ఉరితాడూ ఈ ముడి నువ్వయినా విప్పవూ?

 

 

           -బమ్మిడి జగదీశ్వర రావు

                                     ~

bammidi అయ్యా రంగనాథ్ గారూ..

మీకు నేను తెలీదు, కానీ నాకు మీరు తెలుసు! నాలాంటి చాలా మందికి మీరు తెలుసు! యిప్పుడయితే అందరికీ మీరు తెలుసు! హీరోగా కాదు, విలన్ గా కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అస్సలే కాదు, టీవీ ఆర్టిస్టుగా అంతకన్నా కాదు. కవిగా కాదు. నాటక కర్తగా కాదు. టెన్నీసు క్రీడా కారుడిగా కూడా కాదు. అరవై ఆరేళ్ళ వృద్ధాప్యంలో ఆత్మహత్య చేసుకున్న.. సారీ రంగనాథ్ ని హత్య చేసిన రంగనాథ్ గా మాత్రమే తెలుసు! లోకం మీ మూడొందల సినిమాల్ని మర్చిపోయింది! అందమయిన ఆరడుగుల యెత్తయిన మిమ్మల్ని మర్చిపోయింది! అనుభూతినిచ్చే మీ కవిత్వాన్నీ మర్చిపోయింది! మిమ్మల్ని మీరు హత్య చేసుకున్న విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంది! పెట్టుకుంటుంది! ఇక మీదట యెప్పుడూ మీ కథ.. జీవితాన్ని మీరు ముగించిన చోట మాత్రమే ఆరంభిస్తుంది!

మీరు యెందుకిలా చేసారు? అడిగేవాళ్ళు లేరనా? ఒంటరిగాన్ని అనా? యేమని? మీ వయసెంత? మీ అనుభవమెంత? మరీ అరవ్యయారో యేట చెయ్యదగ్గ పనేనా? చెంప పండీ పండని వాళ్ళు కూడా చెయ్య తగ్గ పని కాదే?! తల పండిన మీకు యేమిటీ తలపోత? మరి మిమ్మల్ని మీ వయసు ఆపలేదా? వార్ధక్యం ఆపలేదా? గడిపిన గతించిన జీవితాన్ని చూసి మీరు యేమి నేర్చుకున్నారు? యేమని సందేశమిస్తున్నారు? యే ‘డిస్టినీ’ యిది? విధి యిదా? యెవరు రాసారు? యే బ్రహ్మదేవుడు రాసాడు? బ్రహ్మదేవుడు వేషం మీరు వేసారు సరే- అరే విధిని మీరే రాసారే?! దేవుణ్ణి ప్రశ్నించిన మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేదేమి?

మీ అమ్మ జానకమ్మగారు మంచి గాయకురాలు. అంతేనా?, మించి తబలా విద్వాంసురాలు. మరి వీణలోనో.. యేకంగా గోల్డు మెడలిస్టు. అన్ని అర్హతలు వుండీ యిల్లాలయ్యాక  యింటి బరువు మోసాక తన కోరిక.. సినిమా నేపథ్యగాయని కావాలన్న తన ఆశని తీసి అటకా యెక్కించేసారు! సంసారమే సంగీతమయ్యాక దారి దొరక్క- గొంతుండీ పాడలేక – పిల్లల పెంపకం వీడలేక – కలని నెరవేర్చుకొనే తోవ లేక – వున్న ఒక్క జీవితాన్ని ముగించలేదు! మీలా వురి పోసుకోలేదు! వూపిరి పోశారు కలకి! కోరితే మీరు నీరు పోశారు! ఆ ఫలమే మీరు!!

మీ సహచరి నిర్మల చైతన్య కుమారి నుంచి మీరు యేమి నేర్చుకున్నారు? మీ ఆవిడ మేడ మీది నుండి కింద పడిపోయారు. నడుం విరిగింది. కాళ్ళు చచ్చు బడిపోయాయి. పద్నాలుగేళ్ళు పడకకే పరిమితమయిపోయారు! జీవితమన్నాక పడడం లేవడం సహజమనుకున్నారు. తప్పితే ఈ జీవచ్చవం లాంటి బతుకెందుకనిగాని, బరువెందుకనిగాని ఆవిడ అనుకోలేదు. అనుకుంటే ఆమెకు మృత్యువు పెద్ద దూరం కాదు. దేవుడు పిలిచినప్పుడే వెళ్లాలని అనుకుంది. తప్పితే మీలా తొందర పడలేదు. పడివుంటే మీకు మీ భార్యపట్ల వున్న బాధ్యత యెంతో నిరూపించుకొనే అవకాశమే లేదు! ఆబాధ్యతలకు మారు రూపు మీరు!!

అలాగే చైతన్య కుమారి జ్ఞాపకాల్ని ఆరేళ్లుగా ఆయువు పోస్తున్నారే.. ఆత్మ అన్నారు.. ఆజ్ఞాపకాల్నీ  మీ ఆత్మనీ మీరు వురితీసారని యెరుగుదురా?

మీ మిత్రుడు నందా ఎయిర్ ఫోర్సుకు వెళ్లిపోయాడని- మీరు వంటరి వాణ్ణి అయిపోయానని- ఆత్మహత్య చేసుకుందామని అనుకొని- రైలు కింద పడదామని పట్టాల ముందు కూర్చుని- తిరుపతి నుండి వచ్చే 156 ఆలస్యమైందని- అప్పుడు అమ్మా అమ్మ కోరికా గుర్తొచ్చి లేచొచ్చేసారని చెప్పుకున్నారే.. మరి రైలు రైట్ టైంకు వస్తే యేమయ్యేది? అమ్మ కోరిక తీరేదా? మళ్ళీ నందా కలిసేవాడా? మీ ఆలోచన ఆలస్యం కాలేదు! మీరు మిగిలారు! మీ కవిత్వమూ సినిమాలు మాకు మిగిలాయి! మీ పెద్ద కుటుంబం మీరు లేకపోతే యేమయ్యేది? మీ పాత్రలో మీరే వుండాలి! మీ పాత్ర మీరే పోషించాలి!

హీరో పాత్రే అనుకుంటే అరవై సినిమాల దగ్గర ఆగిపోయేవారు కాదా? అందరూ హీరోలయితే విలన్లెవరు? మిగతా క్యారెక్టర్లు యెవరు పోషిస్తారు? మిమ్మల్ని మెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆఖరిదాక హీరోగానే వున్నాడా? రేపు మహేష్ బాబు అయినా రాంచరణ్ అయినా అంకుల్ వేషమో తాతయ్య వేషమో వెయ్యక తప్పుతుందా? మనకు విలనుగా వచ్చి హీరోలు అయినవాళ్ళున్నారు. హీరోగా వచ్చి విలన్లు అయినవాళ్ళున్నారు. మీ తొలి విలన్ పాత్ర ‘గువ్వల జంట’ బాగా ఆడలేదని మిమ్మల్ని మళ్ళీ హీరోగా చూసారా? పంతోమ్మిదేళ్ళపాటు విలనుగా మీకు ఆయస్సు యెందుకు పోసారు?

అంచేత యెప్పటికి ఆపాత్రే! పాత్రకు న్యాయం చెయ్యడంలో మీ లోపలి హీరో పాత్రకు పాత్ర వుంది! మీలోపలి హీరో పాత్రని మీరు నిలబెట్టుకుంటూ వచ్చారు! మీలోపలి హీరో పాత్రని మీరు వురితీసి చంపేసి వుంటే మీ మరొక్క పాత్ర బతికే ఛాన్స్ వుoడేది కాదు!

జీవితమంటే జీవించడమంటే హీరోగా మాత్రమే మిగలడం కాదు అని- జీరో దాకా ప్రయాణించడమని- హీరో నువ్వే అనీ- విలనూ నువ్వే అనీ- బాబాయి నువ్వే అనీ- మామయ్యా నువ్వే అనీ- అన్నయ్యా నువ్వే అనీ- తాతయ్యానువ్వే- చివరకు ‘రైల్వే టికెట్ కలెక్టరూ’ నువ్వే- సమస్తమూ సకలమూ నువ్వే అనీ- యిన్నిన్ని పాత్రలు వేసిన నీకు యెవరు చెప్పాలి?!

ఔను! ఒంటరీ నువ్వే! సమూహమూ నువ్వే!

ఒంటరితనాన్ని ఓర్చుకోలేక పోయావా? మనిషి లోపల తనకు తాను ఒంటరి! వెలుపల ఒంటరి కాదే?!

మందసా మహరాజ్ ఎస్టేట్ లో మీతాతగారు వైద్యులుగదా? ఆ మందసా మహారాజు యిప్పుడు యేo చేస్తుస్తున్నాడు? యింకా రాజుగానే వున్నాడా? లేదే.. ఆ ప్రాంతంలో కొందరు రాజులు పాలు అమ్ముకుంటూ బతుకుతూ వున్నారు తెలుసా? మందసా రాజుగారు కూడా వురిపోసుకు చావలేదు!

ఒంటరినని వాదిస్తారా? యెవరు వొంటరి కాదు? మీ పిల్లలే కాదు, మా పిల్లలూ మా దగ్గర లేరే. రేపు వాళ్ళ పిల్లలూ వాళ్ళ దగ్గర వుండరే!? మనకి మనం దొరకనంత వేగంగా పరిగెత్తుతూ వున్నామే!? మీ మిత్రులూ చుట్టాలూ పక్కాలూ అందరూ ఆ పరుగు పందెంలోనే వున్నారే!?

మీ కవిత్వమూ మీ సినిమాలూ నాటకాలూ క్రీడలూ మీ వొంటరితనం నుండి మిమ్మల్ని విడదియ్యలేకపోయాయా?

నిజమే! ఒంటరితనం జైలే! మనుషుల్ని తోటి మనుషులనుండి వేరు చేస్తే అది జైలే! ఆ జైలు నిర్మాణానికి మీ చుట్టూ వున్న వాళ్ళతో పాటు మీరెందుకు పూనుకున్నారు? ఆ శిక్ష మీకు మేరే యెందుకు వేసుకున్నారు? అలా శిక్షించుకున్న ఉదయకిరణ్ ను మీరేమన్నారు? ‘నాదగ్గరకు వస్తే సంపూర్ణంగా మార్చేసేవాడిని’ అన్నారు కదా? మరి మిమ్మల్ని మీరు యెందుకు మార్చుకోలేక పోయారు? మార్పు యెప్పుడూ మననుంచే కదా మొదలవ్వాలి!

మీ సహచరి చైతన్య కుమారితో ప్రేమ కన్నా బాధ్యత గొప్పది అని మీ వుద్దేశాన్ని ఆమెతో విభేదించి మరీ చెప్పారే! మరి మీ బాధ్యత యిదేనా? సమాజంలో యెందరో బతకడానికి చస్తున్నారే?! అమ్మానాన్నాలేని అనాథలుగా యేతోడూ లేక వొంటరిగా బతుకుతున్నారే?! ఆ ఒంటరి వాళ్లను మీరెందుకు తోడు చేసుకోలేకపోయారు? మీ వొoటరితనాన్ని యెందుకు చేరిపేసుకోలేకపోయారు? మీ చుట్టూ మీరు వొంటరితనపు కంచె వేసుకున్నారెందుకు?

సమూహంలో కలవలేని వాళ్ళ కథ యిలానే ముగుస్తుందని చెప్పడానికా యీ మీ కథ?!

నేను నేనుగా వుండిపోతే మనము కాలేకపోతే యింత శిక్షా?!

వొక్క మాట చివరిగా చెప్పాలి.. సమూహంలోనే వొంటరితనానికి విముక్తి!

యేమైనా యింక యెప్పటికీ మిమ్మల్ని చూడలేమని తలచుకుంటే దుఃఖంగా వుంది!

కన్నీళ్ళతో-

వొక ప్రేక్షకుడు

 

మీ మాటలు

 1. బమ్మిడి జగదీశ్వర్ గారూ. చాలా ఆలోచనాత్మకమైన ఆవేదన గొప్పగా రాసారు

 2. ఇలాంటి సందేశాత్మకమైన వ్యాసాలు ప్రజల్ని ఆలోచింపజేస్తాయి.
  -కారం శంకర్ కవి ,రచయిత

 3. మరణించిన వ్యక్తికి ఇన్ని ప్రశ్నలా..? పోనీ ఆయనెప్పుడైనా తన చుట్టూ వున్న ప్రపంచం మీద నిరశించాడా..? లేదే..! పోనీ తనకు కావలసినేవో తనకు దక్కలేదని తన చుట్టూ వున్న మనుషుల మీద పిర్యాదులు చేసారా..? లేదే..!! పోనీ తాను ఒంటరినని ఎక్కడైనా వాపోయారా..? నాకు తెలిసి లేదే..!!
  ఆయన తనను తాను నిష్క్రమించడానికి కారాణాలేంటో ఇప్పుడున్న బయటి ప్రపంచంలో ఎవరికీ తెలియదు, పోనీ బతికున్నప్పుడైనా అవేంటో తెలుసుకోవాలని బయటి ప్రపంచం ఎన్నడూ ప్రయత్నించలేదు, అలా ప్రయత్నించాలని కూడ ఆయన ఎవరి నుండి కాని తన చుట్టూ వున్న ప్రపంచం నుండి కానీ ఏమి ఆశించలేదు. ఆయన ప్రతీది తనకు ఎదురైనది..ఎదురైనట్లుగా యధాతదంగానే అంగీకరించారు కాని తనలో అసంతృప్తి వున్నట్లు కూడ ఎప్పుడూ చెప్పుకోలేదు బయటకు. అలా అసంతృప్తి వున్నట్లుగా కూడ కనపడ లేదు, ప్రవర్తించలేదు. ప్రతీది యధాతదంగా అంగీకరించుకుంటూ వెళ్లిపోయారే గాని ఎక్కడా సమాజం పట్ల పిర్యాదులు లేవు.

  ఆయనకు ఇక చాల్లే ఈ జీవనం అని అనిపించిందేమో…? తన దారి తను చూసుకోవాలనుకొన్నారేమో..? ఎవరికి తెలుసు ఆయన అంతరంగాలు..? ఎవరి మీద ఎలాంటి పిర్యాదులు చేయకుండా మౌనంగా తన దారి తను చూసుకొంటూ నిష్క్రమించిన వ్యక్తి మీద ఎందుకిన్నీ ప్రశ్నలూ..? ప్రశాంతంగా వెళ్లనివ్వండి ఆయనకు కావలసినట్లుగా ఆయన్ని..! దానిని కూడ చుట్టూ వున్న ప్రపంచం నిలువరించాలా..? ఆయనకు నచ్చింది ఆయన్ని చేసుకోనివ్వండి. మన ప్రమేయం ఎందుకు ఆయన వ్యక్తిగత జీవితం మీద..?? ఆయన మరణాన్ని కూడ చిద్రవధం చేస్తెకాని ఈ చుట్టూ వున్న ప్రపంచానికి తృప్తి తీరదా..??

  • Kamal gaaru wonderful andi correct ga chepparu!! Nenu rk tho ayana open heart chusanu yekkada niraasha leni vyakthi…naaku ascharyam veyaledhu ayana chaavu

  • Kongara Gangadhara Rao says:

   రంగనాథ్ ని ఒక వ్యక్తిగా చూస్తే మీరన్నది నిజం కమల్ గారు. కాని మహానటి సావిత్రి లాగా రంగనాథ్ కూడా మనలాంటి ఎంతోమందికి చెందిన వ్యక్తి. అలాంటి వారి జీవితం వారి సొంతం కాదు. జగదీశ్వర్ గారి ఆర్తిని మరో కోణంలో చూడండి.

   • కొంచెం దిగ్బ్రాంతి కలిగించేమాటన్నారు మీరు. ఆయన popular ఐనంతమాత్రాన ఆయన జీవితమ్మీద మనకు హక్కులు దఖలుపడతాయాండీ? ఆయనజీవితమ్మీద ఆయనకు అధికారం ఉండదా?

  • ఇది రంగనాథ్ గారిని ఇప్పుడు ప్రశ్నించడం అని అనిపించడం లేదు, బమ్మిడి గారు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ ఇది ఒక సందేసాత్మక వ్యాసం అందరిని ఆలోచింప చేసే వ్యాసం. ఆత్మహత్య చేసుకొనే వారు తమకు తాము ప్రశ్నించుకోవాలి అని తెలుపుతుంది.

  • ప్రసాద్ చరసాల says:

   మీరు చెప్పినదాంతో ఏకీభవిస్తున్నా. ఆయన అర్ధాంతరంగా నిష్క్రమించటంతో బాధగా వున్నా, ఆయన నిర్ణయాన్ని వేదనతో గౌరవిస్తున్నా!

  • mokkala balakrishna reddy says:

   కమల్ గారూ మీతో ఏకీభవిస్తున్నాను.

 4. ఎంతో ప్రేమ తో రాసారు…బాధతో రాసారు…సహజమైన మరణం అయితే వేరేలా రాసేవారు…కాని అసహజమైన మరణం ఎప్పుడూ బాదే కలిగిస్తుంది….కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకవు…ఎలా మరణించిన కొందరిని తలుచుకోకుండా ఉండలేం..

 5. సెబాసు బజర ..ముడి పడ్డ మనసుల్ని విప్పావు.

 6. //ఔను! ఒంటరీ నువ్వే! సమూహమూ నువ్వే! //
  ఎవరు వంటరి ? ఎవరు కాదు? ఒక ప్రేక్షకుడికగా, అభి మానిగా కన్నీళ్లు తెప్పించారు.

 7. భాస్కరం కల్లూరి says:

  రంగనాథ్ గారి ఆత్మహత్య వార్త విని చాలా బాధపడ్డాను. మనసు వికలమైపోయింది. ఆయన మిగిలిన సినిమాలు ఏవీ నాకు గుర్తులేవు. రంగనాథ్ అనగానే అంతిమ తీర్పు సినిమా ఒక్కటే నాకు గుర్తొస్తుంది. నిజజీవితంలో విలన్ అయినట్టు కనిపించని రంగనాథ్ ఈ సినిమాలో విలనీని అద్భుతంగా పోషించి తనను చూడగానే ఆ పాత్రే గుర్తొచ్చేలా చేశారు. చలనచిత్ర పరిశ్రమ, పెద్దలూ ఎంత గాఢశోకంతో స్పందించారో, ఎవరు ఎలాంటి నివాళి అర్పించారో నేను చూడలేదు. కదిలించే మీ నివాళి మనసును చల్లబరిచింది. తృప్తినిచ్చింది. ధన్యవాదాలు.

 8. సుబ్రహ్మణ్యం says:

  చాలా హృదంతంగా రాశారు బజారా .

 9. sadlapalle chidambarareddy says:

  బాగా లోతుగా చెప్పారు

 10. శ్రీతెలుగు says:

  స్వతహాగా కవి, కథారచయిత, తత్త్వవేత్త అయిన హీరో రంగనాథ్ అసహజ మరణానికి చాలా బాధపడ్డాను. తెలుగు సినిమా పరిశ్రమలో ఆ రంగానికి సహజమైన వ్యామోహాలకీ, చెడుగులకీ దూరంగా, ఋషుల్లా ఆత్మనిగ్రహంతో జీవించిన హీరోలు ముగ్గురున్నారు పాత తరంలో! వారు – రంగనాథ్, శోభన్ బాబు, శ్రీధర్.

  ఈ తరం వాళ్ళకి రంగనాథ్ తెలీదు. ఆయన హీరోగా నటించిన 60 హిట్ సినిమాలు కూడా తెలీవు. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాక నటించిన 250 సినిమాలైనా గుర్తున్నాయో లేదో తెలీదు. నటులు కోటీశ్వరులైతేనే గుర్తుపెట్టుకునే తరం ఇది. ఆ రోజుల్లో రామకృష్ణ, రంగనాథ్, ఈశ్వరరావు, నరసింహరాజు ప్రభృతుల్ని న్యూ జనరేషన్ హీరోలుగా భావించేవారు. ఏ విధమైన సినిమా నేపథ్యమూ లేని సాదా సీదా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన హీరోలు వీరు. కులంతో నిమిత్తం లేకుండా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్న అదృష్టవంతులు వీరు. ఆ మంచి రోజులు గతించిపోయాయి. ఈ రోజు సామాన్యులు హీరోలు కాలేరు. కులసంఘాల వెన్నుదన్ను లేకుండా నిలదొక్కుకోనూ లేరు. శోభన్ బాబు ఆ రోజుల్లో అందాల హీరోగా పేరుగాంచినట్లే రంగనాథ్ గంభీరమైన హీరోగా పేరు గాంచారు. రంగనాథ్ అనగానే ఆ రోజుల్లో మెయిన్ రోడ్లలో పంతులమ్మ మొదలైన హిట్ సినిమాలకి పెట్టిన 30 అడుగుల ఎత్తయిన భారీ కటౌట్లు గుర్తుకొస్తాయి.

  • కమల్ says:

   త్వత్తవేత్తలు వేరండి. వారి ఆలోచనా దోరణే వేరుగా వుంటుంది. రంగనాథ్ గారిని ఆ కోవలోకి కలపకండి. మీరు ఉదహరించిన ఆ హీరోల కాలంలో వారితో పాటుగా వచ్చిన ఏ హీరోలైనా సరే వారికి ఏదైనా సినిమా నేపథ్యం వున్నదా..? అలా సినిమా నేపథ్యమ్ వుండి ప్రఖ్యాతి గాంచిన ఒక్క హీరో పేరు చెప్పగలరా మీరు….? ఆ కాలంలో వచ్చిన హీరోలందరూ దాదాపుగా అందరు మద్య తరగతి కుటుంబాల వారేనే..? ఎక్కడైనా ధనిక కుటుంబాల నుండి వచ్చిన కథానాయకులున్నారా..?

   కులం గురించి ప్రస్తావించారు. అసలు ఆ కాలంలో హీరోల అభిమానలకు కుల స్పృహంటూ ఏది లేదే.. నాకు తెలిసి. ఇప్పటి ఈ కాలపు కుల భావాన్ని అప్పటి ఆ కాలానికి ఆపాదించడం ఎంత వరకు సబబు..? రామకృష్ణ గారికి ఎంతమంది కోట్లాది అభిమానులున్నారో చెప్పగలరా….? నటుడిగా గుర్తించతగ్గ సినిమాలేమైనా వున్నాయంటారా..? ఈశ్వర రావు.. గారించి నటుడిగా ఏదైనా సినిమాలు చెప్పగలరా../

   రంగనాథ్ గారిని సినిమా హీరోగా, కవిగా, ఆయన ప్రతిభను పొగుడుదాం. అంతే కాని ఆయన్ని పొగడడానికి మిగతా వారిని ఎందుకు నిందించడం.? ఒకరిని పొగడాలంటే సాటి వారిని నిందిస్తే గాని గొప్పగా చెప్పుకో బడదా..? ఎప్పుడూ ఒక పెద్ద గీత పక్కన చిన్న గీత గీయాల్సిందేనా..?

   • శ్రీతెలుగు says:

    రంగనాథ్ గారు ఎంత చింతనాపరులో తెలుసుకోవాలంటే ఆయన వ్రాసిన పుస్తకాలు (“ఈ చీకటి తొలగాలి” మొదలైనవి) చదవాలి. ఈనాడు దశాబ్దాల కాలగతిలో చాలా విషయాలు మరపుకొచ్చేశాయి. వారికున్న అభిమానుల్ని అంచనా కట్టడం సాధ్యం కాదు. ఫెనటిక్స్ అయితేనే ఫ్యాన్స్ అనుకోవడం సరికాదు. ఇహపోతే ఈనాటి హీరోల పాపులారిటీ అంతా కులగజ్జి గుంపులకి సంబంధించినదేనని చెప్పడానికి మనమేమీ పి.హెచ్.డి. చెయ్యనక్కర్లేదు. ఈనాటి సినిమా రంగం సామాన్యుడికందుబాటులో లేదనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. నేను ఎవరినీ నిందించలేదు. పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పానంతే. ఎవరైనా అనూహ్యంగా భుజాలు తడుముకుంటే అందుకు నా బాధ్యత లేదని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.

 11. చొప్ప వీరభధ్రప్ప says:

  ఆయన్నుగూర్చి అంతగా తెలియకున్నను . ఉరి వేసుకోవడం సమర్థనీయం కాదు. కష్టాలు వస్తాయి పోతాయి. నేనేమొ పిరికి మనస్థత్వ అనుకుంటా. ఆట్లాంవారి నుండి
  తెలుసుకునే దేమీ వుండదు..తన్ను గూర్చి తనకు తేలియంది ఇతరుల కేం చెపుతాం. ఏదైనామంచిదని పిస్తే ,అది ప్రక్క వారికి సంఘానికి చెడు కానప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడమే మంచిది. ఎవ్వరూ శాశ్వతంగా వుండరు.మననుండీ ఎవరికీ కష్టాలు కలగరాదు.

 12. bhoom reddy narahari says:

  మనిషి క్రుంగి పోయినప్పుడు , జీవితం నిస్సారమని భావించి నప్పుడు , కన్నబిడ్డలు కూడా గ్రహించ నప్పుడు , మనిషి నిర్వేదనకు గురియవుతాడు . ఎంత తెలివి తేటలున్నా , ఎంత ఆధ్యాత్మిక జ్ఞానమున్నా ప్రారబ్ధ కర్మను ఎవేడూ తప్పించలేడు. బ్రతెకే అవసరముంటే ఆ ఈశ్వరుడే కాపాడుతాడు . అనుభవంతో చెప్పుతున్నాను . నేను మూడు సార్లు మృత్యు ముఖం నుండి బయటపడి , ఆధ్యాత్మిక పుస్తకాలూ రాస్తున్నాను . అనాథలకు అండగా నిలిచి ఆర్ధిక సాయం చేస్తూ 80 వ ఒడిలో జీవిస్తున్నాను . దేవుడు నాతొ ఈ పనులు చేయించడానికే మృత్యువును అడ్డుకుంటాడు .

  ఈ విషయం మీరు ఆవేదనతో రాసిందే కానీ , అతన్ని నిలదీయడానికి కాదని తెలుసు . మనం ఆ స్థితికి చేరుకుంటే గాని అర్థమవదు . ఒక్క సారి గీతలోని కర్మ యోగాన్ని లోతుగా చదివితే అతని మరణం యెడల సానుభూతిని చూపుదామె తప్ప అతడు చేసిన పనికి నిందించం . కావున అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం తప్ప నిలదీయడడం సరి కాదు . అతని చివరి కవిత ఎవరో పోస్ట్ చేస్తే చదివాను . ” ఎవరు దేవుడు ” చాకి రేవు బండనా ? గుళ్ళోని దేవుని విగ్రహమా ? అని నిలదీస్తాడు . కంపు బట్టలు బండకేసి బాదితే పవిత్ర (శుభ్రం ) అవుతాయి . ఇల్లు చేరుతాయి . కంపు మనుషులు శటగోపం తలపై పెట్టున కూడా ఇంటికి కంపుతోనే వేల్లుతారట . చూడండి ఈ మనుషుల మీద అతని అభిప్రాయం .

 13. దయచేసి వ్యక్తి నిర్ణయాలని అనుభవాలని గౌరవించండి.
  మన వ్యవహారిక సమస్యలైన నిరాశ నిస్పృహలు,ఆస్తి తగాదాలు,ప్రేమ వ్యవహారాలు,అప్పుల భాదలతోనే బలవన్మరణాలని బేరీజు వేయకండి.
  ఎంతో హుందాగా జీవించి భాద్యతలను నిర్వర్తించి మరెన్నో విజయాలను సొంతం చేసుకున్న రంగనాథ్ గారు స్పృహ తో తర్కంతో ఆలోచించి , అంతే హుందాగా జీవితాన్ని ముగించాలనుకోవడం బాధ కలిగించినా గౌరవించతగినది.వీలైతే తన తర్కానికి మూల వస్తువులైన డెస్టినీ,సామాజిక అంశాలని చర్చిద్దాం.అంతేగాని జాలి చూపి మన అనుభవాలతో ఇంకొకరి జీవితాన్ని అవమానించకండి.ఇది చరిత్రలో కొత్తేమీకాదు వింతేమీ కాదు.
  రంగనాథ్ గారి వ్యక్తిగత నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ హుందాగా సాగనంపుదాం.

  • Rajendraprasada Reddy says:

   మీ భావాలూ భావున్నై. రాగ్ననాథ్ గారి నిర్ణయాన్ని గౌరవిన్ధం.

 14. అయ్యా శ్రీ తెలుగు గారు.

  నేను కూడ రాసింది అప్పటి పరిస్థితుల గురించే, మీరు రాసిన విషయంలో కొద్దిగా అసంబద్దంగా కనపడితేనూ దాని గురించి మాత్రమే రాసాను. మీరు విషయాన్ని వదిలేసి, “భుజాలను తడుముకోకండి” అంటూ వ్యక్తిగతంగా వొస్తున్నారు. మీరలా వచ్చినా నేను వ్యక్తిగతంగా రాయను కేవలం విషయం గురించి మాత్రమే మాట్లాడతాను.

  నేను స్పష్టంగా చెప్పింది అదే ఇప్పటిలా కులస్పృహతో అప్పటి కాలం లేదు, ఇప్పటి వాతావరణాన్ని, ఇప్పటి కాలమాన పరిస్థితుల భావాలను అప్పటి కాలానికి ఆపాదించి మాట్లాడితే ఎలా అని మాత్రమే ప్రశ్నించాను. మీరు మళ్లీ ప్రస్తుత కాలం గురించి ప్రస్తావిస్తున్నారు. నేనేమి మాట్లాడానొ అన్నది కూడ గ్రహించలేని స్థితిలో మీరు కామెంట్స్ రాస్తున్నారు. ఇప్పటి కాల పరిస్థితులు వేరు. అప్పట్లో ఇప్పటిలా మీరంటున్న ఆ గజ్జిలన్నీను లేవు అని చెబుతున్నాను. విషయం గురించి మాట్లాడటానికి ఏమి లేనప్పుడు మాత్రమే భుజాలంటూ వ్యక్తిగతంగా దాడికి వొస్తారన్నది మీ కామెంట్ ద్వారా మళ్లీ నిరూపణ అవుతున్నది.

  నాకు ఆయనతో ప్రత్యక్ష సంబందం లేకపోయినా గత ఇరువై ఏళ్లుగా ఆయనను సమీపంగా ఎరుగుదును. ఆయన రచనలను చదివిన వాడినే. ఇక నేనడిగిన ప్రశ్నలకు మీ వద్ద సమాధానాలు లేవని అర్థమయ్యింది లేండి. అస్సల్ ఈ వ్యాసానికి సంబందం లేని సబ్జెక్ట్ ని తీసుకరావడమె ఒక అసంబద్దమ్.

  • శ్రీతెలుగు says:

   నేను ఎవరినీ వ్యక్తిగతంగా ఉద్దేశించి నా వ్యాఖ్య వ్రాయలేదు. రంగనాథ్ గారు చనిపోయిన సందర్భంగా వారి గురించి నాకున్న అభిప్రాయం తెలియజేశానంతే! అలాగే వారి కాలంలో వారి సహనటుల గురించీ! ఒక ప్రముఖవ్యక్తి చనిపోయి ఆయన గురించి స్మృతుల్ని కలబోసుకునే ఈ సందర్భంలో ఈ కాలంతో ఆ కాలాన్ని పోల్చడం తప్పెలా అవుతుందో నాకర్థం కాలేదు. “ఇలాగే స్మరించుకోవాలి. అలా స్మరించుకోకూడదు” అని నియమమేమైనా ఉందా? నాకు తెలీదు. ఒకవేళ అలాంటివి ఉండాలని కోరుకునేవారెవరైనా ఉంటే ఆ విషయమై పాఠ్యపుస్తకమేదైనా వ్రాయండి. చదువుకుని ఫాలో అవుతాం.

   ప్రశ్నలట. ఏం ప్రశ్నలు వేశారు? నాకెక్కడా కనిపించలేదే. తమరి అభిప్రాయం తమరు చెప్పారు.నా అభిప్రాయం నేను చెప్పారు. ఇందులో ప్రశ్నలూ ఛాలెంజిల ప్రసక్తి ఎక్కడిది? ఆ కాలపు నటుల గొప్పతనం అన్నాక ఓ పాతకాలపు మనిషిగా నాకు తరచుగా జ్ఞాపకమొచ్చే ప్రముఖ విషయం – కులసంఘాలూ, కులమీడియా అండ లేకుండా వారు ఎన్నికోట్లమంది ప్రేక్షకుల హృదయాలకి కేవల ప్రతిభాపాటవాల ఆధారంగా దగ్గరయ్యాన్నదే. నిరాక్షేపమైన ఈ వాస్తవం ఎవరికైనా ఎందుకు గుచ్చుకోవాలో నాకర్థం కాదు.

   మీ మొదటి వ్యాఖ్య చదివాక మీకు రంగనాథ్ గారు వ్యక్తిగతంగా తెలుసని గానీ, మీరాయన పుస్తకాలు చదివారని గానీ నాకు నమ్మకం కలగలేదు. మీకు ఆయన మీద అభిమానం ఉందనే అభిప్రాయం నాకిప్పటికీ కలగడం లేదు. అందుు నేను క్షంతవ్యుణ్ణి. మీతో వాదించడం కోసం నేనీ సైట్ కి రావడం లేదు. ఈ సైట్ లోని వ్యాసాలు చదివి ఎడ్యుకేట్ అవుదామనీ, వీలైతే నావి కూడా రెండుపైసలు ఆఫర్ చేద్దామనీ వస్తున్నాను.

 15. Jayashree Naidu says:

  నిర్ణయం వ్యక్తిగతం అయినా… చుట్టూ ప్రపంచం పట్ల మనకొక బాధ్యతా వుంటుందీ… ఎవరో తెలియని వ్యక్తి అయితే ఇంతటి చర్చ రాదు. ప్రత్యక్షం గానో పరోక్షం గానో సినీ తారలు మన జీవితాల్నీ ఆలోచనల్నీ ప్రభావితం చేస్తారు. అన్దులోనూ ఇంతటి హుందా వ్యక్తిత్వం వున్నా రంగనాధ్ గారి గురించీ బాధ పెల్లుబికి రావడం లో అసహజత్వం ఏమీ లేదు.. నాలాంటి ఎంతో మంది కి కలిగిన నిశ్శబ్దపు ఆవేదనాత్మక అభిమానానికి అద్దం పట్టారు మీరు.. థాంక్యూ సర్

 16. బి.విజయరమ. says:

  ఛచ్చేదాక మనిషి కి ఎవరో ఒకరు తోడుండాలి,ఏవో కొన్ని బాధ్యతలు మిగిలుండాలి. వార్ధక్యం లో మనసుకు వొంటరితనం తెలియని వ్యాపకం వుండాలి. సమాజంలో బ్రతుకుతూ ఆ సమాజంకువెలుపలవుంటు మనిషి అంతర్ముడై జీవిస్తే ఇలాంటి పరిణామాలే ఎదురౌతాయి.
  సమాజాన్ని చదవాడుగాని, సమాజం పట్ల బాధ్యతను ఫీల్ అయివుంటే
  ఆత్మహత్య చేసుకుని వుండే వాడుకాదేమో.ఇంకతనలాంటి వాళ్లతో కలసి
  చివరి దాక బ్రతుకు ప్రయాణం చేసుండేవాడెమో.
  బహుశ,మనిషి వొంటరిగపుడతాడు,వొంటరిగ చస్తాడు. మధ్యలో వెబంధాలు
  బాధ్యతలు అనిభావించివుంటాడు. అవితీరిపొయి తనకెంపనిలేదని భావించివుండొచ్చు. బంధాలు,బాధ్యతలు సమాజానికి విస్తరించాలి.లెకపోతే ఇలాంటి మరణాలు చూడాల్సివస్తుంది.ఈసమాజానికి రంగనాద్ అంటే
  ప్రేమవుంది.అందుకే ఈబలవన్మరణాన్నిజీర్ణించుకోలేకపోతున్నాం.

 17. Dr T.S.Chandra Mouli says:

  రామకృష్ణ గురించి ప్రస్తావించారు.అతను నటుడిగా గుర్తు పెట్టుకోవలసిన సినిమాలే చేసాడు.ఏ వేషం ఇచ్చినా చక్కగా చేసాడు.హీరో గ వచ్చినా, భేషజాలు లేకుండా నటించాడు.అదృష్టం ఎల్లప్పుడు ఒకేలా ఉండదు.కాల ప్రభావం కాదని ఎవరు ఏమి చేయ లేరు.పోలికలు వద్దు.అందరు మంచివాళ్ళే , నటులే.గౌరవిద్దామ్ అందరిని. మధ్యలో వెళ్ళిన వాళ్ళను గురించి బాధ తప్పదు.

 18. ప్రేమ కంటే భాద్యతే గొప్పది అని , మన సన్నిహితులకు అవసరమైనప్పుడు సేవ చేయటం లో భాద్యత మాత్రమే వుంటుందని నమ్మి , వాదించి . చైతన్య గారితో కూడా కంట తడి పెట్టించారు రంగనాథ్ గారు ఒక ఇంటర్వ్యూ సందర్భం లో … కాని ఆమె గతించిన తరువాత ప్రేమతోనే భాద్యత నేరవేర్చినట్లు గ్రహించి ఆమె లేకపోవడాన్ని తట్టు కోలేక పోయారేమో ….మానవ సంభంధాల్లో ప్రేమే కదా అంతస్సూత్రం …. ప్రేమలేని భాద్యత సంతోశాన్నివ్వదు మనల్ని మనకే బరువని పించెట్లు చెస్తున్ ది.ఎవరి మీద ఆధారపడ కుండా జీవిన్ చటం కష్తం బహుసా ఈ రకమైన ఆలోచనలే ఆయనను అయోమయ అవస్తకు నేట్టయేమో…..ఏది ఏమైనా ఆయన కవితల్లాగే ఆయన జీవిత నిష్క్రమానము మనసుని కుదిపేసింది……కష్ట సుఖాల లోతులు అంచులు చుసిన జ్ఞానీ లాంటి ఆయన నిర్ణయాన్ని మనమెలా బేరీజు వెయ గలం… రంగనాథ్ is రంగనాథ్ … still we admire him as a గ్రేట్ హీరో, poet , అన్నింటిని మించి ఒక మంచి మనిషి గా , స్నేహితుడిగా , ఆదర్శ వంతమైన భర్త గా , తండ్రిగా … ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్దిస్తున్నా

 19. G B Sastry says:

  బతకడానికి చస్తున్నారు ఎందరో,బతుకెందుకని చస్తున్న కొందరు,
  నువ్వోకందుకు పోస్తుంటే నేనోకందుకు తాగుతున్నాననుకొన్న
  తీరులో సాగే జీవన యాత్రలో ఎవరుచేస్తున్న ఏపనికైనా అర్ధం
  పరమార్ధం ఉందనుకొని వెతకడం వ్యర్ధమనిపిస్తోంది. జరుగు
  తున్నవి చూస్తుంటే చావడానికి చంపడానికి వెనుకాడని లోకం
  మన ముందు ఆవిష్కరించబడింది ఇందులో విలువలు బంధాలు
  బాంధవ్యాలు వేడుకులాడడం ఎడారిలో మరీచికేనేమొ అనిపిస్తోంది

 20. జరిగి పోయిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని భవిష్యతులో ఆత్మహత్యలు జరుగకుండా మానసిక వైద్యులు .సామజిక సేవ సంస్థలు, ప్రభుత్వము,కుటుంబ సభ్యులు రంగనాద్ ఫౌండేషన్ స్థాపించి మేధావుల మేధస్సును వినియోగించుకోవాలి.

 21. Aranya Krishna says:

  ఆత్మహత్యల మీద ప్రతిస్పందనని ఆత్మహత్య చేసుకున్నవారికి పాఠాలు నేర్పటంగానో, లేదా ఆ వ్యక్తిని ప్రశ్నించటంగానో, ఖండించటంగానో చూడకూడదు. మనిషి చనిపోయాక కూడా ఆ వ్యక్తితో అనుబంధం వున్న ఇతరుల జీవితాలు ప్రభావితం అవుతుంటాయి. ఆత్మహత్యల మీద ప్రతిస్పందనని ఇలాగే అర్ధం చేసుకోవాలి. రంగనాధ్ ని ఉదయ్ కిరణ్ ప్రభావితం చేయలేదని చెప్పగలరా? మొగుడు మీద కోపం వచ్చి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునే ఇల్లాళ్ళ ఉదంతం వింటుంటారు కదా. ఊరంతా అప్పులు చేసి పెళ్ళాం బిడ్డలకు విషం ఇచ్చి తానూ ఆత్మహత్య చేసుకోవటాన్ని “వాడి జీవితం వాడిష్టం” అని సూత్రీకరిస్తారా? అప్పులిచ్చిన వాళ్ళు, అమాయకులైన భార్యా పిల్లల సంగతి? ఇక్కడ రంగనాధ్ ఒక అద్దె ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఇంటి యజమానుల పరిస్తితి ఏమిటి? ఒక్కసారి మీరా ఇంటి యజమానిలా ఆలోచించండి. ఆత్మహత్య చేసుకున్న ఇంటిలోకి ఎవరూ అద్దెకి దీగరు. నేను చాలా ఇళ్ళు చూసాను. ఇది మీకు చాలా సిల్లీగా కనబడుతుంది. చావులో కూడా బాధ్యత ఉండాలి. ఎందుకంటే చావటానికి నిర్ణయం మనిషిగా తీసుకునేదే. చిట్టచివరి ఊపిరి వరకు మానవీయ షరతులు అన్నీ వర్తిస్తాయి. చచ్చేవాడికి ఈ షరతులేంటి అంటారా? అయితే రంగనాధ్ ఇంటి యజమానిగా ఆలోచించండి. నాకూ రంగనాధ్ అంటే ఒక కళాకారుడిగా, మనిషిగా చాలా అభిమానం వుంది. శింగీతం శ్రీనివాసరావంతటి సృజనాత్మక దర్శకుడు కమల్ హాసన్ తో జత కలవక ముందు రంగనాధ్ మీదే ఆధారపడ్డాడు. అద్భుతమైన వాచకం రంగనాధ్ సొత్తు. హీరోగా ఎంత హుందాగా చేసాడొ విలన్ గా కూడా ఆయన వికటాట్టహాసాలు లేని క్రూరత్వాన్ని చక్కగా చూపాడు. అంతిమ తీర్పు, సాంబయ్య లాంటివి చాలా ఉదాహరణలు వున్నాయి. ఒక కారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన నిజం సినిమాలో అద్భుతంగా చేసాడు. రంగనాధ్ మరణం బాధాకరమే కాదు అత్యంత విస్మయకరం. కేవలం సినిమాకి మాత్రమే కాకుండా మనిషి గురించి, సమాజం గురించి బాధ్యతగా ఆలోచిస్తూనే, మరో పార్శ్వంలో డిప్రెషన్లో వుండే రంగనాధు లాంటి వాళ్ళు మరెవరైనా వుంటే బమ్మిడి జగదీశ్వర రావు వేసిన ప్రశ్నలు వాళ్ళకే తగులుతాయి. దయచేసి సరిగా అర్ధం చేసుకోండి.

 22. G B Sastry says:

  ఇలా బతకాలని అనుకుని,అలా బతక లేకుంటె,
  అలాటి బతుకు బతకతగినదికాదనుకుంటే,చావుకు
  వెరవని మనస్థితిఉంటే,ఆభావన తొలగించి ప్రేమతొ
  విరమింపచేసేవారెలేకుంటె మనుషులు చావకేంచేస్తారే
  ఓ గులుకు రాణి

 23. Hemalata.Ayyagari says:

  నేను శ్రీ తెలుగు వ్రాసినదనితో సంపూర్తిగా.ఏకీభవిస్తాను. రంగనాథ్ గురించి ,ఆయన చావుగురించి నా అభిప్రాయాలూ ఏమైనా ఎప్పటి హీరోలు సరుకు తక్కువ హైప్ ఎక్కువ. కేవలం స్టార్ పరివార్ మాత్రమే హీరోలుగానిలదోక్కుకిగాలుగుతోంది. వాళ్ళకు ముఖ కవలికలతో,వాక్కు తో ,అభినయంతో పని లేదు.అభిమానులు,స్స్న్ఘాలు,మీడియా వల్కని బుజాల పై మోసి గొప్పవాళ్ళని చేస్తున్నారు. ఇప్పుడు ఒక సామాన్యుడు హీరో మాట దేవుడెరుగు కనీసం సహాయ నటుడిగా నిలబడటం కూడా అసాధ్యం.

 24. Hemalata.Ayyagari says:

  పైన నేను వ్రాసిన దానిలో కొన్ని అచ్చు తప్పులు. ఇప్పటి హీరోలు, వాళ్ళని అభిమానులు ,సంఘాలు,మీడియా బుజాలపై ఎత్హుకొని మోస్తున్నారు.

 25. పద్మ వంగపల్లి says:

  మనిషితనం మాయమైపోతున్న వేళ, ఇలాంటి సంఘటనలు మరిన్ని పెరుగుతాయోమో, ఎవరికీ తెలియని సామాన్యులు, అందరికీ తెలిసిన అసామాన్యులు అలాంటి మానసిక స్థితిలోకే వెళ్తారేమో..మనం ఎవరికి ఎంత సమయం కేటాయించి ,నేనున్నానే, లేదంటే మేమున్నామనే భరోసా ఇస్తున్నామో చెప్పండి?

  • G B Sastry says:

   చక్కగా చెప్పావు తల్లి, ఈరోజుల్లో మరొకరికి కాదు తమకి తామే తామున్నామన్న భరోసా ఇచ్చుకోకుండా, పూర్తిగా తెగిన గాలిపటాల్లా సాగుతున్న జీవితాలు. విలువలు,ఆప్యాయతలు అంతః కరణలన్నవి కనుమరుగైపోయి దేనికోసం పరుగులెడుతున్నామో తెలియకుండా గడుపుతున్నాం జీవితాన్ని పిచ్చివాడి చేతిలోని రాయికన్నా అర్ధరహిత మయిన ప్రాదాన్యాలతో జీవిస్తున్నాము మనం
   జీ బీ శాస్త్రి
   సంచార వాణీ 9035014046

 26. రంగ నాధ్ అయినా మరెవరైనా ఆత్మా హత్యను గ్లోరి పై చెయ్యకూడదూ. మరీ రంగనాథ్ లాంటి సెలెబ్రటీల గురించి. వారిని ఆదర్స ప్రాయంగా తీసుకొంటూ అనేక మంది అమాయక ప్రాణులుంటారు .

 27. Ramana Yadavalli says:

  ఇక్కడ జరుగుతున్న చర్చకి ఈ సమాచారం కొంత ఉపయోగపడొచ్చు.

  http://www.nhs.uk/conditions/Suicide/Pages/Causes.aspx

 28. కనులు చెమర్చాయి జగదీశ్వరరావు గారు!

 29. ఎ.కె.ప్రభాకర్ says:

  ‘ఇక మీదట యెప్పుడూ మీ కథ.. జీవితాన్ని మీరు ముగించిన చోట మాత్రమే ఆరంభిస్తుంది!’
  ఎంత హృదయ విదారకమైన మాట బజరా! ఒక వాక్యంలో వేయి కవితలు జీవిత శకలాలు చావు మేళాలు ధ్వనించాయి కనిపించాయి వినిపించాయి.

 30. http://www.sakshi.com/news/family/ranganath-sun-and-doughter-soecial-interview-for-sakshi-family-302363

  రంగనాథ్ గారి మరణం గురించి వారి కుటుంబం … (సాక్షి ఇంగ్లీష్ చూడండి :) )

 31. విజయ్ కోగంటి says:

  కీ.శే. రంగనాథ్ చాలా గొప్ప నటులు. ఆవేదన కలిగించే కాలమేదైనా బాధాకరమే! ఆలోచింపచేసిన వ్యాసం.

 32. G B Sastry says:

  చిందరవందరైతే బతుకుని చక్కదిద్దుకొని,అతుకులేసుకుని
  చిరుగులని కనబడకుండాచేసుకొని,జీవితాన్ని గడపాలేగాని
  ఇంట్లోనల్లులుచేరాయని ఇంటికి నిప్పెట్టుకున్నట్లు చావరాదే
  ఇక్కడివికన్న అక్కడికష్టాలు ఎక్కువైతే ఇంకెక్కడకిపోగలమే
  ఓ గులుకు రాణి

 33. బమ్మిడి గారి తో నేను ఏకీభవిస్తాను–రవి కొలికపూడి-

మీ మాటలు

*