నమ్మకమైన యింకో పడవ ప్రయాణం!

 

 

1

లెబనీస్ కవి ఖలీల్ జిబ్రాన్ కీ, అరుణ్ బవేరాకి చుట్టరికమేమీ లేదు; వాళ్ళ భాషా, వేషమూ, దేశమూ వొక్కటి కాదు. కాని, కవిత్వం అనేది భాషలకీ, వేషాలకీ, దేశాలకీ అతీతమైంది అనుకుంటే, అటు జిబ్రాన్ గుండెలోనూ, ఇటు అరుణ్ మనసులోనూ వొకే రంగు జెండా రెపరెపలాడుతోంది. వీళ్ళిద్దరూ వొకే పడవ మీద రెండు భిన్న సముద్రాల్ని ఎదుర్కొంటూ వెళ్తున్నారు. ఆ మాటకొస్తే, ప్రతి వర్తమాన కవిలోనూ నాకు ఎంతో కొంత జిబ్రాన్ అంశ కనిపిస్తూనే వుంటుంది, యీ కవిత్వ భాష విషయానికి వస్తే!

రంగస్థలం మీదికి  కవి ప్రవేశం వూరికే జరగదు. వచ్చేటప్పుడు కవి చాలా నిశ్శబ్దంగానే వస్తున్నాడు కదా అనిపిస్తుంది. కాని, అతను వెళ్ళిపోయాక అతనేమీ నిశ్శబ్దంగా రాలేదనీ, కొన్ని కొత్త శబ్దాల్ని పలికించి వెళ్ళిపోయాడనీ కచ్చితంగా తెలిసిపోతుంది. ఇలా అనిపించడానికి అతని కవి పేరుకి ముందు “మహా” అనే రెండక్షరాలేమీ అక్కర్లేదు. ఇంకో మాట అనాల్సి వస్తే, ఈ “మహా” అనేది చాలా పొడి మాట. అర్థంలేని అసంబద్ధ అబద్దం. అందుకే, నేను పనికట్టుకొని ఇప్పుడు ఎక్కడో వున్న జిబ్రాన్ నీ, ఇక్కడే మన పక్కనే వున్న అరుణ్ నీ కలిపి మాట్లాడుతున్నా.

జిబ్రాన్ అంటున్నాడు:

By poet, I mean the sailor who hoists a third sail on a ship that has only two, or the builder who builds a house with two doors and two windows among houses built with one door and one window, or the dyer who mixes colors that no one before him has mixed, in order to produce a new color for someone who arrives later on to give the ship of the language a new sail, the house a new window, and garment a new color. (1923)

అరుణ్ కవిత్వం అంతా చదివాక ఇతని కొత్త పదాలు ఏమిటీ, కొత్త సందర్భం ఏమిటీ అన్న ప్రశ్నలకి సమాధానాలు వెతికే పనిలో పడ్డాను. ఇతని కవిత్వానికి వొక వర్ణం వుందీ అనుకుంటే ఆ వర్ణానికి వొక పేరుందా అనీ అడుగుతూ ఉండిపోయాను నాలోని చదువరిని!

ఆ మూడు ముఖ్యమైన ప్రశ్నలకూ ప్రతి కవీ ఎంతో కొంత సమాధానం ఇవ్వగలిగి వుండాలని నా నమ్మకం. ఆ సమాధానం వచనంలో కాకుండా ఖాయంగా కవిత్వంలోనే  ఉండి తీరాలని యింకో గాఢమైన నమ్మకం.

 

2

సందర్భం తెలిసిన కవి అరుణ్. అంతే కాదు, యింకో ప్రత్యామ్నాయ కొత్త సందర్భం సృష్టించుకోవాల్సిన అవసరం వుందని నమ్ముతున్న కవి కూడా.

ఒక సందర్భం – క్రిక్కిరిసిన మనుషుల మధ్య గోలగా…

మరో సందర్భం ఖాళీగా…ఒంటరిగా…శూన్యంలా వేలాడుతూ.

ఈ రెండు వాక్యాలలోని రెండు సందర్భాలూ మనకి తెలుసు. మన చుట్టూ ఎంత శబ్దం వుందో, అంతటి నిశ్శబ్దం కూడా వుంది. కొన్ని విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలీనంతగా-  ఇంకా కొన్ని విషయాలు చాలా చాకచక్యంగా నిశ్శబ్దంలోకి నెట్టేస్తున్నాం, ఇంటర్నెట్లోకి! ఇప్పుడు నడిచేదంతా చరిత్రే అయితే, ఆ చరిత్రని ఎట్లా రికార్డు చేయాలన్న సందిగ్ధంలో పడేస్తున్నాం చరిత్రకారుడిని!

కాని, ఇంత సందిగ్ధంలోనూ అడగాల్సిన ప్రశ్నలు అడుగుతూ, రాబట్టుకోవాల్సిన సమాధానాలు రాబట్టుకోవడం ఏమిటో అరుణ్ కి తెలుసు. అతని ప్రతి కవితా వొక ప్రశ్నలోంచి మొలకెత్తి, సమాధానంలోకి ప్రయాణిస్తుంది. అదిగో, అలాంటి ప్రయాణాలే తన కవిత్వంగా నమోదు చేస్తూ వెళ్తున్నాడు అరుణ్.

అయితే, సందర్భాన్ని మాట్లాడే కవి చాలా సందర్భాల్లో వాచ్యమైపోతూ వుంటాడు. అరుణ్ కి అలాంటి ప్రమాదం లేదు. మరీ వాచ్యం అనిపించే సందర్భాన్ని కూడా తీసుకొని, అందులో కవిత్వాన్ని పొదగడం ఏమిటో, ఆ పరుసువేది ఏమిటో తెలిసిన వాడు అరుణ్. ఉదాహరణకి పైన పేర్కొన్న కవిత చూడండి, ఎలా ముగించాడో!

నువ్వో ఆకాశం, నేనో ఆకాశంగా

మాట్లాడుకుందాం

ఎప్పుడైనా-

ఈ నమ్మకాలు గుర్తొస్తే

జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా

పెనవేసుకుందాం.

చాలా అందమైన భావనతో ముగిసింది ఈ కవిత. అరుణ్ ప్రతి సందర్భాన్నీ అంతే శ్రద్ధగా చెక్కుతాడు కవిత్వ శిల్పంగా- అది ఆ సందర్భం మీద పట్టు వున్నప్పుడే సాధ్యమవుతుందని వేరే చెప్పక్కర్లేదు కదా! ఇంతకుముందు జిబ్రాన్ అన్నాడే – the dyer who mixes colors that no one before him has mixed- అని, కచ్చితంగా అదే పని.

సందర్భం మాత్రమే కవిత్వం కాదు, సందర్భం తన రూపాన్ని తానే discover చేసుకోదు. నిపుణుడైన కవి ఇంకో కొత్త రూపంలోకి వెళ్తే, ఆ సందర్భం పదునెక్కుతుంది. అరుణ్ వొక కవితలో అన్నట్టు:

నాలోని ప్రతి పాత్రా

నిండుతున్నట్టే వుంటుంది,

కాని- మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఖాళీ అవుతుంది.

అన్న వొక సంశయం కవికి నిరంతరం వుండాలి. అప్పుడు సందర్భాన్ని ప్రశ్నించే శక్తి కూడా అతనికి వస్తుంది. అలాంటి శక్తి నిండిన కవిత్వం యిక్కడి యీ ప్రయాణంలో ఎదురవుతుంది.

arun

3

తన ప్రయాణానికి వొక సందర్భం వుందీ అని నాలోని చదువరిని గట్టిగా నమ్మించాడు అరుణ్. ఇది చిన్న విజయమేమీ కాదు. అయితే, ఆ నమ్మకం దగ్గిరే నిలిచిపోయి, అరుణ్ చెప్పినదంతా/రాసిందంతా బంగారం అనుకునే స్థిరత్వం ఈ చదువరికి లేదు. ఇతని కొత్త పదాలేమిటీ అని మెతుకు మెతుకునీ పట్టి వెతుక్కునే దప్పికలో వున్నాను. కొన్ని అందమైన వాక్యాలకే ఈ దప్పిక తీరదు. వాక్యాలకి అతీతమైన జీవజ్వాల ఏదో కనిపించాలి. దాన్ని నేను “తాత్వికత” అనుకుంటున్నాను.

ముఖ్యంగా ఎటు చూస్తే అటు కవిత్వమే వినిపిస్తున్నప్పుడు ఈ తాత్వికత నాకు పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఎక్కువ శాతం సమకాలీన కవిత్వంలో వాక్యాల వెంట పరుగు కనిపిస్తోంది. వాక్యాన్ని దీపంగా వెలిగించే ప్రయత్నం తక్కువగా కనిపిస్తోంది. వాక్యం దీపం కావాలంటే, కవికి దాని చుట్టూ వున్న చీకటిని సరిగ్గా చూసే కన్ను కావాలి.

అరుణ్ అన్నట్టు:

జీవితం

ఒక నిర్వచనం స్థాయి నుంచి ఎదగడం లేదు.

 అదే మాటని యింకాస్త విస్తరిస్తే, కవిత్వం కూడా వాక్యం స్థాయిని దాటి వెళ్ళడం లేదు. కవులు తమ వాక్యాల్ని తామే ప్రేమించుకోవడంలో తలమునకలై వున్నారు. తన నీడని తానే ముద్దాడుకుంటూ మురిసిపోయే narcissism బాహాటంగా పెరిగిపోతోంది. వొకానొక కాలంలో కవి చాలా సిగ్గరి. యిప్పుడు అలాంటి సిగ్గూ ఎగ్గూ లేదు. కొన్ని సార్లు కవిత్వం మీదనే వెగటు పుట్టించే స్థాయిలో ఆత్మ ప్రేలాపనలు సాగుతూ వున్నాయి. తనని తాను వెతుక్కునే అంతర్నేత్రం మూసుకుపోతోంది. అట్లాగని, బహిర్నేత్రం బలపడుతోందని కాదు. అది మరీ బలహీనమవుతోంది.

అరుణ్ కవిత్వం చదువుతున్నప్పుడు ఈ స్థితుల్ని దాటుకుంటూ వెళ్తున్న వొక composure కనిపిస్తోంది, బహుశా, అది అతని పునాదిలో వున్న వామపక్ష దృక్కోణం నించి వచ్చి వుండాలి. అతని వాక్యాల్ని వేటినీ మనం విడివిడిగా కేవలం కవిత్వంగా చదవలేం. ఉదాహరణకి:

 1. ఒక్క -కల కోసం

కొన్ని వేల సార్లు నిద్రపోవడం

ఒక్క- కరచాలనం కోసం

వేల శరీరాల్ని తవ్విపోయడం.

 

 1. వాన కురుస్తోందంటే

చెట్లు ఏం మాట్లాడుకుంటున్నాయో వినాలనుంది.

 

 1. మనుషులు ఖాళీ చేసిన వూరు

సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతున్న దుఃఖం.

 

 1. ఈ జీవితాన్ని ముందెప్పుడో జీవించినట్టు

యిప్పుడంతా ఖాళీ.

 1. ఏదీ లేకపోవడం లోంచి

ఏదైనా రగిలే వాంఛ.

 

 1. యివాళ మనుషులందరూ

దీక్షా శిబిరాలుగా విడిపోయిన సందర్భంలో

బ్రతకడం అంటే –

దేనికి నిరసనో చెప్పాలి.

ఇవి కేవలం వాక్యాలు కావు. కావుకావుమనే సగటు కవిలోకపు cacophony లో సమాధి అయిపోయే నినాదాలూ కావు.

తన ప్రాణం పెట్టి మాటని బతికించే తపన ఇది. తన కన్నుని దారిదీపంగా వెలిగించి ముందుకు నడిపించే ప్రవాహపు ప్రయాణం  ఇది. యిలాంటి వెలుగు  ప్రయాణాలు మరిన్ని కావాలి, నిజమైన సందర్భాలు అసందర్భాలై పోతున్న ఈ కాలంలో!     *

*

మీ మాటలు

 1. కవిత్వం అంటే ఏమిటో….ఎలా రాస్తే…కవిత్వమో…ఎలా చదివాలో..కవితని..ఒక.చదువరి…మరల..మరల..మరల….ఇది ఒక పాఠం….thank you ….కన్నా…ఇంకేదైనా మంచి మాట తెలిసి ఉంటే ఈ పాఠకురాలికి అదే వాడేది… తెలియదు..మరి..అందుకోండి….వందనాలు. .

  • సరళ గారూ:

   ధన్యవాదాలు. నేను కవిత్వం చదివే పద్ధతే నా ముందు మాటల్లోనూ అనుసరిస్తాను. పాఠక ప్రతిక్రియ – రీడర్ రెస్పాన్స్- అనే కోణం నించి కవిత్వాన్ని చూసినప్పుడు చాలా కొత్త విషయాలు మనకి అర్థమవుతాయి. మీ విశ్లేషణలలో మీరు అనుసరిస్తున్న పధ్ధతి కూడా ఇదే కదా!

 2. Prof P C Narasimha Reddy says:

  Arun Bavera’s poetic sensibilities seem to emerge from his loneliness in the crowd and ever longing for something that evades him constantly even in word patterns. He seems to be an accidental poet unaware of his own poetic destiny. – Prof P C Narasimha Reddy

 3. Jhansi Papudesi says:

  చాలా బావుంది.

 4. కవిత్వం గురించి మీరు మాట్లాడిన ప్రతి సారీ మాకో సరికొత్త అవగాహన ఏర్పడుతూనే ఉంటుంది . ఎటువంటి కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు బాగా తెలుసు . మాక్కూడా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు

  • భవాని గారూ:

   ప్రతి కవితా వొక కొత్త అవగాహనా తలుపు తెరుస్తుందని నా నమ్మకం.

 5. balasudhakarmouli says:

  అరుణ్ బవేరా గారి కవిత్వం నాకు చాలా నచ్చుద్ది… ఈ ముందు మాటలానే.

 6. Kuppilipadma says:

  వాన కురుస్తోందంటే చెట్లు ఏం మాట్లాడుకుంటున్నాయో వినాలనుంది – అరుణ్ బవేరా గారి పేరు కనిపిస్తే కవిత్వం కురవబోతోందని చదువుతాను యెప్పుడు. అఫ్సర్, మేలిమి వెలుగుని కురిపించావ్.

 7. రెడ్డి రామకృష్ణ says:

  “ఎక్కువ శాతం సమకాలీన కవిత్వంలో వాక్యాల వెంట పరుగు కనిపిస్తోంది. వాక్యాన్ని దీపంగా వెలిగించే ప్రయత్నం తక్కువగా కనిపిస్తోంది. వాక్యం దీపం కావాలంటే, కవికి దాని చుట్టూ వున్న చీకటిని సరిగ్గా చూసే కన్ను కావాలి.”చాలా బాగా చెప్పారు అఫ్సర్ గారు .
  మీమున్దుమాట బాగుంది. మీ పరిశీలన,కవులకు మీరు సూచనప్రాయంగా చెప్పిన విషయాలు తెలుసుకోవటం చాలా అవసరం.
  మితృడు బవేరాకు అభినందనలు .మంచి కవిత్వానికి ఆహ్వానం పలుకుతూ ..

 8. వ్యాసంలో చాలా అవసరమైన వాక్యం మీరు అందుకున్నారు, రామకృష్ణ గారూ.

మీ మాటలు

*