్గిలోనుంచి నడిచే హీరో కాళ్ళకు బదులుగా మన కాళ్ళతో నడవడం, నదిలో సముద్రంలో మునిగిపోతున్న హీరోయిన్ని రక్షించడానికి హీరోకి బదులుగా మనం ఈదడం, ఫ్లైట్లోంచి విలన్ హీరోని తోసేస్తే గాల్లోంచి మనం కింద పడడం, రైల్లోంచి దూకడం, రైలెక్కి రన్నింగ్ చేయడం, పట్టాలపై పరిగెత్తడం వంటి పనులు అడపా దడపా మనకి దొరుకుతాయి. ఇందులో కొన్ని స్టంటు మాస్టార్లే చేసేస్తారు! తక్కువ బడ్జెట్ వున్నప్పుడు మనలాంటి వాళ్లకి అవకాశం వొస్తుంది. ఆ అవకాశం పంచుకుందాం రా..

ఇక్కడ రేపు లేదు! ఇవ్వాలైనా వుందో లేదో తెలీదు!

ఉంటా మరి! ఇండస్ట్రీని మార్చుదాము.. కొత్తనీరు ప్రవాహింప జేద్దాం అని వుంటే రా.. నే నేవడ్ని రావద్దని చెప్పడానికి. లోతు తెలిస్తే ఈత సులువవుతుందని యిదంతా రాసాను! వుంటా రా.. *

యిట్లు

నీ

థర్టీ యియర్స్ యిండస్ట్రీ గాడు.

 

 

మీ మాటలు

 1. Prof P C Narasimha Reddy says:

  Telugu film industry over the six decades or more is burdened with the bane of ancestral luggage and hero worshipping leaving little space to any fresh air into this creative world.
  – Prof P C Narasimha Reddy

 2. చందు - తులసి says:

  సినిమాల్లోకి రావాలనుకునే ప్రతీవాళ్లూ ఇది ఒక సారి చదువుకోవాలి.
  చాలా బాగా చెప్పారు బజరా గారూ.
  ….వాళ్లేమంటారంటే, ఆటో డ్రైవర్ కొడుకు ఆటో నడుపుతాడు. రాజకీయనాయకుడి కొడుకు నాయకుడవుతాడు. మేం ఐతే తప్పా అంటారు.
  అలాగే ఇక్కడ ఇంకో సంగతి ఏంటంటే..‌ఎన్నో హిట్లు తీసిన రాఘవేంద్రరావు తన కొడుకుని హీరో చేయలేకపోయారు. దాసరి పరిస్థితీ అంతే. అరుణ్ కుమార్ నటుడిగా కూడా నిలబడలేదు. .

  దర్శకుడు సుకుమార్ నుంచి …భలేమంచి రోజు ఆదిత్య వరకూ
  ఏ నేపథ్యం లేని వారే కదా..
  యూట్యూబ్ అండతో ఎందరో షార్ట్ ఫిలిం తీస్తున్నారు.
  ప్రతిభ ముందు వారసత్వం, రాజకీయం ఒంగి పోవాల్సిందే.
  కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు

 3. G B Sastry says:

  వారసత్వపు బలం అవకాశం తేలిగ్గా రావడానికి కొన్నాళ్ళు కాపుకాయడానికి పనికొస్తుంది అంతకుమించి నిలబడడానికి ఎదగడానికి సొంత శక్తి లేనిదే పని జరగదు
  ధన భుజ బలాలు ఇంతగా పనిచేస్తున్న రాజకీయాలలో కూడా కేజ్రీవాలులు పుట్టగలుగుతున్నారు బతికి బట్ట కట్ట గలుగుతున్నారుగదా?

 4. THIRUPALU says:

  కేజ్రీవాలులు అక్కడక్కడ దిష్టి బొమ్మల్లా ఉంటారు లేండి!
  ” అవినీతి బందు ప్రీతి చీకటి బజారు , అలుము కున్న ఈ దేశం ఎటు దిగజారు” అన్న శ్రీ శ్రీ గారి చరణాలు గుర్తుకొచ్చాయి. ఈ దేశాన్ని ఆక్రమించుకొని, అజమాయిషీ చేస్తున్న వారు కొన్ని కుటుంబాల వారే ననేది భహిరంగ రహాస్యమే కానీ, సినిమా రంగాన్ని ఆక్రమించు కొన్నా కుటుంబాలు లాగానే, అన్నీ రంగాల్లో ఆక్రమిమ్చుకున్నా కుటుంబాలని భయటికి తీసి మాకు చూఅపించగలరని ఆశిస్తున్నాము.

 5. kavana sarma says:

  మన దృష్టి పాత కులాల వైపుకి మళ్లిస్తే ఈ కొత్త డబ్బున్న కులాలు నాలుగు కాలాల పాటు చల్లగా బతికి మెత్తటి బట్టలు కడతాయి . నేను ఎంతమందినో వేషాలు అడిగాను ఇవ్వలేదు . నా మొహానికిఆ అదృష్టం లేకపోతే ఏమి! నా కాళ్ళకి చేతులకి ఉన్నాయన్టు న్నావుగా బాబు /ఏదో ఒకటి చూసి పెట్టు లేక అది మీ ఇంటి బొట్టేలకేనా ?

 6. రమణ says:

  బాగుంది. కానీ ఈ వారసత్వాన్ని నెత్తి మీద పెట్టుకుని మోస్తున్న ఈల, గోల ప్రేక్షకుల్ని వదిలేశారు.యథా ప్రేక్షకులు, తథా సినిమా. తెలుగు సినిమా మద్రాసులో ఉన్నప్పుడే కాస్త బాగుండేమో. హైదరాబాద్ వచ్చాక కుటుంబ పరిశ్రమగా మారిపోయింది. వెనక రోజుల్లో కేవీ రెడ్డి లాంటి దర్శకులు ఎన్టీఆర్, ఏయన్నార్ లాంటి హీరోలను కూడా శాసించేవాళ్లు. ఇప్పుడు ఒక్క సినిమా చేసిన వారస హీరో కూడా దర్శకుల్ని శాసిస్తున్నాడు. ఇంకా స్క్రీన్ మీద శూన్యం తప్ప సినిమా ఏముంటుంది?
  ఆది శేషగిరిరావు కృష్ణ తమ్ముడు అనుకుంటాను. కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ గా నటించిందా అని అనుమానం.

 7. గోపాలకృష్ణ says:

  ఆది శేషగిరి రావు కృష్ణ కి తమ్ముడే .. కృష్ణ కూతురు మంజుల షో మరియు కాఫీ బార్ చిత్రాలలో హీరోయిన్ గా చేసి, ఆరంజ్ లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసారు.

మీ మాటలు

*