చీకటి నీడలు

 

-మధు పెమ్మరాజు

~

Madhuగడియారం చప్పుడు తప్ప వేరే అలికిడి లేదు, ఫ్లోర్లో అక్కడక్కడా వెలుతురు ఉండడంతో అంతా అస్పష్టంగా ఉంది. నా క్యూబ్ పైన బల్బు మొహమాటంగా వెలుగుతోంది. కదలికని బట్టి వెలగడాన్ని కంపెనీ ఆటోమేషన్ ఇన్నోవేషన్ అంటుంది, ఊపిరి తీసుకోవడం కదలిక కాబట్టి బల్బు వెలుగుతోందని నేను అనుకుంటాను. గత కొన్ని నెలలుగా అలసిన మొహాలు ఒక్కొక్కటీ మాయమయి, బెదురుగా చూసే లేత మొహాలు వస్తున్నాయి – కంపెనీ అవుట్సోర్చింగ్ అంటోంది. ఈ వెలుగు నీడల పరదాలో నేను అనామకుడిగా మారిపోయాను. అనేక భయాలకి ఇంకో కొత్త భయం జత చేరింది – టిక్..టిక్…మంటూ ముల్లు వేగం పెరిగే కొద్దీ బల్బు ఆరుతుందని భయమేస్తుంది, అప్పుడు ఓ రెండడుగులు వేసి కూర్చుంటాను.

రోజూ తలెత్తకుండా పని చేసేవాడిని ఏదో వెలితిగా అనిపించి కీబోర్డ్ పక్కన పెట్టాను, కాసేపటకి కంప్యూటర్ స్క్రీన్ సేవర్ కూడా కదలడం మానేసింది. పక్క క్యూబ్లపై ఆండ్రూ, జాక్, షెల్లీ, ఆలన్ పేర్లు ఇంకా అలానే ఉన్నాయి, వారి నేమ్ ప్లేట్లని ఆప్యాయంగా తడిమాను. నా పలకరింపు వారి దాకా చేరుతుందని భ్రమ. ముప్పై ఏళ్ళ స్నేహాలు వెంట, వెంటనే విడిపోయాకా మా ఫ్లోర్ పక్షులు లేని చెట్టుగా మారింది.

ఒకప్పుడు నా ఈ స్థావరం విశాలంగా, గుండెల నిండా ఊపిరి పీల్చుకునేలా ఉండేది. ఏళ్ళు గడిచిన కొద్దీ ఇరుకుతనం పెరిగింది, ఉద్యోగం నా అస్తిత్వం నుండి జీతం కోసం పని చేస్తున్నాను అనేదాకా చేరుకుంది. క్యూబ్ గోడలపై వెలిసిన నీలం రంగు గుడ్డ, టేబుల్ పై బరువైన నల్లటి ఫోను, పక్కన జెన్నీ పెళ్లినాటి ఫోటో.. జెన్నీ అన్నీ చూస్తున్నట్టుగా నవ్వుతోంది….నా పిచ్చి గానీ అంత దూరం నుంచి ఎలా చూస్తుంది? పక్కన బేస్బాల్ బాట్ పట్టుకుని రిచ్చీ, ఎంత ముద్దుగా ఉన్నాడో – చదువులు ముగించుకుని కాన్సస్ వెళ్ళిపోయాడు.

“బాబూ! నీ పాత ఫోటోలు చూసి, చూసి విసుగొస్తోంది. కాస్త మార్చు” అంటూ షెల్లీ ఆట పట్టించేది. షెల్లీకి చెప్పినా అర్ధం కాదు…జెన్నీ నవ్వు ఎన్ని సార్లు చూసినా మొదటిసారి చూసినట్టే ఉంటుంది. గోడ చుట్టూ ఫ్రేముల్లో కంపెనీ ఇచ్చిన సర్టిఫికేట్లు – ఓ రోజు జాక్ సర్టిఫికేట్లు లాక్కునంత పని చేసాడు, సొంత ఖర్చుతో అందమైన ఫ్రేములు కట్టించి – “విలువైన ప్రశంశా పత్రాలని గాలికి, ధూళికి వదిలేయకూడదు, అందంగా బంధించాలి” అన్నాడు.

chinnakatha
షెల్లీ ఒక్క సంపాదనతో పెద్ద సంసారాన్ని నెట్టుకొచ్చేది, వెళ్ళిపోతున్న రోజు “జో..పని ఒక గౌరవంగా, పరువుగా భావించాను, కంపనీ మరో కుటుంబం అనుకుని పనిచేసాను. ఈ రోజు వాళ్ళు నన్ను నగ్నంగా నిలబెట్టారు..” అని వెక్కి, వెక్కి ఏడ్చింది. ఓ రెండు పేపర్ టిష్యూలు ఇవ్వడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను, వాచీ కేసి చూడబోతూ ఆగిపోయాను, గతం తలుచుకుంటే ముల్లు వేగం పెరుగుతుందా?

ప్రతి ప్రోడక్ట్ రిలీజ్ ఒక పండుగలా ఉండేది. అర్ధరాత్రి, అపరాత్రి అని చూసుకోకుండా నెలల తరబడి ఆఫీసులో మకాం వేసే వాళ్ళం- పిజ్జాలు, కాఫీలతో పాటు లెక్కలేనన్ని జోకులు భోంచేసేవాళ్ళం. రిలీజ్ ముగిసి, మా కాడ్ డ్రాయింగ్లకి రెక్కలొచ్చి ఎగురుతుంటే పిల్లాడు పుట్టినంత ఆనందంగా ఉండేది. ఆండ్రూ పదేళ్ళ పిల్లవాడిలా వచ్చి “జో.. చూడు.. టీవీలో చూడు..ఆ ఎగిరే విమానంపై మన సంతకం ఉంది” అని గోల చేసేవాడు. వెళ్ళే రోజు గోడపై ఇష్టంగా అతికించిన విమానాల పోస్టర్లని కోపంగా లాగి ముక్కలు, ముక్కలుగా చింపి చెత్త డబ్బాలో పడేసాడు. ఆ క్షణం మాట్లాడాలంటే భయం వేసింది.

ఆలన్ స్వతహాగా కవి, ప్రపంచ కవిత్వం చదివినవాడు. నిరాశ, విషాదం నిండిన కవిత్వమంటే ఆసక్తి చూపేవాడు. “ఆల్! నిత్యం మనని వేధించే సమస్యలు సరిపోవా? అవేవో అరువు తెచ్చుకుని మరీ ఏడవాలా?” అని విరగబడి నవ్వితే, జవాబుగా చిరునవ్వు నవ్వేవాడు. వెళ్ళే రోజు హౌస్మన్ కవిత చదివి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు.

చింత రువ్వ చెయ్యి చుర్రుమనిపించిందని
చేతిని పదిసార్లు దులుపుకున్నాను
కాని ఒకటి మాత్రం నిజం, అది తీవ్రంగా బాధించినా
విషాదం ముంగిట నిలిచిన క్షణం
రంగు, రంగుల లోకం చూపక
చేదు సత్యాల్ని చూపి మేలే చేస్తుంది.
నువ్వు నా స్థితిలో ఉన్నప్పుడు
నీ మనసుకి సాంత్వననిస్తుంది.
ఆ ఉరుములు మెరుపుల కాళరాత్రి
నీకొక స్నేహహస్తాన్ని అందిస్తుంది

ఎవరి పాత్రలు వారు సక్రమంగా పోషించి నిష్క్రమించారు, నేను అవసరాల బరువు మోస్తూ ఇంకా తెర ఎదుట ఉన్నాను.

ఆ మధ్యన ఆండ్రూ ఆరోగ్యం బాగోలేదని షెల్లీ చెబితే క్షేమ సమాచారం తెలుసుకుందామని ఫోన్ చేసాను. ఆండ్రూ ఇంకా పూర్తిగా కోలుకోలేదు, మాటలు నీరసంగా ఉన్నాయి. కాస్త తేలిక పరుద్దామని ““ఆండీ! మీ అందరి పుణ్యమా అని నా పూర్తి పేరు మర్చిపోయాను. ఈ మధ్యన కంపనీ పంపే ప్రతీ ఈమెయిలులో నా పూర్తి పేరు ప్రస్తావిస్తున్నారు. నీకు కారణం తెలుసా?” అని నవ్వుతూ అడిగాను. ఆండ్రూ ఏదో చెప్పబోతుంటే నా పక్కగా ఏదో కదలికలా అనిపించింది. చీకటి నీడల్లో పాత పరిచయస్తుడు, సెక్యూరిటీ ఆఫీసులో పని చేసే కీత్ నిలబడ్డాడు. అతని వాలకం చూస్తుంటే కొన్ని క్షణాల నుండి వేచి ఉన్నట్టు అనిపించింది.

ఫోన్ కింద పెట్టి “కీత్! ఏమిటి విషయం?” అని అడిగాను.

“ప్లీజ్ నాతో రండి” అన్నాడు.

విషయం అర్ధమయి జెన్నీ, రిచ్చీల ఫోటోలు బాగ్లో సర్దుకుని నిలబడ్డాను.

“దయ చేసి అవి టేబుల్ పై పెట్టేయండి” అని కాస్త కటవుగా అన్నాడు. మారు మాట్లాడకుండా ఫోటోలు టేబుల్ పై పెట్టి, అతని వెనకాల నడిచాను. కొన్ని అడుగులు దాటగానే క్యూబ్ పైనున్న బల్బు ఆరిపోయింది.

(To Jonathan)

మీ మాటలు

  1. S. Narayanaswamy says:

    Brilliant. We need more like this that deal with work place events.

    • నారాయణస్వామి గారు, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

  2. కథ బాగుందండి మంచి నెరేషన్

  3. Srinivas Mullapudi says:

    చాల బాగా వ్రాసారు. థాంక్ యు మధు గారు.

  4. వంగూరి చిట్టెన్ రాజు says:

    చాలా బావుంది. అమెరికా లో దైనందిన జీవితాల గురించి రావలిసిన ఇలాటి కథలు ఎన్నెన్నో ఉన్నాయి. మధు పట్టుకున్న బాట మంచి బాట. అమలాపురం గురించీ, అమ్మమ్మా , తాతయ్య ల గురించి కథలు వస్తూనే ఉంటాయి. మన గురించి మనం ఎప్పుడు రాసుకుంటాం?

  5. Sridevi Josyula says:

    కధ చిన్నదైనా
    కధా, దాని గమనం రెండూ
    బాగున్నాయి . మధు గారికి అభినందనలు

  6. చాలా బావుంది మధుగారూ… అభినందనలు

  7. satyanarayanarao pemmaraju says:

    చాలా బాగుంది హృదయానికి హత్తుకునేలా

  8. రాజశేఖర్ రెడ్డి గూడూర్ says:

    మధు, బాగుంది. ఒక్కోసారి ఈ ప్రహసనం రోజంతా సాగుతుంది. అప్పటి దాగ ఎంతో ఆప్యాయత చూపించిన పై అధికారులు .. ఒక్కసారి అపరిచితుల్లాగా .. ఒక యమ ధర్మరాజు లాగ కనిపిస్తారు. రోజు చిరునవ్వుతో హలో అనే సెక్యూరిటీ వాళ్ళు యమభటులుగా మారి చేతిలో పాశంతో తిరుగుతున్నారనిపించేది.

  9. mercy margaret says:

    నాకైతే నేను పని చేసిన సిటీ గ్రూప్ గోర్తోచ్చింది .. నెల కింత మంది అని వారు తొలగించేప్పుడు ఆ బాధ ఎలా వుంటుందో మరో సారి గుర్తు చేసారు .. బాగుంది కథ మధు గారు.

  10. మధుగారూ

    అందమైన కవితని చక్కని కథనంలోకి బాగా అతికించారు. కథ ఇంతవేగం అయిపోయిందే అనిపించింది.
    హృదయపూర్వక అభినందనలు

    • మూర్తి గారు, మీ ఆత్మీయ సహకారానికి ధన్యవాదాలు!

  11. చిక్కని కధ. ఈ నాటి మన జీవితాలను తెరచి చుపించిన కధ.

  12. Prof P C Narasimha Reddy says:

    Mr Pemmaraju Madhu is a promising writer with crisp poetic diction. Tight rope walking of career life in the age of modern automation narrated with engaging style
    The very title ‘shadows of darkness / somber shades’ is absorbing. My kudos to Mr Madhu !
    – Prof P C Narasimha Reddy

  13. p.mohan ram prasad says:

    ముప్పై ఏళ్ళ స్నేహాలు వెంట, వెంటనే విడిపోయాకా మా ఫ్లోర్ పక్షులు లేని చెట్టుగా మారింది……..
    గతం తలుచుకుంటే ముల్లు వేగం పెరుగుతుందా?
    విషాదం ముంగిట నిలిచిన క్షణం….ఇవన్నీకధలో బావున్నాయి

  14. Y RAJYALAKSHMI says:

    చాల బాగుంది.

  15. kb Lakshmi says:

    మధు కథలు ఈ మధ్యనే చదువుతూ వస్తున్నాను.చిన్న కథల పల్స్ కరక్ట్ గా పట్టుకున్నాడు.ఇవాళ తెలుగు కథారచయితల్లో మధు కలం ఒక కొత్త ఒరవడి,వురవడి.ప్రతి కథలో కనీసం 3,4 వాక్యాలైనా ఆహా ! అనిపిస్తాయి.
    ఈ కథలోని విషాద గాఢత పఠిత గుండెని తడి చేస్తుంది.మంచి కథ.

    • లక్ష్మి గారు, , మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

  16. Bala Yugandar says:

    మధు కథలు, అప్పుడప్పుడు కైతలు చదవమని బెదిరించినపుడు నేను యధావిధిగా బద్దకిస్తుంటాను…..I am a big lazario in that regard ! కాని అస్సలు భయమేంటంటే ఆ కథలో మునిగిపోయి, అనుభవించి, ఆశ్వాశించి కొన్ని రోజులన్నా భాధ పడవలసి వస్తుందని! మధు ఎక్కడ అతిశయం లేకుండా ఎంతో గంభీరమైన విషయాన్నిఏమాత్రం పలుచన చేయకుండా ఒక శ్యాం బెనెగల్ మూవీ స్టైల్లో చెప్పినవ్ ! ఒక ఆర్తి ఉన్న మనిషి , అనుభవాల సారంతో సహజమైన శిల్పం తో కలానికి పని చెపితే ఏమవుతుంది…..హృద్యమైన అనుభవాలు అనుభవానికోస్తాయ్! ఇంతకంటే ఎక్కువ చెపితే మన భాషలో నిగమశర్మ అక్క కథ పునరావృతం;-)

  17. Mukunda Ramarao says:

    సున్నితంగా చక్కగా కవితలా ఉంది ఈ అనుభవం. బహుశా మరెన్నో ఇటువంటి కథలకు మార్గదర్శి లా అనిపించింది. మధుగారికి అభినందనలు.

    – ముకుంద రామారావు

  18. Sridhar Kalepu says:

    చాల bagundi

  19. Vijaya Karra says:

    ఓక్కో చోట సెక్యూరిటీ పర్సన్ , మరో చోట ఎచ్ ఆర్ పర్సనో – అభావంగా నిల్చుని, నిల్చున్నపలంగా పంపించి వేస్తారని విన్నాను. కథా రూపంలో చెప్పడం బావుంది.

Leave a Reply to Mukunda Ramarao Cancel reply

*