దేవుని చేతిలో గన్నులు ఎందుకు లేవు-1

 

-వినోద్ అనంతోజు

~

vinodముందు మాట:

ప్రశ్న ఒక Chain Reaction. ఏ ప్రశ్నకి అయినా సమాధానం వెతికే క్రమంలో ఎన్నో ఇతర ప్రశ్నలు పుడతాయి. వాటికి సమాధానం వెతికేటప్పుడు ఇంకొన్ని ప్రశ్నలు పుడతాయి. ఇలా అంతు లేకుండా ఒక Chain Reaction లా సాగిపోతుంది. ప్రశ్న ఏదయినా దానికి ఒక సమాధానం ఉండి తీరుతుంది. ఒక్క చిన్న ప్రశ్నతో మొత్తం విశ్వంలోని అన్ని విషయాలనీ అన్వేషించవచ్చు. మనకి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలే గానీ “ఆకలి ఎందుకు వేస్తుంది?” అనే చిన్ని ప్రశ్న నుంచి అటు బయాలజీని, ఇటు సోషియాలజీని అంతుల దాకా అన్వేషించవచ్చు. ఈ శీర్షికలోని వ్యాసాలు ఇలాంటి ఆసక్తి ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయి. చిన్న ప్రశ్నతో మొదలుపెట్టి నేను Anthropology, History, Metallurgy, Religion, Arts, ఇలా ఎన్నో సబ్జెక్టుల్లోకి వెళ్లాను. కొన్ని సార్లు అసలు ప్రశ్నని వదిలేసి మిగతా ప్రశ్నలకి సమాధానం వెతికే పనిలో పడ్డాను. ఈ వ్యాసాలని బాగా అర్థం చేసుకోవడానికి మీరు కూడా కొంత శ్రమ చెయ్యక తప్పదు. నాతో కలిసి మీరు కూడా ప్రశ్నలకి సమాధానాలు వెతకాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీకు కూడా ఆ సబ్జెక్టుల్లో ఆసక్తి ఉండాలి.

***

ప్రపంచంలో దాదాపు 4,500 మతాలు ఉన్నాయి. ఒక్కో మతానికి ఒక్కో దేవుడు ఉన్నాడు. కొన్ని మతాలలో అయితే లెక్కలేనంత మంది దేవుళ్ళు ఉన్నారు. అతి పురాతన మతాల నుంచి అత్యాధునిక మతాల దాకా, అన్నిటిలో కొన్ని అంశాలు ఒకేలా ఉంటాయి. అనేక సందర్భాలలో వేరు వేరు మతాల దేవుళ్ళ మధ్య కూడా చాలా సారూప్యతలు కనిపిస్తాయి.
ఈ మధ్య ఒక మిత్రుడి ఇంటిలో ఒక అద్భుతమైన తైలవర్ణ చిత్రపటం (oil painting) చూసాను. విశ్వరూపంలో ఉన్న విష్ణుమూర్తి painting అది. చిత్రకారుడి పనితనంతో పాటు విష్ణుమూర్తి చేతిలో ఉన్న గద, గొడ్డలి, విల్లు, బాణాలు, ఖడ్గం వగైరాలు నా దృష్టిని ఆకర్షించాయి. ఇవన్నీ మానవులు ఒకానొక కాలంలో వాడిన రకరకాల “ఆయుధాలు” కదా. అంతకు ముందు కాలంలో రాతి ఆయుధాలు వాడారు. ఆ తరవాత గన్నులు, బాంబులు వాడుతున్నారు. మరి దేవుళ్ల బొమ్మలు కేవలం ఆ particular కాలంలో మానవులు వాడిన ఆయుధాలు మాత్రమే ధరించినట్టు కనపడుతున్నాయి ఎందుకు? ఏ ఒక్క దేవుని బొమ్మ అటు రాతి ఆయుధాలు గానీ, ఇటు గన్నులు గానీ పట్టుకుని కనిపించడం లేదు ఎందుకని? కేవలం హిందూ దేవుళ్ళు మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక మతాలలో ఇదే కనిపిస్తోంది. గ్రీకు, రోమను, ఈజిప్షియన్ దేవుళ్ళు కుడా త్రిశూలాలు, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. దీనికి కారణం ఏమయి ఉంటుంది?

vinod1

మామూలుగా చూస్తే ఇది చాలా సిల్లీ ప్రశ్న లాగా కనిపిస్తుంది కానీ ఈ ప్రశ్నకి ఎక్కడా రాజీ పడకుండా సరైన సమాధానం తెలుసుకోవడం కోసం కొంత అధ్యయనం చెయ్యక తప్పలేదు. ఈ ప్రశ్న “మతం – ఆయుధాలు – కళ”లతో సంబంధం కలిగి ఉంది.
“మతం”, “దేవుడు” అనే భావనలు అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. మనం చూస్తున్న దేవుని బొమ్మల యొక్క రూపం కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం కల్పించబడినది. ఆ ఆయుధాలు కూడా అప్పటివే.
మరి మొదటి నుంచీ దేవుళ్ల రూపాలు ఇలా ఉండేవి కావా? ఒకవేళ ఇలా కాకపొతే, అంతకు ముందు కాలంలో దేవుళ్ల రూపాలు ఎలా ఉండేవి? వాళ్ళు ఏ ఆయుధాలు పట్టుకునేవారు? అసలు దేవుళ్ళకి ఈ రూపాలు ఎవరు కల్పించారు? ఏ కాలంలో కల్పించారు? మన అసలు ప్రశ్నతో పాటు ఇలాంటి ప్రశ్నలు అనేకం పుడతాయి. ప్రశ్న ఏదైనా సమాధానం తెలుసుకోవాల్సిందే. ఇందుకోసం మనకు కింద చెప్పిన నాలుగు విషయాలు కొంతయినా తెలిసి ఉండాలి.
1. మానవ సమాజం అభివృద్ధి క్రమం
2. మతం – దాని పుట్టుక, అభివృద్ధి క్రమం
3. ఆయుధాలు – కాలంతో పాటు వాటిలో వస్తున్న మార్పులు
4. కళల  అభివృద్ధి క్రమం

 

మానవ సమాజం అభివృద్ధి క్రమం

మతము, ఆయుధాలు, కళలు – ఈ మూడూ కూడా మానవ సమాజంలోని భాగాలే. వాటి అభివృద్ధీ, వాటిలో వచ్చే మార్పులూ మానవ సమాజంలో వచ్చే మార్పులతో చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. వాటన్నిటి మధ్య connection అర్థం చేసుకోవాలంటే మనకి మానవ సమాజం యొక్క అభివృద్ధి క్రమం తెలిసి ఉండాలి.
ఇవ్వాళ ఉన్న మానవ సమాజం అన్ని రంగాలలోనూ చాలా అభివృద్ధి చెందినది. ఇది ఒక్క రోజులో ఆవిర్భవించింది కాదు. ఒకప్పుడు మనుషులు జంతువుల స్థాయి నుంచి మొదలుపెట్టిన వారే. మనం తయారు చేసుకున్న ప్రతి వస్తువు వెనక, ఏర్పరుచుకున్న ప్రతి వ్యవస్థ వెనుక ఎన్నో వేల సంవత్సరాల మానవానుభవం ఉంది.

మానవానుభావం అంటే ఏమిటి? ఉదాహరణకి ఒక సహస్రాబ్ది (1000 సంవత్సరాల) క్రితం ప్రపంచంలో అత్యధిక భాగంలో రాచరిక వ్యవస్థే నడుస్తోంది. అప్పటి మానవులకి ఇంకా “ప్రజాస్వామ్యం” అంటే ఏమిటో తెలియదు. ఇంకో విధంగా చెప్పాలంటే, “ప్రజాస్వామ్యం” లాంటి వ్యవస్థ సమాజంలో పుట్టి, నిలదొక్కుకోవడానికి కావలసిన అనుభవం ఆయా సమాజాలు అప్పటికి ఇంకా సంపాదించుకోలేదు అన్నమాట. కొన్ని శతాబ్దాల పాటు రాచరిక వ్యవస్థని అనుభవించిన తరవాత మాత్రమే, సమాజం ఆ వ్యవస్థ యొక్క లోపాలని గుర్తించగలిగింది. అంతకంటే ఉత్తమమయిన వ్యవస్థ యొక్క అవసరాన్ని గుర్తించగలిగింది. రాచరిక వ్యవస్థ నడిచిన కాలంలో నేర్చుకున్న అనుభవాలు, గుణపాఠాలు తరవాతి కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్మించుకోవడంలో ఉపయోగపడ్డాయి. ఇది ఒక అభివృద్ధి క్రమం.

vinod2

మనం నేడు చూస్తున్న సమాజంలోని ప్రతి అంశమూ ఇలా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చినదే. జంతువుతో సామానమయిన స్థాయి నుంచి మొదలయిన మానవ ప్రస్థానం నేడు ప్రకృతిని తన వశంలోకి తెచ్చుకునే స్థాయికి చేరింది. ఇది సమాజం యొక్క పరిణామ క్రమం. ఈ క్రమం మొదలయ్యి లక్షన్నర సంవత్సరాలు పైనే అయ్యింది. ఈ మొత్తం అభివృద్ధి జరిగిన క్రమాన్ని/కాలాన్ని మన అధ్యయనం కోసం మూడు యుగాలు గా విభజించవచ్చు.

1. ఆటవిక యుగం – మానవ జాతి ఆవిర్భవించిన కాలం నుంచి మనుషులు కుండలు వంటి మట్టి పాత్రలు తయారు చెయ్యడంలో నైపుణ్యం సంపాదించిన కాలం వరకు ఆటవిక యుగంగా చెప్పవచ్చు. ఈ యుగం సుమారు 1,60,000 సంవత్సరాలు నడిచింది. ఈ యుగంలోనే మానవులు రాళ్ళని పనిముట్లుగా మలచుకునే నైపుణ్యం సంపాదించారు. నిప్పుని కనుగొన్నారు, చేపలు తినడం అలవాటు చేసుకున్నారు, విల్లు, రాతి గొడ్డళ్ళు వంటి ఆదిమ ఆయుధాలు తయారు చేసుకున్నారు. అప్పటికి లోహం (metal) ఒకటి ఉంటుందని మానవులకి తెలియదు.

2. అనాగరిక యుగం – కుండలు తయారు చేసే పరిజ్ఞానం సంపాదించిన కాలం దగ్గర్నుంచి నుంచి భాషలకి లిపి తయారు చేసుకునే కాలం వరకు అనాగరిక యుగం అనవచ్చు. అనాగరిక యుగం సుమారు 35,000 సంవత్సరాలు నడిచింది. అంటే మట్టితో కుండలు చేసే స్థాయి నుంచి మాటలని అక్షరాలుగా రాసే తెలివితేటలు సంపాదించుకోవడానికి మనుషులకి 35,000 సంవత్సరాల పైనే పట్టింది అన్నమాట. అనాగరిక యుగంలోనే మనుషులు పశుపాలన, వ్యవసాయం, ఇటుకలతో ఇల్లు కట్టుకోవడం, రాగి, కాంస్యం, ఇనుములని కరిగించి వస్తువులు తయారుచెయ్యడం నేర్చుకున్నారు. భాషలని అభివృద్ధి చేసుకున్నారు.

3. నాగరిక యుగం – భాషలకి లిపి తయారు చేసుకున్న కాలం నుంచి నేటి వరకు సుమారు 5000 సంవత్సరాల కాలం ఇది. మనకు తెలిసిన రాజులు, రాజ్యాలు, కళలు, అన్ని ఆధునిక పరికరాలు, శాస్త్రాలు, రాతపూర్వక కావ్యాలు, ప్రజాస్వామ్యం ఈ యుగంలోనే మానవులు తయారు చేసుకున్నారు.

గమనిక: ఇవన్నీ పురావస్తు పరిశోధనలని (Archeological studies) ఆధారం చేసుకుని వేసిన లెక్కలు. ఈ యుగాలకీ హిందూ పురాణాలలోని యుగాలకీ (కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం..) ఎటువంటి సంబంధమూ లేదు.
ఈ విభజన కోసం “లూయిస్ హెన్రీ మోర్గాన్” తన జీవిత కాలం వెచ్చించి పరిశోధించి రాసిన “పురాతన సమాజం” పుస్తకం మీద ఆధార పడ్డాను. ఆయన ఆ పుస్తకం రాసే కాలంలో (1870’s) లభ్యంగా ఉన్న ఆధారాల ప్రకారం ఒక విభజన చేసారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన అనేక ఆధారాలను పరిగణలోకి తీసుకుని నేను ఈ విభజనలో కొన్ని మార్పులు చేర్పులు చేసాను. మన అధ్యయనం కోసం ఈ మూడు యుగాలని ఒక్కొక్క దాన్ని మూడు అంతర్దశలుగా విభజించవచ్చు.
ఈ విభజనని సంవత్సరాల వారీగా ఒక పట్టికలో (Table) చేర్చాను. ఈ పట్టికని పై నుంచి కిందకి చదివితే తేలిగ్గా అర్థమవుతుంది. అంటే ఆటవిక యుగం దిగువ దశ నుంచి మొదలుపెట్టి కిందకి చదువుతూ వెళ్ళాలి అన్నమాట. ప్రతి యుగంలోనూ మూడు అంతర్దశలు ఉంటాయి (దిగువ-మధ్య-ఎగువ). పట్టికలో ప్రతి దశలోనూ ఆ దశలో జరిగిన ముఖ్యమయిన విషయాలు, మానవులు సాధించిన ముఖ్యమైన అభివృద్ధి చూడవచ్చు.

ఈ వ్యాసంలోని అనేక విషయాలని అర్థం చేసుకోవడానికి ఈ పట్టిక మీకు ఉపయోగపడుతుంది. ముందు ముందు చదవబోయే వాటిలో ఎక్కడ confusion వచ్చినా ఈ పట్టికని చూడండి.
ఈ పట్టికలో సంవత్సరాల లెక్కలు చూపించడం జరిగింది. దాని అర్థం మొత్తం ప్రపంచంలోని అన్ని సమాజాలలో ఆ సంవత్సరాల లోనే ఆ మార్పులు వచ్చాయని కాదు. ఈ పరిణామం ప్రపంచంలోని అన్ని సమాజాలలో ఒకే సమయంలో జరగలేదు. భౌతిక పరిస్థితులని (Physical Conditions) బట్టి కొన్ని సమాజాలు వేగంగా అభివృద్ధి చెందాయి. కొన్ని వెనకబడ్డాయి. ఈనాటి నాగరిక ప్రపంచంలో కూడా అక్కడక్కడా అనేక ఆటవిక, అనాగరిక జాతులు కనపడతాయి. అంటే ఆ జాతుల అభివృద్ధి క్రమం చాలా నెమ్మదిగా నడుస్తోంది అన్నమాట. మిగతా ప్రపంచం అంతా నాగరిక యుగంలోకి ప్రవేశించింది. కానీ ఆ జాతులు మాత్రం ఆటవిక, అనాగరిక యుగాలలో ఉన్నాయి. అభివృద్ధి చెందే వేగంలో హెచ్చుతగ్గులున్నా, అభివృద్ధి చెందే క్రమం మాత్రం ఇలాగే ఉంటుంది. రాబోయే వ్యాసంలో దీనిని ఇంకొంచం వివరంగా చూస్తాము. పై పట్టికలో చూపించిన సంవత్సరాలు ప్రపంచంలో వివిధ సమాజాలలో వచ్చిన అభివృద్ధి కాలాలను average చేసి, సుమారుగా రాయబడినవి.
సాధారణంగా ఎవరైనా “ప్రాచీన కాలం” అని అంటే మనం మూడు వేలో, నాలుగు వేలో సంవత్సరాల పూర్వం అని అనుకుంటాం. మనం మాట్లాడుకునే “చరిత్ర” కూడా ఈ కాలం నుంచే మొదలవుతుంది. కానీ అంతకు ఒకటిన్నర లక్షల సంవత్సరాల ముందు నుంచే మానవులు ఉన్నారు. జంతువు నుంచి ఆటవికులుగా, ఆటవికుల నుంచి అనాగరికులుగా, అనాగరికుల నుంచి నాగరికులుగా ఎదగడంలో వారు వెచ్చించిన శక్తి, శ్రమ, బుద్ధి అసామాన్యమయినవి. నిరంతరం ప్రకృతితో పోరాడుతూ, ఎదురు దెబ్బలు తింటూ, స్వంత అనుభవంతో చిన్న చిన్న విజయాలు సాధించుకుంటూ ఇంత దూరం వచ్చారు. ప్రకృతిలో ఏ ఇతర ప్రాణీ సాధించలేని అభివృద్ధి మానవులు సాధించారు. “మన పూర్వీకులు” అనగానే కిరీటాలు పెట్టుకున్న రాజులో, వేదాలు చదివే మునులో మనకి గుర్తు వస్తారు. ఇది కొంతవరకే నిజం. మన పూర్వీకులు ఆటవికులుగా దిగంబరంగా అడవులలో తిరిగిన వారే. ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదు. వారు లక్ష సంవత్సరాలు పాటు కష్టపడి సాధించిన అభివృద్ధి శిఖరాగ్రాన (Peak Point మీద) నిలబడి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది మనం మర్చిపోకూడదు.
రాబోయే వ్యాసాలలో మానవ సమాజంలో ఏ కారణాల చేత మార్పులు వస్తాయో, వాటి వల్ల మనుషుల జీవన విధానంలో, మతంలో, ఆచారాలలో మార్పులు ఎలా వస్తాయో చర్చిద్దాం.

(వచ్చే  వారం )
*

మీ మాటలు

  1. చందు - తులసి says:

    వినోద్ గారూ విలువైన చర్చ. అభినందనలు

  2. వెంకట్ కొండపల్లి says:

    చిన్ని ప్రశ్నతో పెద్ద విషయాన్ని విశ్లేసిస్తున్నారు, ప్రతి వారం మీ వ్యాసం కోసం ఎదురు చూస్తాము. Thank you !

  3. శాస్త్రీయ అవగాహన విద్య విధానం మన సమాజంలో లేక పోవడం దురదృష్టకరం. అక్షరాస్యులు ( రాయడానికి చదవడానికి తెలిస్తేనే చదువు అనుకొనే వారు) తామే గొప్ప విద్యా వంతుల మయినట్లు, తమకు తెలిసిందే ప్రామాణికం అనే వారికి కళ్ళు విప్పేలా ఈ వ్యాసాలూ ఉంటాయని ఆశిస్తున్నాము.

  4. దేవుళ్ళకి గన్నులు లేవనా మీ బాధా… రేపణ్ణించే గన్నులున్న దేవుళ్ళని తయ్యారు చేస్తారు కావాలంటే.
    అయినా ప్రతి వినాయక చవితిల్లో తీరొక్క తీరు మాడ్రన్ వినాయకుళ్ళని తయ్యారు చేస్తున్నారుగా. :P

    అయితే……. ఇదివరకే మీరు చెపుతున్న విషయాలన్నీ పుస్తకాలకి పుస్తకాలు రాసి పారేసారు. సరే మీరూ రాస్తానంటున్నారు. బావుంది. అది ఎవరికెందుకు ఉయోగపడుతుందో మీరే చెపితే ఎలా ? :P
    వ్యాసాలని బాగా అర్థం చేసుకోటానికి శ్రమచేయకతప్పదూ అనేదాంట్లో పాఠకులంటే మీకున్న చిన్నచూపు కనపడుతోంది. ఎప్పుడైనా రచయిత తను రాసేది రాయాలి, పాఠకులు ఎలా ఉండాలో, ఎలా చదవాలో చెప్పకూడదు. చదువరులకి ఆసక్తి కరంగా రాయగలగాలి కానీ మీరేమో డిమాండింగుగా ఆసక్తి తెచ్చుకొని చదువమంటున్నారు.

    ” అప్పటి మానవులకి ఇంకా “ప్రజాస్వామ్యం” అంటే ఏమిటో తెలియదు. ఇంకో విధంగా చెప్పాలంటే, “ప్రజాస్వామ్యం” లాంటి వ్యవస్థ సమాజంలో పుట్టి, నిలదొక్కుకోవడానికి కావలసిన అనుభవం ఆయా సమాజాలు అప్పటికి ఇంకా సంపాదించుకోలేదు అన్నమాట. ”
    ఎవల్యూషన్ అనేది సంపాదించుకునేది కాదు… అదో ప్రాసెస్. అదేదో ముందే ఉండీ, తెలిసీ దాన్ని సంపాదించుకోలేకపోయారూ అన్నట్టు రాసారే ? :)
    మాకేప్పుడూ పూర్వికులంటే రాజులూ, కిరీటాలూ గుర్తుకు రాలే… ముందు చింపాంజీలు గుర్తొచ్చి..అటుమీద నిలబడ్డ చింపాజీలూ..దెన్ మంట చుట్టూ నార గోచీలు కట్టుకున్నమనుషులే గుర్తొస్తుంటారు.. స్పేస్ ఒడిస్సీ మేమూ చూసాము లే !! :P

    • చక్రి గారు.. దేవుళ్ళకి గన్లు లేవని నాకు బాధ లేదు.. ఎందుకు లేవా అని కుతూహలం మాత్రమే. :)

      ఈ సబ్జెక్టు మీద మీకు తెలిసిన పుస్తకాలు చెప్పండి. నాకు చదవాలని ఉంది. నేను ఎంత వెతికినా నాకు పెద్దగా దొరకడం లేదు. :)

      “శ్రమ చెయ్యక తప్పదు” అనడంలో ఆ సబ్జెక్టులకి ఉన్న “weight” గురించి చెప్పాలని నా ప్రయత్నం. అది తప్పుగా convey అయినట్టు గా ఉంది. నేను వేరే పదాలు వాడి ఉండాల్సింది.

      ప్రజాస్వామ్యం గురించి రాసిన విషయం – “ఆ కాలం లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు లేదు?” అనే ప్రశ్న వస్తే… ఆ ప్రశ్న అడిగేవాళ్లకి, సమాధానం చెప్పేవాళ్లకి ఇద్దరికీ ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలిసి ఉంటుంది. దానికి సమాధానం ఇలా ఉండొచ్చు.. ““ప్రజాస్వామ్యం” లాంటి వ్యవస్థ సమాజంలో పుట్టి, నిలదొక్కుకోవడానికి కావలసిన అనుభవం ఆయా సమాజాలు అప్పటికి ఇంకా సంపాదించుకోలేదు అన్నమాట”. ఇక్కడ దృష్టి కోణం “ప్రస్తుతం నుంచి గతం లోకి”. ఇది establish చెయ్యలేకపోయాను అనుకుంటున్నా.

      స్పేస్ ఒడిస్సీ ఏదో అన్నారు.. అది నేను చూడలేదు. అది కూడా ఈ సబ్జెక్టు కి సంబంధించినది అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తాను. చెప్పినందుకు ధన్యవాదాలు :)

  5. ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం అంటే అందరికి తెలుసనా ? ఆపేరు రేలుసు ఏమో గాని దాని అర్ధం చాలా మందికి తెలియనే తెలియదు.

  6. Mayukh Adithya says:

    చాలా బాగుంది, వచ్చే వారం కోసం ఎదురుచూస్తున్నాం…….

  7. Bharadwaj Godavarthi says:

    చాల చక్కని విశ్లేషన వినోద్ గారు. వచ్చే వారం కోసం ఎదురు చూస్తున్న.

    విమర్శ ఎప్పుడు భావం మీద వుండాలి కాని ఏదో చెప్పడానికి చేసే ప్రయత్నం మీద కాకూడదు అని నా భావన.

  8. Dr. Rajendra Prasad Chimata. says:

    వినోద్ గారూ
    కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ రాసిన “మనుషులు చేసిన దేవుళ్ళు”, “జీవశాస్త్ర విజ్ఞానం సమాజం” పుస్తకాల లో చాలా విషయాలు మీకు ఉపయోగ పడతాయి. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించారు.

    Sent from http://bit.ly/f02wSy

Leave a Reply to THIRUPALU Cancel reply

*