సామాన్యుడే నా సిటీ, నా పీపుల్, నా స్టడీ: రమేష్

 

 

అవును. ఈ ప్రపంచాన్ని సన్నిహితంగా దర్శించడానికి ఒక కన్నుచాలు.

లేదా ఒక సామాన్యుడి జీవన సాఫల్యాన్ని గమనించినా ఈ ప్రపంచ రీతి అర్థమగును.
ఛాయ మిత్రులు జనవరి మూడో తేదీన ఏర్పాటు చేస్తున్న “నేను వదులుకున్న పాఠాలు” కార్యక్రమం సందర్భంగా కందుకూరి రమేష్ బాబుతో  మోహన్ బాబు, అనిల్ బత్తుల ముఖాముఖి
ఇంట్రో…
కందుకూరి రమేష్ బాబు  కేవలం ఒక రచయిత అనుకుంటే  అతని  ఇంకా  అనేక  సగాలు  ఫక్కున  నవ్వుతాయి. పోనీ, కేవలం  ఫోటోగ్రాఫర్  అనుకుంటే  అసలు అతన్ని  గురించి మనకేమీ తెలియదనే! తనకి  తానే  ఒక  అందమైన  వలయం రమేష్. ఈ  వలయంలో  రమేష్  అనేక  పాత్రలుగా కనిపిస్తాడు, గిర్రు  గిర్రున తిరుగుతూ- చాలా సార్లు అతనొక  అబ్బురం! భిన్న అభిరుచుల  సంబురం!   
పాఠకులకు తెలుసు, ‘దృశ్యాదృశ్యం’తో కందుకూరి రమేష్ బాబు సంభాషించే విధానం. అలాగే ‘సామాన్యశాస్తం’ పేరుతో రమేష్  రచించిన పుస్తకాలూ చాలామందికి తెలుసు. తొలి పుస్తకం ‘కోళ్ల మంగారం మరికొందరు’. మలి పుస్తకం ‘గణితం అతడి వేళ్ల మీది సంగీతం’. ఆ ఒరవడిలో  పన్నెండు పుస్తకాలు రచించి ప్రచురించాడు. ఇటీవలే మొన్నటి బుక్ ఫేర్ లో ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకం విడుదల చేశాడు. ‘శిఖరాలుగా ఎదగడం కాదు, మైదానాలుగా విస్తరించడం ఇందులోని ఇతివృత్తం’ అంటాడు. అయితే, తాను ఐదేళ్ల తర్వాత ఈ పుస్తకం తెచ్చాడుగానీ, ఇటీవలి కాలంలో సోషల్ మీడియంలో తాను ఫొటోగ్రాఫర్ గానూ సుపరిచితుడు. మరి ఆ రచయిత, ఫొటోగ్రాఫర్ తో ఈ ఆదివారం సాయంత్రం ‘ఛాయ’ తన ఎనిమిదవ నెలవారీ సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో తన ప్రసంగాంశం’ నేను వదులుకున్న పాఠాలు.’  ఈ సందర్భంగా ఈ ముఖాముఖి సారంగకు పాఠకులకు ప్రత్యేకం.
 రచన, ఫొటొగ్రఫి, జర్నలిజం – మిమ్మల్ని వీటి వైపు నడిపించిన నేపధ్యం ఏమిటి? కళల వైపు పడిన మొదటి అడుగుల గురించి చెప్పండి?
 
– స్కూల్లో నేవూరి రాజిరెడ్డి సార్ “బళ్లున తెల్లారింది…పిల్లల్లారా లేవండి” అన్న మాట కవిత్వం అని నాకప్పుడు తెలియదు. శ్రీనివాసా చారి సార్ తెలుగు పాఠాలు చెబుతూ, మధ్యలో “నిన్నటిదాకా శిలనైనా’ అన్న పాట పాడుతున్నప్పుడు కూడా నాకు తెలియదు, అది సాహిత్యం అని. ఎం.ఎ. చదివే రోజుల్లో కూడా నాకు మిల్టన్ గుడ్డివాడనే తెలుసుగానీ, ప్యారడైజ్ లాస్ట్ రాసినవాడే మళ్లీ ప్యారడైజ్ రిగేయిన్డ్ కూడా రాసిన చూపున్నవాడని తెలియదు. ఇదంతా సాహిత్యం అని అంతగా తెలియదు. శిష్టా లక్ష్మీనారాయణ అన్న మా ఫ్రొఫెసర్ ‘మెగలో మానియా’ గురించి చెప్పేవాడు. డాక్టర్ ఫాస్టస్ గురించి వివరించేవాడు. ఆయన చెబుతుంటే ఊగిపోయేవాడు. కానీ, తర్వాత తెలిసింది, ఇతడు చెబుతున్నది మార్లో సాహిత్యం గురించే తప్ప ఇతడు స్వయంగా సాహిత్యం కాదని. అట్లా కవులు, కళాకారులు, రచయితలు, ఫొటోగ్రాఫర్లు…నాకు జీవితంలో ఎంతోమంది ఎదురయ్యారు. లేదా నేనే ఎదురెళ్లాను వాళ్లకు. కానీ, వాళ్లు మామూలు మనుషులు. మరొకరి అసామాన్యతో వీళ్లు మాన్యులుగా కనిపించేవారే తప్ప వాళ్లు వాళ్లు కానేకాదు.  కొందరు నిజంగా తామే సాహిత్యం అని భ్రమించేవారు ఉన్నారు. తామే ఫొటోగ్రఫీ అని గర్వించేవాళ్లూ ఉన్నారు. వీళ్లను, వాళ్ల వివిధాలనూ చూస్తుంటే రచన, ఫొటోగ్రఫి వైపు నేను నిదానంగా వేసిన అడుగులు సాహిత్యం వైపు కాదు, నిజ జీవితం వైపనిపిస్తోంది. సాహిత్యం పేరుతో చెలామణి అయ్యే మనుషుల్లోని డొల్లతనం నుంచి తప్పించుకుని అమిత శ్రద్ధతో నేను సహజ  మానవులను కలిశానని! తమ పాట తాము పాడుకునే చిల్లర దేవుళ్లను పూజించడం నేర్చుకున్నానని! అందులో భాగంగానే నేను ఫిక్షన్ కాకుండా  నాన్  ఫిక్షన్ రచయితగా మిగిలి బతికి పోయాను. లేకపోతే గొప్ప రచయితనై ఇప్పటికే మరణించేవాడిని. కళల వైపు నడవకుండా జీవకళ దగ్గరే ఆగి, అదే సత్యం, శివం, సుందరం అని నమ్మి, మామూలు ఫొటోగ్రాఫర్ ని అయ్యాను గానీ  లేకపోతే మహా గొప్ప ఫొటోగ్రాఫర్ ని అయి, నా చుట్టుముట్టున్నవాళ్లలో ఒకడినై విర్రవీగేవాడిని. ధాంక్స్ టు మై నాన్న, అమ్మా. వాళ్లు నా తులసికోట. భూమండలం అంతా తిరిగి ఇంట్లోనే వెతుక్కున్న సామాన్యతే నా కళకు జీవనాధారం.
నిజం.
ఒక్క మాటలో నేను నడిచింది మనిషి దగ్గరకు. నేనే రచించి చేరింది, వాస్తవికత దగ్గరకు. నేను ప్రతిబింబించింది సహజ జీవన చందస్సును. జీవన వ్యాకరణం చెంతకు.  ఇంతకన్నా ఏమీ లేదు. అయితే నేను సూక్ష్మ దర్శినిని. ప్రపంచాన్ని దర్శించడానికి రెండు కళ్లు అక్కర్లేదని తెలుసుకున్న వ్యూ ఫైండర్ ని. ఇక, మొన్న తెచ్చిన “మీరు సామాన్యులు కావడం ఎలా?” అన్న పుస్తకం వాస్తవిత నుంచి సత్యం వైపు తీసుకొచ్చిన నా తొట్టతొలి పుస్తకం. దీంట్లో నేను జీవితాన్నే కల్పనగా గ్రహించి రచించి సామాన్యత తాలూకు తాత్వికతను విభూతిగా ధరించి జేబులో పెన్నూ, భుజానికి కన్నూతో హాయిగా బతుకుతున్న క్షణాన్ని.
my portriat (1)
మీ బాల్యం గురించి చెప్పండి?
రమేష్ వాళ్ళ నాన్న కిషన్ సార్

రమేష్ వాళ్ళ నాన్న కిషన్ సార్

ఇప్పటికీ బాల్యంలోనే ఉన్నాను. చిన్నప్పుడు  మమ్మల్ని అన్నం తినకపోతే భయపెట్టడానికి చాకలి తొంట మల్లయ్యను పిలిచేవారు. పెద్ద పెద్ద మీసాలతో కనిపించే ఆయన నా దృష్టిపథంలో ముద్రపడిన మొదటి ఫొటో. తొలి ఛాయ. తర్వాత మళ్లీ అలాంటి ఛాయలను నేను ఎన్నో తీశాను. ఆయన్ని తప్ప. చిత్రమేమిటంటే నేను పేర్లను, వ్యక్తులను చిత్రించను. మనుషులను చిత్రిస్తాను. ఒక రకంగా మానవులను చిత్రిస్తాను. ఒక భయపెట్టే మనిషి నాలో ముద్ర పడ్డాక భయాన్ని ఆ మనుషుల్లో చిత్రిస్తాను. ఆనందపరిచే ఈస్తటిక్స్ ఉంటే ఆ ఆనంద సౌరభాన్ని చిత్రీకరిస్తూ పో్తాను. అందాన్ని, ఆనందాన్ని అభిమానాన్ని, ప్రేమను, వయ్యారాన్ని అన్నింటినీ, నలుపును విస్మరించి తెలుపును చిత్రిస్తూ ఉంటాను. ఒక రకంగా  బ్రైటర్ సైడ్ ను చిత్రీస్తూ ఉంటాను. డెత్ ను కూడా చేస్తాను.  మనిషి శ్వాసించే అంతిమ శ్వాస మృత్యువు. దాన్ని కూడా అందంగా చిత్రిస్తాను. అసలుకు నాకు నెగటివ్ అంటే పాజిటివ్ కు భూమిక అన్న ఎరుక చిన్నప్పటినుంచే ఉంది. ఎందుకంటే మా నాన్న ఫొటోగ్రాఫర్. మా చెల్లెండ్ల పేర్లమీద స్వాతి, జ్యోతి ఫొటో స్టూడియోలు ఉండేవి. ఇల్లే మాకు  చిత్రాలయం. నేను బాలకార్మికుడిని అంటే ద్వేషిస్తాను. బాల కళాకారుడిని. మా ఇల్లే నాకు తొలి స్టూడియో. ప్రపంచం మలి స్టూడియో. నాకు డూమ్స్ సూర్యుడే. నాకు అంబరిల్లాలు ఆకాశం పరుస్తుంది.

ఫొటోలు కడగడం అన్నది నాకు వచ్చు. కెమెకల్ స్వయంగా తయారు చేసుకోవడం తెలిసిన వాడిని. మల్లెసారే మాకు డార్క్ రూమ్. 120, 35ఎం.ఎం. రీళ్లను డెవలప్ చేసి, ప్రింట్లు వేసి డెలివరీ చేసిన దశాబ్దాల అనుభవం మాది. దాంతో నెగటివ్ అంటే నాకు నలపు కాదు, తెలుపు. పాజిటివ్ అంటే తెలపు కాదు, నలుపు. అందువల్లే తెల్ల కాగితంపై నల్ల అక్షరం ఎలాగో లస్టర్, గ్లాసీ పేపర్ పై ఫొటో ప్రింట్ అలాగా. నా దుస్తుల్లోకీ ఆ నలుపు తెలుపులు వచ్చాయంటే అది సహజాతం  ఎప్పుడూ చెప్పలేదుగానీ, నేను కవి, చిత్రకారుడిని కాకముందే ఫొటోగ్రాఫర్ ని. తర్వాత పాత్రికేయ రచయితను. అటు పిమ్మట తిరిగి ఫొటోగ్రాఫర్ ని . తిరిగి తిరిగి జీవితం ఒక్క చోటుకే వస్తుందని సూర్యోదయం చంద్రోదయం తెలిపినట్లు నేను తొలి గురువుల దగ్గరే మళ్లీ వికసించాను. అమ్మా…నాన్న. తర్వాత మిగతా వాళ్లు. అయితే, నేను పని చేయలేదు. ఏదీ భారం కాలేదు నాకు. దీనర్థం  జీవితం పని చేసిందని!. గడిపిన జీవితం వల్ల దుస్తులు మారుతాయి తప్పా కొంటే వచ్చేవి కాదు. అందుకే నేనొక నలుపూ తెలుపూ. అదీ సంగతండీ.
సరే,  ఇక నేను నడవడం అన్నారు. నా దృష్టిలో మనల్ని నడిపించడం అంటూ ఏదీ వుండదు. మనం నడవడమూ వుండదు. నడకలో నడకైతాము. ఒక యూనిట్ విశ్వాన్ని నిర్ణయించదు. ఎవరైనా విశ్వంలో అంశం అవుతాం. నేను సోల్ ఆఫ్ ది యూనివర్స్ అన్న మాట వాడటానికి ఇష్టపడతాను. నాది కళ కూడా కాదు, క్షణం. కళ శాశ్వతమైంది. నేను క్షణభంగురమైన జీవితం గురించి ఆలోచిస్తాను. వాటికి శాశ్వతత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. శాశ్వతమైన వాటిని క్షణికం చేసే పనిలో కొందరుంటారు. ఆ పని నాకు రాదు. దైనందినాన్ని శాశ్వతం చేసుకునే సామాన్యుడే నా సిటీ. నా పీపుల్. నా స్టడీ.
తమ చిత్రాలను చూసి మురిసిపోతున్నసామాన్య మిత్రులు.

తమ చిత్రాలను చూసి మురిసిపోతున్నసామాన్య మిత్రులు.

అయితే, ఒక మాట. రచన, పాత్రికేయం రెండూ ఒకటే. పాత్రికేయం చరిత్రకు చిత్తు ప్రతి అనుకుంటే ఛాయా చిత్రణం అన్నది చరిత్రకు చిత్తరువు. పాత్రికేయం కన్నా రచన గొప్పదనుకునేవారుంటారు. కానీ, అన్ని రచనలూ ఇప్పడు పాత్రికేయంలో్కి ఒదిగిపోయి చాలా ఏళ్లయింది. అయితే మొత్తంగా రచన చరిత్రకు కోరస్. అందులో నువ్వూ నేనూ ఉన్నామనుకుంటాం కానీ, వుండం. అదృశ్యం అయిపోతాం.అందుకే దృశ్యాదృశ్యం రాస్తున్నాను సారంగలో.
మీరొకటి అనుకుంటారు. నేనొకటి అనుకుంటాను. ఉన్నది వేరొకటి. అయినా దృశ్యాదృశ్యంగా ఒకరికొకరం దగ్గరవుతూ దూరం అవుతాం. కావాలి కూడా.
 అయితే, ఫొటోగ్రఫి అన్నది కూడా రచనే. కాంతి రచనం.  అంతిమంగా ప్రతిబింబించడం అన్న సార్వజనీన లక్షణం నా ఇతివృత్తం. ఎలా జరిగిందో తెలియదు. కానీ, వీటన్నిటికీ మూలం మా నాన్న.  తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ టీచర్ గా కాకుండా బోధించడం కన్నా తెలియజేయడం, చూపడం, ప్రతిబింబించడం ప్రధానంగా పనిచేయడం వల్ల నాకు ఇంట్లోనే మాస్టర్ లభించాడు. ఆయన అద్భుతమైన ఫొటోగ్రాఫర్. ఎక్కడా కరెక్షన్ లేని మనిషి. ఎక్కడా పింక్, టచింగ్ చేయని మనిషి. యాజ్ ఇట్ ఈజ్ అన్నది తననుంచే నేను అందిపుచ్చుకున్నాను. అందువల్ల రచన, ఛాయా చిత్రలేఖనం నాకు మా ఇంట్లోనే మా నాన్న దగ్గర మా సొంత ఫొటో స్టూడియోల్లోంచే రూపొందిందని, నేను ఇంట గెలవడం అన్నది జరిగాకే బయట ఓడిపోవడం జరుగుతూ ఉందనీ అర్థం అవుతూ ఉన్నది నాలో నాకు.  అవును మరి. గ్రహించింది బయట ప్రాక్టీస్ చేయకపోవడం ఓటమి. నేను వదులుకున్న పాఠాలూ అన్నది కూడా ఇందుకే. బయట విజయాలు వదులుకుంటూ చిన్నప్పటినుంచీ సాధన చేసింది మళ్లీ ఒంటబట్టించుకుంటూ విస్తరిస్తున్నాను. ఆ మేరకు నేను నెగటివ్. పాజిటివ్ అర్థంలో. ఆంధ్రప్రదేశ్ లో పుట్టి తెలంగాణలో పెరగడం అన్నా అంతే కదా. ఇంటికి రావడం. మళ్లీ వికసించడం.
 సామాన్యశాస్త్రం పేరుతో మీరు చేస్తున్నరచనల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? వీటిని రాయడానికి ప్రేరేపించిన అంశాలేమిటి?
 
– ‘ఈ జగత్తులో బతికిన మనుషులందరిపై ఒక లైబ్రరీ తెరవాలి. అందులో మీ పరిచయ వ్యాసం తప్పక ఉండాలి’ అన్న మాట ఒకానొక రోజు తట్టింది నాకు. పని మొదలు పెట్టాను. పరిచయ పత్రాలు రాశాను. విస్తరించి నవలల వంటివీ రాశాను. పన్నెండు పుస్తకాలు తెచ్చాను. ఇందులో ఉద్దేశ్యం ఏమీ లేదు. విరుద్దేశమే. ఏ ఉద్దేశంతో మిగతా వారు రాశారో అందులో సామాన్యుడు మిస్ అయ్యాడు. దరిద్రుడిగా, అభాగ్యుడిగా, అధో జగత్ సహోదరుడిగా కనిపించాడేగానీ సృజనశీలుడిగా, భాగ్యవంతుడిగా జవజీవాలతో సెలబ్రేట్ కాలేదు. జీవితం సమరంగా భావించి వచ్చిన రచనలేగానీ జీవితం సంబురంగా ఉందన్న మాట చెప్పిన సామాన్య రచయితలు లేకుండా పోయారు. అప్పుడనిపించింది. ఇది నా పని అని!
పిచ్చి పట్టినట్టు చేశాను ఓ పదేళ్లు. తర్వాత తెలంగాణ. అందులో బాధ్యత ఎరిగిన యువకుడిగా పనిచేశాను. బావుంది. ఇప్పుడు వ్యక్తమవుతున్నాను. సామాన్యంగా.
అయితే, పెద్దలను కలవడం మానేశాను మెలమెల్లగా. నేను నిర్వ్యాపారంగా  కనిపించే జీవన వ్యాపారానికి దగ్గరగా జీవించడం మొదలెట్టాను. సామాన్యావతారం ఈ యుగం లక్షణం అని ముందే గ్రహించి నిశ్శబ్దంగా నా పని చేసుకుంటూ వెళ్లడం ప్రారంభించాను.  ఈ యుగం శ్రీశ్రీ ది కాదు. సామాన్యుడిదని ఏ విప్లవాన్ని గ్రహించినా తేలిగ్గా అర్థమౌతుంది.
నాకూ అర్థమైంది. విప్లవించే శక్తులైనా, క్యాపిటల్  శక్తులైనా పిడికెడు. వీళ్లు నాయకత్వపు లౌల్యానికి గురైతుండగా సునాయాసంగా విప్లవాన్ని చేసే శక్తి సామాన్యులకు ఉంది. వారిని చైతన్యం చేయబూనడం కరక్టు కాదు. వారి చైతన్యానికి స్పందించే లక్షణం ప్రకృతికి ఉంది. ఆ పని జరిగిపోతూనే ఉంది. ఇందుకు తాజా ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర సాధన. అందరూ సామాన్యులై సకల జనులూ సాదించలేదా?సాధించాక ఎలా జరిగిందో అని వారే మళ్లీ  ముక్కుమీద వేలు వేసుకోలేదా? అది ఒక పాట వంటి సామాన్యత సాధించిన విశేషం. లాలిపాట వంటి తల్లి మహత్యం.
 ఇంతకీ  సామాన్యుడంటే మీ దృష్టిలో ఎవరు? 
– ఎవరైతే తనను తాను ప్రదర్శనకు పెట్టుకోడో అతడు. మరెవరైతే అజ్ఞాతంగా కాదు, అదృశ్యంగా ఉంటాడో వాడు. వాడు. ఆ వాడు ఏకవచనం. తాను మట్టిలో పరిమళం. గాలిలో స్పర్శ. నీటిలో రుచి. ఆకాశంలో శబ్దం. నిప్పులో ఆకలి. పంచభూతం. తాను సర్యాంతర్యామి. అడవిలో ఉంటాడు. మైదానంలో ఉంటాడు. రాజు వాడే, పేద వాడే. వర్గం కాదు. వర్ణం కాదు, లింగం కాదు. మనిషి. సామాన్యుడు. అసాధన తన తత్వం. అర్థం కావాలంటే ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ చదవండి.
హక్కుల గురించి మాట్లాడేవాడు కాదు, బాధ్యత గురించి మాట్లాడేవాడు సామాన్యుడు.
 మీరు సామాన్యులు కావడం ఎలా? అన్న తాజా పుస్తకంలో మీరేం చెప్పారు?
–  నిజానికి చెప్పలేదు. చూపాను. గుర్తు చేశాను. మీ జీవితాలు మీరు గడపడం ఎప్పుడు ప్రారంభిస్తారో ఆలోచించుకోమని మననం చేశాను.  మీరు గాయకులు కావడమో లేదా శ్రోత కావడమో కాదు, మీరు స్వయంగా పాట అన్న విషయాన్ని గుర్తు చేశాను. ఆ గుర్తు చేయడం అన్నది సామాన్యంగా చేయలేదు. ఒక పాటను కంపోజ్ చేసినట్లు చేశాను. హృదయం ఉన్న వాళ్లకు నా పుస్తకం ఒక గీతాంజలి. బుద్దిగల వాళ్లకు ఫౌంటెన్ హెడ్. విప్లవశక్తులకు కమ్యూనిస్టు  మ్యానిఫెస్టో. దళిత బహుజనులకు అంబేద్కర్ పూలే. ఇవేవీ చదవని వాళ్లకు సామాన్యశాస్త్రం.
 సామాన్యులను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమాన్ని శ్వాసించిన నేపథ్యంలో మీరేదైనా నవల రాస్తే బాగుంటుందేమో కదా?
– నాకు వేరే ఉద్దేశ్యాలున్నాయి. వార్తలు, సంఘటనలు, విశేషాలు, విశ్లేషణలు, చరిత్రాక ఘట్టాలపై నాకు ఆసక్తి లేదు. అందులో నేనుంటాను. కానీ, నేను చరిత్రను రచించను. ఆ దరిదాపుల్లోకి వెళ్లను. ఎందుకంటే, నాకు పండు కన్నా రసం ఇష్టం. అది బాగుందని చెప్పడం కన్నా ఆరగించి ఆస్వాదించడం ఇష్టం. నేను సామాన్యుడిని.
ఒక సామాన్య రచయితగా,  ఏది చదివితే ఇక మరొకటి చదవనక్కర్లేదో అది చెప్పడానికి నేను యోచిస్తుంటాను. సూక్ష్మంలో మోక్షం లభించే అంశాల గురించి ఆలోచిస్తాను. నా రచన చదివితే మీరు దూరపు కొండల నునుపు కాలికింది కంకరలో కనపడేలా చేస్తాను. దైనందినంలో ఎంత వైశాల్యముందో, లౌకికంలో ఎంత అలౌకికం ఉందో తెలియజెబుతాను. అంతేగానీ, వర్తమానాన్ని చూపడానికో గతాన్ని గుర్తు చేయడానికో, భవిష్యత్తును తీర్చిదిద్దడానికో కాదు. కాలం గురించిన స్పహ లేకుండానే కాలం చేసే మనిషిలా నా రచన సర్వసామాన్యంగా ఉండాలని ఎవరి దిష్టీ తాకకూడదని భావిస్తాను. అందుకే నా పన్నెండు పుస్తకాలూ సామాన్యులకు తప్పా ప్రసిద్దులకు చేర్చలేదు. పద్దెనిమిదేళ్ల ప్రయాణంలో ఒక పుష్కర కాలం శ్రద్దతో కూడిన సామాన్యశాస్త్రం వ్యాసంగానంతరం ఒకడొచ్చాడు. నీ పుస్తకం నేను వేస్తాను అని వచ్చాడు. వాడు క్రాంతి. అతడికి తెలిసింది, ఇది ఇవ్వాళ్టి పుస్తకం అని. అవసరం అని. ఇచ్చాను. ఇక ముందు నేను ఎక్కువ రాయాల్సిన పనిలేదు. రాసిందంతా బయటకు వస్తే చాలు. నిజం.
అయితే, నవల. అవును, కల్పనాత్మక నవల. దానికన్నా జీవితం కల్పనగా కానవచ్చే మానవ ఇతిహాసం నాకిష్టం.  ‘మీరు సామాన్యులు కావడం ఎలా? ‘ చదివారా? మూడుసార్లు చదవాలని మిత్రులు చెప్పారు. మూడు సార్లయినా కంట తడిపెట్టించిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఆ పుస్తకం వందలాది మంది చేతుల్లోకి వెళ్లింది. రాత్రుల్లు వారు మేలుకుని జీవితంలోకి తొంగి చూస్తున్నారు. మెసేజ్ లుకాదు, మనుషులు వచ్చి కలుస్తున్నారు, సామాన్యంగా.
ఇలా రచనలైతే, నా ప్రయాణంలో బతికిన క్షణాలను నిక్షిప్తం చేయడం నా ఛాయా చిత్రణం. అదీ కల్పనే. నమ్మలేని గ్రామీణ జీవన జానపద ఔపోసనం నా ఛాయలు. సిటీలోనే తీస్తారా అని అడుగుతారు. తీస్తాను. ఇదంతా తెలంగాణ కాదా? నేనెక్కడికైనా పోయానా? ఇదంతా నవల కాదా? కొత్తగా లేదా? చూస్తుంటే ఎన్ని జ్ఞాపకాలు గిర్రున తిరగడం లేదు?
మీరు సంప్రదాయ ప్రశ్నలు మానేయాలి. సమాధానాలు పురాతనంగా ఉంటాయి. ఒక మనోఫలకంపై ముద్రించిన ఛాయలా. నా ఛాయలు అవే. అందుకే ఒప్పుకున్నాను, ఛాయ నిర్వహించే సమావేశం నా జీవనఛాయలపై అంతే!
ramesh2
అయినా చెబుతాను. మరో మాటా పంచుకుంటాను. నిజానికి ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకంలోని అంశం తెలంగాణ ఇరుసుగా జనించిందే. తెలంగాణ సమాజం అప్ వార్డ్ మొబిలిటీతో ఆక్రమిత దోపిడీకి గురై విలవిల్లాడి బయటపడ్డాకే ఈ బుక్కు వచ్చింది. ఒక రకంగా తెలంగాణ  సామాన్యతకు దగ్గరైనందువల్లే ఒక రాష్ట్రంగా ఏర్పడింది.  సకల జనుల కూడిక అంటే అదే. సాధారణాంశాలు, ప్రత్యేకాంశాలు ఒక ఈక్వలిబ్రియం లా ఒక్కచోటకు చేరడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అటు తర్వాత సాధారణత్వాన్ని, ప్రత్యేకాంశాలను ఈ స్థానిక జీవలాక్షాణికతతో వికసింపజేసుకోవాలి. ఆ పని పక్కకుపోతున్నదన్న భావంతోనే నేను ‘మీరు  సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకం రాశాను. పొలిటికల్ సెన్స్ ఉన్న వారికి ఈ సంగతి తెలుస్తుంది. తెలియని వారికి నా పుస్తకం విజయానికి ఐదు మెట్లు వంటి పుస్తకాలకు భిన్నమైందని చదువుతారు. ఎలా అయినా నా ప్రయోజనం నెరవేరుతుంది. ఒక నావల్ ఎలిమెంట్ తో రాసిన పుస్తకం అది. విన్నవాళ్లకు విన్నంత పాట అది!
 ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్నది ఒక విత్తనమే.  వృక్షాన్ని విత్తాను, పుటల్లో. పుష్పాల్లోని సౌరభాన్ని అద్దాను అత్తరుగా. మై సిటీ మై పీపుల్ కూడా అంతే. అది మీ ముఖ పత్రం. ఫేస్ బుక్. పుటలు పుటలుగా మీరు వదులుకున్న బతికిన క్షణాలను నేను పరుస్తూ పోతాను, ఛాయలుగా, చిత్రాలుగా. అందుకే అవన్నీ నా ఫొటోలు కాదు. నేనూ ఫొటోగ్రాఫర్ నీ కాదు. అవన్నీ మీవైన జీవితాల్ని మీరు తీయలేనప్పటి ఫొటోగ్రాఫర్లు. మీవైన రచనల్ని మీరు చదవనప్పటి రైటర్లు.
అన్నట్టు, రచనల నుంచి మీ దృష్టి ఫొటోగ్రఫీ వైపు మళ్లడానికి బలమైన కారణాలే ఏమిటి?
–  నేను వేరేవాళ్ల రచనలు అచ్చువేసే పనిలో ఉన్నాను. ఉద్యోగరీత్యా అమిత శ్రద్దతో ‘బతుకమ్మ’ పత్రికను తీర్చిదిద్దాను. దాదాపు ఐదేళ్లుగా వేరే వాళ్ల రచనలు చదివి, అచ్చువేసే పనిలో నిమగ్నమయ్యాను. నన్ను ఫొటోగ్రఫిలో వుంచుకున్నాను. అదొక కారణం. అలాగే ఇంకో కారణం…అక్షరాస్యులు చాలా వాటిని చదవలేక పోతున్నారు. నిరక్షరాస్యులు చాలామంది అంధులవుతున్నారు. వారిద్దరి కళ్లూ తెరిపించాలని. నాతో సహా వారందరికీ మరింత అందమైన ప్రపంచాన్ని చూపాలని. మరింత విస్తారమైన జీవితాన్ని డైజెస్ట్ చేయించాలని. సూక్ష్మ నాళికలో జనజీవనాన్ని దాచి రాబోయే తరాలకు కానుకగా అందించాలని. ఒక మనిషి రెండు చేతులతో ఈ భూగోళాన్ని ఎత్తడం చాలా సులభం, భుజానికి కెమెరా వేసుకుని! నేను ఎత్తాను. మీకు తెలియదు. ఒక లక్షమంది మనుషులు నాతో సహజీవనం చేస్తున్నారు, మా ఇంట్లో. నా మూడు హార్డ్ డిస్కుల్లో. రేపటి తరానికి నా కానుక ఇది కనుకే ఇంత గట్టిగా సామాన్యంగా మాట్లాడటం. సామాన్యమే మరి.
అన్నింటికీ మించి, మనవల్ల ఈ ప్రపంచానికి ఎంత మేలు జరుగుతుందో తెలిస్తే అంత మేలు చేయడానికి దేనికైనా వెనుకాడడు సామాన్యుడు. నేనూ సామాన్యుడినే. రచించి, చిత్రించి మిమ్మల్ని సామాన్యులను చేయడానికి నాకేదో వరం లభించినట్లుంది. అందుకే సామాన్యంగా ఉండవలసి వస్తోంది కూడా. అంటే మరేం లేదు. ఇతివృత్తం వదలకుండా అదే పనిలో నిరాటంకంగా ఉండటం.
 రఘురాయ్ తో కలిసి పనిచేయాలని మీకెందుకనిపించింది? 
– సామాన్యుల జీవితాలను అధ్యయనం చేసే సమయంలో నాకు  కొన్ని సమస్యలుండేవి. ఆయన వద్దకు వెళ్లి వాటిని తానెట్లా పరిష్కరించుకుంటారో అర్థం చేసుకున్నాను. ఈ దేశంలోని మనుషులను, స్థలాలను ఆయన దర్శించి చిత్రీకరించినంతగా మరెవరూ చేయలేదు. అంతేగాక సామాన్య మానవుడిని డిగ్నిటీతో చూపారాయన. అందువల్లే ఆయన్ని కలవాలనుకున్నాను, కలిశాను. ఒక రచన చేయాలనుకుని వెళ్లి తిరిగి ఫొటోగ్రాఫర్ ని కూడా అయ్యాను.
 రఘురాయ్ ని కలిశాక మీరొదులుకున్న పాఠాలేమిటి? అంతగా మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలేమిటి? 
– రఘురాయ్ గారిని కలిశాక నేను సామాన్యశాస్త్రం రచనలు చేయలేదు. ఐదేళ్లుగా నేను పుస్తకం ప్రచురించలేదు. మొన్ననే ఆయన బర్త్ డే మరునాడే అంటే డిసెంబర్ 19 న ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకం రాశాను. కారణం ఏమిటంటే, ఆయన నా దృక్పథాన్ని సాపు చేశాడు. నా వైకల్యాన్ని సవరించాడు. ఫొటోగ్రఫి అంటే ఒక కెమెరా పనితనం కాదని చూపించాడు. ఒక వండర్ ఫుల్ హ్యూమన్ బీయింగ్ కాకుండా మీరు ఉత్తమ రచయితా, ఫొటోగ్రాఫర్ కాలేమన్న సత్యాన్ని అవగతం చేశాడు. చిత్రమేమిటంటే నేను అదే.అద్భుతాన్ని. కానీ, వేరొకరి జీవితాలను రచించి చూపించడంలో సామాన్యతను కోల్పోయాను. ఆయన్ని కలిశాక అసలు సిసలు సామాన్యుడెవరో తెలిసింది. కార్యక్రమంలో లేనివాడు సామాన్యుడని అవగతం అయింది. నేను కార్యక్రమాలను రద్దు చేసుకున్నాను. జీవించడం, ప్రతిబింబించడం. ఇంతే చేశాను. అందుకోసం నన్ను నేను చేరుకోవడానికి వేయిట్ చేశాను. ఆయన పుస్తకం రచన ఆపి మరీ ఆ పని చేశాను. ఐదేళ్లవుతోంది. ఈ క్రమంలో నన్ను నేను వదులుకున్నాను. ఒక బ్రాండ్ కు లొంగిపోకుండా నిలబడాలీ అనుకున్నాను. నాకు నేను బానిసను కాదల్చుకోలేదు. అన్నిటికన్నా మిన్నఅది ఎంత బాగున్నప్పటికీ వేరే వాళ్ల జీవితాలు గడపడం వదులకున్నాను. దీన్ని విడమర్చిచెప్పవలసి ఉందిగానీ, అది ఆదివారం రోజున ‘నేను వదులుకున్న పాఠాలు’ అన్న అంశంలో కొంచెం విడమరచి చెబుతాను. నిజానికి ఈ అంశాల సారాంశమే మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకంలోనూ చర్చించాను.
రఘురాయ్ గారిపై రమేష్ అల్బంని ఆయన చూస్తూ ఉన్న దృశ్యం

రఘురాయ్ గారిపై రమేష్ అల్బంని ఆయన చూస్తూ ఉన్న దృశ్యం

 రఘురాయ్ తో మీరు పంచుకున్న కొన్ని మధురానుభూతుల్ని చెప్పగలరా? 
– లేదు. అవి చాలా విశిష్టమైనవి. వాటిని రాసి చూపిస్తాను. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఒక భరతమాత ముద్దుబిడ్డ తనను తాను ఎంతగా అంకితమొనర్చి ఈ దేశాన్ని, ఇక్కడి స్థలాలను, మనుషులను పక్కపక్కనే…శతాబ్దాలకు శతాబ్దాలు నివసిస్తున్న  లౌకిక జీవన జన గణనని అపూర్వ పుస్తకంగా రచించి పంచుకుంటాను. అంతదాకా ఆయన్ని నాలో పొదగనీయండి. ఒక అందమైన అనుభవంలో ఉన్నాను. ఐదేళ్లయినా ఆసక్తి పోలేదంటే తప్పకుండా వారి పుస్తకం మీకు అందించడం ఖాయం. అయితే ఒకటి చెబుతాను. ఫొటోగ్రఫి ఈజ్ నాట్ ఫర్ ఆల్ ఫొటోగ్రాఫర్స్ అన్నారాయన. ఇంకో అద్భుతమైన సామాన్యతను చెప్పారాయన. జీవితం నువ్వు ఊహించని ఫలాన్ని ఇస్తుంది. నీకు ఫలానా కావాలనే ఉంటే నువ్వు చాలా మిస్ అవుతావు బాబూ అన్నాడు. నేను రఘురాయ్ పుస్తకం రచించడం నుంచి మెల్లగా తప్పుకున్నాను. అపుడు మీరు సామాన్యులు కావడం ఎలా అన్నపుస్తకం సునాయాసంగా వచ్చి నన్ను సఫలం చేసింది.
మీరు క్యాండిడ్ ఫొటోగ్రఫిని చేస్తుంటారు కదా? ఏదైనా ప్రత్యేక కారణాలున్నాయా?
– నిమగ్నం కావడమే. మనుషులు తమ ప్రకృతిలో తాము లీనం కావడంలో ఉన్న సత్యసంధత మరెక్కడా లేదు. అందుకే నా చిత్రాలు మీ వైపు చూడవు. నావైపూ చూడవు. తమలో తాముంటాయి. గడుపుతాయి జీవితాల్ని. ప్రదర్శించవు. నిజానికి క్యాండిడ్ ఫొటోగ్రఫి చేసేవాడు కూడా వేరేకాదు. వాడు కూడా జీవని. గడిపే మనిషి. వాళ్లను ఫొటో తీస్తూ  వాళ్ల పనిలో తాను పాటైతాడు. వాళ్ల పాటలో తాను బాటైతాడు. అందుకే అతడు తీసేవి చిత్రాలు కావు, రాసేవి రచనలూ కావు, జీవితాలు. నావి జీవితాలు సుమా.
అందుకే మొదలు అన్నాను. నా చిత్రాలు ఫొటోగ్రాఫర్లు. నా రచనలు రైటర్లు అని!
అవి వాళ్లవే. వాటిని చదువుతుంటే ఆయా పాత్రలు, వాటిని చూస్తుంటే ఆయా జీవితాలు మీతో సంభాషిస్తాయి. అందుకే అంటున్నాను. నేను వదులకున్న పాఠం ఏమిటంటే భగవంతుడి సంగతేమో గానీ, ఈ యుగంలో రచయిత మరణించాడు. మిగిలింది సామాన్యుడు. అతడితోటిదే నా వర్షిప్. అతడే నా సరస్వతి.
ఇది సామాన్య యుగం మరి.
 చివగా మరి రెండు ప్రశ్నలు. ఆగస్టులో మీరు నిర్వహించిన  సింగిల్ ఎగ్జిబిట్ ఛాయా చిత్ర ప్రదర్శనకి స్పందన ఎలా వుంది? భవిష్యత్ ప్రణాళికలేమిటి?
– ఫొటోగ్రఫిని జర్నలిజంలోకి తెచ్చి దాన్ని దెబ్బతీస్తున్నాం. నేను ఆ పని మున్ముందు చేయదల్చుకోలేదు. ఒక ఫొటో్గ్రాఫ్ చాలు, ప్రదర్శనకు అని నేను సాహసోపేతంగా ప్రదర్శించి  అభినందనలు అందుకున్నాను. ఒక్క చిత్రంతో సంభాషించగలిగే వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగాను.
ఒక రచన మాదిరి కాదు ఫొటోగ్రఫి. అది ఒక లిప్త. క్షణ భంగురం. దాంట్లో సృష్టి స్తితి లయ అంతా ఉంటుంది. ఆ ఎరుక ఉన్నవాడికి విశ్వం ఆశీర్వదిస్తుంది. అది దేవాలయంలోని గర్భగుడిలోని దైవం అవుతుంది. ప్రదక్షణలు పూర్తయ్యాక రావలసింది మోకరిల్లడానికే. గర్భగుడిలోకే. నా సింగిల్ ఎగ్జిబిట్ కూడా అలాంటిదే. ఒక దర్శనం. అందుకే అంటాను, చూపు కాదు, దర్శనం వేరని! ఈ ప్రపంచాన్ని దర్శించడానికి ఒక కన్నుచాలని! కెమెరా కన్ను!
ఆ దర్శనం అన్నది దైవమే కానక్కర్లేదు,ఈ కాలానికి.
మనిషి చాలని! తనను తాను ప్రదర్శించుకోని సామాన్యుడే ఆ దైవం. ఇక, భవిష్యత్తు అంటారా? దానికి నాతో ఏం ప్రణాళిక ఉందో మీరే చూస్తారు. చూద్దాం.
కృతజ్ఞతలు.
*

మీ మాటలు

  1. Tumma Prasad says:

    రమేష్ బాబు గారి ఇంటర్వూ చాలా సామాన్యంగా తనలో తను ఒదిగిపోయి మళ్లీ మనల్ని మనందరం సామానులమే సుమా అనుకునేతటువంటి ఇంటర్వూ మళ్లీ మళ్ళి చదవాలనిపిస్తుంది ……….
    ప్రసాద్ తుమ్మా

  2. kandukuri ramesh babu says:

    Tq brother. Happy new year…

మీ మాటలు

*