రెండక్షరాల్లో ఇమడని కవి అలిశెట్టి

    

  -బి.నర్సన్

~

        అలిశెట్టి ప్రభాకర్ ను “కవి” అనే రెండు అక్షరాల మధ్య ఇముడ్చుతే ఇంకామిగిలిపోతాడు.  అందరిలా- తన మనసుకు నచ్చిన కవిత్వం రాస్తూ కవిగా గుర్తింపును,సత్కారాలను పొందుతూ పొద్దు గడిపిన మనిషి కాదాయన. రోజూ గుండెలో కొలిమిని రాజేస్తూనిప్పు కణికెల్లాంటి అక్షరాల్ని సృష్టిస్తూ, మంటల జెండాల రెపరెపల వెలుగులో సమాజ తీరుతెన్నుల్ని తెలుసుకొమ్మని తపన పడ్డ కవి.  కొలిమి వేడి తనను దహించి వేస్తున్నా ఖాతరుచేయకుండా అక్షరాల్ని పోత పోస్తూ పోస్తూ అక్షరాల్లోనే మిగిలిపోయిన మనిషి.

అట్ట పర్వతం ఎత్తి పట్టుకున్న వాడు

ఆంజనేయుడూ కాదు

నెత్తిలో నెమలీక పెట్టుకున్నోడు

క్రిష్ణపరమాత్ముడూ కాడు

అదంతా “అట్ట”హాసం- అంటూ నిక్కము లేని రచనలను, జీవితాలను, పాలనను ఎద్దేవా చేసాడు. రాసిన అక్షరాల్ని తమపై ప్రయోగించుకోకుండా సమాజానికి అప్పగిస్తే అది ప్రజాకవిత్వంగా చెల్లుబాటు కాదని నిరూపించిన కవి.

      జనంలో ఒకడిగా మెదలడం ఆయనకి ఎంతో ఇష్టం. చేతి నిండా డబ్బులున్న రోజుల్లోకూడా అతి సాధారణ జీవన శైలిని ఇష్టపడేవాడు. లెక్కలు చూసుకోవడం, రేపటి కోసం దాయడంఆయన మెదడుకి ఎన్నడూ తట్టని విషయం.  పుస్తకాలు కొనే వేళ మిగితా అవసరాలనుఈజీగా వాయిదా వేసుకొనేవాడు. బట్టలు, చెప్పులు లాంటి వస్తువులు కొనేటప్పుడు అతిచౌకవాటిని ఎంచుకొనేవాడు. కోఠి చౌరస్తాలో సెకండ్ హాండ్ దుస్తులు కొని బేఫికర్గా వాడుకొనేవాడు.అందుకే అలిశెట్టి ఎంత సాధారణ మానవుడో అంతటి అసాధారణ కవి.

         ఫోటోగ్రఫీ వృత్తిగా బతికిన ఆయన పట్టుమని పది ఫొటోలు దిగలేదు. ఇప్పుడు ప్రాచుర్యం పొందిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో కూడా తన 19వ ఏట ఓ ఫోటో స్టూడియోకి సైన్ బోర్డ్ రాసినప్పుడు ఆ స్టూడియో ఓనర్ ప్రారంభోత్సవం రోజున తీసి ప్రేమతో ఇచ్చిన కానుక. ఇంత కాలం ఆ చిత్రాన్ని భద్రంగా దాచుకున్న భాగ్యం ప్రభాకర్ అభిమానులకందించింది.

      ప్రభాకర్ కవిత్వంలో ఇంత దగడు నెగడు, తెంపరితనం కనబడడానికి కారణం ఆయనలోఉండిన దుస్సాహస లక్షణం. నిజజీవితంలో కూడా ఏనాడూ పర్యవసాలను లెక్కిస్తూ కూర్చోలేదు. తను పోయే దార్లో కష్టజీవిని ఎవరైనా ఇబ్బంది పెడ్తూ ఉంటే కలుగజేసుకునేవాడు,కలహానికి కూడా సిద్ధ మే. తెగింపు ఆయన నైజము.

    లెక్క ప్రకారం మూడు పూటలు తినడం ఆయన జీవితంలో లేదు, తినక తప్పదన్నప్పుడుఏవో నాలుగు మెతుకులు గతకడం తప్ప ఎన్నడూ రుచులు కోరలేదు.  అందుకే ధూమపానంవల్ల దాపురించిన క్షయ ఆయనపై దునుమాడింది. శారీరక బలహీనత వల్ల మెడిసిన్ ప్రభావంఆయన్ని తిప్పి తిప్పి కొట్టింది, తట్టుకోలేని పరిస్థితిలోకి నెట్టివేసింది.

     ఆయన ఆత్మాభిమానం కూడా తాననుభవించిన కష్టాలకు ఆజ్య మే అయ్యింది.సానుభూతిని అస్సలు సహించేవాడు కాదు. 1988లో మేము హైదరాబాద్ నుండి బలవంతంగాజగిత్యాల తీసికెల్లిన వారం రోజుల్లోనే చెప్పకుండా తిరిగి వచ్చేసాడు, కారణం సిటీ లైఫ్ఆగిపోతుందని అన్నాడు కాని, మాకు భారమైనాననే అలోచన కూడా ఉండొచ్చు.

      ప్రభాకర్ కు భాగ్యం అర్ధాంగి అంటే అన్యాయమే అవుతుంది. ఆమె పూర్ణాంగి ఆయన ఒకఅంశ. చిన్ననాడే చదువు ఆపేసిన భాగ్యం బీడీ కార్మికురాలు. పెళ్లి చేయలేని స్థితిలో తల్లి పైడిముడిచి ఆమెను ప్రభాకర్ చేతిలో పెట్టింది. కొన్నాళ్లకే ప్రభాకర్ ఆమె చేతిలో బిడ్డ అయినాడు.పెరుగుతున్న పేదరికం, తరుగుతున్న భర్త ఆరోగ్యం, ఎదుగుతున్న పిల్లల మధ్య ఆమె సుడిగుండంలో నావ.

తెగిన తీగలు

సవరించడానికన్నట్లు

తెల్లవార్లూ పరిచర్యలు చేసే

నా భాగ్యమే

నా కన్నీళ్లను తూచే

సున్నితపు హృదయ త్రాసు – అని చివరి రోజుల్లో భాగ్యం పై రాసిన ఈ కవితకు వేసిన బొమ్మలో ఆర్టిస్ట్ నర్సిం ఆమెను యమధర్మరాజును అడ్డుకుంటున్న సతీ సావిత్రిలా చిత్రించాడు.

సిగరెట్ పీక లాంటి నన్ను

సిగలో పువ్వులా తురుముకొని

గాజుకుప్పెల్లాంటి నా కళ్లలోనే

ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్ప

తులతూగే ఐశ్వర్యమో

తులం బంగారమో కావాలని

ఏనాడూ ప్రాధేయపడలేదు- అంటూ గుప్పెడు అక్షరాల్తో తన ఋణం తీర్చుకొనే ప్రయత్నంచేసాడు ప్రభాకర్.  నేటికీ ఆమె జీవితం చెదిరిన గూటి పక్షిలా ఇద్దరు పిల్లలతో దరి దొరకని ఎదురీతనే. నాడు ప్రభాకర్ కవిత్వాన్ని నెత్తికెత్తుకున్నవాళ్లు నేడు చెదిరిన మేఘాల్లా చెరోవైపు.

       12 జనవరి 1954 నాడు జన్మెత్తి అదే తేదీన 1993లో కలం విడిచిన ప్రభాకర్ రాసిన ప్రతిఅక్షరం మాత్రం సమాజంపై శర సంధానమే. కష్టజీవికి,కంట నీరుకి, దిక్కు తోచని యువతకిఆయన కవిత్వం సైదోడు.

‘కన్నీళ్లకు కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను

అగ్ని పద్యం నేను దగ్ధ గీతం నేను అక్షర క్షిపణి నేను

ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను

అడవి నేను కడలి నేను;- అంటూ సముద్రమంత విశాలమైన సాహితీ క్షేత్రాన్ని నిర్మించి నిరాశలుముంచుకొస్తున్న సమయంలో అందులో సేద తీరమని సాగిపొయాడు.

                                                                                                                               -బి.నర్సన్

మీ మాటలు

 1. రోజూ గుండెలో కొలిమిని రాజేస్తూనిప్పు కణికెల్లాంటి అక్షరాల్ని సృష్టిస్తూ, మంటల జెండాల రెపరెపల వెలుగులో సమాజ తీరుతెన్నుల్ని తెలుసుకొమ్మని తపన పడ్డ కవి.నరసన్ గారు అలిసెట్టి పై మీ వ్యాసం బావుంది.

 2. విలాసాగరం రవీందర్ says:

  అలిశెట్టి ఓ అక్షరాయుధం
  నర్సన్ గారు

 3. చందు - తులసి says:

  అలిశెట్టి గురించి కొత్త చెప్పటానికి ఏముంది….
  జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో…
  అక్షరం, చిత్రాల సాక్షిగా నిరూపించాడు..
  ….అలిశెట్టి గురించి , ఆయన కవిత్వం గురించి తపన పడుతున్న నర్సన్ గారి గురించీ చెప్పుకోవాలి. స్నేహితుడి కోసం ఆయన కృషి చూసినపుడల్లా…హ్యాట్సాఫ్ అనిపిస్తుంది.

  • మిత్రునిగా ఇది నా కనీస బాధ్యత. మనిషిని దక్కించుకోలేదు. కవిత్వంలో చూసుకొంటున్నా ..కృతజ్ఞతలు ..

 4. బుక్స్ ర్యాకుల్లో కాకుండా గుండె పొరల్లో ఎప్పటికీ మెదిలే మిత్రుడు, నేనయితే మహా కవి పక్కన నిలబెడతానతన్ని.

  • ప్రభాకర్ చివరి రోజుల్లో దగ్గరి దోస్త్ వి నువ్వు. కవి లో ఇముడనివాడు మహాకవిలోనైన ఇముడుతాడో చూడాలి . థాంక్స్ నర్సిం భాయ్ …

మీ మాటలు

*