కవి నిద్రపోయే అవకాశమే లేదు!

 

సిద్ధార్థ

సిద్ధార్థ

ఇది నేను బతికిన ఇరవై సంవత్సరాల కవిత్వం. రాజకీయ, సామాజిక వైయక్తిక ఆధ్యాత్మిక సృజనాత్మక… సుడులతో.. దిగులుతో, పొగిలిపోతూ ప్రత్యేక అస్తిత్వం కోసం అంగలారుస్తూ పొటెత్తుతూ… నన్ను క్షణవరతం ముంచేసిన కవిత్వం. రెండు దశాబ్దాల / నిద్ర పోనివ్వని రాత్రుల / జంగమ జాతరల / రంది రగడల కవిత్వం. ఈ వాక్యాలతో, ముచ్చట్లతో నాకు నాతో నాలోని మన నేనుతో తొట్టెలూగాను. ఈ తొట్టెలకు భూమి కేంద్రం నా ఊరు నా తెలంగాణ నా హైదరాబాద్. ఈ పదాల ప్రస్తారవలయం మాయమ్మ బొడ్డుతాడును మెడకు చుట్టుకుని వలయించింది. నా ఇంటి చుట్టూ గల్లీల చుట్టూ రాళ్ళ గుట్టల మొహలాల్ల చుట్టూ కూలిపోవడానికి సిద్ధంగా లేని కట్టడాల చుట్టూ దరువులేసుకుంటూ తిరిగింది నా ప్రదర్శన కవిత్వంగా. 

 
ఈ వాక్యాల కట్టడాల అంతస్సుల్లో మల్లా కొత్త జన్మనెత్తాలన్న ప్రాకృతిక వాంఛను నేను అనుభవిస్తున్నాను. ఔటర్ ఇన్నర్ రింగురోడ్ల కింద కుమిలే / మసలే పంట పొలాల ఆకుపచ్చని రక్తాల వాసనను నేను అనుభవిస్తున్నాను. 
 
రూపం … రూపం రాని తనం … రూప విధ్వంసం … రూప మోహం … రూపసార జంగమం నా కిష్టం. నేను నాకిష్టమై నచ్చిన బతుకే… నా కవిత్వంలో వర్తిస్తూ వచ్చింది. అసహనం, రాయకుండా ఉండలేని తనంతో లోపలి బొక్కల్ని, నరాల్నీ, బొక్కల్లోన్ని మూల్గునీ నుజ్జు నుజ్జు చేస్తున్న కవిత్వం ఇది. ఎక్కడివరకు తీసుకుపోతుందో తెలియదు. ఇది ఎక్కడిదాకా తీసుకోచ్చిందో అర్థం కాలేదు. ఇక్కడ  కనిపిస్తున్న కవితల్లో … సందర్భం పూర్తిగా తెలిసే అవకాశం పాఠకుడికి ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాని వాటిని చదువుతూ… తనకంటూ ఏర్పరుచుకున్న అనుభవ విభాగాల్లోకి ప్రాంతాల్లోకి పార్శ్వాల్లోకి ఇంటి మలుపుల గుమ్మాల కిటికీల సాయవానుల్లోకి పోయి కూర్చుంటాడు. అతనికి అర్థమైందంతా అతని అనుభవం తాలూకు ప్రతిఫలనమే. 
 
పుస్తకాల్లో – నాకు నచ్చిన వాక్యాలు తగిలినపుడు జ్వరమొచ్చి నీరసపడిపోయి వాటి మత్తులో  గంటల తరబడి tranceలో ఊగిపోయిన సందర్భాలు చాలా  వున్నాయి. 
 
నేను ప్రాధమికంగా పాఠకుడిని-పాఠకత్వంలో ఉన్న ఆనందం నాకు  దేంట్లోనూ దొరకలేదు. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుడిగా ఊగిపోవడం తప్ప ఏమీ చెయలేనివాన్ని. అందుకే కవిత్వం పాఠకుడిని మత్తులోకి జీవనలాలసలోకి, దైన్య ధైర్యంలోకి, తెగింపులోకి తీసుకుపోతుంది. అదే దాని శక్తి. అది మనలో రేపే తిరుగుబాటు అంతరిక భౌతిక సరిహద్దుల్ని దాటేస్తుంది. కొత్త మరణాల్లోకి అటు నుంచి కొత్త పుట్టుకల్లోకి జీవిని తీసుకుపోతుంది. కవిత్వం ద్వారా నేను చూసిన వాన మబ్బుల సౌందర్యంతో పాటు పంట సాళ్ళ పగుళ్ళ బతుకు భయ బీభత్స సౌందర్యం కూడా వుంది. తెలుపు నలుపులోని పలు వర్ణ సమ్మేళనాల రసాయనిక చిత్ చర్య వుంది. శబ్దభూమిలోని నిశ్శబ్ద రుద్రభూమి ఆనవాలు వుంది. ఏ కవినైనా కాలమే పుట్టించి అన్నం తినిపించి సేదతీర్చి తిట్టి కొట్టి గాయపరిచి గారంచేసి కేకపెట్టించి ముందుకు ఎగదోసి perform చేయిస్తూ తుదకు మృత్యువుపాలు చేస్తుంది. కవిగా నా విషయంలో కూడా కాలం అదే పనిలో గాడంగా పని చేస్తూనే వుంటుంది. 
 
Siddharta Book Coverకవిత్వం రాసేటోడికి వాని వునికి వానికి తెలిసిరావాలె కదా. మన ఇల్లు వాకిలి మన ఇంటోళ్ళ బతుకూ, బరువూ బలుపు, ఎతచిత, కులం/పొలం/జలం, పొయ్యికాడి దేవతా, తలపోతలోని గ్రామదేవుడూ, దయ్యం దాని శిగమూ తెలిసిరావాలె కదా, మన అమ్మలక్కల చీకటి గదుల అర్రల, చెప్పుకోలేని చింతల, వారి మాటల పనిముట్ల మాటలు మనం మోయాలె కదా. మనలో ఎప్పటికి పోరగాని తనమే తలనూపాలె కదా… 
 
గడిచిన రెండు దశాబ్దాలూ పూర్తిగా కల్లోల దశాబ్దాలు… ముఖ్యంగా కవికి. ఎటు జరిగినా వొక మూలనుంచి ముసురునుంచి ఏదో ఒక రాయి వచ్చి తగులుతుంది. రక్తస్రావం తప్పనిసరి. ఆధిపత్య పాలనకింద నలుగుతూ ధిక్కరిస్తూ పోటెత్తి, పోరెత్తిన కాలం. తెలంగాణ అస్తిత్వమే రుద్రభూమి. కొన్ని దశాబ్దాలుగా ఈ భూమి వలసాధిపత్య హింసలో భాగంగా సామాజిక హింసకు రాజకీయ హింసకు వైయక్తిక ఆధ్యాత్మిక హింసకు సృజనాత్మక హింసకూ చిక్కి నలిగిపోయింది. ఆ గ్నాపక కతా గానమే ఈ కవిత్వం. ఇది ఎన్నో శక్తుల చెండాట. గతం కాళ్ళకింద చిక్కుకుపోయిన వర్తమానాన్ని ఎగతన్ని తల ముందుకు తీసుకురావాల్సిన చెండాట. 
 
చుట్టూవున్న ప్రపంచంతో నన్ను నేను sync చేసుకోవడానికి ప్రయత్నించాను. 
ఇందులోని ఏ  వస్తువులకవే నాతో మాట్లాడినయ్, సర్వజీవ నిర్జీవ చేతనల చింత నాలోనుంచి అవతలకు ప్రసరించి తిరిగి పునర్గమనం చేసింది నాలోకి, నేను వుండని నాలోకి. కవిత్వం వ్యాపకం కాదు … ప్రకృతి. ప్రతి ఒక్క పదమూ మెటఫరే. ప్రతి కదలికా సింబలే. ఈ లోకంలో చెట్టూ పుట్టా రాయీ రప్పా వాగూ గుట్టా ఎన్నెన్నో వాటి పనులు నిర్వహిస్తున్నట్టే నేను నా పనిని నిర్వహిస్తున్నాను. 
 
ఇదింకా అంతంకాలేదు. కంపన కొనసాగుతూనేవుంది. వాస్తవ యుద్ధం ఇంకా మొదలే కాలేదు. కవి నిద్రపోయే అవకాశమే లేదు. 
 
మార్గశిర మాసం, 2015

మీ మాటలు

 1. Dr.Pasunoori Ravinder says:

  సిద్ధార్థ‌న్న క‌విత్వంలాగే, వాక్య‌మూ తెలంగాణ ప‌ల్లెకు చెయ్యిప‌ట్టుకొని తీసుక‌పోతున్న‌ది.
  జ‌వ‌జీవాల‌తో ప‌చ్చిప‌చ్చిగా తగులుతోంది.
  క‌వి అంత‌ర్, బ‌హిర్ సంఘ‌ర్ష‌ణ‌ల సంచారం జ‌మిలీగా సాగింది.
  సిద్ధార్థ‌న్న వంటి క‌వులు మా కాలంలో ఉన్నందుకు మాకు గ‌ర్వ‌కార‌ణం.
  క‌విత్వంగా జీవిస్తున్న సిద్ధార్థ‌న్న లైఫ్‌స్టైల్‌కి స‌లాం!!
  -డాక్ట‌ర్ పసునూరి ర‌వీంద‌ర్‌

మీ మాటలు

*