ప్రొఫెషనల్ కిల్లర్స్

 

 vamsi

-అల్లం వంశీ 

~

చిక్కటి కన్నీటి బొట్లు… ఒక్కొక్కటిగా రాలుతున్నాయి…

“నేనియ్యాల బడికి పోనమ్మా,” ఆరేండ్ల చింటూ ఏడ్చుకుంట అన్నడు.

“మా బుజ్జికదా.. ప్లీస్.. ప్లీస్.. ఇయ్యాలొక్కరోజు పొయిరా నాన్నా. ఇయ్యాలొక్కరోజు పొయ్యస్తే మళ్ళ రేపెట్లాగో ఆదివారమే కదా! కావాల్నంటె రేప్పొద్దంత ఆడుకుందువులే,” అని బుద్రకిస్తూ కొంగుతోని పిలగాని కన్నీళ్లు తుడుచుకుంట స్కూల్ ఆటో ఎక్కించింది వాళ్లమ్మ.

చింటూ అలిగిమూతి ముడుచుకున్నడు.

అమ్మ నవ్వుతూ ముద్దిచ్చి “టాటా నానా,” అని చెయ్యి ఊపింది.

కొడుకు మొఖం అటుతిప్పుకున్నడు తప్పితే టాటా మాత్రం చెప్పలేదు.

ఆటో ముందుకు కదిలింది. అమ్మ ఇంట్లకు నడిచింది.

******

ఆటో హారన్ వినిపించుడుతోనే, బాచు గాడు ఇంట్ల లొల్లి షురూ చేశిండు.

“నేనా బడికి పోను డాడీ.. ప్లీజ్.. నాకా బడద్దు..”

“తలకాయ్ తిరుగుతాందా, రోజు నాకీ లొల్లేందిరా?” అనుకుంట వాళ్ల డాడీ, బాచుగాన్ని రెక్కవట్టుకోని బయటికి ఇగ్గుకచ్చిండు.

“ప్లీజ్ డాడీ, నేనీ బళ్లె సదువుతా..”  అనుకుంట వాళ్లింటి పక్కకే ఉన్న బడిని చూయించిండు బాచు.

ఆ బడి ఉట్టి బడి కాదు, సర్కార్ బడి. గోడమీద రాసుండాల్సిన “ప్రభుత్వ పాఠశాల” అన్న అక్షరాలు గాల్లో కలిసిపొయ్యి చాన రోజులైంది. గోడలు ఓ సగం కూలిపొయ్యీ, మిగిలిన సగం మధ్యాన్నభోజనం పొగలకు మాడిపొయ్యీ, నల్లగ పాడుబడిపొయినట్టున్నదా బడి.  బడికి తగ్గట్టే అక్కడి పిల్లలున్నరు. మాసిపొయిన బట్టలతోనీ, చెప్పులు లేని కాళ్లతోనీ, దుబ్బలపడి ఆడుకుంటున్నరు.

“అన్ల సదువుతె సదువచ్చినట్టే నీకిగ. నడు నడు సప్పుడుచేక ఆటో ఎక్కు,” డాడి అన్నడు.

“ప్లీజ్ డాడీ.. నేనా బడికి పోను..”

“బడికి పోకుంటె ఏంజేత్తవ్? బర్ల కాత్తవారా? చల్ నడూ.. ఆటో ఎక్కు..”

“బడికి పోత డాడీ.. కని, ప్లీజ్ ఇగో… ఈ బడికి పోతా… సర్కార్ బడికి..”

“సంక నాకిపోతవ్ అన్లకు పోతె.. ఎన్నడన్న ఒక్క సారు పాఠం చెప్పంగ చూశినవార అన్ల? సర్కార్ బడట సర్కార్ బడి.. ఓ సారుండడు, ఓ  సదువుండదు అదేం బడిరా.. దిక్కుమాలిన బడి.. నడూ.. సక్కగ ఆటో ఎక్కు..” అని గద్రకిచ్చుకుంట మొత్తానికి కొడుకుని ఆటోల కుక్కిండు డాడీ.

ఆటో టైర్లు ముంగటికురికినయ్. డాడి కాళ్లు, వాళ్ల షాపు తొవ్వ పట్టినయ్.

******

హారన్ కొట్టాల్సిన పని లేకుంటనే పింకీ, వాళ్ళ మమ్మీ ఇద్దరూ ఇంటి గేటు ముంగట నిలుచోని ఉన్నారు.

“మమ్మీ… ఆటో అంకుల్ కి ఇవ్వాలైనా స్లో గా వెళ్లమని చెప్పవా.. ప్లీజ్.. కొంచం గట్టిగా చెప్పుమమ్మీ,”  పింకీ అన్నది.

“సరే బేటా. నువ్వైతె ముందు జాగ్రత్తగ కూచో,” అని తనని ఆటో ఎక్కించి, డ్రైవర్ తోని-

“బాబూ, కాస్త మెల్లగానట వెళ్ళవయ్య.. పిల్లలు భయపడుతున్నరు పాపం,” మమ్మీఅన్నది.

“సరే..”

“నువ్వు రోజు ‘సరే’ అనే అంటున్నవ్, కాని మళ్లీ స్పీడుగనే వెళ్తున్నవట కదా?”

“మీరు పంపినట్టు అందరు పిలగాన్లను టైముకు పంపద్దానమ్మా? రోజూ ఎవ్వలో ఒక్కలు లేట్ జేత్తనే ఉంటరు. మరి అందర్ని బల్లె ప్రేయరు టైముకు ఆడ దింపాల్నా వద్దా? అందుకే జరంత ఫాస్ట్ గా తోల్త, గంతేగని పిలగాన్లను భయపెట్టుడు నాకేమన్న సంబురమా ఏందీ?” అని అటు మాట్లాడుకుంటనే ఇటు గేర్ మార్చిండు డ్రైవరు.

మమ్మీ ఇంకేమో అన్నది కనీ ఆ మాటలు ఆటో చప్పుడులో కలిసిపొయినయ్.

ఆటో మూల మలిగింది. గేటు మూసి లోపటికొచ్చింది.

******

తొవ్వల ఇట్లనే ఇంకో ఐదారుగురు పిల్లలు ఆటో ఎక్కిన్లు. ఆరోజు శనివారంకదా, అందుకే పిల్లలందరు తెల్ల యూనిఫాములల్ల ముత్యాల్లెక్కన అందంగ మెరిసిపోతున్నరు.

అందరు ఎక్కినంక ఇగ డ్రైవర్ సెల్ఫోన్ ల ఓసారి టైము చూసుకున్నడు. పావు తక్కువ ఎనిమిది. “బల్లె ప్రేయర్ ఎనిమిదింటికి స్టార్ట్. ఈన్నుంచి బడికాడికి పది కిలో మీటర్లు. అంటె, ఇంకో పావుగంటల నీను పది కిలోమీటర్లు పోవాల్నన్నట్టు”  మనసులనే లెక్కలు వేసుకోని, బండి టాప్ గేర్లకి మార్చిండు.

మెయిన్ రోడ్డు ఎక్కంగనే ఆటో స్పీడు విపరీతంగ పెరిగింది.  ఐతే, అది పేరుకే మెయిన్ రోడ్డుకానీ రోడ్డుమీద మొత్తం లొందలు, బొందలే. అందుకే వాటినుంచి పొయినప్పుడల్లా ఆటో ఎటు వంగుతుంటే లోపట పిల్లలు కూడా అటుదిక్కే వంగుతున్నరు. దీనికి తోడు ఆటో బయటికున్న ఒక కొక్కానికి వాళ్ళందరి స్కూలు బ్యాగులూ, లంచు బ్యాగులూ వేలాడేశుతోని ఆటో మొత్తం ఒక పక్కకు ఒరిగిపోయ్యున్నది.

ప్రతి రోజు అన్నట్టుగనే, ఇయ్యాల కూడా పింకీ- “ప్లీజ్ అంకుల్ కొంచం స్లో గా వెళ్లండి,” అన్నది.

డ్రైవర్ కూడా ఎప్పటిలెక్కనే ఇయ్యాలకూడా ఆమె మాటలు పట్టించుకోకుండ ఇంకింత స్పీడు పెంచిండు.

ఇంతల రోడ్డు మీద ఒక పెద్ద లొంద.

డ్రైవర్ దాన్ని తప్పించపేండు కనీ, చానా స్పీడ్ మీద ఉండుడుతోని బండి కంట్రోల్ కాలే.

కన్నుమూశి తెరిచినంతల.. ఏదైదే జరగద్దో అదే జరిగింది.

ఖతం..  అంతే.. నల్లటి రోడ్డు ఎర్రగయ్యింది.

మహా విషాదం..

ఒక్క క్షణం ముందు వాళ్ళు కడిగినముత్యాలే. కానీ ఇప్పుడా ముత్యాలు నెత్తుటిమడుగుల్లో పడున్నయ్. మూసిన కన్నులతోనీ.. చలనంలేని శరీరాలతోని..

కొన్ని క్షణాల నిశ్శబ్దం…

ఆ వెంటనే అలజడి. చుట్టూ జనం మూగిన్లు, అరుస్తూ కేకలు పెడుతూ కాపాడే ప్రయత్నాలేవో చేస్తున్నారు.

సరిగ్గా అప్పుడే కొద్దిదూరంల ఓ కారు ఆగింది. లోపట ఏదో పాట మోగుతాంది. డ్రైవర్ మోహన్ కార్ దిగి, ఏమైందో చూద్దామని జనం గుంపుల కలిశిండు.

ఆ కార్ వెనుక సీట్ల ముగ్గురు పిల్లలుకూచోని ఉన్నరు. చందూ, అలేఖ్య, దినేష్. కొంచం పెద్ద “చిన్నపిల్లలు”. తొమ్మిదో క్లాసు వాళ్లు.

పాట ఆపి వాళ్లు ముగ్గురు కూడ కిందికి దిగి చూశిన్లు, ఏమైందోనని.

చెల్లా చెదురుగా పగిలిన అద్దం ముక్కలూ.. విసిరికొట్టినట్టు ఎగిరిపడిన పుస్తకాల బ్యాగులు.. తెరుచుకున్న టిఫిన్ బాక్సులూ.. కలిపి ఉన్న అన్నం ముద్దలూ.. వాటి మధ్యలో చిందర వందరగా చెదిరిపోయి, ఆటోకింద నలిగిపోయిన చిన్న చిన్న పిల్లలు… అది చూసిన అలేఖ్య చక్కెరచ్చి కిందపడ్డది. చందూ, దినేష్ ఆమెను లేపి కార్లో కూచోబెట్టి ఏసీ వేసి తాగడానికి ఇన్ని నీళ్ళిచ్చిన్లు.

లేవంగనే అలేఖ్య అడిగింది- “పాపం.. ఎవరట? అసలేమైందట? ఎట్లైందట?” అని.

వాళ్లు- “ఎమ్మో, ఎవరో చిన్నపిల్లలే ఉన్నట్టున్నరు- స్కూల్ బ్యాగ్స్ కనిపిస్తున్నయ్,” అన్నరు.

అంబులెన్సులు వచ్చినయ్. దానెనుకే పోలీసులూ…

టైము ఎనిమిదింబావు అయితాంది.

జరసేపటికి మోహన్ వచ్చి ఏం మాట్లాడకుంట సైలెంటుగ కార్ల కూచున్నాడు. ఆయినె చేతులకు, అంగీకి ఆడీడ నెత్తుటి మరకలున్నాయి. అవి ఎక్కడివని ఈ పిల్లలు అడగలేదు. ఎందుకంటే అవెక్కడియో వాళ్లకు తెలుసు..

వీళ్లు ముగ్గురూ చిన్నప్పట్నించీ మంచి దోస్తులు.  అందరు చదివేది ఒకే క్లాసు. ఒకే స్కూలు.

దినేష్ వాళ్ల డాడి ఆర్ టీ వో, చందు వాళ్ల డాడి గవర్నమెంటు టీచర్, అలేఖ్య వాళ్ల డాడి గవర్నమెంట్ ఆర్ అండ్ బీ రోడ్ కాంట్రాక్టర్. వాళ్లు ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్, ఉండేది కూడా పక్కపక్క ఇండ్లల్లనే అవుడుతోని అందరూ దినేష్ వాళ్ళ డాడి కార్లనే రోజూ ఇట్లా స్కూల్ కి పొయ్యస్తుంటరు.

మోహన్ ఓసారి గట్టిగా ఊపిరి తీసుకోని కారు స్టార్ట్ చేశి రివర్స్ తీస్కున్నడు.

కారు వచ్చిన దార్లనే వెనక్కి పోతోంది.

vamsi

“అంకుల్ స్కూలూ?” చందూ అడిగిండు.

“వాళ్లు మీ స్కూలు పిల్లలే చందూ,” ప్రశాంతంగా చెప్పిండు మోహన్.

ఒక్క క్షణం పిల్లలకు షాక్ కొట్టినట్టయింది.

“అర్రే.. ఔనా? ఏ క్లాస్ వాళ్లట పాపం?”

“ఎమ్మో, అందరు చిన్న చిన్న పిల్లలే! ఫస్టో సెకండో ఉంటరు కావచ్చు”

ముగ్గురికి మస్తు బాధైతుంది కని ఏమనాల్నో తోస్తలేదు.

మళ్ల జరసేపు అంతా నిశ్శబ్దం.

“అసల్ ఎట్ల అయ్యిందట అంకుల్?” దినేష్ అడిగిండు.

“రోడ్డు మీద పెద్ద లొందస్తే, దాన్ని తప్పించపొయ్యి రోడ్ డివైడర్ కు గుద్దిండట..”

“అరెరే.. పాపం…” అలేఖ్య అంది.

అడగాల్నా వద్దా అనుకుంటనే దినేష్ అడిగిండు- “ఎంతమందట అంకుల్?”

“ముగ్గురు పిల్లలున్నూ ఆ డ్రైవరూ. మొత్తం నలుగురు.  మిగిలినోళ్లకు సుత బాగనే తాకినయ్”

“మెల్లగా వెళ్ళుంటే తప్పించుకునేవాళ్ళేమో కదా? అసలు తప్పంతా ఆ డ్రైవర్ దీ, డొక్కు ఆటోదే,” అలేఖ్య కళ్లు తుడ్చుకుంటూ అన్నది.

“కరెక్టే కని, టైముకు ప్రేయర్ కు అందకపోతే మన స్కూల్ల పనిష్మెంటు ఎట్లుంటదో తెల్సుకదా? అందుకే వాడు ఫాస్ట్ గ పొయ్యుంటడు. వాని తప్పేంలేదు. అసల్ తప్పంత మన స్కూలోళ్లదే! తొమ్మిదింటికి పెడ్తె ఏం పోవును చెప్పు! ఛ, పాపం వాళ్లు మన స్కూల్ కాకున్నా అయిపోవును కదా, మంచిగ బతికిపోతుండే,” చందూ అన్నడు.

“మన స్కూల్ తొమ్మిదింటికి పెట్టినా, పదింటికి పెట్టినా ఆటోవోళ్లు అట్లనే అస్తర్రా. తప్పు ఆటోవోంది కాదు, మన స్కూలోళ్లదికాదు. ఆ రోడ్డున్నది చూశిన్లా – తప్పంత ఆ రోడ్డుదీ, దాని మీదున్న లొందలూ బొందలదీ. అవేగిన లేకుంట రోడ్డు మంచిగ సాఫ్ ఉంటె అసల్ ఇట్లయ్యేదా? ఆ రోడ్డేష్నోన్ని తన్నాలె ముందు,” దినేష్ అన్నడు.

ఇట్లా పిల్లలు ముగ్గురూ, ఇండ్లు దగ్గరికచ్చేదాంక తప్పు వీళ్లదంటే వీళ్లదని వాదిచ్చుకుంటనే ఉన్నరు. మోహన్ మాత్రం నిశ్శబ్దంగా వాళ్ల మాటలు వినుకుంట, కారును మెల్లగా ముందుకు పోనిస్తున్నడు.

“ఏం మాట్లాడ్తలెవ్వేందంకుల్? చెప్పున్లీ.. తప్పెవరిది?”

“మీరు ముగ్గురు చెప్పింది కరెక్టే. కానీ తప్పు చేసినోళ్లను తిడ్తెనో, తంతెనో సమస్య తీరిపోదు కదా?”

“మరింకేం చేస్తమంకుల్? మనతోటేమైతది?”

“అచ్చా? మరి ఎవరితోని ఐతది?”

“ఎవరితోనంటే- పెద్ద పెద్దోళ్ళుంటరు కదా? అవన్ని వాళ్లు చూస్కోవాలె. ఏదన్నుంటె వాళ్లతోనే ఐతది.”

“పెద్ద పెద్దోళ్లంటే?”

“ఆ.. పెద్ద పెద్దోళ్లంటే… పెద్దోళ్లంటే…” అని పిల్లలు కొంచంసేపు ఆలోచించిన్లు కని ఆ పెద్దోళ్లెవరో వాళ్లకు తెలుస్తలేదు.

కొంచంసేపటికి అలేఖ్య అంది. “పెద్దోళ్లంటె గవర్నమెంట్ అంకుల్. అవన్ని గవర్నమెంట్ చూస్కోవాలి.”

చందూ దినేష్ లు కూడ మాట కలిపి- “ఆ.. అదే… ఎమ్మెల్యే.. మినిష్టర్.. సీ యం.. వీళ్లంత ఉంటరుకదా గవర్నమెంటుల.. వాళ్లే.. వాళ్లే చూస్కోవాలె ఇసొంటియన్ని,” అన్నరు.

ఆ మాటలకు, అంత విషాదంల కూడా  మోహన్ మొహంలో చిన్న చిరునవ్వు మొలకెత్తింది.

అతనెందుకు నవ్వుతున్నడో పిల్లలకు అప్పుడు అర్థంకాలేదు…

******

కొన్ని రోజులు గడిచినయ్..

స్కూల్ల ‘హాఫ్ ఇయర్లీ ఎగ్జాంస్’ మొదలైనయ్. పిల్లలందరు ఆ విషాదాన్ని మరిచిపోయి, పరీక్షలు రాస్తున్నరు.  ఒక్క ఈ ముగ్గురు తప్ప.

వీళ్లుకూడా పరీక్షలు రాస్తున్నరు కానీ ఇదివరకటిలాగా కాదు. ఒకప్పుడు పరీక్షలంటెనే భయంతోని బేజారయ్యే వీళ్లు, ఇప్పుడు పరీక్షలెగ్గొట్టి నిర్రందిగ బజార్ల తిరిగే  స్థాయికి చేరుకున్నరు.  ఆ మరణాలు వీళ్ల ముగ్గురిలో పెద్ద మార్పునే తీసుకొచ్చినయ్.

చందూ, దినేష్ మ్యాథ్స్ పరీక్ష ఎగ్గొట్టిన్లు. అలేఖ్య పరిక్షకు హాజరైంది కానీ తెల్ల కాగితం ఇచ్చింది.

డ్రైవర్ మోహన్ కి ఈ విషయం ముందే తెల్సినా, వాళ్ల ఇండ్లల్ల చెప్పలేదు.

పరీక్షలు అయిపేనయ్. క్లాస్ లో పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులిచ్చి, పేరెంట్స్ తోని సంతకం చేయించుకోని తీసుకురమ్మన్నారు.

******

“డాడీ ప్రోగ్రెస్ కార్డ్.. సంతకం పెట్టు,” డాడికి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చిండు దినేష్.

“ఏందిరా ఇదీ? లెక్కల పరీక్షలో ఆబ్సెంట్ అని ఉందీ? పరీక్ష రాయలే?”

“రాయలే..”

“రాయలేదా? ఎందుక్ రాయలే??”

“ఉట్టిగనే.. నాకు రాయ బుద్ది కాలే.. రాయలే.. నువ్వైతె సంతకం పెట్టు డాడీ”

“ఏందిరా?  పరీక్షెందుకు రాయలేరా అంటే మళ్ల బౌరుబాబ్ మాట్లాడుతున్నవ్?”

“రాయబుద్ది కాలే అని చెప్తున్నగా. ఆ రోజుసినిమాకు పోయిన, అందుకే రాయలే.”

“గాడిది కొడక. పరీక్ష ఎగ్గొట్టి సిన్మాకు పేంది కాకుండ మళ్ల పెయ్యిల భయం లేకుంట నాకేఎదురుమాట్లాడుతున్నవా,” అని తిట్టుకుంట బెల్ట్ తీసి నాలుగు దెబ్బలు సరిశిండు వాళ్ల డాడి.

పెయి మీద వాతలు తేలినయ్ కని దినేష్ కంట్లో ఒక్క చుక్క కన్నీళ్ళు కూడ రాలే.

“కొట్టుడు ఐపేందా? ఇగో ఈ రెండు వందలు తీస్కోని సంతకం పెట్టు.”

ఒక్క క్షణం వాళ్ల డాడికి ఏం సమజ్ కాలే.

“ఏందిరా ఇది??”

“పైసలుడాడీ, నాకాడ ఇవ్వే ఉన్నయ్. ఇగో తీస్కో, తీస్కోని సంతకం పెట్టు..”

కోపంతోని ఊగిపోవుకుంట గట్టిగ ఇంకో రెండు దెబ్బలు సరిశిండు వాళ్ల నాన.

“పైసలిస్తే, పాడైపోయిన పాత బండ్లకు పర్మిట్లు ఇచ్చుడూ, పచ్చితాగుబోతులకు డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చుడు నీకు అలవాటే కదా డాడీ.. ఇది కూడ అట్లనే అనుకో. ఈ రెండువందలు తీస్కోని నా ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం పెట్టు..”

******

vamsi“డాడీ ప్రోగ్రెస్ కార్డ్.. సంతకం పెట్టు,” అనుకుంట డాడి చేతిల ప్రోగ్రెస్ కార్డ్ పెట్టిండు చందు.

“ఏందిరా ఇదీ? లెక్కల పరీక్ష ఆబ్సెంట్ అని ఉందీ? పరీక్ష రాయలే?”

“రాయలే..”

“ఎందుక్ రాయలేరా?”

“ఉట్టిగనే.. నాకు రాయ బుద్ది కాలే.. అందుకే రాయలే.. నువ్వైతె సంతకం పెట్టు డాడీ..”

“సువ్వర్ కే… నోరు బాగా లేస్తుందేందిరా,”  అని పట్టపట్ట నాలుగు దెబ్బలు సరిశిండు వాళ్ల నాన్న.

ఒక్క దెబ్బ పడినా అమ్మా అని బిగ్గరగా ఏడ్చే చందూ ఇప్పుడు మాత్రం ఎందుకో అస్సల్ ఏడుస్తలేడు.

“ఎందుకు రాయలేదంటే మాట్లాడ్తలెవ్వేందిరా? చెప్పూ ఎందుక్ రాయలే…” ఇంకో దెబ్బ.

“ఉట్టిగనే రాయలే… నువ్వైతె సంతకం పెట్టు..”

“బగ్గ బలిశి కొట్టుకుంటానవ్రా నువ్వూ. చెప్పు.. స్కూలుకుపోతున్నా అని పొయినవ్ కద ఆరోజు? మరి పరిక్ష రాయకుంట బడెగ్గొట్టి ఏడికి తిరుగపోయినవ్రా?” ఇంకో దెబ్బ.

“నువ్వో గవర్నమెంటు టీచర్ వి అయ్యుండి వారానికి నాలుగు రోజులు స్కూల్ ఎగ్గొట్టి బయట తిరుగుతలెవ్వా?  నేను కూడ అట్లనే స్కూలెగ్గొట్టి బయట తిరిగినారోజు..”

“పిస్స లేశిందారా.. ఏం మాట్లాడ్తున్నవ్?”

“నువ్వు రోజు స్కూలుకు పోకున్నా, నీ జీతం నీకైతె వస్తుందిగా డాడీ? అట్లనే నేను కూడా  స్కూలుకు పోకపోయినా నా మార్కులు నాకస్తయనుకున్న…”

******

“డాడీ ప్రోగ్రెస్ కార్డ్.. సంతకం పెట్టు,” అనుకుంటూ ప్రోగ్రెస్ కార్డ్ డాడికి ఇచ్చింది అలేఖ్య.

“లెక్కల్లో వందకి వందా? వారెవ్వా… శభాష్ బేటా.. నువ్వెప్పుడు ఇట్లనే మంచిగ చదుకోవాలె,” అనిబిడ్డను మెచ్చుకుంటూ అలవాటు ప్రకారం సంతకం పెట్టబొయ్యి, ఒక్క క్షణం ఏదో అనుమానం అనిపించి ఆగిండు డాడీ.

“ఇదేందమ్మా! నీకు మొత్తం ఫైవ్ ఫిఫ్టీ రావాలెగా. మరిక్కడ ఫోర్ ఫిఫ్టీ అని ఉన్నది? మీ టీచర్ కు లెక్కల్ రావా?”

“మా టీచర్ కరెక్టే వేసింది డాడీ..”

“నీ మొఖం. కరెక్ట్ ఏడుందే, టోటల్లో వంద తగ్గింది. నువ్వన్న చుస్కోవద్దా?”

“లేదు డాడి కరెక్టే ఉంది. సంతకం పెట్టు..”

“అరే.. మళ్ళ అదే మాట. కావాల్నంటె నువ్ లెక్కపెట్టు ఓసారి. ఆరు సబ్జెక్టులు కలిపి మొత్తం ఫైవ్ ఫిఫ్టీ రావాలె.”

“లేదు డాడీ, ఆ టోటల్ కరెక్టే. మ్యాథ్స్ లో నాకు సున్న వస్తే, నేనే దాన్ని వందగా మార్చిన.”

“ఏందీ??”

“ఔను డాడీ, సున్నాను వంద చేసిన..”

“ఎందుకు??”

“ఉట్టిగనే.. ఇందాక మీరు శభాష్ మెచ్చుకున్నారుకదా, అట్లా మెచ్చుకోవాలనే. సంతకం పెట్టు డాడీ..”

“సిగ్గులేదా అట్ల తప్పుడు మార్కులు వేస్కోడానికి? నిన్ను వేలకు వేలు ఫీజులుకట్టి చదివించేది ఈ దొంగ మార్కులకోసమేనా- ఆ??”

“మరి గవర్నమెంటు మీకు లక్షలకు లక్షలు సాంక్షన్ చేసేది ఆ నాసిరకం రోడ్లకోసమేనా డాడీ?”

“ఏందే? ఏమ్మాట్లాడ్తున్నవ్??”

“ఆ డబ్బులన్నీ మింగేసి, చివర్లో మీరు కూడా వాళ్లకు దొంగ లెక్కలు చూపెడ్తున్నరుకదా? మరి అలాంటి దొంగపని చెయ్యడానికి నీకు సిగ్గులేదా?”

******

బయట కారులో, మోహన్ ప్రశాంతంగ కండ్లు మూసుకోని ఒరిగిండు. అతని మొహంలో, అప్పుడు కనిపించిన చిరునవ్వే మళ్ళీ ఇప్పుడూ కనిపిస్తోంది.

సరిగ్గా అదే టైముకు ఇక్కడ ఇండ్ల లోపట,  ఆ పిల్లల గొంతునుంచి కొత్త మాటలు మొలకెత్తినయ్-

“మీ డ్యూటీని మీరు సరిగ్గ చేసుంటే, పాపం ఇయ్యాల ‘ఆ నలుగురు’ మంచిగ బ్రతికుంటుండే కదా డ్యాడీ? Yes.. You killed them all.. and you are not a Public Servant dad.. You are a Professional Killer..”

తమ పిల్లలు అంటున్న మాటలకు ఆ తండ్రుల గొంతు తడారి పొయ్యి, మాట పడిపోయింది.

కానీ..

కానీ..   వాళ్ల గుండెలు మాత్రం తడయ్యి, ఆ కరిగిన మనసులకు గురుతుగా..

“చిక్కటి కన్నీటి బొట్లు…. ఒక్కొక్కటిగా రాలుతున్నాయి…”   

 

*

మీ మాటలు

  1. అద్భుతం, గుండెల్లొ తడి తెలిసింది.

    • Allam Vamshi says:

      ధన్యవాదాలు A E O P J P T గారు.. చాల సంతోషం గా ఉంది.

  2. చాలా బాగుంది కళ్ళముందు చూస్తున్నట్టుగా నెరెఅశన్ బాగుంది

  3. చందు తులసి says:

    వ్యవస్థలోని అవివీతి వల్ల ఎలాంటి పర్యవసావాలుంటాయో చాలా ఎఫెక్టివ్ గా చెప్పారు వంశీ గారూ…పిల్లల్లో ఐనా మార్పు వస్తే సంతోషం…

    • Allam Vamshi says:

      మీ స్పందనకు మనస్పూర్తిగా కృతజ్ఞ్యతలు చందు తులసి గారు.. :)

  4. కె.కె. రామయ్య says:

    కధ శానా బాగుంది బావూ!

    అద్భుతమైన కధ, ఆద్యంతం పట్టువిడవకుండా చదివించిన కధనం. మెరుస్తున్నమాడలీకంతో ఉన్న ఈ కధ ( ఆలిచిప్పలో ముత్యంలా ఇన్నాళ్ళూ ఎక్కడున్నారు ఈ వర్ధమాన రచయితలంతా అనే ) గొరుసన్నలాంటి సీనియర్స్ ని మురిపిచ్చుద్ది, మీరీ సద్దికే ప్రవర్ద్దమాన రచయితై ఉన్నా. గీ పోరగాడు నోబెల్ బహుమతి తెచ్చుకునే దిమాక్ గిట్ట ఉన్నోడే .. అని ప్రాతినిధ్య డా. సామాన్య గారు ( మహిత కధ రాసిన సామాన్య గారు ) ఇదివరకే మెచ్చుకున్నా.

    మీ కధ “చదివినం, మంచిగుంది”. “ఉప్పెనోలె ఎగిసిపడుతున్న రచనలు అత్యద్భుతంగా రాస్తున్న” అల్లం వంశీ గారు మీకు సలామ్.

    • Allam Vamshi says:

      చానా సంబరంగా ఉన్నది సర్, దిల్ ఖుష్ అయ్యింది మీ మాటలకు.. ఇట్ల మీ లెక్క మంచి చెడ్డ చెప్పి జబ్బతట్టి ముంగటికి నడిపించెఅటొల్లు ఉన్నరుకాబట్టె రాయలేస్తున్న సర్.. నిజంగా మస్తు బలమచ్చింది మీ మాటలకు.. చానా చాన శణార్తులు.. :)

  5. చందు తులసి గారు చెప్పినట్టు రేపటి తరం మారినా చాలు.. నమ్మకం ఉంది. మంచి కథ, చిన్న పదాలతో పెద్ద సందేశం. తప్పకుండ మంచి కథకుడు అవుతారు/అయ్యారు!

  6. వనజ తాతినేని says:

    ఎప్పటిలాగేనే … మీ నుండి మంచి కథ . విప్లవం ఇళ్లలోనే రావాలి. రేపటి పౌరులు గుర్తుకొచ్చింది. చాలా బావుంది వంశీ !

    • Allam Vamshi says:

      చానా థ్యాంక్స్ మేడం, నా ప్రతి కథ చదివి మీ అభిప్రాయాల్నీ తెలియచెఅసి ఇంతలా ప్రొత్సహిత్సున్నన్దుకు నిజంగా మీకు మనస్పూర్తిగా కృతజ్ఞ్యతలు మేడం.. నిజంగా చానా చాన సంతోశంగా ఉన్దండీ .. :)
      థాంక్యూ సో మచ్ :)

  7. మంచి సబ్జెక్టు, story బాగుందండి.

  8. తహిరో says:

    మీ కథ “సబ్జెక్ట్” సమకాలీనం. తప్పక ఇలాంటి ఇతివృత్తాలతో కథలు రాయాలి కూడా . తండ్రులు చేసే దుర్మార్గాలను పసిగట్టి పిల్లలు ఎదురు తిరగడం మంచి ముగింపే కానీ … అంత వరకూ ఆ తండ్రుల పెంపకంలో ఉన్న ఆ పిల్లల్లో అంత గొప్ప సామాజిక మైన మార్పు ఒక్కసారే ( యాక్సిడెంట్ చూసిన వెంటనే ) రావడం నాటకీయంగా ఉంది. సినిమాటిక్ గా ఉంది. అందువల్ల హృద్యంగా రావలసిన కథ తడిలేకుండా వార్త కోసం కథ అల్లుకున్నట్టు పొడి పొడిగా తయారైంది. వార్తా కథనం అయ్యింది . పిల్లల్లో వచ్చిన మార్పు వెనక తండ్రుల ప్రవర్తనతో విసిగిపోయిన అసహనాన్ని వాళ్ళు చాలా రోజులుగా భరిస్తున్నట్టు సన్నివేశాలు సృ ష్టించి, ఈ యాక్సిడెంట్ తో “బరస్ట్” అయ్నట్టు రాస్తే బాగుండేది .
    మీరొక్కరే కాదు … ఈ మద్య రాస్తున్న కొత్త కలాలన్నీ విషయం చెప్పాలనే తొందర పడుతున్నయ్ గాని “శిల్ప ” పరంగా ఎలా ప్రెజెంట్ చెయ్యాలో ఆలోచించడం లేదు.
    రాయడం వస్తే సరిపోదు – బలంగా ఎలా “ప్రెజెంట్ ” చెయ్యాలనే దానిపై మనసు ఉంచండి – మంచి కథలు రాయగలరు మీరు.
    నా మాటలు కరకుగా ఉండొచ్చొ గానీ – అవి మీ ఎదుగుదల కోసం అని అర్థం చేసుకోగలరు.

  9. తహిరో says:

    మరో విషయం –
    చనిపోయిన పిల్లల తల్లి దండ్రుల మనోక్షోభను దయనీయంగా వర్ణించి , ఆ తర్వాత యాక్సిడెంట్ కు కారణాలను వెదికి ఉంటే … కథ మరింత బలంగా వచ్చేది . అప్పుడు కథ చదివిన పాఠకుల్లో వ్యవస్థ మీద ఒక కసి బయలు దేరేది .

  10. Allam Vamshi says:

    కథ చదివి, మీ అభిప్రాయాన్ని తెలియ చేసినందుకూ & సలహాలు ఇచ్చినందుకు మనస్పూర్థిగా ధన్యవాదాలు తహిరో గారు. చానా హ్యాపీ…

  11. I. Madhavi says:

    ఆద్యంతం చక్కగా చదివించింది మాండలీకం లో వున్నా తేడా తెలీలేదు. కథ బావుంది కానీ ముగిమ్పే మరీ సినీమాలో లాగా వాస్తవానికి దూరంగా వుంది. అంత పేయి బలిసిన వాళ్ల పిల్లలు మరీ ఇంతలాగా ఇదురు తిరగడం ఒకింత వింతే. మరేదైనా పథ్థతిలొ కనువిప్పు కలిగించి వుంటే బాగుణ్ణు. అసలు పెద్దవాళ్లకి కళ్లు తెరుచుకోకపోయినా పిల్లలు తెలుసుకొంటే మంచి జరిగినట్లే కదా. మంచి సమకాలీన ఉదంతం, ప్రయత్నం.

    • Allam Vamshi says:

      కథ పై మీ విలువైన అభిప్రాయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు మాధవి గారు. అయితే, సినిమాలకు రాసిన అలవాటు వల్లనో ఏందోగని అట్లా సినిమాటిక్ గా వచ్చినట్టుంది మరి! ఏదేమైనప్పటికీ మీ స్పందనకు మల్లొక్కసారి కృతఙ్ఞతలు మేడం.. :)

  12. కె.కె. రామయ్య says:

    తమ్మీ వంశీ, ఇంతకీ నీకిన్ని మంచి సలహాలిచ్చిన ఆ తహిరో గారెవరనుకుంటున్నావు ? తెర మరుగు నుడాలనుకునే మీ ముందు తరం తెలుగు కధా గజఈతగాడు. విశాఖ మాండలీకాన్నో చేత్తో, పాలమూరు మాండలీకాన్నింకో చేత్తో రాసినోడు. అట్టాంటోడికి ఈ ఉత్తుత్తి ‘మనస్పూర్తిగా ధన్యవాదాలేంటి’ నా శ్రాద్ధంలా. వాటేసుకుని మరి వొగ్గమాక, ముగ్గులోకి దిగేదాకా. కాలం నాడు ఆంద్రజ్యోతి తిర్పతి ఎడిషన్ పెద్ద ఉమా ( ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారు ) కొట్టి కొట్టి ఈ యప్పను లైన్లో బెట్టిండంటా. ఇప్పుడు కుర్రాళ్లు చౌరస్తా వంశాన్న, చందు తులసి, నీ వంతు వచ్చింది ఆ బాద్యత నెత్తినేసుకోవటానికి.

  13. హ హ.. :)
    సంతోషం రామయ్య గారు. తహిరో గారు అనుభవంతో, ఓపికగా ఇచ్చిన సలహాలు కాబట్టే వాటికి మనస్పూర్థిగా ధన్యవాదాలు చెప్పుకున్నా.. :)
    “వారు చెప్పిన పద్ధతిలోనే రాస్తాను, సలహాలన్ని తూచ తప్పకుండ పాటిస్తాను” అని అబద్ధపు ఒట్లు వెయ్యడం తప్పు కాబట్టి అటువంటి పని చెయ్యలేదంతే సర్.. కని ఆ మంచి సూచనలను తప్పకుండ గుర్తుపెట్టుకుంటా అన్నది మాత్రం వాస్తవం.. మెచ్చుకోలో, మొట్టికాయలో ఏదో ఒకటి మన మంచికోరి పెద్దోళ్లు ఇచ్చినపుడు తప్పకుండా తీసుకోవల్సిందే కదా.. :) సంతోషంగ తీసుకుంటాను.. అందుకే నిజంగ మళ్లీ మనస్పూర్తిగా చెప్తున్నా మీ విలువైన సూచనలకు, సలహాలకు మాటల్లో చెప్పలేనంత ధన్యవాదాలు సర్..

  14. Chandra Shekhar says:

    మంచి కథ.. కంగ్రాట్స్ ☺

  15. k sivanageswararao says:

    good

  16. కె.కె. రామయ్య says:

    తహిరో గోరండీ, పిచ్చర్ బడ్జెట్ కరసు ఎక్కువై పోద్దన్ని పోడ్డూసర్ బామ్మర్దో, టి. కృష్ణ తీసిన రేపటి పౌరులకి ధీటిగా తియ్యాలని డైరెక్టర్ బాబో వత్తిడి చెయ్యటం వల్ల కూడా వంశీ కధను ఈ యాంగిల్లో నేరేట్ జేసుంటాడు. ముందు ముందు ఇంకా పకడ్బందీగా రాస్తాడులెండి మీ సలా మేరకు. అయినా అన్నా! ఉత్తినే “శిల్ప ” పరంగా అంటే కుర్రాళ్ళకి ఎట్టా అర్తమవ్వుద్దో. అది పిచ్చర్లో వీరోయిన్ శిల్ప పరంగానా, లేక కదా శిల్పం పరంగానా అనే డౌటింగ్ రాకుండా జెయ్యాలంటే ఇట్టా ప్రైవేటుగా ప్రైవేటు క్లాసులు తీసుకోకుండా హైదరాబాదులో ఉన్న మనపోరగాళ్ల నందర్నీ యే ఆదోరవో నాంపల్లి టేషన్ కాడికో, కుక్కట్ పల్లి జంక్షన్ కాడికో బిలిచి ఏ ఇరానీ హోటల్ లోనో చాయ్ తాపిస్తా డిష్కషన్ ఎట్టుకోవచ్చు గందా. ఇట్టాటి అరేన్మెంట్లన్నీ చూడమని పరాయోళ్ల కధల మన సిన్నఉమాకి పురమాయిన్చోచ్చు కదా. ఓ నేలక్లాసు ప్రేక్షకుడిగా ఇయ్యన్నీ నా గొంతెమ్మ కోరికలు.

    అల్లం రాజయ్య గారి బాటలో వంశీ ఎలబారిపోతున్నాడు అని అన్నారెవరో. అది విన్నందుకు, ఈ కధ చదివినందుకు నాకు మస్తు దిల్ కుష్ అయ్యిందన్నా.

  17. బాగుంది తమ్మీ!

Leave a Reply to Allam Vamshi Cancel reply

*