కొత్త రెక్కలు పుట్టాలె!

 

 

–కృష్ణ చైతన్య అల్లం

~

 

Krishna Chaitanya Allamకొత్త కథల పుస్తకం  ఎప్పుడన్న కొన్నప్పుడు సూచిక చూస్తం. కథ పేరు ఏదైనా కొత్తగ కనిపిస్తే అది ముందు చదవాలని అనిపిస్తది.

పెద్ద పెద్ద పేరాలు ఉన్న కథలని తరవాత చదువుదాం లె అనిపిస్తది.

కథలో పిల్లలుంటే కథనం ఉత్సాహభరితంగ ఉన్నట్టు అనిపిస్తది. పిల్లల ఉత్సాహం, ఎనర్జీ కథకు కూడా అన్వయించబడ్డట్టే ఉంటది.

చిన్న చిన్న వాక్యాలతో మొదలైన కథో, కథనమో, వ్యాసమో తొందరగా ముగించవచ్చునన్న భావన కలిగిస్తది.

మామూలుగా పిల్లల కథలు రాసేటప్పుడు ఈ రకమైన పద్దతులు పాటిస్తరు. మరి పిల్లల దగ్గర సఫలీకృతమైన ఈ ప్రక్రియ ఎక్కడ ఆగిపోయింది? ఎందుకు ఆగిపోయింది?

కాల్పనిక సాహిత్యం వయసు అవధులు దాటి బయటకు వచ్చే సరికి చాలా వరకు మన సాహిత్యంలో దీన్ని సస్పెన్స్ థ్రిల్లర్ కథో, హారర్ కథో అనే టాగ్ తో సాధారణీకరిస్తరు. రాసే పద్ధతిల కూడా చాలా వరకు సినిమా ధోరణి కనిపిస్తది. నా వరకు మధు బాబు నవలలు, షాడోలు లాంటి కవర్ పేజీలు చూసినపుడు ఈ పుస్తకం చదవాలే అని అనిపించలే ఒక్క సారి కూడా. ఎందుకంటే మామూలుగా పాటించే కథ తీరూ తెన్నులూ పాటిస్తయి ఈ ప్రక్రియలు. ఎట్టకేలకు అవన్నీ మళ్ళీ కలిసి మెలిసి కంచికి పోతై. ఊహించని ఘటన జరిగిన సన్నివేశం చదువుతున్నా కూడా అట్ల జరుగబోతుంది అనే మైండ్ ఆల్రెడీ సెట్ అయి ఉంటుందన్న డీఫాల్ట్ కేటగిరీ. కొత్తగా ఆశిద్దాం అనుకునే ఆశ చూపెట్టడంలో విఫలం అయితై.

ఇగ రెండో పద్ధతి సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ ఫిక్షన్ ఇంకా సోషియో ఫిక్షన్. ఇది ప్రపంచం అంతా అత్యధికంగా వాడే ప్రక్రియలు. మన దగ్గర మాత్రం ఎందుకో ఇది పిల్లల పుస్తకాలుగా మాత్రమె పరిగణింపబడే కళా ప్రక్రియ. పెద్ద పెద్ద కథలూ, నవలలూ, టీవీ సీరిస్, సినిమాలూ కోకొల్లలుగా ప్రపంచం అంతటా వాడబడింది. స్టీఫెన్ కింగ్ డ్రమాటిక్ కాల్పనికత, ఆర్ ఎల్ స్టైన్ అభూత కల్పనలు, జే జే అబ్రం గ్రహాంతర శక్తులు, ఆర్ ఆర్ మార్టిన్ కాల్పనిక పీరియడ్ డ్రామాలు, ఒక్కోల్లది ఒక్కో శైలి. కానీ బాల్యం నుండి ఈ ప్రక్రియ వేరు చేయబడినపుడు వీళ్ళ కథా ప్రమాణాలు మారిపోతయి. అనూహ్యమైన మలుపో, ఊహించని పరిణామమో కథని ఎలివేట్ చేస్తుంది. చదువుతున్నప్పుడు కంచికి పోవాల్సిన కథనం కొండలు గుట్టలు ఎక్కుతుంటే మనసు ఉరకలు వేస్తది. అందుకే అరవై డెబ్బై ఏళ్ళు మీద పడ్డ  మనుషులు కూడా స్టార్ వార్స్, స్టార్ ట్రెక్, గేం ఆఫ్ త్రోన్స్ అని ఉరకలు పెడుతరు.

తెలుగు ఫాంటసీ ఫిక్షన్ ఇంకా గండర గండని దగ్గరనుండి బయటకు రాలేదు. గండర గండడు ఇంకా బాల మిత్ర, బాల జ్యోతుల్లోనే ఉండిపోయిండు. ఎదిగి పెద్దవాడై గ్రహాంతర వాసులతో స్నేహం చేసి, సూపర్ మాన్ తో యుద్ధం చేసి, కాల బిలాలలో పయనించి, కాలాంతర ప్రయాణాలు చేసే కలల ప్రపంచంలో ఇంకా విహరించలేదు. ఒక వేళ వాలినా దానికి దైవిక శక్తి అనో, దయ్యం అనో  అని పేరు పెట్టి కోడి రామ కృష్ణలు ఎలాగోలా కథని మళ్ళీ కంచికి పంపుతరు.

కలల్లో వినీలాకాశాల్లో విహరించి మేఘాల్లో తేలిపోయిన మనసులని కథల్లో, కళా రూపాల్లో మాత్రం నేల దాటనియ్యరు.

ప్రఖ్యాత అభూత కల్పనల సృష్టికర్త ఆర్ ఎల్ స్టైన్ అంటాడు, తన కథలో మూడే భాగాలు ఉంటాయని. ఆరంభం, కథనం, మలుపు. మరి ముగింపు? అని అడిగితె, మలుపు మలిచే కథనమే ముగింపు అంటాడు.

గొప్ప ఫాంటసీకి అర్ధవంతమైన ముగింపు ఇయ్యడం కోసం దాన్ని దైవిక శక్తి అనో, భూతమో ప్రేతమో అని నమ్మింప చేసే ప్రయత్నంలో కథ ఆత్మని కోల్పోతది. సెన్స్ ఆఫ్ క్లోసర్(Sense of closure) అంటున్నం దీన్ని. క్లోస్ చేయాలె ఎట్లనో అట్ల. మొదలు పెట్టిన ప్రతీ బ్రాకెట్ క్లోజ్ అయితేనే కోడింగ్ కంప్లీట్. కలకూ, కళకూ ఎం కోడింగ్ ఉంటది. తెల్లారి లేచినంక సగంలో ఆగిపోయిన కల మళ్ళీ రమ్మంటే వస్తదా? వస్తే? దీని గురించి నాలో ఒకడు అని సిద్ధార్థ్ సినిమా ఒకటి వచ్చింది ఈ కాన్సెప్ట్ మీద ఈ మధ్య. కల మళ్ళీ కొనసాగించ బడుతది పడుకున్నపుడల్లా. ఆలోచన ఎంత అద్భుతం? దేవుడూ దయ్యం ఎమీ లేదు. మనిషితో మనిషి పడే సంఘర్షణ. మనిషి లోపల జరిగే సంఘర్షణ.

వాస్తవిక సాంఘీక జీవనం నుండి వేరు పడిన పిల్లల కథలు అమాంతం పెద్దవాళ్ళ జీవితాల్లోకి వస్తే, ఆఫీసుల డైనోసారో డ్రాగనో కనిపిస్తే, డాల్ఫిన్లు తిమింగలాలు ఆకాశంలో ఎగురుతూ పొతే, భూమి మీద కాకుండా ప్లూటో మీద జీవం ఉంటే, పొలాల్ల మొక్కలు, పెంపుడు ప్రాణులూ మనతోని మాట్లాడుతే.. అంతూ పొంతూ లేని కల్పనా శక్తి. కోరికలు మాత్రమే గుర్రాలై ఎందుకెగరాలె? కలలు, కలాలు, కళలు గుర్రాలై ఎగిరితే తప్పేముంది?

నిత్యం మనలో మనకు ఎన్నో సంఘర్షణలు. సమాధానాలు వెతికే స్వభావం. అన్నీటికి సమాధానాలు కావాలె.

అన్నింటికీ అర్ధం పరమార్ధం ఉండాలంటాడు. కానీ గమ్యం వేటలో ప్రయాణం తాలూకు అనుభూతులని మూటలు కట్టుకోవడం మరిచిపోతుంటడు. గమ్యం చేరుకున్న మనిషి కథ బాగానే ఉంటది. ప్రయాణం కూడా బాగానే ఉంటది. చివరికి ఒక గమ్యం ఆశిస్తున్నాం కాబట్టి. గమ్యం చేరని మనిషి ప్రస్తానం గూడా బాగనే ఉంటది. దారి పొడుగుతా ఎందరో మనుషులు, ఎన్నో అనుభవాలు. ఎన్నో ముచ్చట్లు. ప్రతీ మలుపూ గొప్ప కథే. మనిషి నిత్యశోధకుడు. అమితంగ కుతూహలం ఉన్నవాడు. అంతిమ గమ్యం ఉన్నవానికి తెలుసు దిశానిర్దేశాకత్వాలు. వాడు వాని శోధన గమ్యాన్ని కలిపి  రాస్తడు. గమ్యం లేని వాడు శోధన మాత్రమె రాస్తడు.

గమ్యాల నిర్దేశికత్వం గురించి మాట్లాడుకోవాలె. ఎందరో నడిచిన దారుల్ల పుస్తక రూపం దాల్చిన గమ్యాలు దిశా నిర్దేశాకత్వాలు. ఇటు పోతే ఇది వస్తది. గమ్యం అంటే అది ఇది వరకే నడిచిన దారి, గమ్యం లేకపోవడం కొత్త దారులని వెతుక్కోవడం. సమాజం, నాగరికత ఇది వరకే నడిచిన దారులని చూపిస్తది. ఇందులో ఉపాధి, మనుగడలు కూడా ఉంటయి. ఇవన్నీ సామూహిక ధోరణి కిందనే చెందుతయి. కొత్తగ పుట్టిన వారసులకు పాత దారులని అన్వయిస్తయి. నా కొడుకు డాక్టర్, బిడ్డ ఇంజనీర్ కావాలని కోరుకుంటరు కానీ, మానవీయ సమాజపు ప్రాథమిక సూత్రానుసారం అన్వేషి కావాలని అనుకోరు. సూత్రాల ధిక్కరించి వెలుగు రవ్వలు పుడుతూనే ఉంటై. చదువు కొలమానం కాదన్న సాధారణ  కలాంలు, సగటు మనుషులతో చదువుకునే అర్హత సంపాదించలేని ఐన్స్టీన్ లూ పుడుతూనే ఉంటరు. ఇమిడి పోవాలనుకునే స్వభావాన్ని సామాజిక సాధారనీకతగ చెప్పవచ్చు. సమాజం అంగీకారం కోసమో, మనుగడ కోసమో అన్వేషి జాతి స్వతహాగా తనకు అబ్బిన స్వభావాన్ని రాజీ పడి ధిక్కార స్వరాన్ని కోల్పోతడు. ఇముడ్చుకోవడాన్ని  ఇష్ట పడతాడు. Low Profile స్వభావాన్ని ఆపాదించుకుంటడు. ఎదిగిన కొద్దీ ఎదగాల్సిన స్వరాన్ని, తపననీ, మనసునీ, అన్వేషణనీ కట్టడి చేస్తడు. ఎగరలేని మనసు కలల్లో ఎగిరిస్తుంది. కలల్లో ఆకాశాన్ని అందుకున్నవా ఎపుడన్నా? దానర్ధం నువ్వు ఎగరాల్సిన చోట ఎగరడం లేదని. ఎగరాల్సిన సమయం వచ్చిందని.

*

 

 

మీ మాటలు

 1. మొత్తం తెలుగు కథా చరిత్రనంతా వడబోసి బయటకు తీసిన వాక్యాలు. ఇప్పటి కథా గమనం లో ఇంకా రావాల్సిన మార్పులను కొత్త కోణం లో చెప్పారు. కథా రచయితలు ఈ సూచనలు కూడా పరిగణన లోకి తీసుకుంటే కథ నిజం గానే కొత్త రెక్కలతో ఎగురుతుంది.

 2. Allam Krishna Vamshi says:

  నా కొడుకు డాక్టర్, బిడ్డ ఇంజనీర్ కావాలని కోరుకుంటరు కానీ, మానవీయ సమాజపు ప్రాథమిక సూత్రానుసారం అన్వేషి కావాలని అనుకోరు. సూత్రాల ధిక్కరించి వెలుగు రవ్వలు పుడుతూనే ఉంటై. చదువు కొలమానం కాదన్న సాధారణ కలాంలు, సగటు మనుషులతో చదువుకునే అర్హత సంపాదించలేని ఐన్స్టీన్ లూ పుడుతూనే ఉంటరు. ఇమిడి పోవాలనుకునే స్వభావాన్ని సామాజిక సాధారనీకతగ చెప్పవచ్చు. సమాజం అంగీకారం కోసమో, మనుగడ కోసమో అన్వేషి జాతి స్వతహాగా తనకు అబ్బిన స్వభావాన్ని రాజీ పడి ధిక్కార స్వరాన్ని కోల్పోతడు. ఇముడ్చుకోవడాన్ని ఇష్ట పడతాడు. Low Profile స్వభావాన్ని ఆపాదించుకుంటడు. ఎదిగిన కొద్దీ ఎదగాల్సిన స్వరాన్ని, తపననీ, మనసునీ, అన్వేషణనీ కట్టడి చేస్తడు. ఎగరలేని మనసు కలల్లో ఎగిరిస్తుంది. కలల్లో ఆకాశాన్ని అందుకున్నవా ఎపుడన్నా? దానర్ధం నువ్వు ఎగరాల్సిన చోట ఎగరడం లేదని. ఎగరాల్సిన సమయం వచ్చిందని….
  Manchiga cheppinavraa… Keep it up..

 3. Sukumar DS says:

  బాగుంది సార్..

 4. nice write up

 5. Allam Krishna Chaitanya says:

  థాంక్ యూ రఘు, సుకుమార్.

మీ మాటలు

*