రఫీ వెర్సస్ రఫీ

 

 

 

Prajna-1అది పోలీస్ స్టేషన్. చుట్టూరా కోప్స్. ‘చైల్డ్ హర్రాస్మెంట్’ కేస్ కింద అరెస్టు అయ్యాడు రఫీ.

నా  పేరు రఫీ, మొహమ్మద్ రఫీ. మా నాన్నగారు సింగర్ మొహమ్మద్ రఫీ కి వీరాభిమాని. అందుకే నాకు ఆ పేరు పెట్టారు. అన్నట్టు మా నాన్నగారి పేరు మొహమ్మద్ అలీ. భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ఆయన ఒక కీలక పాత్ర వహించారు. వరంగల్ లో ఆయన జన శక్తి అనే వార్తా పత్రికకి సంపాదకీయం వహించారు. కత్తి కంటే కలం గొప్పది అనే సిద్ధాంతాన్ని ఆయన నమ్మారు. అంతే కాదు! అప్పటి సమాజంలో ఉన్న దురాచారాలని అరికట్టేందుకు తన వంతు సహాయం చేసేవారు. మా నాన్నగారు ఒక సోషల్ రిఫార్మర్. ఆయన ముస్లిం అయినప్పటికీ ఒక బ్రాహ్మల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందుకే మా నాన్నగారి స్నేహితులు అతనిని షేక్ వీరేశలింగం అని పిలిచేవారు. అప్పటి కాలంలో వేరే వాళ్ళ ఇళ్ళలో ఉన్నట్టు ఉండేది కాదు మా ఇంట్లో పరిస్థితి. మా నాన్నగారికి మత పిచ్చి లేదు. కానీ దేవుడు అంటే అపారమైన నమ్మకం. నమాజ్ చేసేవారు, అమ్మ పూజలలో కూడా కూర్చోనేవారు.  మా అక్కలకు భారతి అని, సరోజినీ అని, మా తమ్ముడికి బోస్ అని పేర్లు పెట్టారు. వాళ్ళందరూ  చక్కగా చదువుకున్నారు. అక్కలు, తమ్ముడు – వీళ్ళందరూ  ప్రభుత్వ ఉద్యోగస్తులు. గొప్ప హోదాల్లో రెటైర్ అయ్యారు. 

 నాన్నగారికి నేనంటే ఎందుకో ప్రత్యేక అభిమానం.  నాకు బాగా గుర్తుంది, ఆయనకి యాభై అయిదేళ్ళు వయస్సప్పుడు ఒక రోజు బాగా ఎమోషనల్ అయ్యారు. నన్ను దగ్గరకు పిలిచి, “నీకు పదిహేను యేళ్ళు వచ్చినై . జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావో ఇప్పుడే నిర్ణయం తీసుకో. ఏం చేసినా కానీ, నీ వాళ్ళకి తోడు గా ఉండు” అని అన్నారు. ఆ రోజు నాకు చాలా బాధ కలిగిన రోజు. ఆ రాత్రే కన్నుమూశారు. నాకు ఇంకా గుర్తుంది. నేను నా జీవితంలో జర్నలిజం చేయాలనే అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్న రోజు.

నా జీవితంలో జర్నలిజం ఉన్నదో, జర్నలిజం లో నా జీవితం ఉన్నదో నాకు తెలీదు. కానీ నాకు జర్నలిజం అంటే నా ప్రాణంతో సమానం. నలభై యేళ్లకు పైగా ఈ ప్రొఫెషన్ లో ఉన్నాను. ఎన్నో పలకరింపులు, ఎన్నో అడ్డంకులు, ఇంకేన్నో బెదిరింపులు-ఇలా నా జీవితం సాగిపోయింది. నేను కూడా మా నాన్నగారి అడుగుజాడల్లో నడిచాను. ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లిచేసుకున్నాను. మా బాబు కళ్యాణ్ పుట్టిన మూడేళ్ళకి నా భార్య కాన్సర్ వచ్చి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరూ నన్ను చాలా జల్దీ విడిచి వెళ్ళిపోయారు. నాన్నగారూ, నా భార్యా ఇద్దరూ నన్ను ఒంటరి  వాడిని చేసేశారు. కానీ నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. జర్నలిజం లో మునిగిపోయాను. మా అక్కలు కళ్యాణ్ ని దత్తతు చేసుకుంటాం అన్నారు. కానీ కళ్యాణ్ ని పెంచే బాధ్యత నేనే తీసుకున్నాను.  మా నాన్నగారు మాకు పంచిన విలువలతో వాడిని పెంచాను. అవే మా నాన్నగారు నాకిచ్చిన ఆస్తి.  

“నాన్నా, పదండి వెళ్దాము” కళ్యాణ్ , రఫీ ని పిలవటంతో రఫీ ఈ లోకంలోకి వచ్చాడు.

కళ్యాణ్ తన తండ్రి అంగీకారంతోనే ‘వెరోనికా’ అనే ఒక అమెరికన్ ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఎనిమిదేళ్ళ బాబు. కళ్యాణ్ తన తండ్రి పేరునే కొడుకుకి పెట్టుకున్నాడు ‘రఫీ’ అని. కాలిఫోర్నియా లో ఇల్లు కొనుక్కొని సెటిల్ అయ్యాడు. కళ్యాణ్ కి తండ్రి అంటే చాలా ప్రేమ, గౌరవం.  అరవై యేళ్ళు వస్తున్న తండ్రిని దగ్గరకి తెచ్చుకొని , కేర్ తీసుకోమని వెరోనికా సలహా ఇచ్చింది. రఫీ ని రిటైర్ అవ్వమని చెప్పి, తనతో పాటు కాలిఫోర్నియా లో ఉండమని కళ్యాణ్ కోరాడు. రఫీ కి యాభై యేళ్ళ సావాసం జర్నలిజం తో. కానీ పని వత్తిడి తట్టుకోవడం కష్టంగా అనిపించసాగింది. పైగా కొత్త కొత్త ఛానెల్స్ రావడంతో పాత జర్నలిస్టుల హవా తగ్గిపోయింది. ఇన్నేళ్లు కష్టపడ్డాడు. ప్రాక్టికల్ గా ఆలోచించాడు. తన తండ్రి అన్న మాటలు గుర్తుతెచ్చుకున్నాడు. ఇప్పుడు ఉన్న జీవితాన్ని వదిలేసి, ఫ్యామిలి తో ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకున్నాడు. అందుకే కళ్యాణ్ అడిగిన వెంటనే ఇష్టంగానే ఇండియా వదిలేసి అమెరికా వచ్చేశాడు.

వచ్చిన మొదటి వారంలో నే అరెస్టు అయి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. కళ్యాణ్ తనకి తెలిసిన లాయర్ ని పట్టుకెళ్ళి, రఫీ ని విడిపించుకొని వచ్చాడు. ఇంటికి కార్ లో తిరిగొస్తున్నప్పుడు,

“నా తప్పే. పిల్లాడిని అనవసరంగా కొట్టాను” రఫీ బాధగా అన్నాడు.

“అయ్యో లేదు నాన్నా. ఇక్కడ పిల్లలని దారిలో పెట్టడం చాలా కష్టం. మీ తప్పు లేదు ఇందులో” కళ్యాణ్ డ్రైవ్ చేస్తూ తండ్రిని సముదాయిస్తున్నాడు.

“పిచ్చివాడిలాగా మాట్లాడకు. తప్పు నాదే. ఇంపేషన్ట్ అయిపోయాను సడన్ గా. వాడి అల్లరికి నాకు కోపమొచ్చేసి కొట్టేశాను. కానీ వాడు ఇలా పోలీసులకి కాల్ చేస్తాడని అనుకోలేదు” రఫీ అన్నాడు.

“మీకు తెలిసిందే కదా నాన్న… ఇక్కడ స్కూల్ లో నేర్పిస్తారు. ఇంట్లో ఎవరైనా కొడితే 911 కి కాల్ చేయమని. ఇంతకీ వాడు ఏమన్నాడు మిమ్మల్ని?”

“నన్ను ఒక అసభ్యకరమైన భూతు తిట్టాడు”

“నేర్చుకుంటాడులే నాన్న. ఇంటికెళ్ళాక అన్నీ సర్దుకుంటాయి. మీరు ఎక్కువగా బాధపడకండి” అని కళ్యాణ్ అన్నాడు.

“అలాగే”

ఇంటికొచ్చాక వెరోనికా చక్కగా నవ్వి పలకరించింది. తన మీద ఏం కోపం లేదా అని రఫీ అడిగితే, తన కొడుకే ఏదో వెధవ పని చేసుంటాడని తనకి తెలుసని చెప్పింది. కళ్యాణ్, వెరోనికాలు చూపించే అభిమానం గురించి గర్వపడాలో..ఒక చిన్నపిల్లాడిని కొట్టినందుకు బాధపడాలో రఫీ కి అర్ధంకాలేదు. కొడుకుని తండ్రికి సారీ చెప్పమని అడిగాడు కళ్యాణ్.

“ఐ యాం సారీ” మనవడు అన్నాడు.

“హే రఫీ, ఐ యాం సారీ టూ ” రఫీ మనవడితో అన్నాడు.

“డోంట్ కాల్ మీ దాట్. ఐ యాం రాల్ఫ్, నాట్ రఫీ”

“ఒకే రాల్ఫ్, ఏమైనా ఆడుకుందామా?”

“నో. ఐ డోంట్ లైక్ యు” అనేసి తన రూమ్ లోకి పారిపోయాడు రాల్ఫ్. అలా అనకూడదు అని తిడుతూ వాడి వెంటే వెరోనికా వెళ్లింది.

“మీ పేరు పలకటానికి మీకు ఎక్సైటింగ్ గా ఉంటుందేమో కానీ, వీడికి మాత్రం ఎందుకో ఆ ‘రాల్ఫ్’ అంటేనే ఇష్టం నాన్నా. మీరు ఇంకా వాడికి అలవాటు అవ్వలేదు. వదిలేయండి. వాడిని మీతో వదిలేద్దాం అనుకున్నాము ఈ సమ్మర్ కి. వాడికి కొంచం తెలుగు కొంచం ఉర్దు, కొంచం హింది వచ్చు, మీ చేత అవి బాగా నేర్పిద్దాము అనుకున్నాము. కానీ వద్దులెండి. మళ్ళీ ఏదొకటి చేస్తాడు. సమ్మర్ కాంప్ కి పంపించేద్దాము” అని కళ్యాణ్ అన్నాడు.

మరునాడు పొద్దునే రఫీ నమాజ్ చేసి, కళ్యాణ్ సమ్మర్ కాంప్ వాళ్ళకి కాల్ చేస్తుండగా దగ్గరకి వచ్చి, “నేనొక తండ్రిని. జర్నలిస్ట్ ని. ఇంత అనుభవం ఉన్న నేను నా మనవడితో సఖ్యంగా లేకపోతే నాకు సిగ్గుచేటు. సమ్మర్ కాంప్ వద్దు. నేనే వాడితో ఫ్రెండ్ షిప్ చేస్తాను” అని నవ్వుతూ అన్నాడు.

కళ్యాణ్ కూడా తిరిగి నవ్వాడు, రఫీ ఏదో మాస్టర్ ప్లాన్ వేశాడు అని. తండ్రి అంటే అంత అపారమైన నమ్మకం. తండ్రి మాటంటే అంత గౌరవం.  కళ్యాణ్, వెరోనికా లీ ఆఫీసు కి వెళ్ళిపోయారు. రఫీ మనవడికోసం బ్రెడ్ టోస్ట్ చేశాడు.

“హే రాల్ఫ్, హావ్ దిస్” అని నవ్వుతూ రాల్ఫ్ కి ఇచ్చాడు.

“నో”

“ఆకలి లేదా?”

“నో”

“ఓకే. చాలా టేస్టి గా ఉంది మరి” అని అంటూ మొత్తం తినేశాడు రఫీ. రాల్ఫ్ పెదవులను నాలుకతో తడపటం తప్ప ఏమి చేయలేదు.

మధ్యానం లంచ్ కి ఎగ్ కరీ, అన్నం పెట్టాడు రఫీ. రఫీ వండాడు కనుక రాల్ఫ్ ముద్ద కూడా ముట్టుకోలేదు. కడుపు మాత్రం కాలిపోతోంది. వెరోనికా నాలుగు రోజులకని తన చెల్లెలి ఊరికి వెళ్లింది.  డిన్నర్ టైమ్ కి కళ్యాణ్ ని కిచెన్ లో చూసి, “డాడీ ఇస్ కుకింగ్” అనుకోని కొంచం హాపీ ఫీల్ అయ్యాడు. ఆలు ఫ్రై, సాంబార్ అన్నంతో ఫుల్ గా తినేశాడు రాల్ఫ్.

“డాడీ, కుక్ డైలీ ప్లీజ్. ఐ మిస్ దిస్ ఫుడ్” రాల్ఫ్ కళ్యాణ్ తో అన్నాడు.

కళ్యాణ్ రఫీ తో “డాడీ, కుక్ డైలీ ప్లీజ్. ఐ మిస్ దిస్ ఫుడ్” అని అనేసి నవ్వాడు.

వంట చేసింది తన డాడీ కాదు అని, రఫీ అని తెలుసుకొని, ఉక్రోషం వచ్చింది రాల్ఫ్ కి. కానీ అప్పటికే లొట్టలేసుకుంటూ మొత్తం తినేశాడు. వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ తన రూమ్ లోకి వెళ్లిపోయాడు.

“కళ్యాణ్… నేను నా మెయిల్ చెక్ చేసుకోవాలి, కంప్యూటర్ లేదా ఇంట్లో?” అడిగాడు రఫీ.

“ఉంది నాన్నా, జూనియర్ రఫీ రూమ్ లో” అని కళ్యాణ్ కన్నుకొట్టాడు.

కాసేపయ్యాక, “మే ఐ కమిన్?” రఫీ మనవడి రూమ్ తలుపు కొట్టాడు.

రఫీ గొంతు విని, “నో” అన్నాడు రాల్ఫ్.

“ప్లీజ్”

“నో” అని గట్టిగా అరిచేశాడు. చేసేదేమీ లేక, కళ్యాణ్ లాప్టాప్ ని రఫీ వాడుకున్నాడు. ఆ రోజు అలా గడిచిపోయింది.

మరుసటి రోజు పొద్దునే రఫీ ఉప్మా చేశాడు. కళ్యాణ్ తినేసి ఆఫీసు వెళ్లిపోయాడు. రఫీ కూడా తినేసి టి‌వి చూస్తూ కూర్చున్నాడు. రఫీ కి వినపడేలాగా గట్టిగా ఫోన్ లో తన డాడీ తో వంట ఎందుకు చేయట్లేదని  అడిగాడు. “వంట చేయటం మర్చిపోయాను, తాత బాగా చేస్తాడు. తిను” అని ఫోన్ కట్ చేశాడు కళ్యాణ్. మళ్ళీ ఉక్రోషం తో ఏం తినకుండా పడుకున్నాడు రాల్ఫ్. రాల్ఫ్ ని చూస్తుంటే రఫీ కి బాధగా ఉంది. కానీ వాడిని దారిలో పెట్టాలంటే ఇలాంటి బాధించే పనులు చిన్నవి చేయక తప్పదు. ‘కుచ్ పానే కే లియే కుచ్ ఖోనా హేయ్” అనుకున్నాడు రఫీ.

ఏదో బ్రిల్లియంట్ ఐడియా తట్టినట్లు, రాల్ఫ్ లంచ్ టైమ్ కి రయ్ రయ్ మంటూ రఫీ దగ్గరికొచ్చాడు. లాల్చీ పైజామా లో ఉన్న రఫీ ని చూసి ‘అబ్బాహ్ ఓల్డ్ మాన్’ అనుకున్నాడు.

“ఐ యాం హంగ్రీ”

“ఓకే”

“ఐ వాంట్ ఫుడ్”

“ఓకే”

“నేను కంప్యూటర్ ఇస్తాను. నాకు లంచ్ ఇయి” రాల్ఫ్ అన్నాడు వచ్చి రాని తెలుగులో.

“డీల్” అని రఫీ అనగానే జూనియర్ రఫీ మొహం వెలిగిపోయింది.

లంచ్ చేశాక చెప్పాలా వద్దా అని వందసార్లు ఆలోచించి “థాంక్స్” అనేసి లోపలికి వెళ్లిపోయాడు. మనవడు దారిలో పడ్డాడు అని సంతోషించి తను చదువుతున్న ‘రివర్స్ సైకాలజీ’ బుక్ చూసి నవ్వుకున్నాడు.

రెండు రోజులు ఇలాగే డీల్స్ నడిచాయి ఇద్దరి మధ్యన. రాల్ఫ్ రఫీ ని రఫీ అనే పిలుస్తున్నాడు ఇంకా. తాతా అని పిలిపించుకోవాలని రఫీ కి ఎంతో ఇదిగా ఉంది. ఆ రోజు రాల్ఫ్ దగ్గరకెళ్లి “ఒక ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి” అని తన చిన్నప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చాడు రాల్ఫ్ కి. రాల్ఫ్ ఆ ఫోటో ని జాగ్రత్తగా పరిశీలించి, రఫీ ని గుర్తుపట్టాడు. ఎంతో యంగ్ గా, అప్పట్లో స్టయిల్ తగ్గట్టు పాంట్, షర్ట్ వేసుకొని ఉండటం గమనించాడు.

“యు వర్ సొ హాండ్సమ్” రాల్ఫ్ అన్నాడు.

“యు ఆర్ సొ హాండ్సమ్” అని రాల్ఫ్ జుత్తుని నిమిరాడు రఫీ. రాల్ఫ్ సిగ్గుపడ్డాడు.

సాయంత్రం టైమ్ కి నేను వాకింగ్ చేసోస్తాను అని రాల్ఫ్ తో రఫీ అన్న వెంటనే, షూస్ వేసుకొని “మి టూ” అని రఫీ తో బయలుదేరాడు.  నడుస్తూ మధ్యలో రఫీ ని ఎన్నో ప్రశ్నలు అడిగాడు, రఫీ ఒక గొప్ప వ్యక్తి అని రాల్ఫ్ చిన్న మనసుకు అర్ధమయింది. తన తాత ది కూడా లవ్ మేరేజ్ అని తెలుసుకున్నాడు.

“యు వర్ ఎ ఫ్రీడం ఫైటర్?” అడిగాడు రాల్ఫ్.

“ఇన్ ఎ వే, యెస్” రఫీ అన్నాడు.

“యు ఆర్ గ్రేట్ తాతా” రాల్ఫ్ అన్నాడు.

‘తాతా’ అని వినగానే రఫీ కళ్ళనుండి ఆనంద భాష్పాలు కారాయి. ఎన్నో భావాలు. జర్నలిస్ట్ గా సాధించిన సక్సెస్ అంతా ఈ ఒక్క పిలుపుతో వచ్చినట్లు అనిపించింది. నవ్వుతూ రాల్ఫ్ ని హగ్ చేసుకున్నాడు. రాల్ఫ్ కూడా తన తాత ని మనసారా హగ్ చేసుకున్నాడు.

ఇంటికొచ్చాక తాను తెలుసుకున్న విషయాలు అన్నీ కళ్యాణ్ తో రాల్ఫ్ చెప్పాడు. తన తండ్రి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురుకున్నాడు. చిన్నతనంలోనే రఫీ తండ్రి పోవటం, జర్నలిస్ట్ జీవితం, భార్యతో కూడా ఎక్కువ కాలం గడపలేదు.  అమ్మ లేని లోటు తెలియకుండా, ఎంతో ప్రేమగా, మోరల్స్ నేర్పిస్తూ పెంచిన తండ్రిని హగ్ చేసుకోవడం ఇప్పుడు కళ్యాణ్ వంతు. ఈ సెంటిమెంట్ సీన్ నుండి బయటపడాలని రాల్ఫ్ “తాత ఇవాళ పకోడీ, చికెన్ బిర్యానీ, కేక్ చేస్తాడు” అని అన్నౌంస్ చేశాడు.

“యెస్. పకోడీ ఫర్ ఉర్దు, బిర్యానీ ఫర్ హింది, కేక్ ఫర్ తెలుగు- డీల్స్. అవన్నీ నేర్చుకుంటావా మరి?” కన్నుకొడుతూ అడిగాడు సీనియర్ రఫీ.

“ఎనీథింగ్ ఫర్ ఫుడ్ అండ్ థాథా” అని ‘తాతా’ అనే పదాన్ని అమెరికన్ అక్సెంట్ లో అంటూ, తిరిగి కన్నుకొట్టాడు జూనియర్ రఫీ.

************************************************************************

మీ మాటలు

  1. తిలక్ బొమ్మరాజు says:

    చాలా చక్కని కథ రాసారు ప్రజ్ఞ గారు.కొన్ని బంధాలని క్షుణ్ణంగా పలికించారు.అభినందనలు.

  2. Mohanbabu says:

    కళ్ళ లో నీళ్ళు తిరిగాయి

  3. చొప్ప వీరభధ్రప్ప says:

    కథ చాలా బాగుంది. ఓర్పుతో ఎంత టి సమస్య నైనా పరిష్కరించు కోవచ్చు..తాతయ్య గారి మనస్థత్వం .తాత లందరు గుర్తించదగినది.

Leave a Reply to Mohanbabu Cancel reply

*