ఆగ్రహం నగ్నముని కవిత్వ వ్యాకరణం!

-అఫ్సర్

~

[డిసెంబర్ 6 హైదరాబాద్ లో  యాభయ్యేళ్ళ దిగంబర కవిత్వం సందర్భంగా  “ఛాయ” ఏర్పాటు చేస్తున్న  నగ్నమునితో సంభాషణ సందర్భంగా…

 

సామాజిక సాహిత్య రూపాల పరస్పర సంబంధం 1955 పరిణామాల తర్వాత స్పష్టమయింది. సాహిత్య రూపాలపై క్రమంగా మధ్యతరగతి పట్టు  పెరగటం వల్ల వచన కవిత్వం బాగా విస్తరించింది. చాలా కొద్ది కాలంలోనే వచన కవిత్వానికి కూడా రూపపరంగా వొక ఫార్ములా యేర్పడిపోయింది. రాజకీయ, సామాజిక రంగల్లో వున్న స్తబ్దతా, మధ్య తరగతిలో కళారూపాల పట్ల ఏర్పడుతున్న పరాన్ముఖతా వచన కవిత్వంలోని ఈ ఫార్ములాని కొంతకాలం నిరాటంకంగా సాగ నిచ్చాయి.  ఈ నమూనాని చేధించి, మొత్తంగా కాకపోయినా శకలాలుగానైనా జీవన వాస్తవికతకి దగ్గరగా వెళ్లాలనే ప్రయత్నం ఆరుద్ర, అజంతా, నగ్నముని,  బైరాగి, వజీర్ రెహ్మాన్, ఇస్మాయిల్  లాంటి కవులు చేస్తూ వచ్చారు.

’60 ల మొదటి దశలో నగ్నముని ‘ఉదయించని ఉదయాలు’ వెలువడేనాటికి అదొక ప్రత్యేకమైన గొంతు. అంత్యప్రాసలకి అంత్యక్రియలు చేసి,  కొత్త నిర్మాణ వ్యూహాలతో నగ్నముని వొక కెరటంలాగా తెలుగు కవిత్వాల పొడి  వాతావరణంలోకి దూసుకొచ్చాడు. “అంతా ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయి, ఏదో పనిలో తమని తాము పోగొట్టుకుంటున్న”స్తబ్ధస్థితిలో మనిషిని, మనసులోని కొత్తగోళాల వైపు నడిపించడమే తన లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. బహుశా, నగ్నముని ఈ దశలో చేసింది. కొత్త సంపన్నుల వరసలో చేరాలని తపించే మధ్యతరగతిపై నిరసన ప్రకటించడం.

“గుద్దేసి వెళ్ళిపోయిన కారు కింద పడ్డ మనిషి చుట్టూ జనం ఈగల్లా ముసురుతున్నారు. తిరిగి అంతా అతన్ని వదిలేసి మాట్నీకి వెళ్లిపోతున్నారు….

మధ్యతరగతి తన చుట్టూ   జరుగుతున్న వాటి గురించి కావాలని పెంచుకుంటున్న Alienation, కందమూలాలు ఏరుకోడంలో జీవితం అయిపోతున్నా,  కోర్టుల్లో కాలం ఉరి తీయబడుతున్న అక్షరాలు అర్ధాలు కోల్పోతున్నా, అంతా బావున్నారులే అకాశం కింద –

వాస్తవికతకి దూరంగా పారిపోతే తప్ప, మధ్యతరగతి తన ఊహాప్రపంచాన్ని పకడ్బందీగా నిర్మించుకోలేదు. చుట్టూ ఏమీ జరగడం లేదనుకోవాలి. అంతా బాగుందనుకోవాలి. తను తప్ప సమాజమంతా సుఖంగా వుందనుకోవాలి. ఇలా ఎండుటాకుల మీద చప్పుడు కాకుండా నడవాలనుకునే ఈ ధోరణిని నగ్నముని ఎండకట్టాడు.

2006021617180301_996062e

నగ్నముని మొదటినుంచీ చాలా Conscious poet. తనదేదో ఒక వింత దంత గోపురాన్ని నిర్మించుకొని అక్కణ్నించి దిగి రాకూడదని భీష్మించు కూర్చోడు. నేలమీద నిటారుగా నిల్చొని సూటిగా సూర్యుడి వైపు ప్రయాణించాలనుకుంటాడు. అందుకే నగ్నముని తనదైన ఒక ఏకాంత  స్వప్నాన్వేషణలో తడబడు గొంతుకతో మట్లాడలేదు. స్పుటంగా  పలకడం అతనిలోని శాబ్దిక బలం వల్ల కాదు. తాత్విక బలం వల్ల వచ్చిన లక్షణం. నిశబ్దంలో నిశ్శబ్ధ భావాల్ని పలికేటప్పుడు కూడా నగ్నముని బాహ్య జీవితాన్ని గురించి నిష్కర్షగా చెప్పగలడనడానికి ‘మార్లిన్ మన్రో కోసం’ రాసిన కవితే నిదర్శనం.

దిగంబర కవిగా అవతరించిన తర్వాత నగ్నముని యధాతథ వ్యవస్థ మీద కత్తి కట్టినట్టు కవిత్వం రాశాడు. వ్యవస్థని వెనక్కి నెట్టే లేదా ఎక్కడికక్కడే స్తబింపజేసే ఏ శక్తినీ నగ్నముని క్షమించలేకపోయాడు. ప్రతిఘటన, ఆగ్రహం తన కవిత్వానికి పర్యాయపదాలుగా మార్చుకున్నాడు. కవిత్వంలో  కప్పలా బెక బెక మంటున్న,  మేకలా మే మే అంటున్న   అసహాయపు కీచురాయి గొంతుని దగ్గరికి రానివ్వలేదు. అవకాశవాదమే జీవిత విధానంగా అన్ని విలువల్నీ వంచిస్తున్న నకిలీ వ్యక్తిత్వంపై నగ్నముని రెండో ఆలోచన లేకుండా కొరడా ఝళిపించాడు. ఇలాంటి కవితల్లో నగ్నముని సాధ్యమైనంత Satirical heights కి వెళ్లిపోతాడు. ఉదాహరణ: దేశభక్తి కవిత.

ఆధునిక జీవితానికి సంబంధించిన కొత్త కోణాలెన్నింటినో దిగంబర కవిత్వం వస్తువుగా తీసుకుంది. అయితే, 70లలో విప్లవోద్యమం వచ్చినప్పుడు నగ్నముని దృష్టి ‘తూర్పుగాలి’  వైపు మళ్లింది. దిగంబర కవిగా నగ్నముని అసహన, ఆగ్రహ ప్రకటనకే పూర్తిగా పరిమితం కాలేదు గానీ, ‘తూర్పుగాలి’ లో ఆ కోపానికో దిక్కు దొరికింది. దేన్ని కోప్పడాలి, ఎందుకు కోప్పడాలి అనేది ‘తూర్పుగాలి’ లో నగ్నమునికి సూటిగా తెలిసిపోయిందని పాఠకుడికి కూడా ఇట్టే తెలిసిపోతుంది.

మనిషిగా వర్గ చైతన్యంతో మనం ముందుకు వెడదాం అంటున్న నగ్నముని దిగంబర కవికాదు. వర్గచైతన్యం అనే పదం నగ్నముని  నిఘంటువులో కొత్తది. ఈ దశలో ఈ నగ్నముని నీలోనూ నాలోనూ  వున్నవాడు. మననుండి విప్లవాల్నీ, త్యాగాల్నీ నిరీక్షిస్తున్నవాడు.

విప్లవ కవిగామారిన తర్వాత నగ్నముని గొంతులో ఒక బాలెన్స్ వచ్చినట్టనిపిస్తుంది. భావాల్ని ఆవేశం స్థాయిలో కాకుండా ఆలోచన ప్రమాణంగా వ్యక్తం చేస్తున్నాడనిపిస్తుంది.

01-nagnamuni

విప్లవ కవిత్వం తరవాతి  దశకూడా నగ్నముని కవితల్లో కనిపిస్తుంది. “కొయ్య గుర్రం” ముగింపు వాక్యాల్లో కనిపించేది. మళ్ళీ కొత్త నగ్నమునే నమ్మాల్సిన వాటినన్నింటినీ నమ్మి, మోసపోయిన తర్వాత వుండే నిర్లిప్తతతో, జీవితాన్ని పునః ప్రారంభించాలనే అమాయక తపన కనిపిస్తాయి. అయితే, నగ్నమునిలో రకరకాల రూపాల్లో బహిర్గతమయ్యే సంఘర్షణా, అలజడీ అంత తేలిగ్గా దేనికీ లొంగవు. అంతా నిశ్శబ్దంగా వున్నప్పుడు నిప్పులు కురిపిస్తాడు. అంతా మౌనంగా వున్నప్పుడు శబ్దాల్ని వర్షిస్తాడు. ఈ నిశ్శబ్దం, ఈ మౌనం రెండు ఆయనకి భయంకరమైన ఉపద్రవాల్లా, శత్రువుల్లా కనిపిస్తాయి. అందుకే ఉద్యమాలు తగ్గుముఖం పట్టి, పోరాట పటిమ బలహీనపడిందని భావించి స్తబ్ద వాతావరణాన్ని వేలెత్తి చూపించాడు. విప్లవ నినాదం కాక, ఈ సమాజాన్ని కదిలించాల్సిన కొత్త శక్తి ఏదో కావాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్య గొంతుకని సవరించుకున్నాడు. ఈ రెండు నినాదాల్లోనూ, వివాదాల్లోనూ నగ్నముని రాజీలేని తనమే కనిపిస్తుంది.

బాహ్య, అంతర్లోకాల సరిహద్దులు స్పష్టంగా గుర్తెరిగిన వాడవడంతో నగ్నముని కవిత్వరూపం సర్రియలిజంకి దగ్గిరగా వెళ్లిందనిపిస్తుంది. చాలా మామూలు మాటలూ, వాక్య నిర్మాణంలోనే ఎలాంటి ప్రయాసా పడకుండా అసాధారణ శైలిలోకి ప్రవేశిస్తాడు. ఈ ధోరణి ‘ఉదయించని ఉదయాల్లో’  కాస్త తక్కువగా, దిగంబర కవిత్వంలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ‘ఉదయించని ఉదయాల్లో’  లాండ్ స్కేప్ లాంటి కవితతో Para-linguistic features కనిపిస్తాయి. అంత్య ప్రాసల వచన కవిత్వ శైలి ప్రధానంగా వున్నప్పుడు దాన్ని ధిక్కరించి ‘దిక్’ల వైపు సాగే ప్రయత్నం ‘లాండ్ స్కేప్’లోనే కనిపిస్తుంది. ఈ Para-linguistic రూపాన్ని తర్వాత్తరవాత వజీర్ రెహ్మాన్,  స్మైల్ ఇంకా బలంగా, అర్ధవంతంగా వుపయోగించగలిగారు. ఇలా అత్యాధునిక కవిత్వ రూపానికి సంబంధించిన కొన్ని నమూనాల్ని నగ్నముని తన కవితల ద్వారా చూపించాడని చెప్పవచ్చు.

సాధారణ వచన కవిత్వ శైలిలో ఎంతకాదన్నా శబ్దం పంటికింద రాయిలా తగుల్తుంది. పైగా  అంత్య ప్రాసలవల్ల కవిత్వ వాతావరణం కొంత అసహజంగా వుంటుంది. ఈ రెండింటినీ నిరాకరించినది అత్యాధునిక కవిత్వ రూపం. ఈ రూపంలో భాష వొక వాహికగా వుంటుంది తప్ప తనే కవిత్వంగా మారదు. తిలక్ తరహా అలంకారిక శైలిని అత్యాధునిక కవిత్వంగా  కనీసం ఊహించలేం. అలాగే కుందుర్తి తరహా అంత్యప్రాసల అసహజ ప్రయాస కొత్త రూపంలో కనిపించదు.

8215_front_cover

ఈ కొత్త ధోరణికి చెందినవాడవడం వల్ల నగ్నముని కవిత్వంలో భాష కనిపించదు. అంతర్వాహినిలా వొక ఆధునిక మానవుడి సంభాషణ వినిపిస్తుంది. ఈ సంభాషణా శైలీ వ్యూహాన్ని నగ్నముని చాలా యాంత్రికంగా ప్రవేశపెట్టాడని అనుకోడానికి లేదు. తర్వాత్తర్వాత నగ్నముని కవిత్వరూపంలో ఎన్ని మార్పులొచ్చినా, మౌలిక నిర్మాణ ప్రాతిపదిక ఈ సంభాషణా వ్యూహమే. ఈ సంభాషణకి వొక క్రమం వుంది. నగ్నముని ప్రతి కవితలోనూ రెండు పాత్రలు కనిపిస్తాయి. ఒకటి కవి. రెండు తను లక్ష్యంగా వ్యక్తి లేదా వ్యక్తి ప్రతీకగా వున్న వ్యవస్థ. ఈ రెండు పాత్రల మధ్య సంభాషణలో గట్టి తర్కం వుంటుంది. నిర్మొహమాటంగా సాగే భావాల మార్పిడి వుంటుంది. ఒకే అంశాన్ని అనేక కోణాలనుంచి పరీక్షించి వీక్షించే వైరుధ్యమూ, విశాలత్వమూ వుంటాయి. ఇది (Monologue)గా మిగలదు. కచ్చితంగా (Dialogue) రూపంలో సాగుతుంది.

మొట్టమొదట , చిట్టచివరి కొమ్మన మనసు దిగంబరం కావాలి  – అని నగ్నముని చెప్పింది వ్యక్తీకరణ సమస్యే. ఈ దశలో నగ్నముని కవిత్వ శైలిలో అక్కడక్కడా అశ్లీలం పలకడం కూడా ఆశ్చర్యమేమీ కాదు. నగ్న సంభాషణలో శీలం, పాతివ్రత్యం, అశ్లీలం అంటూ ఏవీ మిగలవు. మాటల మీది ముసుగుని తొలగించడమే ఇక్కడ కవిత్వం పని. ఈ దిశగా నగ్నముని సాధించింది ఎంతో మిగిలింది. ఎన్ని వాదాలూ, అపవాదాలూ చేసినా అది ఖనిజం లాంటి నిజం

[నగ్నముని కవిత్వం మీద  1992లో తెనాలి పొయెట్రీ ఫోరం వారు “సంతకాలు” కవిత్వ పత్రిక నగ్నముని ప్రత్యేక సంచికకి  రాసిన గెస్ట్ ఎడిటోరియల్ ని ప్రచురిస్తున్నాం. ఈ రచనని ఇన్నేళ్ళ పాటు భద్ర పరచి మాకు పంపించిన పసుపులేటి వెంకట రమణ గారికి కృతజ్ఞతలు]

~

మీ మాటలు

 1. సర్ ఎప్పట్లాగే మీ వచనం అద్భుతం . గొప్ప కవినే కాదు గొప్ప అనిపించుకోగల కవిత్వానికి ఉండాల్సిన లక్షణాల్ని కూడా ఎంతో సరళమైన పదాల్లో వివరించారు . చాల థాంక్స్ సర్

 2. బ్రెయిన్ డెడ్ says:

  మీ వాక్యం లో ఇలా చదవడం . చాలా పవర్ఫుల్ ఇంట్రడక్షన్ పవర్ పాక్డ్ కవి గురించి .

 3. దాదాపు ఇరవైయేళ్ళ క్రితం రాసిన వ్యాసమైనా నేటికీ అదే సజీవ ధారగా ఏకబిగిన చదివించే వచనాసైలి మీది. కాంపాక్ట్ గ వారి కవిత్వాన్ని పరిచయం చేసింది. ధన్యవాదాలు సర్.

 4. వ్యాసం (అప్పటి ఎడిట్) చాల బాగుంది అఫ్సర్. నగ్నముని అభిమానిగా చాల సంతోషం వేసింది వ్యాసం చదివి. ‘కొయ్య గుర్రం’ చివరి ‘విశ్వ వస్త్రం’ కుల, వర్గ విభజిత భారత సమాజాన్ని ప్రతిబింబించదు. అందుకు నగ్నముని కవిత మీద బలమైన విమర్శ రావలసింది. వ్యక్తిగత రాగ ద్వేషాలే సాహిత్య చర్చలుగా మారడం వల్ల, వస్తుగత చర్చ మృగ్యం కావడం వల్ల తన మీద ఆ విమర్శ వుపయోగకరంగా రాలేదు. ‘ఉదయిందని ఉదయాలు’ తో మొదలై నేటికీ రగులుతున్న సూటిగా సుత్తి లేకుండా చెప్పే నగ్నమునిత్వం నీ వ్యాసంలో వ్యక్తమయ్యింది. వచన కవితలో ఫోక్లోర్ ఔన్నత్యాన్ని చూపించిన గొప్ప కవి నగ్నముని. అయోమయత్వం కవిత్వం కాదని ఆయన బహిరంగంగానే చెబుతున్న మాటను ఎవరూ వినకపోవడం తదనంతర సాహిత్య జీవుల తప్పిదమే అనుకుంటాను.

 5. Vijay Koganti says:

  Thank You for Sharing Sir.

 6. Delhi (Devarakonda) Subrahmanyam says:

  ఎప్పటి లాగే చాలా మంచి వివరాలు తెలిపిన మీకు అభినందనలు అఫ్సర్ గారూ.

 7. వృద్ధుల కల్యాణరామారావు says:

  వ్యాసం చాలా బాగుంది. ఆయితే ,తిలక్ శైలి అత్యాధునిక శైలి కాకపోవచ్చు కాని అతడి కవిత్వం వచన కవిత్వ పుటందానికి నిజమైన నిర్వచనం. అగ్ని చల్లినా అమృతం కురిసినా అందం ఆనందం దానిపరమావధి.

 8. 77 ప్రాంతాల్లో పదో తరగతి చదివే పిల్లవాడిగా నగ్నముని గారి కొయ్య గుర్రం, విలోమ కథలు చదివే ప్రయత్నం చేసి, అర్థం కాక వదిలేసిన వాన్ని- డిగ్రీ అయ్యాక, మళ్ళీ పుస్తకం తెరిచి కొంత లోపలికెళ్ళగలిగాను, మీ వ్యాసం నగ్నమునిని పూర్తిగా ఆవిష్కరించింది -థ్యాంక్స్ అఫ్సర్ గారు
  –నర్సిం

 9. Prof P C Narasimha Reddy says:

  Linguistic form in literature (of any genre) lays in its discourse. Logical constructs, semiotic lenticular structure, syntactic bendings, discourse features form the part of language. Modern poetry in its evolution discarded certain features of verse and asserted certain basic formal structure of its genre. Language is both a vehicle and a form of literature. Dented comment seems a haste one.- Prof P C Narasimha Reddy

 10. Prof P C Narasimha Reddy says:

  Dear Dr Afsar ! Please refer to the SVU unpublished MPhil dissertation on Nagnamuni’s ‘Koyya Gurram’ under my research supervision which also includes study of poetry on natural disasters (upadrava kavitwam) along with Che Ra and Na Ra (He was with us in 1985.His article included ) views.

 11. G.venkatakrishna says:

  అప్పటి వ్యాసమే అయినా ఇప్పటికి ఎంత పదునుగున్దో …మీ అసెస్మెంట్ చాలా కరెక్ట్ గా ఉంది ……

 12. Ram Mohan Rao says:

  నగ్నముని కవిత్వ పరామర్షే అయినా ఇప్పుడు కలం పడుతున్న కవులకు కొత్త పాతం లా ఉంది. ఒక దేశ స్వాతంత్ర్యానికి సత్యాగ్రహం ఆయుధమైతే భ్రస్టు చెందిన వ్యవస్థ బాగు కై ఎవరో ఒకరు కవితాగ్రహం చేయక తప్పదు. ఇరవై మూడేళ్లయినా వ్యాసం వాడి వేడి తగ్గలేదు. కొన్ని కవితాపంక్తులు జోడిస్తే ఇది నగ్నముని గురించిన మంచి రిఫరెన్స్ అవుతుంది. అభినందనలు.

 13. Ram Mohan Rao says:

  కొత్త పాఠం గా సవరించుకొండి

 14. Kuppili Padma says:

  ఛాయా లో నగ్నముని గారి ప్రసంగాన్ని వినటం విలువైన అనుభవం. యిన్నేళ్ళ తరువాత కూడా యీ వ్యాసం అంతే కొత్తగా వుంది. కొత్త సంక్లిష్టతలు చాల చేరిన నేటి జీవితాలని కవిత్వీకరించటానికి మళ్ళీ మరోసారి యీ కవులందరినీ కొత్తగా చదువుకోవటం, వినటం బాగుంటుంది.

 15. విలాసాగరం రవీందర్ says:

  నగ్నముని కవిత్వ పరామర్షే అయినా ఇప్పుడు కలం
  పడుతున్న నా లాంటి కవులకు కొత్త పాతం లా ఉంది. Thank you sharing Afsar sir

మీ మాటలు

*