మనింటికి వుడ్‌హౌస్ వచ్చిన వేళా…

 

-దాసరి అమరేంద్ర

~

 

Dasari Amarendraవుడ్‌హౌస్  ఎవరూ?

రావుబహదూర్  సోమేశ్వరరావు  ఎవరూ?

మధ్యలో గబ్బిట కృష్ణమోహన్ ఎవరూ?

ఏవిటీ వీరి సంబంధం?

***

తొంభైమూడేళ్ళు జీవించి, అందులో డైబ్భైరెండేళ్ళపాటు రచనా వ్యాసంగం సాగించి 1975లో వెళ్ళిపోయిన  మహానుభావుడు  పి.జి. వుడ్‌హౌస్.

ఇంగ్లాండు మనిషి. అమెరికా అంటే అభిమానం.  “పన్ను” బాధల  పుణ్యమా  అని ఫ్రాన్సులో ఓ పదేళ్ళు  వున్నాడు.  రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్లకు చిక్కడిపోయి ఓ ఏడాదిపాటు వారి ఆతిధ్యం స్వీకరించాడు. పొరపాటునో, గ్రహపాటునో ఆ జర్మనీవారి రేడియోలో తన బాణీ ప్రసంగాలు  ఓ అరడజను చేసి తన స్వదేశీయల  అసహనానికీ, ఆగ్రహానికీ గురి అయ్యూడు. దాని పుణ్యమా  అని మళ్ళీ ఇంగ్లాడులో అడుగు పెట్టకుండా ఓ ముప్ఫై ఏళ్ళపాటు అమెరికాలో నివసించి, పౌరసత్వం పొంది  అక్కడే  తనువు చాలించాడు.  ఆగ్రహాలు సద్దుమణిగాక  మరణానికి కొద్దినెలలు వందు ఆంగ్లప్రభుత్వంవారి నైట్‌హుడ్ పొంది సర్ వుడ్‌హౌస్ అయ్యాడు.

***

వుడ్‌హౌస్ ఏమి రాశాడూ?

చాలా  రాశాడు. పుంఖానుపుంఖాలుగా రాశాడు. జబ్బసత్తువ వున్న రోజుల్లో మూడు నెలలకో  నవల రాశాడు. ఆ సత్తువ తగ్గినపుడు ఆరునెలలకో  నవల.

నవలలు, కథాసంకలనాలు కలిసి తొంభై రెండు పుస్తకాలు. నలభై మ్యూజికల్ కామెడీల లిరిక్సుకి సహరచయిత. ఇవికాక ఉత్తరాలు, జ్ఞాపకాలు, వ్యాసాలు .. ఎన్నో రాశాడు. కానీ ఏది రాసినా – ఎంత వేగంగా రాసినా – కృషి చేసి రాశాడు. నాణ్యతను వదలలేదు. విజయవంతంగా రాశాడు. “మనకాలపు ఉత్తమ రచయిత’ అన్నాడో సమకాలీన రచయిత – 1930లో.

నిజానికి ఆయన ఏమి రాశాడూ?

సీరియస్ సాహిత్యం రాయలేదు. సామాజిక అంశాలతో రాయలేదు. వ్యంగ్య విమర్శకూ పూను కోలేదు. పోనీ హాస్యరచనలు అందామా – అదీకాదు. “ఫార్సు’ రాశాడు అని తేల్చారు విశ్లేషకులు. నా వరకూ నాకు ఆయన రాసినది రేలంగి, పద్మనాభంల బాణీల మేలు కలయిక అనిపిస్తుంది.

***

వుడ్‌హౌస్ రచనలు పాఠకులను ఆకట్టుకొన్నాయన్నది నిజం, వాస్తవం. రాసి వందేళ్ళు దాటినా, రాసినాయన వెళ్ళిపోయి  నలభై ఏళ్ళు దాటినా అతనిని చదివేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఉన్నారు. ఇంగ్లీషులోనే  గాకుండా తమతమ సొంత భాషలలో అనువదించుకుని చదివేవాళ్ళూ వేలకొద్దీ ఉన్నారు. మన తెలుగులో బాపూరమణల  దగ్గిర్నించి గబ్బిట కృష్ణమోహన్ వరకూ ఆయన అభిమానులు అసంఖ్యాకం.

ఊరికే అభిమానించి ఊరుకోకుండా వుడ్‌హౌస్‌ను అనుసృజించి పెడుతున్నారు గబ్బిట.

***

gabbita1

సరదాగా మరికొంతసేపు అన్న వుడ్‌హౌస్ అనుసృజనలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. అందులో “సినిమారంగం’కు చెందినవి నాలుగు.

వుడ్‌హౌస్  అభిమానులంతా తమ అభిప్రాయాలను కలగలిపి ఆయన కథల్లో తలమానికంగా ఎన్నుకొన్న “అంకుల్ ఫ్రెడ్ ఫ్లిట్స్ బై’ అన్న 1936 నాటి కథ ఈ సంపుటిలో “సోంబాబాయి వలస కాపురం” గా మొట్టమొదట కనిపిస్తుంది. మాతృకలోని అంకుల్ ఫ్రెడ్ అనుసృజనలో రావుబహదూర్ సోమేశ్వరరావుగా “అవతారం” ఎత్తుతాడు. తన అబ్బాయి అవతారంతో కలిసి తన చిన్ననాటి ఊరు కుందేరుకు విలాసంగా వెళ్ళి ఇరవై పేజీలూ, ఒక గంటా వ్యవధిలో “తన లౌక్యాన్నీ, బుద్ధికుశలతని, సమయస్ఫూర్తిని, చాకచక్యాన్ని” అలవోకగా ప్రదర్శించి పాఠకులను అలరిస్తాడు.

మొదటి భాగంలోని ఏడు కథల్లో నాలుగింట శశిరేఖ ముఖ్యపాత్ర ధారి. ఆమె తల్లి మహారచయిత్రి ప్రసూనాంబ  విస్మరించలేని కథావ్యక్తి. పెరిగి పెద్దయ్యాక సోంబాబాయి అంత గొప్పమనిషిగా రూపొందగల ప్రామిస్ వున్న శశిరేఖ  తాను  ఇష్టపడే  నరహరిని  కాకుండా తల్లి  సూచించి బాధించే వర్ధమాన రాజకీయు నాయుకుడు ప్రసాద్, రచయితగా అపుడపుడే నిలదొక్కుకొంటున్న గంపా శేఖర్, ఏకపక్ష  ఆరాధకుడు దూడల దివాకర్, అవ్యాజ వ్యామోహి శేషగిరులను ఎంతో చాకచక్యంతో “తెల్లవారుఝాము పాలబండి”లు ఎక్కించిన వైనం కనిపిస్తుంది ఈ నాలుగు కధల్లో.

“విధి, “అదృష్టం” అన్న కథల్లో పాత్రలు వేరైనా వాటిల్లోని అనూరాధ, సరిత – శశిరేఖకు కజిన్లే. తండ్రి గోవర్ధనరావూ, జమీందారు నీలకంఠం – ఒకే తాను ముక్కలే. వెరసి ఈ రెండు కథలూ “తాత్విక దృష్టితో’ చూస్తే మిగిలిన నాలుగు కథలకు దగ్గరి బంధువులే.

సినిమారంగపు నాలుగు కథల్లో రెండింట నరసరాజు, రాగిణిల  ఉదంతాలు  కనిపిస్తాయి. మరో కథ “కోతిచేష్టలు’లో వీళ్ళిద్దరూ పేర్లు మార్చుకొని కనకరాజు, సుభాషిణి అయ్యారా అనిపిస్తుంది. నాలుగోకథ “మీనా దేశ్‌పాండే తారాపథం’ మొట్టమొదటి సోంబాబాయి కథలాగా మిగిలినవాటికి వేటికీ చెందని విలక్షణత గలది.

***

పరిమితుల దృష్ట్యా చూస్తే  అనువాదం సొంత రచన కన్న కష్టమైనది.

అనుసృజన అనువాదం కన్న మరింత మరింత కష్టమైన పని.

వుడ్‌హౌస్  కథల నేపధ్యం ఇంగ్లీషు గ్రామసీమలకూ, పట్టణాలకూ చెందినది. ఆయా రచనలను ఆంగ్లంలోనే చదువుకునేవాళ్ళకి అది అవరోధం కాకపోవచ్చు. ఇంగ్లీషు రానివాళ్ళ కోసమే ఈ తెలుగు ప్రయత్నం అనుకుంటే – అలాంటి పాఠకులు ఆయా పేర్లూ, ప్రాంతాలూ, ఆచార వ్యవహారాలతో మమైకం అయ్యే అవకాశం దాదాపు పూజ్యం. అందులోనూ ఆయా రచనలు హాస్యమూ, ఫార్సూ, శబ్ద అర్థాలంకారమయం అయినపుడు వాటిల్ని చదివే వాళ్ళకు అవి ఆకాశ పంచాంగాలు అయితీరుతాయి.

మరి వాటిల్ని అభిమానించి, వాటిల్ని తెలుగు మాత్రమే వచ్చినవాళ్ళకు తెలియజెయ్యాలని తపించే వారికి ఏమన్నా మార్గాంతరం ఉందా?! ఉంది!!

అనుసృజన.

గబ్బిట కృష్ణమోహన్ గత ఐదారేళ్ళుగా ఈ మార్గాన వెడుతున్నారు. విజయయాత్ర చేస్తున్నారు. ఈ పరంపరలో సరికొత్త మైలురాయి “సరదాగా మరికొంతసేపు’.

సోమేశ్వరరావు, గోవర్ధనరావు, గంపా శేఖర్, దూడల దివాకర్, శశిరేఖ, బండారు ప్రసూనాంబ, శేషగిరి, బాబ్జీ, అనూరాధ, శ్రీహరి, సరిత, జమీందార్ నీలకంఠం, నరసరాజు, కనకరాజు,రాగిణి, సుభాషిణి, రాజమాణిక్యం-ఉరఫ్-మీనా దేశ్‌పాండే – వీళ్ళ మాతృపాత్రలు ఆంగ్లదేశపు నేలకు చెందినవి అయినా, వీళ్ళంతా పదహారణాలు  తెలుగు  మనుషులు. గబ్బిటగారు ప్రాణప్రతిష్ట చేసిన మన మనషులు.

కథల్లోని  “పానకుటీరాలు” మన సంస్కృతికి చెందినవి కాకపోయినా అనుసృజన నైపుణ్యమా అని పానకంలో యాలక పలుకుల్లానే ఉంటాయి.

“పెరట్లో హాయిగా కూర్చున్న  కోడిపెట్టల్ని అదిలిస్తే రెక్కలు టపటపలాడిస్తూ పరిగెత్తినట్టు ఆడ వాళ్ళంతా బయటకి నడిచారు” (బుసబుసలు); “గుండెకు గాట్లుపడి ఆ గాట్లలోంచి గాలి బయట కొస్తున్నట్టుగా ప్రసూనాంబగారు నిట్టూర్చారు” (విశ్రాంతి చికిత్స); “అప్పుడే గుడ్డులోంచి బయటపడి వృత్తిలో ఓనమాలు దిద్దుకొంటోన్న వడ్రంగిపిట్ట చేసే చప్పుడులా ఉందది” (తల్లిగారి ఘనసత్కారం); “అది విని దివాకర్ చెట్లలోంచి దూసుకుపోయే గాలిలా మూలిగాడు” (తల్లిగారి ఘనసత్కారం) – ఇలాంటి అనే కానేక పదబంధాలూ, వాక్యాలూ అపురూపమైన దేశవాళీతనంతో గుబాళిస్తాయి. అనుసృజనకు అర్థాలు చెపుతాయి.

మూలభాషలో వుడ్‌హౌస్‌గారు ఏమని ఉంటారా అన్న కుతూహలం కలిగిస్తాయి.

ఇవన్నీ ఒక ఎత్తు – కృష్ణమోహన్ “తలాడించేవాడి కథ”లోనూ, “మిస్ మీనా దేశ్‌పాండే తారా పథం”లోనూ చూపించిన ప్రతిభ అమోఘం; అద్వితీయం.

తలాడించే భాగోతుల నరసరాజుకు ప్రేమాయణం గుంటదారుల్లో పడ్డప్పుడు మంచి కిక్కిచ్చే దానికోసం మనసు వెంపర్లాడినపుడు – అవి మద్యపాన నిషేధపు మంచిరోజులు – తనకు తెలిసిన ప్రదేశానికి వెళ్ళి తలుపు తట్టి “ఎవరికి ఎవరూ  కాపలా  బంధాలన్నీ  నీకేలా” అంటూ కోడ్ పాట పాడతాడు. తలుపు తీసిన మనిషి “ఏం సినిమా?” అని అడిగితే “ఇంటికి దీపం ఇల్లాలే” అని, “దాహమేస్తోంది” అంటాడు. ఇది చదివాక మన మనసుకు కిక్కూ  ఎక్కుతుంది. ఇంకా కావాలని దాహమూ వేస్తుంది.

ఏకచిత్ర అగ్రతార మీనా దేశ్‌పాండేగారి మాతృపాత్ర ఆంగ్లభాషలో ఏవేం పాటలు గానించిందో తెలియదుగానీ  మన  రాజమాణిక్యం (ఉరఫ్ మీనా దేశ్‌పాండే) – “పులకించని మది పులకించు” దగ్గర మొదలుపెట్టి  “కల నిజమాయెగా కోరిక తీరెగా” దాకా ఓప్పదీ ఇరవై పాటలు పాడేసి “భళిరా గబ్బిటా!” అని పాఠకులు వీరతాడు వేసేలా చేస్తుంది.

***

gabbita1వుడ్‌హౌస్ రాసినది సీరియుస్ సాహిత్యం గాకపోయినా దశాబ్దాల తరబడి, తరతరాల తరబడి పాఠకులను ఆకట్టుకొందన్న మాట నిజం.

ఏవిటా కారణం? ఏవిటా రహస్యం?

ఖచ్చితంగా చెప్పడం కష్టం.

ఎడ్వర్డియన్ యాసా, కవుల కొటేషన్లూ, అనేకానేక సాహితీ చమక్కులూ కలగలిపి తనదైన ఓ ప్రత్యేక భాషాశైలిని సృష్టించాడు వుడ్‌హౌస్. దాన్ని  కామిక్ పొయెట్రీ అన్న వాళ్ళున్నారు. మ్యూజికల్ ప్రోజ్ అన్న వాళ్ళున్నారు. ఏదేమైనా భాష విషయుంలో వుడ్‌హౌస్ రచనలు భాష పరిధుల్ని దాటుకుని వెళ్ళి కొత్త మైలురాళ్ళను పాతాయి అన్న విషయం దాదాపు అందరూ అంగీకరిస్తారు.

అయినా మూలప్రశ్న మరోరూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.

హాస్య, వ్యంగ్య, ఫార్సు రచనలకు  కాలక్షేపమూ, ఉల్లాసమూ  గలిగించడాన్ని మించిన పరమావధి ఉంటుందా?

దానికి రేలంగి సమాధానం చెప్పగలడు – పద్మనాభం చెప్పలేకపోయినా.

ఛార్లీ చాప్లినయితే ఢంకా బజాయించి, గుండెలు బద్దలుకొట్టి చెపుతాడు.

కానీ ఒక్కమాట.

వుడ్‌హౌస్ గురించి మాట్లాడుతూ “సాహితీ ప్రయోజనం” అంటూ వెళ్ళడం చాదస్తపు చర్చ అయి తీరుతుంది.

అయిర పుస్తకపు శీర్షికే ఆహ్వానిస్తోంది గదా:

“సరదాగా మరికొంతసేపు” వుడ్‌హౌస్‌తో గడపమని …

ఇక ఆలస్యం ఎందుకూ – గబ్బిట వుడ్‌హౌస్ దగ్గరికి వెళదాం ..

*

మీ మాటలు

 1. “వుడ్‌హౌస్ గురించి మాట్లాడుతూ “సాహితీ ప్రయోజనం” అంటూ వెళ్ళడం చాదస్తపు చర్చ అయి తీరుతుంది”
  —-
  తెలుగులో విమర్శ మరణించిన చాన్నాళ్ళకు ఇప్పుడు సమీక్షల పేరుతొ వస్తున్నభజన వ్యాసాలకు – కొంత దూరంగా జరిగి బాగా రాశారు. భజనల్లో పొగిడించుకున్న వారికీ , పొగుడుతున్న వారికీ తప్ప ఎవరికీ ఏ ఆనందం కలగదు. అందుకు ఉదాహరణగా ఈమధ్యన ప్రముఖ విమర్శకులుగా పేరుపడి సారంగలో కూడా రాస్తున్న పొగడ్తా వ్యాసాలను చదవండి. పై వ్యాసం అందుకు భిన్నంగా ఉందని చెప్పక తప్పదు.
  -శశాంక

 2. కె.కె. రామయ్య says:

  పి.జి. వుడ్‌హౌస్‌ కథలని అభిమానించి, వాటిల్ని తెలుగు మాత్రమే వచ్చినవాళ్ళకు తెలియజెయ్యాలని తపింఛి వుడ్‌హౌస్‌ పదకొండు కథలు “మరికొంత సేపు” గా అనుసృజించిన ( మక్కీకి మక్కీ అనువాదంగా కాకుండా అనుసృజించిన ) గబ్బిట కృష్ణమోహన్ గారికి, పుస్తకాన్ని సోదాహరణంగా సమీక్షించిన దాసరి అమరేంద్ర సార్ కి నెనర్లు.

  వుడ్‌హౌస్‌ “ఎన్నో రాశాడు. కానీ ఏది రాసినా – ఎంత వేగంగా రాసినా – కృషి చేసి రాశాడు. నాణ్యతను వదలలేదు. విజయవంతంగా రాశాడు ” ఎంతచక్కగా చెప్పారు అమరేంద్ర సార్.

 3. కె.కె. రామయ్య says:

  అమరేంద్ర సార్, గబ్బిట కృష్ణమోహన్ గారు అనుసృజించిన పి.జి. వుడ్‌హౌస్‌ కథల పుస్తకాలు, ఓ పుంజీడు, నవోదయ బుక్ హౌస్, కాచిగూడా వారి వెబ్ సైట్ నుండి తెప్పించుకునే సౌకర్యమ్ కలదు (అమెరికా కు నేరుగా అమ్పించాలంటే కొరియర్ చార్జీలు తడిసిమోపెడవుతాయి గాని). కిస్మీసు సెలవులకు ఇండియా (దట్ యీజ్ భారత్) కొచ్చి తిరిగి అటొస్తున్నవాళ్ల పీకల మీద కత్తిపెట్టి వాళ్ల లగేజి బ్యాగుల్లోంచి ఆవకాయ జాడి, అప్పడాల పొట్లాలు, ఇల్లాలికి కొన్న సాడీసు తీయించి బదులుగా ఈ బుక్కులు మీకోసం పట్టుకెళ్లమని బ్రతిమిలాడమంటారా. లేదూ ఇక్కడ నుండి అమెరికా వెళ్లే విమానం ఎయిర్ హోస్టెస్ పిలకాయలతో ఫ్రెండ్షిప్ జేసి అపుడోటీ అపుడోటీ అమ్పించమంటారా.

  సరదాగా కాసేపు
  http://www.telugubooks.in/products/saradaga-kaasEpu

  సరదాగా మరి కాసేపు
  http://www.telugubooks.in/products/saradaga-mari-kaasEpu

  ఆపత్ బాంధవి ఉరఫ్ పాపాల భైరవి
  http://www.telugubooks.in/products/aapadbhaandhavi-uraf-paapaala-bhairavi

  లంకె బిందెలు
  http://www.telugubooks.in/products/lanke-bindelu

  అంకుల్ డైనమైట్
  http://www.telugubooks.in/products/uncle-dynamite

 4. రెండూ చేస్తే పోలా !!

 5. Gabbita Krishna Mohan says:

  శశాంక గారికి, కోదండరామయ్య గారికి
  ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు
  Gabbita Wodehousu

మీ మాటలు

*