సీజర్ ను భయపెట్టిన ‘ప్రేతాత్మ’ల నగరం…ట్రాయ్

 

స్లీమన్ కథ-17

 

కల్లూరి భాస్కరం

స్లీమన్ వెళ్ళేటప్పటికే, ట్రాయ్ నలిగిన బాట. ఆ బాటలో పిచ్చి పిచ్చిగా పెరిగిన ముళ్ల పొదలు, శిథిల వృక్షాలు. వాటికింద పాడుబడిన బలిపీఠాలు. ఆ పీఠాల వద్ద ఘనతవహించిన ఎంతోమంది మొక్కులు చెల్లించుకున్నారు. తరం వెంట తరంగా ఆ దుర్గమ ఫ్రిజియన్ తీరాన్ని సందర్శించిన అనేకమంది అక్కడి కూలుతున్న గోపురాల మధ్య తిరిగారు. హెలెన్ (గొప్ప సౌందర్యవతి. మైసీనియన్ స్పార్టాను పాలించే మెనెలాస్ భార్య. ఈమెను ట్రాయ్ రాకుమారుడు పారిస్ అపహరించుకుని వెళ్ళాడు. అది ట్రోజన్ యుద్ధానికి దారితీసింది) నిర్బంధానికీ, పదేళ్ళ యుద్ధానికీ సాక్షులుగా నిలిచిన జీర్ణ శిలల మీద సేదతీరారు.

హెరోడొటస్ మాటలనే విశ్వాసంలోకి తీసుకుంటే, ప్రపంచంలోని అత్యధికభాగాన్ని ఏలిన పర్షియన్ చక్రవర్తి గ్జెరెక్సెస్(క్రీ.పూ. 519) టర్కీ నుంచి గ్రీస్ కు దండు వెడలుతూ ఇక్కడ ఒకరోజు ఆగాడు. కొండ ఎక్కి దుర్గాన్ని చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి చెందిన విజ్ఞులను పిలిపించి అక్కడ జరిగిన ముట్టడుల కథలు చెప్పించుకుని విన్నాడు. ఆ తర్వాత ట్రోజన్ ఎథెనాకు వెయ్యి వృషభాలను బలిచ్చాడు. అక్కడి పూర్వజులైన మహనీయుల ఆత్మశాంతికి మద్యతర్పణాలు ఇవ్వవలసిందిగా పురోహితులను ఆదేశించాడు. ఏవో భయానక ప్రేతాత్మలు భూమిని చీల్చుకుంటూ వచ్చి మీద పడతాయన్న ఊహతోనే పర్షియన్ సేనలు ఆ రాత్రంతా వణికిపోతూ గడిపాయి.

పర్షియన్లకూ, ఇతరులకూ కూడా అది రకరకాల కథలూ, పీడకలలూ కలగలిసిన విచిత్ర భయాలను రేపే ప్రదేశం. అన్ని యుద్ధక్షేత్రాలలోలానే, ఈ ప్రాంతాన్ని కూడా ప్రతీకారదాహంతో ప్రేతాత్మలు పెట్టే పెడబొబ్బలు వెంటాడుతూ ఉంటాయి.  గ్జెరెక్సెస్ కూడా పాత పగలు తీర్చుకోవడమే తన లక్ష్యమని చెప్పుకున్నాడు. ట్రాయ్ పతనమే గ్రీకులకూ, తమకూ మధ్య శాశ్వతశత్రుత్వాన్ని రగిల్చిందని పర్షియన్లు అంటారు.

ట్రాయ్ గడ్డ మీద అడుగుపెట్టగానే, ఆసియా మొత్తం తమ చేజిక్కిందని గ్రీకులు అనుకున్నారు. హెల్స్ పాంట్ మీదుగా అలెగ్జాండర్ పర్షియన్లపై దండయాత్రకు వెడుతూ సెజియమ్(ఒక పురాతన నగరం)లోని ఓ గుట్టమీద ఉన్న అఖిలెస్ (ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్న గ్రీకు వీరుడు) సమాధిని దర్శించుకున్నాడు. ఒంటి నిండా నూనె పట్టించి ఆ సమాధి చుట్టూ నగ్నంగా ప్రదక్షిణ చేశాడు. ఎథెనా ఆలయంలో భద్రపరచిన కొన్ని ఆయుధాలను తను ధరించాడు. ఆ నగరాన్ని తీర్చిదిద్దడానికి బ్రహ్మాండమైన ప్రణాళికలు వేసుకున్నాడు.

భూ, సముద్రమార్గాలలో పాంపే(క్రీ. పూ. 106: రోమన్ సేనాని, రాజకీయ నేత)ను వేటాడుతున్న జూలియస్ సీజర్(క్రీ.పూ.100: రోమన్ సేనాని, రాజకీయనేత) ఇక్కడి రోటియన్ గుట్ట మీదికి చేరుకున్నాడు. అప్పటికి నలభై ఏళ్లక్రితం రోమన్ దళాల చేతుల్లో దగ్ధమైన ఈ నగర శిథిలాల మధ్య తిరిగాడు. చుట్టూ కమ్మేసిన అడవీ; రాజప్రాసాదాలపైనా, ఆలయాలపైనా దట్టంగా పెరిగిపోయిన ఓక్ చెట్లు తప్ప అతనికేమీ కనిపించలేదు. అక్కడక్కడ ఇసుక మేటలు వేసిన ఒక ప్రవాహాన్ని అతడు దాటుతుండగా, “ప్రసిద్ధ నది జంతస్ ఇదే” నని ఎవరో చెప్పారు. అతనో పచ్చిక నేల మీద అడుగుపెట్టినప్పుడు; “హెక్టర్(ట్రోజన్ రాకుమారుడు, ప్రియామ్ కొడుకు, వీరుడు) భౌతికకాయాన్ని తీసుకొచ్చిన ప్రదేశం ఇది. అతని ప్రేతాత్మ కోపగిస్తుంది, జాగ్రత్త” అని ఎవరో బిగ్గరగా అరిచారు. అతను ఒక రాళ్ళగుట్టను సమీపించబోయినప్పుడు, ఎవరో అతని చొక్కా పుచ్చుకుని లాగి,”కనబడడం లేదా? అది హెర్కయన్ జూపిటర్ బలిపీఠం” అని గుడ్లు ఉరిమాడు.

చుట్టూ శిథిలాలూ, అలముకున్న అంధకారం తప్ప ఏమీ కనిపించకపోయినా అదో పవిత్రస్థలి అని సీజర్ కు తెలుసు. అక్కడి ప్రేతాత్మలను తలచుకుని భయపడ్డాడు. అప్పటికప్పుడు మట్టితో ఒక బలిపీఠాన్ని నిర్మింపజేసి, దాని మీద ధూపం వెలిగించాడు. తనకు గొప్ప శ్రేయస్సును ప్రసాదించమని ఆ క్షేత్రపాలకులైన దేవతలను ప్రార్థించాడు. అక్కడి కుప్పకూలిన నిర్మాణాలను పునర్నిర్మించి వాటికి పూర్వవైభవం తీసుకోస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంతలో తన బద్ధశత్రువైన పాంపే గుర్తొచ్చి, అతన్ని చంపే తహతహలో ఓడ ఎక్కి ఎక్కడా ఆగకుండా హడావుడిగా ఆసియాలోని సుసంపన్న నగరాల మీదుగా ఈజిప్టు రాజధాని అలెగ్జాండ్రియాకు వెళ్లిపోయాడు.

ఉన్మాదులూ, చక్రవర్తులూ కూడా ట్రాయ్ ను దర్శించుకున్నాడు. ‘కరకలా’ అనే పేరుతో ప్రసిద్ధుడైన ఉన్మత్త రోమన్ చక్రవర్తి ఆంటోనినూస్(క్రీ.శ. 188) ఇక్కడి ఆలయాలకు వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నాడు. ఈ ప్రాంత గతవైభవస్మరణతో మతిభ్రమించి, మేసిడోనియాలో తనను అలెగ్జాండర్ ది గ్రేట్ గా ఊహించుకున్నట్టే, ఇక్కడ అఖిలెస్ గా ఊహించుకున్నాడు. తన ఆప్తమిత్రుడు పెట్రాక్లస్ మరణానికి అఖిలెస్ అంతులేని దుఃఖంలో కూరుకుపోయిన సంగతి గుర్తొచ్చి, తను కూడా అలాంటి దుఃఖాన్ని అనుభవించాలనుకున్నాడు. తనెంతో అభిమానించే ఫెస్టస్ అనే ఒక మాజీబానిసకు విషం పెట్టి చంపించి అతనికి బ్రహ్మాండమైన చితిని పేర్చవలసిందిగా ఆదేశించాడు. తను స్వయంగా జంతువులను బలిచ్చి, మృతదేహాన్ని చితి మీదికి చేర్చి, నిప్పు అంటించాడు. ఆ తర్వాత ఆ మంటలపై మద్యాన్ని చిలకరించి, తన ప్రాణమిత్రుడి మరణాన్ని పండుగ చేసుకోవలసిందిగా వాయువులను ప్రార్థించాడు. కరకలా ప్రభుత్వంలో చిన్న అధికారిగా ఉన్న హెరోడియన్ ఈ ముచ్చట వివరిస్తూ, తను కూడా పట్టలేని దుఃఖంతో తన తలవెంట్రుక నొకదానిని చితికి అర్పించబోయాననీ, తీరా తనది పూర్తిగా బట్టతల కావడంతో అక్కడ ఉన్నవాళ్ళందరూ నవ్వారనీ చెప్పుకున్నాడు.

ఆ తర్వాత, అఖిలెస్ సమాధి చుట్టూ అలెగ్జాండర్ నగ్నంగా ప్రదక్షిణ చేశాడన్న సంగతి గుర్తొచ్చి కరకలా కూడా అదే చేశాడు.

ఆ తర్వాతి కాలంలోనూ, పర్షియాకో, జెరూసలెంకో నిరంతర ప్రవాహంలా వెళ్ళే యాత్రికుల బృందాలు విధిగా ఆ పవిత్రస్థలి మీద కాలు మోపాయి. తూర్పు భూముల్లో రోమన్ సామ్రాజ్యానికి కొత్త రాజధానిని నిర్మించాలనుకున్న కాన్ స్టాంటీన్(క్రీ.శ.270) అందుకు బైజాంటియమ్ ను ఖరారు చేసేముందు, ట్రాయ్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశాడు. నోవమ్ ఇలియమ్(ట్రాయ్ సమీపంలోని ఒక గ్రామం) ను సందర్శించిన రోమన్ చక్రవర్తి జూలియన్(క్రీ.శ.336), ఏజాక్స్(గ్రీకు వీరుడు)అస్థికలకు కొత్త సమాధిని నిర్మింపజేశాడు. మృతవీరుల అస్థికలను ఆరాధించే క్రైస్తవులను చూసి ఎగతాళి చేసిన ఈ చక్రవర్తే, ఏజాక్స్ సమాధిని భక్తితో కొలిచాడు. ట్రోజన్లు ఆ తర్వాత కూడా మరి కొన్నేళ్లపాటు పురాతన బలిపీఠాల వద్ద రహస్యంగా బలులు ఇస్తూవచ్చారు. రోమ్ లో క్రైస్తవ చక్రవర్తుల రాకతో అది క్రమంగా తగ్గుముఖం పట్టి, ట్రాయ్ మతపరమైన ప్రాముఖ్యం కొల్పోయింది.

greek goddess pallas athena

దర్దనెల్లెస్ కు వెళ్ళే దారులకు పదిహేనువందల ఏళ్లపాటు ట్రాయ్ కాపలా కాయగలిగింది. ఇప్పుడా వీధుల నిండా గడ్డి గాదం పెరిగిపోయాయి. ఆలయాలు, ప్రాసాదాల గోడలు కూలిపోయాయి. ఇప్పుడక్కడ ముళ్ళపొదలు, గడ్డితో నిండిన ఓ పెద్ద దిబ్బ మాత్రమే ఉంది. ట్రయాడ్ తీరం వెంబడి ప్రయాణించిన ఆంగ్లో-శాగ్జన్ చరిత్రకారుడు సావూఫ్ (క్రీ.శ. 1100), ట్రాయ్ శిథిలాలు అనేక మైళ్ళ దూరం వ్యాపించి ఉన్నాయని రాశాడు. ట్రాయ్ పూర్తిగా ధ్వంసమైందనీ, ఏమీ మిగలలేదనీ సర్ జాన్ మండవిల్ అనే మరో పర్యాటకుడు రాశాడు.

నిజమే, ట్రాయ్ ధ్వంసమైంది, అయినా మిగిలింది. జనం ఊహల్ని జ్వాజ్వల్యమానం చేయగలిగిన శక్తి ట్రాయ్ కు ఉన్నట్టు మరే నగరానికీ లేదు. బహుశా ఒక్క జెరూసలెం ఇందుకు మినహాయింపు. సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో ట్రాయ్ స్మృతిని హోమర్, వర్జిల్ సజీవం చేశారు. అఖిలెస్ నడిచిన బాటల మీద తాము కూడా నడిచే రోజు కోసం ఇటలీ పండితులు ఎందరో కలలు గన్నారు. రోమన్లు అనుకున్నట్టే, తాము కూడా ట్రోజన్ల వారసులమనీ, లండన్ అసలు పేరు ట్రాయ్ నోవంట్(నూతన ట్రాయ్) అనీ ఇంగ్లీష్ జనం అనుకుంటారు.

ట్రాయ్ కల్పన కాదు, నిజమనీ; హిస్సాలిక్ దిబ్బ కింద ఆ నగరం తాలూకు గోడలు, ప్రాసాదాలు, అలంకరణసామగ్రితోపాటు ట్రోజన్ల సాహిత్యం కూడా సమాధైందనీ 1870 లలో గట్టిగా నమ్మినవాళ్ళు ఇద్దరే: ఫ్రాంక్ కల్వర్ట్, హైన్ రిచ్ స్లీమన్.  ట్రాయ్ ఉనికి హిస్సాలిక్ దగ్గరే నని 1822లోనే నిరూపించే ప్రయత్నంచేసిన పురాతత్వనిపుణుడు చార్లెస్ మెక్లారెన్ 1870ల నాటికి జీవించిలేడు. బునర్ బషీయే ట్రాయ్ అనీ, హిస్సాలిక్ దిబ్బ మీద తవ్వకాలు జరపడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదనేది దాదాపు అప్పటి పండితులందరి ఏకాభిప్రాయం.

హిస్సాలిక్ దిబ్బ మీద పూర్తిస్థాయిలో తవ్వకాలను చేపట్టగల ఆర్థికస్తోమత ఫ్రాంక్ కల్వర్ట్ కు లేదు, అతనికంత ఆసక్తీలేదు. ఆ దిబ్బలోని తూర్పు భాగం అతని సొంతం. పశ్చిమభాగం కమ్ కేల్ లో ఉంటున్న ఇద్దరు టర్కులకు చెందింది.

సముద్రం వైపు తిరిగి ఉన్న పశ్చిమ భాగంలోనే అతి ముఖ్యమైన నిర్మాణాలూ, విలువైన నిధినిక్షేపాలూ బయటపడతాయని స్లీమన్ నిర్ధారణకు వచ్చాడు. టర్కుల అధీనంలో ఉన్న ఆ ప్రదేశంలోనే మొదట తవ్వకాలు జరుపుదామనీ, కల్వర్ట్ కు చెందిన ప్రాంతంలో తర్వాత ఎప్పుడైనా జరపచ్చనీ అనుకున్నాడు. తను బయటపెట్టబోయే నిర్మాణాలను, నిధినిక్షేపాలను చూసిన తర్వాత; తమ అనుమతి లేకుండా తవ్వకాలు జరిపించిన తన తెంపరితనాన్ని ఆ టర్కులిద్దరూ క్షమిస్తారని భావించాడు.

ఏప్రిల్ 9 న, దగ్గర్లోని రెంకోయ్ అనే గ్రామానికి చెందిన పదిమంది టర్కిష్ కూలీలతో మొదటి కందకాన్ని తవ్వించాడు. ఒక్కొక్కరికి పది పియాస్టెర్ల(పియాస్టెర్: మధ్యప్రాచ్యంలో అనేక చోట్ల చలామణిలో ఉన్న ఒక ద్రవ్యకొలమానం. పౌండులో నూరోవంతు)చొప్పున చెల్లించాడు. పని జరుగుతున్నంత సేపూ బెల్టులో పిస్టల్ తోనూ, చేతిలో కొరడాతోనూ వాళ్ళ నెత్తి మీద నిలబడ్డట్టు నిలబడ్డాడు. తను ‘స్కెయిన్ గేట్’(ట్రాయ్ పశ్చిమ ద్వారం. ఇక్కటే గ్రీకులకు, ట్రోజన్లకు అనేక యుద్ధాలు జరిగాయి) ఉంటుందని ఊహించుకున్న వాయవ్య భాగంలో ఒకచోట మొదటి పలుగు దెబ్బ పడింది. ఒక గంటసేపు తవ్విన తర్వాత రెండు అడుగుల లోతున ఒక ప్రాకారం తాలూకు శిథిలాలు కనిపించాయి. స్లీమన్ ఉత్తేజితుడయ్యాడు. సూర్యాస్తమయానికల్లా 60 అడుగుల పొడవూ, 40 అడుగుల వెడల్పూ ఉన్న ఒక భవనం తాలూకు పునాదులు బయటపడ్డాయి.

మరునాడు మరో పదకొండు మందిని పనిలోకి తీసుకున్నాడు. క్రమంగా బయటపడుతున్న ఆ భవనం ఆగ్నేయ, నైరుతి మూలల్లో తవ్వకాలు ప్రారంభించాడు. చదరపు రాళ్ళు తాపడం చేసిన భవనం పై కప్పు పైకి తేలింది. దాని మీద రెండడుగుల మందంలో మట్టి, వందల ఏళ్ల నాటి గొర్రె పెంటికలు, మొక్కల శిథిలాలు, వాతావరణం తాలూకు ధూళి పేరుకుపోయి ఉన్నాయి. కుండపెంకులేవీ కనిపించలేదు. ఆ చదరపు రాళ్ళ అడుగున తవ్వించాడు. సరిగ్గా అతను ఊహించినట్టే అడుగున అగ్నిప్రమాదాన్ని సూచిస్తూ బూడిద కుప్పలూ, కాలిపోయిన పదార్థాలూ కనిపించాయి. ఒక పద్ధతిగా ఉన్న వాటి అమరికను బట్టి అక్కడ కనీసం పది కొయ్య ఇళ్ళు ఉండేవనీ, అగ్ని ప్రమాదంలో అవి తగలబడి పోయాయనీ, ఆ శిథిలాల మీద ఆ తర్వాత రాతి కట్టడం అవతరించిందనీ అతను నిర్ధారణకు వచ్చాడు. ఆ బూడిద కుప్పల్లో ఒకచోట ఒక నాణెం దొరికింది. దానికి ఒక పక్క రోమన్ చక్రవర్తి కమొడస్(క్రీ.శ. 161) చిత్రం, ఇంకో పక్క యుద్ధంలో ట్రోజన్ సేనలకు నాయకత్వం వహించిన ట్రాయ్ రాకుమారుడు హెక్టర్ చిత్రం ఉన్నాయి. ‘హెక్టర్ ఇలియోన్’ (ట్రాయ్ కి చెందిన హెక్టర్) అని రాసి ఉన్న ఆ నాణెం అత్యంత శుభసంకేతంగా స్లీమన్ కళ్లకు కనిపించింది.

రెండు రోజులపాటు ఆ భవనం చుట్టూనే తవ్వించాడు. మూడో రోజున, ఆ స్థలం యజమానులైన ఆ టర్కులిద్దరూ ఏ క్షణంలోనైనా వచ్చిపడతారనిపించి; తూర్పు నుంచి పశ్చిమానికీ; దక్షిణం నుంచి ఉత్తరానికీ రెండు పొడవైన కందకాలను హడావుడిగా తవ్వించడం ప్రారంభించాడు. అందువల్ల ఆ నగరం తాలూకు పూర్తి చిత్రం ఏర్పడుతుందని అనుకున్నాడు.

అవడానికి అతని ప్రణాళిక పక్కాగానే ఉంది. కానీ పని మొదలెట్టించాడో లేదో, ఆ టర్కులిద్దరూ వచ్చిపడ్డారు. తమ స్థలంలో తవ్వకాలు జరుపుతున్న ఈ చిన్నపాటి సైన్యాన్ని చూసి విస్తుపోయారు. తను శాస్త్రీయ ప్రాముఖ్యమున్న పని చేస్తున్నాననీ, ఇందులో తనకు ఎలాంటి స్వార్థం లేదనీ, నిజానికి తను చేస్తున్న పని టర్కీ గౌరవాన్ని ఎంతైనా పెంచుతుందనీ స్లీమన్ దుబాషీ ద్వారా వారికి వివరించాడు. అప్పటికీ దిగ్భ్రాంతి నుంచి తేరుకోని ఆ టర్కులిద్దరూ ఈ పని చేసేందుకు మీ కెలాంటి హక్కూ లేదు, తక్షణం ఇక్కడినుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దాంతో స్లీమన్ వాళ్ళను బుజ్జగిస్తూ, బతిమాలుతూ తను తవ్వకాలు జరిపిన చోటికి తీసుకెళ్లి చూపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతత్వ శాస్త్రవేత్తలందరూ రేపు పొగడ్తలతో ముంచెత్తబోయే తన పరిశోధనాంశాల గురించి ఓ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు. ఇప్పటికే తను పల్లస్ ఎథెనా ఆలయం గోడలో కొంత భాగాన్ని, అసంఖ్యాకమైన అస్థికలను, తాపడం రాళ్ళను, పంది దంతాలను, అగ్నిప్రమాదం తాలూకు ఆనవాళ్లను బయటపెట్టానని చెప్పాడు.

టర్కులు కొంత మెత్తబడ్డారు. అన్నిటినీ మించి అక్కడ తవ్వి తీసిన పెద్ద బండరాళ్ళ మీద వాళ్ళ దృష్టి పడింది. సిమోయిస్ అనే చోట ఒక రాతి వంతెన కట్టించాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ బండ రాళ్ళు అందుకు బాగా పనికొస్తాయనిపించింది. ఈ రాళ్ళను తమ వంతెనకు వాడుకునే షరతు మీద ఆ రెండు పొడవైన కందకాలను తవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. స్లీమన్ వాళ్ళకు నలభై ఫ్రాంకులు చెల్లించాడు. అవి తీసుకుని వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

స్లీమన్ తను తవ్వి తీసిన వాటికి వెంటనే ఏదో ఒక చారిత్రకనామం ఉంచేవాడు. ఓ పెద్ద గోడ బయటపడగానే, ఆ కట్టడానికి పల్లస్ ఎథెనా ఆలయం అని పేరు పెట్టేశాడు. ఉత్తరపు కందకాన్ని తవ్వుతున్నప్పుడు అడుగున ఇరవై రెండు బూడిద పొరల కింద ఒక మృణ్మయ స్త్రీమూర్తి కనిపించగానే, దానికి హెలెన్ అని పేరు పెట్టాడు. తగిన ఆధారాలతోనే అలా పేర్లు పెడుతున్నాడా అన్నది అతనెప్పుడూ ఆలోచించుకోలేదు.

అయితే, టర్కులు వచ్చి వెళ్ళిన తర్వాత దీర్ఘాలోచనలో పడిపోయాడు. తన అదుపులో లేని శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి తప్ప తను ముందుకు వెళ్లలేడని అతనికి అర్థమైంది. నలభై ఫ్రాంకులు చెల్లించి, వంతెన కట్టుకోడానికి రాళ్ళు ఇస్తానని చెప్పి తను వాళ్ళతో తాత్కాలికంగా ఒప్పందం చేసుకున్నాడు కానీ, అది భగ్నమవదన్న నమ్మకం ఏమిటి? ఈ టర్కులు తమ హక్కులకోసం పట్టుబడితే ఏం చేయాలి? అక్కడికీ తను ఆ మొత్తం స్థలాన్ని కొనేయాలనుకుని బేరమాడాడు. వాళ్ళు చాలా ఎక్కువ ధర చెప్పారు. పైగా ఆ దిక్కుమాలిన వంతెన కోసం రాళ్ళు అడుగుతున్నారు. అంతకన్నా అపచారం ఉంటుందా? వీళ్లతో ఎలా వేగాలి? ఈ స్థలం మీద పూర్తి హక్కులు ఎలా సంపాదించాలి?

అతనిలాంటి ఆలోచనలతో సతమతమవుతుండగానే ఏప్రిల్ 21 న ఆ ఇద్దరు టర్కులూ మళ్ళీ వచ్చారు. ఇప్పటివరకూ తవ్విన రాళ్ళు వంతెనకు సరిపోతాయి, ఇక తవ్వకాలు ఆపేయండని హుకుం జారీచేశారు.

ఈ హుకుంను తోసిపుచ్చగల ఎలాంటి ఆయుధాలూ స్లీమన్ దగ్గర లేవు. వీళ్ళతో ఇక పోరాడి లాభం లేదు, వేరే మార్గాలు చూడాల్సిందే ననుకున్నాడు. తను ఇంతవరకూ చేసిన పనేమిటో, ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో వివరిస్తూ జర్మనీ, ఫ్రాన్స్, ఎథెన్స్, కాన్ స్టాంటినోపిల్ లో ఉన్న మిత్రులకు వరసపెట్టి ఉత్తరాలు రాశాడు. ఒక జర్మన్ మిత్రుడికి ఇలా రాశాడు:

అతి పురాతన ప్రాసాదాలు, ఆలయాల శిథిలాలను నేను బయటపెట్టాను. పదిహేను అడుగుల లోతున, ఒక అద్భుత నిర్మాణానికి చెందిన ఆరడుగుల మందమైన పెద్ద పెద్ద గోడల్ని కనుగొన్నాను. ఇంకా ఏడున్నర అడుగుల లోతున ఇవే గోడలు ఎనిమిదిన్నర అడుగుల మందమైన గోడలపై ఆని ఉండడం చూశాను. ఇవి ప్రియాం ప్రాసాదం గోడలో, లేదా ఎథెనా ఆలయం గోడలో అయుంటాయని అనుకుంటున్నాను.

అయితే, దురదృష్టవశాత్తూ ఈ స్థలానికి యజమానులైన ఇద్దరు టర్కులు అదేపనిగా చికాకు పెడుతున్నారు. బహుశా  రేపటితో వాళ్ళు నా పని ఆపేస్తారు. ఈ లోపల ఆ స్థలం కొనేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఏమైనా ప్రియాం ప్రాసాదాన్ని వెలికితీసే వరకూ విశ్రమించకూడదని నిర్ణయించుకున్నాను.

అలా రాశాడే కానీ, ఆ క్షణాన తను ఇక చేయగలిగిందేమీ లేదని అతనికి తెలుసు. పరిస్థితులకు తలవంచుతూ, పనివాళ్ళకు వేతనాలు చెల్లించి పంపేశాడు. ఈలోపల మైసీనియా తవ్వకాలకైనా అనుమతి వస్తుందని ఆశపడుతూ  ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. కొన్ని వారాలు మైసీనియాలో గడిపి, టర్కిష్ ప్రభుత్వం నుంచి ఫర్మానాను, హిస్సాలిక్ దిబ్బ మీద యాజమాన్య హక్కును సాధించుకున్న తర్వాత  ట్రాయ్ వచ్చి తిరిగి తవ్వకాలను ప్రారంభిచవచ్చనుకున్నాడు.

(సశేషం)

 

 

 

 

 

 

మీ మాటలు

  1. కల్లూరి భాస్కరం says:

    స్లీమన్ కథ-17 కు ఫుట్ నోట్ గా ఇది చదువుకోగలరు:

    నేను ఇంతకుముందు రాసిన అనేక ‘పురా’గమన వ్యాసాలలో కొన్ని ప్రతిపాదనలు చేశాను. 1. బలులు, స్త్రీ ప్రధానమైన ఇతర తంతులు కలిగిన ఆదిమ పౌరాణికత ఒకప్పుడు ఉండేది. అది దాదాపు ప్రపంచమంతా పంచుకున్న పౌరాణికత. 2. ఆయా మతాలను క్రీస్తు పూర్వ మతాలుగా, క్రీస్తు శకానంతర మతాలుగా వేరు చేసి చెప్పాల్సి ఉంటుంది. క్రైస్తవం, ఇస్లాం క్రీస్తు శకానంతర స్వభావం కలిగిన నిర్దిష్ట, వ్యవస్థీకృత మతాలు. హిందువులది క్రీస్తు పూర్వ మత లక్షణాలు కలిగినది, క్రీస్తు పూర్వ మతాలలో మత సహనం ఉంటుంది. ఒక మతం వారు, లేదా ఆరాధనావిధానానికి చెందినవారు; భిన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి విశ్వాసాలను తప్పనిసరిగా పాటించేవారు. 3. రోమన్ చక్రవర్తులు క్రైస్తవాన్ని అధికార మతం చేసిన తర్వాతే, వ్యవస్థీకృత రూపంలో మతాలు కరడుగట్టడం, ఇతర మతాలను, ఆరాధనా పద్ధతులను అంతమొందించడం ప్రారంభమైంది. ఆ ఒరవడిలోనే ఇస్లాం అవతరించింది.
    పై రచనా భాగంలో ఈ పరిశీలనకు పనికొచ్చే ఉదాహరణలు కనిపించి ఈ చిన్న వివరణ ఇవ్వాలనిపించింది. బలి పీఠాలు, బలులు స్త్రీ ప్రధానమైన ఆదిమ పౌరాణికతకు చెందినవి. ట్రాయ్ లో అడుగుపెట్టిన పర్షియన్, గ్రీకు, రోమన్ చక్రవర్తులు అక్కడి తంతులను, విశ్వాసాలను తుచ తప్పకుండా పాటించారు. వాటిపై గొప్ప భయభక్తులు చాటుకున్నారు. రోమ్ లో క్రైస్తవ చక్రవర్తులు అడుగుపెట్టేవారకూ ట్రాయ్ జనం రహస్య బలులు వగైరా తంతులు జరుపుకునేవారు. ఆ తర్వాత అవి ఆగిపోయాయి. ట్రాయ్ తవ్వకాలలో మృణ్మయ స్త్రీ మూర్తులు దొరికాయని చెప్పుకున్నాం. అవి కూడా ఆదిమ పౌరాణికతకు సాక్ష్యాలు.
    ప్రస్తుత కాలానికి వచ్చి చెప్పుకోవలసిన ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, హిందుత్వ పేరుతో నేడు ఉద్యమిస్తున్నవారు చేసే ప్రయత్నం అప్రకటితంగా హిందుత్వకు క్రీస్తు శకానంతర మిలిటెంట్ మత స్వభావాన్ని తీసుకురావడమే. కానీ మెజారిటీ హిందువులు ఇప్పటికీ క్రీస్తు పూర్వ మత స్వభావాన్ని జీర్ణించుకుని ఉండడం వల్లనే హిందుత్వ వర్గాలు మెజారిటీ మద్దతుకు పెనుగులాడవలసి వస్తోంది.

  2. k sivanageswararao says:

    గుడ్

మీ మాటలు

*