“విముక్త” పోరాటం ఎంత వరకు?!

 

(ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా  సాహిత్య అకాడెమి అవార్డు అందుకుంటున్న సందర్భంగా…)

-కల్పనా రెంటాల

~

 

అప్పటికే ప్రాచుర్యంలో వున్న కావ్యాలనూ, అందులో పాత్రలనూ, సన్నివేశాలను తిరగ రాయడం తెలుగు సాహిత్యంలో కొత్త కాకపోవచ్చు. అదే పనిని అనేక మంది రచయితలు వేర్వేరు కోణాల నుంచి చేశారు. మధ్య యుగాల కావ్య సాంప్రదాయంలో అచ్చ తెలుగు కావ్యాలు చాలా వరకు రామాయణ, మహాభారతాల పునర్లేఖనమే! ఆధునిక యుగంలో విశ్వనాథ, త్రిపురనేని రామస్వామి, పఠాభి, చలం, రంగనాయకమ్మ లాంటి రచయితలు వివిధ కోణాల నించి రామాయణాన్ని తిరగ రాశారు. అలా రాసేటప్పుడు ఆయా రచయితలు కేవలం తిరగ రాయడానికే పరిమితం కాలేదని వాటిని చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఆయా కావ్యాలను కొత్త దృష్టితో చదవాల్సి వుంటుందన్న అవసరాన్ని  కూడా ఈ పునర్లిఖిత కావ్య ప్రయోగం నొక్కి చెబుతుంది.

రామాయణాల్ని ప్రశ్నించే అదే ప్రయోగ ధోరణిని ఇంకా ముందుకు తీసుకువెళ్లి, అందులోని పాత్రలను ఈ కాలపు సందర్భంలోకీ సంభాషణలోకీ పునప్రవేశ పెట్టి, ఇంకో ప్రయోగం చేశారు ఓల్గా. “విముక్త” కథలు దీనికి బలమయిన ఉదాహరణ అయితే, ఆ ‘విముక్త” చుట్టూ ఓల్గా నిర్మించిన పురాణ విముక్త భిన్న సందర్భానికి సాధనాలుగా అమరిన కొన్ని విషయాల్ని చర్చించడం ఇవాళ అవసరం. ‘ విముక్త ‘ లో కొత్తగా ఓల్గా చేసిన దేమిటి? ప్రతిపాదించినదేమిటి? పఠాభి, చలం, కొ.కు.లాంటి వారు పురాణ పాత్రలని తిరగ రాసే పని ఎప్పుడో చేశారు. అయితే ఓల్గా వారి కంటే కొత్తగా, భిన్నంగా చేసినదేమిటి? ఎందుకలా చేసింది? అని ఆలోచించినప్పుడు , విముక్త లోని కథలన్నీ ఒకే సారి మళ్ళీ ఒక చోట ఓ సమాహారం గా చదివినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఓల్గా ముందు తరం రచయితల కంటే ఒక స్త్రీ వాద రచయిత్రి గా ఎంత భిన్నమైందో అర్థమవుతుంది.

పాత్రలు కావు, భావనలు!

ఇంతకు ముందు పురాణ పాత్రల మీద వ్యాఖ్యాన రచనల చేసిన వారు ఆ పాత్రలను కేవలం పురాణ పాత్రలుగా నే చూశారు. పాత్రల వరకే పరిమితమై చూశారు . ఓల్గా చేసిన విభిన్నమైన, విశిష్టమైన పని ఏమిటంటే సీతనో, శూర్పణఖ నో, అహల్యానో, ఊర్మిళ నో, రేణుకనో, చివరికి రాముడి ని కూడా కేవలం ఒక పాత్రలు గా కాకుండా కొన్ని భావనలుగా చూసింది. ఒక భావనగా చూపించేటప్పుడు పురాణ పాత్రల మౌలిక స్వభావాలను మార్చటం అనివార్యమవుతుంది. అలా ఆ భావనలను ఎందుకు మార్చటం అంటే కొత్త భావనల రూపకల్పన కోసం అని చెప్పవచ్చు.  రామాయణం లో శూర్పణఖ అసురీ స్వభావం కల వనిత. అయితే సమాగమం లోని శూర్పణఖ అసూయపరురాలు, రాక్షసి కాదు. అంతఃసౌందర్యంతో విలసిల్లే ధీరోధాత్త.

సీత  ఈ కథలన్నింటి లోనూ కనిపించే ఒక ప్రధాన భావన. ఈ మూల భావన తో ఇతర పాత్రలు ఇంకొన్ని భావనలుగా కలుస్తాయి. అలాంటి కొత్త భావనల సమాగమ సమాహారం విముక్త. సమాగమం లోనో, ఇతర కథల్లోనో కేవలం సీత  శూర్పణఖ నో, అహల్య నో కలవటమే కథ కాదు. పాత్రలుగా కలవటం కాదు అది. వాళ్ళను కలుపుతోంది ఒక భావన. ఒక ఐడియా. ఒక కోణం. రచయిత్రీ ఈ పాత్రలను ఏ భావనాలకు సంకేతంగా తీసుకుంది, వాటిని ఏ భావనలతో కలుపుతోంది, వాటి కలయిక ద్వారా రచయిత్రి చెప్తున్న కొత్త భావనలు ఏమిటి? అన్నది చూస్తే ‘ విముక్త’ ఓల్గా ఎందుకు రాసిందో, ఎందుకు రాయవలసి వచ్చిందో అర్థమవుతుంది.

రామాయణం లో సీత ప్రధాన పాత్ర కాకపోయినా రెండో ప్రధాన పాత్ర. కానీ  విముక్త  కథలన్నింటిలో సీత ప్రధాన పాత్ర గా కనిపిస్తుంది కానీ,  పక్క పాత్రలుగా కనిపించే శూర్పణఖ, అహల్య, రేణుకా, ఊర్మిళ ప్రధాన పాత్రలుగా నిలుస్తారు. ఆ రకంగా పక్క పాత్రలను ప్రధాన పాత్రలుగా చూపిస్తూ, వారి నుంచి సత్యాలను, జ్నానాన్ని సీత పొందటం ద్వారా చివరికి సీత, అహల్య, ఊర్మిళ, రేణుకా అందరూ కలిసి ఒకే భావన గా మారిపోతారు. అయిదు కథలు చదవటం పూర్తి అయ్యాక మనకు అన్నీ పాత్రలు కలిసి ఒక సీత గా , ఒకే ఒక్క భావనగా మిగులుతుంది. ఆ సీత లో శూర్పణఖ ఉంది, ఆ సీత లో అహల్య ఉంది. ఆ సీత లో రేణుకా ఉంది. ఆ సీత లో ఊర్మిళా ఉంది.  ఆ సీత లో రాముడు కూడా వున్నాడు. ఈ కథలన్నింటి లో రాముడి కథ మిగతా వాటి కంటే విభిన్నమైనది.    స్త్రీ పాత్రల వైపు నుంచి మిగతా కథలు నడవగా,  ‘బంధితుడు’ కథ ఒక్కటి  రాముడి వైపు నుంచి సాగుతుంది. ఆ కథ ఓల్గా ఎందుకు రాసిందో, ఎందుకు రాయవలసి వచ్చిందో  అర్థమయితే  ఒకింత ఆశ్చర్యం తో పాటు ఆనందం కూడా కలుగుతుంది.

సీత కాలం నాటి సమస్యలే ఆధునిక వేషం ధరించి ఇప్పుడు కూడా వీర విహారం చేస్తున్నాయి. కొత్త సమస్యలను పురాణ పాత్రల ద్వారా కొత్త చూపుతో విశ్లేషిస్తోంది. అందుకు స్త్రీ వాదాన్ని ఒక సాధనంగా వాడుతోంది.  ఓల్గా కేవలం సాహిత్య సృజన మాత్రమే చేయదల్చుకుంటే, స్టీవాదాన్ని కేవలం సాహిత్య పరిధి లో మాత్రమే వుంచి చూడాలనుకుంటే ఒక ” సమాగమం’ కథ సరిపోయేది. మిగతా కథలు రాయాల్సిన పని లేదు. అయితే యాక్టివిస్ట్ గా ఓల్గా ఒక పరిమితి లో , ఒక పరిధి లో ఆగిపోదల్చుకోలేదు.  సాహిత్యపరిధి నుంచి, సృజనాత్మక పరిధి నుంచి స్త్రీవాదాన్ని ముందుకు తీసుకు వెళ్ళే బృహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఆ  ప్రణాళిక లో భాగంగానే ఇన్ని కథలు రాయటం అవసరమయింది.

పాతివ్రత్యం అనే పురాణ భావన ని  బద్దలు చేసిన కథ “సైకత కుంభం”. ఇందుకు ఓల్గా ఎంచుకున్న పాత్ర రేణుకాదేవి. జమదగ్ని మహర్షి భార్య గా, పరశురాముడి తల్లి గా లోకానికి తెలిసిన రేణుకా దేవి  ఓ అపురూప శిల్పకారిణిగా ,  విశిష్టమైన సైకత కుంభాలను తయారు చేయగలిగే కళాకారిణిగా  ఈ కథ ద్వారా అర్థమవుతుంది.  ఆర్య ధర్మం లో ప్రధానమైన పితృ వాక్య పరిపాలనకు రాముడు ఒక కోణం అయితే, పరశురాముడు రెండో కోణం.   ఈ రెండు కోణాలు ఇద్దరు స్త్రీలకు ఏం మిగిల్చాయో చెప్పే కథ ఇది.

పాత్రివ్రత్యం , మాతృత్వ భావనల  చుట్టూ స్త్రీల జీవితాలను ఓ ఉచ్చులో బిగించిన పురుషస్వామ్య సంస్కృతి లోని కుట్ర ను, డొల్ల తనాన్ని బయటపెడుతుంది రేణుక. భర్త గురించి,కుమారుల గురించి తనకు తెలిసినంత గా మరెవ్వరికీ తెలియదని రేణుక చెప్పినప్పుడు  మీకు అలా జరిగింది కాబట్టి ప్రపంచం లో భర్తలు, కుమారులు అందరూ ఆలాగే వుంటారని అనుకోవడం న్యాయం కాదని అంటుంది సీత. కానీ రేణుక హెచ్చరించిన సందర్భాలు రెండూ సీత జీవితం లో కూడా ఎదురయ్యాయి.

” భర్త తప్ప వేరే ప్రపంచం లేదనుకుంటారు స్త్రీలు. నిజమే. కానీ ఏదో ఒక రోజు భర్త తన ప్రపంచం లో నీకు చోటు లేదంటాడు. అపుడు మనకు ఏ ఆధారం  ఉంది? పుత్రులకు జన్మనివ్వటమే జీవిత గమ్యమనుకుంటాము. ఆ పుత్రులు పురుషుల వంశాకురాలై మనం గ్రహించే లోపే మన చేయి వదిలి తండ్రి ఆధీనం లోకి వెళ్తారు. వారి అజ్నాబద్ధులవుతారు. లేదా వారే మన జీవితాలకు శాసనకర్తలవుతారు. ఎందుకు ఆ పిల్లలను కనటం- ఇది నాకు అనుభవమైనంత కఠోరంగా మరింకెవరికీ అవదు. కఠోర సత్యం తెలిశాక చెప్పటం నా విధి కదా-”

రేణుక చెప్పిన మాటలు సహజంగానే సీత కు రుచించలేదు.  ఎందుకంటే రేణుక చెప్తున్నలాంటి సందర్భాలు అప్పటికి ఇంకా సీత జీవితం లో ఎదురవలేదు. కళ్లెదుట కనిపిస్తున్నా, తన భర్త, రేపెప్పుడో తనకు పుట్టబోయే బిడ్డలు అలాంటి వారు కారనే ప్రతి స్త్రీ నమ్ముతుంది. ఆ నమ్మకం లోనే, ఆ భ్రమ లోనే బతకాలనుకుంటుంది తప్ప వాస్తవాన్ని గుర్తించాలనిపించదు.  జీవితమనే ప్రయాగశాల లో  రేణుక లాంటి కొందరు స్త్రీలు నేర్చుకున్న అనుభవ పాఠాలు ఎవరైనా చెప్పినా మనకు వాటిని స్వీకరించా లనిపించదు.  దాన్ని సత్యం గా అంగీకరించాలనిపించదు. అందుకే సీత కూడా ” మీ మాటలు నా కర్థం కావటం లేదు. అవి స్త్రీలకు హాని చేస్తాయనిపిస్తోంది” అంటుంది.

తాను తెలుసుకున్న సత్యాన్ని  ఇతర స్త్రీలకు చెప్పటం, తన అనుభవాలను వారితో పంచుకోవటం వల్ల స్త్రీలుగా, బాధితులుగా , అవమానితులు గా   తామంతా ఒక్కరమేనని , ఒకే సమూహానికి చెందిన వారమన్న అనుభూతినిస్తుంది.  ఈ స్త్రీవాద భావన లోంచి చూసినప్పుడు ఓల్గా ఈ కథలను ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం రాసినట్టు స్పష్టం గా తెలుస్తుంది.

స్త్రీలకు తమ మనసు ల మీద, తమ శరీరాల మీద కూడా ఎలాంటి హక్కు లేదని చెప్పే ఆర్య సంస్కృతి పై రేణుక ద్వారా  సైకత కుంభాల సాక్షిగా ఓల్గా తన తిరుగుబాటు ను ప్రకటిస్తోంది.  ఆర్య సంస్కృతి పరిరక్షణ లో భాగంగా పితృస్వామ్యం పెంచి పోషించిన పాతివ్రత్యం, మాతృత్వమే స్త్రీల పరమార్థం లాంటి స్థిర భావనలను సమూలంగా ఈ కథల ద్వారా వోల్గా చర్చకు పెట్టి వాటిని కూకటి వ్రేళ్లతో పెకిలించి వేసి కొత్త భావనలను స్తిరపరుస్తోంది.

vimukta

ఓల్గా రాసిన ‘ విముక్త ‘ కథ లో పద్నాలుగేళ్ళు వనవాసం చేసి వచ్చిన సీత ఊర్మిళ ను చూడటానికి వెళ్లినప్పుడు చెప్పిన మాట ఇది. తనను ఒక మనిషి గానైనా గుర్తించకుండా, కనీసం తనతో మాట మాత్రమైనా చెప్పకుండా అన్నా వదినల వెంట లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు ఊర్మిళ మొదట కోపంతో రగిలిపోయింది.  ఆరని నిప్పుగా మారింది.  తన నిస్సహాయ ఆగ్రహాన్ని ఊర్మిళ సత్యాగ్రహం గా మార్చుకుంది.   నెమ్మదిగా ఆ కోపం తగ్గాక, ఆ ఆవేశం చల్లారాక ఆమె తన దుఃఖానికి, కోపానికి కారణాలు వెతకటం మొదలుపెట్టింది.  తనను నిలువునా దహించి వేస్తున్న ఆ కోపానికి మూల కారణం కనిపెట్టాలని తన అన్వేషణ మొదలుపెట్టింది. కోపం, దుఃఖం, ఆనందం లాంటి ఉద్వేగాలకు , కోపానికి వున్న మూలసంబంధాన్ని విశ్లేషించటం మొదలుపెట్టింది. అందుకు ఆమెకు ఏకాంతం అవసరమయింది. ఊర్మిళ  ఒంటరి తనం లో కూరుకుపోలేదు. ఏకాంతాన్ని కౌగిలించుకొని తన లోపల తాను గా, తనలో తాను గా  ఆ పద్నాలుగేళ్ళు గడిపింది.  తనకు ఇతరులతో వున్న సంబంధాన్ని పొరలు పొరలుగా తీసి లోతుకి వెళ్ళి చూసింది. ఈ అనుబంధాల మూలాలను కనుగోనె క్రమం లో ఊర్మిళ తనతో తాను పెద్ద యుద్ధమే చేసింది. రక్తపాతం, హింస లేని ఆ ఆత్మ యుద్ధం తో ఆమెకు గొప్ప శాంతి, ఆనందం లభించాయి.

స్త్రీ పురుష సంబంధాల్లో ప్రధాన సమస్య అధికారం. ఎవరికి ఎవరి మీద అధికారం ఉంది? ఎంత వరకూ ఉంది? ఎవరి చేయి పైన, ఎవరి చేయి కింద అన్నదే వారి మధ్య అన్నీ పోట్లాటలకు మూల కారణం. ఆ సమస్య ను ఊర్మిళ తన అన్వేషణతో జయించింది.   అధికార చట్రాలలో పడి నలిగిపోతూ విముక్తమయ్యే దారి, తెన్నూ తెలియక అశాంతి తో, ద్వేషంతో రగిలిపోతున్న వాళ్ళకు ఊర్మిళ తన శాంతి రహస్యాన్ని, తన ఏకాంతం లోని గుట్టు ని విప్పి చెప్దామనే అనుకుంది.  ఊర్మిళ జీవన సత్యాన్వేషణ లో తనతో తాను యుద్ధం చేస్తోందని తెలుసుకోలేని వారు ఆమె దీర్ఘ నిద్ర లో మునిగి ఉందని బాధపడ్డారు.

తాను చెప్పినది సీత కు అర్థమయిందని తెలిసాక  ఊర్మిళ మరో ముందస్తు హెచ్చరిక చేసింది.

” నీ జీవితం లో నా కొచ్చినటువంటి పరీక్షా సమయం వస్తే అప్పుడు ఆ పరీక్ష నిన్ను మామూలు తనం లోకి,మురికి లోకి నెట్టకుండా, ద్వేషంతో , ఆగ్రహం తో నిన్ను దహించకుండా, నిన్ను నువ్వు కాపాడుకో. నీ మీధ అధికారాన్ని నువ్వే తీసుకో. ఇతరులపై అధికారాన్ని ఒదులుకో. అప్పుడు నీకు నువ్వు చెందుతావు. నీకు నువ్వు దక్కుతావు.మనకు మనం మిగలటమంటే మాటలు కాదక్కా “.

ఊర్మిళా చెప్పిన ఆ మాటల్లోని అంతరార్థం ఆ తర్వాత ఆమెకు రాముడు అరణ్యాల్లో ఒంటరిగా వదిలి వేయించినప్పుడు గుర్తొచ్చాయి. రాముడి మీద ప్రేమ ను, అనురాగాన్ని వదులుకొని ఎలా విముక్తం కావాలో , అందుకు మార్గమేమిటో ఊర్మిళా చెప్పిన మాటల నుంచి గ్రహించింది.  ఊర్మిళ చేసినట్లే ఇప్పుడు తాను కూడా తనతో తాను యుద్ధం చేసుకొని ఆ అధికారాన్ని వదులుకునే ప్రయత్నం మొదలుపెట్టాలని, అదే తన కర్తవ్యమని బోధపడింది.

రాముడు అశ్వమేధ యాగం చేస్తున్నాడన్న వార్తా సీత కు చేరగానే ఆమె ను కలవటానికి ఊర్మిళ వాల్మీకీ ఆశ్రమానికి వచ్చింది.

సహధర్మచారిణి గా తాను పక్కన లేకుండా రాముడు అశ్వమేధ యాగం ఎలా చేస్తాడని సీత సందేహపడినప్పుడు ” ఈ ప్రశ్న నీకెందుకు రావాలి? వస్తే రామునికి రావాలి? ” అన్నది ఊర్మిళ. ఆ సమస్య సీత ది కాదు, రాముడి ది.  రాముడి సమస్య ను సీత పరిష్కరించలేదు. పరిష్కరించనక్కరలేదు కూడా.

అనవసరమైన ప్రశ్నలతో అశాంతి పడటం అవివేకమని, అలా నిన్ను నువ్వు హింసించుకోవద్దని  సున్నితంగా హెచ్చరించింది. ” నువ్వు రాముడి నుంచి విముక్తం కావాలి” అని ఆమెకు కర్తవ్య బోధ చేసింది ఊర్మిళ.

” ప్రతి పరీక్ష నిన్ను రాముడి నుంచి విముక్తం చెయ్యటానికే. నిన్ను నీకు దక్కించటానికే. యుద్ధం చేయి. తపస్సు చేయి. లోపలికి చూడు. నీవనే యథార్థం కనపడేదాకా చూడు” .

రాముడి నుంచి సీత విముక్తం కావాలంటే ఆ యుద్ధమేదో సీత చేయాలి.ఊర్మిళ యుద్ధం చేయాల్సిన అవసరాన్ని, ఆ మార్గాన్ని మాత్రమే సూచించగలదు. ఊర్మిళ అదే పని చేసింది. ఆ యుద్ధం తో పోలిస్తే అగ్ని పరీక్ష చాలా చిన్నది.  ఆ యుద్ధం చేశాక , తనను తాను రాముడి నుంచి సీత విముక్తం చేసుకున్నాక  మళ్ళీ వెళ్ళి సభలో తన నిర్దోషిత్వమ్ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని సీత కు తెలుసు. అందుకే రాముడు పంపిన ఆ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించి తన గమ్యం వైపు కి సాగిపోయింది.

ఊర్మిళా, సీత  తమతో తాము సంఘర్షించుకొని చేసిన యుద్ధం ద్వారా తెలుసుకున్న సత్యం ఒక్కటే. ” అధికారాన్ని పొందాలి. వదులుకోవాలి కూడా”. ఆ సత్యమే వారిని  పితృస్వామ్య సంకెళ్ళ నుండి విముక్తం చేసింది. ఆధునిక స్త్రీ ది కూడా అదే మార్గం.  అధికారం అనేది ఎలా వదులుకోవాలో? ఎందుకు వదులుకోవాలో తెలిస్తేనే స్త్రీలకు విముక్తి లభిస్తుంది. నిజమైన శాంతి, ఆనందం దక్కుతాయి. స్త్రీ జాతి విముక్తి ని మనసారా కాంక్షిస్తూ  అందుకు అవసరమైన సత్యాలను, అవి గ్రహించే మార్గాలను కూడా మనకు ఈ కథల ద్వారా అందించింది. మార్గం తెలిసింది. యుద్ధం ఎందుకు చేయాలో, ఎలా చేయాలో కూడా తెలిసింది. ఇప్పుడు ఆ యుద్ధం చేయాల్సిన బాధ్యత, విముక్తం కావల్సిన అవసరం ఆధునిక స్త్రీ దే.

*

 

ఓల్గా తో సారంగ ముఖాముఖి ఇక్కడ: 

మీ మాటలు

 1. ఓల్గా గారి విముక్తను తమిళంలో Meetchi అన్న పేరిట అనువాదం చేసి తమిళ పాఠకులకు అందించ గలిగానన్న తృప్తి, సంతోషం నాకు. ఓల్గా గారికి సాహిత్య అకాడమి అవార్డ్ లభించినందు లో ఆ సంతోషం రెట్టింపు అయ్యింది.

 2. వనజ తాతినేని says:

  విముక్త … స్త్రీలందరికీ పోరాటం చేయడమే నేర్పుతుంది . మీ వ్యాసం చాలా బావుంది కల్పన గారు . ఆలోచిస్తున్నాను. థాంక్ యూ !

 3. Delhi (Devarakonda) Subrahmanyam says:

  గొప్ప విశ్లేషణ చేశారు కల్పన గారూ . మీ వ్యాసం ఓల్గా గారి విముక్త కధలను చదివించేలా చేసింద, అభినందనలు. యెప్పుడో రావలసిన సాహిత్య అకాడమీ పురస్కారం ఇప్పుడయినా వచ్చినందుకు సంతోశంగా ఉంది.

 4. వాట్ a pleasant coincidence …ఈ వ్యాసమూ అదే పుస్తకానికి అదే రోజు అవార్డూ ..సంతోషం !!

 5. ఇది coincidence మాత్రం కాదు.

  -శశాంక

 6. కల్పన గారూ. వ్యాసం ఎంతో బాగుంది. అధికారాన్ని పొందాలి . వదులుకోవాలి . కళ్ళు తెరిపించే జీవిత సత్యం .ఓల్గా గారితో పాటు ఆవిడ రచనల్లోని సూక్ష్మాన్ని ఇంత చక్కగా వివరించినందుకు మీక్కూడా బోలెడు థాంక్స్

 7. చాలా మంచి వ్యాసం.

 8. G.venkatakrishna says:

  మంచి విశ్లేషణ . గుర్తింపు పొందిన క్షణంలో , ఈ విశ్లేషణ ఆ క్షణానికి ఇంకొంత విలువను పెంచుతోంది .రామున్ని రాజకీయాలకు ఉపయోగించుకునే కాలంలో దాన్ని వ్యతిరేకించే పాత్రలతో కూడిన కథలకు ఈ గుర్తింపు ఒక పారడాక్స్ ……

 9. కల్పన గారూ

  మీ విశ్లేషణ చాల , చాల బావుంది . ఓ అద్భుత మైన కదా సంకలనానికి ఓ చ్చిక్కని వ్యాఖ్యానం . మహా ప్రస్థానానికి చలం యోగ్యతా పత్రంలా …..అనిపించింది ఇంతకు ముందే రెండు మూడు సార్లు చదివిన ఈ కధల్ని మరోసారి చదివింప చేసింది మీ ఆర్టికల్ . కధలకి , పాత్రలకి ,సందర్భాలకి కొత్త కొత్త కొనాలని చూపించినందుకు చాల కృతఙ్ఞతలు

 10. కె.కె. రామయ్య says:

  స్త్రీ జాతి విముక్తిని ఆకాంక్షిస్తూ ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా గారు తెచ్చిన అద్భుత కదా సంకలనం “విముక్త” పై అత్యద్భుత విశ్లేషణ చేసిన కల్పనా రెంటాల గారికి కృతఙ్ఞతలు. తెలుగు మరియు తమిళం అనువాద రచనలు చేస్తున్నగౌరీ కృపానందన్ గారు “విముక్త” ను తమిళంలో Meetchi అన్న పేరిట అనువాదం చేసినట్లు తెలపటం ఆనందానిచ్చింది.

  ” నీ జీవితం లో నా కొచ్చినటువంటి పరీక్షా సమయం వస్తే అప్పుడు ఆ పరీక్ష నిన్ను మామూలుతనం లోకి,మురికి లోకి నెట్టకుండా, ద్వేషంతో , ఆగ్రహంతో నిన్ను దహించకుండా, నిన్ను నువ్వు కాపాడుకో. నీ మీధ అధికారాన్ని నువ్వే తీసుకో. ఇతరులపై అధికారాన్ని ఒదులుకో. అప్పుడు నీకు నువ్వు చెందుతావు. నీకు నువ్వు దక్కుతావు.మనకు మనం మిగలటమంటే మాటలు కాదక్కా “. రామాయణ కావ్యంలో సీతకు ఊర్మిళ చేసిన ముందస్తు హెచ్చరిక మనుష్యులు ఎవరైనా కూడా మంచి హితవాక్యం గా తీసుకోవచ్చేమో.

 11. రామాయణం మీద ఈ వితండ వాదన కి కేంద్రీయ సాహిత్య అకాడమీ వారు అవార్డు ఇవ్వటం ఏంటి? శూర్పణఖ అసూయే కదా అసలు సీతా దేవి కష్టాలకి కారణం? ఎందుకు లక్ష్మణుడు ఆవిడ ముక్కు చెవులు కోసాడు? శూర్పణఖ సీతాదేవి ని అమాంతం తినడానికి వెళ్ళిందని. తన కోరిక కోసం రాముడు!! కుదరకపోతే లక్ష్మణుడు !! స్త్రీ అంటే అంత నీచంగా ఆలోచిస్తుందా?లేని పోనివి చెప్పి రావణుడ్ని ఉసి కొల్పిన పాత్ర శూర్పణఖ. ఈ రకమైన శాడిజం, సైకోతత్వం తో ఉండేవారినే రాక్షసులు అంటారేమో !! ఇలాంటి పాత్రలు మన నిజ జీవితం లో కోకొల్లలుగా కన్పిస్తూ ఉంటారు. వారికి counselling అనేది ఎంత వరకూ పని చేస్తుంది? అలాంటిది స్త్రీవాదం పేరు తో శూర్పణఖ ని సపోర్ట్ చేస్తూ ‘సమాగమం’ కథేంటి? నిర్భయ కేసు లో సుప్రీమ్ కోర్టు juvenile ని డబ్బులిచ్చి వదిలేసినట్లు !! పైగా ఆ కథలో రామలక్ష్మణులు చేసినది తప్పు గా అన్పిస్తుంది సీత కి. ప్రతి పెళ్లి ఆహ్వాన పత్రికలో సీతారాముల బొమ్మ వుంటుంది . ఎందుకంటే భార్యాభర్తలు సీతారాముల్లాగే ఉండాలి అని. కానీ ఈ కథల లో సీతా దేవి కి రాముడంటే ప్రేమ కాకుండా ప్రతి విషయం లో negative thought!! సీతాదేవి ఒక మాములు స్త్రీ లాగే ఆలోచిస్తే ఆవిడ కి మనకి తేడా ఏంటి? స్త్రీ వాదం ఉండాలి !! ఎప్పుడంటే రావణులని తరిమి కొట్టడానికే కానీ రాముడి కోసం కాదు. ఇలాంటి కథలకి అవార్డులు కూడా ఇస్తుంటే నోట మాట రావట్లేదు.

  • Dr. Rajendra Prasad Chimata. says:

   మీరు సాంప్రదాయ దృష్టితో ఈ వ్యాసాన్ని గానీ విముక్త పుస్తకాన్ని గాని అర్థం చేసుకోలేరు. స్త్రీవాదాన్నే అర్థం చేసుకోలేరు. వ్యాసం ప్రారంభం లోనే సాంప్రదాయ దృష్టి వదిలి ఈ పుస్తకాన్ని చదవాలన్న విషయాన్ని వివరించారు, గమనించగలరు.

   Sent from http://bit.ly/f02wSy

   • ఈ వితండ వాదన సమాజానికి ఏ విధం గా ఉపయోగం? కథలన్నిటికీ రామాయణమే ఆధారం గా తీసుకున్నపుడు, రోజు వారి జీవితం లో రామాయణం ని అనుసరించే వారి కి ఈ కథలు చాలా చికాకు కలిగిస్తాయి. సాంప్రదాయ దృష్టి అంటే ఏంటో నాకు అర్ధం తెలీదు. నేను రామాయణం పవిత్ర పురాణం రాముడు దేవుడు కాబట్టి అనకూడదు అని చెప్పట్లేదు. కానీ రామాయణం నుంచి ఒక సామాన్య మానవుడు నేర్చుకోవలసినది చాలా ఉంది. In one word, it’s a stress relieving medicine for anyone in their daily family life!!అలాంటి రామాయణం ని విమర్శించి తిరగ వ్రాసి ఏమి సాధిస్తున్నారు? ఏమన్నా అంటే నాణేనికి మరొక వైపు అర్ధం చేసుకోవట్లేదనో లేకపోతే మీది మత చాంధసం అనే వాదన. ‘విముక్త’ కథలలో ప్రతి కథ లో రాముడు మీద negative thought సీతకి. అలాంటి ఆలోచన విధానం సమాజం మీద ఎంతో ప్రభావం చూపుతుంది. భర్త చేసే ప్రతి పని భార్య కి negative గా కన్పిస్తుంటే ఎన్ని రోజులు ఉంటుంది ఆ కాపురం? వేరే కథల గురించి పక్కన పెట్టినా , సమాగమం’ కథ లో ఒక విలన్ పాత్ర కి అన్యాయం జరిగినట్లు మాట్లాడడం ఒక psycho ని మద్దతు చేసినట్లే కాదా ? ఈ ‘సమాగమం’ కథ లో బాహ్య సౌందర్యం చాలా ముఖ్యం అన్నట్లు ఉంది. సీత ‘ఆమెను ఏ పురుషుడు ప్రేమించడు ‘ అనుకుంటుంది. స్త్రీ లో ఒక మగవాడు, అందం మాత్రం చూస్తే దాన్ని ప్రేమ అంటారా ? మోహం అంటారా ? స్త్రీ వాదం అంటే ఇదా? రావణుడు వస్తే గడ్డి పరక ని పెట్టి మాట్లాడిన సీత ఇంత అసహ్యకరం గా ఎలా ఆలోచిస్తుంది ? ఒక high level thinking పాత్ర ఎంత low level thinking కి త్రోసి వేయబడింది? రామాయణం లో సీత పాత్ర ఎంత inspiring గా ఉందో ‘విముక్త’ కథల్లో అంత బేలగా ఒక depressed పాత్ర లాగా కన్పించింది నాకు. సాంప్రదాయ దృష్టి అనుకోవచ్చు లేక స్త్రీ వాదం అర్ధం చేసుకోలేదు అనచ్చు.

మీ మాటలు

*