సంభాషణల్లోంచి కథనం!

 

~

ఒక చిన్న ఊహని తీసుకుని కేవలం సంభాషణల ఊతంతో గొప్ప కథగా ఎలా మలచవచ్చో చూపిన కథ ‘బ్రహ్మాండం’.

ఈ కథ రాసింది ఆండీ వెయిర్ (Andy Weir). ఆ పేరు చెబితే వెంటనే అందరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ, ఇటీవలే విడుదలై విజయాన్నందుకున్న హాలీవుడ్ సినిమా ‘ది మార్షియన్’కి ఆధారమైన, అదే పేరుతో వచ్చిన నవలా రచయిత అంటే చాలామందికి తెలియవచ్చు. అంతగా గుర్తింపులేని కాలంలో అతను రాసిన ‘The Egg’ అనే కథకి అనువాదం ఈ ‘బ్రహ్మాండం’.

andy

ఈ కథలో వర్ణనల్లేవు, అనవసరమైన వివరాల్లేవు, ఎక్కువ పాత్రల్లేవు, ఉన్న రెండు పాత్రలకీ పేర్లు లేవు, ఆ పాత్రల హావభావ వివరణా విన్యాసాల్లేవు, వాతావరణ నివేదికల్లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే – చిట్టి కథకి అనవసరమైనవేవీ ఇందులో లేవు. అత్యవసరమైనదొకటి మాత్రం దండిగా ఉంది: క్లుప్తత. ఇంకా, చెప్పదలచుకున్న విషయమ్మీద గొప్ప స్పష్టత. దాన్ని సూటిగా చెప్పిన పద్ధతి. ఆ రెంటికీ అతి సరళమైన వచనంతో వడివడిగా సాగే కథనం జోడై అక్షరాల వెంట పాఠకుల కళ్లు పరుగులు తీసేలా చేస్తుంది.

‘బ్రహ్మాండం’లో ఎస్టాబ్లిష్‌మెంట్ గట్రా శషభిషలేవీ పెట్టుకోకుండా రచయిత ఎకాయెకీ కథలోకి దూకేస్తాడు. ఎత్తుగడలోనే ఉత్సుకత రేపెడతాడు. ఉత్కంఠభరితంగా కాకపోయినా, చివరికేమౌతుందోననో ఆసక్తి ఆఖరిదాకా నిలుపుతూ కథని ముగిస్తాడు. ‘మీ దృష్టిలో మంచి కథ ఏది’ అని ఆ మధ్య వేంపల్లి షరీఫ్ అడిగితే, ‘చదివించగలిగేది ఏదైనా మంచి కథే’ అన్నాను. అలా చదివించాలంటే దానిలో ఉన్న ‘విషయమే’ కాక దాని నిర్మాణ చాతుర్యమూ ఆకట్టుకోవాలి. అలాంటి చాతుర్యంతో రాయబడ్డ కథ ఇది. చదవండి.

అన్నట్లు – ఈ కథలో ఓ ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా కథలు ఉత్తమ పురుష (first person) లేదా ప్రధమ పురుష (third person) దృక్కోణంలో సాగుతాయి. అత్యంత అరుదుగా మాత్రమే మధ్యమ పురుష (second person) దృక్కోణంలో రాయబడ్డ కథలు కనిపిస్తుంటాయి. ఈ కథ ఆ అరుదైన దృక్కోణంలో రాయబడింది. ఈ కథకి అదే సరైన విధానమని మీరే ఒప్పుకుంటారు, చూడండి.

ఈ అనువాదంలోనూ ఓ చిన్న విశేషముంది: ఆంగ్ల మూలకథని ఒక్క ఆంగ్ల పదమూ దొర్లకుండా తెనిగించటం.

*

 

 

andy1బ్రహ్మాండం

(Andy Weir ఆంగ్ల కథ  ‘The Egg’ కి మూల కథకుడి అనుమతితో తెలుగుసేత )

~

నువ్వు ఇంటికి వెళుతుండగా జరిగిందది.

రహదారి ప్రమాదం.

అందులో పెద్ద విశేషమేమీ లేదు – నువ్వు చనిపోవటం తప్ప.

పెద్దగా బాధపడకుండానే పోయావు. ఒక భార్యని, ఇద్దరు పిల్లల్నీ వదిలేసి వచ్చేశావు. నిన్ను కాపాట్టానికి వైద్యులు శక్తికొద్దీ ప్రయత్నించారు. కానీ నీ శరీరం ఎంతగా నుజ్జైపోయిందంటే – నువ్వు బతికుండటం కన్నా ఇదే మెరుగంటే నమ్ము.

అలా కలిశావు నువ్వు నన్ను. అదే మొదటిసారి కాదనుకో. కానీ ఆ సంగతి అప్పటికి నీకింకా తెలీదు.

“ఏం జరిగింది?”. నీ తొలి ప్రశ్న. “ఎక్కడున్నా నేను?”. రెండోది.

“చచ్చిపోయావు,” వెంటనే చెప్పేశాను. నాన్చుడు నాకు తెలీదు.

“పెద్ద వాహనమేదో వచ్చి నన్ను ఢీకొంది …”

“అవును”

“నేను … పోయానా!?!”

“అవును. అందులో బాధపడాల్సిందేమీ లేదు. అందరూ పోయేవాళ్లే ఏదో నాటికి”

నువ్వు చుట్టూ చూశావు. ఏమీ లేదక్కడ. ఉంది మనమిద్దరమే.

“ఎక్కడున్నాం మనం? పరలోకమా?” అన్నావు.

“అలాంటిదే”

“నువ్వు … దేవుడివా?”

“అలా కూడా పిలవొచ్చు”

“నా భార్య, పిల్లలు …” అంటూ ఆగిపోయావు.

ప్రశ్నార్ధకంగా చూశాను.

“వాళ్లకేమవుతుందిప్పుడు?” అన్నావు.

“ఏమో, చూద్దాం”, అన్నాను. “నీ విషయానికొస్తే – చనిపోయిన వెంటనే వాళ్లని తలచుకుని బాధపడుతున్నావు. మంచి గుణమే”

అప్పటికి కాస్త తేరుకున్నావు. నన్ను తేరిపారా చూశావు. నీకు నేనో దేవుడిలా కనబడలేదు. ఓ సాధారణ మానవ రూపంలో కనబడ్డాను. అది పురుషుడో లేక స్త్రీనో కూడా తేల్చుకోలేకపోయావు.

“బాధ పడొద్దు,” నేను కొనసాగించాను. “నీ పిల్లలు నిన్నెప్పటికీ ఓ మంచి తండ్రిగా గుర్తుంచుకుంటారు. వాళ్లకంటూ వ్యక్తిత్వాలు, ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు ఏర్పడకముందే పోవటం నీ అదృష్టం. ఇక నీ భార్య – లోకం కోసం ఏడ్చినా లోలోపల నీ పీడ వదిలిందనుకుంటోంది. మీ మధ్యన అంత గొప్ప అనుబంధమేమీ లేదు కదా”

“ఓహ్,” అన్నావు నువ్వు ఆశ్చర్యపోతున్నట్లు. వెంటనే సర్దుకున్నావు. “అయితే, ఇప్పుడేమవుతుంది? నేను స్వర్గానికో, నరకానికో పోతానా?”

“లేదు. మళ్లీ పుడతావు”

“ఓహ్,” మళ్లీ ఆశ్చర్యపోయావు. “అంటే, హిందువులు చెప్పేది నిజమేనన్న మాట!”

“అన్ని మతాలు చెప్పేదీ నిజమే,” అంటూ నడక ప్రారంభించాను. నువ్వు అనుసరించావు, “ఎక్కడికి?” అంటూ.

“ఎక్కడకూ లేదు. మనమున్న ఈ చోట ఎంత నడచినా ఎక్కడకూ వెళ్లం”

“మరి నడవటం ఎందుకు?”

“ఊరికే. నడుస్తూ మాట్లాడుకోటం బాగుంటుంది కాబట్టి”

కాసేపు మౌనంగా నన్ను అనుసరించాక నోరు విప్పావు.

“మళ్లీ పుట్టటం వల్ల ప్రయోజనమేంటి? ఈ జన్మలో నేను నేర్చుకున్నదంతా వదిలేసి మళ్లీ కొత్తగా మొదలెట్టటం … అంత అర్ధవంతంగా లేదు”

“లేదు. నీ గత జన్మల జ్ఞానం ప్రతి జన్మలోనూ నీ తోడుంటుంది. ప్రస్తుతానికి అదంతా నీకు గుర్తు లేదంతే,” అంటూ ఆగాను. నువ్వు కూడా ఆగిపోయావు.

నీకేసి తిరిగి, నీ భుజాలు పట్టుకుని కుదుపుతూ కొనసాగించాను. “ప్రస్తుత జన్మలో నలభయ్యేళ్లే నువ్వు మానవ రూపంలో ఉన్నావు. గత జన్మల సారాన్నంతటినీ అనుభూతించేంత సమయం నీకు దొరకలేదు, అంతటి వివేకం నీకింకా కలగలేదు”

నా మాటలు అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తూ కాసేపు నిశ్చలంగా ఉండిపోయావు. తర్వాత అడిగావు.

“నాకెన్ని గత జన్మలున్నాయి?”

“లెక్కలేనన్ని. ఒక్కో సారీ ఒక్కో రకం జీవితం”

“రాబోయే జన్మలో నేనెవర్ని?”

“క్రీ. శ. 540, చైనా దేశంలో ఒక గ్రామీణ పడుచువు”

“ఏమిటీ!” అంటూ నిర్ఘాంతపోయావు. “కాలంలో వెనక్కి పంపుతున్నావా నన్ను??”

“సాంకేతికంగా చెప్పాలంటే అంతే. ఈ ‘కాలం’ అనేది నువ్వెరిగిన విశ్వానికి మాత్రమే వర్తించే లక్షణం. నేనొచ్చిన విశ్వంలో విషయాలు వేరుగా ఉంటాయి”

“ఎక్కడ నుండొచ్చావు నువ్వు?” అడిగావు.

“ఎక్కడ నుండో. నాలాంటి వాళ్లు మరిందరూ ఉన్నారు. వాళ్లూ ఎక్కడెక్కడ నుండో వచ్చారు. నీకా విషయాలన్నీ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. అవన్నీ నీకర్ధమయ్యేవి కాదు కాబట్టి వాటినలా వదిలేద్దాం”

“ఓహ్,” నిరాశగా నిట్టూర్చావు. అంతలోనే నీకో అనుమానమొచ్చింది. “అవునూ, నేనిలా కాలంలో ముందుకీ వెనక్కీ గెంతుతూ పునర్జన్మలెత్తుతుంటే ఎప్పుడో ఓ సారి నా అవతారాలు ఒకదానికొకటి ఎదురుపడవా?”

“అది తరచూ జరిగేదే. నీ అవతారాలు తన ప్రస్తుత జన్మని మాత్రమే గుర్తుంచుకుంటాయి కాబట్టి ఒకదాన్నొకటి గుర్తుపట్టవు”

“ఇదంతా దేనికోసం?”

“నువ్వు ఎదగటం కోసం. నీ ప్రతి జన్మ పరమార్ధమూ నువ్వు గత జన్మలోకంటే కొంత మెరుగుపడటం. అంతే. అందుకోసం ఓ విశ్వాన్నే సృష్టించాను – నీ ఒక్కడి కోసం”

“నా ఒక్కడి కోసం!?! మరి, మిగతా వాళ్ల సంగతేంటి?”

“మిగతా వాళ్లంటూ ఎవరూ లేరు. ఈ విశ్వం మొత్తానికీ ఉన్నది నువ్వొక్కడివి, నీకు తోడుగా నేను”

నువ్వు భావరహితంగా నాకేసి చూశావు. “మరి, భూమ్మీది ప్రజలందరూ …”

“వాళ్లంతా నీ వేర్వేరు అవతారాలే”

“ఏంటీ!! అందరూ నేనేనా?”

“అవును. ఇప్పటికి తత్వం బోధపడింది నీకు,” అన్నా నేను అభినందనపూర్వకంగా నీ వీపు తడుతూ.

“భూమ్మీద పుట్టిన, గిట్టిన ప్రతి మనిషీ నేనేనా?”

“పుట్టబోయే ప్రతి మనిషి కూడా నువ్వే”

“మహాత్మా గాంధీని కూడా నేనే?”

“నాధూరామ్ గాడ్సేవీ నువ్వే”

“అడాల్స్ హిట్లర్‌ని నేనే?”

“అతను ఉసురు తీసిన లక్షలాది మందివీ నువ్వే”

“ఏసు క్రీస్తుని నేనే?”

“క్రీస్తుని నమ్మిన కోట్లాది భక్తులూ నువ్వే”

నువ్వు మ్రాన్పడిపోయావు.

నేను చెప్పటం ప్రారంభించాను. “నువ్వొకరిని బాధ పెట్టిన ప్రతిసారీ నువ్వే బాధ పడ్డావు. నువ్వు పెట్టిన హింసకి నువ్వే బలయ్యావు. నువ్వు చూపిన కరుణ నీ మీదనే కురిసింది. ఆయుధం నువ్వే, దాని లక్ష్యమూ నువ్వే. కర్తవి నువ్వే. కర్మవీ నువ్వే”

నువ్వు దీర్ఘాలోచనా నిమగ్నుడివయ్యావు. అందులోనుండి బయటపడ్డాక అడిగావు.

“ఎందుకిందంతా చేస్తున్నావు?”

“ఏదో ఒక రోజు నువ్వు నాలా మారతావు కాబట్టి; నువ్వు నా బిడ్డవి కాబట్టి”

“అంటే … నేను … దేవుడినా??”

“అప్పుడేనా? ప్రస్తుతానికి నువ్వింకా పిండం దశలోనే ఉన్నావు. మెల్లిగా ఎదుగుతున్నావు. సర్వకాలాల్లోనూ వ్యాపించిన మానవ జన్మలన్నిట్నీ సంపూర్ణంగా అనుభవించాక, మనిషిగా పరిపూర్ణుడివయ్యాక, అప్పటికి – నువ్వు నీ అసలు అవతారమెత్తటానికి సిద్ధమౌతావు”

“అంటే – ఈ విశ్వమంతా ఒక పెద్ద అండం! ”

“ఉత్తి అండం కాదు. బ్రహ్మాండం. అది బద్దలవటానికింకా చాలా సమయముంది,” అని నీ భుజం తట్టి చెప్పాను.  “ప్రస్తుతం నీ మరు జన్మకి సమయమయ్యింది”.

ఆ తర్వాత నిన్ను పంపించేశాను.

 

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. వావ్! ఎంత బాగుందో.
  మొత్తం spiritual ఫిలాసఫీ అంత ఒక్క చిన్న కధలో ఎంత సిమ్పల్గా చెప్పారు .
  Where can I get the English version, please.

  Thanks

 2. @ సురభి

  Here you go:

  http://www.galactanet.com/oneoff/theegg_mod.html

 3. దారిలో వెళ్తూ అదాటుగా చూశాను ఈ కథని. మీ తరహా కథలు, ఈ తరహా కథలు భలే బాగుంటాయి, మరేం బయం లేదురా పిల్లాడా అన్నట్టు. ఔనూ, ఎగ్ కు అండం అని తెలుగు, బ్రహ్మాండం కు ఇంగ్లీషు ఏముండె, అలా ప్రాస కుదిరే మాట? :-)

  • Anil S. Royal says:

   బ్రహ్మాండం అంటే విశ్వం అనే అర్ధం కూడా ఉంది కదా. అలా వాడాను.

 4. ఔను, ఊహించాను. ఇంగ్లీషులో అలా ప్రాస కుదిరే మాట ఇంకోటి ఏమైనా ఉందేమో అని అడిగాను. :-) థాంక్యూ.

 5. Vijaya Karra says:

  ఇంటరెస్టింగ్ స్టోరీ! మరింక చక్కని అనువాదం. ఇలాగే విభిన్న కథలు ఎంచుకుని మరింక కధన కుతూహలాన్ని కొనసాగించండి.

 6. గొరుసు says:

  ఓహ్ … గుడ్డు బద్దలు కొట్టి ” బ్రంహాండం” చూపించారు. వెంట వెంటనే రెండు మూడు సార్లు చదివాను ( అర్థం కాక కాదు – కావాలనే ). చదివిన ప్రతిసారీ నాలోకి నేను పయనిస్తూ … గ్రేట్ అనిల్ గారూ !
  ……………………………………………..
  అన్నట్టు తెలుగులో కూడా మధ్యమ పురుషలో కథలు ఉన్నాయి.
  ఉదా : ఖండిత (వి. ప్రతిమ ), అమ్మా ఇంక సెలవు ( ఆర్.వసుంధరా దేవి ), తిర్యగ్రేఖ (ఆడెపు లక్ష్మీపతి)

 7. చందు - తులసి says:

  అనిల్ గారు కథ చాలా బావుంది. మామూలుగా
  మీ కథల్లో భిన్నత్వం చదివించేలా చేస్తుంది.
  ఇది అనువాదమే ఐనా…మీ మార్కు ఉంది. ముఖ్యంగా శైలి పరంగా…
  ఇలాంటి మంచి…లేదా శైలికి సంబంధించి అవగాహన పెంచేవి మాకు మరిన్ని అందించాలి.
  కొత్త రచయితలకూ ఉపయోగకరం.
  ………..
  కథల సమాచారం ఇచ్చిన గొరుసు గారికీ ధన్యవాదాలు…

 8. బావుంది… అబ్బా, ఇంత సంభాషణ జరిగాక కూడా ‘నిన్ను పంపించేశాను’ అనడం నిరాశ కలిగించింది ముందే ‘నువ్వింకా పిండం దశలో ఉన్నావు’ అని చెప్పినా…

 9. “మిగతా వాళ్లంటూ ఎవరూ లేరు. ఈ విశ్వం మొత్తానికీ ఉన్నది నువ్వొక్కడివి, నీకు తోడుగా నేను
  “భూమ్మీద పుట్టిన, గిట్టిన ప్రతి మనిషీ నేనేనా?”
  “పుట్టబోయే ప్రతి మనిషి కూడా నువ్వే”

  లోతైన తత్వం.. చాలా బాగా రాశారు అనిల్ గారూ..!

 10. Jayashree Naidu says:

  సింపుల్గా మంచి కుతూహలమ్ గా సాగింది కథా… అనిల్ గారు చక్కటి అనువాదం ఇచ్చారు మీరు.

 11. KiranKumar Satyavolu says:

  కధ నిజంగా “బ్రహ్మాండం”గా ఉందండి. మధ్యమ పురుషలో జరిగిన సంభాషణ తీరు ఆలోచించేలా చేసింది. మంచి కధను అనువదించి అందించిన అనిల్ గారికి అభినందనలు కృతఙ్ఞతలు . :-)

 12. chandra pratap says:

  నైస్ స్టొరీ ..

 13. Dr బొమ్మదేవర నాగ కుమారి says:

  ఈ మధ్యనే నేను M A ( Vedic Astrology ) చేసాను. జన్మలు,పునర్జన్మలు , పూర్వ జన్మ వాసనలు…వీటన్నిటితో పాటు కర్మ సిద్ధాంతం వివిరంగా చదవటం జరిగింది…. ఎన్నెన్నో ప్రశ్నలు … సమాధానాలు….ఇంకొన్ని కొత్త సందేహాలు… కానీ ఒక ఆంగ్ల రచయిత ఇంత సింపుల్ గా ఎన్నెన్నోప్రశ్నలకు సూటిగా సమాధానంగా రాసాడంటే… just awesome ! ఏయే జన్మల శోధనా ఫలితమో ?? ఎన్నెన్ని జన్మల తపస్సో… You done a great job ! Good !.

 14. P.Jayaprakasa Raju. says:

  నువ్వొకరిని బాధ పెట్టిన ప్రతిసారీ నువ్వే బాధ పడ్డావు. నువ్వు పెట్టిన హింసకి నువ్వే బలయ్యావు. నువ్వు చూపిన కరుణ నీ మీదనే కురిసింది. ఆయుధం నువ్వే, దాని లక్ష్యమూ నువ్వే. కర్తవి నువ్వే. కర్మవీ నువ్వే”

 15. Sai Brahmanandam Gorti says:

  ఈ కథకి ఆయువు పట్టయిన విషయం దగ్గరే అనువాదం తేలిపోయింది.

  “Every time you victimized someone,” I said, “you were victimizing yourself. Every act of kindness you’ve done, you’ve done to yourself. Every happy and sad moment ever experienced by any human was, or will be, experienced by you.”
  You thought for a long time.

  “నువ్వొకరిని బాధ పెట్టిన ప్రతిసారీ నువ్వే బాధ పడ్డావు. నువ్వు పెట్టిన హింసకి నువ్వే బలయ్యావు. నువ్వు చూపిన కరుణ నీ మీదనే కురిసింది. ఆయుధం నువ్వే, దాని లక్ష్యమూ నువ్వే. కర్తవి నువ్వే. కర్మవీ నువ్వే”

  ఇంకొంచెం శ్రద్ధ పెడితే బావుండేది.

 16. వెంకట్ కొండపల్లి says:

  మధ్యమ పురుష దృక్కోణంలో వ్రాసిన కథను ఇదే మొదటి సారి చదవటం. చక్కటి కథను అనువదించి మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు,

 17. Brilliant!

 18. Kuppili Padma says:

  అనిల్ గారు, కథని చక్కగా అనువదించారు. యీ యింగ్లీష్ పదాలు లేకుండా చేసారు. ( నేను యిలా చెయ్యలేను :) పేరు కూడా బాగుంది. చక్కని పేరు పెట్టారు. యిలాంటి పేరు పెట్టలేను. నే అనువాదం చేస్తే. అన్నింటి కన్నా ముచ్చటేసిన విషయం 2 nd పర్సన్ లో చెప్పటం. యిప్పటి వరకు వొక్క కథ కూడా నేను 2 nd person లో రాయలేదు. నాకు మీ అనువాదం భలే నచ్చింది. Thank you.

 19. కథ, అనువాదమూ ఒకదానికొకటి పూవూ, తావి లాగా అమరినాయి. అసలు ఇంతటి విశాల అంతర్జాలంలో ఇలాంటి విలక్షణమైన కథ ఒకటి ఓ మూల దాగి ఉన్నాడని కనుక్కోవటమే గొప్ప శోధన. ఆ విషయంలో అనిల్ గారి కృషిని వర్ణించటం సాధ్యం కాదు. మీరిచ్చిన లింకు ఆధారంగా ఇంగ్లీషు వెర్షన్ కూడా చదివాను. Many Thanks.

 20. బావుంది. బ్రహ్మాండం చదివాక, పరమార్ధం అనే ఇంకో కథ ఇదే రచయిత రాస్తే చదవాలనిపిస్తోంది!

 21. rani siva sankara sarma says:

  చాలా మంచి కథ . అనువాదం బ్రహ్మాండం. ఈ కత ని అనువాదానికి ఎన్నుకోవడం లో అనిల్ విశాల దృష్టి అర్థం అవుతోంది. అణువులోని బ్రహ్మాండాన్ని. వొకే మనిషిలోనే దాగిన సమస్తమానవ జాతిని, జనన మరణాల నిగూఢతని, కాలంగుర్ంచి విచికిత్సనిఅనవసరమైన వాచ్యతని నివారిస్తూ భావస్ఫోరకంగా వ్యక్తంచేసింది ఈకథ. కథ లోని మార్మికతే దాని ప్రాణం. విశ్వం ముందు తానొక చిన్న పిల్లవాడిలా తచ్చాడుతున్నానని ఈ శైలిలో వినయంగా చెప్పాడు రచయిత

 22. శ్రీనివాసుడు says:

  కథకుడు మధ్యమ పురుషలో కథ చెప్పడానికి కారణం బహుశా మరో దృక్కోణమైన ప్రకృతి గురించి కథకుని తాత్త్విక చింతనకు తెలియకపోవడమేమో??!
  ఉన్నవి – జీవుడు, దేవుడు, ప్రకృతి అనేవి మూడూ అని నాకు అర్థమైన భారతీయ సనాతన ధర్మం.
  ఈ మూడో మితిని తలచకపోవడమే లోపమని నా భావన.
  జీవుడు అనాది, దేవుడు అనాది, ప్రకృతి అనాదియని భగవద్గీతలో స్పష్టంగానే వున్నది.
  విశిష్టాద్వైతం దీన్ని బాగా వివరించిందనుకుంటున్నాను.
  కథకుడు భారతీయ సనాతన తత్త్వాన్ని గురించి అధ్యయనం చేసివున్నట్లయితే ఈ కథ ఇలా వచ్చేది కాదేమో!
  ఎవరిదైన అనుభవం, విషయవాసన, నిబద్ధత, వారిదే.

  శ్రీనివాసుడు.

 23. S.Radhakrishnamoorthy says:

  అనువాదం అనాయాసంగా సాగింది. అందులో రెండో మాట లేదు. కాని దీన్ని కథ అనడం,కథగా కథకులు పాఠకులు మెచ్చుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఉండవలసి వస్తే అది, దీనిని రాసినవాడు భారతీయుడు కాదు. భారతీయసంస్కృతిలోని వాడు కాదు. భారతీయుడు రాసిఉంటే చదవకముందే చాదస్తమని ఛాందసమని ముద్దుపేర్లు పెట్టి తిట్టే వారు. ఇటువంటివి మన పురాణాలలో ‘కథలు’ కావు. కొల్లలు. చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. ఈ కథలో అరగొరగా తెలిసిన భారతీయ వేదధర్మం క్రైస్తవంతో కలిసి కనిపిస్తోంది. నమ్మకం లేనివారికి మంచి ఫిక్షన్. ఉన్నవారికి సైన్స్.

మీ మాటలు

*