మన చరిత్రలో చీకటీ వెలుగూ!

 

-రాణి శివశంకరశర్మ

~

 

Rani sarmaభారతీయులు కార్యకారణ సంబంధాన్ని అర్ధం చేసుకోలేక చీకటిలో కూరుకు పోయారనే వాదం ఆధునిక కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. కార్యకారణ సంబంధం, విశ్వాసం, వేరు వేరు.. ఈ రెండూ ఎక్కడా కలవవు అని వారు వాదించారు. భారతీయులు విశ్వాసమనే చీకటిలో కూరుకుపోయి, కార్యకారణ సంబంధాన్ని విస్మరించారు. క్రైస్తవ వలసవాదులు వాళ్ళ కళ్ళు తెరిపించారు. కార్యకారణ సంబంధం లోకి, హేతుబద్ధతలోకి వాళ్ళని మేల్కొలిపారు అని వీరి వాదన.

కన్నుగానని వస్తుతత్త్వము

కాంచగలుగుదురింగిలీజులు (గురజాడ)

కంటికి కనబడని వస్తుతత్త్వం అంటే ఏమిటి? కార్యకారణ సంబంధమే!

కార్యకారణ సంబంధమే కాదు, దేవుడు కూడా కంటికి కనబడడు. దేవుడు కూడా కార్యకారణ సంబంధం నుంచే పుట్టాడు. దేవుడు మూఢవిశ్వాసమైతే, కార్యకారణ సంబంధం పట్ల ఆధునికులకు గల తిరుగులేని విశ్వాసం కూడా మూఢవిశ్వాసమే!

కార్యకారణ సంబంధం పట్ల తిరుగులేని విశ్వాసమే సైన్సుకి మూలాధారం. అంటే కార్యకారణ సంబంధాన్ని పరిశీలించడం ద్వారా వస్తుతత్త్వాన్ని గుర్తెరగవచ్చనే విశ్వాసం అన్నమాట.

ఐతే కార్యకారణ సంబంధం గురించి మనుషులకే కాదు, జంతువులకీ పక్షులకీ చివరికి మొక్కలకి కూడా తెలుసు. పక్షి గూడుని నిర్మిస్తోందంటే ఈ కార్యకారణ సంబంధం తెలియడం వల్లే!

కాని కార్యకారణ సంబంధం పట్ల తిరుగులేని విశ్వాసం మనిషిలో మాత్రమే వుంది. దీని నుంచే దేవుడూ సైన్సూ పుట్టుకొచ్చాయి. అంటే మతమూ సైన్సూ కూడా ఒకే మూలం నుంచి ఒకే రకమైన విశ్వాసం నుంచి పుట్టాయి. కుండకి కుమ్మరి నిమిత్త కారణం. అట్లాగే విశ్వానికి దేవుడు. యింత సింపుల్ లాజిక్ మీద ఆధారపడి దేవుడు పుట్టాడు. యిక్కడ కార్యకారణ సంబంధమే పనిచేసింది.

కుండ చేయడానికి కుమ్మరి ఉన్నాడు. అలాగే వివిధ వృత్తి పనులు చేయడానికి మనుషు లున్నారు. ప్రకృతిలో కూడా కార్యకారణ సంబంధం యిలా సహజంగా పనిచేస్తుండగా వేరే దేవుడెందుకు? అని ప్రశ్నించినవాడు కుమారిలుడు. ఈయన మీమాంసా శాస్త్రవేత్త, వైదికధర్మ వ్యాఖ్యాత. దేవుడు చనిపోయా డంటూ యూరప్ గగ్గోలు పెట్టింది కానీ, భారతదేశంలో దేవుడసలు పుట్టనే లేదు.

బుద్ధుడు కార్యకారణ శృంఖల అన్నాడు. కార్యకారణాలు గొలుసు లాంటివి. అంటే ఒకదాని మీద మరొకటి లింకై అనంతంగా ఉంటాయన్నమాట. ఈ ఆలోచనకు ప్రాచీన సాంఖ్యతత్త్వం మూలం. దేవుడనేవాడుంటే వాడికి కూడా మరొక కారణం వుండాలి అంది సాంఖ్యం. కార్యకారణ అభేదాన్ని చెప్పింది సాంఖ్యం. కారణంలోనే కార్యం వుంటుంది. విత్తులోనే చెట్టుంటుంది. అంటే కర్త క్రియ వేరు కాదు, రెండూ ఒకటే. యింక దేవుడు ఎక్కడ దొరుకుతాడు?

నిజానికి దేవుడు యూరప్ లో పుట్టాడు. క్రైస్తవంలో పుట్టాడు. యూరపియన్ క్రైస్తవంలో పుట్టాడు. నిజానికి మూల క్రైస్తవం గురించి మనకేం తెలుసు? బిగ్ బ్యాంగ్ థియరీకి, బైబిల్ విశ్వాసానికి సంబంధం వుంది. అందుకే రోమన్ చర్చి ఆ సిద్ధాంతాన్ని సమర్ధించింది. ఈమాట ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చెప్పనే చెప్పాడు. ఐతే విశ్వానికి మొదలు ఉంటేనే దేవుడు ఉండే అవకాశం ఉంది. కాని విశ్వం అనాది, అనంతం కనుక దేవుడు లేడు పొమ్మన్నాడు (బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం). భారతీయుల విశ్వాసాల ప్రకారం అంతా అనాది. యింక దేవుడెక్కడ?

ఆధునిక సైంటిస్టులు క్రమేపీ పాంథీయిజం వైపు ప్రయాణించారు. దేవుడే యీ విశ్వంగా రూపాంతరీకరించబడ్డాడనేదే పాంథీయిజం. అటువంటి విశ్వాసంలో మాత్రమే అనంతం అనేది సాధ్యమౌతుంది.

భారతీయులకి అనంతం అంటే ముద్దు. దాన్ని గ్రీకులు చీకటిగా భావించారు. అనంతంలో నామ రూపాలు ఏర్పడవనీ, పరిధి కల చోట మాత్రమే అవి ఏర్పడతాయని అరిస్టాటిల్ అన్నాడు. కాని హెగెల్ ‘అనంతం’ అనేది ఆధునిక కాలపు విప్లవంగా భావించాడు. ఎందుకంటే… గణితంలోనూ, భౌతికశాస్త్రంలోనూ, తత్త్వశాస్త్రంలోనూ అనంతం ఆవిష్కరించ బడుతూ వచ్చింది (రీజన్ ఇన్ రివోల్ట్).

గ్రీకులు చీకటిగా భావించిన ‘అనంతం’ అనే కాన్సెప్టులో భారతీయులు వీరవిహారం చేశారు. అనంతం అనేది అనంతుడైన పరమాత్మ వంటిది. పరమాత్మ కూడా జీవసృష్టి వల్లగానీ, లయము వల్లగానీ మార్పు చెందడు అంటాడు ప్రాచీన గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యులు (సిద్ధాంత శిరోమణి).

సృష్టి ప్రళయాలు కూడా తుదీ మొదలూ లేకుండా సాగుతాయి. అది అనంతమైన ప్రాసెస్. అందువల్ల సృష్టికర్త లేడు, ఉన్నా నామమాత్రుడు. మొదలూ తుదీ లేని చోట కర్తని ఎక్కడ నిలబెడతావు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం నిజమైతే, భారతీయ తత్త్వం ప్రకారం అనంతమైన బిగ్ బ్యాంగ్ ల గొలుసు మాత్రమే ఉంది. ఆ గొలుసుకి మొదలు లేదు. అదే బుద్ధుడు చెప్పిన కార్యకారణ శృంఖల. నిజానికి అనంతంలో యిది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ లో కాలమూ స్థలమూ కూడా కుదించబడతాయి. బిగ్ బ్యాంగ్ కీ దేవుడికీ గల అక్రమ సంబంధాన్ని గుర్తించిన కొందరు కమ్యూనిస్టులు యీ సిద్ధాంతాన్నే తిరస్కరించారు (Reason in Revolt-Marxist Philosophy and Modern Science by Alen Woods and Ted Grant).

అనంత విశ్వాలు ఉన్నాయన్నందుకే బ్రూనోని దహనం చేశారు. బ్రూనో పునర్జన్మపై విశ్వాసాన్ని కూడా ప్రకటించాడు. జన్మ పరంపర అనేది కూడా అనంతమే. అంటే విశ్వాన్ని గురించి, జన్మల గురించి అతని దృక్పథం క్రైస్తవానికి విరుద్ధం. బ్రూనో నాటికి ప్రసిద్ధంగా ఉన్న ‘టోలమీ నమూనా’ ప్రకారం విశ్వం పరిమితం, కాలం పరిమితం. దాన్ని బ్రూనో విశ్వాసాలు బద్దలు చేస్తుండడంవల్లనే ‘పేగన్’ అని ముద్ర వేసి చంపేశారు. యిది అనంతం అనే భావనపై వేటు.

నిజానికి ఆధునిక సైన్సుకి మూలాలు చాలావరకు క్రీస్తు పూర్వం లోనే ఉన్నాయని అనేకమంది మేధావులు భావించారు. సూర్యకేంద్రక సిద్ధాంతానికి ప్రేరణన్ గ్రీకుల సూర్యారాధనలో వుంది అన్నాడు బెర్ట్రాండ్ రసెల్. విశ్వం కొన్ని నియమిత సూత్రాల ప్రకారం పని చేస్తుందన్న సైన్సు నమ్మకానికి మూలం గ్రీకుల FATE లో ఉంది అని ఆయన చెప్పాడు (Is Science Superstitious).

ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తోందంటే సైన్సూ విశ్వాసమూ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయన్నది తప్పు. సైన్సు కూడా విశ్వాసాల పుట్ట. విశ్వాసం లేనిదే విశ్వం లేదు. అందుకే ఆస్ట్రానమి, ఆస్ట్రాలజీ కవలలు గా జన్మించాయి. రసవిద్య రసాయనిక శాస్త్రం కవలలు. తంత్రశాస్త్రం దేహంపై తీవ్ర విశ్వాసం కలిగింది కావడం వల్లే మెదడుకి గల ప్రాధాన్యాన్ని యేనాడో గుర్తించగలిగిందని దేవీప్రసాద్ చటోపాధ్యాయ అన్నారు (లోకాయత).

కనక సైన్సు కూడా విశ్వాసజనితమే. ఏమిటా విశ్వాసం? కార్యకారణ సంబంధం పై విశ్వాసం. యీ విశ్వాసం చేసిన పనేంటంటే … కాన్సెప్టులని సృష్టించడం. దేవుడిపై నమ్మకం మతాన్ని సృష్టిస్తే, కార్యకారణ సంబంధం పై తిరుగులేని నమ్మకం కాన్సెప్టులని సృష్టించింది. థియరీలని సృష్టించింది.

పక్షి గూడు కట్టుకుంటుంది. కాని ‘గూడు’ అనే భావాన్నీ కాన్సెప్టునీ అది సృష్టించలేదు. అందుకే ప్లేటో ‘భావాలే మూలం’ అన్నాడు. ఒక ఇమేజి, వొక కాన్సెప్టు, వొక భావం వీటిని మనిషి మాత్రమే సృష్టిస్తాడు. క్రిమి కీటకాలూ, పక్షులూ, జంతువులూ కూడా గూళ్ళు బోరియలు లాంటి వస్తువులను సృష్టించగలవు. కాని భావాలని కాన్సెప్టుల్ని మనిషి మాత్రమే సృష్టించగలడు. అంటే మనిషి ప్రాధమిక లక్ష్యం వస్తువుల్ని సృష్టించడం కాదు, భావాల్ని సృష్టించడం. యీ భావాల్ని సంస్కారాలుగా తర్వాతి తరానికి అందజేస్తాడు. ‘యద్భావం తద్భవతి’ అన్నది అందుకే. నువ్వెలా భావిస్తే, ఊహిస్తే అలా ఉంటుంది ప్రపంచం.

ఇల్లూ పక్షి గూడూ ఒకటి కాదు. రెండూ కార్యకారణ సంబంధం నుంచే పుట్టాయి. కాని ఇల్లు అనేది మనిషి సృజించిన భావం. అదొక వస్తువు కాదు. అదొక ఇమేజి, కాన్సెప్టు. అందుకే అది వినూత్న రూపాల్ని ధరిస్తుంది. మనుషుల ఊహలూ, భావాలూ ‘ఇల్లు’ అనే పదార్ధంలో తీవ్రమైన మార్పులు తెస్తాయి.

ఇల్లు ఎలా ఉండాలి? ఏది మంచి ఇల్లు, ఏ మోడల్ మంచిది అనేదాన్ని మనిషి సంస్కృతీ సంస్కారం నిర్ణయిస్తుంటాయి. అంటే సింపుల్ కార్యకారణ సంబంధం మనిషిలో స్మృతి పరంపరగా పదిలం చేయబడుతుంది.

యీ స్మృతులు ఆయా స్థలకాలాల్లో విభిన్నంగా ఉంటాయి. వీటినుంచి అక్కడి సంస్కృతి నిర్మించ బడుతుంది. ఈ సంస్కృతే లేకపోతే మనిషి లేడు. ఇంత వివరణ తర్వాత నేను సాహసించి ఒక ప్రశ్నని సంధిస్తాను. ఆధునిక సైన్సుని యూరోపీయ క్రైస్తవం శాసిస్తోందా? బిగ్ బ్యాంగ్ థియరీ వెనక క్రిస్టియన్ మోటివేషన్ ఉందా? అదే నిజమైతే కార్యకారణ సంబంధాన్ని సంస్కృతీ మతమూ శాసిస్తుందన్నమాట. అలాంటప్పుడు కార్యకారణ సంబంధం పై విశ్వాసం మతవిశ్వాసం కంటే నిష్పాక్షికమైనదని, పారదర్శక మైనదని యెలా చెప్పగలం!?

బిగ్ బ్యాంగ్ థియరీని అంటుకొని గాడ్ పార్టికిల్ కోసం చేసిన అన్వేషణను క్రైస్తవ అన్వేషణ అనొచ్చా? యీ మెగా సైంటిఫిక్ ప్రాజెక్టుల వెనక మతపరమైన పాక్షిక దృష్టి పనిచేయడం లేదని ఎలా చెప్పగలం? యద్భావం తద్భవతి. నువ్వలా చూడాలనుకొన్నావు గనక, ప్రపంచాన్ని నువ్వలా నిర్వచించాలనుకొన్నావు గనక నీకలా కనిపిస్తోందా?

మొత్తంగా సైన్సు చరిత్రని పరిశీలిస్తే దాని కార్యకారణ సంబంధం వెనక పాంథీయిజం, పేగనిజం, హెలెనిజం చాలావరకూ పనిచేశాయి. బ్రూనో లాంటి వాళ్ళ మీద దాడి నిజానికి సైన్సు మీద దాడి కాదు. యూరోపీయ క్రైస్తవ వ్యతిరేక భావాల మీద దాడి.

బిగ్ బ్యాంగ్ థియరీ విజయం ద్వారా యితర ప్రాపంచిక దృక్పథాల్ని క్రైస్తవ సైంటిస్టులు వెనక్కి నెట్టేశారు. సైన్సు పేరుతో జరిగిన క్రూసేడు యిది. ఈ క్రూసేడులో భరతఖండం కూడా బాధితురాలే. ఎందుకంటే, క్రైస్తవమత పూర్వపు యూరప్ కీ మనకీ పోలికలు ఉన్నాయి. ఆ ప్రాచీన గతం నుంచే బ్రూనో, గెలీలియో వంటి వారు స్ఫూర్తిని పొందారు. అలాంటి స్ఫూర్తిని వాళ్ళు ప్రాచ్యం నుంచి కూడా పొంది ఉండవచ్చు.

బ్రూనోని ఇటాలియన్ కాథలిక్ క్రైస్తవులు సజీవ దహనం చేసి అతని చితాభస్మాన్ని టైబర్ నదిలో కలుపు తున్నప్పుడు మనదేశంలో యమునా నది ఒడ్డున అక్బర్ చక్రవర్తి సర్వమత సమానత్వాన్ని పెంపొందింప జేయడానికి ప్రయత్నిస్తున్నాడు. విభేదాల్ని సంవాదాలుగా మార్చడానికి కృషి చేస్తున్నాడు.

యిక్కడ నేనొక ప్రాచీన కథని ఉటంకించకుండా  ఉండలేను. దేవదానవులందరూ స్త్రీ పురుష భేదం లేకుండా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒక్క సరస్వతీదేవి మాత్రం దూరంగా వుంది. ఆమెని దేవతలూ రాక్షసులూ కూడా తమవైపుండి పోరాడమని ప్రార్థించారు. అప్పుడు సరస్వతీదేవి వారికి ఒక సత్యాన్ని బోధించింది. “యుద్ధానికి ముగింపు ఉండదు. సంవాదం చర్చల ద్వారా వివాదాల్ని పరిష్కరించుకోండి.” యిటీవల అసహనం చర్చనీయాంశమైన సందర్భంలో వొక కన్నడ రచయిత యీ కథని స్మరించాడు. అక్బర్ ఈ మార్గాన్నే ఎంచుకున్నాడు. బ్రిటీష్ వాళ్ళు పూర్తిగా ఆధిపత్యం చెలాయించేంతవరకు సంవాద పద్ధతి కొనసాగిందని వెండీదోనిగర్ రాశారు (Hinduism – An alternative history).

క్రైస్తవవలసకు పూర్వం భారతదేశంలో ఉన్న స్థితిని చీకటియుగంగా భావించారు మన మేధావులు. ఇది లెఫ్టిస్టులకీ రైటిస్టులకీ కూడా చీకటిచరిత్రే. లెఫ్టిస్టు లేమంటారు? ఆకాలం కులతత్వపు చీకటితో నిండి ఉందంటారు. రైటిస్టులేమంటారు? అది ముస్లిం మతపు చీకటి అంటారు. ‘కసాయిబు’ల కాలం అంటారు. వీరిద్దరూ ఒకచోట కలుస్తారు. అది చీకటి. భారతీయులది చీకటి చరిత్ర.

భారతీయుల గతం చీకటి చరిత్రగా ఎందుకు కనిపించింది? దాని వెనక వున్న కార్యకారణ సంబంధం ఏమిటి?

మార్క్సు భారతీయుల గతం గురించి మూడు రకాలుగా చెప్పాడు. 1) నిరంతర ఓటమి 2) అంతులేని వైరుధ్యాల పుట్ట 3) అధమ మతం, ప్రకృతి ఆరాధనతో కూడిన పేగన్ మతం (ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం). వీటికి పరిష్కారం ఏమిటి? తిరిగి ఓటమి. బ్రిటిష్ చేతిలో ఓటమి. మార్క్సు మాటల్లో భారతీయులకు ఓటమి కొత్తేమీ కాదు. ఏ తురక చేతుల్లోనో కాకుండా బ్రిటిష్ వాడి చేతిలో ఓడిపోవడం మంచిదైంది. దీనికి కొనసాగింపే శ్రీ శ్రీ రాసిన దేశచరిత్రలు. ముస్లిం నియంతల పేర్లు తప్ప ఇంగ్లీషు నియంతల పేర్లు ఆ కవితలో కనబడవు. ఎందుకంటే భారతదేశాన్ని ఇంగ్లీషువాడు ఓడించడమే మంచిదైం దని మార్క్సు అన్నాడు కనుక. బంకించంద్ర చటర్జీది కూడా అదే పాట. ముస్లిం నియంతృత్వపు చీకటి నుంచి బ్రిటిష్ వాళ్ళు మనల్ని బయట పడేశారన్నాడు. జార్జి చక్రవర్తి హింసాత్మక విజయాన్ని గురజాడ కూడా శ్లాఘించాడు. ఈ ఆధునిక కవుల అభిప్రాయాలన్నీ ‘బ్రిటిష్ యుగం హింసాత్మకమైనప్పటికీ అది భారతదేశాన్ని గ్రామీణ చీకటి నుంచి విముక్తి చేసిన యుగం’ అన్న మార్క్సు మాటలకు ప్రతిధ్వనులే!

ఇప్పటికీ భారతీయ గతాన్ని మూడు రకాల చీకటిగా చూడడం జరిగింది. 1) గ్రామీణత 2) కులం 3) ముస్లిం సంస్కృతి. ఈ మూడూ విమర్శకుల దృష్టిలో చీకట్లే. విప్లవ మేధావి కెవిఆర్ బ్రిటిష్ పూర్వ యుగాన్ని ‘నిశీధిని’ అన్నాడు.

భారతదేశాన్ని చరిత్ర పూర్వ యుగంగా భావించాడు హెగెల్. అలాగే భావించాడు మార్క్సు. క్రైస్తవ పూర్వ సమాజంగా భావించారు క్రైస్తవులు. వీరి భావాలే కమ్యూనిస్టుల్నీ, ఆధునికుల్నీ, హిందూవాదుల్నీ ప్రభావితం చేశాయి. ఈ అన్ని దృక్పథాల వెనక కార్యకారణ సంబంధం పనిచేస్తోంది. అది క్రైస్తవ యూరోపీయ కార్యకారణ సంబంధం. దృష్టే సృష్టి.

అన్ సర్టైనిటి థియరీ, కేయాస్ థియరీ, క్వాంటం ఫిజిక్స్ ద్రష్టకి ప్రాధాన్యాన్ని పెంచాయి. దేవుడు పాచిక లాడడని ఐన్ స్టీన్ అన్నాడు. క్వాంటం ఫిజిక్స్ గురించి మాట్లాడే సందర్భంలో ఈ మాటలన్నాడు. భారతీయ దృక్పథం ప్రకారం ప్రపంచం దేవుడి లీల, క్రీడ మాత్రమే. అతనికి తోచుబడి కాక యీ క్రీడ మొదలు పెట్టాడు. మొదట తనని తాను రెండుగా స్త్రీ పురుషులుగా విభజించుకొన్నాడు. మైథునక్రీడ జరిపాడు. అప్పుడు సృష్టి మొదలైంది. దీన్ని సృష్టిక్రీడ లేక ఇంద్రజాలం అంటారు. క్రీడల్లో లాగే ఇంద్రజాలం సూత్రాలు కూడా కల్పితం. ఎవడా సూత్రాల్ని కల్పిస్తాడో, ఏ దృక్పథంతో కల్పిస్తాడో, ఆ రూపం ధరిస్తాయి. అటువంటి సూత్రాలు ఏర్పడతాయి. నువ్వు దేవుణ్ణి ఏరూపంలో చూడాలనుకొంటే ఆ రూపంలో కనబడతాడు. ప్రపంచం ఏరూపంలో కనబడాలనుకుంటావో అలా కనబడుతుంది. నిశ్చల సూత్రాలు లేవు. నువ్వు యూరోపీయ క్రైస్తవ దృక్పథంతో చూడాలనుకుంటే ప్రపంచం అలాగే కనబడుతుంది. భారతదేశానికి ఓటమి సహజాతం అని మార్క్సు అన్నాడు. అది అతని దృష్టి. అసలు ఓటమి అంటే ఏమిటి? భరతఖండ స్వరూప స్వభావాలు ఎటువంటివి? దీన్ని మనం తులనాత్మక పద్ధతిలో నిర్వచిద్దాం.

చైనా చాలాకాలం పాటు మిగిలిన ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. ఒకే భాష ఒకే లిపి అందుకే అక్కడ సాధ్యమయ్యాయంటారు. బ్రిటిష్ వాళ్ళు మత్తు మందు యుద్దాలతో లొంగదీసేవరకు చైనా తన మానాన తాను బతికింది. అమెరికా సంగతి చెప్పక్కర్లేదు. సుదీర్ఘకాలం పాటు ఏకాంతంలో జీవించింది. యూరోపియన్ల ప్రవేశంతో వారితో వచ్చిన సూక్ష్మక్రిములు స్థానికుల్ని చంపేశాయి. మిగిలినవారిని గన్నులు వేటాడాయి. చరిత్ర లేని, బలమైన స్మృతులు లేని కొత్తజాతి పుట్టుకొచ్చింది.

భారతదేశానికొస్తే, యిక్కడ అడుగు పెట్టని జాతి లేదు. యిక్కడ దొరకని భాష లేదు. ముక్కోటి దేవతలు. యిక్కడ ఎవరు ఎవర్ని జయించారు, ఎవరు ఓడిపోయారు!? సుదీర్ఘమైన గతం. యింకా చదవబడని హరప్పా లిపి. భరతఖండం ఎప్పుడూ ఒంటరిగా లేదు. అతిధులు ఎక్కువ. అందుకే ఆతిధ్యం భారతీయుల ప్రత్యేకత అయ్యింది. నిజానికి అతిధుల్నీ స్థానికుల్నీ వేరు పరచడం అసాధ్యం. ఇది అతిధుల దేశం.

అందువల్లనే అమెరికాకి చరిత్రని వెతకలేం. ఇండియా చరిత్రని గుర్తుపట్టలేం. ఎందుకంటే అమెరికాకి చరిత్ర లేదు. ఇండియాకి గుర్తించగలిగే చరిత్ర లేకున్నా గాఢమైన స్మృతులున్నాయి. యిక్కడ చరిత్రని వెతికే వాడు మూర్ఖుడు. స్మృతుల్ని వెదికేవాడు ఋషి. ఆ స్మృతులు ఎక్కడుంటాయి. ప్రజల నాల్కల మీద ఉంటాయి. స్థానిక సంస్కృతుల్లో ఉంటాయి. ఎవరో మనకి అశోకుడి పుట్టు పూర్వోత్తరాలు తెలియవని బాధ పడ్డారు. కానీ మనకి సూఫీ గురువుల బోధలు తెలుసు. కబీర్ దోహేలు తెలుసు. వేమన పద్యాలు నోటికొస్తాయి. అతి ప్రాచీనమైన వేదాలు కంఠతా వచ్చు. ఇవి స్మృతులు, గాఢమైన స్మృతులు. ఈ స్మృతుల్ని అధ్యయనం చెయ్యడం వల్ల మనుషుల మధ్య అనుబంధాలు దృఢమౌతాయి. మనకి అశోకుడి పుట్టుపూర్వోత్తరాలు తెలియకపోయినా, హరప్పా లిపి చదవలేకపోయినా, వర్తమానంలో మిగిలి ఉన్న సజీవ సంస్కృతులలో కులపురాణాలలో మన గత సంస్కృతి అందుతూనే ఉంది.

ఇంతకీ చరిత్ర మనకి ఓడిపోవడం గెలవడం అనే భావాల్ని నేర్పింది. ఎప్పుడూ మనం ఓడిపోలేదు, ఎప్పుడూ గెలవనూ లేదు. భరతఖండానికి సంబంధించినంతవరకూ గెలుపోటములు వలస క్రైస్తవులు కనుగొన్న విషయాలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు మనలో ఒకరుగా ఉండదలుచుకోలేదు. దూరంగా ఉంటూ బిజినెస్సు చెయ్యదలుచుకున్నారు. అందుకని మనని ప్రాచీన ఆర్యుల దగ్గరినుంచి అందరూ ఓడిస్తూ వచ్చారని గెలుపు చరిత్ర మనకు లేదని నూరిపోశారు. ఆర్యుల దండయాత్ర కథ కట్టుకథ అని తేలిపోయినా మనం దానినే అంటిపెట్టుకొని ఉన్నాం. చరిత్ర దయ్యంలా మనల్ని వెంటాడుతోంది. చరిత్ర అంటే గెలుపు అని, ఒక జాతి మరొక జాతి మీద జెండా ఎగరెయ్యడమనీ బ్రిటిష్ వాడు మనకి నూరి పోశాడు. మన సంస్కృతినీ సంప్రదాయాల్నీ కళల్నీ మొత్తం మన జీవితాలనే తాను గెల్చుకున్నానని చాటాడు. యీ వలసవాద దృష్టితోనే భరతఖండాన్ని నిరంతరం వోడిపోయే దేశంగా మార్క్సు వర్ణించాడు.

తెల్లవాడు వచ్చాక తెల్లారింది. అంతకుముందు అంతా చీకటే. అందుకే మరో వందేళ్ళు మనదేశాన్ని ఇంగ్లీషు వాడు పాలిస్తే బాగుండునని కంచ ఐలయ్యగారు అన్నారు. యిటువంటి భావాలు పాశ్చాత్య క్రైస్తవ అభివృద్ధి నమూనాకీ, టెక్నాలజీకి తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెడుతున్నాయి. వలసవాదుల గెలుపు భావన, రాజ్యాధికార భావన మనల్ని వెంటాడుతోంది. అందరూ రాజ్యాధికారమే తమ లక్ష్యమని ప్రకటించుకుంటున్నారు.

(రెండో భాగం వచ్చే గురు వారం)

మీ మాటలు

 1. ఆసక్తిగా రాసారు. గతాన్ని తవ్వుకొంటూ అనేక ఆలోచనలు ప్రతిపాదించారు.
  ఇంతకీ అసలు విషయం వర్తమానం.
  రేపెలా గడుస్తుందో తెలీక చస్తున్న కోట్లాది మామూలు మనుషులకి గతంలో ఏమి జరిగిందో ఆట్టే అవసరం లేదు. వాళ్ళకి విలువయిన గత స్మృతులతో పనీ లేదు.
  ఇప్పటి సమాజంలో కుల వర్ణ అసమానతలూ, దోపిడీ, దౌర్జన్యం ఉన్నాయని శర్మ గారు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే అవి ఎలా పోతాయో , లేదా ఎలా పోవాలని అనుకొంటున్నారో తర్వాతి భాగంలో చెప్తారని ఆశిద్దాం. అదేమీ లేదు క్రైస్తవం , మార్క్సిజం రాక ముందు గతం ఇక్కడ బాగానే ఉంది మళ్ళీ అలాగే బతికేద్దాం అంటారా? అదే ప్రకటించండి.
  -శశాంక

 2. rani siva sankara sarma says:

  ఎంత అసహనం? ఇంకా తర్వాతి భాగం వుందని అంటూనే వున్నారు. అప్పుడే వ్యాసం గురించి తీర్పు యిచ్చేస్తున్నారు. పరిష్కారం అర్జెంటుగా చెప్పెయ్యండి కార్యరంగం లోకి దుకేయ్యాలి. నేను యెప్పుడూ వర్తమాన సమస్యలకి పరిష్కారం చెప్పే పెద్ద మనుషులకోసం ఎదురు చూసే పనిలో వుంటానంటున్నారు. నిండు శశాంకుడిలా మీరే ఆవేలుతురుయేదో పంచండి . యెప్పుడూ వెలుగుకోసం యితరుల మీద ఆధార పడె బానిస బుద్ధి ఎందుకు?. యింతకీ వర్తమానానికీ గతానికీ మధ్య ఎటువంటి సంభాషణ వుండదంటారా? అసలు అటువంటి సంభాషణ అనవసరంఅంటారా? గతంబాగుంది/ బాగులేదు యిలా మీకు ఆన్నీ వన్ వర్డ్ ఆన్సర్స్ కావాలా? ఈమధ్య ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేరు అవుతున్నారు అనుకొంటా . వ్యాసం గురించి ఆసక్తి గావుంది/ లేదు అంటు తీర్పులు చెప్పకండి వోపిక వుంటె పూర్తిగా చదవండి. హిట్టా ఫట్టా అని చెప్పడానికి యిది తెలుగు సినిమా కాదు.

 3. తాత్విక చింతనతో తెలుగులో ఇలాంటి వ్యాసాలు అరుదుగా వస్తారు. మంచి పఠనానుభవాన్ని ఇచ్చింది.
  గతం అనేది నేడు చాలామంది దృష్టిలో ఒక పనికి రాని వస్తువు. ప్రస్తుతం పరిగెడితే తప్ప నడవనికాలం లో ఉన్నామనేది వాస్తవమే కావచ్చు, కాసేపు వెనక్కు చూస్తే, మనల్ని తొక్కుకొంటూ చాలామంది ముందుకు పోయే పరిస్థితులు ఉండొచ్చు, అయినప్పటికీ, చరిత్రను తెలుసుకోవటం మన పూర్వీకుల్ని తలచుకోవటమే. ఈ జన్యువులను ఇచ్చినందుకు (రోగాలతోపాటూ ఆయుషుని కూడా కలిగినవి) వారిని స్మరించుకోవటం ఒక మానసిక నిండుతనాన్ని ఇస్తుంది
  “Those who cannot remember the past are condemned to repeat it” అనే George Santayan కొటేషన్ గుర్తుకువస్తుంది ఈ సందర్భంలో

 4. p.sambasiva rao says:

  శశాంక గారిది అసహనం అంటూనే, మీరెంత అసహనం ప్రదర్శిస్తున్నారో కదా! 😆😁😊

 5. Chimata Rajendra Prasad says:

  బిగ్ బ్యాంగ్ థియరీ, క్రిస్టియానిటీ,స్టీఫెన్ హాకింగ్ గురించి రిఛర్డ్ డాకిన్స్ “ది గాడ్ డెల్యూషన్” (తెలుగులో “దేవుడి భ్రమలో” ఇన్నయ్య అనువాదంలో) ఇతర పుస్తకాల్లో శాస్త్రీయంగా చర్చించారు. చదివి సరి చూసుకోగలరు.

  Sent from http://bit.ly/f02wSy

 6. Nageswara Rao says:

  “భారతదేశానికొస్తే, యిక్కడ అడుగు పెట్టని జాతి లేదు. యిక్కడ దొరకని భాష లేదు. ముక్కోటి దేవతలు. యిక్కడ ఎవరు ఎవర్ని జయించారు, ఎవరు ఓడిపోయారు!? సుదీర్ఘమైన గతం. యింకా చదవబడని హరప్పా లిపి. భరతఖండం ఎప్పుడూ ఒంటరిగా లేదు. అతిధులు ఎక్కువ. అందుకే ఆతిధ్యం భారతీయుల ప్రత్యేకత అయ్యింది. నిజానికి అతిధుల్నీ స్థానికుల్నీ వేరు పరచడం అసాధ్యం. ఇది అతిధుల దేశం.అందువల్లనే అమెరికాకి చరిత్రని వెతకలేం. ఇండియా చరిత్రని గుర్తుపట్టలేం. ఎందుకంటే అమెరికాకి చరిత్ర లేదు. ఇండియాకి గుర్తించగలిగే చరిత్ర లేకున్నా గాఢమైన స్మృతులున్నాయి. యిక్కడ చరిత్రని వెతికే వాడు మూర్ఖుడు. స్మృతుల్ని వెదికేవాడు ఋషి “—చాలా చాలా చక్కని విశ్స్లేషణ .. మంచి తాత్విక ధోరణితో సాగినది..ఒక కొత్త కోణంలో – ఇంత ఆలోచనాత్మక రచన ఈ మధ్య చదవలేదు. అసహనం వంటి కామెంట్లు రాయకుండా దయచేసి ఆగండి- ఇంకో భాగం వచ్చేవరకూ ..ఓపిక పడదాం సాంబశివ రావు గారూ శశాంక్ గారూ !!

 7. తప్పకుండా తర్వాతి భాగం తర్వాత మళ్ళీ చర్చిద్దాం కానీ…
  ” యెప్పుడూ వెలుగుకోసం యితరుల మీద ఆధార పడె బానిస బుద్ధి ఎందుకు?” అని అనటంలోనే మీకెంత సహనం ఉందొ తెలిసి పోతోంది. ఆధారపడటం , నేర్చుకోవటం, చర్చింటమ్ సమాజపురోగతి లో ఒకభాగం. ఆ వరుసలోదే వ్యాసంలో మీరు చేస్తున్న అన్వేషణా, ఆ వ్యాసంలో వెలుగుని కనుగొనే ప్రయత్నం చేస్తున్న పాఠకులూను.
  “ఈమధ్య ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేరు అవుతున్నారు అనుకొంటా “లో వ్యంగ్యం ఇంకా బాగుంది.
  -శశాంక

 8. rani siva sankara sarma says:

  నా వ్యంగ్యాన్ని అర్థం చేసుకోగలిగినందుకు సంతోషం. అలాగే మిగిలిన మాటలు మీతో యెందుకు మట్లాడాల్సివచ్చిందో మీరు స్వయంగా అర్థం చేసుకోగలరని నా నమ్మకం. నేర్చు కోవడం , చర్చించడం,3 స్వబుద్ధిని ఉపయోగించడం కూడా సమాజ పురోగతిలో భాగం. ఆ చివరిదాన్ని చేర్చడం మీరు మరిచిపోయారు [సహజస్వభావం వల్లననుకొంటా]

  నీకు నీవే వెలుగువి- గౌతమ బుద్ధ

 9. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  స్మృతుల్ని అధ్యయనం చెయ్యడం వల్ల మనుషుల మధ్య అనుబంధాలు దృఢమౌతాయి…. బాగా చెప్పారు.

 10. సైన్స్ గురించి ఈ వ్యాసం కొత్తసంగతులను ప్రస్తావిస్తున్నది. సైన్స్ అనే పేరు, బూకరింపుగా మారి పాశ్చాత్య ఆధిపత్య భావజాలానికి గొప్ప ఆధారవనరుగా మారడం, వలసీకరణకు దోహదపడడం మనందరికీ తెలిసినదే. స్థానిక సంస్కృతులను, చరిత్ర, వైవిధ్యభరితమైన జీవన విధానాలను నిరాకరించడానికి ఇది ఎంత శక్తివంతమైన వనరుగా పనిచేసిందీ ఈ శతాబ్ధపు పోస్ట్ కలోనియల్ అధ్యయనాలు చర్చిస్తున్నాయి.

  అంతవరకూ ఆధిపత్యస్థానాలలో ఉన్న మతభావజాలం- సైన్స్ నూ, సాంకేతికతనూ తనలో ఇముడ్చుకొని, దానికనుగుణంగా తన వ్యాఖ్యానాలనూ, కథనాలనూ మార్చుకోవడం గురించి హేతువాద, వామపక్ష భావజాలాలు విస్తృతంగానే చర్చించాయి. అలాగే, తక్షణ వ్యాపార ప్రయోజనాలకూ, యుద్ధార్భాటాలకూ దన్నుగా సైన్స్ పనిచేయడం కూడా వెలుగులోకి వొచ్చింది. ఇదంతా సైన్స్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందన్న దానికి ఉదాహరణగా నిలుస్తాయి.

  దీనికి పూర్తి వ్యతిరేక దిశలో – సైన్స్, మానవ ఆచరణ, వివిధ ఆలోచనా ధారల నుండి వెలుగులోకి వొచ్చినదైనందువల్ల , సమాజంలో ఉన్న ఆధిపత్య భావజాల ప్రభావానికి తప్పనిసరిగా గురవుతుంది. ఈ అవగాహన సైన్స్ చేసిన కొత్త అన్వేషణలు, ఆలోచనలను కొత్తగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది.

  ఇది ఒక రకంగా ఆలోచనలపై ఆలోచనలు చేయడంలాంటిది.

  మన భౌద్ధిక సాంప్రదాయంలో మంచికో చెడుకో యాక్షన్ ఓరియేటెడ్ థింకింగ్‍కే పెద్ద పీట ఉంటూ వొచ్చింది. దీనికి భిన్నంగా ఎవరు మాట్లాడబోయినా మన కర్తవ్య దీక్ష తటాలున ముందుకొచ్చి అవతలి వారి గొంతు పట్టుకుంటుంది.

  బహుశా మనం ఇలాంటి విషయాలను కాస్త ఓపికగా విని ఆలోచించాలేమో.

 11. The Eleven Pictures of Time అనే పుస్తకంలో ఇదే విషయంగురించి ఉంది. ప్రయత్నించండి.
  http://pustakam.net/?p=16284

 12. >> “కనక సైన్సు కూడా విశ్వాసజనితమే. ఏమిటా విశ్వాసం? కార్యకారణ సంబంధం పై విశ్వాసం. యీ విశ్వాసం చేసిన పనేంటంటే … కాన్సెప్టులని సృష్టించడం. దేవుడిపై నమ్మకం మతాన్ని సృష్టిస్తే, కార్యకారణ సంబంధం పై తిరుగులేని నమ్మకం కాన్సెప్టులని సృష్టించింది. థియరీలని సృష్టించింది”

  But there’s a big difference between religious faith and scientific theories. A fundamental truth about science that every true scientist humbly accepts is – a scientific theory can never be proved. It can only be disproved. It can only be repeatedly tested, and each time it passed a test, it’ll become a better approximation of nature. It doesn’t matter how beautiful a theory/concept is or who proposed it or how many centuries it lasted. Science simply discards it, if it failed a test. Or at least fixes/extends it, like in the case of Newton’s theory of gravity.

  Can we say the same thing about ‘faith’?

  We owe a lot to science – including the technology we’re using for this discussion. Let’s not equate it with religious faith. There’s more to science than just blind faith.

 13. rani siva sankara sarma says:

  ప్రూవ్ చేయడానికి డి స్ప్రూవ్ చేయడానికి గాని వీలు లేని విషయాల్ని సైంటిస్టులు యెందుకు మాట్లాడుతున్నారు? ఉదాహరణకి బిగ్ బ్యాంగ్ సింగ్యులారిటీ . వొకథియాలజిస్టు సృష్టికి ముందటి పరిస్థితిని గురించి ప్రశ్నించకూడదన్నాడు.సైంటిశ్టులూ అలాగే మాట్లాడుతునారు. అక్కడ దేవుడికీ సృష్టికర్తకి అజ్ఞాతానికి బియింగ్ ఇన్ ఇట్సెల్ఫ్ కి స్థలం వదులుతున్నారు. అక్కడ[బిగ్ బ్యాంగ్ కి ముందు ] కార్యకారణసంబంధం పని చేయదంటున్నారు. యిప్పుడు బ్లాక్ హోల్స్ గురించి అదే మాట్లాడుతున్నారు.అందుకే కొందరు సైమ్టిష్టులు ఈసిద్ధాంతాలు మతపరమైనవి అంటున్నారు
  మరి పూర్తీ ఆబ్జక్టివ్ గా మీలాంటివాళ్ళు ని ర్వచించిన సైన్సు లోకి మత సరూప్యత ఎలా వచ్చింది? ఆబ్జెక్టివ్ అనేది యేదీ లేదు కనుక. పేరడైమ్ షిఫ్టు తప్ప మరేమే లేదు. సామాజిక శాస్తాలలో లాగే దృక్పధం ప్రధానమైనది, దృక్పధం లో మార్పు ప్రధానమైనది. దీని వెనుక వ్యక్తీ నేపథ్యం తప్పక పని చేస్తుంది ఎందుకంటే సైన్సు కూడ మానవకార్య కలాపమే.సైమ్టిష్టులస్తేట్ మెంట్లూ చూసినా ఈ విషయం అర్థమవుతుంది. ఐనిస్టీన్ దేవుడు పాచికలాడదు అని ఎందుకన్నాడు? క్వాంటమ్ ఫిసిక్సువలన దైవ నియమాల వంటి పూర్వ నిర్ధారిత నిశ్చల నియమాలు కనుమరుగు అవుతున్నాయి అని భావిచాడు.సబ్జెక్టివిటీ పెరిగి పోతోందని భయపడ్డాడు. అనుకున్నంతా జరిగింది. యీప్రమాదం ఐనిస్టీన్ రెలిటివిటీ తోనే ప్రారంభమైంది univarsal స్థల కాలాలని వ్యక్తీ గత స్థల కాలాలు ఆక్ర మించాయి. ఇది దృక్పధంలో వచ్చిన మార్పు. క్వాంటం ఫిజిక్సు దృశ్యాన్ని అస్థిరం చేసింది ద్రష్టకి ప్రాధాన్యం పెంచిది యింకా మీరు 17వ శతాబ్దిలో వున్నారా? ఆ నా టి ఆదిమ సైన్సులో కొట్టు మిత్లాడుతున్నారా అనిల్ గారూ.

  • >> “ప్రూవ్ చేయడానికి డి స్ప్రూవ్ చేయడానికి గాని వీలు లేని విషయాల్ని సైంటిస్టులు యెందుకు మాట్లాడుతున్నారు?

   Where did I say a theory can be neither proved nor disproved? This is of what I wrote: “A scientific theory can never be proved. It can only be disproved”. Please re-read my previous comment.

   >> “ఐనిస్టీన్ దేవుడు పాచికలాడదు అని ఎందుకన్నాడు? క్వాంటమ్ ఫిసిక్సువలన దైవ నియమాల వంటి పూర్వ నిర్ధారిత నిశ్చల నియమాలు కనుమరుగు అవుతున్నాయి అని భావిచాడు”

   Just because he said “God doe not play dice with the universe”, it doesn’t turn him into a philosopher. He’s a theoretical physicist first and foremost. You can twist his words to your advantage but his context is different.

   >> “యీప్రమాదం ఐనిస్టీన్ రెలిటివిటీ తోనే ప్రారంభమైంది univarsal స్థల కాలాలని వ్యక్తీ గత స్థల కాలాలు ఆక్ర మించాయి”
   >> “యింకా మీరు 17వ శతాబ్దిలో వున్నారా? ఆ నా టి ఆదిమ సైన్సులో కొట్టు మిత్లాడుతున్నారా అనిల్ గారూ”

   You think so? Since you seem to be an expert in relativity theory, you should know what I’m thinking about you right now from my frame of reference.

   మీరు చేసిన చివరి వ్యంగ్యభరిత వ్యాఖ్య అవసరమా? ఈ చర్చలో మీరు ఇతరులపై కూడా వ్యంగ్యంగా ప్రతివ్యాఖ్యలు చేయటం గమనించాను. చెప్పదలచుకున్న విషయమ్మీద స్పష్టత ఉన్నవారు చెప్పేదేదో సూటిగా చెబుతారు. విషయం లేనప్పుడే వ్యంగ్యానికి తెగబడి చర్చని పక్కదారి పట్టిస్తారు. మీ విషయం నాకు అర్ధమయింది. I’m withdrawing from this discussion.

 14. rani siva sankara sarma says:

  ఒక విశ్వాసాన్ని మరో విశ్వాసం డిస్ ప్రూవ్ చేస్తుంది. వొక దృక్పధాన్ని మరో దృక్పధం డిస్ ప్రూవ్ చేస్తుంది. ఆప్పుడొక కొత్త సిద్ధాంతం , వొక కొత్త తత్వం , వొక కొత్త మతంపుట్టుకొస్తాయి. అది నిజమే. అందుకే తత్వ వేత్తలకి మత ప్రబోధకులకి, సైంటిస్టులకి దూరం ఆధునిక కాలంలో కల్పించబడినదే. ఆనమ్మకం లో యింకా కోన సాగుతున్నందువల్లే అనిల్ గారిని 17 వ శతాబ్ది లో వున్నట్లు గా భావిస్తున్నాను. యిది స్వభావోక్తే కాని వ్యంగ్యం ఏమాత్రం కాదు.
  అసలు మోట్ట మొదట నిరపేక్ష స్థలకాలాలని తీవ్రంగా వ్యతిరేకించింది ఎవరో తెలుసా? ఆయన సైంటిస్టు కాదు.భౌ తిక శాస్త్ర సిద్ధాంతవేత్త యే మాత్రంకాదు. ఆయన తత్వ వేత్త. పైగా భౌతిక జగత్తు ఉనికినే పూర్తిగా తోసి రాజన్న భావ వాద తత్వవేత్త. ఆయన బిషప్ బర్క్లీ.ఆయన దృష్టిలో స్థల కాలాలు మాత్రమె కాక అసలు భౌతిక వస్తువులే భ్రమ. అంటె ప్రపంచం నేను మీద ఆధారపడి వుంది. అంతా సబ్జక్టివ్, అందుకే న్యూటన్ గారి నిరపేక్ష స్థలకాలాలని హేతు విరుద్ధం అంటూ ఆయన న్యూటన్ జీవించి ఉన్నపుడే వ్యతిరేకించాడు [బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం -స్టీఫెన్ హాకింగ్]. శంకరాచార్యులు కూడా మాయాకల్పిత దేశ కాల కలనా అంటూ స్థల కాలాలని మిథ్య అన్నారు. అలాగే బర్క్లి కూడా. కాని బర్క్లీ కంటే యెన్నో శతాబ్దాలముందే శంకరుడు స్థల కాలాల సాపేక్షత గురించి మాట్లాడాడు అనుకోండి. అదెలా సాధ్యమైంది? శంకరాచార్యులూ బర్క్లీ తత్వవేత్తలే కాని సైంటిస్టులు కారు. వారు చూసిన దాన్ని న్యూటన్ యెందుకు చూడలేకపోయాడు? దానికి అయన క్రై స్తవ దైవ భావనే కారణం. ఈ సంగతిని స్టీఫెన్ హాకింగే ప్రస్తావించాడు. ఈ విశ్వాన్ని దేవుడు కొన్ని తిరు గు లేని నియమాలతో సృష్టించాడు. ఆనియమాలు ఆబ్జక్టివ్ కాకపోతే సృష్టికర్త అయిన దేవుడికే ముప్పు వస్తుంది. అందుకే తన సైన్సు సూత్రాలే తన నిరపేక్ష స్థల కాల భావనకి గండి కొడ్తున్నా అదే నమ్మకాన్ని పటుకు వేళ్లాడాడు . తన మతవిస్వాసాన్ని అది గమించి మరోద్రుష్టి కోణాన్ని మరోవిస్వాసాన్ని ఆశ్రయించకపోవడం వల్ల జీవితాంతం అదే నమ్మకంలో నిలిచిపోయాడు.
  ఐనిస్టీన్ నికూడా ఆయన తాత్విక దృక్పధం మతం పట్ల మారిన దృష్టి , ఆయన సైన్సు సిద్ధాంతాలని కూడా ప్రభావితం చేసినట్లు కనిపిస్తుంది.ఆయన న్యూటన్ దృక్పధానికి పూర్తి భిన్నంగా పర్సనల్ గాడ్ని తిరస్కరించాడు.తాత్వికుడు స్పినోజా ప్రతిపాదించిన పాంథీయిస్టు గాడ్ ని నమ్ముతానన్నాడు. అంటే యీవిశ్వాన్ని నిరంతరం ఆశ్చర్యంతో గమనిచడమన్నమాట. స్వార్థాన్ని విడిచి పెట్టి సైన్సుని వొక తపస్సు గామార్చు కొన్నపుడు అహం నుంచి బయటపడగవచ్చని, ప్రయోజనాన్ని ఆసించకుండా జ్ఞానంకొసం జ్నాం అనే దృష్టితో పరిశొధనలు చేస్తె సైంటిస్టులు కూడా సెయింట్స్ అవూతారని ఆయన భావించాడు. షోపెన్ హోవర్ అనే తత్వ వేత్త వల్ల కూడా తీవ్రంగా ప్రభావితుడయ్యాడు ఐనిస్టీన్. ఆతత్వ వేత్త ద్వారా అహంకారాన్ని అధిగమిచడమె జీవిత పరమావిధి, దేవుడు గోల అనవసరం అనే భావన ఆయనలో బలపరిచింది అనే అభిప్రాయం ఆయన రచనల వల్ల కలుగుతుంది. యీకొత్త తాత్విక దృక్పథం దేవుడిని డిస్ ప్రూవ్ చేసింది. దేవుడితో పాటు నిరపేక్ష స్థల కాలాలని డిస్ ప్రూవ్ చేసింది. వొక విశ్వాసం మరొక విశ్వాసాన్ని వోకాద్రుక్పధం మరొక దృక్పధాన్ని డిస్ ప్రూవ్ చేసుకోవడం లోకరీతి సైన్సు కుడా దానికి అతీతం కాదు.
  [వరల్డ్ యాజ్ ఐ సి- అయినిస్టీన్]

 15. విశ్వాసాలకి ప్రూఫే ఉండదు. అలాంటప్పుడు వాటిని డిస్ప్రూవ్ చెయ్యడం ఎలా సాధ్యం? అందునా ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసాన్ని డిస్ప్రూవ్ చెయ్యగలదనుకోవడం మరొక విశ్వాసమేతప్ప నిజంకాదు.

  శంకరాచార్యులు, బర్క్లీలు తత్వవేత్తలు. తత్వవేత్తలతో అదే గొడవ. వాళ్ళెప్పుడూ ప్రూఫులివ్వాల్సిన అవసరమే లేదని, తమ నమ్మకాలు ప్రపంచపు వాస్తవికతతో విభేదించినా పర్వాలేదని అనుకుంటారు. in fact ప్రపంచపు వాస్తవికతతో తమ వచనాలకు పొంతన కుదరకపోతేనే అవెంతో మార్మికతను మూటగట్టుకొని ఉన్నట్లుగా మనం మురిసిపోతాం. ఒకవేళ సైన్సు స్తలకాలాలు సాపేక్షికంకాదు, పరమం అని తేల్చుంటే అప్పుడు శంకరాచార్యులను, బర్క్ల్లను కాకుండా వ్చేరొకరిని తలుచుకొని ఈ వ్యాసాన్ని లాగించుండేవాళ్ళంకాదా? ఫలానా తత్వవేత్త ఇలా అన్నడు అంటూ మీరు appeal to authorityలోకి దిగకుండా వాళ్ళు ఫలానాదాన్ని ఋజువుచేశారని చెప్పగలిగితే చెప్పండి. అది కుదరకపోతే ఆయన చెప్పినది నిజజీవితంలో ఎలా వర్తిస్తుందో, దానిమీద మనం ఏమేరకు ఆధారపడొచ్చో చెప్పండి. అంతేగానీ కార్యకారణ సంబంధాన్ని వెదకొద్దు, స్విచ్చునొక్కకపోయినా లైటు వెలుగుతుంది, లైటు వెలగడానికీ, స్విచ్చునొక్కడానికీ సంబంధంలేదు అని చెప్పొద్దు. వేదాంతం బాగానే ఉన్నా, దానిమీద ఆధారపడి జీవితాన్ని జీవించడం అసాధ్యం.

 16. ఈ వ్యాసంలో ఉన్న విషయం, వ్యాసం పై జరుగుతున్న చర్చ రెండు తలాలలో కొనసాగుతుతున్నట్టుగా కనపడుతుంది.

  ఒకటి- సైన్స్ తన పురోగతిగా చెప్పుకుంటున్న దానిలో భావజాల ప్రభావం, పరిమితులు ఉంటాయా లేదా అన్నది. వ్యాస రచయిత తన వ్యాసంలో శాస్త్రవేత్తలపైనా, వారి పరిశోధనలపైనా తప్పని సరిగా ఈ ప్రభావ, పరిమితులు పని చేస్తాయని అంటున్నారు.

  రెండవది- ఈ విషయాన్ని వివరించడానికి రచయిత చెప్పిన ఉదాహరణలు, వివిధ ఉటంకింపులు, చరిత్ర, భావజాలం, సంస్కృతి గురించి రచయిత చేసిన వ్యాఖ్యానాలు.

  అనీల్, ఫీనిక్స్ గార్లు చేసిన చర్చ రెండవ తలానికి పరిమితమవుతున్నది. ప్రధానమయిన మొదటి భాగాన్ని వీరు పట్టించుకోలేదు. అందువలన ఈ చర్చ ముఖ్యమైన విషయాలను పట్టించుకోకుండానే సాగుతున్నది.

  అనీల్ గారు సైన్స్ గురించి – A fundamental truth about science that every true scientist humbly accepts is – a scientific theory can never be proved. It can only be disproved. It can only be repeatedly tested, and each time it passed a test, it’ll become a better approximation of nature.- అని అంటున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఈ ఉటంకింపు సైన్స్ తన దృక్పథం గురించి ప్రపంచానికి ఇచ్చిన హామి.

  ఆ హామీని నిజంగానే సైన్స్ నిలబెట్టుకుందా లేదా లేకపోవడానికి భావజాల ప్రభావం ఏమైనా ఉందా అన్నది వ్యాస రచయిత వ్యాసంలో చెప్పదలుచుకున్న అంశం.

  అనీల్ గారి ఉటంకింపును పదేపదే చదువుకుంటున్నప్పుడు నాకు తోచిన విషయం -ఇది కూడా ప్రజాస్వామ్యంలాగా, సోషలిజం లాగా, ఇంకా కమ్యునిజంలాగా పుస్తకాల్లో తరుచూ ఉల్లేకించబడే శుద్ధ ఆదర్శం అని నాకు అన్పించింది.

  ఎందుకంటే వాస్తవం దాని ఆచరణలో భిన్నంగానూ చేదుగానూ ఉంటూ వొచ్చింది కాబట్టి.

  సైన్స్ శుద్ధ ఆదర్శం లాగా ఎప్పుడూ పని చేయలేదు. అలా ఉండడం కూడా సాధ్యపడదు.
  అది తన కాలపు భావజాల వెలుగునీడల్లో తనకున్న పరిమితుల్లో మాతమే పని చేస్తుంది. అలాగే తనకాలపు ఆధిపత్య భావజాలాలను అది ప్రమోట్ చేస్తుంది.

  • ఈ “భావజాలపు పతిమితులు” అన్నమాట నాకు ఏమాత్రమూ అర్ధం కాలేదు. కొన్ని ఉదాహరణలిస్తే నాకు సౌలభ్యంగా ఉండేది.

   సైన్సు ఋజువులపై(కార్యకారణ సంబంధంపై) ఆధారపడి ముందుకు వెళుతుంది. Science has so far been a safe wager. That which it has managed to prove has so far been dependable with a brilliant predictability. Experimental proof means that we could utilize it in our daily lives. Please give me an example of a greater question that has been answered by philosophy that I could depend on safely.

 17. “అమెరికాకి చరిత్రని వెతకలేం. ఇండియా చరిత్రని గుర్తుపట్టలేం. ” … ఇది నిజం . మనం నమ్మే అనంతానికి సైన్స్, సెన్స్ ఉందనేది సత్యం

 18. ari sitaramayya says:

  1. “భారతీయులు కార్యకారణ సంబంధాన్ని అర్ధం చేసుకోలేక చీకటిలో కూరుకు పోయారనే వాదం ఆధునిక కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది.” ఈ అభిప్రాయం ఎవరిది? కార్య కారణ సంబంధం నిజ జీవితంలో రోజూ కనబడేదే. భారతీయులకు అది అర్ధం కాదని అనుకోవడానికి నిదర్శనాలు ఏవి? ఎవరైనా అలా అన్నా దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏంటీ?
  2. “కన్నుగానని వస్తుతత్త్వము, కాంచగలుగుదురింగిలీజులు (గురజాడ)”
  గురజాడ మంచి నాటకం రాశాడు, నిజమే. కాని ఆయనకు తాత్వికుడుగానో శాస్త్రజ్ఞుడు గానో పలుకుబడి ఉందా. నూక్లియర్ ఫిజిక్స్ గురించి మహాత్మా గాంధి ని అడగం కదా?
  “కంటికి కనబడని వస్తుతత్త్వం అంటే ఏమిటి? కార్యకారణ సంబంధమే!” ఇది మీరు ఎలా నిర్ణయించారు? కార్యకారణ సంబంధం చాలా విషయాల్లో కంటికి కనపడేదే. కనపడని కారణాలు ఉన్నప్పుడు వాటిఫలితం empirical గా ధ్రువీకరించగలిగినప్పుడే కార్యకారణ సంబంధం ఆపాదించడం జరుగుతుంది. ఉదాహరణకు quantum theory is supported because it can explain spectroscopic data very nicely even though we cannot see electrons physically.

  3. “కుండకి కుమ్మరి నిమిత్త కారణం. అట్లాగే విశ్వానికి దేవుడు. యింత సింపుల్ లాజిక్ మీద ఆధారపడి దేవుడు పుట్టాడు. యిక్కడ కార్యకారణ సంబంధమే పనిచేసింది.” మొదటి విషయం – దేవుడు పుట్టలేదు. దేవుడిని మనుషులు పుట్టించారు. అందువల్లే ఒక్కో సమూహానికి ఒక్కో దేవుడు ఉన్నాడు. కొందరికీ చాలామంది ఉన్నారు.
  కుమ్మరి కుండను చెయ్యడం కనపడుతుంది. దేవుడు విశ్వాన్ని తయారుచెయ్యడం ఎవ్వరూ చూసినట్లులేదు. ఇవి రెండూ ఒకటే ఎలా అయ్యాయి?
  4. “సైన్సు కూడా విశ్వాసాల పుట్ట.” నిజంగా? తీరిక ఉన్నప్పుడు ఈ విశ్వాసాల గురించి వివరించండి.
  5. ” అన్ సర్టైనిటి థియరీ, కేయాస్ థియరీ, క్వాంటం ఫిజిక్స్ ద్రష్టకి ప్రాధాన్యాన్ని పెంచాయి. దేవుడు పాచిక లాడడని ఐన్ స్టీన్ అన్నాడు. క్వాంటం ఫిజిక్స్ గురించి మాట్లాడే సందర్భంలో ఈ మాటలన్నాడు. భారతీయ దృక్పథం ప్రకారం ప్రపంచం దేవుడి లీల, క్రీడ మాత్రమే. అతనికి తోచుబడి కాక యీ క్రీడ మొదలు పెట్టాడు.”
  Nonsequitur అంటే ఇదే. ఐన్ స్టీన్ మాటలకీ ఆ తర్వాత రాసిన దానికీ సంబంధం లేదు. ఐన్ స్టీన్ ను వదిలేసి తర్వాత విషయం రాస్తే వచ్చే నష్టం ఏమీ లేదు. పైగా ఐన్ స్టీన్ చెప్పిన దాంట్లో ఏమైనా నిజం ఉండా అంటే అదీ లేదు. ఆయన ఎంత గొప్ప శాస్త్రజ్ఞుడు అయినా దేవుడు పాచిక లాడడని క్వాంటమ్ ఫిజిక్స్ గురించి వ్యాఖ్యానించినప్పుడు తప్పులో కాలేశాడు. కొత్త అభిప్రాయాన్ని తొందరగా అంగీకరించడం తెలివైన వారికి కూడా సాధ్యం కాకపోవచ్చు అని చెప్పడానికి దేవుడు పాచిక లాడడని ఐన్ స్టీన్ అనడం మంచి నిదర్శనం.
  6. “ఆధునిక సైన్సుని యూరోపీయ క్రైస్తవం శాసిస్తోందా? బిగ్ బ్యాంగ్ థియరీ వెనక క్రిస్టియన్ మోటివేషన్ ఉందా? అదే నిజమైతే కార్యకారణ సంబంధాన్ని సంస్కృతీ మతమూ శాసిస్తుందన్నమాట. అలాంటప్పుడు కార్యకారణ సంబంధం పై విశ్వాసం మతవిశ్వాసం కంటే నిష్పాక్షికమైనదని, పారదర్శక మైనదని యెలా చెప్పగలం!?”
  క్రైస్తవానికీ ఆధునిక శాస్త్రజ్ఞానానికీ మిత్ర సంబంధం ఉందా? ఎవరివో రెండు మాటలు ఉదాహరణగా చెప్పి తీర్మానం చెయ్యడం కాదు. జీవ పరిణామ క్రమాన్ని క్రైస్తవం పూర్తిగా వ్యతిరేకించింది. ఇప్పుడూ వ్యతిరేకిస్తుంది. అంటే క్రైస్తవం కార్యకారణ సంబంధాన్ని గుర్తిస్తుందా? లేదా? ఏదో ఒక అభిప్రాయం వెలిబుచ్చి, అదే నిజమైతే అని ఒక తోక అతికించి, అది నిజమని తీర్మానించి, దాన్నుంచి మరో అభిప్రాయానికి వెళ్ళడం సైన్స్ తెలిసిన వారు చేసే పని కాదు.

 19. rani siva sankara sarma says:

  జయ గారూ పొదుపైన మాటలలో సత్యాన్ని ప్రస్తావించారు. కార్య కారణ సంబంధాన్ని పరిమితమైన ఎంపిరికల్ నాలడ్జి[అనుభవజ్ఞానం] స్థాయికి కుదించిన వాళ్లకి , కంటికి కనబడే దానిలోంచే వస్తుతత్వాన్ని వడగట్టెయ్యవచ్చు అనుకునే ఎలిమెంటరీ స్కూలు స్థాయి వాళ్లకి అనంతం లాంటి గంభీరమైన కాన్సెప్టులు ఎప్పటికీ అర్థంకావు. అసలు అలంటి వాళ్లకి సాహిత్యమూ సైన్సూ తత్వశాస్త్రమూ ఏ వీ అర్థం కావు. వాటి మధ్య అంతస్సంబంధం వుంటుందన్న యింగీత జ్ఞానం ఐతే సున్నా. మీది చాలా ఉన్నతస్థాయి జయ గారూ . మీస్తాయి పఠకులకోసమే నారచనలు.

 20. ari sitaramayya says:

  1. ఇంకోసారి:
  “భారతీయులు కార్యకారణ సంబంధాన్ని అర్ధం చేసుకోలేక చీకటిలో కూరుకు పోయారనే వాదం ఆధునిక కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది.”
  ఎవరిదీ ఈ అభిప్రాయం? అసలు భారతీయులు అందరూ ఒకే అభిప్రాయం కలిగి ఉండటమో, ఒకే ఆచారాన్ని పాటించడమో ఎప్పుడు జరిగింది?
  2. “అందువల్లనే అమెరికాకి చరిత్రని వెతకలేం. ఇండియా చరిత్రని గుర్తుపట్టలేం. ఎందుకంటే అమెరికాకి చరిత్ర లేదు.” అమెరికాకి చరిత్ర లేక పోవడమేంటీ? నాలుగైదు వందల సంవత్సరాల తెల్ల వాళ్ళ చరిత్ర ఉంది. రెండు మోడు వందల సంవత్సరాల నల్ల వాళ్ళ చరిత్ర ఉంది. పదివేల సంవత్సరాల స్థానికుల చరిత్ర ఉంది.

  • ౧. భారత దేశంలో ఆధునిక( ఆంగ్ల) విద్య – సంస్కరణలు భారతీయులకు కార్యాకారణ సంబంధాన్ని నేర్పించడానికి ఉద్దేశించినవే. ఆంగ్ల విద్యా ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన మేధావులు, తెల్ల వాళ్ళ పాలన పట్ల ఆరాధనా భావాన్ని పెంపొందించుకున్నవాళ్ళూ- తెల్లవాళ్ళు తెచ్చిన, తేవాల్సిన సంస్కరణల పట్ల మహజర్లు సమర్పించిన వాళ్ళూ భారతీయుల కార్యాకారణ గ్నానం పట్ల అనుమానం ప్రకటించిన వాళ్ళే కాదా.

   భారతీయులందరూ ఒకే అభిప్రాయాన్నీ, ఆచారాన్నీ పాటిస్తారా అనే ప్రశ్నను లేవనెత్తడం వల్ల సీతారామయ్యగారు సరియైన వైఖరిని ప్రదర్శించారు. కానీ రచయిత తన వ్యాసం రాసిందే ఇలాంటి ఏకశిలా సదృశ్య వైఖరులకు వ్యతిరేకంగా కాదా? భారతీయులకు కార్యాకారణసంబంధాన్ని నేర్పాలనే భావనలోని ఆధిపత్యభావజాలం గురించి మాటాడుతున్న రచయితకు తిరిగి ఆ ప్రశ్ననే వేయడం ఆశ్చర్యంగా ఉంది.

   ౨. సమాజాలకు, సమూహాలకూ చరిత్ర ఉండడం అనేది – దానిని తమదిగా నిరంతరం మననం చేసుకునే మనుషులు ఉనికిలో ఉన్నప్పుడే జరుగుతుంది. అలా లేనప్పుడూ అది సజీవంగా కాక పుస్తకాల్లో కథనంలా నిర్జీవంగా ఉంటుంది.

   అమెరికాకు చెందిన మూలవాసీ ప్రజలను ఆధిపత్య సమాజాలు, వారి సైన్స్, సంస్కృతులు తుడిచిపెట్టేసాయి. ఆ రకంగా అమెరికా అసలైన చరిత్ర లేనిదయింది.
   ఇక అక్కడ మిగిలి ఉన్న చరిత్ర అంతా సమీప కాల చరిత్రయే కదా.

 21. అన్ సర్టైనిటి థియరీ, కేయాస్ థియరీ, క్వాంటం ఫిజిక్స్ ద్రష్టకి ప్రాధాన్యాన్ని పెంచాయి

  శర్మ గారు, ఈ క్రింది వ్యాసం మీ చర్చకు ఉపయోగపడతాయనుకొంటాను.

  Does the Universe Exist if We’re Not Looking?

  Eminent physicist John Wheeler says he has only enough time left to work on one idea: that human consciousness shapes not only the present but the past as వెల్

  http://discovermagazine.com/2002/jun/featuniverse

  John Wheeler, scientist and dreamer, colleague of Albert Einstein and Niels Bohr, mentor to many of today’s leading physicists,

 22. VENKATA RAMANA says:

  o “౧. భారత దేశంలో ఆధునిక( ఆంగ్ల) విద్య – సంస్కరణలు భారతీయులకు కార్యాకారణ సంబంధాన్ని నేర్పించడానికి ఉద్దేశించినవే.”
  o
  o భారతీయులకు కార్యకారణ సంబంధం నేర్పించడానికి ఎవరో ఉద్దేశిస్తే ఆ అజ్ఞానాన్ని మనం ఇంత సీరియెస్ గా తీసుకుని మనం మరో రకం అజ్ఞానాన్ని పెంచుకోవాలా? ‘కార్య’ ‘కారణ’ సంబంధం తెలియకుండా మన భాషలో ఆ మాటలు ఎలా పుట్టాయి? తర్కమూ, హేతువూ వగైరా మాటలు మన శాస్త్రాలలోకి ఎలా వచ్చాయి? భావానికి విడిగా భాష ఉంటుందా? మాటలు పుడతాయా?
  o
  o “ఆంగ్ల విద్యా ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన మేధావులు, తెల్ల వాళ్ళ పాలన పట్ల ఆరాధనా భావాన్ని పెంపొందించుకున్నవాళ్ళూ- తెల్లవాళ్ళు తెచ్చిన, తేవాల్సిన సంస్కరణల పట్ల మహజర్లు సమర్పించిన వాళ్ళూ భారతీయుల కార్యాకారణ గ్నానం పట్ల అనుమానం ప్రకటించిన వాళ్ళే కాదా.”
  o
  o ఎందుకవాలి? ఎక్కడినుంచైనా జ్ఞానవిజ్ఞానాలను స్వీకరించే బుద్ధితో కూడా కొంతమంది ఆ పని చేసి ఉండచ్చు. ఇంకొంతమంది బతుకుతెరువు విద్యగా తీసుకుని ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించి ఉండచ్చు. స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ మనం అదే చేస్తున్నాం. భారతీయుల కార్యకారణ జ్ఞానం పట్ల అనుమానంతోనే ఇదంతా జరిగిందని అంత సింప్లిస్టిక్ గా ఎలా చెబుతారు?
  o
  “భారతీయులందరూ ఒకే అభిప్రాయాన్నీ, ఆచారాన్నీ పాటిస్తారా అనే ప్రశ్నను లేవనెత్తడం వల్ల సీతారామయ్యగారు సరియైన వైఖరిని ప్రదర్శించారు. కానీ రచయిత తన వ్యాసం రాసిందే ఇలాంటి ఏకశిలా సదృశ్య వైఖరులకు వ్యతిరేకంగా కాదా? భారతీయులకు కార్యాకారణసంబంధాన్ని నేర్పాలనే భావనలోని ఆధిపత్యభావజాలం గురించి మాటాడుతున్న రచయితకు తిరిగి ఆ ప్రశ్ననే వేయడం ఆశ్చర్యంగా ఉంది.”

  రచయిత ఏకశిలా సదృశ్య వైఖరులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నప్పుడు “భారతీయులు” ఇలాంటివారు, భారతీయ విజ్ఞానం ఇలాంటిది అనడంలో ఎలాంటి వైఖరిని అనుసరిస్తున్నారు? అందులో ఏకశిలా సదృశ్యం లేదా?

  “౨. సమాజాలకు, సమూహాలకూ చరిత్ర ఉండడం అనేది – దానిని తమదిగా నిరంతరం మననం చేసుకునే మనుషులు ఉనికిలో ఉన్నప్పుడే జరుగుతుంది. అలా లేనప్పుడూ అది సజీవంగా కాక పుస్తకాల్లో కథనంలా నిర్జీవంగా ఉంటుంది.”

  సమాజాలు, సమూహాల చరిత్ర దానిని తమదిగా నిరంతరం మననం చేసుకునే మనుషుల ఉనికిలో ఉన్నప్పుడే జరుగుతుందంటే అర్థమేమిటి? చరిత్ర మననంలోనే ఉంటుంది తప్ప పుస్తకాల్లో ఉండదు, ఉండకూడదనా? మననమే సజీవంగానూ, పుస్తకాల్లో కథనం నిర్జీవంగానూ ఉంటుందని అనడం ద్వారా పుస్తకాలనే నిరాకరిస్తారా? వేద కాలానికి మనకు పుస్తకమూ, రాతా లేకపోయినా ఆ తర్వాత అవి వచ్చాయి కదా? కాళిదాసాదులు పుస్తకాలు రాయడం వెనుక ఆంగ్లవిద్యా ప్రభావం ఏమీ లేదుకదా? పుస్తకాలలో కథనాలు నిర్జీవం అన్నప్పుడు మీరీ స్పందన ఎలా రాస్తున్నారు? ఈ వ్యాసరచయిత పుస్తకాలు ఎందుకు రాస్తున్నారు? మననంలో సజీవంగా ఉండేది, పుస్తకం కాగానే నిర్జీవం అవుతుందని అన్నప్పుడు ఆ మననాన్ని పుస్తకరూపంలోకి తేవద్దనేగా?
  “అమెరికాకు చెందిన మూలవాసీ ప్రజలను ఆధిపత్య సమాజాలు, వారి సైన్స్, సంస్కృతులు తుడిచిపెట్టేసాయి. ఆ రకంగా అమెరికా అసలైన చరిత్ర లేనిదయింది.
  ఇక అక్కడ మిగిలి ఉన్న చరిత్ర అంతా సమీప కాల చరిత్రయే కదా?”

  సైన్సు, సంస్కృతులు తుడిచిపెట్టిపోవడం కూడా చరిత్రే అవుతుంది కదా?అప్పుడు చరిత్ర లేదని ఎలా అంటాం? సైన్సును, సంస్కృతిని తుడిచిపెట్టినా చరిత్రను ఎవరూ తుడిచిపెట్టలేరు కదా? అమెరికా మూలవాసులకు చరిత్ర లేదని ఎలా అంటారు? అమెరికాకి సమీపకాలంలో ఉన్నదే చరిత్ర తప్ప అంతకు ముందు మూలవాసులకు ఉన్నది చరిత్ర కాదంటారా?’చరిత్ర’కు ఇలా గిరిగీయడం ద్వారా భారతీయుల విషయంలో ఆంగ్లవిద్యా మేధావులు చేసినట్టు మీరు తప్పు పడుతున్నదే మీరు అమెరికా మూలవాసుల విషయంలో చేయడం లేదా?

 23. rani siva sankara sarma says:

  శ్రీరామ్ గారూ అన్నిటినీ స్విచ్చు వేయడమంట యాంత్రికంగా అర్థంచేసుకొనే అజ్ఞానులకి యేదీ అర్థం కాదు. సైన్సు లో ద్రష్ట కి చైతన్యానికీ గల ప్ర్రదాన్యాన్ని నొక్కిచెప్పే ఆధారాల లింకులు మీరు యిచ్చారు. కృతజ్ఞతలు. కాని యివి యాంత్రిక వాదుల బుర్ర తెరిపించలేవనేది నిజం. చరిత్ర అంటే స్మృతులు కాదట. మ్యూజియంలోనూ. చారిత్రిక సిథిలాలలోనూ, చరిత్ర పుస్తకాలలోనూ అయాప్రజల చరిత్ర ఇతిహాసం వుంటుందట. ఆ ఆధారాలు బూజు పట్టకుండా జాగ్రత్త పరిస్తే చాలు. రెడ్ యిండియన్సుని, వారి సంస్కృతినీ , సంప్రదాయాలనీ మొత్తంగా తె ళ్లవాళ్లు తుడిచి పెట్టెసినా కొంపమునిగేదేమీ వుండదు.[ మనం డాలర్లు సంపాదించుకొంటుంతే చాలు అమెరికాకి చరిత్ర వున్నట్లే. ] మానవ చైతన్యాన్ని యెంత హీనస్థితికి దిగజార్చారు? అందుకె సైన్సు అనే ముసుగులో దాంకొని తత్వ వేత్తలని కవులనీ వారిక్రుషినీ అవమానిస్తున్నారు ఈ యాంత్రిక భౌ తికవాదులు.

  • ari sitaramayya says:

   “ఎలిమెంటరీ స్కూలు స్థాయి వాళ్లకి”
   “యింగీత జ్ఞానం ఐతే సున్నా.”
   “అజ్ఞానులకి యేదీ అర్థం కాదు.”
   “మీరు 17వ శతాబ్దిలో వున్నారా? ఆ నా టి ఆదిమ సైన్సులో కొట్టు మిత్లాడుతున్నారా”

   ఇలాంటి మాటలు వాడి చర్చను ఆపెయ్య వచ్చు. బురదను చూసి నప్పుడప్పుడు దూరంగా వెళతారు గాని దాంట్లో కాలెయ్యడానికి ఎవ్వరూ ఇష్టపడరు.

 24. గతంతో వర్తమానం చేసే సంభాషణ చరిత్ర -అని కదా ఇ.ఎచ్. కార్ అన్నది.

  ఈ రోజు మనం సింధూ నాగరికత గురించి మాటాడుతూ ఉన్నామంటే అది ఆర్య- అనార్య సంస్కృతులకు సంబంధించిన వర్తమాన చర్చల్లో నలుగుతూ ఉండడం వల్లనే. ఆ రకంగా వర్తమానం గతంతో మాటాడుతున్నది. అలా కాకుండా కేవలం చరిత్ర గతానికి సంబంధించిన అంశంగా మాత్రమే మిగిలి పోవడం అంటే దానికి నిర్జీవత కమ్ముకున్నట్లే కదా. ఈ రోజు అమెరికాలో నీగ్రోలకు చరిత్ర ఉంది. వాళ్ళు అక్కడి అసమానతలకు వ్యతిరేకంగా తమ చరిత్రను వర్తమానంతో జత కలుపుతున్నారు. ఆ రకంగా వారి చరిత్ర సజీవమై కొనసాగుతున్నది. కానీ అమెరికాలోని రెడ్ ఇండియన్లకు ఆ రకమైన అవకాశమెక్కడున్నది. వారు పూర్తిగా హననానికి గురయ్యారు. అందుకే వారి చరిత్ర పుస్తకాలకు పరిమితమై పోయింది. చరిత్ర సజీవమై ఉండడాన్ని, పుస్తకాలకే పరిమితమై ఉండడాన్ని నేను ఈ అర్థంలో మాత్రమే వాడాను.

  అయితే రెడ్ ఇండియన్ల ఉనికి లేకపోవడం వల్ల వారి చరిత్ర పుస్తకాలకే పరిమితమై నిర్జీవంగా మారిపోయినట్టేనా అనే ప్రశ్న కూడా ముందుకు రావచ్చు.

  వారు భౌతికంగా లేక పోవడం వల్ల వారి చరిత్ర ఆ పరిమితులకు లోనయింది అని మనం ఒప్పుకుంటూనే దానికి ఒక కొనసాగింపును హామీలా ఇవ్వ వచ్చు.

  ఆధిపత్యభావజాలం ఒక జాతిని సమూలంగా నిర్మూలించింది అనే వాస్తవానికి రెడ్ ఇండియన్ల చరిత్ర ఒక ఉదాహరణ. ఈ ఉదాహరణనుంచీ ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకమయిన వైఖరులను పెంపొందించుకుంటూ, సదా ఇలాంటి సంగతులను మననం చేసుకోవడం ద్వారా మరో రకంగా వారిని, వారి చరిత్రను వర్తమానంలోకి తెచ్చి నిలబెట్టిన వాళ్ళమవుతాం.

  శర్మ గారి వ్యాసానికి ఇదే ప్రయోజనం అని నేను నమ్ముతున్నాను.

 25. THIRUPALU says:

  //అంటే మతమూ సైన్సూ కూడా ఒకే మూలం నుంచి ఒకే రకమైన విశ్వాసం నుంచి పుట్టాయి.//
  దీని అర్ధమేమిటి తిరుమలేశా ? విస్వాసనుండి పుట్టేది సైన్స్ ఎలా అవుతుంది? దేవుడు అయితే అయ్యుండొచ్చు గాని. విశ్వాసమ్ నుండి వాటికి కార్య కారణ సంభందానికి ఏమీ అవసరమోచ్చింది ? విశ్వాసానికి ఉనికి అవసరం లేదు భావం తప్ప. ఎందరో తాత్వికుల విబేదాలనుండి పుట్టిన రెండు వైరుధ్యా దృఉక్పాదాలను కలపడం ఏ విధంగా సభబు ? దేని దారి దానిదే అయినపుడు ఈ రెంటిని కలప ప్రయత్నించడమే ఏదో మభ్య పెట్టడమౌ తుంది గానీ!

  • విస్వాసనుండి పుట్టేది సైన్స్ ఎలా అవుతుంది? దేవుడు అయితే అయ్యుండొచ్చు గాని

   అంత కంఫ్యుజన్ ఎముంది?. మార్క్స్ పై చిన్నపట్టినుంచి జుదొ క్రైస్తవ ప్రభావం (విశ్వసం) ఉంది. ఆయన తన సిద్దాంతం సైంటిఫిక్ అని చెప్పాడు కదా! దానిని సోషల్ సైన్ అంట్టునారు అదా? మరి దానికేమంటారు? మార్క్సిస్జం ఫ్రేం వర్క్ అంతా క్రైస్తవ్మ్ నుంచి (చర్చ్)తీసుకొన్నాడు కదా! మతం పునాదులపై నుంచి నిర్మిచబడ్డది సైంటిఫిక్ అయ్యింది కదా!

   బ్లాగులో, మీడీయాలో చర్చించే వారు సైన్స్ చాలా గొప్పదని వాదించటం సైంటిస్ట్లు అయ్యి కాదు, సైన్స్ మీద ప్రేమతో, గౌరవంతో కాదు. మార్క్సిస్ట్ లు సైంటిఫిక్ టెంపర్ గురించి మాట్లాడుతారు. వాళ్లు అలా మాట్లడటానికి మూలం మార్క్స్ గారు తన సిద్దాంతం సైంటిఫిక్ అని డబ్బా కొట్టుకోవటమే కదా! దే వాంట్ టు అలైన్ విత్ మార్క్సిజం డాక్ట్రిన్.

   The Theology of Communism

   http://www.airpower.maxwell.af.mil/airchronicles/aureview/1969/jan-feb/scharlemann.html
   Air University Review, January-February 1969

   We must observe at this point that Communists think of the historical process as moving along a line. This is a concept of history which Karl Marx borrowed from the Scriptures. In the ancient world it was the prophets of the Old Testament who alone among the religious exponents of that time rejected the notion that history moved in a circle. Israel’s prophets spoke of a God who had given certain promises at one time in history, which He would fulfill at some time in the future. They proclaimed a God, therefore, who had given His people both “a future and a hope.” (Jeremiah 29:11, RSV) Communism has taken over this view of what is going on in the world, thoroughly secularizing the concept in the process of adapting it to the needs of revolutionary activity.

   • మరి ఐలయ్య చెప్పే లోకల్ సైంటిస్ట్లు చర్మకారులు,కమ్మరి, కుమ్మరి మొదలైన వారిని, ఎంత మంది సైంటిస్ట్ లు గా గుర్తించారు? పోని ఎందుకు గుర్తించ లేదో ఆలోచించండి. నా సమాధానం, వీరిని సైంటిస్ట్ గా గుర్తిస్తే ఏ ప్రభుత్వానికి వొరిగేదేమి లేదు. వారి నూతన ఆవిష్కరణలు అధికార విస్తరణకు ఉపయోగపడవు, కనుక కార్మికులు గుర్తించటానికే పెద్ద పీఠ వేశారు. వాళ్లని అధికారం లో కి రావటానికి ఓట్ బాంక్ గా కమ్యునిస్ట్ పార్టి లు సైతం చూశారు. వారి వృత్తి లోని సైంటిఫిక్ కోణం మరచారు. నాలేడ్జ్ అధికారానికి, డబ్బు సంపాదించటానికి ఉపయోగపడకపోతే వాటి లోని సైంటిఫిక్ కోణం ప్రజలు, ప్రభుత్వం పట్టిచుకోరు.

 26. rani siva sankara sarma says:

  దేవుడా రక్షించు దేశాన్నీ సాహిత్యాన్నీ సామాన్య ప్రజల్నీ
  యంత్ర ఆరాధకులనుంచి వలసవాద ఆలోచనల బురదనుంచి
  కవులనీ తత్వ వేత్తలనీ మహాత్ములనీ అవమానించి
  సైన్సు పేరుతొ టెక్లాలజీని ఆరాధించే ప్రాప్త కాలజ్నులైన పెద్ద మనుషుల నుంచి
  తత్వశాస్త్రానికీ చరిత్రకీ సామాజిక శాస్తాలకీ సాహిత్యానికీ గల అంతస్సంబమ్ధాన్ని విస్మరించి
  కవులకీ తత్వ వేత్తలకీ గాంధీ వంటి రాజకీయ తాత్వికులకీ
  లక్ష్మణ రేఖలు గీసి ఆరేఖలలో చరించాలని ఆదేసిస్తున్న సాహిత్య గ్లోబల్ పోలీసులనుంచీ
  డాలర్లు కురిపించె టెక్నోక్రసీయే విద్య అని జ్ఞానమని బోధించే
  నేటి పాలక వర్గాలతో గొంతు కలుపుతూ ఫిలాసఫర్సునీ కవులనీ అవమానిస్తున్న వాళ్లనుమ్చీ
  సైన్సుకీ తత్వశాస్త్రాంకీ సాహిత్యానికీ గల సంబంధాన్ని గుర్తించలేని ఎలిమెంటరీ జ్ఞానులనుంచి

  మహారాజశ్రీ మాక్ ఇన్ యిండియా వలస వాదులనుంచి వారి అజ్ఞాన మనే
  గౌరవనీయ అమూల్య బురదనుంచి
  దేశాన్ని రక్షించు దేవుడా

 27. rani siva sankara sarma says:

  శ్రీరాం గారూ
  కంచ అయిలయ్య హిందూ వాదులూ యిద్దరు కూడా వొకవైపు స్వదేశీ కబుర్లు చెప్తారు. మరోవైపు విదేశీ గీతాలు పాడతారు. ఈ సంగతి నావ్యాసాలలో బట్ట బయలు చేసాను. కాని ఈవ్యాస చర్చలో పాల్గొన్న కొందరు మరీ జార్జి బుష్ మానస పుతుల్లా వ్యవ హరిస్తున్నారు. చరిత్ర పేరుతొ వలస వాదులనీ వారిచేతిలో పరాజయం పొందిన వాళ్లనీ , బానిసలుగా మార్చబడి న వాళ్లనీ బానిస యజమానులనీ , తెల్ల వాళ్ల చేతిలొ చంపబడ్డ రెడ్ యిమ్డియన్సునీ తెల్ల దొరలనీ వొకే గాట కట్టెస్తూ ఒక రంగూ రుచీ లేని చరిత్రని నిర్మిస్తున్నారు యీపెద్ద మనుషులు. ఆవలస వాద చరిత్ర వెనుక దాంకొ ంటు న్నరు. వీళ్ళకి కుంటా కిమ్టే తెలియదా/ ఏలెక్స్ హెలీ రాసిన రూట్స్ నవలలో కథా నాయికుడు , నల్ల బానిస పుత్రుడు. తన మూలాలని వెతుక్కుంటూ వెల్లి ఆఫ్రికాలో తన పూర్వీకులని కనుగొంటాడు. [ అమెరికాలో కాదు.] వలస వాదం అంటె ఏమిటి , అసలు అదెక్కడుంది, అంటూ సంనాయి నొక్కులు నొక్కే యీపెద్ద మనుషులే మేధా వలస వాదులు. భుజాలు అందుకె తడుముకొంటున్నారు. వీళ్లు భారత దేశంలో ని వలస వాద భావ దాస్యాన్ని కూడా తెలివిగా కప్పి పుచ్చాలని చూస్తున్నారు. బహు పరాక్.

 28. rani siva sankara sarma says:

  register sign in Goodreads: Book reviews, recommendations, and discussion

  Title / Author / ISBN
  search
  Home My Books Friends Recommendations Explore
  Get quotes daily
  Facebook Sign in with Facebook Sign in

  options
  Carl Sagan > Quotes > Quotable Quote
  Carl Sagan
  “The Hindu religion is the only one of the world’s great faiths dedicated to the idea that the Cosmos itself undergoes an immense, indeed an infinite, number of deaths and rebirths.
  It is the only religion in which the time scales correspond to those of modern scientific cosmology. Its cycles run from our ordinary day and night to a day and night of Brahma, 8.64 billion years long. Longer than the age of the Earth or the Sun and about half the time since the Big Bang.”

  ― Carl Sagan, Cosmos

 29. rani siva sankara sarma says:

  రోహిత్ వేముల చివరి లేఖ లో ఈ కార్ల్ సాగన్ ని ప్రస్తావించాడు . హిందూ కాస్మాలజీని కార్ల్ సాగన్ మెచ్చుకొన్నాడు సైన్సుకి .దానికి గల సంబంధాన్ని అందలి సౌందర్యాన్ని ప్రస్తావించాడు. కాని కుల మత రాజకీయాలలో మగ్గుతున్న హిందూ వాదులకి యిటువంటి తాత్విక విషయాలని అర్థం చేసుకొనే శక్తీ ఆసక్తీ శూన్యమ్. .

 30. Cosmos In India – CARL SAGAN (Astronomer) Hindu Brahman Vedic

 31. “A fundamental truth about science that every true scientist humbly accepts is – a scientific theory can never be proved. It can only be disproved. It can only be repeatedly tested, and each time it passed a test, it’ll become a better approximation of nature.

  హరిబాబు
  అనిల్ గారి ఈ వింత కొటేషన్ నాకూ అయోమయంగానే ఉంది.ఎందుకంటే నేను సైన్సు స్టూడెంటుని నా క్రెడెన్షియల్ – 5655 %%% ఫిజియాలజీ మెయిన్ సబ్జెక్ట్.మా సబ్జెక్టులో ఆల్రెడీ ఇదివరకు చహెసి రిజల్టు వచ్చినవి మార్కుల కోసం రిపీట్ చేసినా,లేక ధియరీలో వాటి ఇంపార్టెన్సు గురించి చెప్పినా ప్రతి ప్రయోగమూ ఏ సైంటిస్టు చహెసినా తన సిద్ధాంతం కరెక్ట్ అని ఇతర్ల చహెత ఒప్పించహ్టానికే చేశాడు.మరి యీయన “ఇట్ కెన్ నెవర్ బి ప్రూవ్డ్” అనీ ఇంకా గాఠ్ఠిగా “ఇట్ కెన్ ఓన్లీ బి డిస్ప్రూవ్డ్” అనీ అంటున్నారు? డిస్ప్రూవ్ చెయ్యటం,అంటే తెలుగులో మాట సరింది దొరకటం లేదు గాబట్టి నాకు మరీ గందరగోళంగా ఉంది,వారు గానీ వారేమి చెప్పారో అర్ధమయిన ఇతర్లు గానీ కొంచెం విసదీకరిస్తే బావుంటుంది!”

Leave a Reply to nagaraju Cancel reply

*