“మాటల మడుగు”తో మెర్సీ మరో అడుగు..

 

-అరణ్య కృష్ణ

~

“మేఘాల మీదుగా భూమిపైకి చూడటం నేర్చుకున్నప్పుడే
ఇంద్రధనుస్సు ఆకారం పరిపూర్ణంగా కనబడేది
వర్షంలో తడుస్తున్న భూమిని
కళ్ళారా నింపుకోగలిగేది”
మెర్సీ సరిగానే చెప్పారు.  జీవితాన్ని ఓ కవి అలానే చూడాలి.
మెర్సీ మార్గరెట్! ఎంతో అందమైన ఇంగ్లీష్ పేరు.  “మార్గరెట్ కవిత్వం చదివారా?” అని ఎవరైనా ఇంగ్లీష్ లిటరేచర్ విద్యార్ధినడిగితే “ఓ! బ్రహ్మాండంగా!” అంటాడేమో.  కానీ మెర్సీ మార్గరెట్ పదహారణాల తెలుగమ్మాయి.  వర్తమాన సమాజ బీభత్సాన్ని లలితమైన పదాలతోనే కవిత్వంగా తూర్పారపట్టిన తెలుగమ్మాయి.  ఒక దళితురాలిగా, మైనారిటీగా, స్త్రీగా ఎంతటి వివక్షతను, అశాంతిని అనుభవించాలో అంతటినీ మంజూరు చేసిన వర్తమాన సమాజాన్ని ఒకసారి ఆర్ద్రంగా, మరోసారి కసిగా నిలదీసిన పదహారణాల తెలుగు కవి మెర్సీ.  ఆ మూడు రకాల అస్తిత్వ మీమాంస మెర్సీ కవిత్వం లో కనబడుతుంది.  ఆధునిక కవిత్వం అంటే ప్రధానంగా భావానికి, భావాల సంఘర్షణని వ్యక్తీకరించటానికే  అన్న విషయాన్ని మెర్సీ కవిత్వం మరోమారు నిరూపించింది. వాడ్రేవు చినవీరభద్రుడు, ఎండ్లూరి సుధాకర్, అఫ్సర్ లాంటి ముగ్గురు ప్రసిద్ధుల నుండి ముందుమాటల ద్వారా కితాబులందుకున్న మెర్సీ “మాటలమడుగు” నిజానికి కవిత్వ సెలయేటిలో కొత్తపాయ.
         కవిత్వం కాల్పనిక భావోద్రేకాలకు చెల్లుచీటీ చెప్పాలని ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది.  కవిత్వంలో ఏదో ఒక సామాజికాంశ లేకుండా చదవటానికి ఏ పాఠకుడూ సిద్ధంగా లేడు.  సామాజికాంశ అంటే సామాజిక వాస్తవికతే.  వైయుక్తిక స్థాయిలో వ్యక్తీకరించినప్పటికీ సాటి మనుషులతో పంచుకోతగిన ఆవేశమే కవిత్వం కాగలదు. లేకుంటే అదేదో గందరగోళంగానే మిగిలిపోతుంది.  అయితే కేవలం వాస్తవాల కోసమే అయితే ఒక వార్తాపత్రిక చదువుకోవచ్చుగా మరి అన్న ప్రశ్న వస్తుంది.  ఒక అత్యాచార వార్త చదవటం వేరు, దానిమీద కవిత చదవటం వేరు.  నిర్భయ మీద ఎన్నో కవితలొచ్చాయి. తెలిసిన విషయమే కదా. మరెందుకు చదివాం?  కవిత్వం మనలోని మనతనానికి అప్పీల్ చేస్తుంది.  మనం మనుషులుగా హృదయంతో స్పందింపచేస్తుంది.  కనుకే కవిత్వం అంటే వాస్తవికమైన అనుభవాన్నో, పరిశీలననో భాషా మాద్యమం ద్వారా హృదయం నుండి హృదయానికి ప్రయాణింపచేసే కళాత్మక ప్రక్రియ.  సరిగా మెర్సీ ఇక్కడే సఫలమయ్యారు.
అవాస్తవాలకు, అతిశయాలకు పోకుండా సరళంగా వ్యక్తీకరించిన నిండుకుండ లాంటిది మెర్సీ కవిత.  కోపగించుకున్నా, వెటకారం చేసినా, ప్రతీకాత్మకంగా వ్యక్తీకరించినా, మార్మికంగా గుసగుసలాడినా….ఎలా చెప్పినా మొత్తం మెర్సీ కవిత్వం వేదనాపూర్వక అనుభూతి ప్రధానమైనదే.    స్త్రీ లైంగిక స్వేచ్చ వంటి స్త్రీవాద కవిత్వం ప్రతిపాదించిన లోతైన వివాదాంశాల జోలికి వెళ్ళకుండానే స్త్రీ శరీరం మీద అమలయ్యే పురుషాధిక్య భావజాలాన్ని కవిత్వంలో ఎండగట్టడంలో మెర్సీ సఫలమయ్యారు.  ఆమెను ప్రధానంగా స్త్రీవాద కవిగా గుర్తించటం కష్టం.  స్త్రీవాద చాయలు కొంతమేరకు కనబడ్డా ఆమె ప్రధాన దృక్పధం కానీ, లక్ష్యం కానీ స్త్రీవాదం కాదు.  దళితుల మీద వివక్ష, మైనారిటీల వ్యధలు, స్త్రీగా ఎదుర్కునే ఆటంకాలతో పాటు కాలుష్యం, ప్రపంచీకరణ, యాంత్రీకరణ, యాంత్రిక జీవితం, కన్స్యూమరిజం వంటి సమకాలీన అంశాల మీద కూడా ఆమె కవితలు రాసారు.  ముఖ్యంగా చుట్టూ ఆవరించివున్న నిరాశాజనక పరిస్తితులు సృష్ఠించే మనోవైకల్యాల మీద ఒక కవితాత్మక నిరసనగా మెర్సీ కవిత్వాన్ని చెప్పొచ్చు.
     ఆధునిక కవిత్వంలో ఎటువంటి సీరియస్నెస్ నేను కోరుకుంటానో అది మెర్సీ కవిత్వంలో కనబడింది.  అది వస్తువుకి, శిల్పానికి రెండింటికీ సంబంధించినదే.  మెర్సీ కవిత్వం అత్యున్నత స్థాయి కవిత్వమని ఆకాశానికెత్తను కానీ మంచి కవిత్వమని, మంచి అనుభూతి కలగచెయ్యగలదని మాత్రం భరోసా ఇవ్వగలను.  ప్రతి కవిత మీద ఆమె మంచి శ్రద్ధ పెట్టిన విషయం తెలుస్తుంది.  ప్రతి కవితకి ఒక ఎత్తుగడ, నడక, ముగింపుల నిర్వహణ సమర్ధవంతంగా నిర్వహించారావిడ. అందుకే మంచి ప్రామిసింగ్ గా కనిపించారు ఆవిడ.
        మనుషుల్తో మాట్లాడటం విఫలమైనప్పుడలా కవి కవిత్వాన్ని ఆశ్రయించటం జరుగుతుంది.  దీన్నే మెర్సీ కవిత్వం బలపరుస్తుంది.  తన పరిశీలన, తన అనుభవం లోకి వచ్చిన ప్రతి అంశాన్ని ఆమె కవిత్వం చేసారు.  ఎంతటి కర్కశమైన వాస్తవాన్నైనా ఒక మార్దవంతో, ఆర్తితోనే వ్యక్తీకరించారు.  ఆర్తి లేని కవిత్వం పత్రికా సంపాదకీయమే అవుతుంది.  ఈమె కవిత్వం లో మాటలు, ఆలోచనలు, అక్షరాలు అన్న పదాలు ప్రధానంగా కనబడతాయి.  దాన్నిబట్టే చెప్పగలం ఆమె తన కవిత్వం ఆలోచనాస్ఫోరకంగా ఉండాలని బలంగా కాంక్షించారని.   “కొట్టివేతల నుండి కొత్తగా పుట్టుకురావాలి” అన్న వినిర్మాణ (డీకన్స్ట్రక్షన్) స్పృహతో మొదలై సంకలనం చివర్లో చోటు చేసుకొని అన్ లెర్నింగ్ కోసం తపించిన “మైనస్లతో మైత్రి”  వరకు  ఆమె కవిత్వం తన ప్రస్థానమేంటో స్పష్ఠంగా చెబుతుంది.
“ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి
మాటలకు మొలకల వేళ్ళుండేవి
పచ్చగా మొలకెత్తేందుకు అవి
సారవంతమైన నేలలు వెతికేవి” (మాటలమడుగు) తప్పిపోతున్న మనిషిని మాటల్లేనితనం లోనే పట్టుకోగలం కదా!
ప్రతి మనిషిలో ఒక ప్రశ్నలగది వుంటుంది.  అందులోకి ప్రవేశించటానికి అందరికీ భయమే ఆ గదిలో
“ఎండిపోయిన విత్తనాల్లాంటి ప్రశ్నలు
చిక్కులు చిక్కులు గా వుండలు చుట్టి పడేసిన ప్రశ్నలు
మసకబారిన చిమ్నీల్లాంటి ప్రశ్నలు
శ్వాస పీల్చుకోలేక వేలాడుతున్న క్యాలెండర్ లాంటి ప్రశ్నలు” తాండవమాడే అంతరంగ ప్రశ్నలగదిలోకి వెళ్ళాలని చెబుతారు కవి (ఫ్రశ్నల గది) ఎందుకంటే ప్రశ్న అంతరాత్మ మాతృభాష కదా మరి.
వర్ణాల్లో అందాలు చూసే వాళ్ళ పట్ల గొప్ప నిరశన “చీకటిదీపం”లో కనబడుతుంది.
“వర్ణాల బేధం లేకుండా పూలన్నిటినీ హత్తుకునే
చీకటి
ఎంతటి సహృదయ
నిశ్శబ్దాన్ని గుండెల నిండా నింపుకోడానికొచ్చే వారిని
దరిచేర్చుకునే వైద్యురాలు”
“హృదయపు మెతుకు” ఈ సంకలనంలోని ఉత్తమకవితల్లో ఒకటి. స్థూలకాయురాలైన భార్య వంటలో ప్రేమని కాక ఏదో ఒక రకంగా ఎత్తిపొడవటానికి వంకల్ని వెతుక్కునే భర్తల వైఖరిపై నిప్పుల్లాంటి కన్నీళ్ళు విసురుతుందామె.
“”బరువెక్కిన కాళ్ళు కళ్ళు  నదులై ప్రవహించేదాక
అన్నంలా ఉడుకుతుందామే
……………………..
ట్రెడ్ మిల్ పై చిననాటి తప్పటడుగుల్ని జ్ఞాపకం చేసుకుంటూ
తననెవరైనా గంజిలా వార్చమని
ఉబ్బినట్లున్న శరీరావయవాలను నిమురుకుంటుందామె
……………………….
“ఈ మధ్య నీ ధ్యాసెటుంటుది?
అన్నం పలుకుపలుకుంది
పాతబియామే కదా ఇంత లావెందుకున్నయని?”
అతడు చిదిమిన అన్నం మెతుకులో
ఆమె హృదయం కూడా ఉందని
అతడు చూసుకునే లేదు”
మెర్సీ ఊహాశక్తికి తార్కానంగా నిలువగల “కాదంబరి” “తలాష్” “వెన్నెల స్నేహితా” వంటి కవితలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. చెట్టులో మనిషితనపు అన్వేషణని ప్రతిబింబించే ‘చిప్కో”, వదిలివెళ్ళిన స్నేహాత్మ కోసం రాసిన “తనతోనే నేను”, విభిన్న జ్ఞాపకాల మీద రాసిన “చీకటిదండెం”, కాలానుగత మార్పులకు సాక్షీభూతమైన “మైలురాయి”, మృత్యువు మనిషి జీవితంలోని వ్యర్ధత్వాన్ని నిరూపించటం మీద వేదాంతంగా రాసిన “ఇంతేనా మనిషంటే”, తండ్రుల నియంతృత్వాన్ని ప్రశ్నించమనే “ఇంటికిరాని వెన్నెల”, స్నేహితురాలి ఆత్మహత్య మీద “గాజుమనసు”, లక్షింపేట మీద రాసిన “ఉలిక్కిపడుతున్న ఊరి తలుపులు” వంటికవితలు కూడా చదవించే కవితలే.
53 కవితలతో అందమైన ముద్రణతో “మాటలమడుగు” రూపొందించారు. మనం చదువుకోవాల్సిన కవిత్వం రాసిన మెర్సీ మనం ఆహ్వానించతగ్గ కవి.
“అక్షరాలు గుండెను చీలుకొని
బయటికొచ్చి పసిపిల్లల్లా నవ్వుతాయి
వాటిని దోసిట్లోకి తీసుకొని
నేను ఏడ్చేప్పుడు
కన్నీళ్ళ లాలపోసుకొని
కాగితపు ఊయల్లో నిద్దరోతాయి”
(“మాటలమడుగు” కవితల సంకలనం. రచన మెర్సీ మార్గరెట్.  వెల రూ.100.  ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలు. హౌ. నం. 1-4-61, రంగ నగర్, ముషీరాబాద్, హైదరాబాద్-500090.)

మీ మాటలు

  1. Sharada Sivapurapu says:

    చక్కటి విశ్లెశణ అరణ్య కృశ్ణ గారూ . ఒక ప్రామిసింగ్ యువ రచయిత్రి మెర్సీ మార్గరెట్ గారికి అభినందనలు

  2. మస్తాన్ ఖాన్ says:

    వొక కవితా సంపుటికి అనేక విశ్లేషణలు ప్రచురితమైన కొద్దిరోజుల్లో రావడం ఆ సంపుటి స్థాయిని తెలియపరుస్తూ వున్న…అరణ్య కృష్ణ గారి యీ విశ్లేషణ భిన్నంగా వుంది…మూడు రకాల సామాజిక పీడనను అనుభవించిన కవయిత్రి కావ్యాత్మకతను ఆవిష్కరించారు…యీ కవిత్వంలో ఆర్తితొో పాటు కవిత్వంపట్ల విపరీతమైన ఆరాధ్యభావం మెండుగా వుంది..యే కళా రూపమైన సమస్య…సమస్య నేపధ్యాన్ని ప్రస్తావించాలి…యిందులో దాని పరిణామ తీవ్రత వుంది…అనుభవించిన వారికే అర్థమయ్యే కవిత్వం యిది….అరణ్యకృష్ణ గారు good write up….

  3. Aranya Krishna says:

    ధన్యవాదాలు మస్తాన్ ఖాన్ గారూ! మీ పరిశీలన క్లుప్తంగా అయినా నిండుగా ఉంది.

మీ మాటలు

*