ఏంజేత్తదో ఎవలకెరుక..

-కందికొండ

(సినీ గేయ రచయిత)

~

IMG-20151112-WA0010

 

kandiమా అవ్వ బతుకమ్మ పండుగకు ఊరికి రమ్మని ఫోన్ జేసింది . నేనన్నా ‘మా ఇద్దరిపోరగాండ్లకు మాకు ఇంటినలుగురికాకం కలిపి రానుపోను,ఇంటికచ్చినంక పండుగ ఖర్సు కలిపి ఓ నాలుగైదు వేలయితై ఎందుకులే ’  అన్న. ‘రేపు మేం సచ్చినంక మీరు వచ్చేది రాంది మేం సూత్తమాగని  మా జీవి వున్న నాల్గు రోజులన్నవచ్చిపోరాదుండ్లి, మీ పోరగాండ్లు కండ్లల్ల మెరుత్తాండ్లు’ అన్నది. మారు మాట్లాడకుంట ఊరికిపోయినం!

బతుకమ్మ పండుగ బాగనే జరిగింది. దసరా పండుగనాడు ఓ యాటపోగు తీసుకున్నం . మా మచ్చిక లక్ష్మణ్ గౌడ్ చిచ్చా ఇద్దరు రెగ్యులర్ “వాడిక” దార్లకు ఎగ్గొట్టి వాళ్ళ బాపతి కల్లు నాకు పోషిండు. తాగి అబద్దమెందుకు ఆడాలె గని ఉన్న నాలుగు రోజులు కడుపునిండ కల్లు తాగిన. పండుగ సంబురంగనే జరిగింది . కానీ, ఒక్కటే బాధ! ఈ బాధ ఇప్పడిదికాదు ఆరేడు సంవత్సరాలనుంచైతాంది . మా ఇంట్లనుంచి బయటికెల్లంగనే కుడిచేయి రోకు పెసరు కొమ్మాలు ఇల్లు ఉంటది. నేను ఆయనను పెద్దనాయిన అని పిలుస్త. మా నాయిన కన్నా రెండు మూడు సంవత్సరాలు వయసులో పెద్దోడు. వాళ్ళు మా కులపోళ్ళో,సుట్టాలో కాదుగనీ మంచి కలుపుగోలు మనుసులు.వాళ్ళ శిన్నకొడుకు శీనుగాడు నేను సాయితగాండ్లం .

ఆయనకు ఆరేడు సంవత్సరాల కిందట పక్షవాతం (పెరాలసిస్) వచ్చి నోరు కాళ్ళు  చేతులు పడిపోయినై . ఊళ్లే ఆ పెద్దనాయిన తోటోళ్లే కాదు ఆయనకన్నా పెద్దోళ్ళు కూడా ఎవల పని వాళ్ళు చేసుకుంటాండ్లు,మంచిగనే ఉన్నరు.  పాపం పెద్దనాయిన పరిస్తితి అట్లయ్యింది .కొంచం దూరం కూడా నడువలేడు .ఆయన పనులుగుడ ఆయన శేసుకోలేడు. మూత్రం దొడ్డికి అన్నీ మంచం పక్కేనే… ఖాళీ స్థలం లో . అది కూడా ఎవలన్నఆసరుండాల్సిందే,లేకపోతే అన్నీ మంచంలనే. పాపం పెద్దవ్వ పెసరు ఈరలచ్చమ్మ భూదేవసొంటిది,మస్తు ఓపికతోని దొడ్డికి ఎత్తిపోసేది. సుట్టుపక్కల ఊడ్సేది,బట్టలల్ల మూత్రమో దొడ్డికో పోతే బట్టలన్నీ తెల్లగ పిండేది. రెండు మూడు సంవత్సరాల కిందట ఆ పెద్దవ్వ సచ్చిపోయింది. కొడుకులు కోడండ్లు మనవండ్లు మనవరాండ్లు ఉన్నరు,బాగానే అర్సుకుంటరు . కానీ, అన్నీ వుండిలేమి  కుటుంబాలే కదా..కూలికో నాలికో పోకపోతే ఇంట్లకెట్లెల్లుద్ది . వాళ్ళు పనికిపోయేటప్పుడు ఇంత అన్నం, మంచినీళ్లు పెట్టిపోతరు.

పెద్దనాయిన పాత కుమ్మరి గూనపెంక ఇంటి ముందు,చింతచెట్టుకింద ఓ పాత నులక మంచమేసుకుని వచ్చి  పోయేటోళ్లను సూసుకుంట మందలిచ్చి మాట్లాడుకుంటా రోజును ఎళ్లదీత్తడు .రోజెళ్లదీసుడేంది అట్లా ఏడు సంవత్సరాలనే ఏళ్లదీసిండు. ఒకవేళ, ఆదాట్నవానత్తె  తడవాల్సిందే,బాగా ఎండత్తే  ఎండాల్సిందే,సలిపెడితే వణుకాల్సిందే.ఇంకొకల ఆసరా లేకుండా కదలలేడు. పెద్దనాయిన పరిస్తితి సూత్తాంటే నాకు శ్రీ శ్రీ “జయభేరి” కవితల “ఎండాకాల మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా! వానకాలం ముసిరిరాగా నిలువు నిలువున నీరు కాలేదా ! శీతాకాలం కోతపెట్టగ కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే!” అనే పంక్తులు గుర్తుకచ్చి అవి పెద్దనాయిన కోసమే శ్రీ శ్రీ రాసిండా ఏంది ! అనిపిచ్చేది.

ఒకప్పుడు ఇరవై అయిదు ముప్పై సంవత్సరాల కిందట… నేను చిన్నపోరగాన్ని, టూపులైటు లాగులేసుకుని ఎగిడిశిన భూతంలెక్క ఊళ్లె  తిరిగేటోన్ని. అప్పుడు పెద్దనాయిన ఎట్లుండేటోడు పులి లెక్క ! పెసరు కొమ్మయ్య అంటే ఒక ఆట, పెసరు కొమ్మయ్య అంటే ఒక పాట,పెసరు కొమ్మయ్య అంటే ఒక కోలహలం …ఒక కోలాటం. అప్పటి రోజులు నాకింకా గుర్తున్నాయి. ఎండాకాలం,సలికాలం,ఎన్నెల ఎలుగులల్ల నాలుగుబాటల కాడ కమ్యూనిష్టు పార్టీ జెండా గద్దె ముందు రాత్రి ఏడెనిమిది గంటలకు ఊరోళ్ళంతా ఇంత తినచ్చి కూసునేది .

పెద్దనాయిన రాంగనే సందడి మొదలయ్యేది. అందరూ పక్కన పెట్టుకున్న ‘పట్నం తుమ్మ’ కోలలు తీసుకుని గుండ్రంగా నిలబడేటోల్లు ,పెద్దనాయిన కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, చేతిల చిరుతలు పట్టుకుని మధ్యల నిలబడి పాట పాడుకుంటూ చిందేసేది. నాకయితే సినిమాలల్ల కైలాసంల శివుడు నాట్యం శేత్తానట్టు అనిపిచ్చేది.ఆ చిందేసే కాళ్ళు అసలే ఆగకపోయేది. చేతుల చిరుతలు రికాం లేకుండ (నాన్ స్టాప్ గా) మోగేటియి . పెద్దనాయిన పాడుతాంటే సుట్టున్నోళ్ళు కోరస్ పాడుకుంట ఎగిరేటోళ్లు . గుండ్రగ నిలబడి కోలాటమెసేటోళ్ళల్ల ఎవ్వలకన్న దమ్మత్తే(ఆయాసం)వాళ్ళ కోలలు వేరేటోళ్లకిచ్చి వాళ్ళు కూసోని మొస్స తీసుకునేటోళ్లు .కానీ పెద్దనాయిన కాలు నిలవకపోయేది. నోటెంట పాట ఆగకపోయేది. అట్ల ఆగకుండా గంటలకొద్ది చిందులేసిన కాళ్ళు ఇప్పుడు సచ్చుబడిపోయినాయి. గల్లుగల్లున చిరుతలు మొగిచ్చిన చేతులు ఆయన పని ఆయనే చేసుకోవటానికి సహకరిస్తలేవు.

నాలుగు బాటల కూడలిలో గొంతెత్తి పాటపాడితే వాడకొసలకు ఇనచ్చేది,ఊరు మారు మొగిపోయేది. అసోంటి గొంతు బాధైతే చెప్పుకునేదానికి,ఆకలైతే అన్నమడగటానికి కూడా లేత్తలేదు. పెద్దనాయిన పరిస్తితి పగోనికి కూడా రావద్దనిపిస్తది. ఆయన బాధ సూత్తాంటె సూత్తాంటనే నాకు తెలవకుంటనే నా కండ్లల్ల నీళ్ళు కారినయి. ఏడుపచ్చింది. అట్లాంటి పెద్ద నాయినలు ఊరికి ఎంతమంది ఉన్నారో కదా…

జీవితం ఎప్పుడు ఎవల్ను ఏంజేత్తదో ఎవలకెరుక. అందుకే రిచర్డ్ డేవిడ్ బాక్ అనే రచయత ఇట్లన్నట్టున్నది…. “Life does not listen to your logic; it goes on its own way, undisturbed. You have to listen to life”.

*

 

మీ మాటలు

  1. venu udugula says:

    అన్నా అద్బుతం. కీప్ రైటింగ్. ఇలా నెలకి ఒకటి చొప్పున రాయండి అన్నా.బాగుంటుంది.

  2. దామొదర్ says:

    కండ్లముందు ఓ జీవితం కనిపించిందన్న…..

  3. మా ఉరు జేవితం అన్ని యదికచ్చినాయి…

  4. గొరుసు says:

    “ఆయన బాధ సూత్తాంటె సూత్తాంటనే నాకు తెలవకుంటనే నా కండ్లల్ల నీళ్ళు కారినయి. ఏడుపచ్చింది. అట్లాంటి పెద్ద నాయినలు ఊరికి ఎంతమంది ఉన్నారో కదా…”
    ……………………………………………………..
    పెసరు కొమ్మయ్యను ప్రత్యక్షంగా చూస్తె మీకు కండ్లల్ల నీళ్ళు కారినయ్ కందికొండ గారూ. పరోక్షంగా ఆయన గురించి మీరు ఆర్ద్రతతో చెబుతుంటేనే తట్టుకోలేకపోయాను. “థూ దీనమ్మ జీవితం ” అనిపించకుండా ఉంటుందా ?
    కొమ్మయ్య బాధకు వ్యధ , మీ అందమైన ఉత్తర తెలంగాణ మాండలీక పరిమళానికి ఆనందం – ఈ రెండూ ఏకకాలంలో నన్ను సుఖవంతమైన దుఃఖంలోకి నెట్టివేసాయి.

  5. raamaa chandramouli says:

    కందికొండా..ఒక అద్భుతమైన సజీవ జీవిత శకలాన్ని తెచ్చి కన్నీటిస్పర్శతో పాఠకలోకానికి పరిచయం చేసావు.ఇటువంటి కనిపించని కన్నీళ్ళెన్నో..కొనసాగించు ఈ అన్వేషనాత్మక రచనను.

    – రామా చంద్రమౌళి

  6. అన్న సూపర్ అమ్మ నాన్న మనకు చాల ముక్కమ్ తరువాత వేరే ఏమైనా వాళ్ళకు సర్వీస్ చేయని లైఫ్ వెస్ట్ అన్న రేపు మనం అమ్మ నాన్న లమే గుర్తుంచుకోండి

  7. నేను సదూకునె అర్రకు ఎదురుంగనె మా పెదనాయిన గిట్లనే పక్షవాతం తోటే పడుండే. సింహం తీరు బతికినోనికి సిన్న పోరగాడు గూడ దేకక పోతుండే. తన పరిస్తితిని తలుసుకుంట దినాం ఏడ్చుకుంట సచ్చిండు. ఆ బాధ మళ్ళీ మెదిలింది. మన మాటల్లో బాగా రాసారు.

  8. Mohanbabu says:

    ఇలాంటి బతుకులు చాల వెల్లమారిపోయాయి , బతుక్కి లాజిక్కు పాడు లేదు , భయమేస్తుంది రేపటిని తలచుకొని , బాగా రాసారు , మాండలీకం మరీ బాగుంది .

  9. Kaavati venkat says:

    చాల భాగుoడి ..

  10. Dr.Banala srinivasrao says:

    Thanks a lot Kandikonda gaaru for writing such a wonderful experience of your life. it is indeed quite heart-rending to read such adeplorable condition an old man who led an energetic inspiring life at his young age. your telangana slang touches each and every true telanganite. keep it up.

  11. అసురుడు says:

    నీవు కంది కొండవే కాదు అన్న…. బంగారు కొండవు. పెన్నుతోటి గాదు… గుండెతోటి రాసినట్లుంది. గుండెకింద తడి ఉన్నోళ్లందరికీ కళ్లెంట నీళ్లు వొస్తయి. అట్ల రాసినవ్.

మీ మాటలు

*