సంగమాలు సంగరాలౌతోన్న సందర్భంలో…

 

-ఎ.కె. ప్రభాకర్

~

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

వివాహ వ్యవస్థలోని  ఆధిపత్యాల గురించి  అసమానతల గురించి అణచివేతల గురించి అభద్రత గురించి స్త్రీ పురుష సంబంధాల్లో చోటుచేసుకొనే   వైరుధ్యాల గురించి నైతిక విలువల గురించి చర్చిస్తూ యీ నేలమీద స్త్రీవాదం మాట పుట్టక ముందు నుంచి కూడా సాహిత్యం విస్తృతంగానే వెలువడింది. అయితే స్త్రీవాదం ఆ వ్యవస్థలో వేళ్ళూనుకొన్న పితృస్వామ్య భావజాలం జెండర్ రాజకీయాల లోతుల్లోకి వెళ్లి అధ్యయనం చేసి సైద్ధాంతిక పునాదినుంచీ కొత్త దృక్పథాల్ని – కొత్త డిక్షన్ తో సహా – జోడించింది. పెళ్లి వొక ప్రయోగం అనీ ఆ ప్రయోగంలో యెంత మంది యెన్ని సార్లు విఫలమైనా కొత్తవాళ్ళు మళ్ళీ అదే ప్రయోగం చేస్తున్నారనీ కథలు ( ఓల్గా ) వచ్చాయి. పెళ్ళికి   ప్రత్యామ్నాయంగానో  వికల్పంగానో సహజీవనం (లివింగ్ టూగెదర్) వొంటరి బతుకు (సింగిల్ లైఫ్ స్టైల్ ) అనే ఆలోచనా ఆచరణా యిటీవలి కాలంలో బలపడ్డాయి. సహజీవనంలో సైతం  వినిపించే అపశ్రుతుల్ని కనిపించని కట్టుబాట్లనీ బహిరంగంగా చెప్పుకోలేని భయసందేహాల్నీ  సంక్షోభాలనీ సమన్వయ లోపాల్నీ వొత్తిడికి గురౌతోన్న సందర్భాల్నీ కల్లోలానికి లోనయ్యే సున్నితత్వాల్నీ సంక్లిష్టమోతోన్న మానవసంబంధాల్నీ బలంగా ఆవిష్కరించిన కథ ‘శతపత్ర్రసుందరి’( ఆంధ్ర ప్రదేశ్ – మాస పత్రిక , జూన్ 2015). స్త్రీ పురుష సంబంధాల్లోని ఐక్యత ఘర్షణల్నీ కనిపించే పెత్తనాల్నీ కనిపించని హింసనీ మనుషులమధ్య – మనుషుల్లోపల యేర్పడుతోన్నఖాళీలనీ తనదైన శైలిలో చక్కటి నేర్పుతో సాహిత్యీకరిస్తున్న కె ఎన్ మల్లీశ్వరి దాని రచయిత. వస్తు శిల్ప నిర్వహణల్లో యెంతో సంయమనాన్నీ శ్రద్ధనీ గొప్ప పరిణతినీ చూపడం వల్ల యీ కథ మల్లీశ్వరి రాసిన కథల్లో ప్రత్యేకంగా నిలబడుతుంది. కథలో చెప్పిన అంశాలకంటే చెప్పదల్చి చెప్పకుండా వదిలేసిన అంశాలే పాఠకుల బుర్రకి పని పెడతాయి. చదివిన ప్రతిసారీ పాత్రల ప్రవర్తన విషయికంగా కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. వాటి అంతరంగాల లోపలి పొరలు ఆ పొరల్లోపల సంభవించే ప్రకంపనలు ఆవిష్కారమౌతాయి. సంభాషణల్లోని కాకుస్వరాలు  వాక్యాలమధ్య దాగున్న అంతరార్థాల్ని బోధపరుస్తాయి. ముగింపు ఓపెన్ గా వొదిలేయడం వల్ల అనేకార్థాలకీ విరుద్ధ వూహలకీ ఆస్కారం కల్గిస్తుంది. అది యీ కథకున్న బలమో బలహీనతో విశ్లేషించుకోవాలంటే వాచకం లోతుల్లోకి వెళ్ళాలి.

అలా వెళ్ళే ముందు కథా సారాన్ని నాల్గు ముక్కల్లో చెప్పుకుందాం:

క్రిమినల్ లాయర్ సదాశివ యేదో ఆఫీస్ లో వుద్యోగం చేసే నీలవేణి లివింగ్ టుగెదర్ జంట. కథాకాలానికి వొకరి స్వేచ్ఛని మరొకరూ వొకరి వ్యక్తిత్వాన్ని మరొకరూ గౌరవించుకోడానికి కావాల్సిన స్పేస్ ని కాపాడుకొంటూ పది సంవత్సరాలుగా కలిసి వుంటున్నారు. ఆమె వొక  సామ్రాజ్ఞిలా అతని హృదయాన్ని యేలుతూవుంటుంది.  నీలవేణి ఔత్సాహిక నటి కూడా. ఒకానొక నాటక ప్రదర్శన ద్వారా డైరెక్టర్ గౌతమ్ ఆమెకి దగ్గరవుతాడు. యెంతో సంస్కారవంతుడూ విప్లవ భావాలు కలవాడూ న్యాయంకోసం బాధితుల పక్షంలో సమస్త శక్తులూ వొడ్డి పోరాడే సాహసీ అయిన సదాశివ నీలవేణి అల్లుకొనే కొత్తసంబంధాన్నిఅంగీకరించలేడు. నీలవేణి శాశ్వతంగా తనకే – కేవలం తనకే – వుండాలనుకొంటాడు.

కానీ జీవితంలోకి కొత్తగా వచ్చిన గౌతమ్ ఆలోచలు నీలవేణికి ఎంతో హాయినిస్తాయి. వాళ్ళిద్దర్నీ ‘కలిపి ఉంచే మహోద్వేగపు ప్రవాహమే’ ఆమెని నడిపిస్తోంది. సదాశివ సమక్షంలో కూడా ‘సన్నని నూలుచీరలా వొంటికి చుట్టుకొన్నట్టు మనసుకి హత్తుకుపోయిన గౌతమ్ ఊహని విడదీయడం ఆమెకి సాధ్యం కావడం లేదు’. విడదీయాలని కూడా ఆమెకి లేదు. ఆమెకి అతను జీవితలోకి వచ్చేసిన సెలబ్రేషన్. అలా పండగలా వచ్చినతన్ని సదాశివ కోరినంత మాత్రాన పొమ్మనలేదు. పొమ్మన్నాఅతను పోడు. అదే సదాశివకి ఆమె స్పష్టం చేసింది.

సదాశివ  గింజుకొన్నాడు. అడ్డొచ్చిన వాటిని పగలదన్నాడు.  యేడ్చాడు. మొత్తుకొన్నాడు. వాపోయాడు. బతిమాలాడు. బెదిరించాడు. అంతకు ముందు తమ సహజీవనంలోకి తాత్కాలికంగానైనా యిద్దరు స్త్రీలను సదాశివ తీసుకువచ్చినప్పుడు ఆ చొరబాటులో  తానెంత వొత్తిడికి లోనైందీ దాన్ని అధిగమించి సంబంధాన్ని నిలుపుకోడానికి తానతన్ని వోర్పుతో యెంతగా ప్రేమించిందీ నీలవేణి స్పష్టం చేసింది. సదాశివ తప్పు వొప్పుకొన్నాడు. చేతులు పట్టుకొన్నాడు. కాళ్ళబడ్డాడు. ఆమె గాంభీర్యం ముందు భంగపడ్డాడు . చివరికి చస్తానన్నాడు. అతనిలోని ద్వంద్వ ప్రవృత్తి తెలుస్తోన్నా ఆ క్షణంలో ఆమె  గుండెలో యే సానుభూతి వీచిక కదిలిందో యే ప్రేమోద్వేగ పవనం వీచిందో పదేళ్ళ సాహచర్యంలో అనుభవించిన యెడతెగని యే మోహ తరంగం యెగసిందో రచయిత్రి చెప్పలేదు గానీ ఆమె అతణ్ణి “రా” అని దగ్గరకి తీసుకొంది. అయితే ఆ కలయిక ఆమెకి ఆనందాన్నివ్వదు. ‘ఎప్పట్లా తెల్ల పూలదండ అంచుల సముద్రుడిలా కాకుండా విలయం సృష్టించే సునామీలా’ వస్తాడతను. అతని ఆ రాకలో మనశ్శరీరాలని కుళ్ళగించి ఆమెకి ప్రియమైనవాడి వునికిని నిర్మూలించాలన్నలన్న క్రోధంతో చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. అదొక యుద్ధమే అని నీలవేణి భావించినప్పటికీ  ‘జీవితం నాటకం కాదు గదా తెర పడేలోపు యుద్ధం ముగియడానికి!’ అన్న వేదనకి గురౌతుంది. మరోసారి రసభంగమైంది. ఇదీ కథ.

దాంపత్య సంబంధాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం మాత్రమే కాదు సహజీవనంలో ఆశించే స్వేచ్ఛని   సైతం మగవాళ్ళు స్త్రీలపై ఆధిపత్య సాధనంగా వుపయోగిచుకొనే ప్రమాదం వుందన్న ప్రతిపాదన చుట్టూ అల్లిన కథ యిది.

ఒక దృక్పథాన్నే వస్తువుగా చేసుకొని కథ రాయడానికి రచయిత యెంతో జాగరూకతతో వుండాలి. అందుకు అనుగుణమైన పాత్రల్ని నిర్మించుకోవాలి. ఆ పాత్రల ప్రవృత్తుల్నీ స్వభావాల్నీ  ఆలోచనల్నీ వుద్వేగాల్నీ, అంతరంగ మథనాన్నీ , బాహిర శక్తుల ప్రమేయాన్నీ ,  ఆ పాత్రల మధ్య చోటుచేసుకొనే సంఘర్షణనీ దాన్ని ప్రతిఫలించే  సంభాషణల్నీ కొండొకచో నిర్దిష్టమైన ప్రతీకల్నీ  కథలోకి తీసుకురావడంలో  గొప్ప నేర్పు వుండాలి. ఆ నేర్పు మల్లీశ్వరిలో నిండుగా వుందని  యీ కథ నిర్ద్వంద్వంగా నిరూపిస్తుంది. నేపథ్య నిర్మాణం , పాత్ర చిత్రణ , ప్రతీకలతో కూడిన యెత్తుగడ – ముగింపులూ కథా నిర్మితిలో  కథనం అంతటా పరచుకొని వున్న అద్భుతమైన వొక craftmanship విభ్రమం గొల్పుతుంది. అలా అని  అది కథాంశంపై దృష్టి మరలిపోయే విభ్రమమైతే కాదు.

రచయిత్రి కథకి నేపథ్యంగా తీసుకొన్న జీవితం పై తరగతి వారిది లేదా యెగువ మధ్య తరగతి వారిది అన్న విషయం గమనంలో వుంచుకోవాలి (ఇంట్లో బార్ స్టూల్ , సహవాసులిద్దరూ కలిసి తాగడం వంటి వర్ణనలు చూడండి). నీలవేణి ప్రేమైక రూపాన్నీ స్థిర చిత్తాన్నీ గంభీర్యాన్నీ హుందాతనాన్నీ , సదాశివ ద్వంద్వ వైఖరినీ మనోవైకల్యాన్నీ వ్యక్తిత్త్వ విచ్ఛిత్తినీ భావజాల వైరుద్ధ్యాన్నీ ఆవిష్కరించడానికి ఆమె యెన్నుకొన్న కంఠస్వరం స్త్రీదేనని(మొత్తం కథంతా నీలవేణే చెబుతుంది) గుర్తుంచుకోవాలి. అప్పుడు మాత్రమే కథ పారదర్శకమౌతుంది. పాత్రల ప్రవర్తన ప్రస్ఫుటమౌతుంది.

కథలో సదాశివకి అనేక ముఖాలున్నై. అతనిలో  ‘అనేక సదాశివలు’ నీలవేణి స్పష్టంగా  చూడగలుగుతుంది. అందుకు కారణాలు కూడా గుర్తిస్తుంది. ‘సదాశివ అంటే ఉత్తి చేతులతో సాయం కోరే వారికి మేలు చేసే మంచి లాయర్ అనీ , సంస్కారవంతుడనీ, లోకాన్ని మెరుగ్గా అర్థం చేసుకోగల సమర్థుడనీ’ నీలవేణి ప్రేమించింది. అతనూ అలాగే వుండటానికి ప్రయత్నిస్తాడు. కానీ స్వయంగా అతిచరించాడు. సహజీవన సంబంధంలో లాభించిన వెసులుబాటునీ స్వేచ్ఛనీ హాయిగా అనుభవించాడు.  నీలవేణి జీవితంలోకి గౌతమ్ రావడంతో పొరలన్నీ చిరిగిపోయి లోపలి మనిషి బయటకొచ్చాడు. అందుకే సదాశివని రచయిత్రి క్రిమినల్ లాయర్ చేసింది. ‘స్వైర విహార ధీరలగు సారసలోచనలున్న చోటికిన్’ వంటి వసుచరిత్ర పద్యాల్ని సందర్భోచితంగా గుర్తు తెచ్చుకొని ‘స్వైరిణి’ పదాన్ని దాని అర్థచ్ఛాయలతో సహా యెరిగి ప్రయోగించి  ‘రసభంగం’ చేయగల సాహితీ వేత్తకూడా అతను. ‘అన్ని స్వేచ్ఛలనీ గట్టిగా నమ్మిన’ వాడే ; కానీ  ‘మన ఆచరణ శక్తి ఎంతవరకో అంతవరకూ ఉన్నదే విప్లవమనే’ (యీ వాక్యాన్ని  కథకి టాగ్ లైన్ గా రచయిత భావించి వుండొచ్చు)  మేధావుల కోవకి చెందుతాడు. అందుకే గౌతమ్ విషయం వచ్చేసరికి వోర్చుకోలేక ‘వయొలెంట్’ గా ప్రవర్తిస్తాడు. పిచ్చివాడైపోతాడు. తన వొంటరితనపు వేదనని ఆమె ముందు గుమ్మరిస్తాడు. డ్రింక్ ఆఫర్ చేసి ఆమె వద్దన్నందుకు తనతో కల్సి తాగనన్నందుకు గౌతమ్ పరిచయం వల్ల కల్గిన ‘కొత్త పాతివ్రత్యమా?’ అని పరిహసించి గాయపరుస్తాడు. మరీ బెడిసికొడుతుందనుకొన్నాడో యేమో వెంటనే సారీ చెప్పాడు. అంతేకాదు ; ఆమె తనకే కట్టుబడి ఉండేలా యెత్తుగడలు వేశాడు. వ్యూహాలు పన్నాడు.

సదాశివ రచయిత్రి ‘సృజించిన’ పాత్ర కాదు. గురజాడ గిరీశాన్ని గుర్తించినట్టు మల్లీశ్వరి  మన సమాజంలో మగవాళ్ళలో సదాశివని గుర్తించింది. సదాశివలో దాగివున్న మగవాణ్ణి వెలికితీసింది. సదాశివ పాత్రలోని వైరుధ్యాల్ని బహిర్గతం చేయడం ద్వారా   స్త్రీపురుష సంబంధాల్లోని ఆధిపత్య రాజకీయాల్నివాటి భిన్న పార్శ్వాల్నీ ఆవిష్కరించింది.

చానాళ్లుగా నలుగుతోన్న వొక కేసు విజయాన్ని నెపం చేసుకొని సదాశివ పార్టీ యేర్పాటు చేస్తాడు. ఆ కేసులో తాను యెదుర్కొన్న వొత్తిళ్ళను యేకరువుపెట్టి వాటిని అధిగమించడంలో తనకు తోడుగా వుండి తన విజయం వెనక నిలబడ్డ స్నేహమయి నీలవేణి అని అందరిముందూ నాటకీయంగా ప్రకటించాడు. ఒక దెబ్బకి రెండు కాదు; మూడు పిట్టలు. పదిమందిలో ‘ఇన్స్టిట్యూషనల్ గౌరవాన్నిచ్చి’ నీలవేణితో సామాజికంగా తన సంబంధాన్ని పటిష్ఠపరచుకోవడం , తమ మధ్యకి చొరబడిన గౌతమ్ అడ్డు తొలగించుకోవడం ( ఆ పార్టీకి అతణ్ణి పనిగట్టుకు పిల్చింది కూడా అందుకే ) , అక్కడే వున్న లవ్లీ లాయరమ్మకి రాయల్ గా  గుడ్ బై చెప్పడం. నీలవేణి ‘జీవితంలోకెల్లా అత్యంత అవమానంతో సిగ్గుపడిన క్షణాలవి’.  ఇద్దరు స్త్రీల జీవితాలతో హృదయాలతో ప్రేమతో కుటుంబ అనుబంధాలతో పెనవేసుకొన్న వుద్వేగాలతో ఆటలాడే మగవాడి గడుసు పోకడకి , ‘రోదసి నుంచి భూకక్ష్య లోకి ప్రవేశించే వ్యోమనౌక ఫెయిలయ్యి పేలిపోయిన’ప్పటి భీభత్సాన్ని ఆడవాళ్ళ జీవితంలో నింపుతోన్న పురుషాధిపత్యానికి పరాకాష్టగా  రచయిత్రి ఆ సందర్భాన్ని రూపొందించింది. కథా రచనా శిల్పంలో , పాత్రచిత్రణలో  మల్లీశ్వరి సాధించిన  పరిణతికి గీటురాయిలా కనిపించే ఆ సన్నివేశం రచయిత్రి  ప్రాపంచిక దృక్పథానికి గొప్ప తార్కాణం. నీలవేణి పాత్రలోని గాంభీర్యం పాఠకుడిని కట్టిపడేస్తుంది. సాటి స్త్రీ పట్ల ఆమె చూపిన సహానుభూతి మనుషులమధ్య వెల్లివిరియాల్సిన మానవీయతకు నిండైన నిదర్శనం. స్త్రీ జాతి ఆలోచనల్లో కనిపించే సున్నితత్వానికి ప్రతీక – పతాక.

 

నీలవేణీ సదాశివల ఆలోచనల్లో ఆచరణల్లో తేడా వుంది. ఆ తేడా  స్త్రీ పురుషుల సహజ ప్రవృత్తుల్లోనే వుందేమోనని కథ చదువుతోన్నంతసేపూ అనిపించేలా రాయడంలోనే రచయిత్రి నేర్పు కనిపిస్తుంది (నిజానికి ఆ తేడా సామాజికం కూడానేమో ; అన్నిసమాజాల్లో సదాశివలు అలాగే ప్రవర్తిస్తారా? ) సహజీవనానికి మౌలికంగా నిర్మించుకొన్న విశ్వాసాల పునాదిగా (చేసుకొన్న వొప్పందం ప్రకారం?) ఆమె అతనికున్న అన్ని  హక్కుల్ని గౌరవించింది. ఇష్టాల్ని అంగీకరించింది. అతని స్వేచ్ఛకు యెక్కడా  ఆటంకం కాలేదు. బాదంకాయ కళ్ళపిల్ల అతని ప్రేమని కొరికి రుచి చూసి పోయినప్పుడూ  లవ్లీ లాయరమ్మని అతను స్వయంగా వెంటబెట్టుకొని హృదయంలోకి తీసుకువచ్చినప్పుడూ మొదట కొంత అభద్రతకి గురైంది భయానికి లోనైంది. కానీ తేరుకొంది. అతని మనసులో తాను ధీమాతో విశాలంగా పరచుకొని అధిష్టించిన చాప కుదించుకుపోయిందని యేడుస్తూ కూచోలేదు.   ఈర్ష్య పడలేదు. తగవులాడదల్చుకోలేదు. ద్వేషించి భంగపడలేదు. తట్టాబుట్ట సర్దుకొని పోలేదు. తనకు తానే సర్ది చెప్పుకొంది. అతని ప్రేమని పొందడానికి మరింతగా  ప్రేమించడమే దారనుకొంది.  ప్రేమిస్తూనే అతని మనసులో వొక మూల వొదిగి వుండడానికి సిద్ధపడింది.

అతన్నుంచి ( సదాశివ నుంచి) ఆమె తిరిగి అదే ఆశించింది. తన జీవితంలో గౌతంని కూడా ‘వో పక్కగా వుండనీయి’ (సదాశివని దాటి పోకుండానే) అని అడిగింది. కానీ సదాశివ అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఆమె శారీరికంగా మానసికంగా చివరికి సామాజికంగా కూడా తనకే విధేయంగా వుండాలనుకొన్నాడు. ఆమె జీవితంలో యే రూపంలోనూ తనతోపాటు మరోవ్యక్తిని అంగీకరించలేకపోయాడు. ‘బ్లాక్ హోల్’ లా గౌతమ్ ఆమెను లాగేసుకొంటున్నట్టు భావించాడు.  ‘ఉన్నంతలో ప్రాక్టికల్ గా ఇబ్బందులు లేకుండా కాస్త తెలివిగా’ తనతో బంధాన్నికొనసాగించామన్నాడు.  గౌతంతో ఎమోషనల్ గా బాహాటంగా ఓపెన్ కావద్దన్నాడు. డ్యూయల్ వాల్యూస్ ఉండకూడదని తాను ఆచరించని ఎథిక్స్ ఆమెకి బోధించాడు.  ‘ఆకర్షణ కలిగితే వన్  నైట్ స్టాండ్ తీసుకో … లేదూ కాదూ అంటే కాజువల్ రిలేషన్ షిప్ లో ఉండు…’ అని వొక తుచ్ఛమైన ఆప్షన్ యిచ్చాడు. మనుషులమధ్య వుండాల్సిన ‘అంతిమ విలువ – స్వేచ్ఛ’ విషయికంగా అతని దృష్టికోణం అదీ. సదాశివకి స్వేచ్ఛ ఆశయమే కానీ ఆచరణ కాదు( పైగా అది ముసుగు కూడానేమో! ).  ఆమెకి ‘నిలకడగా స్థిరంగా తదేకంగా  ఉండే బంధం కావాలి’. అది తానివ్వలేక పోయినా గౌతమ్ దగ్గర మాత్రం లభిస్తుందని హామీ వుందా  – అని లాయర్ లాజిక్కుతో యెదురు ప్రశ్నించి హెచ్చరించాడు సదాశివ.

స్త్రీ సొంత వ్యక్తిత్వాన్నీ స్వేచ్ఛనీ అభావం చేయడానికి అణచివేత రాజకీయాల్ని యెన్ని రూపాల్లోనైనా వుపయోగించగల మగవాళ్ళకి నమూనాగా సదాశివ పాత్రని చిత్రించడంలో రచయిత్రి నూటికి నూరు పాళ్ళూ సఫలమైంది. అయితే యెంతో చైతన్యవంతంగా ప్రవర్తించాల్సిన నీలవేణి – వొక్క క్షణమే కావొచ్చు – అతనికి లోబడిపోవడమే ఆశ్చర్యం.

సదాశివ ఆలోచనల్లోని వంచననీ  నైచ్యాన్నీ  అర్థం చేసుకొని కూడా – తన నొప్పినీ  కష్టాన్నీ దాచుకొని తనలో రగిలే అగ్ని పర్వతాల్ని కప్పిపెట్టుకొని అతని కష్టానికి దు:ఖిస్తూ నీలవేణి అతణ్ణి వోదార్చడానికి పూనుకొంది. అంత కరుణ ఔదార్యం ఎందుకని పాఠకుడిలో ప్రశ్న మొలకెత్తుతుంది.

స్త్రీలోని లాలిత్యమూ కారుణ్యమూ  ప్రేమైక జీవన తత్త్వమే  ఆమెకు సంకెళ్ళుగా పరిణమిస్తున్న వైనాన్ని రచయిత్రి నీలవేణి ఆచరణలో చూపించింది. ప్రేమకీ స్వేచ్ఛకీ సహజీవనానికీ స్థిరమైన అనుబంధాలకీ స్త్రీ పురుషులిచ్చే నిర్వచనాలు వేరని నిరూపించింది. అయితే –

అనేక ఆధిపత్యాల అసమ సమాజంలో పెళ్లయినా సహజీవనమైనా స్త్రీ పురుష సంబంధాల్లో మార్పేవీ ఉండదనీ , అభద్ర భావన కారణంగానో సంబంధాల్ని అంత త్వరగా వదులుకోలేని బలహీనత కారణంగానో  స్వేచ్ఛతో సహా సమస్తం  కోల్పోతుంది  స్త్రీలేననీ   రచయిత్రి మరోసారి నొక్కి చెప్పాలనుకొన్నట్లు  అనిపిస్తుంది. అదే ఆమె చెప్పాలనుకొన్న విషయమైతే పెళ్లి అనే వ్యవస్థ ( institution ) ని పగలగొట్టి సహజీవనమనే విప్లవకరమైన ఆచరణలోకి వెళ్ళాలనుకొనేవారిని అది కూడా స్త్రీ పురుష సంబంధాల్లో అంతిమ స్వేచ్ఛకి ఆస్కారమివ్వదని అక్కడకూడా యుద్ధం తప్పదని భయపెట్టి వెనక్కి లాగినట్లవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాన్ని మూసివేసినట్లవుతుంది. లేదా స్వేచ్ఛాసమానత్వాలకోసం జరిపే పోరాటంలో సహజీవనం వొక మెట్టే ; అక్కడ కూడా స్త్రీలకు భద్రత లేదనీ , మగవాళ్ళలో పాతుకుపోయిన పితృస్వామ్య ఆధిపత్య భావజాలంతో నిరంతరం పోరాడక తప్పదనీ  హెచ్చరించడమే రచయిత వుద్దేశ్యమైతే కథా ప్రయోజనం నెరవేరినట్లే.

అయితే ఆ యుద్ధాన్ని నీలవేణి సదాశివతో కలసి వుంటూనే చేస్తుందా – విడిపోయి గౌతమ్ దగ్గర చేస్తుందా – యేక కాలంలో యిద్దరితోనూ సంబంధాన్ని కొనసాగిస్తూ ( మల్టిపుల్ రిలేషన్ షిప్ లో) చేస్తుందా – హద్దుల్లేని అప్రమేయమైన ప్రేమతో  యిద్దర్నీ జయిస్తుందా – వోర్పుతో నెగ్గి మానవసంబంధాన్ని నిలుపుకోగలుగుతుందా  – రేపు గౌతమ్ అయినా మరో మగవాడైనా సదాశివలానే ప్రవర్తించవచ్చు కాబట్టి వొంటరిగా స్వతంత్రంగా జీవిస్తుందా – ఆమె తెరవేయలేని యుద్ధాన్ని కేవలం లైంగిక  స్వేచ్ఛ వరకే పరిమితం చేస్తుందా  – పితృస్వామ్య భావజాలానికి సంబంధించిన అన్ని రకాల అసమానతలకీ  వ్యతిరేకంగా నిలబడుతుందా – లేదా మరింత విస్తృతమై సమాజంలో పాతుకుపోయిన  సమస్త ఆధిపత్యాల్ని రూపుమాపే మార్గంలో నడుస్తుందా – అసలు దాంపత్యాలన్నీ యెడతెగని ద్వంద్వయుద్ధాలేనా – సహజీవనాలు సైతం సంగ్రామాలుగా యెందుకు మారుతున్నాయ్ –  బంధాల్ని తెంచుకోలేనితనం  స్తీలకు మనోధర్మమా, సామాజిక అభద్రతాభావన నుంచి వస్తుందా – ఆధిపత్యం పురుష ప్రవృత్తా , అసమ సమాజంలో అది అనివార్యమైన దృగంశమా – స్త్రీ పురుష సంబంధాల్ని మానవీయంగా వుంచగలిగే స్థిరమైన విలువలేంటి – దేశ కాల సంస్కృతులకి అతీతంగా వుపయోగపడే నమూనాలుంటాయా  …… యివన్నీ పాఠకుల ముందు రచయిత పరచిన మరికొన్ని  ప్రశ్నలు.

ఈ ప్రశ్నలు పుట్టడానికి కారణం రచయిత్రి కథని open ended గా వొదిలి వేయడం వొక కారణమైతే ; రెండో కారణం కథ ప్రారంభంలోనూ ముగింపులోనూ ఆమె వాడిన  ప్రతీకలు.

ప్రతీకల వెనకున్న అర్థాలు సులభగ్రాహ్యాలే కానీ పాఠకుడిలో గందరగోళానికి ఆస్కారమిస్తున్నాయి. కథ నీలవేణి నటించే నాటకంలో అంతిమ దృశ్యం యుద్ధంతో మొదలౌతుంది. ‘యుద్ధం ముగిసింది. ఒకరు విజేత. ఆ విజేతని నేనే గెలిచాన’ని  నాయిక ప్రకటిస్తుంది. గెలుపుకీ వోటమికీ మధ్య గీత చెరిగిపోయింది. యుద్ధంలో వోడి మరణించినవాడొకడు. గెలిచి మరణించినవాడొకడు. అదీ విషాదం. వాళ్ళిద్దరి నుంచీ విముక్తే ఆమె కోరుకొంటే మోదాంతం.

కథ మాత్రం విషాదాంతమే. కాకుంటే అది నీలవేణి జీవితం. నాటకంలోలా జీవితంలో ఆమె యెప్పటికి గెలుస్తుందో తెలీదు. యుద్ధం సదాశివ గౌతమ్ ల మధ్యా ? వాళ్ళిద్దరికీ నీలవేణికీ మధ్యా? గెలుపెవరిది , వోటమెవరిది? విముక్తికోసం నీలవేణి తనతో తానే తనలో తానే అంతర్యుద్ధం చేస్తుందా? మొత్తం పురుషసమాజంతో చేస్తుందా? గెలుపు వోటముల ఆటలో హింసని అనుభవిస్తూ కూడా  ఆమె సదాశివకి యెందుకు లొంగిపోయింది? స్వేచ్ఛ ఆమెకి అవసరం కాకుండా ఆకాంక్ష మాత్రమే అవడం వల్ల అలా జరిగిందా? సదాశివ యేడ్చి వోటమిని వొప్పుకొన్నందుకా? స్వేచ్ఛ అవసరంగా పరిణమించినప్పుడు ఆమె సమస్త శక్తులూ వుడిగిపోతే ఆ రోజున పోరాడే పరిస్థితి వుంటుందా? అప్పుడు సదాశివ ప్రవర్తన వూహకందనిదేం కాదు. తన పురుష నైజాన్నీ సమాజం యిచ్చిన బలాన్నీ బాహాటంగానే ప్రదర్శించక మానడు. నైతికంగా వోడిన సదాశివ శారీరికంగా ఆమెపై ఆధిపత్యాన్ని స్థాపించుకొనే ప్రయత్నం చేస్తూనే వున్నాడు కాబట్టి స్త్రీ పురుషులమధ్య జీవితయుద్ధంలో వైరుధ్యాలు యెప్పుడూ శత్రుపూరితంగానే వుంటాయని నిరంతర చైతన్యంతో మాత్రమే వాటిని పరిహరిచుకోగలం అని ప్రతిపాదించడమే రచయిత్రి అభిప్రాయమా? కాకుంటే యీ యుద్ధ ప్రతీకల ప్రయోజనం యేమిటి? ప్రయోజనం లేని ప్రతీకలెందుకు? ‘పంజరంలో సైతం పక్షులు యెందుకు పాడతాయో’ పాడాలో ఆమెకి తెలుసు. ‘కోపం భయం ద్వేషం పగ అన్నిటినీ విసిరికొట్టి ప్రేమించడమే’ యుద్ధాలకి శాంతిపాఠం. అయినా యుద్ధాలకు ముగింపు లేదు. ఆమె కోరుకొనే శాంతి యెక్కడుందో తెలుసుకొనే వరకూ పరిష్కారం రాదు.

కథలు పరిష్కారం చూపేవిగానే వుండాలని నియమం లేదుగానీ ఆ దిశగా ఆలోచింపచేసేవిగా వుండాలని కోరుకోవడం తప్పుగాదు. కానీ యిన్ని విరుద్ధమైన ఆలోచనలకి తావిచ్చేదిగా వుండడమే ‘శతపత్ర సుందరి’ ప్రత్యేకత.

 

తాజా కలం: హైదరాబాద్ – ఆలంబనలో ‘వేదిక’ సాహిత్య సమావేశం( జూలై 12, 2015 ) లో ‘శతపత్ర సుందరి’ పై చర్చ జరిగినప్పుడు కథా శీర్షిక అంతరార్థం గురించి ప్రస్తావనలొచ్చాయి. సహచరుడితో స్వైరిణి గా పిలిపించుకొన్న నీలవేణి లోపలి పొరల సౌందర్యానికి ఆ శీర్షిక ప్రతీక కావొచ్చని వొక ముక్తాయింపు. ఏదీ అంతిమ తీర్పు కాదు.

 *

 

 

మీ మాటలు

  1. raghava reddy says:

    ఈ కధ చదవలేదు.మిస్ అయ్యాను. థాంక్యూ ప్రభాకర్ గారూ. – పొసెసివ్ నెస్ , అచ్చం గా నాకే కావాలనుకోవడం మగాళ్ళలోనే ఉంటుందా…ఆడవాళ్ళలో ఉండదంటారా? లేక ఇద్దరిలోనూ ఉండి దాన్ని ప్రదర్శించే అవకాశం పురుషులకు మాత్రమే ఉంటోందా? … సదాశివ తో సంబంధం లోకి మరో ఇద్దరు వచ్చినప్పుడు నీలవేణి నుంచి వచ్చిన ప్రవర్తన జెండర్ తో ప్రమేయం లేని ఒక ప్రత్యేక వ్యక్తిత్వానిదా? లేక అది ఒక సమూహ (స్త్రీ) సాధారణ మనస్తత్వమా? అలా అయితే వర్గం తో సంబంధం లేకుండా సాధారణ పల్లె జనాల దగ్గర నుంచీ మధ్యతరగతి ఉద్యోగులూ, సాప్ట్వేర్ వంటి ఉన్నతాదాయ సమూహాహాలూ, సినిమా తారలూ…అందరిలోనూ పొసెసివ్ తగాదాలు (నీలవేణుల వైపు నుంచి కూడా) చూస్తున్నాం గదా. – జస్ట్ అవుటాఫ్ క్యూరియాసిటీ, నా ఈ ప్రశ్నలు… –

  2. >>> ‘ఆకర్షణ కలిగితే వన్ నైట్ స్టాండ్ తీసుకో … లేదూ కాదూ అంటే కాజువల్ రిలేషన్ షిప్ లో ఉండు…’ అని వొక తుచ్ఛమైన ఆప్షన్ యిచ్చాడు.

    తుచ్ఛమైన ఆప్షన్ కాదు, అతని మగ ఐడెంటిటీ పరంగా ఆలోచిస్తే ఏమాత్రం పొసగని అతిఉదాత్తమైన ఆప్షన్ ఇచ్చాడు. నిజంగా అతను ఆ ఆప్షన్ ఇవ్వగలిగే మగవాడే అయితే ముందసలు అతనికి ఆమె పట్ల ఇక వేరే ఏ ఫిర్యాదూ ఉండకపోవును. అక్కడే ఈ సదాశివ పాత్రని, ఈ కథ మొత్తాన్ని ఒక స్త్రీ రచయిత నడిపిస్తోందన్న స్పృహ బాగా కలిగింది. అందుకే సదాశివ పాత్రని నడపడంలో “నూరుపాళ్ల” సఫలత నాకు కనిపించలేదు. కథలో క్లుప్తత బాగుంది. ‘తెల్లపూదండ అంచుల సముద్రుడు’లాంటి కవితాత్మక సందర్భాలు నచ్చాయి.

    కథను తిరిగి చెప్పడంలో ప్రతిభని కనపరిచిన ఈ వ్యాసం, విశ్లేషణ దగ్గరకి వచ్చేసరికి కథ లోపలి లోకపు లెక్కలతో పొసగని బయటి స్కేళ్లు ప్రయోగిస్తూ, కథపై అది కోరుకున్నట్టు కనపడని ప్రాతినిధ్య భారాన్ని మోపుతూ, కథ గురించి మాట్లాడటం ఆపి బయటకు వచ్చి సంబంధం లేని ప్రశ్నలు సంధిస్తూ ముగియటంతో నిరాశ కలిగించింది.

  3. ఎ కె ప్రభాకర్ says:

    మీ ప్రశ్నలు నావి కూడా రాఘవరెడ్డి గారూ!

  4. ఎ కె ప్రభాకర్ says:

    మల్లీశ్వరి శతపత్రసుందరి లింక్
    https://drive.google.com/file/d/0B46Skg0ME2HWdmNhUUEtQ0tyYUljeVRvLVMxY2tITkVaU0JR/view?usp=sharing

  5. ప్రభాకర్ గారూ,

    నా అభిప్రాయం, ప్రశ్నలు వ్యాఖ్య చాలా పెద్దగా ఉంది అండీ అందుకే ఇక్కడ http://teepi-guruthulu.blogspot.co.uk/2015/12/blog-post.html

  6. రాఘవరెడ్డి గారూ,

    “సదాశివ తో సంబంధం లోకి మరో ఇద్దరు వచ్చినప్పుడు నీలవేణి నుంచి వచ్చిన ప్రవర్తన జెండర్ తో ప్రమేయం లేని ఒక ప్రత్యేక వ్యక్తిత్వానిదా? లేక అది ఒక సమూహ (స్త్రీ) సాధారణ మనస్తత్వమా?”

    సమాధానం మీ ప్రశ్నల్లో కూడా ఉంది. సమూహ సాధారణ మనస్తత్వం అనుకొంటే సమూహం గా స్త్రీ కి ఉన్న పరిమితులని చర్చించాల్సి వస్తుంది.

    జెండర్ తో ప్రమేయం లేని ఒక ప్రత్యెక వ్యక్తిత్వానిది అయ్యుంటుందా అని ఆలోచిస్తే అంతకన్నా ఒకపరిస్థితి ని ఒక్కొకరు వారి జీవితం గురించిన అవగాహన, ఇష్టాలు మరియు పరిమితులని బట్టి ఉంటాయి .

    వ్యక్తిత్వం వల్ల ప్రవర్తన ఉంటుందా లేక ప్రవర్తన నుండి వ్యక్తిత్వం అర్ధం అవుతుందా అన్న చిన్న సంశయం నన్ను చెట్టు ముందా , విత్తు ముందా అన్నట్లుగా అనిపించి ఈ పదాలకి బయట నా సమాధానం పై విధం గా వెతుక్కున్నాను. లోపం ఉంటె సరిచెయ్యగలరు.

మీ మాటలు

*