చివరాఖరి ప్రశ్న

Art: Srujan Raj

Art: Srujan Raj

 

-కోడూరి విజయకుమార్

~

vijay

‘కొక్కొరోకో’ … మొబైల్ అలారం లెమ్మని అరుస్తోంది

నిద్ర పట్టని మహానగర రాత్రుల యాతనల నడుమ ఉదయమే లేవడమొక పెను సవాలు!

చిన్నతనంలో ఊరిలో కోడి కూతకు మేల్కొనే అలవాటు ఇంకా పోనందుకో లేక  కొట్టి మరీ నిద్ర లేపే లక్షణం వున్నందువల్లనో అతడు ఊళ్ళోని కోడికూతలా భ్రమింపజేసే ఈ విచిత్ర యంత్రశబ్దాన్ని ఎంచుకున్నాడు.

కొట్టి చెబితే కూడా మెలకువలోకి రాకుండాపోతోన్న జీవితాన్ని తల్చుకుని క్షణకాలం దిగులు పడ్డాడు.

ఇట్లా అప్పుడప్పుడూ జీవితాన్ని తలుచుకుని దిగులుపడే సున్నిత హృదయ శకలం ఒకటి ఏ మూలనో ఇంకా మిగిలి వున్నందుకు ఒకింత సంతోషించాడు కూడా !

‘సరే గానీ … దిగులు దేనికి ?’ ప్రశ్నించుకున్నాడు.

జబ్బులతో మంచాన పడిన తలిదండ్రులు జ్ఞాపకం వొచ్చారు.

‘వృద్ధాప్యం కదా … జబ్బులతో మంచాన పడడం మామూలే కదా’

సంసారంలో ఇబ్బందులు పడుతోన్న తన తోడబుట్టిన వాళ్ళు జ్ఞాపకం వొచ్చారు.

‘ఏ ఇబ్బందులూ,  గొడవలూ, మనస్పర్థలూ లేకుండా ఎవరి సంసారాలు వున్నాయి? చాలా అందంగా సాగుతున్నట్టుగా పైకి కనిపించే సంసారాలన్నీ నిజంగా అందంగానే సాగుతున్నాయా?’

సరే … సరే …. లోన లుంగలు చుట్టుకు పోతున్న ఈ దుఃఖం మాటేమిటి ?

అరచేతులనూ జుత్తు లోనికి జొనిపి,  కణతలను చిన్నగా రుద్దుకుంటూ, గట్టిగా శ్వాస పీల్చుకుని వదిలాడు.

ప్రశ్నలు …. ప్రశ్నలు …. నిన్న సాయంత్రం నుండీ ఎడ తెరిపి లేని ప్రశ్నలు …  ఏవేవో సమాధానాలు దొరుకుతున్నాయి గానీ, అసలైన ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. ఇంతా చేసి, ఆ ప్రశ్న వేసింది అప్పుడప్పుడూ ఆర్టీసీ చౌరస్తా దగ్గర తారసపడే పిచ్చివాడు.

రోజుల తరబడి స్నానం చేయక  పోగచూరినట్లు నల్లగా వుండే శరీరం … చీలికలు పేలికలుగా శరీరం పైన వున్న పొడవాటి షర్టు, పొట్ట దాకా పెరిగిన తెల్లటి గడ్డం, చింపిరి జుట్టు, గుంటలు పడి లోనకు పోయిన కళ్ళు!

‘ఎవరికీ పట్టని వాళ్ళు, ఎవరినీ పట్టించుకోని వాళ్ళు ఇట్లాగే వుంటారేమో?’ అనుకున్నాడు.

‘పిచ్చివాడు ‘ … ఆ మాట ఎందుకో ఒక క్షణం చిత్రంగా అనిపించింది!

ఫలానా విధంగా కనిపిస్తే, లేక ఫలానా విధంగా మాట్లాడితే‘పిచ్చివాడు’ అని ప్రమాణాలు నిర్ణయించింది ఎవరు?

ఒక చిన్న కారణంతో ఏళ్ల తరబడి దెబ్బలాడుకునే భార్యాభర్తలూ …. తిడితే తప్ప కింది వాళ్ళు పనిచేయరనే ఆలోచనలతో తిరిగే యజమానులూ…  అత్యంత రద్దీ సమయంలో  పొరపాటున దాష్  కొట్టిన స్కూటర్ వాడితో నడి రోడ్డు పైన పెద్ద గొడవకు దిగే కారు ఓనర్లు …. వీళ్ళందరూ ‘నార్మల్’ మనుషులేనా ?

కిటికీ పరదాని పక్కకు జరిపాడు

ఉదయం వెలుగు జొరబడి గది అంతా పరుచుకుంది.

‘గడిచిన రాత్రి నుండి బయట పడి, ఇట్లా ఈ కొత్త రోజు లోకి వచ్చాను కాబట్టి సరిపోయింది గానీ, లేకపోతే ?’ ప్రశ్నించుకున్నాడు.

‘లేకపోతే ఏముంటుంది ? ఏదీ …. ఏ …. దీ వుండదు !’ ఎవరో గట్టిగా చెప్పినట్టు అనిపించింది.

తల తిప్పి చూసాడు –  కుండీలో మందార పువ్వు నవ్వుతోంది.

`ఈ బాధలు పడడం కన్నా, ఈ పువ్వులా పుట్టి వుంటే ఎంత బాగుండేది?’ నిట్టూర్చాడు.

‘పువ్వులా పుట్టకపోయినా పువ్వులా బతకొచ్చు అని ఎప్పుడైనా అనుకున్నావా?’ కుండీ లోని పువ్వు గల గలా నవ్వినట్టు అనిపించింది.

కళ్ళు నులుముకుంటూ బెడ్ రూం లో నుండి బయటకు వచ్చాడు.

తను వంటగదిలో ఉన్నట్టుంది. పిల్లల అలికిడి లేదు.

బాబు ఉదయం నాలుగు గంటలకే ఐ ఐ టి కోచింగ్ కీ, పాప ఉదయం ఐదు గంటలకే మెడిసిన్ కోచింగ్ కీ వెళ్ళిపోతారు.

బాల్యం కోల్పోయారు … కౌమారం కోల్పోతున్నారు … రేపు యవ్వనం కూడా కోల్పోతారు …

ఇన్ని కోల్పోయిన తరువాత రేపు జీవితం కోల్పోకుండా ఉంటారా ?

కానీ, అది కోల్పోకుండా వుండడం కోసమే కదా ఈ తెల్లవారు ఝాము కోచింగులు !

ఏది కోల్పోకుండా వుండడం కోసం మరి దేనిని కోల్పోతున్నట్టు ?

Kadha-Saranga-2-300x268

స్కూలు రోజుల వరకూ అతడు చాలా పాటలు పాడేవాడు. ఎక్కడ  పాటల పోటీ జరిగినా మొదటి బహుమతి సాధించేవాడు. ఒక బాలమురళి లాగా, ఒక జేసుదాసు లాగా పాటలు పాడుకుంటూ బతికేయాలని అతడి అప్పటి కల!

శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటానని తండ్రికి చెప్పినపుడు, ‘ముందు చదువు పైన శ్రద్ధపెట్టు’ అన్న సమాధానం వెనుక డబ్బులు కట్టలేని  తండ్రి బేలతనం వుందన్న రహస్యం అతడికి కొంత ఆలస్యంగా అర్థం అయింది. కాలేజీ రోజుల లోకి వచ్చేసరికి అతడికి కుటుంబ బాధ్యతల సెగ తగిలి, క్రమ క్రమంగా ఒకప్పుడు తాను అద్భుతంగా పాటలు పాడే వాడిని అన్న సంగతినే మర్చిపోయాడు.

చదువు … పోటీ పరీక్షలు … నెల తిరిగే సరికి కుటుంబం కాస్త ప్రశాంతంగా బతికేందుకు అవసరమైన సంపాదన తెచ్చే ఒక మంచి ఉద్యోగమే లక్ష్యం!

సరే … అదంతా గతం … ఇప్పుడు తాను చేస్తున్నది ఏమిటి ?

పాప చక్కగా పాటలు పాడుతుంది … ఎంత తియ్యని గొంతు దానిది !

సంగీతం క్లాసులు మాన్పించి, మెడిసిన్ కోచింగ్ క్లాసులకు వెళ్ళమని చెప్పిన రోజున అన్నం తినకుండా అలిగి కూర్చుంది.

బుజ్జగించి, లేక, సంగీతాన్నే నమ్ముకుని ముందుకు వెళితే మిగిలే జీవితాన్ని బెదరగొట్టే రూపాలలో వర్ణించి, మొత్తంమీద పిల్లని సంగీతం నుండి దారి మళ్ళించాడు !

నేల పైన మొదలైన తన జీవితం ఇప్పుడు మేడ పైన కాస్త సౌకర్యవంతమైన స్థాయికి చేరిన దశలో అజాగ్రత్తగా వుంటే, రేపు పిల్లలు ఎక్కడ నేల పైకి జారి పడతారో అని ఒక భయానక అభద్రతా భావం … ఎవరు జొప్పించారు ఈ జీవితాల లోనికి ఇంత అభద్రతా భావాన్ని ?

‘ఎక్కడి నుండో ఇక్కడి ఈ లోకం లోకి విసిరి వేయబడి, ఇక్కడి ఈ సంచారంలో నిరంతరంగా ఒక భారాన్ని మోస్తూ, చివరన మళ్ళీ ఎక్కడికో తిరుగు ప్రయాణమై …’ తన ఊహలకు తానే నవ్వుకున్నాడు!

‘టేబుల్ పైన టిఫిన్ రెడీగా వుంది …. లంచ్ బాక్స్ అక్కడే పెట్టాను ‘ స్నానం చేసి వచ్చేసరికి, బాల్కనీలో మొక్కలకు నీళ్ళు పోస్తోన్న భార్య చెప్పింది.

‘భూమ్మీద పడి, తిరిగి వెళ్లి పోయేదాకా ఏమి తప్పినా వేళకు తిండి తినడమైతే తప్పదు గదా!’  తనలో తాను గొణుక్కున్నాడు.

‘అందమే ఆనందం …. ‘ వివిధ భారతి లో ఘంటసాల పాట తియ్యగా సాగుతోంది.

పాటలు వింటూ టిఫిన్ చేయడం అలవాటు అతడికి.

‘ఆనందమే జీవిత మకరందం’ వినడానికి ఎంత సరళంగా, ఎంత అందంగా వుంది?

ఇంత సరళమైన, ఇంత అందమైన ఈ అనుభూతి ఒక జ్ఞానం లాగ బయటే నిలబడి పోతున్నది తప్ప, గుండెలోకీ, రక్త నాళాలలోకీ, జీవితంలోకీ ఇంకడం లేదెందుకని ? పిచ్చివాడు వేసిన ప్రశ్న భయపెడుతున్నదా? … లేక, వాడికి దొరకిన జవాబు తనకు దొరకనందుకు దిగులుగా వున్నదా?

స్కూటర్ తీసుకుని ఆఫీస్ కు బయల్దేరాడు ….

గత వారం రోజులుగా ఆఫీస్ కి వెళ్ళాలంటే చాలా దిగులుగా ఉంటోంది.

మధు … ఆఫీస్ లో వున్న సన్నిహిత మిత్రులలో ఒకడు ….. వారం కిందట క్యాన్సర్ తో పోయాడు.  మనిషి మృత్యువుకు చేరువ అయ్యేటప్పటి ప్రయాణం ఎంత భారంగా వుంటుందో దగ్గరగా చూసాడు. పరీక్షలు జరిపి చెప్పారు డాక్టర్లు – ‘ క్యాన్సర్ చివరి దశలో వుంది – సమయం లేదు’.

‘ఛ …. ఇంతేనా జీవితం ….ఎన్నెన్ని ఊహించుకుంటాము …. ఎన్నెన్ని కలలు కంటాము … అన్నీ దేహం లోపలి ఒక్క కుదుపుతో దూది పింజలలా తేలిపోవలసిందేనా?’ డాక్టర్ గది నుండి బయటకు వచ్చి స్నేహితుడు దుఖించిన రోజు ఇప్పటికీ వెంటాడుతూనే వుంది.

 

వీధులు దాటి, మెయిన్ రోడ్డు మీదకు చేరుకున్నాడు. రోడ్లు ఈనినట్లుగా జనం …. బస్సుల్లో, కార్లలో, ఆటోల్లో, బైకుల పైన ….ముందు వాడిని కదలమని వెనుక వాడూ, ఆ ముందు వాడిని మరింత త్వరగా వెళ్ళమని ఈ ముందు వాడూ …  అందరూ ఆదరా బాదరాగా పరిగెత్తడానికి సిద్ధంగా వుంటారు గానీ ఎవరూ టైంకి గమ్యానికి చేరే అవకాశం వుండదు. వాడెవడో భలే చెప్పాడు …. మహానగరంలో మనుషులు కాంక్రీటు బోనులలో బంధింపబడిన జంతువులు …. బయటికి వెళ్లి బతకలేరు … లోపలి ఉక్కపోతను భరించలేరు!

వి ఎస్ టి సెంటర్ దగ్గరకు చేరున్నాడు అతడు.  అర కిలోమీటరు మేర ట్రాఫిక్ వుంది. వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. పక్కనే పోలీసుల కాపలా మధ్య ఎర్ర జెండాల నీడలో, చేతులలో ప్లకార్డులతో  ఊరేగింపు కదులుతోంది.

‘భూటకపు ఎన్ కౌంటర్లు నశించాలి’

‘హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి’

అతడి పక్కనే కదులుతోన్న ఊరేగింపులో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు –

‘ఇంజనీరింగ్ చదివే పిల్లలు … పేద ప్రజల పట్ల ఎంత కరుణా, ప్రేమా లేకపోతే బంగారం లాంటి జీవితాలని వొదులుకుని అట్లా అడవుల్లోకి వెళ్ళిపోతారు?’

అతడిని ఆ మాటలు కాసేపు సిగ్గు పడేలా చేసాయి.

తను … తన వాళ్ళు … తన బాధలు  … తన వాళ్ళ బాధలు …. ఈ కలుగు నుండి ఎప్పుడైనా బయటపడ్డాడా తను? మరి, ఆ యువకులు ? …. తమకు ఏమీ కాని పేద వాళ్ళ కోసం, గెలుస్తామన్న నమ్మకం ఇసుమంతైనా లేని యుద్ధం లోకి దూకి ప్రాణాలని తృణ ప్రాయంగా వొదిలి వేసారు.

జీవితమంటే ఇతరుల కోసం జీవించేదేనా ?

‘జీవితమంటే తెలిసిందా నీకు …. తెలిసిందా నీకు ? … హ్హ హ్హ హ్హ …. నాకు తెలిసింది …. నాకు తెలిసింది …. ఇదిగో ఈ గుప్పిట్లో దాచేసాను … హ్హ హ్హ హ్హ’

ఆర్ టి సి చౌరస్తా దగ్గర పడేసరికి, మూసిన గుప్పిలి చూపిస్తూ, నిన్న హటాత్తుగా తన స్కూటర్ కు అడ్డంగా వచ్చి ప్రశ్న వేసిన పిచ్చివాడు జ్ఞాపకం వచ్చాడు అతడికి.

ఇవాళ మళ్ళీ కనిపిస్తాడా ?

కనిపిస్తే బాగుండు …. ఆ గుప్పిట్లో ఏం దాచిపెట్టి, జీవితమంటే తెలిసిందని అంత ఆనందంగా  ప్రకటించాడు వాడు?  వాడిని కొంచెం మంచి చేసుకుని మాటల్లో పెట్టి తెలుసుకోవాలి! పిచ్చివాళ్ళు మహా మొండిగా ఉంటారని అంటారు – వాడు గుప్పిలి తెరిచి చూపిస్తాడంటావా ?

అయినా, పిచ్చి వాడి మాటలకు అర్థాలు వుంటాయా ?

ఇక్కడ జీవితాలకే అర్థం లేకుండా పోతోంది ….. అంటే, జీవితానికి అర్థం ఉంటుందా ? … ఉండాలనే నియమం ఏదైనా వుందా ?

ఆలోచనల నడుమ ఆర్ టి సి చౌరస్తా సిగ్నల్స్ దగ్గర ఆగాడు అతడు.

చుట్టూ చూసాడు – ఆ పిచ్చివాడు ఎక్కడైనా కనిపిస్తాడేమో అని. ఊహూ … కనిపించలేదు. అయినా, ఫలానా టైంకి, ఫలానా చోటులో వుండాలనే కాలనియమం పాటించడానికి వాడేమైనా మామూలు మనిషా?

‘సర్ … నిన్న సాయంత్రం ఇక్కడ ఒక పిచ్చివాడు వుండాలి ‘ మాటల్ని కూడబలుక్కుంటూ పక్కన నిలబడి వున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ని అడిగాడు అతడు.

‘ఏమైతడు నీకు? అట్ల రోడ్ల మీద వొదిలేసి పోతే ఎట్ల?’

‘అయ్యో …. అతడు నాకేం కాడు …. నాకేం కాడు’ తత్తర తత్తరగా అన్నాడు.

కానిస్టేబుల్ అతడిని తేరిపార చూసాడు.

అప్పుడే గ్రీన్ బల్బు వెలగడంతో ఇక కానిస్టేబుల్ మొహం చూడకుండా ముందుకు వెళ్ళిపోయాడు.

సుదర్శన్ టాకీస్ లో ఎవరో స్టార్ హీరో కొత్త సినిమా విడుదల ఉన్నట్టుంది. టాకీసు ముందు అభిమానుల కోలాహలం! ….అభిమాన హీరో సినిమా మొదటి రోజు, మొదటి ఆట చూడకపోతే జీవితానికి అర్థం లేదనుకునే జనం …. ఒక వేళ టికెట్ దొరక్కపోతే ఆత్మహత్య చేసుకోవడానికైనా వెనుకాడని సాహసులు!

అశోక్ నగర్ చౌరస్తా దాటి ఇందిరా పార్కు దగ్గరికి వచ్చేసరికి ఒక చోట జనం మూగి వున్నారు. గుంపు ముందర ఆర్ టీ సి బస్సు ఆగి వుంది.

ఎప్పట్లాగే, ఏమీ పట్టనట్టుగా ముందుకు సాగిపోతూ వుండగా పక్కన ఎవరిదో మాట వినిపించింది -‘ఎవరో పిచ్చివాడు …. బస్సుకు అడ్డంగా వెళ్లి, దాని కిందపడి చచ్చి పోయాడు’

స్కూటర్ సడెన్ బ్రేక్ వేసి, కొంచెం దూరంగా పార్క్ చేసి, గుంపుని చేరుకున్నాడు అతడు. గుంపులోకి దూరి, ఒకరిద్దరిని బలవంతంగా పక్కకు జరిపి రక్తం మడుగులో పడి వున్న పిచ్చివాడిని చూడగానే కొన్ని సెకన్ల పాటు అతడి ఒళ్ళు జలదరించింది.

రోడ్డు పైన నిర్జీవంగా పడి వున్న పిచ్చి వాడిని పరికించి చూసాడు.

ఏదో గొప్ప అలౌకిక ఆనంద స్థితిలో మరణించినట్లుగా వాడి పెదవుల పైన ఇంకా మెరుస్తోన్న నవ్వు! సరిగ్గా నిన్న సాయంత్రం అతడి స్కూటర్ కి అడ్డంగా వచ్చి, ‘జీవితమంటే నాకు తెలిసింది’ అని గొప్ప సంతోషంతో ప్రకటించినప్పుడు అతడి కళ్ళల్లో, పెదవుల పైన కన్పించిన మెరుపు నవ్వు లాంటి నవ్వు !

అతడు, అప్రయత్నంగా నిర్జీవంగా వెల్లకిలా పడి వున్న పిచ్చివాడి అరచేతుల వైపు చూసాడు.

అరచేతులు రెండూ తెరుచుకుని, ఆకాశం వైపు చూస్తున్నాయి.

మనసు వికలమై, అతడు గుంపులో నుండి బైటకు వచ్చాడు.

‘నారాయణగూడా సెంటర్ లో పెద్ద బట్టల దుకాణం వుండేది ఈ పిచ్చాయనకి … వ్యాపారంలో కొడుకే మోసం చేసే సరికి తట్టుకోలేక ఇట్ల అయిపోయిండు’ అక్కడ చేరిన వాళ్ళలో ఒకరు, మిగతా వాళ్లకు చెబుతున్నారు.

‘ఏముంటే మాత్రం ఏమున్నది బిడ్డా … పోయేటప్పుడు సంపాయించిన పైసలొస్తయా …. రక్తం పంచుకున్న బిడ్డలస్తరా?’  ముసలమ్మ ఒకావిడ అంటోంది!

అతడికి ఆఫీసుకి వెళ్ళాలనిపించలేదు. ఫోను చేసి చెప్పాడు రావడం లేదని.

స్కూటర్ వెనక్కి తిప్పి ఇంటి దారి పట్టాడు.

ఇంటికి చేరుకొని, గబ గబా బెడ్ రూమ్ లోకి చేరుకొని మంచం పైన వాలిపోయాడు.

‘ఏమయింది ఈ మనిషికి ఇవాళ ‘ అనుకుంటూ బెడ్ రూమ్ లోకి వచ్చింది అతడి భార్య.

‘ ఆఫీస్ కు వెళ్ళ లేదా? ఏమైనా ప్రాబ్లంగా ఉందా ఒంట్లో?’

‘నో ప్రాబ్లం … ఐ యాం ఆల్ రైట్’ అంటూ తెరిచి వున్న కిటికీ వైపు చూసాడు అతడు. పొద్దున్న కన్పించిన మందార పువ్వు లేదక్కడ!

‘ఈ కుండీలో పొద్దున్న మందార పువ్వొకటి వుండాలి ‘ భార్యను అడిగాడు

‘ఓ అదా … పక్కింటి వాళ్ళ ఇంట్లో దేవుడి పూజ ఏదో వుందని కోసుకు పోయారు. హ్మ్ …. అయినా ఎప్పుడూ లేనిది ఇంట్లో కుండీలలో పూసే పూవుల గురించి అడుగుతున్నావు … ఒంట్లో బాగానే ఉందా అని అడిగితే నో ప్రాబ్లం అంటున్నావు’ కొంచెం కంగారుగా అడిగింది

.

* * * * *

 

                     

        

 

 

మీ మాటలు

 1. చందు - తులసి says:

  పువ్వులా పుట్టకపోయినా పువ్వులా బతకొచ్చని
  ఎపుడైనా అనుకున్నావా…?
  దేని కోల్పోకుండా ఉండేందుకు… దేన్ని కోల్పోతున్నాం..?
  మళ్ళీ మళ్ళీ చదివించే ఇలాంటి వాక్యాలు చాలా వున్నాయి.
  జీవితమంతే….జీవితమంతా కూర్చోని ఆలోచించినా అర్థం కాదు…

 2. కోడూరి విజయకుమార్ says:

  Thank You Chandu – Thulasi … for the warm Complement

 3. Kottam Ramakrishna Reddy says:

  మంచి కథ. మన కథ. బావుంది.

 4. KiranKumar Satyavolu says:

  Nijamga adbhutamaina kadha rasaaru Sir :-) Every point in the story is thought provoking, really very nice story sir.

  Thank you for giving beatiful story.

 5. విజయకుమార్ గారు చాల ఆర్ద్రంగా ఉంది.రోజుకు కొన్నివందల దృశ్యాలు మన కళ్ళముందరే అద్రుష్యమవుతుంటాయి.ఎన్నెన్ని జీవితాలు.వాటి మధ్యలో మన నిత్య జీవితాలు.

 6. తహిరో says:

  నీ కథ చదవగానే నన్నుకొద్దిసేపు స్మశాన వైరాగ్యం ఆవహించింది విజయ్ . కథ గురించి ఏమ్ చెప్పడాని లేదు . ఆహో ఓహో … అనలేను కానీ అప్పుడప్పుడు మన ముఖాన్ని అద్దంలో చూసుకున్నట్టు ఈ కథను చదువుకుంటే కొంచెం కింద నెల ఉందనే సత్యం గుర్తుకొస్తది – లేకపోతే నెలకు జానెడు ఎత్తుల నడుస్తుంటమ్ కదా మనం.
  చాలా రోజుల తర్వాత కథ రాసినట్టు ఉన్నావ్ – లాంగ్ పోయమ్ ను కథగా మలిచినట్టు ఉన్నావ్ – ఔనా ?
  జేసుదాస్ అని రాసావు , బహుశా అది జె. ఏసుదాస్ అనుకుంటా :)

 7. తహిరో says:

  నీ కథ చదవగానే నన్నుకొద్దిసేపు స్మశాన వైరాగ్యం ఆవహించింది విజయ్ . కథ గురించి ఏమ్ చెప్పడానికి లేదు . ఆహో ఓహో … అనలేను కానీ అప్పుడప్పుడు మన ముఖాన్ని అద్దంలో చూసుకున్నట్టు ఈ కథను చదువుకుంటే కొంచెం కింద నేల ఉందనే సత్యం గుర్తుకొస్తది – లేకపోతే నేలకు జానెడు ఎత్తుల నడుస్తుంటమ్ కదా మనం.
  చాలా రోజుల తర్వాత కథ రాసినట్టు ఉన్నావ్ – లాంగ్ పోయమ్ ను కథగా మలిచినట్టు ఉన్నావ్ – ఔనా ?
  జేసుదాస్ అని రాసావు , బహుశా అది జె. ఏసుదాస్ అనుకుంటా :)

  సారీ … నెల కాదు – నేల అని చదవాలి – తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు కదా :)

 8. చొప్ప వీరభధ్రప్ప says:

  కోడురు విజయకుమార్ గా రి కథ నేటి సంఘ ప్రయాణ,పరిణామ గతులకు బింబ ప్రతిబింభం. సున్నిత మనస్తత్వ చిత్రరూపమిది.గత జీవితస్మృతి. పట్టణజీవణ వ్యత్యాంతో ఇమడలేని స్థితిగతులను బొమ్మ గట్టారు .జబ్బుపడ్డ తల్లిదండ్రుల జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం వారికి రుణగ్రస్తులం .అది తీర్చ లేనిఋణం.చదువులు ఇష్టంగా మరచి పరిగెత్తే నేటి చదువులను దులిపారు.నేటి రక్షక వ్యవస్థకు భయం గుప్పెట పట్టడం .మోసగాడైన కొడుకు తో మానసిక క క్షోభపొంది పిచ్చెక్కింప చేసింది నేటి కొడుకులు చాలామంది ఈగాటి జీవు లనచ్చు.బాధతో అంతర్ముఖుడై.వెంట ఏమీ రాదని పిచ్చి వాని ద్వారా చెప్పారు. రాబోయే కుటుంబ వ్యవస్థ.పరిణామానికి అద్దం ముందే చూపారు.మందారం పూవు పరిణామం కథకు కెంద్రం చేశారు

 9. దేశరాజు says:

  బావుంది

 10. తహిరో says:

  నువ్వు “పొదుపిస్టు ” వని తెలుసు గానీ మరీ ఇంత అక్షరాల “పొదిపిష్టు ” అని ఇప్పుడే తెలిసింది డేరా … సారీ దేరా :)

 11. కోడూరి విజయకుమార్ says:

  రామకృష్ణ రెడ్డి గారు — కిరణ్ కుమార్ గారు – రజని గారు ….వీర భద్రప్ప గారు …. THANK YOU !

  తహిరో ….. అంతిమంగా అనివార్యమైన మృత్యువు ఒకటి ఉంటుందన్న సంగతి అందరం కన్వీనియెంట్ గా మరిచిపోవడం వల్లనే సరళ సుందరంగా ఉండవలసిన జీవితాలు సంక్లిష్టం అవుతున్నాయన్న ఎరుక ఏదో ఈ మధ్య వెంటాడుతున్నది …. అట్లాంటి ఒకానొక వైరాగ్య స్థితిలో (ఒక ఎరుక కలగడాన్ని వైరాగ్య స్థితి అనే అనొచ్చా ?) ఉన్నపుడే ఈ కథ రాసాను
  2000 సంవత్సరం లో చివరి కథ — మళ్ళా 2011 లో … తిరిగి ఇప్పుడే ! … ఇక ఆపకుండా కథలు రాయాలనే తపన !
  మీ ఆత్మీయ స్పందనకు కృతజ్ఞతలు !

  దేశరాజు …. థాంక్స్ !

  • తహిరో says:

   ” … అనివార్యమైన మృత్యువు ఒకటి ఉంటుందన్న సంగతి అందరం కన్వీనియెంట్ గా మరిచిపోవడం వల్లనే సరళ సుందరంగా ఉండవలసిన జీవితాలు సంక్లిష్టం అవుతున్నాయన్న ఎరుక ఏదో ఈ మధ్య వెంటాడుతున్నది …. ”
   …………………………………………………………………………
   నీ వొక్కడికే కాదు విజ్జీ … ప్రతి మనిషిలో నీడలా మృత్యు భయం వెన్నాడుతూ ఉంటది – కాకపోతే మేక పోతు గాభీర్యం తో కనిపిస్తారు అంతా.
   నన్ను మృత్యువు కంటే భయపెట్టేది ఏమిటో తెలుసా ? చచ్చాక ఒక వ్యాన్ లో పడేసి స్మశానానికి తీసికెళ్ళి గప్ చుప్ గా కాల్చి పడేయక తతంగం + దిన కర్మ + దిక్కుమాలినవన్నీ చేస్తారు చూడూ … అది.
   మళ్ళీ బతికి అవన్నీ చేయవద్దురా అని దిక్కులు పిక్కటిల్లేలా అరవాలని ఉంటది.
   ఏది ఏమైనా ఒక మంచి కథ రాశావ్ – సంతోషం – గొరుసు

 12. Jayashree Naidu says:

  విజయ్ గారు…
  హడావిడి పరుగులా నాగరిక జీవనంలా వుందీ..
  ఉద్యోగం ఆర్ధిక అవసరమే, లేక పోతే ఊరికే అడుక్కోవడమే వృత్తి చేసుకునే బిచ్చగాడికి ఆనందం అనుభవం లోకి రాదు.
  చౌరస్తాలో ఎదురైన పిచ్చి వాడి కారెక్టర్ అర్థాంతరపు ముగింపు అసంతృప్తినే ఇచ్చింది. అతడి statement తో ముగించే కన్నా కొంత సంభాషణ వాక్యాలు నడిపి వుంటె సంతృప్తి కరంగా వుండేది. జీవితం లో విపరీతమైన ఎదురు దెబ్బ తిన్న వాడు అది జీర్ణించుకోలేక పిచ్చి వాడవుతాడు. అలాంటి ఉన్మాది కి, స్థిమిత మనస్సు తో సత్యాన్ని వెతికి అది చేజిక్కించుకున్న వాడికీ తేడా వుంటుంది కదా. అటు వంటి పిచ్చి వాడి (మూసిన పిడికిలి లోని )జీవిత సత్యం ఎంత వరకూ ఆ మైన్ కారెక్టర్ కి ఆదర్శ ప్రాయం?

  జీవితం అంటే కేవలం ఇతరుల కోసం బ్రతకడం లేదా మరణీంచడం మాత్రమే కాదు (మీరు చూపిన ఇంజనీరింగ్ విద్యార్థుల ఉదాహరణ) ఇతరుల కోసం జీవిస్తూ తన కోసం కూడా జీవించడం. అదే ఒక కళ. ఆ కళలోనే ఆనందం వుంటుంది.

  ఉద్యోగం ఒక ఆర్థిక స్వావలంబనా సాధనం. కానీ మన మనో ప్రవృత్తికి సంబంధించిన విషయమే వృత్తిగా మారితే ఆ ఆనందమే వేరు. ప్రతి రోజూ ఒక కొత్త ప్రయోగం… ఒక కొత్త మనో ఆవిష్కరణ… ఒక ముందడుగు అవుతుంది. అలా కాకుండా వృత్తీ ప్రవృత్తీ ఉత్తర దక్షిణాలైనపుడే యీ ఘర్షణలూ మనో యవనిక ఆవిష్కరణలూ అవసరం అవుతాయి.
  సమాధానాలున్న ప్రశ్నల్నే మీ కథ మళ్ళీ రెవైజ్ చేసినట్టు అనిపించిందీ.

 13. రాధ మండువ says:

  బావుందండీ, మనందరి ఆలోచనలనీ కథగా మలిచిన తీరు బావుంది.

 14. కోడూరి విజయకుమార్ says:

  రాధ గారు … thank you !
  జయశ్రీ గారు …
  కథలో ప్రోటాగనిస్ట్ కొద్ది రోజులుగా మృత్యువు, జీవితాలకు సంబంధించిన ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి ఐన మానసిక స్థితిలో వున్నాడు. అతడి జీవితంలో ఒక పూట ఎట్లా గడిచిందో చెప్పే ప్రయత్నమే ఈ కథ ! నిజమే …. చాలా ప్రశ్నలకు సమాధానాలు వున్నట్లే అనిపిస్తుంది గానీ, పరీక్షా సమయాలలో ఎవరి వెతుకులాటలలో వాళ్ళు ప్రయాణిస్తారు అనుకుంటాను !
  (ఇదంతా మీ స్పందనలో నాకు ఎదురైన ప్రశ్నలకు ఒక వివరణ మాత్రమె తప్ప – కథను సమర్థించుకునే ప్రయత్నం కాదు – అట్లా భావిస్తే క్షమించండి !)

 15. Y RAJYALAKSHMI says:

  “ఏది కోల్పోకుండా వుండడం కోసం మరి దేనిని కోల్పోతున్నట్టు ?” బావుంది. అందరికి ఇలాగే అనిపిస్తోంది కానీ సొల్యూషన్ మాత్రం దొరకటం లేదు.

 16. కోడూరి విజయకుమార్ says:

  రాజ్యలక్ష్మి గారు … నిజమే … సొల్యూషన్ దొరకడం లేదు ….
  కాకపోతే, సాహిత్యంలో కనీసం కొంత స్వాంతన దొరుకుతోంది !

 17. Rishi Srinivas says:

  బాగుంది సార్. సారంగ లో ఒక గొప్ప కధ చదివిన అనుభూతి చాన్నాళ్ళకి కలిగింది.

 18. కోడూరి విజయకుమార్ says:

  రిషి శ్రీనివాస్ గారు …
  కథ మీకు అంతగా నచ్చినందుకు చాలా సంతోషం !

 19. Krishna Prasad says:

  నేల పైన మొదలైన తన జీవితం ఇప్పుడు మేడ పైన కాస్త సౌకర్యవంతమైన స్థాయికి చేరిన దశలో అజాగ్రత్తగా వుంటే, రేపు పిల్లలు ఎక్కడ నేల పైకి జారి పడతారో అని ఒక భయానక అభద్రతా భావం … ఎవరు జొప్పించారు ఈ జీవితాల లోనికి ఇంత అభద్రతా భావాన్ని ?

  చావుకన్నా మిన్నగా బ్రతుకు భయపెట్టడం విషాదం.మీ కధలో నేను పట్టుకున్నదదే.కధ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది.ప్రతి విషయం పరిష్కరించే స్థాయిలోనే మనకు కనిపిస్తుంది.కానీ అది నేరుగా మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు బెంబేలు పడిపోతాం.ఆ జంఝాటనల తాలూకు నిర్వేదమే మీ కధ.
  అభినందనలు కోడూరి విజయకుమార్ గారూ, మీకూ మీ కధకూ !

 20. కోడూరి విజయకుమార్ says:

  కృష్ణ ప్రసాద్ గారు … thank you !
  నిజాయితీగా రాసే ఏ రచనను అయినా ఓన్ చేసుకుని అర్థం చేసుకునే పాటకుడు ‘కనీసం ఒక్కరైనా’ ఉంటారని నమ్ముతాను నేను.
  ఈ కథ కు వొచ్చిన స్పందనలలో అట్లాంటి పాటకులు ఒకరి కన్నా ఎక్కువ కనిపించడం సంతోషంగా వుంది !

మీ మాటలు

*