దేహ భాష తో మౌనంపై యుద్ధం – “కప్లెట్”

 

-ఏ.కె. ప్రభాకర్

~

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

ఇద్దరు స్త్రీల మధ్య చోటుచేసుకొనే శృంగారానుభావాన్ని లైంగిక హక్కుల్లో భాగంగా ప్రతిపాదిస్తూ సాహిత్యీకరించడం  మన సమాజంలో సాహసమే.  స్థిరీకృత విలువల్నీ సాంప్రదాయిక ఆలోచనల్నీ వ్యవస్థీకృత భావనల్నీ ధ్వంసం చేసి కొత్త దృష్టికోణాన్ని ఆమోదయోగ్యం చేయడం అంత సులువేం కాదు. ఆ సాహసాన్ని యిష్టపూర్వకంగా చేయడానికి పూనుకొన్న రెంటాల కల్పన రాసిన కథ కప్లెట్. ఈ కథ రాయడానికి  వస్తు స్వీకరణ దశలోనే రచయిత సంఘర్షణ యెదుర్కొన్నట్టు తెలుస్తుంది. పాఠకులు అంగీకరిస్తారో లేదోనని సంకోచం వొకవైపు ,  లోతుగా పాతుకుపోయిన సామాజిక కట్టుబాట్లనీ బలమైన చట్టాల్నీ ప్రకటిత అప్రకటిత నిషేధాల్నీ అభేద్యమైన నిశ్చిత నిశ్చయాల్నీ అన్నిటికీ మించి ప్రాకృతిక నియమాల్నీ  సహజమైన సంబంధాల్నీ కాదని అతిక్రమించడానికి తన్నుతాను సంసిద్ధం చేసుకోవడం మరోవైపు , వీటిని బ్యాలన్స్ చేస్తూనే వొక నిర్దిష్ట దృక్కోణాన్ని ప్రతిపాదించే పనిలో కళాత్మక విలువలు దెబ్బతినకుండా కథని  తీర్చిదిద్దాల్సిన అవసరం యింకోవైపు  యిదంతా వొక ‘సోషియో లిటరరీ వార్’ లో భాగంగానే జరిగినట్టనిపిస్తుంది.

స్త్రీ పురుషుల శృంగారాన్ని ప్రణయ భక్తిగాథల మధ్య వర్ణించిన తెలుగు సాహిత్యంలో మాయ , వైష్ణవి మధ్య శృంగారానుభవం రాయటం రాసి మెప్పించటం , మెప్పించి లెస్బియన్ బంధం కూడా సక్రమ సంబంధమేనని ఒప్పించటం అంత సులువుగా ఏమీ జరగలేదు. నాకే తెలియకుండా నా లోపల ఉన్న అప్రకటిత సెన్సార్షిప్ ను ఎంతో కొంత వదిలించుకొన్నాకే ఈ కథ రాయగలిగాను … … … కప్లెట్ కథను ప్రచురించటానికి తెలుగు పత్రికలు ఇంకా సిద్ధంగా లేవు అని వెనక్కు తిప్పి పంపటం సమాజానికి , సాహిత్యానికి ఉన్న ఒక పెద్ద దూరాన్ని చెప్పకనే చెప్పినట్లయింది.

(కల్పనా రెంటాల : ‘శరీర రాజకీయాల నుంచి లైంగిక రాజకీయాల దాకా …’ (తెలుగు సాహిత్యంలో స్త్రీ పాత్రల పరిణామం)  20వ తానా సభలు – సాహిత్య సమావేశం,  జూలై 2 – 4 , 2015 లో చేసిన ప్రసంగ పాఠం నుంచి)

కల్పన చెప్పిన పై మాటలు చదివాకా కొత్త వస్తువుతో కొత్త కథ రాయడానికి రచయితకీ పాఠకులకీ మధ్య వున్న గోడల్ని అధిగమించడానికి రచయిత యెంత  వొత్తిడికి గురైందో తెలుస్తుంది. సాహిత్య వ్యవస్థ నిర్దేశించిన అలవాటయిన మార్గానికి భిన్నంగా కొత్త దారి పరుస్తూ  కప్లెట్ లాంటి కథ రాయడం , రాసి మెప్పించడం వొక యెత్తు అయితే తాను ప్రతిపాదించదల్చుకొన్న లెస్బియన్ సంబంధం ‘సక్రమమే’నని వొప్పించడం మరో ఛాలెంజ్. ఆ క్రమంలో కల్పన గుర్తించిన మరో అవరోధం సమాజానికీ సాహిత్యానికీ మధ్య వున్న దూరం , ఆ దూరాన్ని తొలగించాల్సిన పత్రికలు యింకా అందుకు పూర్తిగా సిద్ధంగా లేకపోవడం. ఇవన్నీ బయటికి కనిపించే  కారణాలైతే కనపడని లోపలి కారణం తనకు తాను విధించుకొన్న అప్రకటిత సెన్సార్ షిప్. ఏమైతేనేం వీటన్నినీ తెంచుకొని కథ మన ముందుకొచ్చింది.

మై బాడీ మై ఛాయిస్ అన్న భావనని  తెలుగు పాఠకులకి కల్పన మరీ కొత్తగా యేం పరిచయం చేయడం లేదు. స్త్రీ వాదం చేసిన ప్రయాణంలో యిదో మలుపేనన్న స్పృహ కూడా ఆమెకు వుంది. కాకుంటే స్త్రీల లైంగికతని ఆమె కేవలం  శరీర రాజకీయంగా మాత్రమే కాకుండా హక్కుల రాజకీయంగా కూడా  చూస్తుంది.

స్త్రీల శృంగారానుభవం గురించి ముద్దుపళని రాసిన రాధికాసాంత్వనం పుస్తకాన్ని నిషేధించి చదువుకున్న మేధావులు చేసిన కువిమర్శల దాడి మొదలుకొని ఇప్పటి వరకు స్త్రీలు లైంగికత్వం గురించి , లైంగికానుభావాల గురించి రాయటంలో ఎన్నో ఆటుపోట్లను , ఎదురు దెబ్బలను ఎదుర్కొని ఇంత దూరం ప్రయాణించారు. (‘శరీర రాజకీయాల నుంచి లైంగిక రాజకీయాల దాకా …’)

అయితే తన దృక్పథాన్ని కథీకరించడంలో చాలా జాగరూకత వహించాలనే వొక యెరుక ఆమెకు వుంది. ఆ యెరుకవల్ల  కథ  కళాత్మకంగా రూపొందింది. అలా తీర్చి దిద్దడానికి రచయిత చేసిన  కాన్షియస్ ప్రయత్నం కథ పొడవునా కనిపిస్తుంది. లేకుంటే యే సపరి ‘వార’ పత్రికలోనో సెంటర్ స్ప్రెడ్ స్టోరీ గా యెవరూ చూడకుండా రహస్యంగా చదువుకొనే  సరస శృంగార కథగా తయారయి వుండేది. సరైన దృక్పథాన్ని సరైన రీతిలో బట్వాడా చేయగల కథా నిర్మాణ నైపుణ్యం వొక్కటే అటువంటి ప్రమాదం నుంచి కాపాడగలదు. అందులో భాగంగానే రచయిత్రి పాత్రల నిర్మితిలో గొప్ప నేర్పు ప్రదర్శించింది. కథలోని పాత్రల బయటి లోపలి స్వరూప స్వభావ ఆవరణల్ని ఆవిష్కరించింది. భిన్న ప్రవర్తనలకీ వుద్వేగాలకీ  సంఘర్షణలకీ అనుగుణమైన భిన్న నేపథ్యాలు నిర్మించింది. దేశ కాలాలు పాత్రల మధ్య లోపల సంఘర్షణకి కారణమౌతాయి.

స్వలింగ సంపర్కం గురించి అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో వొకే విధమైన సామాజిక నియమాలూ నైతిక విలువలూ చట్ట నిబంధనలూ లేవు. యూరప్ అమెరికాల్లో చాలా మేరకు LGBT లకు చాలా వరకు స్నేహం – ప్రేమ – కలిసి జీవించడం – శారీరిక సంబంధం కల్గి వుండడం – గోప్యత అవసరం లేని స్వలింగ సంపర్కం- పెళ్లి చేసికోవడం – పిల్లల్ని పెంచుకోవడం  – సొంత కుటుంబం యేర్పరచుకోవడం వంటి స్వేచ్ఛ  వుంది. ఆసియా ఆఫ్రికా దేశాల్లో అవన్నీ నిషిద్ధాలు.  ఇండియాలోనే కాదు 80 శాతం కామన్వెల్త్ దేశాల్లో సైతం స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం. కఠిన శిక్షకి కారణమయ్యే నేరం . ఒకే జెండర్ కి చెందినవారి మధ్య వైవాహిక హక్కులు లేవు. భారతదేశంలో స్వలింగ సంపర్కాన్ని  చట్ట బద్ధం చేయమని పిటిషన్లు (నాజ్ ఫౌండేషన్), చట్టసభల్లో ప్రైవేటు బిల్లులు , కొండొకచో వీథి ప్రదర్శనలు , సెక్షన్ 377 (నిషేధ చట్టం) ని రద్దు చేయమని న్యాయస్థానాల్లో హక్కుల పోరాటం వంటివి ఇటీవలి పరిణామాలు. చట్టాలని సైతం పక్కన పెట్టి ఖాప్ పంచాయితీలు సగోత్రీకుల మధ్య పెళ్ళిళ్ళకి కులాంతర వివాహాలకు క్రూరమైన శిక్షలు పరువు హత్యలు అమలు జరిపే పరిస్థితుల మధ్యే  ఫైర్ నుంచీ అఫైర్ వరకూ సినిమాలు తయారవుతున్నాయి. ఈ సందర్భాన్నుంచే కప్లెట్ కథని చూడాలి .

వైష్ణవి సంప్రదాయ భారతీయ హిందూ కుటుంబానికి చెందినది. ఆమె బాల్యం పదమూడేళ్ళ వరకూ ఇండియాలోనే గడిచింది. ఆ తర్వాత అమెరికా వచ్చేసినా చిన్నప్పటినుంచీ అనేక ఆంక్షల మధ్య పెరిగింది. వయసు పెరుగుతోన్న కొద్దీ వాటికి యెదురు తిరగడం మొదలైంది. కూచిపూడి డాన్సర్. కూచిపూడినీ ప్రపంచంలోని యితర నృత్యరీతులనీ తులనాత్మకంగా అధ్యయనం చేయడానికి  తల్లిదండ్రుల కట్టడి నుంచి బయటపడి వారికి దూరంగా ఆస్టీన్ వచ్చింది. అక్కడ  సొంత ఇంటిలో మొదటిసారి స్వేచ్ఛని అందులోని ఆనందాన్నీ అనుభవిస్తోంది.

మాయ మెక్సికన్ అమెరికన్ అమ్మాయి (1871నుంచే మెక్సికోలో  LGBT లకి ప్రత్యేక హక్కులు వున్నాయి. ఆ విషయంలో అమెరికాకన్నా ముందుంది).  చిన్నప్పటి నుంచే స్వేచ్ఛగా పెరిగింది. ‘మిడిల్ స్కూల్లోనే తన సెక్సువాలిటీ పట్ల అవగాహన ఉంది. మగపిల్లల కంటే ఆడపిల్లలంటేనే ఇష్టంగా ఉండేది.’ హైస్కూల్లోకి వచ్చాకా అబ్బాయిలతో డేటింగ్ చేసింది. ‘కానీ ఏనాడూ దాన్ని ఎంజాయ్ చేయలేకపోయింది.’  ఎదిగే క్రమంలో ఫెమినిస్టు భావజాలాన్ని వొంటబట్టించుకొంది. ‘Woman’s Body-Feminism-Sculpture’  ని ప్రధానాంశంగా పరిశోధన చేయాలని ఆమె ఆకాంక్ష.

మాయా వైష్ణవీ ల అభిరుచులూ ఆసక్తులూ కలిసి అవసరాల రీత్యా యూనివర్సిటీ క్యాంపస్ కి దగ్గరగా వొకే యింటిని షేర్ చేసుకొంటారు. అదే విధంగా అభిప్రాయాల్నీ పంచుకొన్నారు. ఒకానొక సాయంత్రం  వొక ‘మోహపు ముద్దు’ వాళ్ళిద్దర్నీ శారీరికంగా దగ్గరచేసింది. చీరకట్టులో ‘సెక్సీ’ గా ‘స్పైసీ’ గా  వున్న వైష్ణవిని మాయ ‘ఆర్తిగా’ ముద్దు పెట్టుకొంటే వైష్ణవి ఆమెను ‘గట్టిగా అల్లుకుపోయింది’. ‘మాయ ముద్దు పెట్టుకున్నాప్పుడు అబ్బాయిలు ముద్దు పెట్టుకున్నప్పుడు ఎలా ఫీల్ అయిందో అలాగే లేదా అంతకంటే ఎక్కువ ఫీల్ అయింది .’ అది మొదలు యెన్నోసార్లు   మాయ వైష్ణవి ‘దేహంలోకి ప్రవహించింది’.

ఆ కలయికల్లో కలిగే ‘అనేక అందమైన అనుభవపు అనుభూతుల సుగంధం’ వైష్ణవి మనసుకి యిష్టంగానూ సహజంగానూ వున్నప్పటికీ ఆమె పుట్టి పెరిగిన  కుటుంబ సమాజ నేపథ్యం కారణంగా ప్రతిసారీ  ‘మాయా మోహపు మంత్రజాలం నుండి బయటకు వచ్చాకా’ ఏదో తెలీని అపరాధభావనకి గురయ్యేది. కానీ మాయ ‘చేతుల్లోని మంత్ర దండానికో చూపుల్లోని శక్తిపాతానికో వద్దు వద్దు అనుకుంటూనే పసిపాపలా’ లొంగిపోయేది.

అయితే తమ సంబంధాన్నిబాహాటం చేయకుండా  యింటి నాలుగు గోడలవరకే వుంచాలని వైష్ణవి , వైష్ణవి పట్ల ఇష్టాన్ని, ప్రేమ ను కేవలం నాలుగు గోడల మధ్య మాత్రమే చూపిస్తూ బయట తానెవరో పరాయి వ్యక్తి లాగా దూరం దూరం గా తిరగటానికి యిష్టపడని మాయ (‘ఇంట్లో ఒక లా, పబ్లిక్ లో మరోలా ఉండటం నాకు రావట్లేదు’ ) , యిద్దరి ఆలోచనల్లో  వున్న  యీ  వైరుధ్యమే సంఘర్షణకి కారణమౌతుంది . వైష్ణవికి లభించిన కొత్త మగ స్నేహం పట్ల కూడా మాయకి రిజర్వేషన్స్ వున్నాయి. వైష్ణవి తన చేజారిపోతుందేమోనని అనుమానం అభద్రతా ఆరాటం మాయని అసహనానికి గురిచేసాయి. దాంతో ఆరోపణలూ ప్రత్యారోపణల్తో యిద్దరి మధ్య మాటలు చురకత్తులయ్యాయి. ‘కలిసి ప్రేమనుపంచుకున్న ఇద్దరూ ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కత్తులతో సమూలంగా రెండువైపులా నుంచి నరికేసుకున్నారు’. గొడవ తెగేదాకా (బ్రేకప్) సాగింది . ఆ సంబంధాన్ని నిలుపు కోవాలా వద్దా నిలుపుకోడానికి యే ఆలోచనలు ప్రేరేపించాయి అన్నదే మిగతా కథ.

ఒకే జెండర్ కి చెందిన యిద్దరు వ్యక్తులమధ్య యేర్పడే శారీరిక ఆకర్షణ మానసిక వైవిధ్యమా మానసిక వైకల్యమా అన్న ప్రశ్న లోతుల్లోకి వెళ్ళకుండా లింగ భేదం లేకుండా తమకు నచ్చిన వ్యక్తితో కలిసి వుండే స్వేచ్ఛ ప్రతి వొక్కరికీ వుండాలనే హక్కులకోణం నుంచి రాసిన కథ కావడంతో చర్చకి తెరలేపినట్టైంది.

ఇద్దరు స్త్రీలు కావొచ్చు యిద్దరు పురుషులు కావొచ్చు వారి మధ్య చోటు చేసుకొనే యిటువంటి సంబంధాలు కేవలం ప్రైవేటు వ్యవహారాలేనా ? వాటికి సామాజిక కోణాలు లేవా ? అన్నది వొక ప్రశ్న.

ప్రకృతి విరుద్ధం అసాధారణమైన (uncommon) వికృతమైన అనారోగ్యానికి దారితీసే సెక్సువల్ పద్ధతులన్నిటినీ వ్యక్తి స్వేచ్ఛ పేరున ఆమోదించగలమా? వావివరసలు అక్రమ సంబంధాలు మొదలైన పదాల అర్థాలు భిన్న దేశ కాలాల్లో మారేవే అయినప్పటికీ విధి నిషేధాలు మనిషి కల్పించుకోనేవే అయినప్పటికీ  మానవ హక్కుల పేరున ఉల్లంఘించగలమా?  తిరుగుబాటు కోసమే తిరుగుబాటు చేయాలా? అని మరో ప్రశ్న.

పిల్లల్ని కనడానికి స్త్రీ పురుషులు  అవసరం అవుతారు కానీ ప్రేమకీ స్నేహానికీ వొకే జెండర్ కి చెందిన వాళ్లైనంత మాత్రాన తప్పేంటి? ఒకవేళ పిల్లల్ని కావాలనుకొంటే కలిసి పెంచుకొంటారు. సమాజంలో యెవరికీ యిబ్బంది కల్గించని అటువంటి సంబంధం మానవ హక్కులకు భంగం కలిగించేది కాదు కదా! అన్నది యెదురు ప్రశ్న.

ఇటువంటి ప్రశ్నల్ని కథ బయటి విషయాలుగా కొట్టిపారేయొచ్చునేమోగానీ కథ లోపలి విషయాలు కూడా  కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.

‘మనసుకి ఏ తొడుగు లేకుండా స్వేచ్ఛ’ గా వొకటైనప్పటికీ  మాయా వైష్ణవీల  మధ్య సైతం అసమ సంబంధమే యేర్పడినట్టు తోస్తుంది . వారిద్దరి భావాల్లో ఆలోచనల్లో వాటి వ్యక్తీకరణలో వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మాయ ప్రవర్తనలో పురుషాధిపత్య స్వభావం  , వైష్ణవి అనుభూతుల్లో స్త్రీ సౌకుమార్యం  గోచరిస్తుంది .  హోమో సెక్సువల్ రిలేషన్ లో కూడ వొకరికి   ఆధిపత్య స్వభావం  సహజమేనని అంగీకరించగలమా ?  ‘సమాన ఛందం’గా వుండాల్సిన ‘జంట’ (కప్లెట్ నానార్థాలు) సంబంధంలో సైతం యేర్పడే వైరుధ్యాల్ని పరిహరించే పరికరాలెలా యెక్కడ సమకూర్చుకోగలం?

మాయ స్థానంలో వైష్ణవి భర్త వుండి యింటో బయటో ఆమెకి ఇష్టం లేనప్పుడు దగ్గర కావడానికి ప్రయత్నిస్తే …. వేరే సంబంధంలోకి వెళ్తున్నావని అనుమానించి అవమానిస్తే … మరొకరితో ఆత్మీయంగా వున్నందుకు అసూయ పడితే … స్త్రీవాదులుగా మన స్పందన ఎలా వుంటుంది? గాఢమైన ప్రేమలో యివన్నీ సహజమేనని స్వీకరించగలమా?

వైష్ణవి కేవలం తనకు మాత్రమే చెందాలని ఆమె తన సొంత ఆస్తి అన్న విధంగానే మాయ ప్రవర్తనని ఎలా అర్థం చేసుకోవాలి (మాయ ఫెమినిస్టు అయినప్పటికీ వైష్ణవిపట్ల ఆమె ఆలోచనలూ స్పందనలూ మగవాడి ధోరణిలోనే వుండడం గమనించాలి)?

రాహుల్ తో వైష్ణవి సాన్నిహిత్యాన్ని స్నేహాన్ని అసూయతో చూసి అసహనానికి గురయ్యే కన్నా వైష్ణవి స్వభావంలోని ద్వంద్వాన్ని  బై సెక్సువాలిటీగా స్వీకరించవచ్చు కదా! లేదా మల్టిపుల్ రిలేషన్ ని గౌరవించి అంగీకరించ వచ్చు కదా!

మాయే వైష్ణవిని తన మాటలతోనూ చేతలతోనూ లోబరచుకొని చివరికి బ్లాక్ మెయిల్ చేసే స్థితికి వచ్చిందన్న ఆలోచన కూడా పాఠకుల్లో కలుగుతుంది . అందువల్ల కామన్ రీడర్ మాయ మోహం నుంచి వైష్ణవి బయట పడాలని భావించే అవకాశం వుంది .

అదే సందర్భంలో వైష్ణవి మాయల  మధ్య బంధం శారీరిక అవసరాల రీత్యా ఏర్పడిందా  మానసిక అవసరాలకోసం ఏర్పడిందా అన్న ప్రశ్న కూడా వుత్పన్నమౌతుంది. పురుషాధిపత్యం పై నిరసనగా లేదా ధిక్కారంగా   ఫెమినిస్టులూ ,  గర్భధారణ సమస్య లేని సురక్షిత సంబంధమనీ టీనేజి ఆడపిల్లలూ భావించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెస్బియన్ల సంఖ్య పెరుగుతోందని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి.  హాస్టల్ మేట్స్ జైల్ మేట్స్ మధ్య  నిర్బంధమో అనివార్య ఆవశ్యకతో బలవంతమో హోమో సెక్సువల్ రిలేషన్ యేర్పడటానికి  కారణాలౌతున్నాయి . అటువంటి ప్రత్యేక కారణాలు  లేకుండానే  మాయా వైష్ణవీ యిద్దరూ ‘సహజంగా యిష్టంగా’ దగ్గరయ్యారని రచయిత్రి వైష్ణవి ముఖత: ప్రస్తావించింది .

అంతే  కాదు; స్త్రీ పురుషులమధ్య మాత్రమే సెక్సువల్ సంబంధాన్ని అంగీకరించడం స్టుపిడ్ నెస్ అని మాయ నమ్మకం. అది సంప్రదాయ శృంఖలాలను తెంచుకోలేక పోవడం అనికూడా ఆమె వుద్దేశం. అందుకే తనతో వున్న సంబంధాన్ని బాహాటం చేయడానికి యిష్టపడని వైష్ణవిని జాతి మొత్తంతో కలిపి స్టుపిడ్ ఇండియన్స్ అని మాయ తిడుతుంది. మాయకి తన మనసుతో లోపలి ఘర్షణతో వ్యక్తం చేసిన భయ సంకోచాలతో ప్రమేయం లేదనీ  యేక పక్షం వ్యవహరిస్తోందనీ వైష్ణవి బాధ. వెరసి కథ మనస్సు – శరీరం – సమాజం – స్వేచ్ఛ అనే నాలుగు నాలుగు స్తంభాల చుట్టూ సంచలిస్తూ చివరికి రాజకీయ ప్రకటన దిశగా పయనిస్తుంది.

శరీరం అనే అడ్డుగోడని కూడా దాటిన ప్రేమబంధం ది కప్లెట్. సెక్సువాలిటీ అనేది ఇవాళ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక పర్సనల్ బెడ్ రూమ్ వ్యవహారంగా ఎందుకు మిగలలేదని ప్రశ్నిస్తుంది వైష్ణవి. మాయా ఈజ్ మై ఛాయిస్ అన్న అవగాహనకు వస్తుంది. స్త్రీ పురుషుల మధ్య మాత్రమే బంధాలను నియంత్రించే సామాజిక నియమాలను చట్టాలను ధిక్కరించే ఈ కథ లైంగిక హక్కుల అవగాహనకు ఒక ఉదాహరణ.(శరీర రాజకీయాల నుంచి లైంగిక రాజకీయాల దాకా …)

kalpan.profile.photo.1

మాయా వైష్ణవీ ల మధ్య ప్రేమ శరీరాల్ని అధిగమించిందా? అన్నది ప్రధానమైన ప్రశ్న. కథలో వాళ్ళిద్దరి మానసికావసరాల గురించిన ప్రస్తావనలు లేవు. మగవాళ్ళతోగానీ ఆడవాళ్ళతోగానీ  అంతకు మునుపు వైష్ణవికి యెటువంటి సాన్నిహిత్యం లేదు , మాయకి మిడిల్ స్కూల్లోనే తన సెక్సువాలిటీ పట్ల అవగాహన వుందనే విషయం గమనించాలి.

అందువల్లే మాయ దృష్టి ఎంత సేపూ వైష్ణవి శరీరం మీదే వుంది. వైష్ణవి అంగసౌష్టవం వంపు సొంపులే మాయని కవ్వించాయి. శిల్పకళ మీద పరిశోధన చేసే మాయని వైష్ణవి శారీరిక సౌందర్యమే ఆకర్షించింది. వైష్ణవి శరీరంతో ఆమె ఆడుకొంది. వైష్ణవికి స్నానం చేయించాలని ఆమె వుబలాటం. వైష్ణవి మనసుతో ఆమెకి పని వున్నట్టు కనిపించదు. నాట్యం చేసేటప్పుడు ‘ఎగిరెగిరిపడే’ ఆమె ‘వక్షోజాలూ’ , నాట్యం వల్ల చెమటతో తడిసిన దేహానికి అంటిపెట్టుకొన్న వస్త్రాలూ మాయలోనూ పాఠకుడిలోనూ కోరికలు వుద్దీప్తం కావడానికే దోహదం చేస్తాయి. చీర కట్టులో వైష్ణవినీ నల్లటి జలపాతం లాంటి ఆమె జుట్టునీ ‘శరీరాన్ని అంటిపెట్టుకున్న డిజైనర్ బ్లౌజ్ పైనా కిందా ఆమె అర్ధ నగ్నపు వీపునీ ఎడమవైపు నడుం వంపునీ’  చూసినప్పుడు ఆమె మీద మాయకి కంట్రోల్ చేసుకోలేని యేదో అలజడి అంటుకుంటుంది. ‘లోపలి నుంచి ఒక కాంక్ష మాయను నిలువెత్తునా ముంచెత్తుతోంది.’

అప్పుడే కాదు ప్రతి సందర్భంలోనూ మాయ వైష్ణవిని సెక్సువల్ ఆబ్జెక్ట్ గానే చూసింది.  రచయిత కూడా వైష్ణవిని మాయ దృష్టికోణం నుంచే చూపించింది. ‘వైషు  శిల్ప శరీరం’ పట్ల రచయిత్రికి కూడా మోహం పుట్టినట్టుంది. ఆమె దేహభాషతోనే ఆమె  చుట్టూనే కథ అనేకానేక వొంపులు తిరుగుతుంది. ‘దేహ తంత్రులు ఒకదానినొకటి కొనగోటితో మీటుకొనే,  కాంక్షలు అల్లరిగా ఆడుకొనే’   శృంగారానుభవ వర్ణన మగ రచయిత నుంచి వస్తే  మనం యెలా స్వీకరించే వాళ్ళం ? అన్న   ప్రశ్న పుడుతుంది. అయితే  వారిద్దరి పరస్పర స్పర్శలో ‘ఒకరికి ఊరట , సాంత్వన ; మరొకరికి ధైర్యం , నిశ్చింత అన్న వాక్యంతో  ఆ సన్నివేశం ముగిసింది . దాంతో  వారి సాన్నిహిత్యం శరీరాల్ని అధిగమించిందనీ సాంగత్య సౌరభం మనసుల లోతుల్ని తాకిందని వాచ్యంగానే తెలిపినట్టైంది.

రచయిత్రి ఆ సన్నివేశాన్ని వుద్వేగ భరితమైన సంఘటనకీ ఆలోచనాత్మకమైన సంఘర్షణ కీ మధ్య అల్లింది . ఆ విధంగా   ఇద్దరు స్త్రీల మధ్య శృంగారాన్ని బెడ్ రూమ్ నాలుగ్గోడల మధ్య జరిగే ‘ప్రవేటు వ్యవహారంగా’ చూడాల్సిన అవసరం వైపు ,  స్త్రీల లైంగిక స్వేచ్ఛకీ దాన్ని హరించే వ్యవస్థీకృత భావజాలానికీ మధ్య నెలకొన్న దూరాల్ని ఛేదించడానికి వ్యక్తిగా వైష్ణవి చేసే మానసిక యుద్ధంవైపు , తనకేం కావాలో తెలుసుకోలేక తాను స్ట్రైటో లెస్బియనో బైసెక్సువలో తేల్చుకోలేక తన్ను తాను assert చేసుకోలేక తల్లడిల్లే ఆమె అంతరంగ సంఘర్షణవైపు , ఆమె తనలోకి తాను  చూసుకొంటూ చేసే అస్తిత్వ అన్వేషణ వైపు , వ్యక్తి స్వేచ్ఛని నిరోధించే కౌటుంబిక సామాజిక శాసనాల వైపు , వాటి మధ్య వైరుధ్యాలవైపు , మాయా వైష్ణవిల మధ్య సంబంధంలో కూడా యెక్కడో తెలియకుండానే చోటుచేసుకొన్న అసమానతవైపు పాఠకుల దృష్టి మళ్లేలా చేసింది.

వైష్ణవి మనసులో సుళ్ళు తిరిగే సంఘర్షణే కథకి ఆయువుపట్టు. ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడు బయట స్నేహితులు వాళ్ళ మధ్య తన పెర్సనల్ ‘ఇమేజి’ … అంతా లెస్బియన్ లేబుల్ అంటించి తనని బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తున్నట్టు భావిస్తుంది. హోమో సెక్సువాలిటీ పట్ల వ్యక్తుల లైంగిక హక్కుల పట్ల తన భావాల్ని వ్యక్తం చేయడానికి రచయిత్రి వైష్ణవినే తన కంఠస్వరంగా యెన్నుకొంది. అందుకే చివరికి వైష్ణవి అన్నిటినీ ఛేదించుకొని  తన మనశ్శరీరాలు కోరుకున్నదాని వైపే మొగ్గింది.

‘మృత దేహాల్ని మార్చురీలో పెట్టినట్లు నేను కూడా ఈ దేహాగ్నిని ఐస్ గడ్డల మధ్య చల్లర్చుకోనా’ అన్న వైష్ణవి ఆవేదనని నెపం చేసుకొని  ‘కొన్ని లక్షల మంది’ (ప్రపంచ బాధిత స్త్రీల సంఖ్యలో యిది చాలా తక్కువ శాతమే కావొచ్చు) గొంతుకలకు ప్రాతినిధ్యం వహిస్తూ శరీర రాజకీయాలనుంచీ  లైంగిక రాజకీయాల దాకా స్త్రీవాద ప్రస్థానాన్ని రచయిత్రి నిర్వచించదల్చుకొన్నట్టు స్పష్టమౌతుంది.

ఇలా వొక భావజాలాన్నిప్రాతిపదిక చేసుకొని నిర్మించే  కథలో పాత్రలు ఫ్లాట్ గా తయారయ్యే అవకాశం వుంది . కానీ కల్పన  మాయ  వైష్ణవి పాత్రల్ని రౌండ్ క్యారెక్టర్స్ గా మలచడంలో గొప్ప  నేర్పు చూపింది . వ్యక్తికీ సమాజానికీ వ్యక్తికీ వ్యక్తికీ  వ్యక్తి  లోపలి  ద్వంద్వాలకి మధ్య చోటుచేసుకున్న వైరుధ్యాలూ వాదోపవాదనలూ వేదనలూ వాటి మాధ్యమంగా  చిత్రితమైన  బలమైన సంఘర్షణతో   కథకి కావాల్సిన అన్ని హంగులూ సమకూరాయి. వర్తమానం నుంచి గతానికీ గతం నుంచీ వర్తమానానికీ – వంటి రోటీన్ కథన శిల్పం కూడా కల్పనా చేతిలో కొత్త శోభని సంతరించుకుంది.

కథలో వైష్ణవి అనుభవించే యాతన పట్ల పాఠకులకు సానుభూతి లేదా  సహానుభూతి – ఆమె అంతిమంగా తీసుకున్న నిర్ణయం పట్ల యేకీభావం కలుగుతాయో లేదో గానీ కథ చదువుతోన్నంత సేపూ పైన లేవనెత్తిన ప్రశ్నలేవీ నిజానికి అడ్డురావు . రచయిత  వొక వుత్కంఠ భరితమైన కథావరణంలోకి తీసుకుపోయి ‘మంత్రదండం’ వుపయోగించి కదలకుండా కట్టిపడేస్తుంది . బయటికి వచ్చాకా అంతా  వొక వైష్ణవ మాయ అనిపిస్తుంది. అంతిమంగా కథ లెస్బియన్ సంబంధానికి లెజిటమసీ సాధించడానికి తోడ్పడుతుందో లేదో గానీ మౌనాన్ని బద్దలుగొట్టి ఆలోచనల్ని తట్టిలేపడానికి దోహదం చేస్తుందని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. తెలుగు కథలో వస్తు వైవిధ్యం కొరవడుతోందని ఆరోపించి బాధపడేవారికి యీ కథ  ఊరట , సాంత్వన , ధైర్యం , నిశ్చింత  కలగజేస్తుంది.

తాజా కలం   : కప్లెట్ కథ తర్వాత – ఇద్దరు స్త్రీల సహజీవనం చట్టబద్ధం కాకపోవడం వల్ల వాళ్ళిద్దరిలో వొకరు అకస్మాత్తుగా చనిపోతే రెండో వ్యక్తి యెదుర్కొనే  సామాజిక ఆర్ధిక అభద్రతని కేంద్రం చేసుకొని కుప్పిలి పద్మ రచించిన ‘మౌన’ కథ (  – చినుకు జూలై 2015 ప్రత్యేక సంచిక)  – లెస్బియన్ సంబంధం లోని మరో కోణాన్ని స్పృశించి యిదే వస్తువుకి  విస్తృతిని సాధించింది ; కానీ  గే ప్రేమని వస్తువుగా ఎండ్లూరి మానస రాసిన  ‘అదే ప్రేమ’ కథ   (సారంగ 24-9-15) మాత్రం చాపల్యంతో పనిగట్టుకు చేసిన ప్రయోగంలా అనిపించింది .

*

 

 

మీ మాటలు

 1. గొప్పగా విశ్లేషించారు . కల్పన గారు కథని మలచడంలో చూపే నేర్పు అద్భుతంగా ఉంటుంది కథాంశం ఏదైనా, అది అచ్చంగా జరుగుతున్న లేదా జరిగిన సంఘటన అనే భావనని కలిగించడం ఆమె కథల్లోని విశిష్టత

 2. చందు - తులసి says:

  కప్లెట్ కథను విశ్లేషించిన తీరు బాగుంది సర్ …
  ఇక వైష్ణవి దేహం రచయితని కూడా ఆకర్షించిన
  విషయానికొస్తే….
  ఆడ-మగ సంబంధమైనా, ఆడ-ఆడ సంబంధమైనా…దేహమో, భావజాలమో, డబ్బో
  ఏదో ఒకటి ఆకర్షణలో పడేలా చేస్తుంది..
  ఆ ప్రకారం…శిల్పాలను అధ్యయనం చేసే మాయను ఆకర్షించింది దేహమే. ఆ విషయం నొక్కిచెప్పడానికే వైష్ణవి దేహ వర్ణనపై …రచయిత అధిక శ్రద్ధ పెట్టి వుండొచ్చు.
  —ఇక ఎండ్లూరి మానస గారి కథపై మీ అభిప్రాయం గురించి…..
  ఎంత లేదన్నా…..కథలో రచయిత భావజాలం, పరిణతి కనిపిస్తుంది. ఆ పరిణతి ఎన్ని పుస్తకాలు చదివినా…వయసుతోనే వస్తుంది తప్ప ఆంకోలా కుదరదు.
  కనుక కల్పన రెంటాల, కుప్పిలి పద్మ గారిలో కనిపించే విస్తృతి …మానస గారి కథల్లో ఉండే అవకాశం లేదు. గే సంబంధాల పై ….ఆ బంధంలో ఉండే ఆరాధన చూపించడంలో , విషయాన్ని చర్చకు పెట్టడంలో మానస గారి కథా
  ఫలించిందనే చెప్పొచ్చు.

 3. తహిరో says:

  ప్రభాకర్ గారూ … “కప్లెట్ ” కథను సమగ్రంగా విశ్లేషించారు.
  ఒక కథ గురించి ఇంత నిడివిగా రివ్యూ చేసారంటే అది ఆ కథా వస్తువులోని వైవిధ్యం, గొప్పదనం – మామూలు కథల గురించి ఇంత సూక్ష్మంగా చెప్ప వలసిన అవసరం కూడా రాదేమో.
  “గే” , “లేస్బినియన్” కథా వస్తువులు రాసిన వాళ్ళు ముగ్గురూ రచయిత్రులు కావడం గమనార్హం ( 80 ఏళ్ల క్రితం ఎప్పుడో విశ్వనాధ సత్యనారాయణ గారు “మరియొక విధంబు ” అనే “గే ” చాయలు ఉండే కథ రాసారు కానీ ఇప్పుడు వీళ్ళు రాసినట్టుగా పారదర్శ కంగా లేదు – మర్మగర్భంగా ఉంది . ఆ కథని మంజుశ్రీ గారు 8 ఏళ్ల క్రితం విపుల పత్రికలో పరిచయం చేసినప్పుడు చదివిన గుర్తు ) . ఇలాంటి కథలు ఈ మధ్య కాలంలో రచయితలు రాసిన దాఖలాలు కూడా లేవు – “గే” కథలు రాస్తే అది ఆ రచయిత అనుభవం కావచ్చు అని పాఠకులు అనుకుంటా రనే భీతి వల్ల కావచ్చు. (వస్తువు ) కాదేదీ కథకనర్హం అనుకుంటే తప్పించి ఇలాంటి భిన్న మైన కథలు వచ్చే అవకాశం లేదు.
  కల్పన గారు కథని డీల్ చేసిన విధానం లో మంచి పరిపక్వత ఉంది . ఆ సెక్స్ మీద అవగాహన కోసం ఆమె పుస్తకాలు చదివారో , ఇతరుల అనుభవాలు విన్నారో తెలియదు కానీ కథ రాయడానికి వెనుక బాగా కసరత్తు చేసి ఉంటారనేది మాత్రం నా అభిప్రాయం .
  ఇక ఎండ్లూరి మానస గారు కూడా సాహసం చేసారనే చెప్పాలి. ఒక మగవాడిని (లోలోపల) ఇష్టపడే మరో మగవాని ఫీలింగ్స్ ఆమె బాగా పట్టుకున్నారు. అయితే ఎండింగ్ అలా ఉండడం అతకలేదు – ఏడాది కాలంలో అర్జున్ ఫీలింగ్స్ ఏమిటో కనిపెట్టకుండా ఒకేసారి తన మనసులోని మాట చెప్పడం జరగదు – ఏదో ఒక సందర్భంలో అర్జున్ లో తనమీద ఇష్టం, సానుకూలతని గోవిందు కనిపెట్ట గలిగి ఉండాల్సింది.
  ఇలాంటి కథలు రాయడం కత్తి మీద సామే. పిల్లలు కనడానికి తప్పించి ప్రేమకు లింగభేదం అక్కర్లేదు అనే అభిప్రాయానికి వత్తాసు పలుకుతాను.
  జీవితంలో దాదాపు 90 శాతం స్త్రీ పురుషులు ఎప్పుడో ఒక సందర్భంలో స్వలింగ ప్రేమకు, సెక్స్ కు లోనయి ఉంటారనేది నా అభిప్రాయం – కాకపోతే బయటకి చెప్పడానికి గుండె ధైర్యం చాలదు! నా అభిప్రాయం తప్పని మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా ?
  అభినందనలు కల్పన గారు !

 4. కన్నెగంటి అనసూయ says:

  ” జీవితంలో దాదాపు 90 శాతం స్త్రీ పురుషులు ఎప్పుడో ఒక సందర్భంలో స్వలింగ ప్రేమకు, సెక్స్ కు లోనయి ఉంటారనేది నా అభిప్రాయం – ” తాహిర్ గారి ఈ అభిప్రాయం గురించి సమగ్ర చర్చ జరగాలి.
  కల్పన గారి కథ ఒక ఎత్తయితే ఆ కథ మీద ప్రభాకర్ గారి విశ్లేషణ చాల సమగ్రంగా స్పష్టంగా ఉంది. అయితే తాహిర్ గారి ఈ పై అభిప్రాయంతో నేను విభేదిస్తాను.
  90% ఎంత వరకూ కరెక్ట్ ..వారు ఏ ఆధారాలతో ఆ అభిప్రాయానికి వచ్చారో చెప్పాలి.
  అయితే ,
  ఇరువురు” లెస్భియన్లు” గానీ, ఇరువురు “గే” లు కాని ఒకరికొకరు ఇష్టపడి కలసి జీవిస్తే అది వేరు. అదే ఒక లెస్భియన్ మహిళకు పవర్ , డబ్బు ఉంటే తను ఆశించిన మహిళను ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అనే అంశాన్ని ఒక భాగంగా తీసుకుని నేను వ్రాసిన నవలే ” కొత్తగా రెక్కలొచ్చెనా..!” . ఈ నెల చతుర లో పబ్లిష్ అయ్యింది.

 5. స్త్రీ అంతరంగాన్ని, మరో స్త్రీ పై ప్రేమనీ ఎంతో లోతుగా అర్ధం చేసుకుని అంతటి సమగ్ర విశ్లేషణ రాసి, పురుషుడి మీద పురుషుడి ప్రేమ దగ్గరకు వచ్చేసరికి ‘అదే పేమ’ కథ పనిగట్టుకు చేసిన ప్రయోగంలా అనిపించడం నవ్వు తెప్పించింది!! పని గట్టుకు రాయడానికి అది క్రైమ్ కథో లేక సస్పెన్స్ కథో కాదు! మనసులో భావాలను, అనుభూతులను ఎవ్వరికీ చెప్పుకోలేని జీవితంలోంచి పుట్టిన కథ! కథా వస్తువుతోనే మీకు సమస్య ఉందని భావిస్తున్నాను! పాట నచ్చింది కానీ దాని రాగం నచ్చలేదనడం, వినడం మనకి కొత్తేమీ కాదు! ఎంతోమంది పురుషులు(గే, స్ట్రెయిట్) అదే ప్రేమ కథను చదివి వారి జీవితాల్లో జరిగిన అలాంటి అనుభవాలనే పంచుకున్నారు. ఆ కథ కింద కమెంట్స్ చదివినా ఆ విషయం అర్ధమవుతుంది!
  ఇక అర్జున్ ఒకేసారి ప్రేమని ఒప్పుకోవడం కొందరికి covincing గా అనిపించలేదు. అర్జున్ కి కూడా ఇతనంటే ఇష్టమని ముందే చెప్పేస్తే కథకి క్లైమాక్స్ ఉండదు! అర్జున్ మనసుని అర్ధం చేసుకోకుండా ఇతను అంత ధైర్యం చేసి propose చెయ్యడు! ఆ విషయం స్వల్పంగా కథలో రాశాను కూడా. చందు తులసి, తహిరొ గార్లకి కృతజ్ఞతలు!

 6. johnson choragudi says:

  వైష్ణవి కూచిపూడి నర్తకి, హిందూ, భారతీయం.
  మాయ మెక్సికన్.
  రెండు వేర్వేరు ఖండాలు, దేశాలు జాతులు.
  ఒకటి భౌతికమ్, మరొకటి ఆధ్యాత్మికం.
  అన్నిటా వున్నా వైరుధ్యమే – ఈ రెంటి ద్రుష్టి లోను,శరీరాల్లోను వుంటుంది.
  ఇద్దరినీ ఆడ చేసినా, లేదా మగ చేసినా – ఒక్కటే.
  ఇక్కడ ‘ఆడ’ చేయడం వల్ల అది – కధ అయింది.
  అయినా తెలుగు సమాజానికి వున్న తీరికకు శతకోటి వందనాలు!

మీ మాటలు

*