ఒక కవి- ఒక భరోసా!

-బద్రి నర్సన్

~

        narsan పూట గడవడమే గండంగా బతుకును నరకప్రాయంగా వెళ్లదీస్తున్న బడుగు జీవులకు ఎంత ధీమాగా కవి ప్రసాదమూర్తి చెప్పారు వారికి బాసటగా కవులున్నారని. కవులు తప్ప ఎవరూ లేరని పలకడం ఎంత సాహసం. కవి గణం నుండి వకాల్తా తీసుకున్నట్లు మేమున్నమని భరోసా మాట ఇవ్వడానికి ఎంత మనోధైర్యం కూడకట్టుకోవాలి.

       కవిత ముగింపుగా కనబడే  “కవులు తప్ప” చదవడానికి ఐదు అక్షరాలే కాని పంచ భూతాల సాక్షిగా పలికిన వాగ్దానమది. పిల్లాడి కన్నీరు తుడవడానికి అమ్మ ఉన్నట్లు, ఆస్తికుడికైతే దేవుడే దిక్కన్నట్లు ఎంత బాధ్యతాయుతమైన తీర్పు ఈ మాట.
       ప్రసాదమూర్తి ప్రజల కష్టాలను కవిత్వీకరించిన తీరు కన్నీటి పర్యంతమానం. పైన ఆకాశం లేక కింద నేల కూడా లేని వాళ్లకు కవులే తోడూ నీడా అన్నప్పుడు కవులు జడుసుకోవలసిందే.
    ‘రోడ్డు పక్కన దేహాలను అమ్మకానికి నిలబెట్టినవారికి,
    కుప్పితొట్టి ఉయ్యాలలో నక్షత్రగోళాలు పాడే జోలపాట వింటూ ఏడుస్తూ నిద్రపోయే అభాగ్య శిశువుకు,
    మట్టి మీద తమను పాతుకొని నాగటి కర్రుకు నెత్తుటి సంతకమై వేలాడే మట్టి మనుషులకు,
    కన్నీటి కాందిశీకులకు ఎవరున్నారు’ అనడం కవిగా తాను వేసిన ఎన్నో అడుగుల్లో ఇది మాత్రం తనకుతాను పునర్ ప్రమాణం చేసే సరికొత్త అడుగు.
       ఎవరున్నా లేకున్నా బాధితులకు తోడుగా నిలబడి అక్షరాలా అక్షరాల ఊరడింపునందించి, వెంటుండి బతుకు బండిని సవరించే బాధ్యత కవులకుందని ఈ కవి ఘంటాపథంగా ప్రకటిస్తున్నాడు.
       మరి కవులంటే ఎవరు? అడగ్గానే చేతులెత్తి నిలబడడానికి చాలా మందే ఉంటారు.  ఫేస్బుక్కు ఖాతాలోకి కిటికీలోంచి నాలుగు పదాలు విసిరేసేవాళ్లకూ కొదువ లేదు. నిందారోపణ కానేకాదు. ‘కవులు తప్ప’  అన్నాక కూడా ధీర్ఘంగా ఆలోచించకుండా ఉంటే ఎలా? ఇన్ని కష్టాలు అనుభవిస్తున్న వాళ్లకు మేమున్నమని ఆశ్వాసం కలిగించడానికి కవులు సాహసోపేతంగానే వ్యవహరించాలి. కవులు ఎవరి కాలువలో వారు ఈదినట్లుకాక సముద్ర అలల ధాటిని తట్టుకోవాలి.
     “రచయితలారా మీరెటువైపు?” అని ప్రశ్నించినపుడు సాహితీ లోకం కంపించినట్లు కష్టాలకు భుజం తోడు ఇచ్చినవాడే కవి అన్నప్పుడు కూడా నేటి కవులు తాము పోషించవలసిన పాత్రను స్థిరీకరించుకోవలసిందే. ఈ గడ్డు కాలంలో కలం పట్టడమే ఓ సాహసిక చర్య,  జీవన్మరణ పరిస్థితి.            
     కత్తి గొప్పదా! కలం గొప్పదా! అన్నప్పుడు కలమే గొప్పదని సోదాహరణంగా చదువుకునే రోజుల్లోనే వాదించాం. శబాష్ అనిపించుకున్నాం. కళ కళ కోసం కాదు, ప్రజల కోసం అని నమ్మినాము కదా. ఇవన్నీ నిరూపించుకోకపోతే ఎలా! 
      వీరులకే వీరగంధం దక్కినట్లు కవిగా నిరూపించుకునే పరీక్షకు సిద్ధపడాలి. అవసరమైతే కాలం కడుపులోకి చొచ్చి కవులుగా మళ్లీ జన్మించాలి.  ప్రసాదమూర్తి మాట దక్కించాలి.      
*

మీ మాటలు

 1. prasadamurty says:

  thank you narsan garu. your words are great inspiration for me

 2. విలాసాగరం రవీందర్ says:

  మంచి విశ్లేషణ నర్సన్ గారు

 3. చందు - తులసి says:

  కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అని మహాకవి అన్నారు కదా. ఇరు వైపులా కాకున్నా కష్టకాలంలోనైనా మేమున్నామని నిలవాలి..
  మంచి విశ్లేషణ నర్సన్ గారు..
  ప్రసాదమూర్తి గారికీ, మీకూ అభినందనలు

  • A word in need, a poet indeed. మాట బలం ఎంతో ధైర్యాన్ని ఇస్తది. అభిప్రాయానికి అభివందనం .

 4. knvmvarma says:

  మంచి విశ్లేషణ గొప్ప కవిత్వం

మీ మాటలు

*