తుమ్మపూడి కంటి వెలుగు చంద్రమౌళి

 

                                                                                

-సి.బి. రావు

~

సజ్జనుడు, సాహితీ ప్రియుడైన  చంద్రమౌళి గారు నవంబరు 28, 2015 న మరణించారన్న వార్త  మనసును విచారంతో నింపింది. సంజీవదేవ్ రచనలతో కూడిన కొన్ని చిన్న పుస్తకాలు మిత్రుడు సురేష్ తెనాలి నుంచి తీసుకొచ్చి నా కిచ్చినప్పుడే మొదటగా చంద్రమౌళి గారి పేరు నేను విన్నాను. చంద్రమౌళి గారి ఆర్థిక సహాయంతో  ఆ పుస్తకాలను ప్రచురించారు. సంజీవదేవ్ కుమారుడు  మహేంద్రదేవ్ హైదరాబాదు లోని  Centre for Economic and Social Studies, (CESS), Hyderabad, India, లో 1999 నుంచి మే  2008 వరకు Director గా పనిచేశారు. CESS నుంచి కొత్త ఢిల్లీ కు Chairman, Commission for Agricultural Costs and Prices, Ministry of Agriculture గా బదిలి అయిన సందర్భంలో అమీర్‌పేటలోని CESS కార్యాలయంలో జరిగిన వీడ్కోలు సభలో నేను చంద్రమౌళిగారిని చూడటం, పరస్పర పరిచయం జరిగాయి. అప్పటినుంచి వారు నా మిత్రులయ్యారు.

చంద్రమౌళి గారు Chief Engineer R & B గా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్నారప్పుడు. టెలిఫోన్లో సంజీవదేవ్, సాహిత్య విషయాలు గురించి మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళం. కొన్నిసార్లు వారిని, వారింట చూశాను. పాతతరం రచయితలంటే ఆయనకు మిక్కిలి ప్రేమ ఉండేది. సంజీవదేవ్ రచనలంటే ప్రాణం పెట్టేవారు. వారితో తనకు వ్యక్తిగత పరిచయం లేదని, అంతటి మహావ్యక్తిని తాను కలుసుకోనందుకు మిక్కిలి బాధపడేవారు. సంజీవదేవ్ వియ్యంకుడు ఈయన సహొద్యోగి అయ్యుండీ, సంజీవదేవ్‌ను తన సహొద్యోగి, సంజీవదేవ్ కుమారుడి వివాహం జరిగిన సందర్భంలో పరిచయంచెయ్యలేదని బాధపడుతూ చెప్పేవారు.  

Chandramouligaru rs

చిత్రం: దామరాజు నాగలక్ష్మి గారి సౌజన్యంతో

   సంజీవదేవ్ రచనలు ఎక్కడా లభ్యం కాకపోవటం వీరిని బాధించింది. తనే దేవ్ రచనలు కొన్ని, చిన్ని పొత్తాలుగా ముద్రింపించారు. సంజీవదేవ్ జీవిత చరిత్ర అసలు ప్రతి దొరకక  జీరాక్స్ ప్రతి తెప్పించుకుని చదివి ప్రభావితమయ్యారు. జుజ్జవరపు చంద్రమౌళి గారు  సంజీవదేవ్ స్వీయవాణిని జనం చేత చదివించాలన్నదే తమ అభిమతమని చెప్పి, సంజీవ్‌దేవ్ రచించిన ‘తెగిన జ్ఞాపకాలు’, ‘స్మృతిబింబాలు’, ‘గతంలోకి’ పుస్తకాలను  రాజాచంద్ర ఫౌండేషన్ పేరిట ‘తుమ్మపూడి’  అనే సంకలనంగా తీసుకొచ్చారు. సంజీవదేవ్ స్వీయచరిత్ర అయిన ఈ మూడుభాగాల సంకలనానికి ఆయన స్వస్థలమైన దుగ్గిరాల మండల గ్రామమైన తుమ్మపూడి పేరిట నామకరణం చేశారు. ఏప్రిల్ 4, 2011 న సంజీవదేవ్ నివాసం ‘రసరేఖ’లో సంజీవదేవ్ సతీమణి సులోచన పుస్తకావిష్కరణ చేశారు.

tummapudi_rs (1)

రాజాచంద్ర ఫౌండేషన్ అధ్యక్షుడిగా చంద్రమౌళిగారు తుమ్మపూడి (సంజీవదేవ్), నా స్మృతిపథంలో.. సాగుతున్న యాత్ర (ఆచంట జానకిరాం), రమణీయ భాగవత కథలు (ముళ్ళపూడి వెంకట రమణ), సురపురం (మెడోస్ టైలర్ ఆత్మ కథ), జానకితో జనాంతికం (దువ్వూరి వేంకట రమణ శాస్త్రి), డాక్టర్ యెల్లాప్రగడ సుబ్బారావు (అబ్బూరి ఛాయాదేవి), సంజీవదేవ్ లేఖలు (శ్రీనివాసాచార్య దర్భాశయనం కు వ్రాసినవి), అమ్మకు జేజే నాన్నకు జేజే గురువుకి జేజే, వగైరా పుస్తకాలు ప్రచురించారు.

చంద్రమౌళిగారికి సాహిత్యాభిలాష మెండు. వారి ఇంటిముందు వసారాలో కూర్చుని తనకిష్టమైన పుస్తకాలు చదువుతూ వాటిగురించి మిత్రులతో చర్చించే వారు. అముద్రిత వ్యాసాలను లేక ఆసక్తికరమైన వ్యాసాలను జీరాక్స్ తీసి మిత్రులకు పంపేదాకా ఆయనకు నిద్రపట్టేది కాదు. తనకిష్టమైన పుస్తకాలను రచయితలవద్దనుంచి టోకుగా కొని మిత్రులకు పంచేవారు. ఒకసారి సోమరాజు సుశీలగారి పుస్తకం, మరికొన్ని పుస్తకాలు  నాకు ఇచ్చారు. వారికి కోపం ఎక్కువ. ఒకసారి ఎందుకో నా పై కోపం ప్రదర్శిస్తే కొన్నాళ్ళు వారింటికి నే వెళ్ళలేదు. తనకోపం వలన, నాకు మనస్తాపం కలిగితే, అందుకు విచారం వ్యక్తం చేస్తూ,, పెద్దమనసుతో తనను క్షమించాలని కోరుతూ జాబు వ్రాసారు. ఇది ఆయన సహృదయతకు తార్కాణమై నిలుస్తుంది. కాలపాలన విషయంలో క్రమశిక్షణతో ఉండటం ఆయనకు ఇష్టం. ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకునేవారు.

  నా వియ్యంకుడు సత్యనారాయణగారు (Retired Chief Engineer, R & D) ఆయనకు Junior. వారు నాతో   మాట్లాడుతూ “చంద్రమౌళి గారు చాలా నిష్కర్షగా, నిష్కాపట్యముగా, అవినీతికి దూరంగా ఉండేవారు. అందరికీ సహాయకారిగా ఉండే వారు. ఆయన Senior కావటంతో, కార్యాలయంలో ఎక్కువ మందితో పరిచయాలుండేవి. ఎవరైనా చనిపోతే తనే అందరికీ ఫోన్ చేసి సమాచారం అందించేవారు. పుస్తకాలు బాగా చదువుతుండేవారు.” అన్నారు.

మరణాంతరం జరిగే కర్మకాండలపై చంద్రమౌళిగారికి విశ్వాసం లేదు. తన తదనంతరం తన శరీరం వృధా పోవటమూ వారికిష్టం లేదు. వారి కోరిక మెరకు వారి కుటుంబ సభ్యులు, వారి పార్థివ దేహాన్ని ఉస్మానియా వైద్య కళాశాలకు అందచేశారు. ఎలాంటి కర్మకాండలు జరపటం లేదని వారి కుటుంబ సభ్యులు తెలియచేశారు. రాజాచంద్ర ఫౌండేషన్ అధ్యక్షులైన చంద్రమౌళిగారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ, ఎప్పటివలెనే రాజాచంద్ర ఫౌండేషన్, ఉత్తమ సాహిత్యం, తెలుగు ప్రజలకు అందిస్తుందని ఆశిద్దాం. ఆ పుస్తకాలు  చదివి ఆనందిస్తే, అదే  సాహితీబంధు చంద్రమౌళి గారికి మనమిచ్చే  నిజమైన నివాళి.

*

 

 

 

 

 

మీ మాటలు

  1. కన్నెగంటి అనసూయ says:

    నిజాయితీకి నిలువెత్తు నిర్వచనం శ్రీ చంద్రమౌళిగారు. క్రమశిక్షణకు మారు పేరు వారు. మనసులో స్వఛ్ఛత, మాటలో నిజాయితీ వారి సహజ గుణాలు. నమ్మిన ఆశయాల కోసం చివరి ఊపిరి వరకూ నిబధ్ధతతో నిలబడగలగటం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో చంద్రమౌళిగారిది అగ్రస్థానం అంటే అతిశయోక్తి కాదు

  2. కొత్త రవికిరణ్ says:

    సంజీవ్‌దేవ్ గారి “తెగిన జ్ఞాపకాలు” కోసం వెదుకులాడుతున్న రోజులలో మీ(సి.భాస్కరరావు గారు) రిఫరెన్స్‌తో చంద్రమౌళిగారిని కలిశాను. ఆ సమయంలో ఆయన చూపిన ఆప్యాయత, మా నాన్నగారు కూడా సంజీవ్‌దేవ్ గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారని చెప్పినపుడు ఆయన ఆనందం ఇంకా నాకు జ్ఞాపకమున్నాయి. మీరు చెప్పిన ఆ ఇంటి ముందు వసారా సమావేశంలో నాకు ఎన్నో విషయాలు చెప్పారు. ఆ తరువాత ఆయన్ని కలిసింది లేకపోయినా, ఆ వీధి పక్కగా వెళుతూ ఆయన్ని తలచుకోని సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు.

  3. ఏప్రిల్ 4, 2011 న తుమ్మపూడి సభ కు వెళ్ళాను. రాజా చంద్ర ఫౌండేషన్ ద్వారా చాలా మంచి పుస్తకాలు ప్రచురించారు. చంద్రమౌళి గారి మరణానికి మా జనసాహితి సంస్థ ద్వారా సంతాపం తెలియచేస్తున్నాను

మీ మాటలు

*