అసంపూర్ణం….

 

-మేడి చైతన్య

~

chaitanya mediనేను ఏదైన విషయం చెబితే అది వెంటనే దాని ప్రాముఖ్యతను కోల్పోతుంది. అదే విషయాన్ని రాస్తే అప్పుడు కూడా అలాగే జరుగుతుంది, కాని కొన్ని వేళలలో దానికి కొత్త అర్ధం  విలువస్తుంది .

నిశ్శబ్దం రాజ్యమేలుతుండడంతో మాటలు బిగ్గరగా వినిపిస్తున్నాయి.

ఒసే ఎక్కడున్నావే….వినిపిస్తుందా…ఏం చేస్తున్నావే?

అన్నంపెట్టవే…ఏయ్…నిన్నే?

ఎవరమ్మా?

ఇంకెవరురా…మీ పెదనాన్నే!

మంచంలో వెల్లకిలా పడుకొని అరుస్తున్నాడు. పెద్దమ్మేమో ఏమి పట్టనట్టుగా పొయ్యి రాజేసి ఆవెలుగులో తన చీకటిని కలిపివేస్తునట్టుంది.

ఎందాకని చేస్తుంది అది మాత్రం, ఈ రోజుల్లో మంచంలో ఏరుక్కుంటే శుభ్రంచేసే పెళ్ళాం లంజముండ ఎవత్తుంది చెప్పు? అన్నంపెడితే మళ్ళీ ఏమయ్యిద్దోని దాని భయం. ఐనా పెట్టింది తిని ఉండొచ్చు కదా,ఎందుకు ఊకే గొణగటం?

అమ్మమాటల్లో పెద్దమ్మ నిశ్చల ముఖమవతలి పార్శ్వం కనిపించింది.

మంచిగున్నప్పుడు రోజు కుల్లబొడిచేవాడు ఇప్పుడు తెలుస్తుంది అయ్యగారికి ఆమే విలువేంటో? మంచంలో నవిసి నవిసి చావొద్దూ! కోపంగా అనేసి నాన్న ఏమయిందో చూడ్డానికి వెళ్ళాడు.

“ముసలితనానికి అందరు ఇష్టమే నాన్న,నీవు కుడా దాని ప్రేమనుంచి తప్పించుకోలేవు.”

అయినా ఏముందిరా చిన్నోడా, డబ్బా?….పొలమా? రెక్కల మీద బతికేటోళ్ళు. పాపం పెద్దోడికి ఇద్దరు ఆడపిళ్ళలేనా, నడిపోడేమో లారీక్లీనరాయా (ఏదేశాలుతిరుగుతున్నాడో ఏంటో), ఆఖరోడేమో పని,పాట లేకుండా చెడు సావాసాలు.ఉన్న ఒక్కదాన్ని ఈయనే ఒక అయ్యచేతిలో పెట్టిండు. వాళ్ళడొక్కే నిండట్లేదు, ఇంకేవరు ఈయన్ని దవఖనకు తీస్కపోతరు చెప్పు?

కళ్ళ ముందు మనిషి చనిపోతుంటే ఏం చేయలేమా అమ్మ?

అందరం ఎలాగోలా బ్రతకాలనే కోరుకుంటం.మరణమే దిక్కయినపుడు,అదే తొందరగా రావాలని ఎదురుచూస్తున్నాం!

‘బతుకులోనే కాదు చావులో కుడా బాగుకోరవచ్చునేమో!’

చిన్నోడా ఎప్పుడొచ్చావురా, రెండు రుపాయిలుంటే ఇవ్వరా, బీడీలు కొనుక్కుంటా అని అడుగుతుంటే, చిన్నప్పుడు బొందలగడ్డల దగ్గర బొంగుపేలాలు ఇంకొన్ని పెట్టు పెదనాన్న అని బేలగానే పెట్టిన మొహమే నాకు ఇప్పుడు కనిపించింది.

ఐనా నేను కొనిచ్చే ఈ రెండు బీడీల వల్ల పెదనాన్న బాధతీరుతుందా?

నేనేం చేయలేనా? మనిషి పుట్టుకపుట్టినాక ఇంకొకమనిషికి సాయం చేయలేనా? అసలు నా జీవితానికి ఏమైనా అర్దం ఉందా? ఏమి చేయాలో తెలియని సందిగ్ధస్థితి?

తర్వాత చాల రోజులకు పెదనాన్న చనిపోయాడని చెప్తే, కాదు మీరే చంపేశారన్నా!నన్నెందుకు ఆ క్షణం మినహాయించుకున్నానో తెలీదు, బహుశా బీడీలు కొనిచ్చాననే భరోసా ఏమో?

ఆలోచనలలో పడి ఎప్పటిలాగే ఏమిపట్టనట్టుగా ఎటో చూస్తూ వర్షం వస్తోందనే సంగతే గమనించలేదు! కోపంగా నన్ను తిట్టుకొని కిటికి వేసేంతవరకు నా పక్కన ఒకతను కూర్చున్నాడనే గుర్తించలేదు.

చలికాలంలో వానేంటనే చెత్తప్రశ్నలడగకుండా, కిటీకిలోంచి ఆవల బస్టాండు వైపు చుశా.మూలగా బొంతేదో కదులుతున్నట్టుగా ఉంది. వానలో తడవకూడదని చాలా మంది బస్షెడ్డులోకి వస్తుంటే, తనుమాత్రం తలదాచుకుంటుదక్కడే అనుకుంటా!

రెండు మూడు రోజులు గమనించినా తనెవరో తెలియలేదు. తీరా ఒక రోజు తన మొహం కనిపించింది. ఆనందం, బాధ ఎరుగని అవ్యక్తభావమేదో ముఖంలో దాచుకున్నట్టుంది తను. బొంతే తన సర్వస్వమన్నట్టు దానిని విడిచిపెట్టదెప్పుడూ, అయినా వాళ్ళ కొడుకులని ఎలా విడిచిపెట్టిందో మరి!

ట్యూషన్డబ్బులొస్తే తనకేమయినా ఇవ్వాలనుకొని రెండు  నెలలు గడిచాయి.ఈ రోజు డబ్బులొస్తే మాత్రం ఖచ్చితంగా కొనుక్కొనిపోవాలని నిశ్చయించుకున్నా.

అరటిపళ్ళు తీసుకొని బస్సెక్కా. ఎలా ఇవ్వాలనే ఆలోచనలలో మునిగిపోయి, వేరే బస్టాప్లో దిగి, తను ఉన్న బస్టాండ్వరకు నడుచుకుంటూ వెళ్ళా!

ఎవరో ఇద్దరు ఏదో బస్కోసం ఎదురుచుస్తున్నారు. వాళ్ళుండగా ఇవ్వడానికి నాకెందుకో ధైర్యం సరిపోలేదు(ఎక్కడ చూసేస్తారేమోనని భయమనుకుంటనేమో!)

ఒక పావుగంట నా దేహాన్ని దోమలకు వదిలేసి, ఆకాశంలో నక్షత్రాలను లెక్కెట్టం మొదలెట్టా!

నేను తనే మిగిలాం! లోకమేమీ పట్టనట్టుగా నిద్రపోతూనే ఉందితను. ధైర్యం చేసుకొని సంచీ తన కాళ్ళ దగ్గర పెట్టేసి వెనక్కి తిరగకుండా వచ్చేశా!

అనందం ఏంటో తెలియకపోయినా, గుండెల్లో బరువేదో తగ్గినట్టుంది.

మర్నాడే తనేం చేస్తుందోనని ఆ బస్టాప్లో దిగి ఒక పక్కగా నిశ్శబ్దంగా కూర్చున్నా. పక్కన కూర్చున్న వాళ్ళెవ్వరు తననేమి పట్టించుకోకపోయినా ఏదో చెప్పుకుంటూ పోతూంది. రాత్రి క్రిస్మస్తాత తన దగ్గర కొచ్చి ఆకలి తీర్చాడని, తన్ను కంటికి రెప్పలా తనే కాపాడతాడని, ఇంకా అర్ధము కాని మాటలేవో చెప్పుకుంటూ పోతూంది.

ఇరవై  ఏళ్ళ నిన్ను అప్పుడే తాతని చేసేసిందని తన బొంత నన్ను వెక్కిరిస్తునట్టు చూస్తోంది. కన్నీటి చుక్కొకటి సమధానమయిందిదానికి………

తన బొంత బస్టాండు మీద వేలాడుతూ కనిపించింది తర్వాతిరోజు. వచ్చేటప్పుడు కుడా తను కనిపించలేదు. చాలా రోజుల వరకు తను కనిపించలేదు. చాలా సార్లు ఆ బొంతతో మాట్లాడాలని ప్రయత్నించా, తనెక్కడికి వెళ్ళిందో తెలుస్తుందేమోనని! బొంతకున్న చిరుగు నా ఆరాటాన్ని చూసి బహుశా నవ్వుకుందేమో!

ఇవాళ బస్సెక్కిన దగ్గరనుంచి ఆ చిరుగుల పడిన బొంతే కనిపిస్తుంది. తను ఏమైయుంటుందబ్బా అని ఆలోచించా. ఆశగా ఎదురుచూస్తున్న ఆబొంతను చూసి ఒక కథ రాసేద్దామనుకున్నా. మరుక్షణమే తన గురించి పట్టించుకోకుండా కథలు రాయాలన్న నా కమర్షియల్బుద్ధిని తిట్టుకొన్నా.

ఒకవేళ తను చనిపోయిందేమో?

నేను ఇంకేమైనా చేసి ఉండాల్సిందేమో?

పెదనాన్న చావుని ఏమి చేయలేని స్థితి అనే సాకుతో నన్ను దోషిగా ఊహించుకోలేదు ఇప్పుడు మాత్రం నేను తప్ప దోషిగా ఆ చిరుగుకి ఎవరూ కనిపించరేమో! బహుశా నా వల్లే తను చనిపోయిందేమో! అరడజను అరటికాయలిచ్చి నా జీవితానికి అర్ధం దొరికిందని సంబరపడ్డానేమో! నే చేసిన పనులన్ని అసంపూర్ణంగా ఇప్పుడనిపిస్తున్నాయి. నా జీవితమే అసంపూర్ణంగా తోస్తుంది నాకు.

మనిషికంటూ ఒక విలువుందని నమ్మేలోపు, ఆ విలువేదో ఈ జీవితంలో తనకు తానుగా తెలుసుకోలేడనే చేదు నిజం ఎదురవుతుంది. పరిపూర్ణతను ఎప్పుడు కాంక్షిస్తామో అప్పుడే జీవితం పట్ల విరక్తి కలుగుతుంది. మనిషే అసంపూర్ణమేమో!

చేతనమున్న దేని విలువయినా దాని ఆంతర్యంలో దాగదు. దాని శరీరం, ఆలోచనలు చేరుకోలేనంత దూరంగా దాని విలువ దాగుంటుంది. జీవితానికే ఏదయినా విలువుంటే అది ఈ లోకపు సరిహద్దుల ఆవల ఉంటుంది. లోకపు ఎల్లల అవల గురించి మాట్లాడాలంటే మనం భాషా పరిమితులను దాటిపోవాల్సిందే! నిర్దిష్టమైన ఆధారమేది లేని ఆ భావన కోసం వెదుకులాడకుండా, ఎల్లల లోపలున్న జీవితాన్ని అంతర్ముఖంగా పరిశీలన చేసుకుంటే, జీవితం పట్ల విరక్తి పోతుందేమో!

దూరంగా మబ్బుల మీద చిరుగులబడిన బొంతేదో నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుంది.

అకస్మాత్తుగా బస్సెందుకో ఆగింది. కళ్ళు తెరచి చూసేసరికి ఎదురుగా టికెట్ చెకింగ్ స్క్వాడ్ ఉంది.

అప్పుడు గుర్తొచ్చింది, నేను బస్సెక్కి చాలా సేపయిందని, జేబులో టికెట్టుకి సరిపడా చిల్లర తప్ప మరేమిలేవని!

మీ మాటలు

*