కలలో మనుషులు

 

-అల్లం వంశీ

~

 

allam-vamsi“మా తాత గురించడుగుతె చెప్తగని, గాంధి తాత గురించి నాకేమెర్క..!!”  ఆరో తరగతి చదివే కొడుక్కు అన్నం తినిపించుకుంట అన్నడు రాజన్న..

ఏంది బాపూ, ఎప్పుడేదడిగిన గిట్లనే అంటవ్..!! మూతి చిన్నగ చేస్కోని అన్నడు సతీషు..

నాకు తెలుస్తె చెప్పనారా? నిజంగనే నాకెర్కలేదు నాయినా..

ఏ పో బాపూ.. ఊకె గిట్లనే అంటవ్.. ఇంకోసారి నిన్నేదడగద్దు..

అరే.. అన్నీటికి గట్ల అలుగుతె ఎట్లరా??  ఇంగో ఈ బుక్క తిను.. బడికి ఆలిశమైతాంది, మళ్ల బస్సెళ్లిపోతది..

సతీష్ బుక్క నోట్ల పెట్టుకోకుండ “వద్దన్నట్టు” తలకాయి అడ్డం తిప్పిండు..

రాజన్న “ఇగ ఏదన్నొకటి చెప్పకపోతె వాడు తిండి తినడని” తనకు తోచిందేదో చెప్తాండు-

గాందీతాత అంటె…. గాంధీతాత అప్పట్ల, ఎనుకట ఉండేటోడు.. అప్పటికింక మీం పుట్టలే కావచ్చు!

ఇగో ఈ బుక్క తిను… చెప్తానగారా.. తినుకుంట ఇను.. ఇగో.. ఆ.. ఆ… అని సతీషు నోట్లోబుక్కపెట్టి-

అప్పట్ల మనకాడ తెల్లోల్లుంటుండేనట..

తెల్లోల్లంటే?

తెల్లోలంటె తెల్లోల్లేరా.. గీ.. మనా… గీళ్లను సూళ్ళేదా.. టీవీ ల అప్పుడప్పుడత్తరు సూశినవా?? గిట్ల ఇంగిలీషుల మాట్లాడుతరు సూడు.. గాళ్లు.. ఇంగో.. బుక్క వెట్టుకో..

ఆ..

రాజన్న ఇంకో బుక్క వెట్టి-

ఆ.. ఆళ్లున్నప్పుడు మరి ఈనె మనకు మంత్రో.. మరోటో ఉంటుండే గావచ్చురా..

ఎవలు.. గాంధితాతా?

ఆ.. ప్రెదాన మంత్రో.. ముక్యమంత్రో… మొత్తానికైతే ఏదో ఓటి ఉంటుండెనట…

ఆ..

అప్పుడు సొతత్రం అదీ ఇదని పెద్ద లొల్లుంటుండెనట.. ఇంగో బుక్కవెట్టుకో..

సొతంత్రం అంటే??

సొంతంత్రం అంటె…

సొతంత్రం అంటే సొతంత్రమే ఇగ.. మొన్నటిదాంక తెలంగాణ లడాయి లేకుండెనా?

ఆ..

అట్లనే అప్పుడు దేశం కోసం సొతంత్రం లడాయుండెనన్నట్టు.. ఇoగో ఈంత బుక్క వెట్టుకో…

ఆ.. లడాయైతుంటె??

అయినా, అయన్ని మనకెట్ల తెలుత్తయిరా.. ఇప్పటివేరం అప్పుడేమన్న పేపర్లా? టీవీలా?? అసలప్పుడు మనూరు మొత్తం కలిపి రెండిండ్లే ఎరికేనా??

మీ చిన్నప్పుడు టీవీల్లెవ్వా బాపూ??

టీవీలా?? టీవీలు కాదు నాయినా.. మాకసలు సైకిలంటెనే ఎర్కలేకుండే… అప్పుడు గియన్నెక్కడియిరా…..  అనుకుంట ఇంకో బుక్క పెట్టబోతే సతీష్ “కడుపు నిండిందన్నట్టు” అంగీలేపి బొత్త సూయించిండు… మిగిలిన రెండు బుక్కలూ రాజన్న నోట్లేసుకోని ఖాళీ కంచం బాయికాడ బోర్లేశిండు…

ఇంతలనే సతీషు జబ్బకు సంచేసుకోని బడికి తయారైండు… వాళ్లమ్మ పాత స్ప్రైట్ సీసను మంచిగ కడిగి నీళ్లు పోశిచ్చింది.. ఆమెకు టాటా చెప్పి తండ్రికొడుకులిద్దరు సైకిల్ మీద మొండయ్య హోటల్ కాడికి బయలెల్లిన్లు..

తొవ్వపొంటి రికామనేదే లేకుంట కొన్ని వందల ప్రశ్నలు అడుగుతనే ఉన్నడు సతీషు..

హోటలుకాడికి పొయ్యేపోవుడుతోనే “పల్లె వెలుగు” బస్సు రానే వచ్చింది…  అది మండల్ హెడ్ క్వార్టరుకు పొయ్యే బస్సు.. ఇక్కడికి పది కిలో మీటర్లు దూరం.. సతీష్ తోని పాటే ఇంకో నలుగురైదుగురు పిల్లలు బస్సెక్కిన్లు….

వాళ్లందరు సదివేది ఒక్క బల్లెనే.. సర్కార్ బడి.. ఆ హెడ్ క్వార్టర్లనే ఉంటదది..  వీళ్ల లెక్కనే చుట్టుపక్కల ఉన్న ఓ పది పన్నెండు ఊళ్లకేంచి చానమంది పిల్లలు ఇట్లనే రోజు బస్సులెక్కో, సైకిల్లు తొక్కో అదే బడికి వస్తుంటరు…

లోకలోల్లకూ,  ప్రైవేటు స్కూలు పిల్లలకు ఈ బాదుండదు, మంచిగ పొద్దుపొద్దుగాల్నే స్కూల్ బస్ ఇంటి గల్మలకే అచ్చి ఎక్కించుకుంటది, మళ్ళ పొద్దూకంగ అదే గల్మల పడగొట్టిపోతది… సతీషులాంటోళ్లకు అసొంటి బడికి పోవుడనేది ఎడారిల “ఒయాసిస్సే”… అదటుంచుతే సర్కార్ బల్లె అయితే ‘మాపటీలి తిండి’ ఉంటదికదా…!!!

******

అరేయ్… గాంధీతాత గురించి నేర్సుకచ్చుకొమ్మన్నగారా.. నేర్సుకచ్చుకున్నరా?? సార్ అడిగిండు..

ఈ సార్ మొన్న మొన్ననే జిల్లా హెడ్ క్వార్టరు కాంచెళ్లి ఈ బడికి ట్రాన్స్ ఫర్ అయి అచ్చిండు..

ఏందిరా?? ఎవ్వలు సప్పుడు చేస్తలేరు?? నేర్సుకచ్చుకున్నరా లేదా??

“నేర్సుకచ్చుకున్నం సార్” అని కొందరు.. “నేర్సుకచ్చుకోలేద్ సార్” కొందరు అంటున్నరు..

ఏందిరా?? నపరొక మాటoటాన్లు?  అసల్ నేర్సుకచ్చుకున్నారా లేదా?? గొంతు పెంచి అడిగిండు సారు..

గుంపుల గోవిందలెక్క ఈసారి అందరు గట్టిగ “నేర్సుకచ్చుకున్నం సార్” అన్నరు తలకాయలూపుకుంట.. అనుడైతె అన్నరుకని “నన్నెక్కడ లేపి అడుగుతడో” అని ప్రతి ఒక్కరికి లోపట లోపట గజ్జుమంటాంది.

“మందల గొర్ల వేరం అందరు తలకాయలూపుడు కాదురా,  ఒక్కొక్కన్ని లేపి అడుగుతె అప్పుడు బయట్వడ్తయ్  మీ యవ్వారాలన్ని..”  అనుకుంట క్లాసు రూం మొత్తం కలె చూస్తూ బేంచిల మద్యలనుంచెళ్లి లాష్టుబేంచిల దిక్కు నడిశిండు  సారు..

ఆ మాట వినంగనే అప్పటిదాంక మంచిగ సాఫ్ సీదా ఉన్న పిల్లల నడుములు ఒక్కసారిగ వంగి, గూని అయినయ్!

అట్ల వంగి కూసుంటే సార్ కు కనిపియ్యమని వాళ్ల నమ్మకం.. తలకాయలుకూడ నేల చూపులు చూస్తున్నయి… ఎవలకువాళ్లు మనసుల- “సార్ నన్ను లేపద్దు.. సార్ నన్ను లేపద్దు” అనుకుంటాన్లు…

అరే.. నారిగా.. లే రా…

లాస్టు బేంచిల అటునుంచి ఫష్టుకు కూసున్న నరేషు భయం భయంగ లేశినిలుసున్నడు..

చెప్పురా.. గాంధితాత ఎవరూ? ఆయినె దేశానికేం చేశిండు??

సార్.. అంటే.. అదీ.. సార్.. అని మాటలు నములుతాండు తప్పితే నోట్లెకేంచి కూతెల్తలేదు నరేషుకు..

ఏందిరా?? నేర్సుకచ్చుకోలే?? మీరు పుస్తకాలెట్లా తియ్యరు.. కనీసం ఇంట్లోల్లను అడిగన్న తెల్సుకచ్చుకొమ్మని చెప్పిన గారా.. అని సట్ట సట్ట రెండు మొట్టికాయలు కొట్టిండు సారు..

అబా… అద్దు సార్ అద్దుసార్.. నిన్న ఆణ్నే బొడుసులేశింది సార్.. అద్దు సార్.. అద్దుసార్ అని నెత్తి రుద్దుకుంటూ బతిమాలిండు నరేషు…

అరే రాజుగా నువ్వు చెప్పురా…

సార్.. అదీ.. సార్.. నిన్న మా అవ్వ పత్తేరవొయ్యింది సార్… ఇంటికి రాంగనే ఈ ముచ్చట్నే అడుగుదామనుకున్న సార్.. కని అచ్చేవరకే బాగ నెరివండుండే సార్.. అందుకే….

అందుకే అడగలేదంటవ్?? సాప్ మట్టల్ సాప్..

“ఫాట్”.. “ఫాట్”… సదువు రాదుకని సాకులు మాత్రం అచ్చు.. దినాం కొత్త సాకు.. సాపు..

“ఫాట్”.. “ఫాట్”…

ష్ష్ .. అబ్బా.. అద్దు సార్ అద్దు సార్ అనుకుంట మట్టలను జాడించిండు రాజు…

మీ లాష్ట్ బేంచి బతుకులెప్పుడు గింతేరా.. గిట్లనే గంగల కలుత్తయ్ మీ బతుకులు…. అని పక్కకున్న ఇంకిద్దరిని కూడ తలో నాలుగు దెబ్బలు సరిశి ముందుకు అచ్చుడచ్చుడే-

అరే సత్తీ… లేరా… చెప్పూ.. గాంధి తాత ఎవరూ? ఆయినేం జేశిండు??

గట్టిగ చెప్పు.. అందరికినవడాలే..

ఫస్ట్ బేంచిల కూసున్నవాళ్ళకు అన్నీ తెలుస్తయని సారు నమ్మకం.. నమ్మకానికి తగ్గట్టే, సతీష్ సుత ఏ మాత్రం భయపడకుండ ఠక్కున లేశి చేతులు కట్టుకోని చెప్పుడు వెట్టిండు..

సార్.. గాంధి తాతా.. అప్పట్ల… తెల్లోల్లున్నప్పుడు… మన మంత్రి ఉండేటోడు…

ఏందీ???

మంత్రి సార్.. మినిష్టర్..

ఏం మినిష్టర్ రా???

సార్ మాటల వ్యంగ్యం సతీష్ కు అర్థంకాక ఇంకింత ఉత్సాహంగ-

ప్రధాన మంత్రో, ముఖ్య మంత్రో ఉంటుండే సార్.. ఏదో తెల్వదు కని ఈ రెండీట్ల ఏదో ఓటుంటుండె సార్..

సార్ మొఖం ఎర్రగ అయింది…

“గాంధి తాతా మంత్రారా?? ఆయినె ముఖ్యమంత్రని నీకు మీ నాయిన చెప్పిండారా?” అనుకుంట  గిబ్బ గిబ్బ రెండు గుద్దులు గుద్దిండు సారు….

కాద్సార్ కాద్సార్.. ప్రెధాన మంత్రి సార్.. ప్రెధానమంత్రి సార్..

“మీ నాయినే చేశిండట్నారా ప్రధానమంత్రిని? ఆ??”                        వెన్నుబొక్క మీద ఇంకో రెండు గుద్దులు..

మా బాపు చెప్పింది చెప్పినట్టే అప్పచెప్పినా సుత సార్ కొడ్తుండేందని సతీషుకు మస్తు దుఃఖమస్తాంది కని ఆపుకుంటాండు.. ఎంత ఆపుకున్నాగని గుడ్లెంబడి నీళ్లు రానే అచ్చినయ్..

ఇంకో ఇద్దరు ముగ్గురు ఫష్టు బేంచోళ్ళను లేపి అడుగుతెసుత అసొంటి జవాబులే వచ్చినయ్.. గాంధి తాత గరీబోడూ, బట్టలుసుత లేకుండెనట అని ఒకరు చెప్తే, గాంధితాత ఉన్నోడేగని, ఉన్నది మొత్తం గరీబోల్లకు దానమిచ్చి అట్లయిండని ఇంకోడు చెప్పిండు.. ఇవన్ని వింటున్న సారుకు బీపీ పెరిగింది..

వాళ్ళ వేల్ల మధ్యలో చాక్ పీసు పెట్టి వొత్తిండు..

వాళ్లు “వావ్వో.. వావ్వో అద్దుసార్ అద్దుసార్” అని మొత్తుకుంటున్నా సార్ కు వినపడ్తలేదూ , విడిచిపెట్టబుద్ధైతలేదు.!

“థూ.. ఏం పోరగాన్లురా మీరు?? దునియాల గాంధి తాత గురించి ఎర్కలేనోడు ఉంటడారా?? ఓడు మినిష్టరంటడు, ఓడు గరీబోడంటడు, ఓడు అదంటడు ఇంకోడు ఇదంటడు..!! ఏడికెల్లి దాపురించిన్లురా ఇసంటి సంతంత!!! తినున్లిరా అంటె గిద్దెడు తింటరు ఒక్కొక్కడు.. సదువు మాత్రం సున్నా.. ఎందుకస్తర్రా ఇసొంటి గాడిదికొడుకులు మా పానం తినడానికి?  థూ..” నాలుక కొస్సకు ఇంక చాన మాటలున్నయి.. కని ఆపుతున్నడు..

పిల్లలందరూ తప్పు చేసినట్టు తలలు కిందికి వేస్కున్నరు..

మీకు తెల్వకపోతె తెల్వదు.. కనీసం మీ ఇంట్లోల్లనన్న అడిగి తెల్సుకోని రావద్దారా? ఆ? మీ నాయిన్నో, అవ్వనో.. ఎవరో ఒకల్ని అడిగి నేర్సుకోని రావద్దా??

నీన్ అడిగిన సార్..  సతీషు మెల్లగ అన్నడు..

మాద్దండి అడుగుడడిగినవ్ పో.. అదే చెప్పిండార మీ నాయిన?? గాంది తాత.. రాష్ట్రపతి, ముఖ్యమంత్రని??

ఔన్ సార్..

“ఎవడ్రా మీ అయ్యకు సదువుచెప్పినోడు? గాంధీజీ మన ముఖ్య మంత్రా?? ఆ?? చెప్పూ.. ముఖ్యమంత్రా??” చెవు మెలివెట్టిండు సారు..

ఆ.. ఆ.. ఎమ్మో సార్.. కాద్సార్.. కాద్సార్..

మీ అయ్య ఊళ్లె ఉంటాండా?? అడివిల ఉంటాండారా?? ఆ?? గాంధితాత ఎర్కలేదారా మీ అయ్యకు??

అని మళ్ళ క్లాస్ అంత కలెతిరిగి చూస్తూ- సరే వీళ్ల నాయినకు ఎరుకలేదట.. మరి మీ అందరి సంగతేందిరా??

మావోళ్లుసుత ఎర్కలేదన్నరు సార్.. అందరు మళ్ల గుంపుగ జవాబిచ్చిన్లు..

ఎవడన్న వింటె ముడ్డితోని నవ్విపోతడు ఎర్కేనా? మీ వొళ్లంత ఊళ్ళె ఉంటాన్లా జంగిల్ల జంతువుల్తోటి ఉంటాన్లా? గాంధి తాత గురించి తెల్వదనుడేందిరా? మీ నకరాలు గాపోతె…. ఇట్ల కాదుకని ఇయ్యాల మీ సంగతి చూశినంకనే ఇంకో పని..

ఒక్కొక్కడు లేశి మీ నాయినలేం జేత్తరో చెప్పున్లిరా… మీ ఈపులు మొత్తం సాఫ్ చేశే పోత ఇయ్యాల…  చెప్పుర సంతు మీ నాయినేం జేత్తడ్రా…

సార్… మా బాపు.. మా బాపు చాపల వడ్తడు సార్..

ఏందీ?

ఔ సార్.. మా బాపు చాపల వడ్తడు.. మా బాపు గాలమేత్తె కం సె కం కిలకు తక్కువ చాప వడదు సార్.. ఇగ వలేత్తెనైతె వశపడదు సార్..

సార్.. మా బాపు ఉట్టి చేతుల్తోటిసుత చాపలు పడ్తడు సర్..

ఆ..!!

మా బాపు నీళ్లల్లకు దిగిండంటే  చాపలే ఆయినకు ఎదురత్తయంటరు సార్ మా ఊరోళ్ళు..

ఇంకా??

Kadha-Saranga-2-300x268

“మా బాపు ఎవుసాయం జేత్తడు సార్… నారు వోశిన కాంచి అడ్లు కొలిశేదాక మొత్తం అన్ని చేత్తడు సార్ మా బాపు..” ఓదెలు అందుకున్నడు.

ఆ..

అడ్లను ఒక్కచేత్తోనే గుప్పిట్ల ఇట్ల వట్టుకోని ఆటిని నలిపి బియ్యం తీత్తడు సార్ మా నాన.. బియ్యం నలుపుతె పిండి పిండి అయితసార్ నిజంగా…

అచ్చా.. ఇంకా..

మా నాయిన పడువ తోల్తడు సార్.. మనూరోల్లు శివారానికి, ఏలాలకు పోవాల్నన్నా, ఆ ఊళ్ళోల్లు మనూళ్ళెకు రావాల్నన్నా మా నాయిన పడువొక్కటే సార్…

అచ్చా!!

నిరుడు హోళి అప్పుడు ముగ్గురు పోరగాన్లు కయ్యలల్ల వడి మునుగుతాంటె ఆళ్లను మీదికిగ్గింది మా నాయినే సార్.. ఇప్పటిదాంక అట్ల బొచ్చెడుమందిని బచాయించిండుసార్ మా నాయిన..

ఆ..!!

సార్.. మన జిల్లా మొత్తమ్మీన ఆనా కాలం, గంగ ఇటొడ్డు కాంచి అటొడ్డుకు ఈత కొట్టే మొగోడు మా నాయినొక్కడే అట సార్.. మా కాక చెప్తడు..

ఇంకా..??

సారు విసుగుతో, వ్యంగ్యంతో అంటున్న “ఇంకా” అనే మాట ఆ పిల్లల కు చాన పాజిటివ్ గ అనిపించింది… మా సార్ మా నాయినలు గురించి తెల్సుకోవాల్నని అడుగుతున్నడు అనుకోని ఇంకింత ఉత్సాహంతో తమ తమ తండ్రుల గురించి చెప్పుడు షురూ చేశిన్లు ఒక్కొక్కరు..

మా అయ్య అమాలి పనికి పోతడు సార్… మొత్తం లారెడు లోడు ఒక్కన్ని ఎక్కియ్యమన్నా ఎక్కిత్తడు సార్, మళ్ల దించుమంటె సుత అప్పటికప్పుడు దించుతడు సార్ మా అయ్యా..  రవి చెప్తున్నడు..

ఆ..

పేనేడాది గా బుచ్చన్నోళ్లు, కచ్చరమ్మీద అడ్ల బస్తాలు చేరగొడ్తాంటే జొడెడ్లల్ల ఒక ఎద్దు తొవ్వల్నే సచ్చిపేంది సార్.. అప్పటికే ఆయిటిపూని ఎప్పుడు వానకొట్టేది ఎర్కలేకుంటున్నది.. కచ్చరంల పదిహేను కింటాల్ల అడ్లున్నయట సార్, కప్పుటానికి బర్కాల్ సుత లెవ్వు.. సరిగ్గ అదే టయానికి మా అయ్య అటుకేంచి పోతాంటె సమ్మన్నా జర సాయం పట్టరాదే అన్నరట సార్.. గంతే.. కనీ వట్టుకోని కచ్చురాన్ని అమాంతం లేపి జబ్బ మీదికెత్తుకున్నడట సార్.. కనీకి ఓ దిక్కు ఎద్దు ఇంకో దిక్కు మా నాయిన… అట్ల ఆరు కిలమీటర్లు ఇగ్గుకచ్చి అడ్లు ఇంటికి చేరగొట్టిండు సార్… మా బుచ్చన్నమామ ఇప్పటికి చెప్తడు…

ఆహా..! ఇంకా?

సార్… మా నాయిన కోళ్లు పెంచి అమ్ముతడుగని ఆయినెకు పామ్మంత్రం, తేలు మంత్రం ఎరికెసార్… షరీఫు లేశి అన్నడు.

ఆ..

నా అంతున్నప్పుడే మా నాయిన నాగుంబాములు ఉట్టి చేత్తోటి వట్టిండట సార్.. నాగుంబాం కుట్టినా, కట్లపాం గుట్టినా, చిడుగువడ్డా.. మా నాయినకాడ మొత్తం అన్నీటికి మందున్నది సార్… అసల్ ఇప్పటిదాంక ఒక్కర్నిసుత సచ్చిపోనియ్యలేసార్ మా నాయిన..

“ఇదెక్కడి లొల్లిరా బాబు..” సార్ మనసులోనే అనుకుంటాండు..

సార్ మా బాపు కల్లు గీత్తడు సార్.. తాళ్లుంటయి గద సార్.. పొద్దుగాల పదింటికి దాని నీడ ఏడి దాక వడ్తదో ఎర్కెగద సార్??  అగో.. ఆ నీడ మీద మనం ఇటుకేంచి అటు నడిశి, మళ్ల అటుకేంచి ఇటూ ఎనుకకు మర్రచ్చేంతల మా బాపు ఆ తాడెక్కి లొట్లుసుత వట్టుకోని దిగుతడు సార్.. గంత జెప్పన ఇంకెవలెక్కర్ సార్.. పవన్ చాతి ఉబ్బించి మరీ చెప్పిండు.

మాట మాటకు సారుకు విసుగు పెరిగిపోతాంది…

సార్..  మా నాన బట్టల్ కుడ్తడు సార్… అంగీలు, లాగులు, ప్యాంట్లు, బనీన్లు మొత్తం అన్ని కుడ్తడు సార్… అసల్ చేతుల టేపు వట్టకుండ, కొల్తలు తియ్యకుంట ఉట్టిగ మనిషిని చూత్తె సాల్ సార్, బరాబ్బర్ ఎవలి సైజుల వాళ్ళకు బట్టలు కుట్టిత్తడు సార్ మా నాన… చెప్పిండు రమేషు..

సార్ మా నాయిన సాకలోడు సార్.. సార్ మా బాపు పాలమ్ముతడు.. మా బాపు మంగలాయినె సార్… మా నాయిన కట్టెలమ్ముతడు.. మేస్త్రి పని చేత్తడూ..  చాయి బండి.. సాలె మగ్గం.. కుమ్మరి కుండలు.. ఇస్తిరి డబ్బా… పాతినుపసామాన్… అని ఒక్కొక్కరు మస్తు సంబురంగ సార్ సార్ అనుకుంట తమ తండ్రుల గురించి చెపుతున్నరు.. క్లాస్ అంతా పిల్లల ఉత్సాహంతోని నిండిపోయి.. మంచి ఆహ్లాదకరంగా మారిపోయింది..

కాని ఇంతలనే “నీ యావ్… ఇగ సాలు ఆపున్లిరా…” అన్న మాట ఆ గదిల ప్రతిధ్వనించింది..

పులిని చూశి భయపడ్డట్టు పిల్లలందరు ఒక్కసారి గజ్జున వణికిన్లు సార్ కోపం చూసి..

చెప్పుమన్నకదా అని ఒక్కొక్కడు మా అయ్య మినిస్టరు, మా అయ్య కలెక్టరు అన్న లెవల్ల చెప్తాన్లేందిరా??

అసలొక్కటన్న మంచి పని ఉన్నదార మీరు చెప్పిన దాంట్ల?? నాన్ సెన్స్ అని… నాన్ సెన్స్..

పిల్లల మొఖాలు మాడిపొయినయ్..

ఓడు పాలమ్ముతడట.. ఓడు చాపల్ వడ్తడట.. గివ్వారా పనులంటే? ఆ?? గివ్వేనా??

పిల్లల పానం సల్లవడుతాంది, సారుకు మాత్రం ఒళ్లంత మంట వెట్టినట్టయితాంది..

మూటలు మోశుడూ, బర్ల ముడ్లుకడుగుడూ ఇయ్యారా పనులు? ఆ??

నాన్ సెన్స్ అని… నాన్ సెన్స్..  ఊరోళ్లూ.. ఊరి కథలు… నీ.. యవ్.. మిమ్ముల గాదుర నన్నీడికి ట్రాన్స్ ఫర్ చేశినోన్ని అనాలె ముందుగాల.. థూ.. ఇసొంటి మనుషుల్ని నీనేడ సూల్లేదవ్వా… ఓ సదువులేదు ఓ తెలివి లేదు..

గాంధీజి ముఖ్యమంత్రట.. చత్.. మరీ గింత అనాగరికంగ ఎట్లుంటర్రా మనుషులు?? ఎసొంటోల్లత్తర్రా మా పానాల మీదికి?? అని ఇంకేదో అంటున్నంతలనే అన్నం బెల్లు కొట్టిన్లు..

పొట్ట చీరుతె అక్షరం ముక్క రాదుగని, టైముకు తిండి మాత్రం పెట్టాలె మీకు!! నాన్ సెన్స్ అని నాన్ సెన్స్.. చత్… ఏం రాజా బతుకురా మీది!!  అనుకుంటూ తొవ్వలున్న కుర్చీని కోపంగ పక్కకు నూకి బయటికి నడిచిండు సారు…

మాములుగ బెల్లుకాంగనే “మధ్యానం భోజనానికి” కంచాలువట్టుకోని గ్రౌండుకాడికి ఉరికే పిల్లలు ఇయ్యాల మాత్రం కూసున్న కాంచెల్లి లేవలే..

ఇన్ని రోజులు వాళ్ళు తమ తండ్రులు చేసే పనులు మహ మహా అద్భుతాలనుకున్నరు.. కని సార్ మాత్రం ఇంకో తీరంగ అంటున్నడు.. ఎందుకట్లన్నడనేదే వాళ్లకు సమజైతలేదు..

ఎవ్వరికి అన్నానికి లేవ బుద్దైతలేదుకని ఆ రోజు ఉడ్కవెట్టిన కోడిగుడ్డు ఇచ్చే రోజు.. వారానికి ఇచ్చేదే రెండ్లు గుడ్లు..  అందుకే గుడ్డు మీద ఆశకొద్ది పాపం అందరు కంచాలు వట్టుకోని బయటికి నడిశిన్లు…

******

సాయంత్రం ఏడింటికి..

“సార్” వాళ్ళింట్ల టీవీ చూస్కుంట ఫోన్ మాట్లాడుతున్నడు..

“ఎక్కడ బావా!! రూపాయి దొర్కుతె ఒట్టు…  మాదేమన్న మీలెక్క రెవెన్యూ డిపార్టుమెంటా చెప్పు? మీరు కుక్కను తంతె పైసల్ రాల్తయ్.. మా ముచ్చట అట్లకాదుకదా.. అందుకేగదా ఇయన్ని యవ్వారాలు..”

అవతలి మనిషి ఏదో అన్నడు..

vamshi

వంశీ కథాసంపుటి ఆవిష్కరణ సందర్భంగా…

అయన్ని కాదు కని బావా నువు కొంటానవా లేదా ఒకటే ముచ్చట చెప్పు.. బయటోళ్లకైతె నాలుగ్గుంటలు పదికిత్తా అంటున్నరు, నువ్వు మనోనివి కాబట్టి నీకు ఆరుకు ఇప్పిస్త.. సరేనా?? నా కమిషన్ టెన్ పర్సెంట్ లెక్క అలగ్ మల్ల…

డ్యాడ్….. “సార్” కొడుకు వరుణ్, తండ్రిని పిలిచిండు..

“డ్యాడ్” కొడుకును పట్టించుకోకుండ ఫోన్ ల మాట్లాడుతనే ఉన్నడు..

ట్రాన్స్ ఫర్ అంటే ఉట్టిగనే అయితదా బావా? ఎన్ని చేతులు తడుపాల్నో నీకెర్కలేదా! అందుకేగా ఇన్ని తిప్పలు.. ఫైవ్ పర్సెంట్ అంటె కాదుగని ఎనిమిది చేస్కో బావా నువ్ కాబట్టి లాష్ట్ ఇంక…

డ్యా…..డీ…. ‘కుర్ కురే’ నములుకుంటూ కొంచం గట్టిగ పిలిచిండు కొడుకు.

వాట్ బేటా??

ఐ హ్యావ్ అ డౌట్ డ్యాడ్…

యా??

వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ “పండిత పుత్ర పరమశుంఠా”??

అతనికి తన కొడుకేమంటుండో ఒక్క నిమిషం అర్థంకాలేదు..

వ్వాట్?? వ్వాట్ బేటా??

వాట్…. ఈస్…. ద…. మీనింగ్…. ఆఫ్…. “పండిత పుత్ర పరమశుంట??”..

అప్పటిదాక పక్కకుపెట్టి పట్టుకున్న ఫోన్ లో “నీన్ మళ్లీ ఫోన్ చేస్త బావ..” అని చెప్పి కాల్ కట్ చేసి.. కొడుకును దగ్గరికి రమ్మన్నడు ” డ్యాడ్”..

కొడుకు కుర్ కురే ముక్కను నోట్లె సిగరెట్ ముక్కలెక్క పెట్టుకోని తండ్రిని ఇమిటేట్ చేస్కుంట చాన క్యాజువల్ గా వచ్చి “డ్యాడ్” పక్కన కూచున్నడు..

నౌ, టెల్ మీ వాట్ హ్యాపెండ్??  అసల్ ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా నీకు??

నథింగ్ డ్యాడ్.. మా సర్ ఇవ్వాల నన్నామాట అన్నడు..

ఎందుకు?? ఎందుకట్లన్నడు??

వాడు వట్టి వేస్ట్ ఫెలో డ్యాడ్…

వరుణ్.. టెల్ మి అంటున్న కదా..

అదంత పెద్ద స్టోరీ డ్యాడ్.. లైట్ తీస్కో.. దానికి మీనింగ్ చెప్పు చాలు…

రేయ్.. మంచిగ అడుగుతున్నకదా.. చెప్పు.. అసల్ ఆ మాటెందుకన్నడు వాడు?

అరే.. ఈసీ డ్యాడ్.. ఇవ్వాల లంచ్ అవర్ లో బాక్స్ ఓపెన్ చేస్తే అందులో మళ్లీ బాయిల్డ్ ఎగ్గ్ కర్రీనే ఉండే.. మమ్మీ కి పొద్దున్నే ఫ్రై కర్రి చెయ్యమని చెప్పినాకుడ వినకుండా మళ్లీ అదే బోరింగ్ బాయిల్డ్ ఎగ్స్, టొమాటో కరీ వేసి పెట్టింది డ్యాడ్.. అందుకే మమ్మీ మీద కోపమొచ్చి బాక్స్ విసిరి కొట్టిన… బట్ అన్ ఫార్చునేట్లీ ఎగ్సాక్ట్  అదే టైం కి మా మ్యాక్స్ సర్ గాడు అక్కడికొచ్చిండు..

ఆ?? వస్తే??

వొచ్చి.. ఈ బాక్స్ ఎవరిది అన్నడు… ఐ సెడ్ ఇట్స్ మైన్… బట్ వాడు “ఎందుకు విసిరికొట్టినవ్..” అదీ ఇదీ అని పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసాడు డ్యాడ్…

అంటే?? నువ్ ఇవ్వాల కూడ లంచ్ చెయ్యలేదా వరుణ్? పక్కనే టీవీ చూస్తున్న వాళ్ల మమ్మీ అడిగింది..

గీతా.. ప్లీస్ డోంట్ చేంజ్ ద టాపిక్.. చెప్పు వరుణ్ తర్వాతేమైంది??

నతింగ్ డ్యాడ్.. నా లంచ్ నా ఇష్టం అని నేన్ కూడా ఫుల్ ఆర్గ్యూ చేసిన….

ఆ??

ఆ వేస్ట్ గాడు అక్కడో పెద్ద సీన్ చేసి నాకు క్లాస్ పీకాడు..

ఆ?

అప్పుడు  ఫైనల్ గా వాడొకటన్నాడు డ్యాడ్.. “అన్నం విలువ తెలిస్తె నువ్విట్ల చెయ్యవ్ వరుణ్” అని.. నాకు ఫుల్ కోపమొచ్చింది.. నాకు తెల్సు అన్న.. కని వాడు ఇంక ఎక్స్ట్రా చేస్తూ “అసల్ నువ్ తినే అన్నానికి బియ్యం ఎక్కన్నుంచి వొస్తాయో చెప్పు” అన్నడు..

నేన్ బియ్యం- “బియ్యం చెట్లకు” కాస్తయని చెప్పిన…

అంతే డ్యాడ్, ఆ వేస్ట్ గాడు నాతో ఇంక ఆర్గ్యూ చెయ్యలేక “పండిత పుత్రా పరమ శుంఠా” అని సాన్స్ క్రిట్ లో ఏదో అనుకుంటూ అక్కణ్నించి ఎస్కేప్ అయిండు… అసల్ ఆ సెంటెన్స్ కి మీనింగ్ ఏంది డ్యాడ్??

“దానికి మీనింగ్ కాదురా.. అసల్ ఆ మాటన్న సార్ గాడెవడో చెప్పు.. వాని తోలు ఒలిచి పారేస్తా..

వానికెంత బలుపుంటె ఆ మాటంటడు వాడు నా కొడుకును? ఆఫ్ట్రాల్ ప్రైవేట్ టీచర్ గానికి గంతగనం మోరనా?? వాని…  లక్షల్ లక్షల్ ఫీజులు కట్టేది గిందుకోసమేనా? లంజొడుకు… నోటికి ఏదస్తె అదనుడేనా సాలెగాడు!!అసల్ ఏం అనుకుంటాండ్రా వాడు??  రేపైతె తెల్లారని.. వాన్ని డిస్మిస్ చేయించి పారేస్త స్కూల్లకెల్లి.. … …. నాన్సెన్స్ అని నాన్సెన్స్..”

******

రాత్రి ఎనిమిదయితుంది..

సతీషు అన్నం తింటలేడని వాళ్ల బాపు బతిమాలుతాండు..

“తిను నాయినా.. దా.. ఒక్క బుక్క.. దా దా.. మా సత్తి మంచోడుగదా.. దా.. ఒక్క బుక్క తిను రా నాయినా.. దా..” అనుకుంట అన్నం బుక్క నోటిముంగటే పెట్టినా సతీషు మాత్రం నోరు తెరుస్తలేడు..

“నా బంగారం కదా.. దా బిడ్డా.. ఒక్క బుక్క.. ఒక్కటంటె ఒక్కటే బుక్క.. దా నాయినా… నెరివడ్తవ్ రా రా..” అమ్మసుత మస్తు బతిమాలుతాంది కని సతిషు మాత్రం నోరు తెరుస్తలేడు..

అసల్ ఎందుకలిగినవ్ రా? ఏవలన్న ఏమన్న అన్నరా??

సత్తి మాట్లాడలేదు..

చెప్పు కొడుకా.. ఏమైందిరా??  బిస్కిటు పొడ తేవాల్నా, “ఛా”ల ముంచుకోని తినేవు??

ఉహూ..

పోని చాకిలేట్లు తేవాల్నా??

సత్తి వద్దన్నట్టు తల అడ్డంగ ఊపిండు..

మరేంగావాల్నో చెప్పురా?? ఉట్టిగనే అట్ల మా మీద అలుగుతె ఎట్లరా మరి…  దా… మా బుజ్జి కదా.. ఒక్క బుక్క తిను.. దా నాయినా..

“నాకద్దు పో.. నీన్ తినా అని చెప్పిన కదా… ఊకె ఎందుకట్ల సతాయిస్తున్లు.. నాకద్దు.. నీన్ తిన..”

సత్తి గొంతుల కోపం కన్నా దుఃఖం ఎక్కువున్నదని ఆ తల్లిదండ్రులకు ఉట్టిగనే అర్థమైంది..

ఏమైందిరా?? ఏవలన్న ఏమన్న అన్నరా??

బల్లె సారు గిట్ల కొట్టిండారా??

సత్తి కండ్లల్ల ఒక్కసారిగా నీళ్ళు ఊరుకచ్చినయ్.. ఠక్కున అమ్మ ఒడిల వాలి పొయ్యి చీర కొంగును మొఖం మీదికెళ్లి ఏసుకున్నడు..

వాడి కన్నీళ్ల వెచ్చదనం ఆ తల్లిదండ్రుల మనసుకు తెలుస్తనే ఉంది…

ఊకో నాయినా.. ఊకో రా.. దా దా దా.. అనుకుంట చేతులున్న కంచం పక్కకువెట్టి కొడుకును ఎత్తుకున్నడు బాపు..

ఎవల్రా?? మీ సారు కొట్టిండా??

మ్మ్… సత్తి ముక్కు చీదుకుంట అన్నడు..

అమ్మ ఊకో బిడ్డా ఊకో అనుకుంట కొంగుతోని కండ్లు తుడుస్తాంది..

అరెరే.. అందుకు అలిగినవా కొడుకా?? ఊకో.. ఊకో..  బాగ కొట్టిండారా సారు??

మ్మ్..  మస్తు కొట్టిండు బాపూ.. ఎన్నుల గిబ్బ గిబ్బ గుద్దిండు.. అనుకుంట బనీను లేపి చూపించిండు..

అమ్మ కండ్లల్ల నిళ్ళచ్చినయ్ కని కొడుక్కు కనపడకుండ వెనకనే నిలుచుని అతని వెన్నును చేత్తో రుద్దుతోంది… సత్తికిసుత మళ్ల కండ్లల్ల నీళ్లస్తున్నయ్..

అరే.. ఊకో నాయినా.. నీను అటెప్పుడన్నచ్చినపుడు “మావోన్ని కొట్టద్దని” మీ సారుకు చెప్త సరేనా?? ఆ.. ఇంగో..

నోరు తెరువు… ఇగో.. ఆ.. ఆ.. ఈ బుక్క తిను… రేపు బడికిపోంగ నీకు ఉప్పు బిస్కిటుపొడ కొనిస్త సరేనా?? అనుకుంట  నోట్లో బుక్క పెట్టిండు బాపు..

సతీషు బుక్క నములుతూ- నీను రేపటి కాంచి బడికి పోను బాపూ.. మా సార్ ఉట్టుట్టిగనే మస్తు కొడ్తాండు.. మా దోస్తులుసుత బడి బంజేత్తా అంటున్లు..

లె ల్లే.. తప్పు కొడుకా అట్లనద్దు.. మీకు సదువు మంచిగ రావల్ననేగారా మీ సార్లు కొట్టేది..  గాయింత దానికే సారుమీద అలుగుతరా చెప్పు..

అట్లకాదు బాపూ.. ఆయినే మాదండోడు..

సదువు చెప్పే సారును అట్లనద్దురా.. తప్పు నాయినా.. ఇంగో బుక్క వెట్టుకో..

మీరందరు మంచిగ సదువుకోని రేప్పొద్దుగాల మంచి మంచి నౌకర్లు చేత్తె ఆ సారుకు ఏమన్నత్తదా చెప్పు?? మీ బతుకే మంచిగైతది కదా?? సార్లు ఓ మాటన్నా, ఓ దెబ్బ కొట్టినా అదంత మీరు మంచిగుండాల్ననేకని మిమ్ముల కొట్టుడు వాళ్లకేమన్న ఖాయిషా కొడుకా??  ఇంగో బుక్క తిను…  ఇంకెప్పుడు సదువు చెప్పే సార్లను అట్లనకు సరేనా..

సరే..

చెంపలేస్కో..

చెంపలు వేస్కుంటూ… “చిన్న చిన్న బుక్కలు వెట్టు బాపు” అన్నడు సత్తి..

నాయిన బుక్కను సగంచేసి పెట్టిండు.. అది నములుకుంటూ సత్తి అన్నడు- “అయినా.. ఇయ్యాల నువ్వు చెయ్యవట్టికే మా సార్ నన్ను కొట్టిండు బాపూ..”

నీన్ చెయ్యవట్టా?? నీనేం చేశిన్రా??

పొద్దుగాల “గాంధితాత గురించి అడుగుతె నువ్వు సక్కగ చెప్పలేగదా.. అదే ముచ్చట మా సారుకు చెప్తే ‘గిది సుత తెల్వదారా మీ అయ్యలకు’ అనుకుంట ఎన్నుల గిబ్బ గిబ్బ గుద్దిండు బాపూ..”

******

తండ్రికొడుకులిద్దరు రాత్రి కల్లం కాడికి కావలిపొయ్యి, చిన్నపాటి గడంచెల నడుం వాల్శిన్లు.. సత్తి, బాపు చెయ్యిమీద తల పెట్టుకోని…. బొత్త మీద కాలూ-చెయ్యి ఏశి గట్టిగ పట్టుకోని పడుకున్నడు..

“బాపు” కండ్లు మూసుకున్నడు కని నిద్రపడ్తలేదు… కొడుకన్న మాటలే చెవులల్ల మళ్ల మళ్ల వినపడుతున్నయ్..

“గాంధితాత గురించి అడుగుతె నువ్వు సక్కగ చెప్పలేగదా.. అదే ముచ్చట మా సారుకు చెప్తే ‘గిది సుత తెల్వదారా మీ అయ్యలకు’ అనుకుంట ఎన్నుల గిబ్బ గిబ్బ గుద్దిండు బాపూ..”

“పాపం..  నీన్ చెయ్యవట్టే నా బిడ్డ దెబ్బలు తిన్నడియ్యాల.. పాపం.. కొడుకు…” అనుకుంట కొడుకు తలను, ఎన్నునూ ప్రేమగ నిమిరిండు బాపు.. అతని కండ్లల్ల కన్నీళ్ళు..

పిలగానికి ‘జో’ కొడుతూ కొడుతూ ఏ రాత్రో తనూ నిద్రలకు జారుకున్నడు..

చిమ్మ చీకటి…

చిక్కటి నిశ్శబ్దం…

పైన చుక్కలూ..

కింద చుట్టూ.. చెట్లూ చేమల మధ్యల…  చల్లటి గాలి జోలపాటకు, కన్నంటుకోవల్సిన ఆ “అనాగరికులు”..

కలత నిద్రలో…

ఒకే కలవరింపు…

“మా తాత గురించడుగుతె చెప్తగని, గాంధి తాత గురించి నాకేమెర్క..!!”

*

మీ మాటలు

 1. కథ అద్భుతంగా ఉంది వమ్శీ. అసలు అనాగరికులు అంటే ఎవరో చెప్పకనె చెప్పినావు. “పచ్చదనపు” పుస్తకం తీస్తున్నందుకు శుభాకాంక్షలు.

 2. Balakrishna Koyada says:

  Nenu chadivina goppa kadhalallo idhi okkati.
  inka ilanti kadhalu meeru rayalani korukuntunnam.

  • Allam Krishn Vamshi says:

   చాన చాన ధన్యవాదాలు బాలకృష్ణ గారూ.. మనస్పూర్తిగా కృతజ్ఞ్యతలు..

 3. Prasad babu says:

  baagundanDii neanu chadivina mee toli katha.

 4. Chilappa chandrasheker says:

  Super

 5. చాల చాల బాగుంది వంశీ…

  ఎన్నో చోట్ల కండ్లల్ల నీళ్లు తిరిగినయి. గొప్ప ఆశను కలిగిస్తున్నవు. నిలబెట్టుకుంటవనే నమ్మకం.

  • Allam Krishna Vamshi says:

   తప్పకుండా నిలబెట్టుకుంటాను సర్.. థాంక్యూ సో మచ్..

 6. చాల బాగా ఉంది .ఆర్ద్రత తడి కథలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.ra

 7. Threveen Challa says:

  నైస్ స్టొరీ మామ.చాల బాగుంది.

 8. చదువు , సంస్కారం ,నాగరికత , మనుషులు అంతా కథ తో చెప్పావు వంశీ . గుడ్ లక్ .

 9. Village life ni transparent ga establish chesav..
  Shaili baagundi. Keep it up Vamshi 👍

 10. వనజ తాతినేని says:

  గుండె బరువైంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం తెలియనివాళ్ళు నిరక్షరాస్యులు లక్షల మంది ఉన్నారు. చదువుకోవాలంటే తల్లిదండ్రులు చదువుకోవాలని సర్కార్ బడులలో కూడా రూల్స్ పెడితే ఏ పేదోడి బిడ్డా బడి మెట్లు ఎక్కడు. నాగరికుల మీద రోతేసి పోయే వాస్తవ చిత్రీకరణ. కథ చదువుతుంటే మధ్య మధ్యలో ఎన్నోసార్లు మనసు తడి. వంశీ ..చాలా రోజులు గుర్తుండే కథ వ్రాసావ్ ! పల్లె కి పొతే ఈ కథ తప్పకుండా గుర్తుకొస్తుంది .

  • Allam Vamshi says:

   చానా చానా ధన్యావాదాలు మేడమ్, నేను రాసిన ప్రతి కథకు మీరిచ్చే అభిప్రాయాలు నాకు నిజంగా మస్తు ఎంకరేజ్మెంట్ గ ఉంటాయ్ మేడమ్, కథ మీకు నచ్చడం చాన సంతోషంగా ఉండండి.. థాంక్యు సొఅ మచ్

 11. Ramakrishna Vanam says:

  తెలుగు బాష లోని తీయదనాన్ని తెలంగాణా యాసలోని కమ్మదనాన్ని పల్లె బతుకులోని సంస్కారాన్ని సర్కారి బడులల్లోని పిల్లల జీవితాన్ని గురించి అద్బుతంగా రాసిండ్లు మీరు

  మనదైన తెలంగాణా పదాలని ఇంకా ప్రాచుర్యం లోకి తేవాలని కోరుకుంటూ.

  • Allam Vamshi says:

   తప్పకుండ నా ప్రయత్నం నెఅను చేస్తూనే ఉంట రామకృష్ణ గారు.. థాంక్యూ..

 12. మస్తుంది తమ్మీ.. సూపర్!!👍

 13. కె.కె. రామయ్య says:

  ” సత్తి కండ్లల్ల ఒక్కసారిగా నీళ్ళు ఊరుకచ్చినయ్.. వాడి కన్నీళ్ల వెచ్చదనం ఆ తల్లిదండ్రుల మనసుకు తెలుస్తనే ఉంది…” కధ చదివిన వాళ్ల కళ్ళూ చెమర్చేలా చేసావు వంశీ. కృతజ్ఞతలు.

  • Allam Vamshi says:

   చానా చాన థాంక్యూ సార్.. చదివి కొందరన్న “ఆలోచిస్తే” సంతోషం సార్.. :)

 14. Sukumar DS says:

  ప్రతి సన్నివేశం నాకు అనుభవమైనట్టె అనిపిస్తోంది సార్. ఇది నా కథే!

 15. చాలా చాలా మంచి కథ కృష్ణ వంశీ గారూ… అభినందనలు.

  • Allam Vamshi says:

   కథ చదివి, అభిప్రాయాన్ని తెలిపినందుకు చాన చాన ధన్యావాదాలు రాధ గారు.. హ్యాపీ..

 16. కథ చాలా బాగుంది వంశీ అభినందనలు

 17. “మా తాత గురించడుగుతె చెప్తగని, గాంధి తాత గురించి నాకేమెర్క..!!”
  కధకి వరుణ్ అవసరం కనిపించలేదు. మిగతా కధ మాత్రం చాలా బాగుంది. అభినందనలు!!

  • Allam Vamshi says:

   మీ విలువైన అభిప్రాయాన్ని తెలిపినందుకు చాన చాన థాంక్స్ మధు గారూ.. వరుణ్ పాత్ర పెట్టడానికి కారణం ఆ గవర్నమెంటు టీచర్ పర్సనల్ లైఫ్ ను గురించి చెప్పడానికి..
   వరుణ్ వాళ్ళ స్కూల్లో జరిగిన సంఘటనకు వాళ్ల “నాగరిక” డ్యాడీ ఎట్లా రియాక్ట్ అయ్యిండూ & at the same time ఇక్కడ సత్తి వాల్లింట్లొ same అటువంటి సందర్భంలో తన “అనాగరిక” తండ్రి ఎట్ల రియాక్ట్ అయ్యిండొ అనే ఆ పొలిక చెప్పడం కోసం అట్లా రాసిన సార్.. థంక్యూ :)

 18. Good tammi..

మీ మాటలు

*