అన్వీక్షణ

 

 

-బి. హరిత

చిత్రం: సృజన్ రాజ్ 

~

 

Picture (1)పరిచయం:

హైదరాబాద్  సెంట్రల్   యూనివర్సిటీలో  ఎం.ఫిల్. చేస్తున్నాను. 
పుట్టింది విజయనగరం, ఇప్పుడు ఉంటున్నది హైదరాబాదు.
సాహిత్య ప్రవేశం అంటే, టూకీగా చెప్పాలంటే, సాంకేతిక విద్యలో డిగ్రీ అయ్యాక, తెలుగు మీద మమకారంతో ఎమ్మే చేశాను, ఆ ఇష్టంతో ఇప్పుడు పరిశోధనలోకి అడుగుపెట్టాను.
 
*

“ఎవరు నువ్వు?”

“నన్నే ఎరుగవా? నువ్వు నిరంతరం ఎవరి గురించి ధ్యానిస్తున్నావో అవ్వారిని నేనే!”

“అంటే నువ్వు.. నువ్వు దేవుడివా?”

“సందేహమా?”

“నేనేం నీ గురించి ధ్యానించటం లేదే!”

“లేదా? నువ్వు గత కొన్ని రోజులుగా రాత్రింబవళ్ళు నాగురించే ఆలోచిస్తున్నట్టు తోస్తేను, ఏదో నిన్ను పలకరించి పోదామని వచ్చాను. పోనిలే! వెళతాను”

“ఆగాగు! దొరక్క దొరక్క దొరికావు. నిన్నంత తేలిగ్గా పోనిస్తానా? నిన్ను చాలా చాలా అడగాలి. నా బుర్రంతా సందేహాలతో వేడెక్కిపోతోంది”

“అందుకేగా వచ్చాను. ఇక నీదే ఆలస్యం! అడుగు మరి”

“ఈ ప్రపంచానికంతటికీ నువ్వొక్కడివే దేవుడివా? నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా?”

“నేనే వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉంటాను”

“ఎందుకలా? నువ్వు ఉన్నవాడివి ఉన్నట్టుగా కనిపిస్తే తీరిపోదా? అన్ని రూపాల్లో కనిపిస్తూ జనాలను తికమక పెట్టి వాళ్ళ మధ్య తగువులు సృష్టించి తమాషా చూడడం నీకు సరదానా?”

“మీ ఇంట్లో ఎంతమంది?”

“నేనే మడిగాను? నువ్వేం మాట్లాడుతున్నావు? అయినా మా ఇంట్లో ఎంత మంది ఉన్నారో నీకు తెలియదా?”

“తెలియకేం! నీ నోట విందామని..”

“నలుగురం – నేను, చెల్లి, అమ్మ, నాన్న”

“నీకే కూర ఇష్టం?”

“వంకాయ”

“మీ చెల్లికి?”

“బెండకాయ”

“అమ్మా నాన్నలకు?”

“అబ్బబ్బ! విసిగిస్తున్నావు!”

“చెబుదూ”

“అమ్మకు ఏదీ ప్రత్యేకంగా ఇష్టం ఉన్నట్టు కనపడదు. అన్నీ ఒకేలా తింటుంది. నాన్న బీరకాయను ఎక్కువగా ఇష్టపడతారు”srujan1

“ఒక కుటుంబంలో ఉన్న నలుగురు మనుష్యులకే, ఇప్పుడు తింటే మరి కాసేపట్లో అరిగిపోయే తిండి విషయంలోనే ఇన్ని ఇష్టాలున్నాయే, మరి ఈ విశాల ప్రపంచంలో ఉండే కోటానుకోట్ల మనుషుల అభిరుచులలో తేడాలుండవా? ఏ ప్రాంతం వారి అభిరుచులకు తగ్గట్టు వారికి కనిపిస్తాను.  ఇక వారి మధ్య గొడవలంటావా? అవి నేను పెట్టినవి కావు. నీకు వంకాయ ఇష్టమని మీ చెల్లిని కూడా అదే ఇష్టపడమనడంలో అర్థముందా? ‘De gustibus non est disputandum’ అని లాటిన్ లో ఒక సామెతుంది. అంటే..”

“తెలుసు! అభిరుచుల విషయంలో వాదోపవాదాలకు తావు లేదని. నీకు లాటిన్ కూడా తెలుసా?”

“అదేం ప్రశ్న! మీకు తెలిసినవన్నీ నాకూ తెలుసు. మీకు తెలియనిదేదీ నాకూ తెలియదు. ముందు చెప్పింది విను. ఎవరి ఇష్టం వారిదని పక్కవాడి ఇష్టాలను గౌరవిస్తే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఎపుడైతే మన ఇష్టాలను పక్కవాడి మీద రుద్దాలని ప్రయత్నిస్తామో అప్పుడే ఘర్షణ మొదలవుతుంది. అది మీరు గ్రహించిననాడు మీ ప్రపంచం శాంతిమయం అవుతుంది”

“అయితే ఈ విషయంలో నీ తప్పేమీ లేదంటావు!?”

“సరే! నీ కర్థమయ్యేలా చిన్న ఉదాహరణ చెబుతాను. మీ నాన్న నిన్ను, మీ చెల్లినీ చిన్నప్పటి నుండీ ఒకేలా చూశాడు. ఒకే సౌకర్యాలు కల్పించాడు. ఒకే స్కూల్లో చేర్పించాడు. అవునా?”

“ఔను!”

“మరి నువ్వు బాగా చదివి ఫస్టు మార్కులు తెచ్చుకున్నావు. కాని మీ చెల్లి చదువెప్పుడూ అంతంతమాత్రమే! దీనికి కారణం మీ చెల్లా? లేక మీ నాన్నా?”

“మా నాన్నెలా అవుతాడు. మా చెల్లే! అదెప్పుడూ టీ.వీ. ముందు కూర్చుంటే మార్కులెలా వస్తాయి?”

“కదా! మరి నేనూ మీ అందరికీ బుద్ధినిచ్చాను. అది వాడి బాగుపడమన్నాను. మరి మీలో కొందరు రవీంద్రులు, నరేంద్రులు అవుతున్నారు. విశ్వశాంతిని బోధిస్తున్నారు. మరికొందరు మతం పేరిట మారణహోమం సృష్టిస్తున్నారు. ఇది మీ తప్పా? నా తప్పా? మీకు నేను బుద్ధిని, తార్కిక శక్తిని ఇచ్చానంటే ఉపయోగించుకోమనే కదా! ఉపయోగించి ఏది మంచి, ఏది చెడు తెలుసుకునే బాధ్యత మీదే!”

“మరి నీ పేరుతో చెలామణీ అయ్యే ఆచారాలు? వ్యవహారాలు?”

“నువ్వాలోచించి చెప్పు, చూద్దాం!”

“హ్మ్!!….అవి ఆయా కాలాలలో ఆయా ప్రాంతాలలో ఉన్న బుద్ధి జీవులు అక్కడి ప్రజల మంచి కోసం, సమాజంలో ఒక కట్టడి కోసం, నీ పేరిట ఏర్పరిచిన నియమాలు. అంతేనా?”

“శభాష్! నువ్వన్నట్టు ఒకప్పటి కాలంలో ప్రజలకు అవి అవసరమని జ్ఞానులు అవి ఏర్పరిచారు. అన్నీ కాదు కాని వాటిలో కొన్ని కాలపరీక్షకు నిలబడలేవు. అటువంటి వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ పోవాలి. కాని ఆచారం పేరిట మీరు వాటినే పట్టుకు వేలాడుతున్నారు”

“నిజం!  రాత్రి పూట ఇల్లు ఊడిచినా చెత్త ఎత్తి ఆవల పడెయ్యకూడదంటుంది అమ్మ. ఎందుకో అమ్మకూ తెలియదు. అమ్మమ్మ చెప్పిందంటుంది. ఆలోచించగా నాకు ఒక్కటే తోచింది. ఇంతకు ముందైతే గుడ్డి దీపాల వెలుతురులోనే రాత్రుళ్ళు పని చేసే వాళ్ళు. పొరపాటున విలువైనదేదో పడిపోతే చీకటిలో అవతలికి పడేస్తారేమోనని ఆ నియమం పెట్టి ఉంటారు. ఇప్పటి విద్యుద్దీపాల వెలుగులో కూడా దాన్నే పాటించడం తెలివితక్కువతనం. అలాగే సత్యన్నారాయణ స్వామి వ్రత కథ. వ్రతం చేసిన ఆవిడ, చనిపోయాడనుకున్న భర్త తిరిగి వచ్చిన ఆనందంలో, ప్రసాదం తినడం మరిచిపోయి భర్తను చూడడానికి పరిగెడితే, ఆమె భర్త ఉన్న ఓడను అక్కడికక్కడే సముద్రంలో ముంచేశావట. నువ్వింత శాడిస్టువా అని అప్పట్లో ఎంత తిట్టుకున్నానో!”

“బాగుంది! ఈ వ్రతకథలూ అవీ రాసేది మీరు. చెడ్డపేరు మాత్రం నాకా?”

“మరి నువ్వు నేరుగా కనిపించి ఈ విషయాలన్నిటిగురించి మాకు చెప్పొచ్చు కదా!”

“నన్ను చూడాలని బలంగా కోరుకునేవారికి తప్ప అందరికీ నేను కనిపించను. అయినా నేను చెప్పకపోతే ఏం? ఎప్పటికప్పుడు జ్ఞానుల చేత చెప్పిస్తూనే ఉన్నాను. అయినా మీరు వింటేగా? వోల్టేర్ అని మీ వాడే ఒకడు చెప్పాడులే, ‘It is difficult to free fools from the chains they revere’ అని”

“సరే కానీ, ఇంకొక పెద్ద సందేహం ఎప్పటినుండో ఉండిపోయింది. నిన్ను అడిగి తేల్చుకోవాలి. మా అమ్మ సీతమ్మను అడవిలో వదిలెయ్యడంలో ఏమైనా న్యాయముందా? నీకు సీతమ్మ కంటే రాజ్యమే ఎక్కువైపోయిందా? అది అధికారదాహం కాదా?”

“ఆబ్బో! ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయే! సరే! సమాధానం చెబుతాను. సావధానంగా విను. మొదటిగా సీతమ్మను వదిలేసింది నేను కాదు. రాముడు!”

“అదేమిటి? నువ్వే రాముడిగా అవతారం దాల్చలేదా? రాముడూ నువ్వూ వేరు వేరా?”

“వేరు కాదు! రాముడు నా అంశే! రాముడే కాదు మీరందరూ నా అంశలే! నా అవతారాలే! కాని రాముడు, కృష్ణుడు, బుద్ధుడు వంటి కొందరు మాత్రం తమ బుద్ధిని అత్యున్నత స్థాయిలో వికసింపజేసుకుని, ధర్మమార్గంలో నడిచి, తమలోని దైవాంశను ఆవిష్కరింపజేసుకున్నారు. మహనీయులయ్యారు. మీ అందరికీ ఆరాధనీయులయ్యారు. ఆ విధంగా రాముడు నా అభిమాన అవతారం.
ఇక రెండవది అతడిపై నీ ఆరోపణ! దానికి జవాబు చెప్పే ముందుగా నీ జీవితంగా జరిగిన సంఘటనొకదాన్నిగురించి నేను ప్రస్తావిస్తాను. నువ్వు డిగ్రీ చదివే రోజుల్లో నువ్వు, ఉపాస్య అనే నీ స్నేహితురాలు ఒకరినొకరు ఇష్టపడ్డారు; బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలు సంపాదించి పెళ్ళి చేసుకోవాలని కలలు కన్నారు. అవునా? మరిప్పు డేమయింది? జీవితాంతం కలిసి ఉంటామని ఒట్లు పెట్టుకున్న మీరెందుకు విడిపోయారు? నువ్వెందుకామెను వదిలేశావు?”

“నేనేం ఆమెను వదిలెయ్యలేదు! మేం..మేం పరస్పర అంగీకారంతో విడిపోయాము. మేం ప్రేమించుకుంటున్న రోజుల్లో పదవ తరగతి చదువుతున్న నా చెల్లి చదువూ సంధ్య లేని ఒక పనికిమాలిన వెధవతో తిరగడం చూసి ఆమెను ప్రశ్నించాను. ‘నువ్వు ప్రేమించగా లేనిది నేను ప్రేమిస్తే తప్పా’ అని అడిగింది. తనది తెలిసీ తెలియని వయసని నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. వినలేదు. ‘నువ్వు నీ ప్రేమను వదులుకుంటే నేను నా ప్రేమను వదులుకుంటా. లేదంటే నా విషయంలో మాట్లాడకు’ అంది. గత్యంతరం లేని పరిస్థితిలో తన క్షేమం కోరి, తన భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించి, ఉపాస్యతో చర్చించి, రాసిపెట్టి ఉంటే మళ్ళీ కలుద్దామనుకొని, అప్పటికి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఏం తప్పా?”

srujan1“కానే కాదు! ఎంతో చక్కటి నిర్ణయం తీసుకున్నావు. నీ చెల్లెలిది పరిపక్వత లేని వయస్సు. బాధ్యత కల అన్నగా నీ కర్తవ్యాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించావు. మరి నీ చెల్లిని నువ్వు ఎంత ప్రేమించావో, అంతకంటే ఎక్కువగా రాముడు తన ప్రజలను ప్రేమించాడు. అతని ప్రజలూ బుద్ధిహీనులే! నువ్వు నీ చెల్లికోసం నీ ప్రేమను త్యాగం చేస్తే, రాముడు తన ప్రజలకోసం ప్రాణంతో సమానమైన తన భార్యను త్యాగం చేశాడు. మీ నాన్న నీ త్యాగానికి ఎంతగా సంతోషపడ్డాడో నేను రాముడి త్యాగానికి అంతగానూ గర్వపడ్డాను.”

“కాని రాముడు రాజ్యాన్ని తన తమ్ములకు వదిలి సీతతో అడవులకు వెళ్ళి ఉండవచ్చు కదా?”

“రాముడు చేసిన మొదటి ఆలోచన అదే! కాని అతని తమ్ములు రాజ్యభారాన్ని వహించడానికి సిద్ధపడలేదు. అరాచకమైన రాజ్యంలో ధర్మం నశిస్తుంది. ప్రజలంతా భ్రష్టుపట్టిపోతారు. ఇద్దరు వ్యక్తుల సుఖంకోసం సమాజాన్ని బలి పెట్టడం సరి కాదనుకున్నాడు రాముడు. తన అర్థాంగిని – తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. సీత అడవిలో ఉంది. రాముడు రాజభవనంలో ఉన్నాడు. కాని సీత లేని ఇంద్రభవనం కూడా రాముడికి అంధకార కూపమే. సీతకూ అంతే! రాముడు లేనిది ఏ చోటైనా ఆమెకు ఒకటే! అయితే నువ్వు చేసినట్లే రాముడు కూడా సీతతో చెప్పి పంపాల్సింది. ఆమె ఆనందంగా ఒప్పుకునేది. కాని దారుణ నరకబాధను అనుభవించడానికి సిద్ధపడ్డ రాముడు తను ప్రాణంగా ప్రేమిస్తున్న భార్యను పిలిచి, ‘నిన్ను విడిచిపెడుతున్నాను’ అని చెప్పే ధైర్యం చేయలేకపోయాడు”

“హ్మ్!…..”

“మరి నేను వెళ్ళనా?”

“ఉండుండు! మరొక్క ప్రశ్న! పూజలూ, వ్రతాలు, ఉపవాసాలు చేసి నిరంతరం నిన్ను ప్రార్థిస్తూ ఉంటారు కొందరు. అసలు నువ్వున్నావో లేవో అని డోలాయమానంలో ఉండేవారు ఇంకొందరు. నిన్నస్సలు పట్టించుకోని వారు మరికొందరు.  వీరందరిపట్ల నీ దృక్పథం ఎలా ఉంటుంది?”

“మీ నమ్మకమే నా ఊపిరి. నమ్మినవారికి ఉన్నాను. నమ్మని వారికి లేను. అందరూ నాకు సమానులే!”

“అసలిదంతా..మన మధ్య జరుగుతున్న ఈ సంభాషణంతా నిజమా? నా భ్రమా?”

“యద్భావం తద్భవతి! నువ్వు నమ్మినదే నిజం!”

“కానీ..”

“చెప్పవలసిందంతా చెప్పాను. ఇక నీ మెదడుకు పదును పెట్టి ప్రశ్నలకు జవాబులు అన్వేషించవలసింది నీవే. ఇక వెళ్ళొస్తా! మరొక భక్తుడికి నాతో పని పడింది”

*

మీ మాటలు

 1. చందు - తులసి says:

  హరిత గారూ….ముందుగా మీకు అభినందనలు..
  సాంకేతిక విద్యలో పట్టభద్రులై ఉండి తెలుగు సాహిత్యంపై ఆసక్తితో…ఇటువైపు రావడం సాహసమే.. అభినందనీయం. మీ నుంచి మరిన్ని
  మంచి కథలు రావాలి

 2. తహిరో says:

  కేవలం సంభాషణలతో కథ రాయడం, రాసినా “రక్తి” కట్టించడం అంత “వీజీ ” కాదు – ఏ శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి వంటి వారికో పట్టుబడిన విద్య . మీరు “తర్కాన్ని” వస్తువుగా ఎంచుకుని అవలీలగా రాసి అవతల పడేశారు – సూక్ష్మమ్ లో మోక్షం అంటె ఇదేనేమో ! మీ వచనంలో మంచి “ఫ్లో ” ఉంది – అభినందనలు .

 3. When a story is told in first person, it is important to establish the gender of the narrator as early as possible. Otherwise, readers are likely to assume its the same gender as that of the writer. I certainly did so, while reading this story. Result? I got a jolt when I read the protagonist (whom I assumed to be a girl) loved another girl and wanted to marry her! Its only later that the narrator’s gender got revealed.

  Story as a whole is flat and boring. Sorry to say this – but you cant put your raw opinions on a piece of paper, format them to look like a conversation and call it a story. There’s more to a story than just a discussion.

  • తహిరో says:

   అనిల్ గారూ మీరన్నది నిజమే. ఉత్తమ పురుషలో కథ చెప్పినప్పుడు ప్రారంభం లోనే “జెండర్” క్లియర్ గా ఉండాలి . లేదంటే మీరన్నట్టు పాఠకుడు చెప్పేది ఆ కథా రచయిత “జెండరే” అనుకునే ప్రమాదం ఉంది. ఈ కథ మధ్యలోకి వచ్చాక (అన్నా చెల్లెళ్ళ ప్రస్తావన తో ) కాని చెప్పేది “పురుషుడు ” అని తెలియదు.
   ఒకవేళ “థర్డ్ జెండర్” పాత్రను ఉత్తమ పురుషలో చెప్పాల్సి వచ్చిందనుకోండి – అప్పుడు దా రొంబ ప్రమాదము దానే !
   నాకు భీ జెర డౌట్ వచ్చింది – ఉపాస్యను చేసుకోవడం ఏమిటా అని – ఇద్దరూ అమ్మాయిలే కదా అని – “బాధ్యత కల అన్నగా నీ కర్తవ్యాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించావు” అన్న మాట చదివిన తర్వాత గానీ క్లారిటీ రాలేదు .

  • vidyasagar says:

   i also feel the same. a good analysis and good suggestion

 4. ari sitaramayya says:

  హరిత గారూ, “మీ వచనంలో మంచి “ఫ్లో ” ఉంది” అన్న తహిరో గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. మీరు మంచి కథలు రాయగలరు.

  బుర్ర రాసేవి వ్యాసాలు; కథల ముసుగులో వ్యాసాలు. హృదయం రాసేవి కథలు. ఈ సారి కథ రాయాలనుకున్నప్పుడు ఇది జ్ఞానోపదేశం చెయ్యటానికి రాస్తున్నానా లేక హృదయ భారం పంచుకోవటానికి రాస్తున్నానా అని మిమ్మల్ని మీరే అడగండి. సమాధానం మొదటిదయితే శుభ్రంగా వ్యాసం రాయండి. రెండోదయితే దాన్ని కథ అనండి.

  ఏది రాసినా మీరు బాగా రాయగలరు.

 5. మీ ప్రోత్సాహానికి, సూచనలకు ధన్యవాదాలు. నేను మళ్ళీ ఏదైనా రాయడానికి ప్రయత్నించినప్పుడు ఈ మాటలను గుర్తు పెట్టుకుంటాను.

 6. కథ బావుంది. ఏండీ వెయిర్ రాసిన ది ఎగ్ కథని గుర్తుకు తెచ్చింది.

మీ మాటలు

*