స్పీడ్ ఇన్ టు టైమ్!

 

sidhareddiచీకటి .

ఇది ఎప్పటికీ ఇలానే ఉండిపోతే ఎంత బావుణ్ణో! ఈ చీకటిలో ఎవరూ లేరు. నేనూ లేను! అంతా శూన్యం. ఈ శూన్యం నుంచి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఎక్కడికో వెళ్లిపోవాలనే తీవ్రమైన కోరిక. అలా వెనక్కి వెనక్కి వెళ్లిపోతూ, బిగ్‍బ్యాంగ్ కంటే ముందు కి వెళ్లిపోతే ఇంకా బావుంటుందేమో. తను, నేను, ఈ విశ్వం, భూమి – అసలేమీ లేనప్పుటి రోజులకి.

లేడీస్ అండ్ జెంటిల్మెన్, టుడే వుయ్ ప్రౌడ్లీ ప్రెజ్ంట్ టు యూ…

వెలుగు.

ఫోకస్ లైట్ వచ్చి మీద పడింది. భరించలేని వెలుతురు. మోయలేని భారం. హాలు నిండా జనాలు. ఎవరు వీళ్లంతా? తండ్రి కి దూరమైన కొడుకు, ప్రియురాలిని పోగొట్టుకున్న ప్రియుడు, ప్రేమించడం చేతకాని అసమర్థుడు, ఓడిపోయి గెలవాలనుకునే తపనతో రగిలే యోధుడు, మోసగాడు, ఎత్తుకు పై ఎత్తు వేసేవాడు, అన్నీ పోగొట్టుకున్న పనికిరాని వాడు – జీవితంతో పోరాటానికి దిగిన సైనికుల సమూహం.
…ది ఒన్ అండ్ ఓన్లీ , రఘురామ్.

చప్పట్లు. ఫ్లాష్ లైట్లు. జనాలు.

స్టేజ్ మధ్యలోకి నడిచాను. ఫోకస్ లైట్ నన్నే ఫాలో అయింది. రెండు చేతులెత్తి ఆడియన్స్ వైపు చూశాను. ట్రేడ్‍మార్క్ విన్యాసం. రేపు హెడ్‍లైన్స్ లో ఇదే ఫోటో. రఘు రాక్స్ ది టెక్నోకాన్ఫరెన్స్.

ఆడిటోరియంలో కూర్చుని ఎదురుచూస్తున్న జనాలు.

స్టేజ్ మీద నేను. నా జీవితం ఇంకెక్కడో నాకు సంబంధం లేకుండా గడిచిపోతోంది.. ప్రపంచంలో ఏదో మూల ఎవరో ఇప్పుడే కంప్యూటర్ ముందు కూర్చుని నా కంపెనీ షేర్స్ కొందామా వద్దా అని ఆలోచిస్తుంటారు. కొంటే నా మీద మరి కొంత భారం. ఇంత భారం నేనెలా మొయ్యాలి? మోయగలనా?

ఒక క్షణం కళ్లు మూసుకున్నాను. ఒక జ్ఞాపకం ఫ్లాష్ లా మెరిసింది. హాయిగా నిద్రపోతున్నట్టుగా బెడ్ రూంలో పడుకునొందొక ఆవిడ. పక్కనే డాక్టర్లు. వాళ్లని పట్టుకుని భోరున ఏడుస్తున్న ఒక పిల్లవాడు. అతని పక్కనే నిల్చుని వాడిని పట్టుకుని ఏడుస్తోన్న ఇద్దరు ముసలివాళ్ళు. పక్కనే మరొక బెడ్ రూంలో బెడ్ పై పడుకుని ఫ్యాన్ వైపే చూస్తోన్న ఒక వ్యక్తి.

గొంతు సవరించుకున్నాను. ఆడిటోరియంలో మసగ్గా కనిపిస్తున్న ప్రేక్షకుల వైపోసారి చూశాను. ఎంతమంది జనాలు! నా పేరు రఘురామ్. అది అందరికీ తెలుసు. కానీ నేను ఎవ్వరికీ తెలియదు; చివరికి నాక్కూడా!

వీళ్లల్లో ఏ ఒక్కరికైనా నేను తెలిసుంటే ఈ వేషం తీసేస్తాను. ఈ జీవితం చాలించేస్తాను. ఎక్కిన మెట్లన్నీ దిగేసి, కాలం అద్దిన రంగులన్నీ కడిగేసి, వెనక్కి, ఇంకా వెనక్కి వెళ్లిపోతాను. బిగ్‍బ్యాంగ్ అంత వెనక్కి కాకపోయినా, యూనివర్శిటీ కారిడార్లో నా వైపు నడిచొస్తూ ఆమె చూసిన ఓర చూపులో కాలి బూడిదైపోతాను. ఆ బూడిదలోనుంచి ఏక కణ జీవిగా గా ఆవిర్భవిస్తాను. జీవితాన్ని మళ్లీ మొదట్లో ఆరంభిస్తాను.

మరి ఇన్నాళ్ల నీ కష్టం సంగతేంటి? – వెయ్యి గొంతుకలు ఒక్కసారే అడిగాయి.

పది సంవత్సరాల్లో మూడు స్టార్టప్స్. మల్టీ మిలియన్ డాలర్స్. క్లోజ్ టు బిలియన్.

సాధించింది కొండంత. కోల్పోయింది విశ్వమంత.

 

…టుడే ఇండియా హాజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్. ఫ్రమ్ ధ్రీ ధౌజెండ్ స్టార్టప్స్ యాన్ ఇయర్ బ్యాక్, టు ఏ ప్రొజెక్టెడ్ ఫిఫ్టీన్ థౌజెండ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్… ఏ న్యూ ఎరా ఫర్ స్టార్టప్స్ హాజ్ బిగన్.

స్పీచ్. అంతా ప్రిపేర్డ్. ఎవరో రాసిచ్చింది. ఇంతకుముందు ఇంకో దగ్గర మాట్లాడిందే!

మాట్లాడ్డం మొదలుపెట్టగానే తను నడిచొచ్చింది. ఎదురుగా కూర్చుంది. అంత ఎత్తులో ఎలా కూర్చుంది? ఎదురుగా మరొక స్టేజ్ ఉందా? బ్యాగ్ లోనుంచి ఫ్లాస్క్ తీసి బయట పెట్టింది. అందులో వేడి నీళ్లు. ఇంకో పక్కన రేడెల్ శృతి బాక్స్ పెట్టుకుంది.

నాకిప్పుడు ముప్ఫై ఐదు. తనింకా అప్పట్లానే ఉంది.

ఫరెవర్ ట్వంటీ వన్. పడి పడి లేచే వయసు.

తను పాడడం మొదలుపెట్టింది.

రాగం మోహనం. తాళం ఆది. రచన పూచి శ్రీనివాస అయ్యంగార్.

నిన్ను కోరి యున్నానురా,
నిఖిల లోక నాయకా.
నన్ను పాలింప సమయము రా.

నువ్వు తాళం సరిగ్గా వేయటం లేదు. ఎన్ని సార్లు చెప్పాలి. ఇంత సింపుల్ విషయం ఎందుకు అర్థం కాదు నీకు? పేరుకి పెద్ద మ్యాథ్స్ జీనియస్. ఇంకోసారి చెప్తాను. ఇదే లాస్ట్ టైం. సంగీతానికి శృతి, లయ ప్రధానం.
ట్యాప్. ఒన్ టూ థ్రీ. ట్యాప్. టర్న్. ట్యాప్. టర్న్. అర్థమైందా? ఇది ఆది తాళం. ఏంటా తలూపడం? నీతో సమస్య ఏంటో తెలుసా? నువ్విక్కడ ఉండవు. ఉంటే గతంలో లేదా భవిష్యత్తులో. ప్లీజ్ బి విత్ మి. రైట్ హియర్. రైట్ నౌ.

ట్యాప్. ఒన్ టూ థ్రీ. ట్యాప్. టర్న్. ట్యాప్. టర్న్.

Kadha-Saranga-2-300x268

పోడియం మీద మెల్లగానే ట్యాప్ చేశాను. కానీ మైక్ క్యాచ్ చేసేసింది. చప్పట్లు కొడుతున్నారనుకున్నారో, చప్పట్లు కొట్టమని సిగ్నల్ చేస్తున్నాననుకున్నారో, ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది.

తను నన్నే చూస్తోంది. నవ్వుతోంది.

ఆ నవ్వులో ఎన్నో ప్రశ్నలు. విన్నావా? వింటున్నావా? ఈ చప్పట్లకోసమేగా నువ్వింత వేగంగా పరిగెత్తుకు వెళ్లిపోయింది? కానీ ఈ చప్పట్ల శబ్దం వెనుక ఏం వినిపిస్తోంది? ఔట్ ఆఫ్ ట్యూన్, ఔట్ ఆఫ్ పిచ్, ఔట్ ఆఫ్ రిథమ్ – అర్థమవుతోందా? అందుకే తాళం ఎలా పెట్టాలో ప్రాక్టీస్ చెయ్యమనేది. గుర్తుందా?

సంగీతానికే కాదు, జీవితానికి కూడా శృతి, లయ ఉండాలని తను నాకెందుకు చెప్పలేదో?

… రేపు లేదు. ఏదేమైనా, ఇవాళే మొదలు పెట్టండి. మీరు చెయ్యకపోతే ఇంకొకరు మీ అవకాశాన్ని దోచేస్తారు. ఎప్పుడూ లేనంత కాంపిటీటివ్ ప్రపంచం ఇది. స్టార్ట్ సమ్‍థింగ్ గుడ్. అండ్ లెట్ టుడే బి దట్ డే.

స్పీచ్ అయిపోయింది. స్టాండింగ్ ఒవేషన్.

ట్యాప్. ఒన్ టూ థ్రీ. ట్యాప్. టర్న్. ట్యాప్. టర్న్. ఆది తాళం. తను నాకు నేర్పించిన మొదటి సంగీత పాఠం.

లైట్సాగిపోయాయి. తనూ చీకట్లో మాయమైంది. తన పాట మాత్రం ఆగలేదు.

తనిక్కడ లేదని తెలుసు. కానీ ఎక్కడ చూసినా తనే ఎందుకు ఉంది?

*****
సర్ వి హావ్ టు ఫ్లై టు చెన్నై, ఫ్రమ్ దేర్ టు అబుదాబీ అండ్ దెన్ టు జోహెనెస్‍బర్గ్.

చెన్నై?

యెస్ సర్. ఇక్కడ్నుంచి బిజినెస్ క్లాస్ దొరకలేదు. సో…, ఇబ్బందిగా చెప్పాడు మిస్టర్ శివరామ్.

ఇట్సాల్‍రైట్ అన్నాను.

నిజానికి ఇట్ ఈజ్ నాట్ ఆల్రైట్. చెన్నై. ఆ ఊరి పేరు వింటేనే పాత జ్ఞాపకాలేవో అలల్లా ఎగిసిపడతాయి. ఊపిరాడకుండా చేస్తాయి. కానీ ఇప్పటికిప్పుడు ట్రావెల్ ప్లాన్ మార్చడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే సరే అన్నాను. లండన్ టు బెంగుళూర్. ఒక రెండు గంటలు హోటల్లో నిద్ర. టెక్నోకాన్ఫరెన్స్. ఆఫ్టర్ పార్టీ. మరో గంట నిద్ర. ఇంకాసేపట్లో బెంగుళూర్ టు చెన్నై ఫ్లైట్. అక్కడ్నుంచి ఇంకో రెండు ఫ్లైట్స్.

48 గంటల్లో నాలుగు ఫ్లైట్స్. జీవితం ఎంత ఫాస్ట్ గా గడిచిపోతుందో? పగలు, రాత్రి తేడా తెలియకుండా ఉంది. క్యాబ్ లో వెనుక సీట్లో కూర్చుని కళ్లు మూసుకున్నాను.

ఒక పెద్ద సూట్‍కేస్ ని లాక్కుంటూ చెన్నై ఎయిర్‍పోర్ట్ దగ్గర త్రిశూలం రైల్వే స్టేషన్ లో దిగాడొక యువకుడు. మరో చేతిలో క్యాబిన్ బ్యాగేజ్. మోయలేని బరువు. అరకిలోమీటర్ దూరం. సబ్‍వే లో ఆ లగేజ్ లాక్కుని వచ్చేసరికి చెమటలు పట్టిపోయాయి. ఎయిర్‍పోర్ట్ లో జనాలు చాలామందే ఉన్నారు. ప్రయాణం చేసే వాళ్లకంటే వాళ్లని సాగనంపడానికి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అమ్మలు, నాన్నలు, అత్తలు, మామయ్యలు, బాబాయిలు, పిన్నిలు, పిల్లలు, పెద్దలు – తను మాత్రం ఒంటరిగా! ఏడుపొచ్చిందతనకి.

కళ్లు తెరిచాను. బెంగుళూర్ ఎయిర్‍పోర్ట్ ఎక్స్‌ప్రెస్‍వే మీద కారు వేగంగా వెళ్తోంది.

కళ్లు మూస్తే చాలు. ఏదో ఒక పాత జ్ఞాపకం వరదలా తడిపేస్తోంది. అసహనంగా సీట్లో కదిలాను.

శివరామ్ వెనక్కి తిరిగి, ఆర్యూ కంఫర్టబుల్ సర్? అన్నాడు.
ఐ యామ్ ఆల్రైట్ అని చెప్పి సీట్లో వెనక్కి వాలాను. బెంజ్ కార్లో ఏసి వేసుకుని కూర్చున్నా ఇబ్బందిగా కదుల్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. కానీ నా గురించి ఇతనికేం తెలుసు. పాపం అనుకున్నాను.

పదిహేనేళ్ల క్రితం. జనాలతో నిండిపోయిన నెల్లూరు స్టేషన్ లో ఒంటరిగా నేను. హౌరా ఎక్స్‌ప్రెస్. ఓ కొన్ని గంటలు లేటుగా వచ్చింది. దూసుకెళ్లే అలవాటు లేదు. అంతటి దూకుడూ లేదు. అందరికంటే వెనుక. కష్టపడి ఒక చేత్తో గేట్ దగ్గర ఒక కాలు పెట్టుకునేంత స్థలం. ఒక చేతిలో చిన్న సూట్‌కేస్. మరొక చేతిలో ప్రాణాలు. ఎంతసేపు అలా నిలబడ్డానో తెలియదు. కావలి చేరుకునే లోపలే ఎక్కదో దగ్గర పడిపోయి చచ్చిపోతానేమోనంత భయం. నాన్నంటే విపరీతమైన అసహ్యం వేసింది. ట్రైన్ స్టేషన్ దాటి వెళ్లినంత సేపూ రిజర్వేషన్ కంపా‌ర్ట్‌మెంట్ లో కంఫర్టబుల్ కూర్చున్న వాళ్లు, తమని సాగనంపడానికి వచ్చిన వాళ్లకి టాటా చెప్తూనే ఉన్నారు.

రిజర్వేషన్ చేపించడానికి డబ్బులు లేవు. అమ్మని హాస్పిటల్ లో చూపించడానికి డబ్బులు లేవు. ఇంట్లో టీవి కొనడానికి డబ్బులు లేవు. నాకు సైకిల్ కొనడానికి డబ్బులు లేవు. ఎందుకో, నాన్న దగ్గర దేనికీ డబ్బులుండవు?

నీతో సమస్య ఏంటో తెలుసా?

నేనేదో చెప్దామనుకునే లోపలే తనే మళ్లీ మొదలుపెట్టింది. ఎందుకిలా కష్టపడి వేళ్లాడ్డం. చేతిలోని ఆ బరువు ని పడేసెయ్. కొంచెం ఈజీగా ఉంటుంది – అంది.

నాకున్నవి ఇవే బట్టలు. ఎలా పడెయ్యగలను?

భారమైనప్పుడు దేన్నైనా వదిలెయ్యడమే!

ట్రైన్ వేగంగా వెళ్తోంది.

నీకేం. ఎన్నైనా చెప్తావు. అసలు నువ్వు ఎలా గాల్లో ఎగరగలుగుతున్నావు?

బికాజ్ ఐ యామ్ ఫ్రీ.

తను ఎగిరిపోయింది. నేనింకా అక్కడే ఉన్నాను. పదిహేను సంవత్సరాల క్రిత్రం నేను పట్టుకుని వేలాడిన ట్రైన్ రాడ్ ఇంకా చేతిలోనే ఉంది. భుజాలు లాగేసే నొప్పి ఇప్పటికీ తెలుస్తుంది. చెమటలు పట్టి చెయ్యి జారిపోయి చచ్చిపోతానేమోనన్న భయం వెంటాడుతూనే ఉంది. ఎలాంటి సందర్భంలోనైనా జీవితం కంఫర్టబుల్ ఉండగలిగేంత డబ్బు సంపాదించాలన్న కసి ఇంకా రగులుతూనే ఉంది.

SpeedIntoTime (1)ఎక్స్‌ప్రెస్ వే మీద కారు ఆగింది. ముందెక్కడో యాక్సిడెంట్ అయినట్టుంది. ట్రాఫిక్ జామ్. ఉదయం మూడు దాటింది. కారు కిటికీ అద్దాలను మంచు మసగ్గా కప్పేసింది. కారులో హోటల్ కాలిఫోర్నియా పాట ప్లే అవుతోంది.

Up ahead in the distance, I saw a shimmering light
My head grew heavy and my sight grew dim
I had to stop for the night
There she stood in the doorway;

ఆమె రోడ్ పక్కన నిలబడి ఉంది.

ఒక చేతిలో క్యాండిల్ లైట్. మా కారు దగ్గరకి నడిచొచ్చింది. ముందు సీట్లో క్యాండిల్ లైట్ వెలుతురులో ఎవరికోసమో చూసింది. ఆ వెలుగులో తనెవరో అర్థమైంది. మసక వెలుతురులోనూ ఆమె సన్నటి ముక్కు, పొడవాటి మొహాన్ని గుర్తుపట్టాను. నాకు మాత్రమే తెలిసిన తను, వెనక కిటికీ దగ్గరకొచ్చి ఆగింది. అద్దం పైకెత్తి ఆమెను చూడాలనిపించింది. కానీ ఆమె నా కళ్లల్లోకి చూడగానే బిగుసుకుపోయాను. ఆమె తన వేలితో కిటికీ అద్దం పై కప్పిన మంచులో వేలితో మెల్లగా ఏదో రాసింది. తన మరో చేతిలో ఉన్న క్యాండిల్ ని ఎత్తి ఆ అక్షరాలకు వెలుగు చూపించింది.
మైత్రేయి
*****
ఆమె చూపు, ఆమె జ్ఞాపకం చుట్టూ నా జీవితమంతా ఘనీభవించుకుపోయిందని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది.

చెన్నై విజయ హాస్పిటల్ లో కారిడార్లో నిల్చుని ఉంది తను. వీసా పేపర్స్ పట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాను. లాస్ట్ మినిట్ వరకూ ఏమీ తేలలేదు. రాత్రి ఫ్లైట్ కి బయల్దేరి వచ్చెయ్యమని లండన్ నుంచి ఆర్డర్స్.
ఇప్పుడెలా? అంది.

నేను వెళ్లాలి.

అంకుల్ ని ఈ పరిస్థుతుల్లో వదిలేసి?

నన్నేం చెయ్యమంటావు మైత్రేయి? ఎప్పుడూ ఇంతేనా! నా జీవితంలో అడుగడుగునా అడ్డంకులేనా. నన్ను ముందుకెళ్ళకుండా కాళ్లకు వేసుకున్న గుదిబండ నాన్న. ఎగరనీయకుండా రెక్కలు విరిచిన రాక్షసుడు నాన్న.

ఫర్ గాడ్ సేక్. హి హాడ్ ఏన్ హార్ట్ ఎటాక్. యూ కాన్ట్ స్పీక్ లైక్ దట్. హి ఈజ్ యువర్ ఫాదర్.

అద్దాల కిటికీలోనుంచి సాయంకాలపు ఎండ నా కళ్లల్లో పడుతోంది. ఏంటీ బంధాలు? వీటిని వదిలించుకోలేమా? కళ్లు మూసుకున్నాను. ఈ చీకటి నయం. ఇక్కడ ఎవరూ ఉండరు. రెండేళ్లు, పగలూ రాత్రి కష్టపడితే వచ్చిన ఆన్‍సైట్ ఆఫర్. నా కలల ప్రపంచంలోకి మొదటి మెట్టు. కానీ ఇదే ఆఖరి మెట్టు కాబోతోందా? భరించలేని బాధ. ఒక్కసారిగా గట్టిగా అరిచేశాను. కష్టపడడం, బాధపడడం తప్ప నాకింకేమీ తెలియదు. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? ఏంటీ శాపం?

మా బంధువులంతా నన్నే చూస్తున్నారు. తను నన్ను దగ్గరకు తీసుకుంది. ఏంటి రఘు, చిన్న పిల్లాడిలా. నువ్వు బయల్దేరు. అంకుల్ ని నేను చూసుకుంటాను, అంది. థాంక్స్ చెప్పాలో, సారీ చెప్పాలో కూడా తెలియని దయనీయ స్థితి నాది. ఆమె కళ్ళల్లోకి చూశాను. ఆమె చూపుకి అర్థం తెలియదు. ఐసియూ లో ఉన్న నాన్న మొహం కూడా చూడకుండా బయల్దేరాను. వెనక్కి తిరిగితే, వెనకడుగు వేస్తాననే భయం. పరుగులాంటి నడకతో హాస్పిటల్ నుంచి భయటపడ్డాను.

వీటన్నింటిని మర్చిపోవడానికి ఇంకెన్ని జన్మలు పడుతుందో! కాలంలోకి వేగంగా వెళ్లిపోతే దూరం పెరిగి ఈ జ్ఞాపకం కనుమరుగవుతుందనుకున్నాను. కానీ ఒక రాత్రి లండన్ లో అది ఎంత అబద్ధమో తెలిసి వచ్చింది.
*****
అమ్మకి ఒకటే కోరిక ఉండేది. మీ నాన్నను ఎప్పటికైనా ఒక్కసారి ఫ్లైట్ ఎక్కించరా అని అడిగేది. ఏం నువ్వు ఎక్కవా? అని అడిగితే, అమ్మో నాకు భయం అనేది. అమ్మ అందరికంటే ముందే ఎగిరిపోయింది.
నా చిన్నప్పుడు, ఇందిరాగాంధీ, ఎలక్షన్ క్యాంపైన్ కి హెలికాప్టర్ లో నెల్లూరు వస్తుందని తెలిసి, నన్ను కూడా తీసుకెళ్లాడు నాన్న. అందరూ ఇందిరాగాంధీ ని చూడ్డానికి వెళ్తే నాన్న మాత్రం గ్రౌండ్ దగ్గర నిల్చుని, నన్ను భుజం మీద ఎక్కించుకుని చాలా సేపు నాకు హెలికాప్టర్ నే చూపించాడని చెప్పేది అమ్మ.

మరి ఎందుకు నాన్నా? ఎగిరిపోవాలనే నా ప్రతి ప్రయత్నానికీ అడ్డు తగిలావ్?

నాన్న నాకు ఎప్పటికీ అర్థం కాడు. బహుశా నేను కూడా నాన్నకు ఎప్పటికీ అర్థం కానేమో! టైం చూసుకున్నాను. ఐదున్నరైంది. ఫ్లైట్ చెన్నై చేరడానికి ఇంకో పదిహేను నిమిషాలు పడ్తుందేమో! ఎన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ చెన్నై లో అడుగుపెట్టడం? ఆ రోజు విజయ హాస్పిటల్ నుంచి బయల్దేరింది, మళ్లీ వెనక్కి తిరిగి చూసింది లేదు. ఇండియాకి చాలా సార్లే వచ్చాను. కానీ చెన్నై కి రావాలంటేనే ఏదో భయం.

నా భయం వృధా పోలేదు. చెన్నై లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై ఎయిర్‍పోర్ట్ రన్ వే మొత్తం నీటితో నిండిపోయింది. అతి కష్టం మీద ల్యాండింగ్ అయింది. వర్షంలో తడుస్తూనే అందరం ఎయిర్‍పోర్ట్ లౌంజ్ లోకి చేరుకున్నాం.

అన్ని ఫ్లైట్స్ లేట్ గా నడుస్తున్నాయని ప్రకటించారు. కొన్ని గంటల తర్వాత కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్పారు. బిజినెస్ క్లాస్ కాబట్టి మహారాజా లౌంజ్ లో మమ్మల్ని కూర్చోబెట్టారు. మెల్లిగా ఎయిర్‍పోర్ట్ లోపలకి కూడా నీళ్లు రావడం మొదలయింది. అప్పటివరకూ మమ్మల్ని సౌకర్యవంతంగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్న స్టాఫ్ కూడా కాసేపట్లో మొదటి ఫ్లోర్ లోకి చేరుకున్నారు. మమ్మల్నీ అక్కడికే వెళ్లమని సలహా ఇచ్చారు. కాసేపట్లో ఎయిర్‍పోర్ట్ లోని జనాలంతా ఒకే దగ్గరకు చేరుకున్నారు.

చాలా సేపటి వరకూ, వర్షమే కదా; సునామీ కాదు అనుకున్నాం అంతా! చిన్నప్పుడు కాగితం పడవలు నడిపించిన వర్షం, కాలేజ్ రోజుల్లో తడిసి ముద్దవుతూ కూడా గంతులేసిన వర్షం. వర్షం కూడా ఇంత విధ్వంసకరంగా ఉంటుందని చాలా రోజులకి గుర్తు చేసింది. గత వందేళ్లల్లో లేనంత వర్షం.

చెన్నై పరిసర ప్రాంతాలన్నీ వరదనీటిలో మునిగిపోయాయి. అందరూ లౌంజ్ లో ఉన్న టివి ముందు కూర్చుని కళ్లార్పకుండా చూస్తున్నారు. అందరి మొహాల్లో టెన్షన్. నాకు మాత్రం నవ్వొచ్చింది. ఇంకో కొన్ని గంటల్లో నేను జోహెనెస్‍బర్గ్ లో లేకపోతే ఒక పెద్ద ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. జీవితంలో నాకు ఏదీ ఈజీగా దొరకదేమో! ప్రతి దాని కోసం ఇలా తీవ్రమైన పోరాటం తప్పదేమో!

జీవితం నాతో ఆటలాడుతూనే ఉంది. నేను ఆడి గెలుస్తూనే ఉన్నాను.

కానీ మనుషులతో, మనసులతో పోరాడొచ్చు. ప్రకృతితో పోరాడడమెలా?

ఆమె పోరాడుతోంది. వరదలో చిక్కుకుపోయిన లక్షలమందిని కాపాడడానికి వేలమంది యువతీ యువకులు స్వచ్ఛంధంగా బయటకొచ్చారు. ఎవరికి తోచిన రీతిలో వారు సాయం చేస్తూనే ఉన్నారు. వాలంటీర్స్ లో ఒకరిగా టివిలో కనిపించింది మైత్రేయి.

పధ్నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆమెను చూడ్డానికి ఇన్ని దేశాలు తిరగాలా? ఇన్ని మిలియన్ డాలర్లు సంపాదించాలా? ఇన్ని కష్టనష్టాలకోర్చాలా? చివరికి టివిలో వార్తల్లో ఆమెను చూడాలా?

తను ఇప్పటికీ అలానే ఉంది. ఫరెవర్ యంగ్. ఫరెవర్ మైత్రేయి.

నేనే! ఎన్ని రంగులు మార్చాను. ఎన్ని డీల్స్ క్లోజ్ చేశాను.

లండన్ వెళ్లిన చాలా రోజుల వరకూ మైత్రేయి తో ఫోన్ లో మాట్లాడుతూనే ఉండేవాడిని. ఏదో ఒక రోజు తను కూడా నా దగ్గరకు వచ్చేస్తుందనే ధైర్యం. చాలా రోజుల వరకూ వస్తాననే చెప్పింది కూడా!

తనకి ఇష్టమని నేను ఉన్న ప్రతి ఇంట్లోనూ బెడ్ రూం కిటికీ తూర్పు దిక్కుగా ఉండేలా చూసుకున్నాను. ఆమె వస్తుందని, నన్ను హత్తుకుని పడుకుంటుందని, ఉదయాన్నే సూర్యుడి కిరణాలు ఆమె మొహం పై పడి అల్లరి చేస్తుంటే, నా చేతిని అడ్డు పెట్టి ఆపాలని…

ఆ రోజు ఎప్పటికైనా వస్తుందా?

*****
ఎక్స్‌క్యూజ్ మీ. హలో, ఎక్స్‌క్యూజ్ మీ, అంటూ నా భుజం తట్టాడతను.

చాలా సేపట్నుంచే నన్ను పిలుస్తున్నట్టున్నాడు. మీరేం అనుకోకపోతే కొంచెం సేపు నా ఫోన్ ఛార్జ్ చేసుకుంటానని అడిగాడు.

ప్లగ్ లోనుంచి నా ఛార్జర్ తీసి, ప్లీజ్ అన్నాను. అతను నా పక్కనే కూర్చున్నాడు. హై. ఐయామ్ క్రిస్ పుల్లిస్ అని చెయ్యందించాడు. నేను హలో అని హ్యాండ్ షేక్ చేశాను.

ఫోన్ స్విచాన్ చేశాను. ఫోన్ లో యాభై కి పైగా నోటిఫికేషన్స్. వాట్సాప్, మిస్డ్ కాల్స్, మెసెజేస్, మైల్స్, ఫేస్ బుక్.

దాదాపు చాలా వరకూ థియోదోరా నుంచే!

ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? జోహెనెస్‍బర్గ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చెప్పాలి వాళ్లకి? – అన్నీ ప్రశ్నలే. నా దగ్గర సమాధానం లేని ప్రశ్నలు. చెన్నై ఎయిర్‍పోర్ట్ లో ఇరుక్కుపోయున్నానని మెసేజ్ పంపిద్దామనుకున్నాను. ఆ విషయం కూడా తెలిసిపోయినట్టుంది. వాట్ ఈజ్ ది స్టేటస్ ఇన్ చెన్నై? అని మెసేజ్.

థియోదోరా. ముద్దుగా థియో. రొమేనియన్ అమ్మాయి. మై లివిన్ పార్టనర్ ఇన్ లండన్. నన్ను తట్టిలేపిన థియో!

*****

SpeedIntoTime (1)

లండన్ లో ఒక వారం క్రితం. థియో ఇంట్లో పార్టీ. చాలా రాత్రయిపోయింది. ఒక్కొక్కరూ వెళ్లిపోయాక ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం మిగిలారు. వాళ్లకి నన్ను పరిచయం చేసింది.

మీట్ మిస్టర్ రఘు. ఎవ్రీధింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఫర్ హిమ్. బట్ హి ఈజ్ కైండ్ ఆఫ్ శ్యాడ్.

నాకర్థం కాలేదు. థియోకెలా తెలుసు? నేను ఆనందంగా లేనని నీకెలా తెలుసు, అని అడిగాను.

తెలుసు. నువ్వు నాకు ఏడేళ్లుగా పరిచయం. ఈ ఏడేళ్లలో నువ్వొక కన్నీటి బొట్టు రాల్చిందీ లేదు. మొహంలో ఏ ఒక్కసారైనా విషాదపు ఛాయలు తొణికిన ఆనవాళ్ళూ లేవు.
దట్స్ బీకాజ్ ఐ యామ్ హ్యాపీ.

నో. దట్స్ బికాజ్ యూ యార్ క్యారీయింగ్ ఏన్ ఓషన్ ఆఫ్ టియర్స్ ఇన్ యువర్ హార్ట్.

నిజమే. పాతవన్నీ ఉపేక్షిస్తూ వేగంగా ముందుకెళ్తుంటే, కాలం తనలో కలిపేసుకుని, వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుందనుకున్నాను. భవిష్యత్తుకేసి మొహం పెట్టి గతాన్ని కాలగర్భంలో కలిసిపోనీ అని ముందుకు సాగాను. బట్ ఐ యామ్ రాంగ్. ఇటీజ్ ఆల్ హియర్. రైట్ హియర్.

ఆ రాత్రి. బహుశా, జీవితంలో అంత ఏడ్చింది ఎప్పుడూ లేదు. హఠాత్తుగా అమ్మ పోయినప్పుడు కూడా నేనంత ఏడవలేదు. నాన్నతో గొడవ పెట్టుకున్నప్పుడు కూడా నేనంత ఏడవలేదు. మైత్రేయి ని హాస్పిటల్ లో నాన్న దగ్గర వదిలి వెళ్లిపోయినప్పుడు కూడా అంత ఏడవలేదు. బహుశా చాలా ఏళ్ల తర్వాత ఇండియా వస్తున్నందుకో, లేక థియో అచేతనంగా ఉన్న నా చైతన్యమనే బావిలో రాయి విసిరి జ్ఞాపకాలను తరంగాలుగా రేకెత్తించినందుకో – ఏమో, ఎప్పుడో తెగిన తీగలేవో తిరిగి నన్ను చుట్టుముట్టి, ఉక్కిరిబిక్కిరి చేసి కన్నీళ్లగా ఉబికివచ్చినట్టున్నాయి.

దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయాక థియో నన్ను దగ్గరకు తీసుకుంది. ఓదార్చింది. చూడు రఘు, తనని మర్చిపోమని నేను చెప్పటం లేదు. నన్ను గుర్తించు అని వేడుకుంటున్నాను అంది.

నా కోసం తెలుగు కూడా నేర్చుకుని, నాకు తెలుగులో కవితలు రాసే ఓ థియో! ఓ నా ఐరోపా సుందరీ! ఏడు సముద్రాలు దాటినా, ఓ కన్నీటి సముద్రాన్నే గుండెల్లో దాచుకున్నానని ఎందుకు గుర్తు చేశావు? తనకు చాలా చెప్పాలనుంది. గుండె లోపల అగ్ని పర్వతం బద్దలవుతోంది. లావా పొంగబోతోంది. కానీ ఏమీ మాట్లాడలేదు.

ఏం చెప్పగలను. ఎన్నని చెప్పగలను. నా మీద ప్రేమ పెంచుకున్నందుకు ఆమె సాన్నిహిత్యంలో కన్నీళ్లు మనసారా ప్రవహింపజేయగలను. కానీ యెదలోని ఈ రోదన ఆమెకు విప్పిజెప్పగలనా?

చిన్నివెన్నెల మూటను మరిచివచ్చితినేనాడో, నా తప్పటడుగులు తిరిగి నన్నచటికే గొనిపోయెనేడు. నేనేమి చెయ్యను థియో.
ప్రతి రోజూ ఆరుబయట పచ్చికలో నడవాల్సిన నా జీవితంలో, తను లేకుండా ప్రతి రోజూ అఫీస్ క్యాబిన్స్ లో గడిచిపోతుందని; ఏ దేశంలో ఏ కెఫెలో కాఫీ తాగుతున్నా, తను లేకుండా తాగిన ప్రతి కాఫీ రుచి ఎంత చేదుగా ఉంటుందోనని; ఎన్ని మిలియన్ డాలర్లు సంపాదించినా, తను లేకుండా ఖర్చు పెట్టిన ఏ ఒక్క రూపాయికి కూడా విలువలేదని; ఎక్కడో ఆల్ప్స్ పర్వతాల్లో విహరిస్తున్నా, తను లేకుండా గాలి సైతం అలకబూనిందని; పున్నమి వెలుగులో చల్లని వాతావరణంలో కూర్చున్నా, తను లేదని వెన్నెలమ్మ కినుక బూని నిప్పులు చెరిగిస్తుందని- ఇవన్నీ చెప్పగలనా? తనే లేకపోతే నేను లేనని ఎలా చెప్పను. ఇంత ప్రేమ సాధ్యమా అని అడిగితే చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నా కన్నీటి జడి వానలు, ఆ సెలయేట జారిన నా కలలూ – ఎవరికీ కనిపించవు. మూసుకుపోయిన నా హృదయ ద్వారాల లోపల ప్రతిధ్వనించే ఆర్తనాదాలూ, రోదన ధ్వనులూ ఎవరికీ వినిపించవు. తనులేకుండా భగ్నమైన కలలు నావి; తను లేకుండా ఆగిపోయిన కలం నాది. థియో, నువ్వు మళ్లీ గడ్డి పూలను కూర్చి, కలము చేసి, చేతికిచ్చి, జోల పాడి, నిద్ర పుచ్చి – మళ్లీ తనని గుర్తుకు తెచ్చి…

…మాటల్లోనూ చెప్పలేను. కవితల ముసుగుల్లోనూ కప్పలేను. నీ నుంచీ దాచలేను! నేను ఆమెని తప్ప వేరొకరని ప్రేమించలేను. తను లేకుండా నాకు పగలు లేదు, వెలుగు లేదు. రాత్రి లేదు, చీకటి లేదు. సముద్రం లేదు. అలలూ లేవు. శృతి లేదు, లయ లేదు.

నేను ఇండియా కి బయల్దేరుతుంటే ఎయిర్‍పోర్ట్ కి వచ్చింది థియో.

మళ్లీ తిరిగి వస్తావా? అని అడిగింది.

పిచ్చి ప్రశ్న అది. నా జీవితమంతా ఇక్కడే ఉంది. నా జీవితాన్ని పూర్తిగా ఇక్కడే నిర్మించుకున్నాను. ఇవన్నీ అంత సులభంగా వదిలేసుకోలేను. తప్పకుండా తిరిగివస్తానన్నాను.

థియోకిచ్చిన మాటను నిలబెట్టుకోగలనా?
*****
మిస్టర్ రఘు, హలో మిస్టర్ రఘు!

క్రిస్ మళ్లీ భుజం తట్టి నన్ను జ్ఞాపకాల్లోంచి బయటకు తీసుకొచ్చాడు. యూ కెన్ యూజ్ యువర్ ఛార్జర్ నౌ, అన్నాడు.
థ్యాంక్యూ అన్నాను.

మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి. కానీ మీరు చాలా ప్రీ ఆక్యుపైడ్ గా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లమా? ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? అడిగాడు క్రిస్.

ఏం చెప్పాలి? పాపం అతనేం చేస్తాడు? నా మొహం చూస్తే చాలు, బాధలో ఉన్నానని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. కనీసం మాట సాయమైనా చేద్దామనుకుంటున్నాడు అతను. ఐ యామ్ ఆల్రైట్ అని చెప్దామనుకున్నాను. కానీ అతను నమ్మడు. అందుకే, జ్ఞాపకాల వరదలో తడిసి ముద్దవుతున్నానని చెప్పాను.

అవునా? కానీ అది చాలా ప్రమాదకరం కదా, అన్నాడు.

నాకర్థం కాలేదన్నట్టు తలూపాను.

కాఫీ తాగుతారా? అడిగాడు.

ఫర్వాలేదన్నాను.

కాఫీ డే కి వెళ్లి రెండు లాటే తీసుకొచ్చి, ఒకటి నా చేతిలో పెట్టాడు. థాంక్ గాడ్! ఫ్లైట్స్ లేకపోయినా కనీసం కాఫీ అయినా దొరుకుతోంది. మాటలు కలిపే ప్రయత్నం. నేను అడ్డు చెప్పలేదు. కానీ కాఫీ కోసం వెళ్లకముందు అతనన్న మాట నా చెవిలో మ్రోగుతూనే ఉంది. అందుకే అడిగాను – ఎందుకు జ్ఞాపకాలు ప్రమాదకరమన్నారు?

ఎందుకంటే, జ్ఞాపకాలు ప్రమాదకరమైన ఉచ్చులు, వాటిలో చిక్కుకుంటే అంతే!

నిజమే! ఇది ఇంకొకరు చెప్పక్కర్లేదు. నాకు ప్రత్యక్షంగానే అనుభవమవుతోంది.

కాఫీ తాగుతూ మాట్లాడ్డం మొదలుపెట్టాడు క్రిస్. అయిష్టంగానే నేనూ అతను చెప్పేది వినడం మొదలుపెట్టాను. నిజానికి నాకూ వేరే పని లేదు. ఎయిర్‍పోర్ట్ లో ఉన్న వాళ్లకి సాయం అందడానికి మరో ఇరవై నాలుగు గంటలు పైనే పట్టవచ్చని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
నేను ఫ్రాన్స్ నుంచి రెండేళ్ల క్రితం ఇండియా వచ్చాను. దాదాపుగా ఈ రెండేళ్లు అండమాన్స్ లో గడిపాను. మీకు తెలుసా? నేను ఎన్నో ఏళ్ల నుంచి, జ్ఞాపకాల యొక్క నిర్మాణాత్మక స్వభావం గురించి పరిశోధన చేస్తున్నాను. అందుకు సరైన శాంపిల్ కోసం నేను ప్రపంచంలోని ఎన్నో ప్రదేశాలు పర్యటించాను. కానీ అండమాన్ దీవుల్లోని తెగలకంటే సరైన నమూనా నాకెక్కడా దొరకలేదు. అందుకే గత రెండేళ్లుగా అక్కడే ఉంటున్నాను. ఇప్పుడు క్రిస్‍మస్ హాలిడేస్ కోసం ఫ్రాన్స్ బయల్దేరాను – చెప్పుకొచ్చాడు క్రిస్.

జ్ఞాపకాల గురించి అతని పరిశోధన కోసం అండమాన్ వరకూ రావడమేంటో నాకర్థం కాలేదు. అదే విషయం అతన్ని అడిగాను. సర్ ఫ్రెడెరిక్ ఛార్ల్స్ బార్ట్లెట్ అని ఒక బ్రిటీష్ మానసిక శాస్త్రవేత్త గురించి చెప్పాడు క్రిస్. అతను చెప్పింది చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది.

మెమురీస్ ఆర్ డేంజరస్ బీయింగ్స్. దే హావ్ ఏ లైఫ్ ఆఫ్ దైర్ ఓన్. మనం ఏదైనా విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతి సారీ అది ఒక్కో రూపం సంతరించుకుంటుంది. మన గత జీవిత అనుభవాలు, పెంపొందించుకున్న జ్ఞానం, భవిష్యత్తు పట్ల అంచనాలు – వీటన్నింటి బట్టి ఆ జ్ఞాపకం ఎప్పటికప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది. అందుకే జన జీవన స్రవంతికి దూరంగా – మనకంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ మరియు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న అండమాన్ ఆదిమవాసులతో సహజీవనం చేస్తూ – ది కన్స్‌ట్రక్టివ్ నేచర్ ఆఫ్ మెమరీ గురించి క్రిస్ పరిశోధనలు చేస్తున్నాడని చెప్తే ఆశ్చర్యం వేసింది.

జీవితం ఎవరిని ఎక్కడెక్కడికి తీసుకెళ్తుందో కదా అనిపించింది.

మెమురీస్ కి కన్స్‌ట్రక్టివ్ నేచర్ ఉన్నట్టు, డిస్ట్రక్టివ్ నేచర్ కూడా ఉంటుందా? ఈ సారి నిజంగానే ఆసక్తిగా అడిగాను.

నిజం చెప్పాలంటే – జ్ఞాపకాలకు నిర్మాణాత్మక, విధ్వంసక స్వభావాలు ఉన్నాయనడంకంటే, పునర్నిర్మాణ స్వభావం ఉందని చెప్పడం కరెక్ట్, అన్నాడతను.

అతనితో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు. మధ్యాహ్నం అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చారు. అందరూ తిని మెల్లగా కుర్చీల్లో నడుం వాల్చారు. ఏ మూడింటికో నాకూ నిద్రపట్టింది.
*****
ఒక జ్ఞాపకం.

అదే ఇల్లు. ఒక బెడ్ రూం ఖాళీగా ఉంది. ఇప్పుడక్కడ డాక్టర్లు లేరు. వాళ్లని పట్టుకుని భోరున ఏడ్చిన పిల్లవాడు హాల్లో కూర్చుని ఆటలాడుకుంటున్నాడు. అతని పక్కనే కూర్చుని టివి చూస్తున్నారు ఇద్దరు ముసలివాళ్ళు. పక్కనే మరొక బెడ్ రూంలో, బెడ్ మీద పడుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడొక వ్యక్తి. హాల్లో కూర్చున్న పిల్లవాడికి ఆ ఏడుపు వినిపించింది. మెల్లగా బెడ్ రూంలోకి నడిచాడు. ఆ వ్యక్తి పక్కనే కూర్చున్నాడు. అతని తలపై చెయ్యి వేశాడు. పక్కనే కూర్చున్న తన కొడుకుని చూసుకున్నాడా వ్యక్తి. ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకున్నాడు.

మరొక జ్ఞాపకం.

ఒక యువకుడు వేగంగా విజయా హాస్పిటల్ మిట్లు దిగి నడుస్తున్నాడు. అతనికి వెనక్కి తిరగాలనే ఉంది. కానీ చూడాలంటే ఏదో తెలియని భయం. ఇంకో రెండడగులు వేస్తే రోడ్డు మలుపు తిరుగుతుంది; హాస్పిటల్ కనుమరుగవుతుంది. ఒక అడుగు ముందుకు వేశాడు. ఇంకో అడుగు ముందుకు వెయ్యబోతూ వెనక్కి తిరిగి చూశాడు. మూడో అంతస్థులో కిటికీలోనుంచి, అతనివైపే చూస్తూ, దుమ్ము పట్టిన కిటికీ అద్దం మీద పెద్ద లవ్ సింబల్ గీసిందొక అమ్మాయి.

ఇంకొక జ్ఞాపకం.

హౌరా ఎక్స్‌ప్రెస్ నెల్లూరు స్టేషన్ దాటి, పెన్నా నది బ్రిడ్జి మీద మెల్లగా సాగిపోతోంది. జనరల్ కంపార్ట్‌మెంట్ గేట్ దగ్గర ఒక చేత్తో రాడ్ పట్టుకుని వేలాడుతున్నాడొక యువకుడు. బాబూ, ఏం ఇంత కష్టపడి వేలాడకపోతే. ఎవరైనా ఈ సూట్‌కేస్ తీసుకోండి పాపం. లోపల్నుంచి ఎవరో సూట్ కేస్ తీసుకున్నారు. మరొకరు చెయ్యందించి కష్టపడి లోపలకి లాగారు. టాయిలెట్స్ పక్కనే న్యూస్ పేపర్ పరుచుకుని కూర్చున్న ఒకతను, రా బాబూ కూర్చో అని కొంచెం చోటిచ్చాడు.

మరింకొక జ్ఞాపకం.

ఒక యువకుడు చెమటలు కక్కుతూ, చెన్నై ఎయిర్‍పోర్ట్ లోకి పెద్ద సూట్‍కేస్ లాక్కుంటూ వచ్చాడు. దూరంగా ఒక ట్రావెల్ బ్యాగ్ మాత్రమే భుజానికి తగిలించుకున్న ఒక మధ్య వయస్కుడు, కొంచెం దూరంగా ఉన్న ట్రాలీ ని లాక్కొచ్చి లగేజ్ దాని మీద సర్దాడు. ఈజిట్ యువర్ ఫస్ట్ టైం అన్నాడు. సిగ్గుగా తలూపాడా యువకుడు. దేర్ ఈజ్ ఏ ఫస్ట్ టైం టు ఎవ్రీథింగ్ అన్నాడాయన. కమ్ లెట్స్ గో అని ఎయిర్‍పోర్ట్ లోపలకి తీసుకెళ్లాడు.

ఒకదాని వెనుక ఒకటి జ్ఞాపకాలు కొత్త రంగులద్దుకుంటున్నాయి.

*****

ఫోన్ మోగింది. నిద్ర లేచాను. టైం చూస్తే రాత్రి రెండయింది.

ఎయిర్ పోర్ట్ లో చాలా భాగం వరకూ చీకటి. పవర్ సప్లై కట్ అయిపోయిందన్నారు.

ఫోన్లో థియో.

జోహెనెస్‍బర్గ్ లో కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అయిందని, వచ్చే నెలలో తిరిగి ఏర్పాటు చేస్తారనీ చెప్పింది. ఇప్పుడు వాటన్నింటి గురించి నాకు ధ్యాస లేదు. ఈ ముప్ఫై ఆరు గంటలు నాలో నేను, నాతో నేను గడిపిన క్షణాలు – గత పదేళ్లల్లో నాతో నేను ఇంత ఆప్యాయంగా గడిపిన క్షణాలు ఇవేనేమో! ఎన్నో గీతలు, ఎన్నో వ్యత్యాసాలు తొలిగిపోయి – ఏదో జీవిత సత్యం కనుగొన్న అనుభవం. ఒక్కోసారి మనిషి విచ్చలవిడి తనాన్ని అదుపులో పెట్టడానికే ప్రకృతి ఇలా మనపై తిరగపడుతుందేమో! కొత్త పాఠాలు నేర్పిస్తుందేమో!

థియో మాటలేవీ నాకు వినిపించడం లేదు.

చీకటి లోనుంచి మైత్రేయి నావైపే నడిచొస్తోంది.

నువ్విక్కడికెలా వచ్చావు?

దూరం తొలిగిపోయింది.

నాకర్థం కాలేదు.
మిస్టర్ జీనియస్. ప్రస్తుతం నువ్వు జీరో స్పీడ్ లో వెళ్తున్నావు. ఇండియాలో గడిపిన ఈ నలభై ఎనిమిది గంటలు, అందులో ఇక్కడ ఎయిర్‍పోర్ట్ లో గడిపిన ఇరవై నాలుగు గంటలు -దటీజ్ యువర్ టైం. చిన్నప్పుడు ఫిప్త్ క్లాస్ లో చదువుకోలేదా? స్పీడ్ ఇన్‍టూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అని. ది డిస్టెన్స్ ఈజ్ జీరో నౌ. నువ్వు మళ్లీ బయల్దేరిన చోటికే చేరుకున్నావు. పద వెళ్దాం అంది.

*****
మేము తిరువాన్నమళై లో బస్ దిగాం. ఇదే అరుణగిరినాథర్ గుడి అని చూపించింది. అది చూసే లోపలే వేగంగా ముందుకు కదిలింది. కొంచెం దూరం వెళ్లగానే ఇదే రమణ మహర్షి ఆశ్రమం అని చూపించింది. లోపలకి తొంగిచూడబోయాను. చలం చివరి రోజుల్లో గడిపిన ప్రదేశం. లోపల చాలామందే ఉన్నారు.

ఆగి చూద్దామంటే, తను నాకంటే కొంచెం ముందు నడుస్తోంది. నేను ఎప్పుడూ ఇంతే. చాలా వేగంగా ముందుకు వెళ్లిపోదామనే అనుకుంటాను, కానీ ఎప్పుడూ వెనకపడిపోతుంటాను . తను వెనక్కి తిరిగి చూసి, ఓ క్షణం పాటు ఆగి రమ్మన్నట్టు చెయ్యి అందించింది. ఇద్దరం అలా చాలా సేపు మౌనంగానే నడుస్తున్నాం. ఇది ఫలానా వాళ్ళు నడిపే స్కూల్, అది ఫలానా వాళ్లు పండించే పళ్లతోట – చూపిస్తూ ఆగకుండా వెళ్తూనే ఉంది.

కాసేపటికి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ మాయమయ్యాయి. చుట్టూ పల్లెటూరిలా ఉంది. రోడ్ కి కొంచెం దూరంలో ఒక తోటలా ఉంది. తోట బయట ఒక ముసలి జంట చిక్కుడు కాయలు తెంపుతున్నారు. అంకుల్ ఈ తోటలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ లో హెల్ప్ చేస్తుంటారు అని అంది. లోపలకి వెళ్లి నాన్నను చూడాలనిపించింది. కానీ తను ఆగటం లేదు.

కొంచెం దూరం వెళ్లగానే ఒక దగ్గర పిల్లలు కొంతమంది వీధిలో ఆడుకుంటున్నారు. పక్కనే ఒక చిన్న బిల్డింగ్ ఉంది. ఈ స్కూల్ లోనే నేను సంగీతం నేర్పిస్తుంటాను అని ఆ బిల్డింగ్ వైపు చూపించింది. లోపలకి వెళ్దామా? అడిగాను. ఇప్పుడు కాదని చెప్పింది.

ఏం, అన్నాను? మళ్లీ వచ్చినపుడు అంది.

పిల్లలు కొంతమంది రోడ్ పక్కనే ఉన్న ఒక పంపు కింద నీళ్లు తాగుతున్నారు. నేను కూడా అక్కడికెళ్లి నీళ్లు తాగాను. తను నన్నే చూస్తోంది. ఆమె దగ్గరకు నడిచాను. మైత్రేయి, నీకో విషయం చెప్పాలి. చెప్పమని కళ్లతోనే సైగ చేసింది. ఇప్పుడు ఇక్కడ నీ చెయ్యి పట్టుకుని నిలబడి ఉంటే నాకేమనిపించిందో తెలుసా? అనంతమైన ఈ విశ్వంలో దుమ్ము ధూళి కి ఉన్న ప్రాముఖ్యత కూడా లేని నా జన్మకు సార్థకం కలిగింది నీ వల్లనే!

తను ఏమీ మాట్లాడలేదు. వెళ్దామా అన్నట్టు చెయ్యందించింది. నేనామె చెయ్యిపట్టుకుని ముందుకి నడుస్తున్నాను. నన్ను వెనక్కి తీసుకొచ్చి చెన్నై వెళ్లే బస్ ఎక్కించింది . నాకు వెళ్లడం ఇష్టం లేదని చెప్పాని. నేనిక్కడే ఉండిపోతానని ప్రాథేయపడ్డాను .

బస్సు వెళ్లిపోతోంది.

The Sun had not yet risen. The doors are not yet open.

SpeedIntoTime (1)గుండె మీద చెయ్యి పెట్టి, యూ కెన్ కమ్ హియర్ వెన్ యూ ఆర్ రెడీ అంది.

హలో మిస్టర్ డ్రీమర్. మనమింక బయల్దేరవచ్చు. నిద్రలేపి చెప్పాడు క్రిస్.

నాకు తేరుకోడానికి ఒక్క నిమిషం పట్టింది. నేనింకా ఎయిర్‍పోర్ట్ లో లౌంజ్ లో కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాను.

ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చాయి. అర్జెంట్ గా వెళ్లాల్సిన వాళ్లని బెంగుళూరు కి ఎయిర్‍లిఫ్ట్ చేస్తున్నారు. మీరు కూడా వస్తున్నారా? అడిగాడు క్రిస్.

ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. గత పదేళ్లల్లో నాకు ఎప్పుడూ ఇలాంటి ప్రశ్న ఎదురవ్వలేదు. వెన్ రఘు ఈజ్ హియర్ ఎవ్రీధింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. హి ఈజ్ ఏ ఫైర్ ఫైటర్. కానీ ఇప్పుడు ఏదీ నా కంట్రోల్ లో లేదు. వెళ్లిపోవచ్చు. వెళ్లాలి కూడా. లేకపోతే సౌత్‍ఆఫ్రికా డీల్ క్యాన్సిల్ అవుతుంది. ఐదువందల కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఆల్రెడీ అది ఇంకొకరికి ఇచ్చేసి ఉండొచ్చు. డీల్ క్యాన్సిల్ అయిందని న్యూస్ బయటకు వచ్చేసి ఉండొచ్చు. అల్రెడీ కంపెనీ షేర్ వాల్యూ పడిపోయి ఉండొచ్చు. ఏమైనా జరగొచ్చు.

ది పాజిబిలిటీస్ ఆర్ ఎండ్‍లెస్.
కానీ, ఒకటి మాత్రం నిజం. నేనిక్కడ్నుంచి బయటకు అడుగుపెడ్తే ఇంకే రోజూ ఈ కల మళ్లీ రాదు. అయినా ఆ కళ్లు దాని కోసం వెతుకుతూనే ఉంటాయి. అదే కలను తెచ్చే రాత్రికోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. కానీ నాకిప్పుడు కావాల్సింది కల కాదు. ఆ కలలను తెచ్చే రాత్రి కాదు. నిజం కావాలి. ఆ నిజాన్ని తీసుకొచ్చే వెలుగు కావాలి; నా మైత్రేయి నాకు కావాలి.

ఆర్యూ కమింగ్, అడిగాడు క్రిస్.

ఐ థింక్, ఐ విల్ వెయిట్, అన్నాను.

ఫర్ వాట్ అన్నాడు.

ఫర్ ది సన్ టు షైన్ అండ్ ది డోర్స్ టు ఓపెన్ అన్నాను.

ఏమనుకున్నాడో, ఏమో అతను తన బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయాడు.

బయట వర్షం ఆగింది. ఆకాశంలో సూర్యుడు జాడ తెలుస్తోంది. ఒక్కొక్కరూ ఎయిర్‍పోర్ట్ లోనుంచి వెళ్లిపోతున్నారు. నేను మాత్రం అక్కడే కూర్చున్నాను – ఆమె రాక కోసం ఎదురుచూస్తూ!

*

మీ మాటలు

  1. నిజం చెప్పాలంటే – జ్ఞాపకాలకు నిర్మాణాత్మక, విధ్వంసక స్వభావాలు ఉన్నాయనడంకంటే, పునర్నిర్మాణ స్వభావం ఉందని చెప్పడం కరెక్ట్, అన్నాడతను.–నిజమే

    వండర్ఫుల్ స్టొరీ

  2. బాగుంది కథ

  3. నా కథను ప్రచురించిన సారంగ కి ధన్యవాదాలు

  4. గొరుసు says:

    కథ గమ్మత్తుగా ఉంది. భిన్నంగా ఉంది. మర్రి ఊడల ఉయ్యాలలో కూర్చుని వేగంగా ముందుకీ వెనక్కీ ఊగినట్టు ఉంది – “తమాషా” మూవీ టెక్నిక్ గుర్తుకొచ్చినట్టుగా ఉంది. కళ్ళముందు ఒక రణబీర్ కపూర్ తన కథ చెప్పినట్టుగా ఉంది – ఇంకా ఏఏమో ఉంది . అన్నీ చెప్పాలనీ ఉంది – చెప్పలేననీ ఉంది – అన్నిటికీ మించి సిధారెడ్డి కాలానికి మంచి పడునుంది.

  5. Jayashree Naidu says:

    మానవాత్మక జీవితావస్థలతో సతమతమయ్యె కథా ప్రవాహాలకు.. ఒక సార్వజనీనిక… మానసిక… సాంకేతిక.. వలయాలని చుడుతూనే… ఒక అండర్ కరెంట్ లాంటి స్పిరిచ్యువాలిటీ ని అద్భుతం గా టచ్ చేశారు… సింపుల్ గా చెప్పాలంటే… ఒక మానసిక గెలాక్సీ లో ప్రయాణించినట్టుంది..

  6. Sreevardhan says:

    Man’s time machine is his own mind and it’s మెమోరీస్…
    Simple story well told…

  7. చందు - తులసి says:

    మాటలకందని అనుభూతి….
    కథ బాగుందనో, సూపర్ అనో…., చెప్పలేము.
    మనమేంటో మన మూలమేంటో గుర్తు చేసే ఇలాంటి కథలు ….మనల్ని జ్ఞాపకాల కొలిమిలో కాల్చి కొత్త జీవితాన్నిస్తాయి.
    కథ నడిపిన తీరూ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
    స్టాండిగ్ ఓవేషన్ టూ వెంకట్ సిద్దారెడ్డి గారూ..

  8. ఆనంద్ కార్తీక్ says:

    స్పీడ్ ఇం టూ టైం – కథ కూడా స్పీడ్ గా చదివేద్దాం అనుకున్నా ..కాని ఒక్కో వాక్యం అయ్యాక దాని గురించి ఆలోచిస్తూ చదివాను. పాత్రలు సన్నివేశాలు ఊహిస్తూ కథ అర్థం చేసుకోవడానికి చివరకంటూ ప్రయత్నించా .. జ్ఞాపకాల దొంతరలు విప్పుతూ , ముందుకు వెనక్కు వర్తమానం కి వస్తూ భలే గా రాసారు. కాలం తన సేఫ్ లాకర్ లో అన్ని భద్ర పరుస్తుంది. మనం జ్ఞాపకాల్లో ఆగినప్పుడు కావాల్సింది గుర్తు తెస్తుంది. మన పక్కన ఉండే వ్యక్తుల ప్రేమ ను స్పర్శను ఇంకా పచ్చి గానే ఉంచుతుంది. కాలానికి అందరు కావాలి, కాని అదే కాలం అవసరాలకు కావాల్సిన డబ్బు , హోదా నే మనకు ముందుంచుతుంది. మనం ఆగి ఆలోచిస్తే అవి కాదు ప్రేమే గొప్ప అని హితబోధ చేస్తుంది. పరుగెత్తు పరుగెత్తు కాని ఒకసారి ఆగు … గతం వెనకనే ఎన్నో జ్ఞాపకాలను మోసుకొస్తుంది, భాదో ఆనందమో , సుఖమో ఇంకేదో …..

  9. ఈ మధ్య కాలంలో చదివిన విలక్షణమైన ఉత్తమ కథ. అక్షర శిల్పి ప్రావీణ్యత పదాల అల్లికలో తెలుస్తోంది.
    నేచర్ ఆఫ్ మెమరీస్…. ఒక్క క్షణం ఖాళీగా ఉంటే ఇట్టే వచ్చేసే ఆలోచనలను ఏ బకెట్లో వెయ్యాలో తేల్చుకోవాలిక.
    థాంక్యు సిద్దారెడ్డి గారు ఫర్ ఏ వండర్ ఫుల్ స్టోరీ.

  10. Narayanaswamy says:

    చాలా బాగుంది కథ – అద్బుతమైన నరేషన్ టెక్నిక్ – సినిమా చూస్తున్నట్టనిపించింది – గొప్ప విజువలేజేషన్ – మంచి కథను అందించినందుకు నెనర్లు !

  11. రాధ మండువ says:

    బావుంది.

  12. వెంకట్ గారూ .. చాలా బాగుంది అన్నది చిన్నమాట. కాలంతో వెనక్కి ముందుకీ మధ్య ఊగిసలాటలో తెగిన గొలుసులూ, సాగిలపడే మనుషులూ.. వొక మనస్సునామీ

  13. Krishna Veni Chari says:

    Good narrative

  14. సెన్స్ ఉన్న సినిమా దర్శకులు రచయితలు కూడాయితే ఏం జరుగుతుందో అదే జరిగింది . షుక్రియా….

  15. Vijaya Karra says:

    “అనంతమైన ఈ విశ్వంలో దుమ్ము ధూళి కి ఉన్న ప్రాముఖ్యత కూడా లేని నా జన్మకు సార్థకం కలిగింది నీ వల్లనే!” – జ్ఞాపకాలకే కాదు… ఓ రచనకో, ఇలాంటి ఓ మంచి వాక్యానికో కూడా గొప్ప పునర్నిర్మాణ స్వభావం వుందనిపిస్తుంది. నైస్ స్టోరీ!

  16. Kuppili Padma says:

    వర్తమానపు పరుగుని కాసేపైనా ఆపి మన అంతరంగంలో సుళ్ళు తిరిగే జ్ఞాపకాలని అందమైన ప్రవాహంగా మన జీవనంలో మలుచుకోవటమే జీవనానందం… వో కొత్త ప్రవాహం కథా జీవనదిలో… స్పీడ్ ఇన్ టు టైమ్. నాలో చదువరిని విస్మయపరిచింది. సంతోషపరిచింది. దిగులునినింపింది. ఆశని పూయించింది.
    మసకేసిన మనసులకి శుభ్రపరిచి కాంతివంతమైన రంగులని చిలకరించే యీ కొత్త కథని అందించిన Venkat Siddareddy గారికి అభినందనలు.

  17. వనజ తాతినేని says:

    కథ చాలా బావుంది .

  18. హ్మ్మ్…. ఇంకోసారి చదవాలి.
    మనందరి మూలాలు దాదాపుగా ఒకటే. పరుగులే పరిపరి విధాలు. ఓ క్షణం లోపలికి తొంగి చూసుకుంటే కోల్పోయింది బేలగా మనకేసి చూస్తుంది కాబోలు. లోతైన రచనా శైలి శ్రద్ధగా చదివించింది.

  19. bhaskar g says:

    Very good story. Reminded me of one of my favorite novels ‘Time and Again’ by Jack Finney. As someone said above, each one of has our time machine, our memories. What are experiences if not mental stimulations? So, if we can create the mental stimulation without any external means, does it really mean we are living/re-living those moments? This is also explored in some movies like ‘Vanilla Sky’ and the recent kannada/tamil ‘Lucia’ movies as well.

  20. Sneha Ponnaganti says:

    యాంత్రికంగా పరుగులు పెడుతున్న మనసుని అలొచింపచెసింది మీ కథ ..
    గుండె లొతుల్లొ దాగిన గ్నాపకలను గుర్తు చేసినది మీ కధ ..
    విభిన్నమైన కధ ..

  21. Vinod kumar yerram says:

    “The Sun had not yet risen. The doors are not yet open.”
    Thank you sir and thank you very much “ఓక మంచి ఉదయన్నీ నాకు కలిగించనందుకు..

Leave a Reply to besharam saifu Cancel reply

*