ఆమె లాంటి ఒకరు …యింకొకరు

 

అరుణ్ బ‌వేరా
…………………
గడ్డి పరకల మీద
పాదాల అలికిడికి తలలత్తే పుష్పాలకు మల్లే
ఆకు ఆకునా విచ్చుకున్న చూపులతో …
ఆమె
ఆమె లాంటి ఈమె
ఈమె లాంటి మరొకరు యింకొకరు
నీ ఆకలిగా,దాహంగా
నీ సోమరి కళ్ల వెనుక దాగిన మైకంగా
అలసి, మురిసే లోగా
నువ్వొస్తావు
నువ్వే వస్తావు …
పారిజాతం కోసుకువెళ్లిపోయే స్వేచ్ఛగా వస్తావు
రాత్రి నదిలో ఈదినన్నిసార్లూ వచ్చే అలసటగా ,
ఒక ఆఖరి ప్రయత్నం లాంటి కోరికేదో నీలో  తమకంగా తెల్లారుతుంది.
దేహం మీద సుఖమైన ద్రోహమేదో సాగిపోతుంది
బహుశా, చెక్కిలి మీద నుంచి నీటి చుక్క రాలినంత పొడిగా ..

 

నమ్మకంగా లేచి వెళ్లిపోయే ముగింపులో,
తడిసిన రెక్కలారబెట్టుకుని ఎగిరిపోవడమెల్లాగో తెలిసిపోతుంది.
యిక-ఏ కలా నిన్ను వెంటాడదు
ఏ కాటుకా నిన్ను అంటుకోదు.
వేళ్ల సందుల్లోంచి యిసుక జారినంత సులభంగా జారిపోవచ్చు.
నీ తలపుల్లో తెల్లవార్లూ తలుపులు తెరచుకునే
ఆమె
ఆమె లాంటి ఈమె
ఈమె లాంటి మరొకరు  యింకొకరు
కాలమంతా నిన్ను శూన్య హస్తాల్లో మోసుకు తిరుగుతారు.
మంచులా గడ్డకట్టుకున్న మౌనమేదో నీ చుట్టూ కంచె కడుతుంది.
నీ రసోద్రేక ప్రపంచం రోజుకో రంగు మారుస్తుంది.
నువ్వు మాట్లాడవు –
నువ్వు మాట్లాడని జీవితంలో  రోజుకో  మోసం  పడగ విప్పుతుంది.
కానీ,అప్పుడప్పుడు –
నేను మాట్లాడతాను
నీ నాటకీయమైన ప్రేమలో గాయపడ్డ తారకను పోలిన కంఠధ్వనితో -నేను మాట్లాడతాను
నేను మాత్రమే మాట్లాడతాను.
*

మీ మాటలు

  1. అబ్బ ! ఎంత బాగుంది కవిత! Chadavagane ఇలాగె అనాలనిపించింది .excellent poem

  2. బ్రెయిన్ డెడ్ says:

    కొంచం ప్రేమ కవితలంటే బాబోయి అనుకొనే వాళ్ళ చేత కూడా భలే ఉంది అనిపించారు .. ఈ లైన్స్ అయితే మళ్ళీ చదవాల్సిన లైన్స్ ” పారిజాతం కోసుకువెళ్లిపోయే స్వేచ్ఛగా వస్తావు
    రాత్రి నదిలో ఈదినన్నిసార్లూ వచ్చే అలసటగా ,
    ఒక ఆఖరి ప్రయత్నం లాంటి కోరికేదో నీలో తమకంగా తెల్లారుతుంది.
    దేహం మీద సుఖమైన ద్రోహమేదో సాగిపోతుంది
    బహుశా, చెక్కిలి మీద నుంచి నీటి చుక్క రాలినంత పొడిగా ..”

  3. చాలా కొత్తగా వుంది.. మనసుకు హత్తుకుంది సర్..

Leave a Reply to కెక్యూబ్ వర్మ Cancel reply

*