అతను సాహిత్య లోకపు ధృవతార  

 

-భవాని ఫణి

~

bhavani phani.

పందొమ్మిదవ శతాబ్దపు గొప్ప కవి అయిన జాన్ కీట్స్ ప్రేమ (జీవిత) చరిత్ర ఆధారంగా 2009 లో రూపొందింపబడిన చలన చిత్రం “బ్రైట్ స్టార్(Bright Star )”. చాలా మందికి అతని జీవితంలోని విషాదం గురించి తెలిసే ఉంటుంది . పాతికేళ్ల వయసుకే అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన ఆ మహా కవి, తను జీవించి ఉన్న కాలంలో పెద్దగా గుర్తింపు పొందలేకపోయాడు . అతని దృష్టిలో అతనో విఫల కవి. సమాజం ఎప్పట్లానే అతని గొప్పతనాన్ని జీవితకాలం ఆలస్యంగా గుర్తించింది . ఇదంతా పక్కన పెడితే అతని అతి చిన్న జీవితంలోకి వలపుల వసంతాన్ని మోసుకొచ్చిన అమ్మాయి ఫానీ బ్రాన్. వాళ్ల ప్రణయగాథకి దృశ్య రూపమే ఈ బ్రైట్ స్టార్ చలన చిత్రం .

కొంచెం బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పద్దెనిమిదేళ్ల  అమ్మాయి, కళ్లలోంచి కవిత్వాల్ని వొలికించగల జాణ.  యువకుల హృదయాల్ని ఉర్రూతలూపగల అందం , ఆధునికత ఆమె సొంతం . కథానాయిక ‘ఫానీ బ్రాన్’ పాత్ర ధారిణి అయిన ‘అబ్బే కోర్నిష్’  కళ్లకి ఇదీ అని చెప్పలేని వింత ఆకర్షణ ఉంది . ఆ కళ్లలో చంచలత్వం లేదు . ఒక పరిణితి, ఉదాత్తత , హుందాతనం వాటి నిండా కొలువు తీరి ఉన్నాయి . నటిస్తున్నది ఆ అమ్మాయా లేకపోతే ఆమె కళ్లా అనిపించింది ఒక్కోసారి .

ఆ కన్నుల లోతులు కొలవడమంటే
గుండె గర్భానికి బాటలు వెయ్యడమే
ఆ కన్నులతో చూపు కలపడమంటే
మబ్బుల చిక్కదనంలోనికి మరలి రాని పయనమే

అన్న భావం  ఆ అమ్మాయి కళ్లని చూస్తే కలిగింది  . చూసే కొద్దీ ఆ భావం మరింతగా బలపడింది . ఆ కళ్లలో ఏదో ఉంది . అనంతమైన సాగరాల అలజడి , అగ్ని పర్వతాల అలికిడి , సెలయేటి పరవళ్ల ఉరవడి , చిరు అల్లరిని రేగించే సౌకుమార్యపు సడి….. ఇక అవి ఏ కవి కళ్లలో పడినా కవితల సందడే సందడి .ఎందఱో యువకుల ఆరాధ్య దేవత అయినా ఫానీ మాత్రం జాన్ కీట్స్ ని ఇష్టపడింది . మొదట్లో ఆమెని పెద్దగా పట్టించుకోకపోయినా అతని తమ్ముడు క్షయ వ్యాధితో చనిపోయినప్పుడు ఆమె ప్రదర్శించిన దుఃఖాన్ని గమనించాకా  కీట్స్ కి కూడా  ఆమెపై ఇష్టం ఏర్పడుతుంది. కవిత్వ పాఠాలు నేర్చుకునే వంకతో ఫానీ , కీట్స్ తో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది . ఆ  సమయంలో జాన్ కీట్స్ కొన్ని ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్తాడు . “చెరువులోకి దూకడం, వెంటనే ఈదుకుంటూ ఒడ్డుకు చేరడం కోసం కాదట . అక్కడే కొంతసేపు ఉండి , ఆ నీటి తాకిడిలోని లాలిత్యాన్ని అనుభవించడం కోసమట! అది ఆలోచనకి అందని ఒక అపురూపమైన అనుభవమట . అతను ఆ సందర్భాన్ని కవిత్వాన్ని అర్థం చేసుకోవడంతో పోలుస్తాడు . చెట్టుకి ఆకులు చిగురించినంత సహజంగా రానప్పుడు , కవిత్వం అసలు రాకపోవడమే మంచిదట. ”

అలా కవిత్వ పాఠాల ద్వారా ఆ ఇద్దరి మధ్య తగ్గిన దూరం , వారి మనసుల్ని మరింత దగ్గర చేస్తుంది. అలౌకికమైన ఓ ప్రేమ భావన , ఇద్దర్నీ పెనవేసుకుని చిగురిస్తుంది. ఇంతలో ఫానీ , కీట్స్ లకి ఒకే ఇంట్లో పక్క పక్క వాటాల్లో నివసించే అవకాశం లభించడంతో వారి ప్రేమ బంధం మరింత గట్టిపడుతుంది . మధ్యలో కొంతకాలం కలిగిన తాత్కాలికమైన ఎడబాటు సమయంలో కీట్స్ ఆమెకి ఎన్నో అందమైన లేఖలు రాస్తాడు.  అతని కోసం ఏమైనా చెయ్యగలిగేంత ప్రేమ ఆమెది.  ఆమె గురించి పేజీల కొద్దీ సోనెట్లు రాయకుండా ఉండలేనంత అనురాగం అతనిది .

ఆ సమయంలో  కీట్స్ రాసిన కవిత “బ్రైట్ స్టార్” ఇదే .
Bright star, would I were stedfast as thou art—
Not in lone splendour hung aloft the night
And watching, with eternal lids apart,
Like nature’s patient, sleepless Eremite,
The moving waters at their priestlike task
Of pure ablution round earth’s human shores,
Or gazing on the new soft-fallen mask
Of snow upon the mountains and the moors—
No—yet still stedfast, still unchangeable,
Pillow’d upon my fair love’s ripening breast,
To feel for ever its soft fall and swell,
Awake for ever in a sweet unrest,
Still, still to hear her tender-taken breath,
And so live ever—or else swoon to death.ఈ కవితలో కీట్స్ ఒక కదలని నక్షత్రంతో మాట్లాడుతున్నాడు .
అతనికి కూడా ఆ నక్షత్రంలా మార్పు లేకుండా , స్థిరంగా ఉండాలని ఉందట .
కానీ, ఆ నక్షత్రపు ఒంటరితనం ఎంత అద్బుతమైనదైనా అటువంటి స్థిరత్వాన్ని కాదట అతను కోరుకునేది .
ఆ నక్షత్రంలా ఎంతో ఎత్తున నిలబడి ఎప్పటికీ మూతపడని కనురెప్పల మధ్య లోంచి ప్రకృతి చూపించే ఓర్పునీ, మార్పు చెందని ఆధ్యాత్మికతనీ చూడాలని కాదట అతని కోరిక .
గుండ్రని భూమి యొక్క మానవత్వపు తీరాల్ని ఒక పూజారిలా శుధ్ధి చేస్తున నీటి కదలికల్ని గమనించాలని కూడా కాదట అతను స్థిరంగా ఉండాలని అనుకుంటున్నది .
పర్వతాల మీదా, బంజరు భూముల మీదా ముసుగులా పరుచుకుంటున్న మెత్తని మంచుని తదేకంగా చూడటమూ అతని ఉద్దేశ్యం కాదట .
కానీ అతని స్థిరంగా ఉండాలని ఉందట .
పరిపూర్ణమవుతున్న అతని ప్రేమభావం(ప్రేయసి?) యొక్క పయ్యెదని దిండుగా చేసుకుని మార్పు లేని స్థితిలో ఉండాలని ఉందట
ఆ పడి లేస్తున్న మెత్తదనాన్ని అనుభవిస్తూ
ఒక తియ్యని అవిశ్రాంత స్థితిలో ఎప్పటికీ మేలుకుని ఉండాలని ఉందట
ఎప్పటికీ కదలకుండా ఉండి, ఆ శ్వాస తాలుకూ పలుచదనాన్ని వింటూ
ఎప్పటికీ జీవించి ఉండాలని ఉందట, లేకపోతే మరణంలోకి మూర్ఛిల్లాలని ఉందట!!!ఎంత గొప్ప భావం! ఒక్కొక్క పదానికీ ఎన్నెని అర్థాలో!  ప్రతి వాక్యంలోనూ ఎంతటి భావ సంఘర్షణో! ఓ పక్క ఉత్తేజభరితమైన జీవితాన్నీ , మరో పక్క అమానవీయమైన నిశ్చలతనీ కోరుకుంటూ , ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్లాడుతున్నట్టుగా అనిపించే ఈ గొప్ప కవిత రాయడానికి కీట్స్ దగ్గర ఒక బలమైన కారణముంది .
అదేమిటంటే అనారోగ్యం! అప్పటికే అది కీట్స్ శరీరాన్నిఆత్రంగా ఆక్రమించుకుంటోంది. అతని తమ్ముడిని పొట్టన పెట్టుకున్న అదే క్షయ వ్యాధి అతన్ని కూడా తన కబంధహస్తాల మధ్య ఇరికించుకునే ప్రయత్నం చేస్తోంది . పైగా బీదరికం.  అతను అటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఫానీ అతనితో వివాహానికి సిద్ధపడి , అతన్ని తన ఇంట్లో ఉంచుకుని సపర్యలు చేస్తుంది . కానీ అక్కడ లండన్ లో ఉన్న తీవ్రమైన చలితో కూడిన వాతావరణ పరిస్థితుల కారణంగా , క్షీణిస్తున్న అతని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని,  మిత్రులంతా ధనాన్ని ప్రోగు చేసి, చలి కొంచెం తక్కువగా ఉండే ప్రాంతమైన ఇటలీకి అతడిని పంపుతారు . అతను అక్కడే తన ఇరవయ్యైదవ ఏట వ్యాధి ముదిరి మరణిస్తాడు .కీట్స్ కొన్ని రోజులు కనిపించకపోతేనే విలవిల్లాడిపోయే ఫానీ , ఈ దుర్వార్త విని తీవ్ర వేదనకి గురవుతుంది . ఆ సన్నివేశంలో విషాదమూర్తిగా మారిన ‘ఫానీ’గా, అబ్బే కార్నిష్ చూపిన నటన గురించి వివరించాలంటే అద్భుతం అన్నమాట అనక తప్పదు . ఎందుకంటే అంతకంటే ఉన్నతంగా ఆమె నటనని వర్ణించగల పదమేదీ లేదు కనుక . జుట్టు కత్తిరించుకుని , నల్లని దుస్తులు ధరించి , అతను రాసిన బ్రైట్ స్టార్ సోనెట్ ని వల్లె వేసుకుంటూ రాత్రి పూట ఆ ప్రదేశమంతా సంచరిస్తూ చాలా ఏళ్ల పాటు అతని వియోగ దుఃఖాన్ని ఆమె అనుభవిస్తుంది .  అలా అక్కడితో కథని ముగిస్తాడు దర్శకుడు జేన్ కాంపియన్ .

ఈ చలన చిత్రంలోని ప్రతి సన్నివేశం ఓ అపురూపమైన కళాఖండంలా ఉంటుంది . అతి పెద్ద కేన్వాస్ మీద ఓ గొప్ప కవి జీవితంలోని కొంత భాగాన్ని చిత్రించి చూపడంలో  దర్శకుడు ఎంతగా తన ప్రతిభని కనబరిచాడో , నటీనటులంతా అంతే సహజత్వాన్ని తమ తమ నటనలో ప్రదర్శించారు. జాన్ కీట్స్ పాత్రధారి ‘బెన్ విషా’ , ఫానీ పాత్రధారిణి ‘అబ్బే కార్నిష్’ ల నటన అత్యుత్తమం .  ముఖ్యంగా అబ్బే కార్నిష్, చలన చిత్రాన్నీ, ప్రేక్షకుల్నీకూడా  తన చుట్టూ రంగుల రాట్నంలా తిప్పుకోగలిగేంత అద్వితీయమైన చార్మ్ ని ప్రదర్శించింది . అలాగే ఒక సన్నివేశం తాలుకూ ఆడియో మరో సన్నివేశానికి కొనసాగింపబడటం, చలన చిత్రానికి ఒక ప్రత్యేకతని ఆపాదించింది . ఆ విధమైన ఎడిటింగ్ కారణంగా  కాలం  ఏక ప్రవాహమై తన గమనాన్ని గమనించనివ్వకపోయినా, చలన చిత్రమంతా ఓ కొత్త అందమే పరవళ్లు తొక్కింది .

మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రకాశవంతమైన ఈ ‘తళుకుల తార’ , తీవ్రమైన ప్రేమభావాన్ని తనలో తను అనంతంగా జ్వలించుకుని, మన మనసుల్లోపల అపూర్వమైన జ్ఞాపకాల్ని వెలిగిస్తుంది . కానీ అన్ని గొప్ప ప్రేమ కథల్లోలాగే ఇక్కడ కూడా వియోగమే గెలుస్తుంది . విషాదాన్నే మిగులుస్తుంది.

మీ మాటలు

  1. “చెరువులోకి దూకడం, వెంటనే ఈదుకుంటూ ఒడ్డుకు చేరడం కోసం కాదట . అక్కడే కొంతసేపు ఉండి , ఆ నీటి తాకిడిలోని లాలిత్యాన్ని అనుభవించడం కోసమట! అది ఆలోచనకి అందని ఒక అపురూపమైన అనుభవమట . అతను ఆ సందర్భాన్ని కవిత్వాన్ని అర్థం చేసుకోవడంతో పోలుస్తాడు . చెట్టుకి ఆకులు చిగురించినంత సహజంగా రానప్పుడు , కవిత్వం అసలు రాకపోవడమే మంచిదట. ”

    అద్భుతం అండి …అతని పోయెట్రీ లాగే మీ రచన కూడా అందంగా ,సహజంగా ,కుదురుగా చాలా బాగుంది :)
    మీ నుంచి ఇంకా కోరుకుంటూ ….

    • ఇటువంటి ఒకటో రెండో స్పందనలు చాలు, రాయాలన్న తపనని రగిలించడానికి . చాలా చాలా ధన్యవాదాలు దత్తమల గారూ

  2. తిలక్ బొమ్మరాజు says:

    వొక గొప్ప కవిత్వ ప్రేమ కథా చిత్రం యీ బ్రైట్ స్టార్ .వో రెండు సంపూర్ణ ఆత్మలు ఎలా వొదిగిపోయాయో చెప్పే సినిమా .మంచి విశ్లేషణ భవాని ఫణి గారు.యింకా యిలాంటివి కావాలి మీ నుండి.అభినందనలు.

  3. mohan.ravipati says:

    భవాని గారు ! అధ్బుతమైన విశ్లేషణ !! సినిమా లాగే మీ విశ్లేషణ కూడా అద్బుతంగా ఉంది . ముఖ్యంగా కవితను తెలుగులో కి అనువదించటం లో మీ లోని కవితాత్మక హృదయం తెలుస్తుంది. హాలివుడ్ , యూరొపియన్ సినిమా ల గురించి మీ విశ్లేషణ చాలా పరిణితి తో ఉంటుంది.

  4. మీ స్పందన చూసి నిజంగా చాలా సంతోషం కలిగింది . ధన్యవాదాలు మోహన్ గారు

  5. చాలా చాలా చక్కని విశ్లేషణ మా…
    ఓ సుదీర్ఘమైన కవిత చదువుతున్నట్లుగా అనిపించింది…
    టూ గుడ్…

  6. కె.కె. రామయ్య says:

    జాన్ కీట్స్ ప్రేమ (జీవిత) చరిత్ర ఆధారంగా రూపొందింపబడిన “బ్రైట్ స్టార్” చిత్రం పై మీ విశ్లేషణ అద్బుతంగా ఉంది భవాని గారు. టోను వేరేనేమో కాని పి. లలిత గారి రివ్యూలంత బాగుంది. మీ నుంచి మరిన్ని కోరుకుంటూ ….

    ” ఈ విశాల విశ్వసాగర తీరాన ఏకాకిగా నిలబడి
    ప్రేమకీ కీర్తిప్రతిష్టలకీ కడసారి వీడ్కోలు చెబుతున్నాను ” ( “నా భయాలు” … జాన్ కీట్స్; అనువాదం : NS Murty )

    • Bhavani Phani says:

      చాలా సంతోషంగా ఉంది సర్ , నేను లలితగారి రచనలకి అభిమానిని . ఇంతకంటే మంచి కాంప్లిమెంట్ మరేదీ ఉండదు . Thank You much

మీ మాటలు

*