వెలిగే నీడ 

 

 
 -ఎం.ఎస్. నాయుడు
~
మచ్చలు
కన్నీటిలో 
ఏ కంటికీ అంటుకోవు 
 
జీవించే జైలులో నమ్మదగ్గ మౌనం దొరికేనా
నిస్సార మనసులో విచారించు విచారం విచారమేనా
 
కదలని కడలిని
కలవని కలలని 
కనికరించే కనులని 
క్షమిస్తే రమిస్తే ప్రాధేయపడితే 
నిశ్శబ్దమే నిరు(రూ)పయోగమై ఆక్రమిస్తుందా 
 
వెలిసిన వెలితితోనే వెలిగే నీడ 
పదాలే అరిపాదాలై 
అతితొందరలో చేరే స్థలంకై ఊగిసలాడుతున్నాయ్ 
 
మర్చిపోవాలనే 
గాలిచిగురులు ఎగిరే పెదవుల కన్నీళ్ళ కలలో 
 
ఖాళీ జ్వాల 
కీలుబొమ్మల దుఖం 
 
నిర్యాణ నిర్మాణం చేపట్టేనా విడిచిపెట్టేనా మర్చిపోయేనా 
అభావ అనుభవమా అనుభవ అభావమా 
 
చంచల ద్వారం 
నాలో ముడుచుకొని 

మీ మాటలు

  1. రా రెడ్డి says:

    ఖాళీ జ్వాల
    కీలుబొమ్మల దుఖం -బావుందండి.

  2. తిలక్ బొమ్మరాజు says:

    చాలా నచ్చింది మీ కవిత .గొప్ప అనుభూతి నిండిన పదాలు.

  3. బ్రాకెట్ లో అక్షరం అనవసరం. నిజనికది నిరూప యే. చివరి మూడు పంక్తులు ప్రారంభం కన్నా కాస్త బలహీనంగా ఉన్నాయి – ప్రభు

  4. బి.అజయ్ ప్రసాద్ says:

    కొత్తగా కనుగొన్న పదాలు, విచిత్రంగా అతికించిన పదాలు, జత చేసిన పదాలు (లేకుంటే “కీలు బొమ్మల దుఃఖం” పదం ఏమిటీ). ఇది కేవలం పద విన్యాసం కాదు. తదనంతరం రంగులు మార్చుకున్న రంగులు. ముఖాలు మార్చుకున్న భావాలు, అనుభవాలు.. నీ పోయెమ్ ఎప్పుడు చదివినా నా మీద కాక్టస్ మొక్కను విసిరేసినట్లు ఉంటుంది. తెలిసిన పదాలను తెలియని పరీక్ష నాళికలలో పెట్టి ఏమౌతుందా అని చూస్తున్నట్లుగా ఉంటుంది. చివరకు ఫలితం నాకెప్పుడూ ఒకేరకంగా ఉంటుంది. remixing colors.. collapse or collusion of cosmic dimensions.. విడమర్చడం, అర్థం చేసుకోవడం ఎప్పటికీ ఉండదు..

  5. వాసుదేవ్ says:

    ఎప్పుడో కానీ ఇలా గుండెని తడిపే వాక్యాలు రావు.ఇదిగో ఇలా మన నాయుడు గారి అక్షరాల్లో తడిసి ముద్దయి ఓ రఫీ పాట పాడుకునెంతవరకూ…అన్నా నమస్తె

మీ మాటలు

*