కథ జీవితమంత విశాలం కావాలి!

 

-ఆరి సీతారామయ్య

~

సమాజానికి ఏది మంచిదో ఆలోచించడం, దాన్ని ప్రోత్సహించడం, తదనుగుణంగా ప్రవర్తించడం సామాజిక స్పృహ. సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించే శక్తులనూ భావజాలాన్నీ వ్యతిరేకించడం కూడా సామాజిక స్పృహే.

తన వర్గానికి ఏది మంచిదో, లేక తనకు ఇష్టమైన వర్గానికి ఏది మంచిదో  దాన్ని ప్రోత్సహించడం,  ఆ వర్గ పురోగమనాన్ని నిరోధించే శక్తులను  వ్యతిరేకించడం వర్గ చైతన్యం. అస్తిత్వ ఉద్యమాల పేరుతో జరుగుతున్న ప్రాంతీయ, వర్గ, కుల, మత పోరాటాలలో పాల్గొనడం, లేక వాటితో  సహకరించడం వర్గ చైతన్యం.

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల గురించి అభిప్రాయాలు ఏర్పరచు కోవటం, ఆ పరిణామాల వెనుక ఉన్న చోదక శక్తుల గురించి అవగాహన ఏర్పరచు కోవడం ప్రాపంచిక దృక్పథం.

సామాజిక స్పృహా, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం ఎంతో కొంత ప్రతి మనిషిలో ఉంటాయి. చైతన్యవంతుల్లో ఎక్కువే ఉంటాయి.

కథలు రాయదల్చుకున్న వారికి ఇవన్నీ ఉండటం మంచిదే. కాని తన సామాజిక స్పృహనీ, వర్గ చైతన్యాన్నీ, ప్రాపంచిక దృక్పథాన్నీ కథలో జొప్పించకుండా, పాత్రల స్వభావాలను  తన వైపు తిప్పుకోకుండా, కథలో పాత్రలను వారివారి స్వభావాలకు అనుగుణంగా ప్రవర్తించే వారిగా సృష్టించ గలిగితే మంచి కథలు వస్తాయి. అదంతా అవసరం లేదు, కథ మన వర్గపోరాటానికి ఒక సాధనం మాత్రమే అనే వారున్నారు. అలాంటి అభిప్రాయం  ఉన్నవారుకూడా నేర్పూ ఓర్పూ ఉంటే సజీవమైన పాత్రలను సృష్టించగలరు, మంచి కథలు రాయగలరు. నేర్పూ ఓర్పూ లేని వారు వస్తువు బలంగా ఉంటే చాలు, రూపం అంత ముఖ్యం కాదు అని ప్రచారం చే స్తూ కథల్లో తమ సామాజిక స్పృహా, తమ వర్గ చైతన్యం, తమ ప్రాపంచిక దృక్పథాన్నే మళ్ళీ మళ్ళీ  పాత్రలకు అంటిస్తూ నిస్సారమైన పాత్రలతో ఉపన్యాసాలతో పాఠాలతో విసుగు  పుట్టిస్తుంటారు.

సామాజిక స్పృహ, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం గురించి ఆలోచించని  వారు మంచి కథలు రాయగలరా? రాయగలరు అని నా అభిప్రాయం. మంచి కథ అంటే ఏంటో ముందు చెప్పుకుందాం. ఒక భావోద్రేకానికి లోనయిన రచయిత, దాన్ని కథ ద్వారా పాఠకులకి అందించగలిగితే అది మంచి కథ. భావోద్రేకానికి కారణం కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, భయం కావచ్చు, ఏదైనా కావచ్చు. పాఠకులు ఆ భావోద్రేకాన్ని అనుభవించాలంటే రచయిత సజీవమైన పాత్రలను సృష్టించాలి. కథలో సన్నివేశాలూ సంఘటనలూ రోజువారీ జీవితంలో అందరికీ ఎదురయ్యేవిగా ఉండాలి. అప్పుడు కథ పండుతుంది.

తమచుట్టూ  సామాజిక స్పృహ, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం అని  గిరులు  గీసుకుని,  వీటి  పరిథిలోనే  కథలు  రాయాలి  అనుకునే  వారికి  ఇవి గుదిబండల్లాగా తయారవుతాయని నా అభిప్రాయం. సగటు  తెలుగు సినిమా ఎప్పుడూ పనికి మాలిన వారి ప్రేమకలాపాల చుట్టూ తిరుగుతున్నట్లు, తెలుగు  కథ ఎప్పుడూ సమస్యలూ, వాటి పరిష్కారాల చుట్టూ తిరుగుతుంటుంది. అందువల్ల కథలు ఎప్పుడూ ఒక చిన్న వలయంలో ఉన్న వస్తువుల గురించే వస్తుంటాయి. జీవితంలో ఉన్నంత వస్తువిస్తృతి, భావవిస్తృతి కథల్లో ఉండదు.

తెలుగు కథ సమస్యలకూ పరిష్కారాలకూ పరిమితం కావటానికి కారణం ఎవరు? వామపక్షం వారని చాలా మంది అభిప్రాయం. సాహిత్యంలో వామపక్షం వారి ప్రభావం ఎక్కువగా ఉండటం, సమాజాన్ని తమకు ఇష్టమైన దిశగా మార్చటానికి సాహిత్యం ఒక పనిముట్టు అని వారు  భావించటం, ఇప్పుడు ఆ  భావజాలాన్ని  అన్ని ‘అస్తిత్వ ఉద్యమాల’ వారూ పాటించటం, తెలుగు  కథ ప్రస్తుత పరిస్థితికి చేరటానికి కారణం అని  నా అభిప్రాయం.

కానీ ఇది వామపక్షం సృష్టించిన పరిస్థితికాదు. ఆధునిక కథాప్రక్రియకు ముందే మన దేశంలో నీతికథలు ఉండేవి. కథకు ముఖ్యోద్దేశం ఒక నీతిని పాఠకులకు చేర్చడం. ఈ ప్రభావం వల్లనే మనం కథ దేని గురించి? అసలు ఈ రచయిత ఈ కథ ద్వారా ఏం చెప్పదల్చుకున్నాడూ? అని చాలా అనాలోచితంగా అడుగుతూ ఉంటాం. అంటే కథ ఏదో ఒక సమస్య గురించి  ఏదో ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం అన్న మాట. మనకు చాలా కాలంగా ఉన్న ఈ  ఆచారాన్నే వామపక్షం వారు  బలోపేతం చేశారు. ఆ గోతిని ఇంకా లోతుగా తవ్వారు.

జీవితం సమస్యలకంటే, భావజాలాలకంటే, అస్తిత్వ ఉద్యమాలకంటే, రాజకీయాలకంటే విస్తృతమైంది. కథని ఒక పనిముట్టుగా వాడుకోవటం మానేసి, జీవితంలో ఉండే అన్ని కోణాల్నీ ప్రతిఫలించనివ్వాలి. అప్పుడు తెలుగు కథకు మంచి రోజులు వస్తాయని నా నమ్మకం.

*

 

మీ మాటలు

 1. కథ గురించి మీ సందర్భోచిత విశ్లేషణ బాగుంది. అందరికి ఆమోదయోగ్యంగా ఉంది.

 2. చందు - తులసి says:

  సార్ ….మీరు మంచి సూచనలు చేశారు.
  …వామపక్షాలు తమ రాజకీయ ప్రయోజనం కోసం అన్ని సాహిత్య ప్రక్రియలు వాడుకున్నారు.
  ప్రయోజనం సాధించారు కూడా.
  …ఇక వామపక్షాల వల్ల నష్టం జరిగిందా…లాభం జరిగిందా చర్చ పక్కన పెడితే, వామ పక్షాలతో సంబంధం లేకుండా, ఒక్కోసారి వ్యతిరేకించి రాసిన కథలు అంతకన్నా మూసలోకి వెళ్లడం.
  పడక్కుర్చీ కథలు, వ్యక్తి సుఖమే ప్రధానమన్న కథలూ..శైలి పరంగా సాధించిన అద్భుతమేదీ లేదు.
  ఇక్కడ సంతోషించాల్సిందేమంటే తెలుగు కథ మీద ఇటీవల విస్తృతంగా చర్చ జరగడం.
  ఐతే వ్యక్తుల స్థాయిలో కాకుండా …తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంస్థలు, యూనివర్శిటీలు మరింత విస్తృతంగా పరిశోధించి, చర్చించాల్సిన అంశమిది. ఆ దిశగా కృషి జరిగితే తెలుగు కథకు మంచిరోజులు తప్పక వస్తాయి. మీ లాంటి పెద్దలు
  సీనియర్లు ఆ దిశగా చొరవ చూపాలి.

 3. ఇది కథకే కాదు కవిత్వానికి కూడా వర్తిస్తుంది. ఇస్మాయిల్ గారు వివిధ వాదాలనేవి తిరగళ్ళు వంటివని, అవి కవి స్వేఛ్చని హరిస్తాయనీ వాటిని కాళ్ళకు కట్టుకొని పరిగెడుతూ మంచి కవిత్వం వ్రాయలేమని అనేవారు.

 4. Brahmanandam Gorti says:

  రచనలు చేయదల్చుకున్న వారు, ముఖ్యంగా కథలు, నవలలు రాయదల్చుకున్నవారు, రాస్తున్న వారూ బాలగోపాల్ “రూపం-సారం” పుస్తకాన్ని చదవితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
  మిగతా ప్రపంచ భాషల్లోనో సామాజిక చైతన్య దిశగా ఎన్నో నవలలూ, కథలూ వెలువడ్డాయి. కానీ అవన్నీ ఆయా కళారూపాల్లో ఒదిగిపోయాయి కాబట్టే ఈనాటికీ అవి చదువుతూ ఉంటాం.

 5. అజిత్ కుమార్ says:

  ప్రాంతీయ, వర్గ, కుల, మత పోరాటాలలో పాల్గొనడం, లేక వాటితో సహకరించడం వర్గ చైతన్యం- అని రెండవ పేరాలో పేర్కొన్నారు. కానీ వర్గపోరాటమంటే మీరనుకున్నది కాదేమోనని నా అనుమానం.

 6. raghava raghava says:

  ” సామాజిక స్పృహ, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం గురించి ఆలోచించని వారు మంచి కథలు రాయగలరా? రాయగలరు అని నా అభిప్రాయం ” – ఈ అభిప్రాయం సమంజసం గా కనపడ్డం లేదండీ. స్వాతి లో సరసమైన కధలు అని వస్తుంటాయి గదా. బహుశా ఆయా కధల రచయితలు మీరు ప్రస్తావించిన స్పృహ, చైతన్యం,దృక్పధం లాంటి గుదిబండల గురించి ఆలోచించనివారే.ఆ కధలన్నీ మంచి కధలే అంటారా?

  ఇవి గుదిబండలే అవుతాయంటారా అసలు? అయినా తమకంటూ ఒక ప్రాపంచిక దృక్పధం అసల్లేని వాళ్ళెక్కడుంటారండీ? కాకుంటే అది తమ సాహిత్యరూపపు శిల్పాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాలి గానీ. గురజాడ, కొ.కు. రావిశాస్త్రి, చాసో ..వీళ్ళంతా సామాజిక స్పృహ, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం వగైరా గుదిబండలను కలిగి ఉన్నవాళ్ళే కదండీ. వీళ్ళు మరి మంచి,ఆకట్టుకునే,పండిన కధలే రాయలేదా? అది ఎలా సాధ్యమయింది మరి?
  వల్లంపాటి వామపక్షశిబిరమాయనే గదా. “వస్తు శిల్పాల సమన్వయం సరిగ్గా కుదిరినదే మంచి కధ” అనేగా ఆయన అంటాడు. వామపక్షం వాళ్ళెక్కడైనా శిల్పం పట్ల శ్రద్ధ పెట్టొద్దనీ, కేవలం నినాదప్రాయం గా రాయమనీ చెప్పారా? వస్తు శిల్పాల మధ్య పోటీ నే అనవసరం .చక్కని సమన్యయం కుదర్చగలగాలి. ఒకవేళ పోటీ అనివార్యమైతే ,,ఆయా సృజనకారులు రెంటికీ న్యాయం చేయగలిగిన సమర్ధత లేని వాళ్ళైతే..అప్పుడు శిల్పం కంటే వస్తువే ముఖ్యమవుతుందంటే మరి అది న్యాయమే కాదా? మనం తినే తిండి పోషణనీ,రుచినీ రెంటినీ ఇవ్వాలని కోరుకుంటాం. కానీ పలానా వంటగాడికి అంత సీన్ లేదు,ఏదో ఒక్కటి మాత్రమే ఇవ్వగలడూ అంటే అప్పుడు ఏది కోరుకోవాలి మనం ? రుచి నా? పోషణ నా?

 7. Raghavendra says:

  మోకాటికీ, బోడిగుండుకీ అంటే ఇదే. సామాజిక స్పృహ లేకుండా రాసిన కధలు మంచివీ, ఆ చైతన్యం తో రాసినవి పండవూ అని వ్యాసకర్త అన్నాడని అర్ధం చేసుకున్నారా? వంట విషయం లో రుచీ, పోషణా కోరుకోవచ్చు . కధల్లో పోషణ కోసం వెతుక్కోవటం తప్పు. ఈ ధోరణిలో పోతే నీలిచిత్రాల్లో కూడా ప్రభోధం లేదని బాధపడాల్సి రావచ్చు. వస్తు ప్రాధాన్యత కొద్దీ సీతారామయ్య గారు వ్యాసం రాసారుగానీ కధ రాయలేదు కదా. శిల్పమూ, వస్తువూ రెంటి మేళవింపూ కుదిరిన కధలు గుర్తుండిపోతాయి. రుచిమాత్రం ఉన్న కథలు కూడా భలే. వస్తువు మాత్రమే ఉంటే కధ సరి ఐన ప్రక్రియ కాదు.

 8. raghavaraghava says:

  “సామాజిక స్పృహ, వర్గ చైతన్యం, ప్రాపంచిక దృక్పథం గురించి ఆలోచించని వారు మంచి కథలు రాయగలరా? రాయగలరు అని నా అభిప్రాయం. ” – ఈ వాక్యానికి అర్ధమేంటి సార్ రాఘవేంద్ర గారూ..? ఈ వాక్యం ఈ వ్యాసం లోనిదే.

  వస్తు శిల్పాల మేళవింపు కుదరాల్సిందే. అలా కాకుండా “రుచి మాత్రమే ఉన్న కధలు కూడా భలే “అని మీరు అంటే ,..కావొచ్చు..ఎవరి వ్యక్తిగత అభిరుచి వారిది…- “భలే” లను సాధారణీకరించడం కష్టం గదండీ..
  వామపక్షాల వాళ్ళెవరయినా వస్తువు కోసం శిల్పాన్ని బలి పెట్టమని ఎక్కడయినా రాశారా…? రాసి ఉంటే కొన్ని పేర్లు చెప్పండి సార్…

 9. Raghavendra says:

  “రాయగలరు” అని మాత్రమే . నేను తినగలను అంటే నువ్వు తినలేవు అనికాదు. ఆననిమాటలు ఊహించుకుని, భుజాలు తడుముకొంటం వ్యర్ధం. చెయ్యని ఆరోపణలకు ఉదాహరణలిమ్మంటే ఎలాబాబూ? P.G.Wodehouse మేళగాళ్ళతో make a sound like an egg and beat it అన్నట్లు ఉందిది.

  • raghava raghava says:

   ఓహ్..రాఘవేంద్ర గారూ! నిజమే..ఒక పర్టిక్యులర్ చట్రం పెట్టుకోకపోయినా మంచి కధల్ని రాయగలరు అనే వ్యాసకర్త అభిప్రాయాన్ని నేను పొరపాటుగా అర్ధం చేసుకున్నాను. సారీ.

మీ మాటలు

*