మానసిక తర్కంతో అరుణ కవిత్వం!

-ఎం. నారాయణ శర్మ 

~

ఎం. నారాయణ శర్మ

వస్తుశిల్పాల క్రియాశీలక సమన్వయం కవిత్వం. ఏ వస్తువును వ్యక్తం చేస్తున్నారు, వ్యక్తం చేయడంలో వాడుకున్న పరికరాలేమిటీ అనేదాన్ని బట్టే కవుల, కవయిత్రుల వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటాయి. కాలంలో మానసికశీలం పరిణతను సాధిస్తుంది. ఇది వస్తువును చూసే విధానం, అర్థం చేసుకున్న తీరు, దాన్ని తాత్వికదృక్పథంతో సమన్వయం చేసిన తీరు,  ఆమార్గంలో వ్యక్తం చేసిన తీరు ఇందులో పరిణత దశలు.

ఎన్.అరుణ కవిత్వం “కొన్ని తీగలు కొన్నిరాగాలు“ఒక పరిణత తాత్వికదర్శనాన్ని వ్యక్తం చేస్తుంది. ఏకవి, కవయిత్రయినా తనుచూసినదానికి  అనుభవించినదానికి వ్యతిరేకంగా స్పందించడం కనిపించదు. ప్రతికవి తీర్పువెనుక అంతఃకరణ సూత్రం (subjective principle)తోపాటు, అది విశ్వాత్మలో చెల్లుబాటయ్యేలా ఉంటుందని సృజనకారులు అలాంటి పారమార్థికసూత్రం(transcendental principle)నిర్మిస్తారని కాంట్ అంటాడు. ఎన్.అరుణ కవిత్వంలో కనిపించేది ఇదే.

ఇందులో ప్రతీ అంశాన్ని తాత్వికదృష్టితో ప్రతీకాత్మకం(symbolize)చేయటం కనిపిస్తుంది. ఈ ప్రతీకాత్మకసూత్రం నుంచే అనేకచోట్ల జీవితాన్ని,అందులోని సంఘర్షణను వ్యక్తం చేస్తారు. వస్తుగతంగా ఇందులో గతజీవితం-వర్తమానానికి మధ్య వైరుధ్యాలను అర్థం చేసుకుని కవిత్వం చేయడం  ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతీ అంశాన్ని చిత్రించడానికి ప్రాతిపదికగా బాల్యం, యవ్వనం నుంచి దృష్టిని సమగ్రంగా ప్రసారం చేయటంవల్ల ఇవి జ్ఞాపకాలుగా కనిపిస్తాయిగాని, బాల్య యవ్వనాలు నిర్దిష్టంగావ్యక్తం గావు. ఆయాదశల్లోని సారం తాత్వికంగా కవిత్వం చేయబడుతుంది. ప్రజ్ఞావార్థక్యపు భౌతికపరిస్థితుల మానసికతర్కం ఈ కవిత్వంలో ఎక్కువగాకనిపిస్తుంది. అదీ ప్రతీకాత్మకమైన కళాగంథాన్ని అల్లుకుని.

 

దుఃఖమేదో సంతోషమేదో

ఇప్పటికీ అంతుపట్టదు/దేనిలోంచి ఏది ఉబికివస్తుందో తెలియదు./కంటికి కనపడని నైలాన్ దారం/రెంటినీ విడదీస్తుంది“-(కొన్నిసార్లు-పే.20)

ఏటిలోకి వంగిన/కొమ్మమీదవాలిన పిట్టలు/

అలల అద్దాలవైపు కదులుతున్నాయి“-(అందం ఒక అనుభవం-పే.43)

జీవితం/హఠాత్తుగా ఆకాశం నుంచి/ఊడిపడదు/

ఒక్కొక్కవర్ణం మొలుస్తూ ఇంద్ర ధనుస్సు ఏర్పడుతుంది-(అవునుజ్ఞాపకాలే-పే.47)

అన్వయంలేని కవిత్వంలా/ఉండీ ఉండీ కురుస్తుంది వాన“(దర్శనం-పే.53)

 

ఎప్పుడో సుడిగాలో వీచి/ చెట్టుకో తట్టుతుందా/జీవితం విలవిల్లాడిపోతుంది/ఆకాశంలో ఏర్పరచుకున్న/దారులకు గమ్యం స్పష్టం కాదు_(దిశాగీతం-పే.13)

 

ఈవాక్యాలన్నీ అనిర్దిష్టంగా విషయ, విషయీ సంబంధాలలో తాత్వికసూత్రాన్ని అల్లుకుని ఉన్నాయి. జీవనప్రవాహంలోని సంఘర్షణలను ఇవి వ్యక్తం చేస్తున్నాయి. అరుణ గారి కవిత్వంలో అనిర్దిష్టత ఎక్కువ. నిర్దిష్టవస్తువు ప్రత్యక్షంగా వ్యక్తంగాక, ప్రతీకలోని సారభూతమైన తాత్వికతతో వ్యక్తమౌతుంది. నిర్దిష్ట సందర్భాలు, స్థలాలు, వ్యక్తులు ఈ వాక్యాల్లో కనిపించడం తక్కువ. తాత్వికంగా, కళాత్మకంగా వ్యక్తం చేయడమే ఎక్కువ. శీర్షికలు చూసినా ఈవిషయం అర్థమవుతుంది. రూపాన్ని సాధించేవిషయంలో రష్యన్ రూపవాదులు “అపరిచయీకరణం”(Alienation)ను పరిచయం చేసారు. దీనిని రష్యన్ భాషలో “ఓస్త్రానిన్యా”(Ostraninja)అనేవారు. మనచుట్టూ ఉండేప్రపంచాన్ని కప్పి ఉన్న అతిపరిచయం అన్న తెరను తొలగించి మనకు పరిచయమైన వస్తువులను, లేదా ప్రపంచాన్ని కొత్తకోణంలో వినూత్నదర్శనంలో ప్రదర్శించడం అపరిచయీకరణం. ఈ కవిత్వం జీవితాన్ని సత్యదర్శనం ద్వారా , సాంకేతికతర్కం ద్వారా ఆవిష్కరించింది. ఏ కవితనైనా కళాత్మకంగా, తార్కికంగా, తాత్వికంగా సాధించి వ్యక్తం చేసే తీరు గమనించదగింది.-“మల్లెచెట్టు-కాలభరిణె-గడప-దిశాగీతం”లాంటి అనేక కవితలు ఇలాంటి నిర్మాణ సాధనకు నిదర్శనం. ఇవన్నీ సాంకేతికంగా స్త్రీజీవితాన్ని ధ్వనిస్తాయి.ఈ క్రమoలో అరుణ గారికవిత్వానికి ఒక సృజనసూత్రాన్ని గమనించవచ్చు.

 N. Aruna కాలం +జీవిత సంఘర్షణ +తాత్వికప్రతీక =>సృజనసూత్రం

“గడప”అనే కవితను పరిశీలిస్తే భాష సంబంధించిన తాత్విక, సాంకేతిక తర్కాలను అరుణ గారు ఎలా ఉపయోగించుకున్నారో అర్థమవుతుంది. రోమన్‌ యాకోబ్ సన్(Roman Jakobson) అనే రష్యాపండితుడు భాషా సంబంధంగా “బలవత్తరలక్షణం”(The Dominant) అనే అంశాన్ని ప్రస్తావించాడు. కవితాధ్యయనం (Poetics) భాషాశాస్త్రంలో ఒక అంతర్భాగమని ప్రస్తావిస్తూ  ఆయన”Closing statement; Linguistics and Poetics”- అనే గ్రంథాన్ని రాసారు. ఒక అంశాన్ని ప్రస్తావించాల్సిన తప్పనిసరి అవసరం బలవత్తర లక్షణం. ఈ అంశానికి మయకోవ్‌స్కీ ప్రతిపాదించిన ప్రత్యేకకేంద్రీకరణ(Foregrounding)ఆధారమని విశ్లేషకులు చెబుతారు. కవిత్వంలో చెప్పదలచుకున్న ప్రధానవిషయమే ప్రత్యేక కేంద్రీకరణ.-“గడప”లో ఈ సంకేతం నుంచే వ్యక్తమయ్యే స్త్రీ జీవితం ప్రత్యేక కేంద్రీకరణగా కనిపిస్తుంది.కేవలం స్త్రీ జీవితంకాకుండా దాన్ని పెనవేసుకున్న గత వర్తమానాలసారం ఇక్కడ ప్రధానాంశం.దీన్ని ప్రస్తావించాల్సిన సందర్భమే బలవత్తరలక్షణం.

   తగిలినప్పుడు తెలిసింది అక్కడ/అక్కడ గడప ఉందని/

 అంతవరకు దాని ఉనికి పట్టించుకున్న పాపానపోలేదు/మౌనకోపం అంటే ఇదేనేమో

-“తగిలినప్పుడుతెలవడం””మౌనంగాఉండడం”స్త్రీనేకాకుండా,స్త్రీ జీవిస్తున్న స్థితిని ఈ ఎత్తుగడ(move of poem)ప్రతీకాత్మకం (symbolize)చేస్తుంది.ఈ పదాలే గతవర్తమానాలను రికార్డు చేస్తాయి.యాకోబ్‌సన్-టిన్యునోవ్ అన్నమాటలను ఇక్కడ గమనించాలి.

Pure synchrony proves to be an illusion, every synchronic system has its past and its future as inseparable structural elements of its system

(శుద్ధమైన వర్ణన కేవలం భ్రాంతి.ప్రతీ వర్ణవ్యవస్థకు గతం,భవిష్యత్తు ఉంటాయి. అవి ఆవ్యవస్థలో విడదీయరాని మూలకాలుగా ఉంటాయి)

“మౌనకోపం””లో”మౌనం”గతాన్ని”కోపం”భవిష్యత్తును క్రియాశీలకంగా వ్యక్తం చేస్తాయి. భాషలో వ్యక్తమయ్యే భావప్రకటనావ్యాపారాన్ని”భాషాసన్నివేశం(speech event)లో విశ్లేషించవచ్చు.దీనికి సంబంధించి ఆరు భాషా కారకాలు(speech factors)ఆరు భాషా కార్యాలు(speech functions) ఉన్నాయి.పై ఎత్తుగడలో కారకాలను విశ్లేషించుకోవచ్చు.

స్త్రీ ఉనికి చెప్పడం సందర్భం(context) స్త్రీగా ఉండటం వక్తృస్థానం (addressor)-రిచర్డ్స్ప్రస్తావించిన గొంతుక(Tone)దీనిని నిర్ణయిస్తుంది.సందేశం(message)-ఇక్కడ విచారణ (phatic)రూపంలో ఉంది. ఈ ముఖంగా ఇది జీవితాన్నిచర్చించింది. మిగతావాక్యాలలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి.

aruna photo

2.”ఇంటికీ వాకిలికీ /గడప సరిహద్దు/

 వెలుపలి ప్రపంచం పెద్దదా/లోపెలి లోకం పెద్దదా అంటే/ ఇల్లునుమించిన విస్తీర్ణం దేనికీ లేదంటాను

3.”ఇల్లు/మనస్సంత విశాలం /కాలమంత అనంతం/

ఇంతచిన్న జీవితాన్ని /ఒక బృహత్కథగామలచిన తపోవాటి

భాషాగతంగా ఈ వాక్యాల్లో చేసింది రెండుపనులు.ఒకటికి గడపను స్త్రీకి బలమైన ప్రతీకగా పునః పునః అన్వయించడం.దాన్నించి జీవితాన్ని వ్యక్తం చేయడం.వాక్యాలు విచారణలో భాగాలు.మొదటివాక్యంలోని మొదటి అంశం ఇల్లు,వాకిలి పేరుతో స్త్రీ జీవితానికిగల గృహ,సామాజికజీవితాలను సంకేతిస్తుంది.ఇది సామాన్యభాషకు భిన్నమయ్యింది కాదు.రెండవ అంశం వాక్యాలన్ని కవితార్థంగా ఇవ్వాల్సిన సందేశాన్ని సారాంశంగా అందిస్తాయి. యాకోబ్ సన్ ప్రకారం ప్రతి కారకం ఒక భాషా కార్యానికి కేంద్రబిందువవుతుంది.ఇందులో ఈభాగాలన్నీ కనిపిస్తాయి.

4.”కోపంతో అడుగు బయట పెట్టబోతుంటే/బాధ్యతగా ఆపిందీ గడపే/అదొక అందమైఅన లక్ష్మణరేఖ

5.”నీళ్ళతోనే కాదు/దానిని కన్నీళ్ళతోనూ కడిగిన సందర్భాలున్నాయి

నాలుగవ వాక్యంలో భావావేశస్థ్తి తి (emotive) కనిపిస్తుంది. అనేక సందర్భాల ప్రస్తావన(referential), చివరివాక్యంలో నీళ్ళు,కన్నీళ్ళు- కడగటం అనే ఒకే క్రియకు దగ్గరగా ఉండటం. సాధారణ అసాధారణ స్థితులను వ్యక్తం చేస్తాయి. కన్నీళ్ళతో కడగటం వల్ల భాషకు అధి భాషా(meta lingual)స్థాయి లభించింది. స్త్రీ అనేపదం ప్రత్యక్షంగా కనిపించదు కాని ప్రతివాక్యంలో ప్రాణశక్తిలాప్రవహిస్తునే ఉంటుంది. ఈ కవితలో గడప స్త్రీ అనే జీవితాన్ని వ్యక్తం చేయడానికి మాధ్యం(code)స్త్రీని వ్యక్తం చేసిన సందర్భం, గడప మాధ్యమంగా ఇంటా,బయట అనేక్రమాల్లో ప్రస్తావించడం. స్త్రీగా భావావేశస్థాయి చెప్పినపుడు కవిత్వార్థంగా అణచివేతను వ్యక్తం చేయడం. ఇవన్నీ సాంకేతికంగా ఈకవిత సాధించిన పరిణతులు.

అరుణగారి కవిత్వంలో నిర్మాణమార్గంలో సాంకేతికాంశం,దర్శనంలో తాత్వికాంశం రెండూ ఒక లక్షం వైపు నడుస్తాయి.ఈ ప్రయాణమే కవిత్వాన్ని సారవంతం చేస్తుంది.

                                                             *

మీ మాటలు

  1. Ram Mohan Rao thummuri says:

    నారాయణ శర్మగారు పొగడ్తల స్థాయి దాటి పొయ్యారు. వారు చెప్పిన దానిని అర్థం చేసుకోవడానికి నిత్య కృశీవలత్వం అవలంబించాల్సిందే.విశ్వసాహిత్య విమర్శా కాంతిలో,క్రాంతిలో సాగే శర్మగారి కవిత్వ తత్వ విచారం కవి కులానికి నిత్యమార్గ దర్శనం అనడం అతిశయోక్తి కాదేమో.

  2. విలాసాగరం రవీందర్ says:

    గొప్ప గా వుంది విశ్లేషణ. ఇన్ని అంశాలు ఉంటాయా అనిపిస్తంది. మీకు మీరే సాటి.

  3. నారయణ శర్మ గారి గురించి ఎంత చెప్పిన మరి కొంత మిగిలే ఉంటుంది ఏమో ..ఎంత అద్భుత ము గా రాసారో చెప్పనవసరం లేదు …కవులు తమ మనస్సులో అనుకున్న భావానికి వీరి విశ్లేషణ కి సరి పోవడం గొప్ప గా ఉంటుంది మనో వైజ్ఞానిక ము గా సాగే వీరి విశేల్షణ ఒక కొత్త పాఠం లాంటిదే..నా మటుకు నాకు అయితే ప్రతి విశ్లేషణ కొత్తది గానే ఉంటుంది ..అద్భుతమైన విశ్లేషణ అందించిన శర్మ గారికి వందనాలు

  4. వృద్ధుల కల్యాణ రామారావు says:

    కవులు తమ కవిత్వంలో ఇన్నోటున్నాయా అని ఆశ్చర్య పొయ్యేటంతగా ఉంది నారాయణ శర్మ గారి విశ్లేషణ. Hats off .

మీ మాటలు

*