పరిచిత అపరిచితుడు

 

-పూడూరి రాజిరెడ్డి

~

rajireddi-1అతడిని నేను మొదటిసారి ఎప్పుడు చూశానో గుర్తులేదు. నిజానికి, ‘మొదటిసారి’ అని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? ఆ పరిచయం ఎంతో కొంత సాన్నిహిత్యానికి దారి తీసినప్పుడు కదా! కానీ ఇక్కడ సాన్నిహిత్యం అటుండనీ, కనీస పరిచయం కూడా లేదు. కాకపోతే ఎక్కువసార్లు తటస్థపడుతున్న వ్యక్తిగా ఇతడు నాకు ‘పరిచయం’. అంతకుముందు కూడా కొన్నిసార్లు చూసేవుంటాను! కానీ, ఏదో ఒక ‘చూపు’లో- ‘ఈయన్ని నేను ఇంతకుముందు కూడా చూశాను,’ అని గుర్తు తెచ్చుకున్నాను.

అతడు మా కాలనీకి ఎగువవైపు ఉంటాడనుకుంటాను. నేను పొద్దున పిల్లల్ని స్కూలుకు తోలుకు పోయే సమయంలో, అతడు మెయిన్ రోడ్డు ఎక్కడానికి అడ్డరోడ్డు దాటాలి గనక, అలా దాటుతూ ఎదురుపడతాడు. ఒక్కోసారి నేను పిల్లల్ని స్కూల్లో ‘పడగొట్టాక’- తిరిగి మూలమలుపు తిరుగుతున్నప్పుడు, అతడు ఏటవాలు రోడ్డు మీద నడుస్తూ వస్తూంటాడు. ఆ జారుడు మీద కాలిని అదిమిపట్టడానికి వీలుగా మోకాళ్లను కాస్త వంచి నడవడం నాకు తెలుస్తూవుంటుంది.

అతడిది అటూయిటూగా నా వయసే అని సులభంగానే అర్థమవుతుంది. టక్ చేసుకుంటాడు. షూ వేసుకుంటాడు. ఇవి రెండూ నేను కొన్ని ‘సిద్ధాంత కారణాల’ వల్ల వదులుకున్నవి! సిద్ధాంత కారణాలు అంటే, మరీ గంభీరమైనవేం కావు. టక్ చేసుకున్నప్పుడు నా పృష్టభాగపు ఉనికి వెనకవారికి ఇట్టే తెలిసిపోతుందని నాకు తెలియడం; కాలికి రిలీఫ్ ఇవ్వగలిగే పనిలో ఉన్నవాడికి- షూ అనవసరపు ఉక్క అని అర్థం కావడం!

అతడు కూడా నాలాగే వేగంగా నడుస్తాడు. దాదాపుగా ప్రతిసారీ చేతిలో లంచ్ బ్యాగ్ ఉంటుంది కాబట్టి, అతడు ఏ ఆఫీసుకో వెళ్తూవుండాలి!

ఈ ఆఫీసు ఆహార్యంలో కాకుండా, కొంత ‘స్పోర్టీ’గా అతడు ఒకట్రెండు సార్లు కాలనీలో ఉన్న చిన్న పార్కులో దాదాపుగా చీకటి పడే వేళలో ఎదురుపడ్డాడు. అప్పుడు అర్థమయ్యిందేమిటంటే, అతడికి పెళ్లయిందీ, నాలాగే ఇద్దరు పిల్లలూ! కాకపోతే ఇద్దరూ అబ్బాయిలే కాదు; ఒక పాప, ఒక బాబు.

ఇంకొకసారి, వచ్చిన అతిథిని కావొచ్చు, సాగనంపుతూ ఎదురయ్యాడు.

ఇన్నిసార్లలో ఏ కొన్నిసార్లయినా అతడి గమనింపులోకి నేను వెళ్లివుంటానని నాకు అర్థమవుతోంది. అయినా మేము పరిచయం కాబడటానికి ఇంకా ఏదో కావాలి. లేదా, మాకు పూర్తి భిన్నమైన స్థలంలో ఎదురుపడటమో జరగాలి. విచిత్రంగా, రెండు తెల్ల బొచ్చు కుక్కపిల్లలతో ఇలానే తరచూ ఎదురుపడే తెల్లజుట్టు పెద్దమనిషితో కూడా నాకు ఏ పరిచయమూ లేదు; కానీ కొన్నిసార్ల తటస్థత తర్వాత ఒక పలకరింపు నవ్వు అలవాటైపోయింది. బహుశా, పిల్లలు నా పక్కనుండటం ‘తాత’ వయసు ఆయనకు ఆ నవ్వును సలభతరం చేసివుంటుంది.  కానీ ‘అతడు’ దీనికి భిన్నం. అతడు నా ఈడువాడు. ఇంకా చెప్పాలంటే, దేనికోసమో తెలియని పోటీదారు!

కొంతకాలానికి అతడు నడకలో ఎదురుపడటం పోయి, బండిమీద కనబడటం మొదలైంది. బ్లాక్ రోడియో తీసుకున్నట్టు అర్థమైంది. దుమ్ము నుంచి రక్షణగా కావొచ్చు, నల్ల కళ్లద్దాలు పెట్టుకోవడం ప్రారంభించాడు. ఇక్కడొక అపనమ్మకంగా కనబడే విషయం చెప్పాలి. ‘చూశావా, నేను బండి తీసుకున్నాను,’ అని చెప్పీ చెప్పనిదేదో, ఇంకా చెప్పాలంటే, నాపైన అతణ్ని ఒక పెమైట్టు మీద ఉంచుతున్న చిరుస్పర్థ లాంటిదేదో అతడు అనుభవిస్తున్నాడేమోనని నేను నిజంగా ఫీలయ్యాను. అదే అతణ్ని ‘పరిచిత’ అపరిచితుడిగా నిలబెడుతోంది.

దీనికి ముగింపేమిటో నాకు తెలియదు. ఈ పరిచయం ఎటో దారి తీయాలని నేనేమీ ప్రత్యేకంగా కోరుకోవడం లేదు. కానీ ఎటు దారితీస్తుందో చూడాలన్న కుతూహలం మాత్రం ఉంది.

* * *

నిజానికి మొదలుపెట్టిన అంశం పైనే ముగిసిపోయింది. కానీ ఇది ఊరికే అపరిచిత్వం భావనకు కొంచెం కొనసాగింపు. అది ఇంకా ఎన్ని రకాలుగా ఉండగలదు! మా ఎదురుగా ఉండే ఇంటిని కూల్చి, అపార్ట్‌మెంట్ కట్టారు. ముందుగా కనబడే వాచ్‌మన్ తప్ప, లోపల ఎవరుంటారో నాకు తెలియదు.

అంతెందుకు, మా ఆఫీసులో పనిచేసేవాళ్లు అనేది చాలా పెద్ద మాట, మా ఫ్లోర్లోనే ఉత్తరం వైపు పని చేసేవాళ్లలో చాలామంది నాకు తెలియదు. అంటే, ముఖాలుగా తెలుస్తారు; కానీ, ఆలోచనలుగా తెలియరు.

చూడండి గమ్మత్తు! ఎక్కడో ప్రారంభమై, ఎక్కడో చదివి, ఎక్కడెక్కడో ఉద్యోగాలు మారి, తీరా ఒకే సంస్థలో ఒకే లిఫ్టు బటన్ నొక్కడమనే ఉమ్మడితనంలోకి ప్రవేశిస్తాం. అయినా అపరిచితులుగానే ఉండిపోతాం. బహుశా పండగల పరంగానో, సినిమాల పరంగానో, పుస్తకాల పరంగానో, రాజకీయాల పరంగానో, భావజాలాల పరంగానో ఏదో ఉమ్మడితనం అనుభవిస్తూనే ఉంటాం కావొచ్చు; అయినా అనుభవిస్తున్నట్టుగా తెలియకుండానే ఉండిపోతాం. అదే కదా పరిచయం కావడానికీ కాకపోవడానికీ మధ్య తేడా!

*

మీ మాటలు

 1. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  సమూహం లోని ఒంటరి తనాన్ని ఆద్భుతంగా చిత్రించారు.

 2. rani siva sankara sarma says:

  ఇలా అపరిచితులు గానే మిగిలిపోవడంలో ఎటువంటి భారము లేదు. అలాగని పొందేదికూదా యేమీ లేదు . అదీ విచిత్ర విషాదం.

 3. భాస్కరం కల్లూరి says:

  రాజిరెడ్డిగారూ…అందరికీ కలిగే అనుభవానికి అక్షరరూపమిచ్చారు. బాగుంది.విశాల ప్రపంచం అనుభవంలోకి వస్తున్నకొద్దీ ప్రపంచం కుదించుకుపోతుంది కాబోలు. గ్లోబల్ విలేజి అనే మాటే చూడండి. అలాగే జనబాహుళ్యంలో జీవిస్తున్నకొద్దీ పరిచిత అపరిచితుల మధ్య మనిషి ఒంటరి అయిపోతూ ఉంటాడు కాబోలు. .నాది చరిత్ర దృష్టి, ఈ ప్రాసెస్ ఎప్పుడు ఎలా ప్రారంభమయిందనేది నాలో ఆసక్తిని కలిగించే ప్రశ్న.

 4. వెంకట్ కొండపల్లి says:

  రాజి రెడ్డి గారు,
  ఎప్పుడూ ఎక్కడో ఒక చోట మళ్లీ మళ్లీ కలుస్తున్న ‘పరిచిత అపరిచితులను’ చూస్తున్నప్పుడు నవ్వుదామా – వద్దా, పలకరిద్దామా – వద్దా, పరిచయం చేసుకుందామా – వద్దా అనే మీమాంస లో కొట్టు మిట్టాడే పరిస్థితి లో వచ్చే రక రకాల అలోచనలను ఎంత చక్కగా వ్రాసారండి.

 5. sudheer balla says:

  కాదేమో , నామట్టుకు నాకు ఇప్పుడు అపరిచితులతో కలిసిపోవడం , మాట్లాడడం ముందు కంటే సులభం గా వుంది , కానీ ఆ పరిచయాల సాంద్రత తక్కువ ……

మీ మాటలు

*