శాపగ్రస్తులు జర్నలిస్టులు!

 

ఈమధ్య ఓ జర్నలిస్టు మిత్రుడు అనారోగ్యంతో చనిపోయాడు. సంవత్సరాల తరబడి నిర్లక్ష్యానికి, అస్తవ్యస్తమైన biological clockకి గురైన ప్రాణం అలా కాక ఇంకెలా పోతుంది? అలానే పోయాడు శివకుమార్. ఓ మంచి జర్నలిస్టు, మంచి sense of humour వున్న వాడు, గొప్ప కొలీగ్. కంప్యూటర్లు, ఇంటర్నెట్ జర్నలిజంలో ఎలాటి విస్ఫోటనాలు సృష్టించబోతున్నాయో ఓ ఇరవై ఏళ్ల క్రితమే ఊహించగలిగినవాడు. టెక్నాలజీ నేర్చుకోకపోతే ఎంత పెద్ద జర్నలిస్టయినా మూలనపడాల్సిందే. “Technology and computers are going to be levelers,” అని చెప్పినవాడు.
(ఈ వ్యాసం మొత్తంలో ‘డు’ అని సౌలభ్యం కోసం మాత్రమే వాడేను. కానీ, ఇది జర్నలిస్టులైన మహిళలను కలుపుకుని రాసింది. నిజానికి, మహిళలు అదనంగా – పురుషస్వామ్యమనే పీడనని భరిస్తున్నారు. అది వాళ్లెవరైనా చెప్తే తప్ప ఆ తీవ్రతని వర్ణించడం కష్టం.)

అసహజ మరణాలు జర్నలిస్టులకు కొత్త కాదు. అసహజ మరణాలగురించి వాళ్ళు రాస్తారు, మంచి శీర్షికలతో ప్రచురిస్తారు. కానీ, వాళ్ళు కూడా అసహజ మరణాలకు, లేదా తీవ్ర అనారోగ్యాలతో మూలనపడతారు. అయితే, వీళ్ళు చాలా సందర్భాల్లో ఓ సింగిల్ కాలమ్ కి కూడా నోచుకోరు. ఓ దౌర్భాగ్య మరణం. దౌర్భాగ్య జీవితం.

జర్నలిస్టుల గురించి చాలా జోకులున్నాయి. నేను కూడా వేస్తాను. Quality of life వుండని జర్నలిజంలోకి పిల్లలు శలభాల్లా వచ్చి పడకూడదని అనిపిస్తూ వుంటుంది. కానీ, well-meaningగా ఆలోచించే వాళ్ళు జర్నలిజంలో లేకుంటే ఎలా అనికూడా అనిపిస్తూ వుంటుంది.
యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ ఓసారి క్లాస్ లో అన్నారు, ప్రపంచంలో ఎందుకూ పనికిరాని వాడు జర్నలిస్టు అవుతాడని. మేం పగలబడి నవ్వేం అప్పుడు. “అందుకూ పనికి రాకపోతే, జర్నలిజం టీచర్ అవుతాడని,” తనమీద తనే జోక్ చేసుకున్నారు కూడా.

“నువ్వు మనిషివా, జర్నలిస్టువా?” అనీ, ఇంకా ఎన్నో రకాలుగా జర్నలిస్టులు తమ మీద తామే జోకులు వేసుకున్న సందర్భాలున్నాయి.
జోకులు సరే, సమాజంలో జర్నలిస్టుల బాధ్యత గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. మంచీ వుంది, చెడూ వుంది. చెడే ఎక్కువగా వుందన్న మాటకూడ వాస్తవమే. కానీ, మంచి జర్నలిస్టులు చేస్తున్న కృషి తక్కువేమీ కాదు. తమకు వీలైనపుడు, లేదా తమకున్న కొంచెం spaceని తెలివిగా వాడుకుని ప్రజల సమస్యలకు చోటు కల్పించే, ప్రచారం కల్పించే జర్నలిస్టులు ఎందరో వున్నారు. నిశ్శబ్దంగా ఎంతో పనిచేస్తున్నారు మంచి జర్నలిస్టులు కొందరు. వాళ్ళ గురించి ఎవరికీ తెలీదు. తెలియాలని అనుకోరు కూడా. ఓ గొప్ప వార్త రాసిన రిపోర్టరో, ఓ గొప్ప శీర్షిక పెట్టిన సబ్-ఎదిటరో ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఓ రోడ్డు మలుపు దగ్గరో కనిపించి వుంటాడు. కానీ, faceless జర్నలిస్టులు మనమధ్య తిరుగుతూ, మన సమస్యలు, మన సంతోషాలు గమనిస్తూ వుంటారు. (సీనియర్ జర్నలిస్టు శశాంక్ మోహన్ పెట్టేరొకసారి ఓ శీర్షిక – సరదా సరదా సిగిరెట్టూ, పైలోకానికి తొలిమెట్టు అని).

ఎంత మంచివాడైతే, ఎంత తెలివైన వాడైతే, ఎంత గొప్ప కొలీగైతే ఎవరికి లాభం? తనకి, తనకుటుంబానికి మాత్రం కాదు. అంటే, లక్షలు కోట్లు సంపాదించడంలేదని కాదు. తనమీద తాను పెట్టుకోగలిగిన, తన కుటుంబం మీద పెట్టుకోగలిగిన టైమ్ పెట్టుకోలేదు. ఏ సాయంత్రమూ, ఏ ఉదయమూ (రాత్రి లేటవడం వల్ల) పిల్లకు పెట్టలేడు. పిల్లల బాల్యంలో, చదువులో భాగస్వామ్యం వుండదు. కుటుంబంతో వెళ్లగలిగే సరదాలకు, సందర్భాలకు వెళ్లలేడు. వెళ్ళినా అందరూ వెళ్లిపోయాకనో, లేదా అక్కడ అందరికీ ఉత్సాహం అయిపోయాక, ఆ సందర్భం అయిపోయాక, కుటుంబ సభ్యులు చిన్నబోయాక.

(మెజారిటీ) జర్నలిస్టుల జీవితాలు దుర్భరం. బ్రోకర్లుగా మారి, పార్టీల కార్యకర్తలుగా మారి, పోలీసు దూతలుగా మారి, అవకాశవాదులుగా మారి డబ్బులు సంపాదించిన, సంపాదిస్తున్న జర్నలిస్టుల గురించి కాదు. ఆర్ధిక పరమైన దుర్భరత్వమే కాదు. మానసికంగా తీవ్ర వత్తిళ్ళకి గురై, ఆ వత్తిళ్లను తట్టుకోడానికి ఏదో ఒక అలవాటు చేసుకుని, అది వ్యసనమై చుట్టుకుని చతికిల పడ్డ జర్నలిస్టుల సంఖ్య చాలా ఎక్కువ.

తెలివితక్కువ లేదా అహంకారులైన ఎడిటర్ల బారిన పడి ఆరోగ్యాలు, ఉద్యోగాలు పొగుట్టుకున్న జర్నలిస్టులు ఎందరో. ఈ దుస్థితి తెలుగు జర్నలిజంలో మరీ ఎక్కువ. అవకాశాలు తక్కువగా వుండడం వల్ల, పేపర్లన్నీ బాధిత జర్నలిస్టుల పట్ల పత్రికా యాజమాన్యాలన్నీ మూకుమ్మడి నిషేధాన్ని విధిస్తాయి. ఎక్కడా వుద్యోగం రాదు. రాయడం తప్ప ఇంకే పనీ చేతకాని జర్నలిస్టులు ఎక్కడో అనామకంగా రోజులు వెళ్లదీస్తారు. ఎక్కడో అక్కడ ఏదో వుద్యోగం సంపాదించినా అదీ సజావుగా సాగదు.

ఇరవై ఏళ్ల క్రితం ‘ఉదయం’ మూతపడ్డాక ఉద్యోగాలు కోల్పోయి, ఇప్పటికీ సరైన జీవనోపాధిలేని జర్నలిస్టులు తెలుసు నాకు. ఎక్కడైనా బస్సులో వెళ్తున్నపుడో, రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నపుడో తారసపడతారు. మనసు చిపుక్కుమంటుంది.

అలాటివాళ్లూ, ఇంకా రిటైరైన వాళ్ళు ఎక్కడైనా కనిపించినపుడూ కనిపించినపుడు, “ఎలా వున్నారు? ఎలా గడుస్తుందీ,” అని అడగకుండా వుండలేను.
సరే, తిరగగలిగినపుడు వుద్యోగం వుంటే వుద్యోగం లేకపోతే ఇంకేదో పని చేసుకుంటూ బతుకుతారు. మరి ఆ తర్వాతో? ఉద్యోగం వున్నపుడు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని గొప్పలు పోయిన జర్నలిస్టులు, కింది ఉద్యోగులని నీచంగా చూసిన జర్నలిస్టులు, డెస్కు తప్ప లోకమే తెలీకుండా బతికిన జర్నలిస్టులు, పేపర్ గొప్పని పేపర్ యాజమాన్యం గొప్పని తమదిగా భావించి వూడిగం చేసిన జర్నలిస్టులు – వీళ్ళందరూ హఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడ్డ ఉదాహరణలు ఎన్నో.

అందుకే, శాపగ్రస్తులు జర్నలిస్టులు. అంటే మిగతా వృత్తుల్లో వున్నవాళ్లు కాదని కాదు.
ఇది మా జీవితం.

*

 

మీ మాటలు

  1. చందు - తులసి says:

    కూర్మనాథ్ గారూ..
    జర్నలిస్టులు, ముఖ్యంగా గ్రామీణ విలేఖర్లు …ఈ మధ్య నాలుగు రూపాయలు చూస్తున్నాం కానీ
    గతంలో నానా తిప్పలు పడేవాళ్ళం.
    ఇప్పటికీ జర్నలిస్టులకు లోన్లు ఇవ్వరు కదా..
    ఐనా అక్షరాలను నమ్ముకుని ….అదే ఆనందంగా బతకుతున్నాం.

  2. కదిలించిందండీ…….తప్పులు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా….ఉన్న కొద్దిమంది పాతికేయులే జగతికి జవాజీవాలు. అక్షరబంధంతో వ్యాసం చదివి గర్విస్తున్నా….

  3. B.Narasimhareddy says:

    పత్రికా రచయితలు సమాజంలో గౌరవంగానే పిలవబడుతారు. కానీ వారి వృత్తి స్థానాల్లోకి అడుగు పెట్టగానేవెట్టి చాకిరీ చేయాల్సిందే.
    సంపాదకులకు కూడా అదే పరిస్థితి వచ్చింది. అందుకే 6 నెలలు తిరక్కుండానే ఆఫీసు మారుస్తుంటారు. మేనేజ్ మెంటు మాత్రం సంపాదకులను,పత్రికా రచయితలను పొగిడి, పొగిడి మరునాడే ఉద్యోగం ఊడబెరుకుతుంటారు. కనుక రచయితలు మేధావులుగా గాకుండా, వెట్టి చాకిరీ పనివారుగానే గుర్తింపబడుతారు. స్వతంత్రంగా వ్యవహరించుతున్న సంపాదకులు గాని,రచయితలు గాని ఉంటే సర్వే చేయటం మంచిది.

  4. nagendra sai says:

    ఆత్మసంతృప్తితో అలా బతికేస్తున్నాం. అలా అని మనసును సరిపుచ్చుకోకపోతే.. బతకలేం. రాయడం తప్ప ఇంకేమీ రాదు. ఒక్కోసారి.. భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తుంది. మరోసారి.. మనమీద మనకే జాలేస్తుంది. రాయడం తప్ప ఇంకేమైనా వచ్చా.. ? అని ఎవరైనా అడిగితే.. చెప్పేందుకు సమాధానం లేదు, ఉండదు. ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయామా.. అని అనుకోవడానికీ మనసొప్పదు. అన్ని ఉద్యోగాల్లానే ఇదీ ఉంటే.. మన ప్రత్యేకత ఏముంటుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. మీరు ఫలానా ప్రోగ్రాం బాగా చేశారనో.. ఫలానో ఆర్టికల్ బాగా రాశారనో అంటే చాలు.. నెల రోజుల టానిక్ అది. అలా అలా.. గడిచిపోతోంది జీవితం. అందరూ మనల్ని వాడుకునే వాళ్లే కానీ.. అవసరానికి ఆదుకునే వాడు ఒక్కడూ ఉండదు. వాళ్లు ఎంత మంచితనంగా ఉన్నా.. ఎన్ని మన్ననలు పొందినా..

  5. Gurrala mahesh says:

    సర్..
    మీ అనుమతి లేకుండా ఈ అంశాన్ని కాపీ చేసి మా whatsapps గ్రూప్ లో మీ పేరుతో పేస్టు చేశాను .. జర్నలిస్ట్ ల సమస్యలపై అర్థవంతమైన చర్చ జరిగింది .. ధన్యవాదాలు..

  6. M Sagar Kumar says:

    జర్నలిస్టుల జీవితాన్ని ఆవిష్కరించినందుకు థాంక్స్ కూర్మనాధ్ గారు.

  7. nagu kakimukkala says:

    జర్నలిస్టు బతుకుల స్కానింగ్ రిపోర్ట్ లా ఉంది

  8. nirmala kondepudi says:

    బావుంది కూర్మానాధ్, మీ ఆర్టికల్ చదివాక నా జర్నలిస్ట్ జీవితం ఒక దశలో కడుపుమండి రాసుకున్న సెటైర్ గుర్తొచ్చాయి.

    పెట్టుబడి దారుడి చీలమండకొక ప్రేమలేఖ
    +++++++++++++++++++++++++++++++++

    ఓర్నీ చమత్కారం మండిపోనూ,
    ఎన్ని నేర్చినావురా..?
    పెట్టుబడిదారుడి బట్ట మీద రెట్టా…|
    పాదానికో లోకం చొప్పున ముల్లోకాలూ ఎక్కి తొక్కేసిన వామను డు కూడా నీ ముందు బలాదూరే.
    ఏంది బే..ఏమిటి అంటున్నావు….లాభాలు ఆశించకుండా “పరోపకారం మిదం శరీరంగా పత్రిక పెట్టాడా నీ దొర…?
    అవున్లే ఇంకేం చెబుతావ్ మరి…మనిషి మాంసం పచ్చళ్లనుంచీ, రియల్ ఎస్టేట్ల కుంభకోణం నుంచి, కబేళాల్నించీ, తల్లిదండ్రులకి పిల్లలమీదుండే భవిష్యత్ భయాల్ని బ్లాక్ మెయిల్ చేసే బడి వ్యాపారాల్నించి కొట్టుకొచ్చిన బ్లాక్ మనీ కరగపెట్టడమే దీని ఉద్దేశ్యమని చెప్పలేవు కదా..
    నువు వాడికి నీడవి, గోడవి, బూటుకింద నాడావి.
    పెట్టుబది ,పెట్టుబడి అంటూ నిమిషానికి నూటపాతిక సార్లు అదే పనిగా రెచ్చిపోకు. అదేదో చాతబడి పదం లా వినిపిస్తుంది నాకు..
    నీ పెట్టుబడి- – వంద పీకల్ని తెంపుకొచ్చిన రూక
    నా పెట్టుబడి – నిరంతర మేధో చాకిరి, నా ఏకాగ్రత, ఉనికి, మాన మర్యాద, చెమట కన్నీరు|
    న్యూస్ ప్రింటుకి డబ్బులేదంటూ అనేక సార్లు మా శక్తులన్నీ కుదువబెట్టావు. కాబట్టే పత్రిక బావుళ్ళేదన్న ప్పుడల్లా నా మొహం బావుళ్ళేనట్టో ,రక్తం పల్చబడినట్టొ అనిపించి ఫీలయిపోతుంటా..
    అసలు మీ పత్రికలో మాచేతి రాతలు ,తల రాతలూ ఎప్పట్నించీ బావుంటాయో అడగటానికే నీ దగ్గరకొచ్చాన్రా…
    నేనడగాల్సింది నువ్వడిగే సరికి కిందుమీదవుతున్నాం. కంత్రీ నాకొడకా…..
    నడమంత్రపు సిరితో నువు సెల్ ఫోను చెవిలో పెట్టుకుని మూడు చెంచాల్ని,
    ఆరు చుంచు గరిటెల్ని వెంటేసుకుని తిరుగుతుంటే ఒరే..
    గుడ్డు పెట్టిన కోడిని చంపి, కోడి బొచ్చు గుడ్డుకి అతికి పెట్ట మాంసం పేరిట మార్కట్టు తెరిచినట్టే వుంటుంది.
    పాత వాళ్ళ బకాయీలు పూడ్చకుండా అత్యంత ఉత్సాహవంతులయిన కొత్త వాళ్ళని కొలువుకి పిలవడం భాయీ , భాయీ అనుకొమ్మనడం నీకు తప్ప ఇంకెవరికి చాతనవుతుందిరా.. చెక్కమొహం నా కొడకా…
    అత్యంత ఉత్సాహవంతులనగా ఎవర్రా..?జీతం లేకుండా, జీవితేచ్చ లేకుండా,చీమూ నెత్తురూ లేకుండా, వెన్నెముక లేకుండా బతికే వాడని అర్ధమా..?
    ఎంత వెర్రి బాగుల ఇల్లాలికైనా శత్రువు సవతి కాదురా..ఆ ఇద్దరి మధ్యా కంచాల పోరాటం, మంచాల పోరాటం ఏర్పాటు చెసిన వాడే దొంగ.
    నీ పేపరు పేరు చెప్తే ఫొటొ గ్రాఫర్లు దౌడు తీస్తున్నారు. రచయి్తలూ ,కిరాయి రిపోర్టర్లూ లగెత్తుకు పోతున్నారు.ప్రతి సంచిక కోసం ఫేస్ వాల్యూ పొరలు పొరలు గా వొలుచుకుని, వొలుచుకుని మొహాలు , మోహాలు లేకుండా మిగిలిపోయాంరా..
    ఇప్పుడిక్కడ మా బలహీనతే నీ పెట్టుబడి…..

    పాలికాపుకి కూడా మగబిడ్డేనా ? అని వెనకటికి నీలాంటి మదించిన భూకామందు చిందులు తొకినట్టు, జర్నలిస్టు పిపీలకాలకి ఆక్సిజన్ కూడా ఎందుకని ఫాన్లు, ఎ.సి లు కత్తిరించి పారేశావు. జీతాలు తొక్కి పెట్టావు. కన్వేయన్సులు మింగేశావు.
    టీ నీళ్ళకు రేషను పెట్టావు. పి.ఎఫ్.లు వడ్డీలకు తిప్పావు.రిజిస్టరులో ఆలస్యం మార్కు చుక్కలన్నీ మా కూలి డబ్బులకు బొక్కలుగా మార్చావు.
    ఇంతమంది చమటనీ మగ్గపెట్టి, మగ్గపెట్టి కంపోస్టు చేసిన లక్షల్లో
    కమాషను ఎవరిది రా ..?
    నువు మాకు బ్రదర్నని చెబుతావురా బడితె నాకొడకా..|
    రేపెప్పుడో మాకు రెండేసి కిడ్నీలూ, కళ్ళూ, రెక్కలూ, కాళ్ళూ కూడా దండగనుకుంటే, అవి కూడా నీ న్యూసు ప్రింటుకి పనికి వస్తాయనుకుంటే కత్తిరించుకు పోతావని పందెం వేసుకుని వున్నాంరా…

    నువ్వు, నీ దొరగారి కుడి ఎడమ భుజాలూ, మోకాళ్ళూ,చీల మండలూ కలిసి చెప్పే కబుర్లకి మాకు కిత కిత లు పెట్టినట్టు నవ్వొస్తోందిరా..
    ఈ సారి మీటింగు పెట్టినప్పుడు ఆ ముక్కిపోయిన బూందీలూ, కుక్క బిస్కెట్లూ మానేసి, చెవిలో పెట్టుకోవడానికి, మింగి చావడానికి కాసిని గన్నేరు పువ్వులు, కాయలూ కూడా తెప్పించి వుంచు.

    కంపెనీ కి ,సారీ… పత్రిక్కి లాభాలొచ్చాయొ నష్టాలొచ్చాయో ఇండియా మ్యాపు లాంటి నీ నోట్లోంచి, పొంచివున్న మొసలి లాంటి నీ కొండ నాలుక మీంచీ వినడమే తప్ప మాకెలా తెలుస్తుందిరా..
    వ్యాపార మర్మాలు , మనిషి మాంసం కూర్మాలూ నీ సబ్జెక్టు కదా…
    నీకూ సాహిత్యానికీ , నీకూ జర్నలిజానికి ఎలాంటి సంబంధం లేనప్పుడు మా బతుకుల మీదుగా ఈ కోతి కొమ్మచ్చులెందుకురా..
    నువు అబిడ్సు సెంటరులో మంత్రాల ఉంగరాలు, చాతభడి తాయత్తులూ అమ్ముకుంటే బాగా రాణిస్తావు.
    ఏళ్ళ తరబది కరువు భత్యమైనా పెరగని మాతో ఎందుకురా భేటి పడతావు..?
    గౌతమ బుద్ధుది జ్నానానికి ఒ రావిచెట్టూ, నదీ తీరం లాంటి క్లాసికల్ హంగామా
    బోల్డం త కావాల్సివచ్చింది. జర్నలిస్టుకి శ్మశాన వైరాగ్యం ఏ పత్రికలో కూచున్నా వస్తుంది.|||
    ఓ చేత్తో రిజిగ్నెషనూ, ఇంకో చేత్తో అప్లికేషనూ పట్టుకుని నీ లాంటి నా కొడుకులు ఎక్కడెక్కడ సర్పయాగాలు చేస్తూంటారా అని ఎదురుచూస్తుంటాం.
    బోర్డు పెట్టి పెట్టగానే వాన పాములూ, త్రాచు పాములూ, సగం చచ్చిన పాములూ ఆత్మాహుతి దళాల్లా దూకేస్తాం.

    సంస్థలో పని చేస్తున్న వాల్లవే కాదురా, పని మానేసిన వాళ్లవీ, పోన్లే పాపం అనుకుని కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళవీ అయిన చెమటలూ రక్తాలూ నువ్వే తాగుతున్నావు.
    జగడాల నా కొడకా.. నువ్వు జగడం పడేదే బకాయీలు ఎగ్గొట్టడం కోసం కదరా..
    నీ దగ్గరకు వసూళ్ళకోసం వచ్చిన ఏ ప్రాణి అయినా ముళ్ళమీదే తప్ప కుర్చీ లో కూచోడం నేనింతవరకు చూళ్ళేదు.
    ఏమిటి అంటు్న్నావు ? మళ్ళీ చెప్పు..ఏలిన వారి ఆర్ధిక క్లేశం తీర్చడాన్కి మనం చందాలు వసూలు చెయ్యాలా..? చీచీచీ…
    ఒరే, సాయంత్రానికి నా ఇంట్లో బియ్యం లెకపోయినా సరే , పొద్దుటి ముద్దలో వంటబట్టిన ఉప్పూ కారం పౌరుషంతో బతుకుతాం తప్ప ని అంత నీచాతి నీచమైన ఏడుపు సీన్లు రక్తి కట్టీంచ లేమురా…
    హేమిటేమిటి..? కంపెని లాభాలు లెక్కెట్టుకోవడమ్లో పడి పెళ్ళాం పిల్లల్ని ముద్దు చెయ్యడం కుదరడం లేదా నాయినా…
    మరి మా వంక చూశావా..?
    పెళ్ళయితే పెళ్ళానికి తిండి పెట్టాల్సి వస్తుందని మానేసిన వాళ్ళు, కాపురం చేస్తే పిల్లలు పుట్టేస్తారనే భయం తో అది మానేసిన వాళ్ళూ వున్నారు తెలుసా…?
    స్వామియే శరణ మయ్యప్పా……..

    ట్రెయినీ స్టాఫుకి, ట్రెయినింగులు పూర్తి కాక ,
    సీనియర్సుకి సీనియారిటియె అనర్హతగా ,
    రోజూ రెండు బస్సులెక్కి వచ్చి బొమ్మ లేస్తున్నవాడికీ, కంపోజింగు ,పేజి మేకప్పూ చేస్తున్నవాడికి రిజిస్త్రులో పేరెప్పుడు రాస్తారో తెలీక – బిక్క చచ్చి వున్నారు.
    వెహికిలూ, టేపు రికార్డరూ, కెమేరా, ఐడెంటిటీ ,అక్రిడేషను కార్డూ లాంటి కనీసపు గుర్తింపులేమీ లేకుండా , పిచ్చి బిచ్చగాళ్ళకు మల్లే మేం ఎక్కడకు వెళ్ళి ఇంటర్వూలు తీసుకున్నా- కూచున్న కుర్చీయో, తాగిన నీళ్లగ్లాసొ ఎత్తుకుపోతామేమో నని అనుమానంగా చూస్తున్నార్రా,,
    జీవన ప్రమాణం పెరక్కుండా పని ప్రమాణం పెరగాలను కునే పిశాచి బుద్ది నా కొడకా…

    యూనియన్ గాళ్ళు కూడా నీకు అన్నలే..
    ఏలినవారు నవ్వినప్పుడు బంగారు దంతాల మీదికి, తిట్టినప్పుడు వెండి నాలుక వెనక్కి నక్కి నక్కి చచ్చె నక్క నాయాళ్ళే.అంచేత పని చేసే హక్కే తప్ప వేతనపు హక్కు లేని మాలో ఏ రెండు గుండెలూ ఒకలా స్పందించడం మానేశాయి.
    పండం టి బిడ్డ పుడుతుందని తొమ్మిది నెలలూ మోసిన తల్లికి బండరాయి పుడితే ఎలా వుంటుందో మా జీతాల రో జు అలా వుంటుంది…….

    జీతం ఇవ్వకుండానే కాదురా.. ఇస్తున్న క్రమంలో కూడా అవమానించడం నీ ఒక్కడికే తెలుసు.
    ఒకరికి తెలీకుండా, ఒకరు చిప్ప పట్టుకుని అడుక్కుని, బట్టలు చించుకుని, జుట్టు పీక్కుని ఎవరెక్కువ సార్లు నీ చుట్టు తిరిగితె వాళ్ళకి రహస్యంగా ఇస్తావేందిరా..బహిరంగ శ్రమకి లాలుచీ వేషాలేమిటి..?
    అవి నెల జీతాలను కున్నావా… వయాగ్రా మాత్రలనుకున్నావా..?వంకర బుద్ధి నా కొడకా..|
    చేసిన రిపోర్టుకి రికార్డింగు ఫెసిలీటి లేక రోడ్డున పడ్ద వాళ్లం వున్నాం. ఎన్ కౌంటరు స్టోరీలు రాసి నిఘా పాలయిన వాళ్ళం వున్నాం..పస్తులుండి పండగ స్పెషల్సు, సంకెళ్ళలో స్వతంత్ర దినోత్సవ సంబరాలు రాసిన వాళ్ళం వున్నాం
    ఒరె… మేం చస్తే కూడా నీ పేపర్లో వార్త రాదని తెలుసు.
    రోడ్డుమీద ఇప్పటికే అనేకమంది బిచ్చగాళ్ళుండటం వల్ల , రోడ్డు బిచ్చగాళ్ళకంటె బిల్డింగు బిచ్చగాళ్ళు నయమనే భ్రమలో రోజూ నీ ఎస్టేట్లో కూచుంటూన్నాం.
    మాకంటే గొప్ప గొప్ప జర్నలిస్టులూ మట్టికొట్టుకునే వున్నారన్న ఒదార్పు తప్ప -నీగ్గాని, మాగ్గాని ఇంకో స్వస్వరూప జ్ణానమ్ ఏమున్నది చెప్పు.?
    ఆరువేలకి సంతకం చేసి అందులో సగమే అందుకునే వాడి గుండె కోత నీకెప్పటికి అర్ధం అవుతుందిరా..?

    మా లొంగుబాటు తనం యావత్తు బానిసత్వాల స్థాయీ బేధం తప్ప ఇంకోటి కాదు. పాక్కుంటూ కొందరం , వెన్నెముక వొంచి కొందరం, కేవలం తల మాత్రమే వాల్చి కొందరం నీ గోళ్ళని వార్నీష్ చేస్తూ, కోరలు పదును పెడుతూ…
    ఆకలి సమస్య ముందు ఆత్మాభిమానం బతికించుకోవడం కష్టం గా వుందిరా..
    గొర్రె కసాయి వాడ్ని నమ్మడమం వల్లనే చావదు.- నమ్మక పోవడం వల్ల బతికేదీ లేదు.
    యాడ్స్ లెకపోయినా పత్రిక నడుస్తుంది. మార్కెటింగు సిబ్బంది లేకపోయినా పత్రిక నడుస్తుంది. యాజమాన్యపు దంతాలు, పుచ్చుగోళ్ళూ, భుజాలు లెకఫోయినా పత్రిక నడు స్తుంది.
    రిపోర్టర్లు లేరంటూ తెల్ల కాగితాల సంచిక నడిచిందిట్రా చరిత్రలో ఎక్కడైనా…?
    అంటే నీ పేపరుకి నా రాత మొదటి పెట్టుబడి.
    రాసే వృత్తిలో వృత్తిలో వున్న వాళ్ళకి కలాలు కూడా ఇవ్వలేని కక్కుర్తి నాకొడకా…
    పదేళ్ళూ , పదిహేనేళ్ళు పనిచేశాకా కూడా నువ్వు తల్చుకుంటే ఒక్క నిమిశంలో అన్ ఫిట్ అయిపోతాంరా…
    ఎందుకంటె కంపోజింగ్ గాడిని, ఎడిటోరియలుకి, మార్కెటింగుకి గాడిని చెంచాల నిర్మాణానికి బదలాయింపు చెయ్యడంతో నే జీ జులుం మొదలవుతుంది కదా..
    మాకు వచ్చిన పని కాక ,నీకు నచ్చిన పని మొదలెట్టిన రోజే ఆత్మద్రొహం మొదలయినట్టు లెక్క.
    మెడకొక కత్తి చొప్పున నువు కనిపెట్టిన కోదిపందేల్లో ఎవరి పీక తెగినా నీ విందుకి లోటు లేదుగా.
    రూరల్ ఏరియాల్లొ రిపోర్టర్లనీ, స్టిగర్లనీ అడుక్కు తినమని ప్రకటిస్తావా..?ఎలాంటి జన్మ రా నీది…
    నీ సర్ప యాగాల్లో జోక్యమ్ చేసుకున్నామా..?
    స్వామీజీ తీర్ధాల్లో వాటా అడిగామా..?
    శవపూజల రహస్యం బైటికి చెప్పామా..?
    చేసిన వన్నీ చేసేసి, రెడ్ లైట్ ఏరియా లాంటి నీ పర్సనలు గదిలో ఏ పార్టికి కొమ్ము కాసినా, ఎంత విప్లవం కబుర్లతొ ముస్తాబు చెసినా ఎప్పుడూ నోరెత్తనే లేదు కదరా….
    అప్పాయింటు మెంటు ఆర్డరు చేతికిస్తూనే నువు ఆజ్నాపించిన వృత్తి పాతివ్రత్యం ప్రకారం ఈ చేతులు ఇంకెక్కడా పని చెయ్యకుండా, ఈ కాళ్ళు ఇంకెటూ నడవకుండా , ఈ ముక్కు ఇంకెక్కడా చీదకుండా నీ ఎరీనాలో పాతి పెడతావు కదరా..
    బోఫోర్సు గాళ్ళనీ , మనిషి బలి గాళ్ళని చూసీ చూడనట్టుండే సర్కారి కూడా, అచ్చం నీలాగే ప్రశ్నించే వాళ్ళనీ, మెడమీద తలకాయ వున్న వాళ్ళనీ వేటాడి తింటోండి.
    గోళ్ళలో గుండు సూదులు దించి వ్యభిచారం చేయించినట్టుగా నచ్చని నా రాతలకీ, సర్కారీకీ, విలువలకీ మేక్కొట్టీన నా ఆత్మ బలికి నష్ట పరిహారం ఏమిస్తావు? సర్వీసుకేమిస్తావు? సారం లేని నా నవ్వులకేమిస్తావు..?
    హైటెక్కు స్పీడెక్కాలంటే పాలమూరి లేబరు , ఉరఫ్ వెట్టిచాకిరి , ఇంటూ బానిసవమ్ వర్ధిల్లాలి.
    రాజకీయాలూ, స్వకీయాలూ ఆనందం గా గోక్కుంటూ వేదిక కట్టాలంటే మాలాంటి రాతగాళ్ళూ, నిలువీతగాళ్ళు బతికితీరాలి.
    రాడికల్ వ్యవస్థ కాడ్నించి, రమ్యకృష్ణ గారి పిర్రమీది పుట్టుమచ్చ పజిల్ దాకా ఏదడిగితే అది రాస్తున్నాం. వల్గారిటీ తగ్గించరా ఒరే…
    విదేసీ వయాగ్ర, స్వదేసీ పెనిగ్రా ముచ్చట్ల తో బాటు పెరిగిపోయిన అత్యాచార వార్తలు కూడా అందంగా నే బాక్సు కడతాం. మనిషి కన్నీళ్లని వార్తలు తప్ప ఇంకెలానూ స్పందించడం ఎప్పుడో మానేశాం.
    ప్రిటీంగు మీడియా చచ్చిపోయిందనే మాట వినడాన్కి ముందే అనేక మంది విలేకరులు నీ మూలంగా ఉరేసుకున్నార్రా…
    లేడి డయానా ప్రెస్ నుంచి పారిపోవడాన్కి తునాతుఅనకలైతే , ప్రెస్ వాళ్ళు ప్రెస్ లోనే దూకి ముక్కలౌతున్నారు. బాగు పడుతున్నది పెట్టుబడి దారుడే…
    బయటోళ్ళ పేపర్లోంచి మేటర్లు దించేసి, అచ్చుగుద్దుకునే చద్దిమొహం చిన్న పత్రికలోడిక్కూడా జర్నలిస్టే లోకువ.
    వాడి పేపరులోంచి వీచే అయోమయ దుర్గంధాన్ని ముట్నూరి పీలిస్తే ముక్కు వాచి ఏడుస్తాడు. నార్ల పీలిస్తే నాలుక తెగ్గోసుకుంటాడు.
    జర్నలిజానికి, మందుసీసాల వ్యాపారాన్కి తేడా తెలీని జలగ నా కొడకా…
    నూకలకు ఆశపడి వలలో చిక్కుకున్న చిత్రగ్రీవుల కధ పునరావృత్తమవుతోంది.
    దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అంతర్జాతీయ వలలే. ఇక్కడి గల్లీలో జరిగిన హత్యలు ,అరాచకాలు రాయాల్సిన చేతులు పల్లీల్ని వేయించి ,సంస్కృతీపరంగా పాకం పట్టడమేలాగో నేర్పుతున్నాయి.
    ఎక్కడైనా ఎవరికైనా స్పాన్స “రింగు మాస్టరే కింగు.”
    వాడి బుర్రలో వున్నది విజ్ణాన శాకుంతలం.
    వాడి టోపీ విసిరి సృష్టీంచిన పిల్లులే ఆత్మలింగాలు.
    జ్యోత్శ్యమూ, హస్త మైధునమూ అత్యాధునిక స సర్క్యులేషను అవడం
    చిత్రమేంకాదు.
    అంతా ఊహించుకున్నదే.
    వ్యవస్థకి చికిత్స చేయాల్సిన వాళ్ళే చచ్చి వూరుకున్న నేపధ్యంలో రోగ కారక క్రిములు బతికెస్తున్నాయి.
    “ఎవరికెన్ని పెట్టుబళ్ళుకావాలో అన్నేసి పెట్టుకోండోచ్” – అంటు నీ యబ్బ చంద్రబాబు ప్రకటన చూశావు కదా.
    దేశం మీదికి ఇక బుల్ డోజర్లు వచ్చేస్తాయి.
    ఇండియన్ రక్తం మీద అమెరికన్ డిస్నీలాండు తేలుతుంది.
    సొంతమొగుళ్ళే కాదు ఇక పరాయి మొగుళ్ళూ అత్యాచారం చెయ్యడానికి అత్యుత్సాహంతో ముందుకొస్తారు.
    తస్సాదియ్యా……
    పాత కోరలకీ, కొత్త కోరలకీ
    పాత గోళ్ళకీ ,కొత్త గోళ్ళకీ
    పాత వ్యూహాలకి ,కొత్త వ్యూహాలకీ యుద్ధమే యుద్ధం.
    గాంధీ అనబడు వెర్రిబాగుల ముసలి వాడు కొల్లాయి గట్టి బ్రిటీషు వాడ్ని తరిమికొడ్తే మనం పాలిస్టరు గోచీలు చుట్టుకుని స్వదేసీ, విదేసీ దంతాల వెనక దాక్కుండాం.
    ఓరి నిన్ను తగలేయ్యా…ఇంకెప్పుడూ అనకురా పత్రిక ఆర్ధిక స్థితి బావుళ్ళేదని,
    ఆంఢ్ర భ్రమ వాడు – శ్రీరామ చంద్రుడని,
    ఆంధ్ర చీమి వాడు – సత్య హరిశ్చంద్రుడని,
    ధూర్త గాడు – ధర్మరాజనీ,
    అజ్ణాన్ గాదు – వరాలిచ్చే శివుడనీ
    ఏ టి,వి గాడూ – కేటు గాడు కాదని
    ఉదయ మధ్యాన హంతకులు- నోట్లో వేలు పెడితే కొరకలేరనీ ,
    అనకురా అబ్బీ అనకు.
    నవ్వలేక నా పొట్ట చెక్కలవుతోంది.
    కర్ణూడి చావుకు సవాలక్ష కారణాలుండచ్చు.
    జర్నలిస్టు చావుకు నీలాంతి చెంచాగాడు ఒక్కడు చాలు.
    ప్రజా సమస్యలకీ, పాలకుల కబుర్లకీ మధ్య నిరోధ్ తొడుగుల్నీ, నిర్లేప్ పెంకుల్నీ ఇరికించీ అమ్ముకునే ప్రకటనల పిచ్చి నా కొడకా…
    ఇండియా లో డ్రైనేజీ మూతలు తీసిన గోతుల మీదుగా నెక్లెస్ రోడ్లు న్నట్టే , పడిపోయిన పత్రికల పక్కనే , జర్నలిస్టు ఉత్పత్తి కర్మాగారాలున్నాయి.
    ఒరేయ్..ఒరేయ్..ఒరేయ్ ఎంత కడుపు మండినా నా దగ్గర పిడీకెడు తిట్లు కూడా లేవేంటిరా..
    ఏది విసిరినా అది ఆడాళ్ళమీదికో , దళితులమీదికో,జంతువులమీదికో పోతోంది.
    లాకౌట్ల నాకొడకా…కేపటలిస్టు కంటే బూతు మాట ఏ లోకం లోనూ లేదురా..
    మనసుంటే చూడు, చెవులుంటే విను.
    ఏ నలుగురు పాఠకులు చీ కొట్టి ఉమ్మేసినా అందులో నీ పేరే వుంటుంది.
    ఏ ఇద్దరు ఖద్దరు గాడిదలు తల తాకట్టు పెట్టినా అది నీ నిర్వాకమె అయివుంటుంది.
    ఏ గుంపు నీలి వార్త రాసినా అందులో నీ ప్రోద్బలమే దిగబడుతుంది.
    రిపోర్ట్ చేసే వృత్తిలో వున్న వాడ్ని నేరస్థుడిగా మార్చే నయవంచక నా కొడకా..
    నువు చేసిన వంద తప్పులూ పూర్తయిపోయాయి.
    నీ ఊరేగింపు ముగిసిందిరా..
    ఇక నిమజ్జనమె మిగిలింది.

    ++++++++++++++++++++++++++++++++++++
    (కొండేపూడి నిర్మల – “అవమానం” డెస్క్ నుంచి )

    • మనసు లోంచీ కలిగిన బాధ – ఒక ఫిజికల్ పెయిన్ లా బాధించడం మొదటి సారి అనుభవం ఐంది….దీనిని దశాబ్దం పాటూ ఎలా మోసారండీ నిర్మల గారూ – పంచుకోకుండా!

  9. నిర్మల గారూ,
    మీరు చెప్పిన దాంతో పోలిస్తే నేను చెప్పినది ఏమీ కాదు. చాలా పవర్ ఫుల్ గా వుంది. అది ఒక సామూహిక ఆగ్రహ ప్రకటన.

  10. G.venkatakrishna says:

    కుర్మనాథ్ డి తడి తడి స్వరం , కవి నిర్మల గొంతుకలోఆగ్రహ ప్రకటన గా మారి జర్నలిస్టుల మీద సానుభూతి లేని నన్ను కూడా నిలేసింది …..maarqez లాంటి రచయిత కుడా జర్నలిస్తే నని గర్వపడండి…..

  11. కూర్మనాథ్ గారు, బాగుంది.. ఇంతకన్నా చెప్పడానికి ఏముంది? అంతే మన జీవితాలు…

    • అవునండీ. ఎంతైనా చెప్పొచ్చు అనుకుంటాం కానీ ఎంత చెప్పినా అంతే, ఎంత చెప్పినా తక్కువే

  12. kondepudi nirmala says:

    కృతజ్ణతలు కూర్మానాధ్ , వెంకట కృష్ణ గారూ,
    ఒక్క పిసరు కూడా ఎడిట్ చెయ్యని ఒక ఆగ్రహ ప్రకటన ఇది. అర్ధం చేసుకున్నందుకు సంతోషంగా వుంది. దశాబ్దం క్రితం ఎప్పుడో ఒక రాత్రి నిద్రకాచి రాసుకుని ఎక్కడికీ పోస్టు చేయలేక దాచుకున్నాను. కూర్మానాద్ వ్యాసం వల్ల ఇలా బైట పడింది.

Leave a Reply to కల్యాణి S J Cancel reply

*