మనసూ ప్లస్ ఆలోచనా =’కేన్యా టు కేన్యా’

 

 

(డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ లో నవంబరు 1, 2015 న ఫార్మింగ్టన్ హిల్స్ గ్రంథాలయం లో ఆరి సీతారామయ్య గారి కథా సంకలనం ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణానంతరం ఈ కథలపై చర్చ జరిగింది. ఈ సమీక్ష ఆ చర్చ సారాంశమే.)

-కూనపరెడ్డి గిరిజ Girija

~

 

ఆరి సీతారామయ్య గారి కథలు చాలా విభిన్నమైనవి. ఆయన ప్రతి కథా మన బుర్రకి బుల్లెట్ గురిపెట్టినట్లే. సమస్య మనది కాదు. కానీ … “మన కథ అయితే” అనే ఆలోచన ప్రతి కథకీ కలుగుతుంది. ఎందరి జీవితాలకో, ఎన్ని సమస్యలకో మనకి కిటికీలు తెరిచి తెలియజేయటమే కాదు, పరకాయ ప్రవేశం చేయించేస్తారు. ‘సుచిత్రా చంద్ర ‘ మొదటి కథ. ఇక్కడి యువతరం సైకాలజీ మరియు జీవితం పై వారి దృక్పథానికి అద్దం పట్టారు. సామాన్యంగా అమ్మాయి సర్దుకుపోవటం, అబ్బాయి సమర్ధించుకురావటం – ఇది మన నాయికానాయకుల లక్షణాలు. కానీ ఇప్పటి మన పిల్లల జీవితాల్లో ఆ పాత్రలు తారుమారవుతున్నాయి. మనం మారాము అనుకున్నా ఇంకా ఆ ఎత్తుకు ఎదగలేదనిపిస్తుంది. ‘చంద్ర’ లో ఏ సంకుచితం కనపడదు మనకి. సుచిత్ర పాత్రలో సంఘర్షణకి చంద్ర చక్కటి సమాధానం. అలాటి సమాధానం మన అమ్మాయిలందరికీ దక్కాలి. Just kidding … బులుగు తెలుగు అనుకున్నట్లున్నారు సీతారామయ్య గారు.

“ఉదారస్వభావం’ కి వస్తే, ‘రామాయణ’, ‘మహాభారత’ బ్రతుకులే మనవి ఇక్కడ. అది ఉదారస్వభావం అని వెంకట్ అనుకోవచ్చుగాక. ఆంగ్ల ఉవాచ ఒకటి ఉంది, ‘బ్రతుకు – బ్రతకనివ్వు’ అని. కానీ మనం మన పిల్లల జీవితాలు మనమే జీవించేయాలని చూస్తున్నాం. మారుతున్న కాలంతో పాటు విద్య పట్ల, సంపాదన పట్ల మన ఆలోచన మార్చుకోవాలి.

‘పై చదువు’ – ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి, క్రొత్తగా దేశంలోకి వచ్చిన ఇండియన్ విద్యార్థికి కలిగే అనుభవాలు ఆసక్తికరంగా చిత్రీకరించారు.

‘పరివర్తన’ – ఇది మనకు ఎక్కువగా మనసులో రొద పెడుతుంది. ముందు అసంపూర్ణం అనిపించి పూర్వాపరాలు తెలుసుకోవాలి అని ఆదుర్దా అనిపించినా, ఈ కథ ఉద్దేశం బహుశహ ఇక్కడి system గురించి ‘ఏది పరివర్తన?’ అని చెప్పడం కాబోలుననిపిస్తుంది.

పచ్చ సంచీ – అనువాద కథ. మనసుకు తగలవచ్చు, తగలకపోవచ్చు, దేశకాల పరిస్థితులు వేరు కాబట్టి.

టెస్ట్ – మనసును కదిలించే ఇతివృత్తం. సుజాత పరిస్థితి చాలా బాధాకరం. కాన్సర్ ఎక్కువైపోతున్న ఈ కాల పరిస్థితుల్లో మన ప్రతిస్పందన ఏమిటి ఆ పరిస్థితిలో ఉన్నవారితో అని ఆలోచింపజేస్తుంది. చావు బ్రతుకు అనే సమస్య చాలా గడ్డుది.

అలనాటి ఆర్జ నర్తకి – వయసులో ఒక వెలుగు వెలిగిన తార ముసలి వయసులో ఎదుర్కొన్న దుర్భర పరిస్థితి. అనువాద కథే అయినా కళ్ళు తెరిస్తే మన చుట్టుప్రక్కల చాలానే కనిపిస్తాయి ఇటువంటి జీవితాలు. మనసులు కూడా తెరవాలి మనం.

పెద్దా చిన్నా – అమెరికాలో ఉన్న కొడుకు కోడలు దగ్గరకి వచ్చిన రామ్మూర్తి గారి అనుభవాలు. చక్కటి కథ. మనకి సుపరిచితం కూడా. కోడలితో మంచిగా చెప్పించారు, “గాడిదల్ని పెంచి అమెరికాకి పంపించినా బెంగుళూరు పంపినా వాళ్ళు గాడిదల్లాగే ప్రవర్తిస్తారు … దానికీ అమెరికాకీ సంబంధం లేదు”.

లైఫ్ సైన్స్ – హఠాత్తుగా ఒంటరి అయిపోయిన జానకి జీవితం. తను లేక పోయినా, ఆమె జీవితం ఎంతో కొంత సుగమం చేయాలని తపించిన ఆమె భర్త సుబ్బు మనకి కనువిప్పుగా ఉంటారు. జీవితంలో ఎన్నో ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు గానీ చెప్పలేం ఎంత ఓర్చుకోగలమో.

లక్ష్మమ్మ – టూకీగా చెప్పినట్లు చెప్పినా ఈ కథ నిజానికి ఒక కథాపాఠం. మన గిరిలోంచి బైటకి వచ్చి ప్రక్క మనిషి మనసు తెలుసుకొని మసలమంటుంది.

దేశీ విదేశీ – తమాషా అయిన కథ. ఇండియాలో మాట్లాడే ఇంగ్లీష్ కి ఇక్కడి వ్యవకారిక భాషకి మధ్య తేడాకి పడే అగచాట్లు చాలా తమాషాగా ఉన్నాయి. కానీ ఇండియాలో ఉన్నవాళ్ళు చదివితే మళ్ళీ అజిత్ పరిస్థితే వాళ్ళకి. It will be lost in translation!.

ముగింపు – ఇక్కడ గాయత్రికి వచ్చే ఆలోచన మనందరికీ వస్తుంది. వైద్యం ఎంతో పురోగతి చెందిన ఈ కాలంలో ఎంతవరకు దేవునితో యుద్ధం సాగించి మరల సాయంతో మరణాన్ని ఆపగలుగుతారో … అందుకు మన శరీరాల్ని ఆటవస్తువులుగా వదలాలా వీడిపోవాలా అన్నది అందరం ఆలోచించాలి – ప్రణాళిక వేసుకోక తప్పదు!

ప్రయాణం – విదేశాల్లో పనిచేసే అబ్బాయిలు, వారిని చేసుకున్న అమ్మాయిల అగచాట్లు చెప్పకనే చెప్తుంది ఈ కథ. విదేశీ వ్యామోహం ఆశతో వస్తే అగాధంలో అడుగేసినట్లే ఇలాటి పెళ్ళిళ్ళతో భవితవ్యాలు!

గింజలు – Most thought provoking story. బాధ్యత నెరవేరుస్తున్నాననుకొని ఒకటి, బాధ్యత వదలలేక ఒకటి – రెండు పక్షుల కథ. మన దైనందిన జీవితాలకు అద్దం పట్టిన కథ. ఒక్కోసారి ఈ బాధ్యత అనే ముసుగులో, సంపాదన మత్తులో మునిగిపోయి మనం జీవితంలో ఎన్నో విలువైన సంబంధాలను పలుచన పరుచుకుంటున్నాం. జీవితం జీవించటమే మరచిపోతున్నాం. చెల్లి పక్షి అలాగే బలైపోయింది పాపం.

ఆఖరుగా కేన్యా టు కేన్యా – పుస్తకానికి ఈ పేరే పెట్టారంటే ఈ కథ విలువ తెలుస్తుంది మరి. స్టీవెన్ ఆయేషాలకు వచ్చిన పరిస్థితి ఏ భార్యాభర్తలకూ రాకూడదు. వచ్చినా, వారికున్నంత మనోధైర్యం, స్థైర్యం ఉండాలి. ఆ పరిస్థితుల్లో మన నిర్ణయం అదే కాకపోవచ్చు. కానీ వారికి తోచిన నిర్ణయం నిర్భయంగా చేసుకున్నారు.

ఆరి సీతారామయ్య గారు మంచి ఆలోచన ఉన్న రచయితే కాదు, ఆలోచింపజేయగల రచయిత. ప్రతి కథా అక్కడి నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డ మన జీవితాల్లో కలిగే వింత అనుభవాలకూ, సమస్యలకూ,  సంఘటనలకు ప్రతీక. ఇండియాలోనూ, ఇక్కడ ప్రతి ఒక్కరు చదివి ఆనందించ తగ్గ కథా సంపుటి ఇది. కథలు చదివేసినా, పుస్తకం మూసేసినా, అది తెరిచిన కిటికీలు మూతపడడానికి చాలా సమయం పడుతుంది. అంతగా మనసుకు దగ్గరకొస్తాయి కొన్ని కథలు.

*

మీ మాటలు

 1. పరిచయం చేయడం బాగుంది. పుస్తకం ఎక్కడ దొరుకుతుంది?

  సురభి

 2. కె.కె. రామయ్య says:

  ఆరి సీతారామయ్య గారి అద్భుత కదా సంకలనం “కేన్యా టు కేన్యా” ప్రింటు పుస్తకాన్ని నవోదయ బుక్ హౌస్, కాచిగూడా, హైదరాబాదు వారి ( క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింకు నుండి ) తెప్పించుకోవచ్చు

  http://www.telugubooks.in/products/kenya-to-కెన్యా

  “కేన్యా టు కేన్యా” కధల గురించి శ్రీ జి.ఆర్.కె మూర్తి గారు తమ ” కర్పూరమంజరి ” బ్లాగు లో వ్రాసిన పరిచయం కూడా తప్పక చదవదగ్గది.

  http://karpuramanjari.blogspot.in/2015/12/dr-ari-sitaramayyas-kenya-to-kenya.హ్త్మ్ల్

  ఆరి సీతారామయ్య గారి పుస్తకావిష్కరణ చేసిన డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ సభ్యులకి శుభాభినందనలు.

 3. కె.కె. రామయ్య says:

  ఆరి సీతారామయ్య గారి “కేన్యా టు కేన్యా” కధా సంకలనం e-పుస్తకాన్ని కినిగే Online e-Book Store, హైదరాబాదు వారి క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింకు నుండి పొందవచ్చు.

  http://kinige.com/book/Kenya+To+Kenya

మీ మాటలు

*