కరుణా టీచర్ చెప్పిన ఉపాయం

 

 

సాయంకాలం క్లాసులకి పెద్ద పిల్లలు క్రమంగా మళ్లీ రావడంమొదలు పెట్టేరు. నాకు సంతోషంగా అనిపించింది. ఇంకా కొందరు రావలసి ఉంది. నాకు తెలుసు. రోజూ అటెండెన్స్ తీసుకుంటూ వాళ్లరాక కోసం ఎదురుచూస్తున్నాను.

ఒక వారం తరువాత క్లాసు అయి ఇంటికి బయలు దేరుతుంటే ఒకతను, ’మేష్టరమ్మగారూ , మీతో మాట్లాడాలి’ అన్నాడు. మిగిలిన పిల్లలు ఆసక్తిగా చూస్తుంటే , వాళ్లని పంపించేసి, చెప్పమన్నాను. ఇతన్ని ముందెప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు.

‘ మేష్టరమ్మగారూ, నేను ఇక్కడే గూడెంలోనే ఉండేది. లారీ మీద పని,దేశం మొత్తం తిరుగుతూంటాను. నెలకి ఒకటీ రెండు సార్లు ఇంటికి వస్తావుంటాను. మొన్న మీకు దెబ్బలు తగిలేయంటగా, తెలిసింది. ఎవరో పెద్ద క్లాసు సదూతున్న పిలగాళ్లు ఈ పని సేసేరని సెప్పుకుంటున్నారు. మా ఇంట్లో కూడా ఎన్మిది సదూతున్న పిల్లోడున్నాడు. ఈ పని సేసింది వోడు కానీ అయితే సెప్పండి. మా వోడు మాట వినడం లేదని, అల్లరి ఎక్కువైందని మా ఇంటామె సెబుతోందీ మద్దెన.’

‘ మనం ఇంక ఆ సంగతి మర్చిపోదామండి,’అన్నాను ముందుకు కదులుతూ.

‘ నాకు ఒక్క అవకాశమివ్వండి. మీకు మళ్లీ ఇట్టాటి ఇబ్బంది రాకుండా నేను సూసుకుంటాను.’ అతను రెట్టించాడు.

అతని మాటలు వింటున్నప్పుడు ఆ మాట తీరు ఎవరినో స్ఫురింపచేసింది.

‘ నాకు ఇబ్బంది ఏమీ లేదులెండి. మళ్లీ ఇలాటి విషయం జరగదని నా నమ్మకం’ అని నడక మొదలు పెట్టేను. అతను కొంచెం దూరం వెనుకే రావడం తెలుస్తోంది.

‘ సరే మేష్టరమ్మగారూ, మావోడు అనీలు, మీకు తెలిసే ఉంటుంది, ఎనిమిది సదువుతున్నాడు. ఆణ్ని మీ దగ్గర కూర్సోబెట్టుకుని రోజూ సదివించండి…….’ అతను వెనక్కి మళ్లాడు.

అవును. నా సంశయం నిజమే.! ఆ పిల్లవాడి తండ్రే ఇతను.ఆ విషయాన్ని ఎంత ప్రక్కకి తోసేస్తున్నా మళ్లీ మళ్లీ గూడెంవాళ్లు తిరగ తోడుతూనే ఉన్నారు.

ఆ రాత్రి భోజనం చేసి, స్కూలు పని ఉందని చేసుకుంటూ కూర్చున్నాను. పని పూర్తై నిద్ర పోబోతే నిద్ర రాదు. ఏదో దిగులుగా అనిపించింది. అమ్మ వచ్చి వెళ్లటం బావుంది. కానీ ఆ పదిరోజులూ అమ్మ ఇంట్లో తిరిగిన అలికిడి జ్ఞాపకం వస్తే……మనసు బలహీనమవుతోంది. కాని వెళ్లేప్పుడు నామీద కోపంతో వెళ్లింది. అమ్మకి గూడెం అంటే కూడా కోపంగా ఉందని నాకు అర్థమైంది.

అసలు అమ్మ కాదూ నాకు రోల్ మోడల్! ఆవిడ తన ఉద్యోగంతో పాటు ఎన్నెన్నో సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకోవటం తను చూస్తూనే ఉంది చిన్నప్పటినుండి. అమ్మకి గూడేన్ని పూర్తిగా పరిచయం చెయ్యనేలేదు. ప్చ్….అమ్మకి వివరంగా ఇప్పుడు పరిచయం చేస్తాను…అవును, నిద్ర ఎలాగూ రావటం లేదు. మంచంమీద నుండి లేచి ల్యాప్ టాప్  తెచ్చుకుని అమ్మకి ఉత్తరం టైపు చెయ్యటం మొదలుపెట్టేను………………

************

‘ అమ్మా, నా మీద అలకతో ఉన్నావు కదూ. నాకథ పూర్తిగా విను , అప్పుడు నువ్వు నన్నూ, నా గూడేన్ని, నాపిల్లలని చూసేందుకు పరుగెత్తుకువస్తావు………………….

ఇక్కడి గవర్నమెంటు బడికి ఉద్యోగ రీత్యా వచ్చినప్పుడు పిల్లలని చూసి ఆశ్చర్యపోయాను . సమాజంలో అడుగువర్గాలనుండి వచ్చిన పిల్లలే ఇక్కడంతా. చదువు అవసరం వీళ్లకి ఎక్కువగా ఉంది.

కాని చదువు పట్ల వాళ్ల అనాసక్తి…..అనాసక్తి కూడా కాదేమో, ఉదాశీనత! ఎందుకో నాకు అర్ధం కాలేదు.

ఇన్నాళ్ళుగా కార్పొరేట్ స్కూలులో పాఠాలు చెప్పిన అనుభవం! అక్కడి డిసిప్లిన్ మాత్రమే చూసేను. చదువుకున్న తల్లిదండ్రులు తీసుకునే శ్రధ్ధ స్పష్టంగా చూసేను.

ఇక్కడ కనీసం పదిశాతం మంది పిల్లలు కూడా చదువు పట్ల శ్రద్ధ చూపకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. పుస్తకాల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలన్న ఆలోచన లేకపోవటం చూస్తే, చదువుని తేలిగ్గా తీసుకుంటున్నారనిపిస్తుంది.క్లాసులో చెప్పినప్పుడు శ్రధ్దగా వినేవాళ్లు తక్కువే . ఒకటికి నాలుగుసార్లు చెప్పి, ఇంట్లో చదవమని కొద్దిపాటి హోంవర్క్ ఇచ్చినా ఏనాడూ పూర్తిగా చేసుకొచ్చిన వాళ్లు లేనే లేరు .

కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాల నిరంకుశత్వం నుండి బయటపడి సంతోషంగా వచ్చి గవర్నమెంటు బడిలో చేరేను కాని  ఇక్కడ పిల్లల వైఖరికి అసంతృప్తి మొదలైంది. నా  బాధ్యత సరిగా నెరవేర్చటంలేదేమో అని నా మీద నాకే అపనమ్మకం మొదలైంది.

వీళ్లని ఎలా మలుచుకోవాలి, అదీ ఒక్కరో , ఇద్దరో కాదు. అందరూ కాకపోయినా చాలా మంది పిల్లలు చదువులో బాగా వెనకబడే ఉన్నారు.  పిల్లలు మాత్రం ఎంతో చురుగ్గా ఉన్నారు. ఏ కార్పొరేట్ స్కూల్ పిల్లలకీ తీసిపోరు.

ఎప్పటిలాగే స్కూల్లో పాఠంచెప్పటం అయిపోయేక , ఇంటికి వెళ్లి చదవమని చెప్పి, కొంత హోమ్ వర్క్ ఇచ్చేను .

నీరజ లేచి చెప్పింది, ‘టీచర్ , ఇంటికెళ్లేక చదవటానికి మామూలుగానే చాలా తక్కువ సమయం ఉంటుంది, కానీ ఇప్పుడు మా అమ్మకి ఆరోగ్యం బావులేదు , ఇంట్లో పని మొత్తం నా బాధ్యతే. …………….అదికాకుండా………..’ఒక్కక్షణం ఆగింది. అంతలోనే మెల్లిగా నావైపు నడిచి వచ్చి రహస్యంగా చెప్పింది, ‘టీచర్, మా అమ్మ పని చేసే ఇళ్లకి వెళ్లి పని చేసిరావాలి. అమ్మ లేవటం లేదు, ఒక్కరోజు, రెండు రోజులకంటే ఎక్కువ మానేస్తే జీతం కోత పెడతారు……’

తలవాల్చుకుని చెబుతున్న నీరజని వింటుంటే ఆశ్చర్యం….. మిగతా పిల్లలు వింటే ఏడిపిస్తారేమో అన్న దిగులు ఆ గొంతులో. అయినా ఎవరికి తెలియనిదనీ, వెంటనే భవాని అంటోంది, ‘ నీరజ స్కూలు నుండి వెళ్లేక ,పనికెళ్లాలి టీచర్, ఆమెకి టైమే ఉండదు’ భవాని మాటలకి క్లాసు మొత్తం నీరజ వైపు తిరిగేరు.

నీరజని వెళ్లి కూర్చోమని చెప్పి ఆ విషయాన్ని అంతటితో ముగించాను. ఇలాటి ఒక విషయం ఉంటుందని ఎప్పుడైనా తెలుసా నాకు?ఈ పిల్లలని ఇంకొంచెం శ్రధ్ధగా పట్టించుకోవలసిన అవసరం ఉందని మాత్రం అర్థమైంది.

స్కూలు వదిలేక పిల్లలంతా ఎవరిదారిన వాళ్లు ఇళ్ల దారి పట్టేరు . భవాని నా వైపుగా నడుస్తూ మాటలు కలిపింది.

‘ టీచర్, నీరజకి ఇంట్లో బోలెడు పని ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ల అమ్మ కూడా లేవట్లేదు, ఇప్పుడు ఆ  పనులూ నీరజవే. వాళ్ల నాన్న ఇంటిని అస్సలు పట్టించుకోడు.  ఇంట్లోకి ఒక్క పైసా ఇవ్వడంట . సంపాదించటం వరకూ సంపాదిస్తాడు,కానీ డబ్బంతా తాగుడికే ఖర్చు పెడతాడంట. ‘

పన్నెండేళ్ల భవాని ఆరిందాలా చెబుతోంది. ఇంకా ఏమి చెబుతుందో కానీ, ‘ఆలస్యం అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్లు’ అంటూ ఇంటి దారి పట్టేను.

ఆ తర్వాత నాలుగైదు రోజులు నీరజ స్కూలుకి రాలేదు. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో , ఒక్కసారి వెళ్లి చూసి వస్తే…….ఏమో , ఏమనుకుంటారో………..  వాళ్ళ విషయాల్లో నేను ఎక్కువగా తలదూరుస్తున్నానని అనుకుంటే…………ఎవరిని అడగాలి, భవాని ని అడిగితే చెబుతుంది , కానీ వేరొకరి విషయాలు ఆమె దగ్గర ప్రస్తావించటం సరి అయిన పని కాదు.

స్టాఫ్ రూమ్ లో మిగిలిన టీచర్లతో అదేమాట చెబితే,

‘ క్రొత్తగా చేరేవు కదూ, నువ్వు కొన్నాళ్లపాటు పిల్లలు, చదువులు అంటు దిగులు పడటం సహజమేలే. మేమూ నీలాగే ఉండేవాళ్లం. రానురాను అదే అలవాటైపోతుందిలే. వాళ్లంతే. వాళ్లకి చదువులక్కర్లేదు. స్కూలుకి రావడం, వెళ్లడం ….అంతవరకే. అదీ వచ్చినన్నాళ్లే ’ శ్యామల మాటలు బాధనిపించాయి.

కరుణా టీచర్ మాత్రం కొంచెం సానుభూతితో చెప్పింది.

‘ దీపికా, వాళ్ల గురించి నువ్వు ఆలోచిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. వాళ్లందరూ రోజువారీ కూలి పనులకి వెళ్లే వాళ్ల పిల్లలే చాలావరకూ. తెల్లవారి లేస్తే పనికోసం పరుగెత్తాలి. పని దొరికితే సరే. ఇల్లు చేరేసరికి చీకటి పడిపోతుంది. ఆ పూటకి కావలసిన సరుకులు తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం …అంతే ఆ రోజు గడిచిపోయినట్లే. ఇక పిల్లల చదువులు పట్టించుకునే తీరికెక్కడిది? పిల్లలు ఏం చదువుతున్నారో అర్థం చేసుకునే చదువులు వాళ్లకి లేనేలేవు’

‘ మరి వీళ్లు చదువుకోకపోతే వీళ్ల భవిష్యత్తు ఏంకావాలి కరుణగారూ?’ నా ప్రశ్నకి ఆవిడ నవ్వింది. కరుణ టీచర్ రిటైర్మెంట్ కి దగ్గరలో ఉంది. ఎంతో ఓర్పుగా నా ప్రశ్నకి జవాబు చెప్పింది.

‘ ఆసక్తి ఉన్నవాళ్లని సాయంత్రం మీ ఇంటికి రమ్మని నువ్వు కొంత ప్రోత్సాహం ఇవ్వచ్చు. అదైనా ఎంత మంది వస్తారో చెప్పడం కష్టమే.’

ఆవిడ చెప్పిన ఆలోచన నచ్చింది నాకు.

‘అర్థం కాని పాఠాలు చెప్పించుకుందుకు సాయంత్రం ఇంటికి రండమ్మా ‘ అంటే, సంబరపడుతూ అయిదారు మంది పిల్లలు రావడం మొదలు పెట్టేరు. అది ఒక్క నాల్గు రోజులే. ఆ తర్వాత రావడం మానేసేరు. ఏమైందంటే….

‘ ఇంటికెళ్లేసరికి ఆలస్యం అయిపోతోంది టీచర్. మా అమ్మ పనిలోంచి వచ్చేసరికి ఇంటి పనంతా చెయ్యాలి. వంట కూడా చెయ్యాలి. నిన్న, మొన్న కూడా పనులు అవక వంట ఆలస్యం అయింది. తమ్ముడు, చెల్లెలు ఏడుపు. మా నాన్న నన్ను పది దాకా చదివిస్తా అనేవాడు . కాని ఇప్పుడు చదువు వద్దు, స్కూలు మానేసి ఇంటిపట్టున ఉండు’ అంటున్నాడు టీచర్’ నందిని బావురుమంది.

సుగుణ చెబుతోంది,’ మా అమ్మకి గుండె జబ్బు టీచర్. నాలుగు రోజులు పనిలోకి వెళ్తే నాలుగు రోజులు ఇంట్లోనే ఉండిపోతుంది. నేను బాగా చదువుకుని , మంచి ఉద్యోగం చెయ్యాలని చెబుతుంది. నేను చదువుకోవాలని అమ్మకి ఆశ’ కళ్లనీళ్లు తిరుగుతుంటే ముఖం తిప్పుకుంది.

 

మీ మాటలు

 1. ఎన్ని చూసానో సర్వీస్ లో ఇలాటివి . పిల్లలు మారుతుంటారు . కధలు అవే .
  అయినా చదువుకొనడం ఉద్యోగం కోసమే అనే ప్రపంచం లో చదువు
  మెంటల్ మెచ్యురిటీ కోసం అని వాళ్లకు ఎలా చెప్పగలం . బాగా వ్రాసారు

 2. కథ చెప్పిన Teri బాగుంది Kani అసంపూర్తిగా ఉంది samasyalu అందరికి తెలిసినవే సొల్యూషన్ chipset bagundedi

 3. మన ఇంటిలో పని మనిషి రాకపోతే తిట్టుకుంటాము కాని వాళ్లకి కుడా ఇలాంటి బాధలు ఉంటాయని వెంటనే గుర్తు రాదు. వాల్లూ మన లాంటి మనుషులే అని వాళ్ళ కి, పిల్లలు మరియు కోరికలు ఉంటాయని గుర్తు రాదు. మా అత్తగారు మా మెయిడ్ కూతురు పనికి వస్తే దాని పట్టుకుని దులిపెస్తారు..నీకు ఎందుకె ఆ చదువులు మీ అమ్మకి సహాయం చెయ్యక , ఉద్యోగం చేద్దామనీ చదువుతున్నావా అంటూ. పైన శేషు కొండూరి గారు సమస్యకి పరిష్కారం రాయాలి అన్నారు కానీ దానికి పూర్తిగా వ్యవస్థ మారాలి. అంటే మా అత్తగారు లాంటి వారే మరి. ఇలాంటి కథలు మన లో మార్పుని తేవడమే దానికి పరిష్కారం అనిపిస్తోంది….ఒక్క పూట పనికి రమ్మని చెప్పడం చేస్తే మరి వాళ్ళ జీవితాలు బాగు పడతాయేమో??

 4. చందు - తులసి says:

  మన దేశంలో పెద్దల సమస్యలకే దిక్కులేదు..
  ఇక పిల్లల గురించి, వాళ్ల విద్య, ఆరోగ్యం గురించి పట్టించుకున్న నాథుడు లేడు.
  ప్రభుత్వ విద్య నానాటికి దిగజారుతోంది. పిల్లల పట్ల ప్రేమ, వృత్తి పట్ల నిబద్ధత ఉన్న ఇలాంటి టీచర్ల వల్లనే ఎంతో కొంత మంచి జరిగేది.

 5. వ్యవస్థ మారడం కాదు ఆలోచన తీరు మారాలి. ఇప్పుడు కాలంలో అందరు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నాము. మరి మా ఇంటిలో కూడా నేను వచ్చి వంట చేస్తే కాని కంచం లోకి భోజనం రాదు, అలా అని మా పిల్లలు 7థ్ క్లాసు అండ్ మెడిసిన్ చదువుతున్నారు, వాళ్ళు రికార్డ్స్ రాసుకోవడం,హోం వర్క్స్ చేసుకోవడం మానేసి వంటలు ఇంటిలో పనులు చేయ్యరేయ్. గూడెం మనుషులు అని మనం వేరుగా ఆలోచించడం ఎందుకు? వాళ్ళ తల్లి తండ్రులతో మాట్లాడాలి, అనురాధ గారు రాసినట్టు వాళ్ళ జీవితాల్లో కలుగ చేసుకోవడం కుదరదు కాబట్టి వాళ్ళలో మార్పు రావాలి, కొన్ని చోట్ల చూస్తున్నాము ఇలాంటి మార్పులు. టైం పడుతుంది.

 6. ఉపాధి కలిపించలేని చదువు కంటే, ఉపాధి చూపే కళా నైపుణ్యమే నయమనిపిస్తోంది మన దేశ పరిస్థితి చూస్తే.
  అనురాధ గారి కధలో పిల్లలే ఎక్కువ మన దేశంలో!!

 7. suryanarayana nadella says:

  ఈ కదా కి రచయిత్రి గారు పెట్టిన పేరు బాగుంది. ఇందులోని పాత్రలు టీచర్ గారితో మాటలు ఆడినవి బాగున్నై. కథ మద్యలో అమ్మ గుర్తుకు కు రావడం అంత సహజంగా వుంది. ఎన్ని పధకాలు ప్రబుత్వం చేస్తున్న చాల పిల్లలకి ఇంకా చదువు అందటంలేదు. రోజు కూలీలకు చేతినిండా పని మరియు కుటుంబ అవగాహనా పెంచితే వాళ్ళ పిల్లలకు విద్య ఆవశ్యకత ఫై అవగాహనా వస్తుందని తద్వారా మంచి సిన్సియర్ టీచర్స్ కి విద్య దానం చేసిన తృప్తి కలుగుతుందని అనిపిస్తోంది.
  .

 8. D. G. Sekhar says:

  ఈ పేద పిల్లల తల్లి తండ్రులు తమ పిల్లల భవిష్యత్తు చదువులోనే వుందని తెలుసుకోవాలి. అతి పేద పిల్లలు ఈఈట్ సీట్ వాచినవాళ్ళు కూడా వున్నారు. ఈ పిల్లల తలితంద్రులకు నట్చాచేప్పాలి. అనురాధగారి కధ పేద పిల్లల ఇళ్ళలో పరిస్తితులు కళ్ళకి కట్టినట్టుగా వున్నాయి.

 9. sreedevi canada says:

  అనురాధ గారు ఆ టైటిల్ ఎందుకు పెట్టేరో అర్ధం కాలేదు. కరుణ టీచర్ ఉపాయం పని చెయ్యలేదు కదా!!?? నేను కెనడా వచేక చూసింది ఏమిటంటే పిల్లలు 16 ఏళ్ళకి ఇంటి నుండి వెళ్లి పోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు. వాళ్లకి 24 గంటలు చాలవు. వాళ్ళు ఫ్రెండ్స్ తో హాంగ్ అవుట్ చేస్తారు, థెసిస్ లు రాస్తారు, ఉద్యోగాలు చేస్తారు. వాళ్లకి జాబు ప్రైడ్ లేదు – కాఫీ షాప్, రెస్తౌరన్త్స్,క్లోతింగ్ స్టోర్స్ అన్నింటిలో చేస్తారు.వాళ్లకి బిల్ల్స్ పైడ్ ముఖ్యం. ఇంతకీ ఇది ఎందుకు రాస్తున్నాను అంటే మన ఇండియా లో వెస్ట్రన్ ఇంపాక్ట్ ఓన్లీ వాలెంటైన్స్ డే, ఫథెర్స్ డే & మతేర్స్ డే వరకే పరిమితమై ఉన్నాయి. చాలా కాల్ సెంటర్స్, గ్లోబల్ ఆఫీసు సెట్ అప్ వచేయి కనుక ఈ కథ లోని ముఖ్య పాత్ర దీపిక పిల్లలకి ధైర్యం చెప్పాలి. నందిని, సుగుణ వాళ్ళతో డీలా పడిపో కూడదు. ఇలా అయితే మన ప్రధాన మంత్రి గుజరాత్ లో అంత అభివ్రుది తేగలిగే వారేనా? నేను ఇలా రాయడం ఈజీ అని తెలుసు, మన దేశం లో appreciation కంటే అబ్యూస్ ఎక్కువ. కాని దీపిక టీచర్ లాంటి వారె ముందుకి తీసుకి రావాలి. మన లాంటి వారం donations కి వెనక్కి తగ్గ కూడదు.

  అనురాధ గారు మీరు ఏమంటారు దీనికి?

 10. Lakshmi ramesh dasika says:

  నేను కరుణ టీచర్ సలహా తో ఎకిభావించాను. మన దేశం లో స్కూల్ వర్కింగ్ హౌర్స్ ఎక్కువ . పిల్లలకు స్కూల్ కి రావడమై కష్టం అవున్తనప్పుడు, సాయంత్రం మల్లి చదువు నిమ్మితం టైం spare చేయడం కుదరదు. స్కూల్ లో అలిసిపోయాన పిల్లలు మల్లి ఇంటికి వెళ్లి ఇంటి పనులు చెయ్యాలి because they come from low- income households. ముందుగ స్కూల్ timings తగించి, పిల్లలు school కి రెగ్యులర్ గ రావడానికి ఇంట్రెస్ట్ కల్పించాలి. వీక్లీ ఒన్స్, పేరెంట్స్ కి కూడా ఇంపార్టెన్స్ అఫ్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి. Deepika teacher’s effort to bring about a change in the children is commendable.

 11. అనూరాధ నాదెళ్ల says:

  గూడెం కథల్ని శ్రధ్ధగా చదివి ఇంతమంది మిత్రులు తమ అభిప్రాయాల్ని తెలియజేయటం చాలా సంతోషాన్నిస్తోంది.
  ఈ పిల్లల సమస్యలను, వారి చుట్టూ ఉన్న పరిస్థితులను వారి దగ్గరకే వెళ్లి చూడటం వలన ఇవి రాయకుండా ఉండలేకపోయాను. గూడెంలోకి వెళ్లటం మొదలుపెట్టిన కొత్తలో రాత్రుళ్లు నిద్రపట్టేదికాదు. అప్రయత్నంగానే …మరిన్ని సదుపాయాలుతో, ప్రోత్సాహాన్నిచ్చే వాతావరణంలో ఉన్న పిల్లలు కళ్లముందు మెదలక మానరు.
  నిజమే, ఈ సమస్యలు చాలావరకు మనకందరికీ అవగాహన ఉన్నవే. ముఖ్యంగా టీచింగ్ వృత్తిలో ఉన్నవాళ్లకి, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వాళ్లకీ ఇవి మరింతగా తెలుస్తాయి.
  చదువు ఒక్కటే ఈ సమస్యలకి పరిష్కారం. అవును, కేవలం చదువు మాత్రమే!
  చదువు ఎంత ముఖ్యమో ప్రతిరోజూ పిల్లలకి చెబుతూనే ఉంటాను. విన్నప్పుడు బుధ్ధిగా సరే అంటారు. కానీ వాస్తవంలో అనేక ప్రభావాలు వాళ్లని ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. ఒక్కోరోజు క్లాసుకి రాలేదేమిటని చూస్తే కొందరు ‘ టి.వి. చూస్తున్నాం, ఈ రోజు క్లాసుకి రాములే టీచర్’ అని చెప్పేస్తారు.
  మొన్న ఒక రోజు రెగ్యులర్ గా సాయంకాలం క్లాసుకి వచ్చే అన్నదమ్ములిద్దరు క్లాసుకి రాకుండా ఆటలాడటం గమనించి రాలేదేమని అడిగితే ‘ నిన్న రాత్రి మా నాన్న చనిపోయాడు టీచర్ , కొన్ని రోజులు మేము రాము’ అని చెప్పి ఆటల్లో మునిగిపోయారు. ఆ పిల్లల తల్లి ని పలకరించినప్పుడు నిర్వికారంగా చిప్పింది,’ తాగి తాగి పోయాడు. ఆయన్ని పోషించే బరువు తగ్గిందిలే నాకు’ అని.
  ఇంకొక పిల్లవాడు, ఏడవ తరగతి వాడు, అల్లరి చేస్తూంటే, ‘ అమ్మని పిలుచుకురా, మాట్లాడాలి’ అంటే అమ్మ లేదని చెప్పాడు. వాడు స్కూల్ కి సరిగా రాడు. సాయంత్రం క్లాసుకీ రాడు. ఎంత బుజ్జగించినా వస్తానని మాత్రం అంటాడు. మిగిలిన పిల్లలు ‘వాళ్ల అమ్మ లేదు టీచర్, వెళ్ళిపోయింది. ’ అన్నారు గోలగోలగా. ఆ పిల్లవాడు మాత్రం ‘ మీకెందుకురా, మా అమ్మ వెళ్లిపోతే…’ అంటూ గట్టిగా గొడవకి వచ్చాడు.
  ఆ తల్లి ఇంట్లో ఏ బాధలనుండి విముక్తి వెతుక్కుంటూ వెళ్ళిందో కానీ ఈ పసివాడిమీద ఆ ప్రభావం, తాను మిస్సవుతున్నతల్లి ప్రేమ తాలూకు వెలితి ఎంతగా ఉంటుందో !………..క్లాసుకి వచ్చే పిల్లల్ని బాగా విసిగిస్తాడు, వాళ్ల బ్యాగ్స్ ని లాక్కుంటాడు. ఏదో తెలియని బాథ వాడిని వేధిస్తూ ఉంటుంది. రోజూ పలకరిస్తూనే ఉంటాడు. సాయంకాలాలు క్లాసు బయట చక్కగా కబుర్లు చెబుతాడు. ‘టీచర్ మీరు చెప్పేరు కదా. స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకు వచ్చేను’ అని నా ప్రశంసకోసం చూస్తాడు. ఏమో వాడిని కొంచెం చదువు వైపు మళ్ళించగలనేమో అని ప్రయత్నిస్తూ ఉంటాను.
  అక్కడి తల్లి తండ్రులనీ ప్రశ్నిస్తూ ఉంటాను, ‘మీ జీవితాలకంటే మెరుగైన జీవితాల్ని పిల్లలకి ఇవ్వాలని మీకు అనిపిస్తుందా లేదా’ అని. ప్రతిరోజూ ఒక సమయానికి పుస్తకాలు తీసి ఆరోజు చెప్పిన పాఠాలు చదువుకోవాలి అన్న స్పృహ, అలవాటు పిల్లలకి కలిగిస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది. దానికి సమయం పడుతుంది.
  సాయంకాలం క్లాసులో ఎక్కువసమయం పిల్లలకి అక్షరాలు, గుణింతాలు నేర్పేందుకే కేటాయించాల్సి ఉంటోంది. ఆ పిల్లలు మూడు సంవత్సరాలపిల్లలైనా, పదమూడు సంవత్సరాల పిల్లలైనా అదే పరిస్థితి.
  డిక్టేషన్ రాయమంటే ఖాళీ పుస్తకాన్ని ముందు పెట్టుకుని పెన్ను కూడా తియ్యకుండా కూర్చునే పిల్లలు ఎక్కువ. రాయటం లేదేమని అడిగితే ‘ రాయటం రాదు టీచర్’ అని చెప్పేస్తారు. ఇది ఎనిమిది , తొమ్మిది తరగతి పిల్లల పరిస్థితి. టీచ్ ఫర్ ఛేంజ్ తరఫున ప్రభుత్వ పాఠశాలలకి వెళ్తే ఇదే పరిస్థితి. పెద్ద క్లాసు పిల్లలకీ అక్షరాలు కూడా రావని నిరశించే టీచర్లు ఉన్నారు. మన బాధ్యత ఎంతవరకు ఉంది దీనికి? ప్రాథమిక స్థాయి నుంచే మరింత శ్రధ్ధ పెడితే కొంచెం మార్పు కనిపిస్తుంది.
  ప్రతిరోజూ గూడెం ఒక క్రొత్త కథ చెబుతూనే ఉంది. జీవికకోసం జరిపే నిత్య పోరాటంలో పిల్లల్ని సరైన దారిలోకి మళ్లించుకోలేని తల్లిదండ్రుల్ని మాత్రం ఎంతవరకు తప్పుపట్టగలం?
  చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలు కూడా నేర్పిస్తే వాళ్ల చదువులక్కావలసిన ఆర్థిక శక్తి కొంతవరకు వాళ్లకి అందుతుంది. అది వాళ్లకి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. భవిత పట్ల భద్రతనిస్తుంది. ఇలాటి మార్పులు మన విద్యా వ్యవస్థలో రావాలని అందరం కోరుకుంటున్నా మార్పు వచ్చేందుకు చాలా సమయం పడుతుందన్నది కఠిన వాస్తవం.
  వాడు……
  వాడు అందరిలాటి పసివాడే !
  ప్రపంచంలోని కోటానుకోట్ల పసివాళ్లకి తోబుట్టువే!
  అమ్మకి అందాల చందమామే!
  అదే అమాయకపు ముఖం,అదే బాల్యపు చాపల్యం,అవే అల్లరి ప్రశ్నలు !
  చుట్టూ ఉన్న ప్రపంచానికి సమానంగా సంతోషాల్ని పంచుతాడు,
  నక్షత్రాల్లాటి కళ్లతో చుట్టూ వెలుగులు పూయిస్తాడు!
  ప్రపంచం పట్ల తనదైన ముద్రని వేస్తూ, తనవైన నమ్మకాల్ని పెంచుకుంటాడు.
  బడిలో కంటే బయటే వాడికి బ్రతుకు పాఠాలు గట్టిగా పట్టుబడతాయి!
  మట్టిలో ఆడుతూ, మట్టికీ మనిషికీ ఉన్న ఆత్మీయానుబంధాన్ని నిత్యం నెమరేస్తుంటాడు !
  అన్నీ బావున్నాయి, అంతా బావుంది…………………
  వాడు రేపటి గురించిన భయం అసలే లేనివాడు!
  కానీ వాడు …….. కొందరు పిల్లలకంటే
  పుట్టుకనుంచీ ఎక్కువ పోరాటాలతో, ఎక్కువ సమస్యలతో జీవించేవాడు!

 12. sreedevi canada says:

  ముందుగా, లక్ష్మి రమేష్ గారు రాసిన పరిష్కారం ఎంతో నచ్చింది. ఎస్, ముందు స్కూల్స్ లో టైం తగ్గిన్ చాలీ ఆ తర్వాత సిలబస్ తగ్గించాలి. అప్పుడు పిల్లలు ఆట పాటల్లో కళా రంగాల్లో రాణిస్తారు. చాలా బాగా చెప్పే రండి.
  తర్వాత, రచయత్రి గారు రాసిన మాటలు హృదయాన్ని హత్తుకున్నాయి. ఎంతో దగ్గరగా, సున్నిత హృదయం తో చుస్తే ఇలా రాయడం వస్తుంది. అనురాధ గారు రాసే ముందు ముందు కథ కోసం ఎదురు చూస్తాను మరి ప్రతి నెలా!!

 13. వనజ తాతినేని says:

  అనూరాధ గారు కథ కన్నా మీ స్పందన చాలా నచ్చింది నాకు .

 14. Deepthi peesapati says:

  ఐ లవుడ్ యువర్ కామెంట్ .. రెండు updates కి కామెంట్…. deepika determination చాల నచ్చింది.అందరి అమ్మల్లాగా దీపిక వాళ్ళ అమ్మ కంగారు సహజం కానీ తన మనసు తెలిసున వ్యక్తిగా ఎక్కువ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకుండా మంచి పనికి అడ్డు పడక పోవటం చాల నచ్చింది..ఫ్యామిలీ సపోర్ట్ చాల అవసరం. పని అమ్మాయి రానపుడు పిల్లలినిల పనికి పంపటం చూస్తూ ఉంటాను తప్పు అని తెలిసిన పని అయిపోవటం కావాలి .. వాళ్ళ పేరెంట్స్ నితప్పు పట్టలేము.. ఇలాంటి ఆటిట్యూడ్ చేంజ్ అవాలి.. తల్లి దండ్రులు పిల్లలు అన్ని నేర్చ కోవాలని ప్రోత్సహిస్తాం .. కానీ ఈ పిల్లలకి ఆ ప్రోత్సాహం ఉండదు .. మీరు ఎంత చెప్పిన ఇంటికి తిరిగి వెళ్తే బ్రతకటానికి ఎంత కష్టపడుతున్నారో చూసి ఎం చేయగలరు ? చాల సార్లు పిల్లలు పున్చింగ్ బగ్స్ అవతారు.. పిల్లలు చదువుపట్ల ఆసక్తి చూపించటం మంచిదే కానీ అది పెద్దలు కూడా చూపి ప్రోత్సహిస్తే ఇంకా బావుంటుంది .. పెద్దలకు చదువు విలువ తెలియజేస్తే బావుంటుంది .. వాళ్ళు చేయలేని వి పిల్లలు చదువుకుని ఎలా సాధించగాలరో తెలియచెస్తె ? అభిప్రాయాలూ మార్చటం కష్టం కానీ అసాధ్యం కాదు .. వ్రుత్తి విద్యల ఆలోచన బావుంది .. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ లో కూడా ఉంటున్నాయి ఈ మధ్య.. మార్పు అన్నది ప్రతి ఒక్కరు తానుగా ముందడుగు వేస్తేనే సాధ్యం.. అలంటి అడుగు ఎవరికీ వారు తమ పరిధిలో మొదలు పెట్టాలి. ఒక రేస్పోసిబిలితి గా ఫీల్ అయి చేస్తే మార్పు వచ్చినట్టే . Kudos to the great work you are doing .. Waiting for your next update

 15. ఎప్పుడు ప్రేమ కథలే కాకుండా కొంచం ఇలా సమాజం గురించి భవిష్యతు గురించి ఆలోచించే విధంగా వుండే కథలు రానించాలి. చక్కటి స్పందన కలిగించిన కథ. కామెంట్స్ చూస్తుంటేనే తెలుస్తోంది మన అందరికి కావలసిన సబ్జెక్టు అని.

 16. సత్యవతి says:

  ఇవి కథలు కావు అనూరాధ గారి అనుభవాలు ఆవిడ తన ఇంటి దగ్గర వున్న గూడెం కు రోజూ వెళ్లి పిల్లలను పోగు చేసి వాళ్ళ తో బాగా involve అయి చదువు చెబుతారు పట్టించుకుంటారు అంతే కాదు ప్రభుత్వ పాఠశాల లో కూడా వాలంటరీ గా పాఠాలు చెబుతారు I admire her

 17. after reading this story I did not feel bad about the gudem people.it is quite natural in their circumstances.i am sorry to say this but so called corporate school children’s standard is also like this.children always want to spend their time in watching T.V.using smart phones for all the purposes and laptops.whom should we blame.parent’s inability to control or lack of motivation in society in general.if gudem children are neglecting,atleast there is a reason behind it.we don’t know where we are reaching .only GOD should lead us to the correct path.

 18. Sarada Putrevu says:

  అనురాధగారి kadha వాస్తవానికి ప్రతిరూపం.ఈకథ స్పూర్తితో కనీసం కొంతమంది Mahila లైన వారి ఖాలీ టైం ఈవిధంగా ఇటువంటి కార్యక్రమాలకు వెచ్చిస్తే కొంతమంది గూడెం పిల్లలకు చదువు విలువ తెలియచేసిన వారమవుతాము.

  అనురాధ పరిచం ఎంతో అదృష్టం

 19. చాల బాగుంది అనురాధ గారు సమాజాని కి ఎంతో ఉపయోగమైన కథలు వ్రాస్తున్నారు ఇంకా చాలా చాలా కథలు వ్రాయాలి మీరు.

 20. ఎస్ ఆర్ బందా says:

  వీటిని కథలు అనడంకన్నా, ఒక ఉదాత్త ప్రవృత్తి గల వ్యక్తి, చిక్కనైన () సదుద్దేశ్యంతో చేస్తున్న ప్రయత్నాల్లో ఎదురైన అనుభవాలు అనడం మరింత సబబుగా వుంటుందనుకుంటున్నాను. ఎన్నో ఏళ్ళ క్రితం ఒక కథ చదివాను. అందులోని ఇంటి ఇల్లాలు, ఎదురింటావిడ పనిమనిషిమీదా, నౌకర్లమీదా ధాష్టీకం చేస్తుంటే సహించలేకపోతుంటుంది. ఆ విషయం మీద ఒక కథ వ్రాద్దామని ప్రయత్నిస్తూ, భర్తని సలహా అడుగుతుంది. అప్పుడావిడ భర్త ఇలా అంటాడు.. “నువ్వు రాద్దామనుకోవడం, తద్వారా పదిమందికీ చెప్పాలనుకోవడం మంచిదేకానీ, అలా రాయడంవల్ల, వీటిని చదివేవాళ్ళుకూడా మనలాగా – మన ఆలోచనా స్థాయికే చెందిన వాళ్లయి వుంటారు కాబట్టి వాళ్ళు నువ్వు చెప్పేదానికి ఏకీభవిస్తారేమో కానీ, నిజంగా ఎవరిమీద ఇవి పనిచెయ్యాలో వాళ్ళు వీటిని చదవరు కాబట్టి, నీ రచనకి వుండే అంతిమ లక్ష్యం అందదేమో'” అంటాడు. అదే విధంగా, గూడెంలోని పిల్లలకి చదువుచెప్పాలన్న వుద్దేశ్యమూ, దాని ఆచరణా ఎంతో వున్నతమైనవే అయినప్పటికీ, సామాజికంగా, రాజకీయంగా ఆర్ధికంగా కొన్ని సమూలమైన మార్పులు స్పష్టంగా చోటుచేసుకోనంతవరకూ ఈ అనుభవాలు చర్వితచర్వణమౌతూనే వుంటాయని నా వుద్దేశ్యం. గూడెంలోని సమస్యలని చూపడం మాత్రమే కాక వాటికి పరిష్కారాలని కూడా ప్రస్తావించితీరాలన్న సూత్రమేదీ ఈ కథలకి వర్తించదని నమ్ముతున్నాను. చదువరికి భావప్రాప్తి కలిగించడంలో కొంత వెనుకబడినా సరే, ఇవి మనచుట్టూ ప్రతిరోజూ కనిపించే సంఘటనలే కాబట్టి, వాటిని చదివి అదే విధంగా స్పందించాలనుకుంటున్నాను.

మీ మాటలు

*