పారిస్ పై ద్వేష గీతం

 

 

 

-దేశరాజు

~

దేశరాజు

“To forgive the terrorists is up to God

but to send them to him is up to me”

-Vladimir Putin, President of Russia

 

వాడికి కాస్త అర్థమయ్యేట్టు చెప్పండి,

వాళ్లు దేవుడ్ని వెతుక్కుంటూనే అక్కడకు వచ్చారని.

ప్రపంచ పౌరులారా, రండి

ఇప్పుడు మనం దేవుడ్ని ద్వేషిస్తూ ప్రార్థన చేద్దాం

***

ప్రేమ నగరమే కావచ్చుగానీ,

ద్వేషం మరకపడిన పారిస్ నిప్పుడు ముద్దాడలేను-

ఎక్కడెక్కడో నాటిన ద్వేషాన్ని దాచిపెట్టడానికేనంటూ..

పారిస్ పొడుపు కథను విప్పేశాక ఫ్లయింగ్ కిస్ అయినా ఇవ్వలేను-

 

రండి మిత్రులారా, ఇప్పటికైనా మనల్ని మనం క్షమించుకుందాం

పారిస్ పై పడిన నెత్తుటి మరకలో మనవంతు మాలిన్యాన్ని కడిగేసుకుందాం-

మనందరికీ తెలియని బహిరంగ రహస్యాన్ని..

గుసగుసగానైనా ఒప్పుకుందాం-

 

రాక్ బ్యాండ్లూ, ఫుట్ బాల్ మ్యాచ్ లతో ఉల్లాసంగా గడిపే..

అనేకానేక రాత్రుల్లో, కేవలం ఒకేఒక్క రాత్రి మాత్రమే కాళరాత్రి-

ఇక అప్పటి నుంచీ వెంటాడేవన్నీ పీడకలలు కాదు..

పీడకుల కలలని మరొక్కసారైనా, నిజాయితీగా ఒప్పుకుందాం-

 

సిరియాతో చేదు మింగించి, అనుభవాలన్నిటినీ ఆవిరిజేసి..

ఉల్లాసమనే మాటను వారి భాషలోంచే తుడిచేస్తున్న..

అగ్ర నేతల అతి తెలివిని ఫేక్ ఐడీతోనైనా ట్వీట్ చేద్దాం-

 

రివల్యూషన్ రెక్కలు విరిచేసి నిశ్శబ్ధంగా ఎగురుకుంటూపోయిన..

లోహవిహంగాలు కురిపించిన బాంబుల

భయంకర ధ్వనులు విందాం-

ఈ తుపాకుల చప్పుళ్లు వాటి ప్రతిధ్వనులేనని చాటిచెబుదాం.

 

రంగురంగుల అందంలేకపోయినా,

ఎవడి చెమటతో పెట్టుకున్న పుట్ట-వాడికొక ఈఫిల్ టవర్ కదా

వారి పుట్టల గుండెల్లో హలెండే వేలుపెట్టినప్పుడు,

పెల్లుబికిన హాహాకారాలను కూడా ఒకింత ఆలకిద్దాం-

 

దిక్కులు ధ్వంసించబడిన దేశాలను,

మృతదేహాల దిబ్బలైన ఊళ్లను చూసి కూడా..

మారని మన ప్రొఫైల్ పిక్ ను తలచుకుని కాసింత సిగ్గుపడదాం-

***

ప్రపంచ మిత్రులారా, రండి

ఎన్నాళ్లగానో దాచిపెట్టబడుతున్న

చెమట, నెత్తురు, కన్నీళ్లను పుక్కిలించి ఉమ్మేద్దాం,

పారిస్ నే కాదు, కొందరి స్వప్నాలకే సాక్ష్యాలుగా నిలిచే..

మహా నగరాలను మనమే కూల్చేద్దాం-

ఫ్లయింగ్ కిస్ లకు బాయ్ చెప్పి ఓ ఫ్రెంచ్ కిస్సిద్దాం.

-దేశరాజు

మీ మాటలు

  1. Aranya Krishna says:

    దేశరాజూ ! చాలా బాగుంది కవిత. మంచి కసితో, ఆవేదనతో రాసావు. కనీసం గుసగుసగానైనా నిజాలు ఒప్పుకునే నిజాయితీ ప్రపంచ పౌరులందరికీ కలగాలని ఆశిద్దాం.

  2. రివల్యూషన్ రెక్కలు విరిచేసి నిశ్శబ్ధంగా ఎగురుకుంటూపోయిన..

    లోహవిహంగాలు కురిపించిన బాంబుల

    భయంకర ధ్వనులు విందాం-

    ఈ తుపాకుల చప్పుళ్లు వాటి ప్రతిధ్వనులేనని చాటిచెబుదాం.

    పచ్చి నిజాన్ని ఇలా మీరు ఈ కవితలో చెప్పడం చాలా నచ్చింది. నిజాల్ని నిర్భయంగా ఒప్పుకునే మనసు కావాలి. థాంక్ యు సర్

  3. రంగురంగుల అందంలేకపోయినా,

    ఎవడి చెమటతో పెట్టుకున్న పుట్ట-వాడికొక ఈఫిల్ టవర్ కదా

    వారి పుట్టల గుండెల్లో హలెండే వేలుపెట్టినప్పుడు,

    పెల్లుబికిన హాహాకారాలను కూడా ఒకింత ఆలకిద్దాం-

    — బావుంది , ప్రొఫైల్ పిక్ మారకపోయినా పర్వాలేదు.. మనిషి ఆలోచనల్లో వచ్చిన పర్వాలేని తనం సిగ్గు లేనిది

  4. బ్రెయిన్ డెడ్ says:

    కవితలు అందంగా ఉండాలి బాధ వెళ్లబుచ్చాలి ఇలా కాకుండా సాఫ్ట్ టోన్ లో నిజాలు రాయొచ్చు అని ప్రూవ్ చేసారు . కుడోస్

  5. dasaraju ramarao says:

    ప్రేమ నగరమే కావచ్చుగానీ,

    ద్వేషం మరకపడిన పారిస్ నిప్పుడు ముద్దాడలేను-

    నిక్కచ్చి కవితనం దేశరాజు ది…. అభినందన

  6. విలాసాగరం రవీందర్ says:

    నిజాన్ని ఒప్పకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. అది మీ కవిత లో కనిపిస్తుంది. మంచి కవిత దాశరాజు గారు.

  7. Poem is so good. Great craftsmanship. But personally I felt inadequate to appreciate the truth in it. Is it really my personal problem? Is the confusion really personal to me? Don’t know.

Leave a Reply to dasaraju ramarao Cancel reply

*