రూప వినిర్మాణం కోసం…

-అరణ్య కృష్ణ
~
aranya
ఎవరో కిరసనాయిల్లో ముంచిన గుడ్డముక్కలకి నిప్పెట్టి
గుండె లోపలకి వదుల్తున్నారు
గంధకం పొడిని ముక్కుదూలాల్లో నింపుతున్నారు
కుక్కపిల్ల తోకకి సీమటపాకాయ జడ కట్టి వదిలినట్లు
రోడ్ల మీద పరిగెడుతున్నాం
భస్మ సాగరంలో మునకలేస్తున్నాం
మాటల్లో పెదాలకంటిన బూడిద
ఎదుటివాడి కళ్ళల్లో ఎగిరి పడుతున్నది
మనిషో మోటారు వాహనంలా శబ్దిస్తున్నాడు
ఇంజిన్ల శబ్దాల్లో మాటలు
పాడుపడ్డ బావుల్లోకి ఎండుటాకుల్లా రాలిపోతున్నాయి
పలకరింపులు బీప్ సౌండ్లలా మూలుగుతున్నాయి
మనుషుల ముఖాలు సెల్ ఫోన్లలా చిన్నబోతున్నాయి
నెత్తిమీద ఏంటెన్నాను సవరించుకుంటున్న పరధ్యానం
ముఖాల మీద తారట్లాడుతున్నది
ఏవో మూలుగులు పలవరింతలే తప్ప
చిర్నవ్వుల పరిమళాల్లేవ్
కరచాలనాల్లో చెమట చల్లదనం  తప్ప
చర్మ గంధం తగలటం లేదు
ఒకర్నొకరు గుర్తుపట్టలేని బంధాలు
గుంపు కదలికల్లో విఫలమైపోతున్న ఆత్మ సం యోగాలు
హోర్డింగులు నిర్దేశిస్తున్న జీవన వాంచలు
ప్రేమల ప్రాణవాయువులందక హృదయాల దుర్మరణాలు
నగరం మానవాత్మల మీద మొలుస్తున్న మహా స్మశానం
నేను మాత్రం రూపవిచ్చతి కోసం గొంగళిపురుగులా
ఒక తావు కోసం వెతుక్కుంటున్నాను .
*

మీ మాటలు

  1. చందు - తులసి says:

    దుస్థితిని చూపిస్తూనే ఆశావహంగా ముగించారు…బావుంది సార్..

  2. సహా గొంగలి పురుగునే . తావు దొరికితే కాస్తా చెప్పండి .

  3. Shivakumar says:

    తెలుగులో కవులు ఉన్నారు
    కానీ బతికున్నవాళ్ళలో (కవులు) లేరు
    -కె. శివకుమార్
    siva.kotla1@gmail.com

    • Aranya Krishna says:

      శివకుమార్ గారూ! అర్ధం కాలేదు. కొంచెం వివరిస్తారా?

మీ మాటలు

*