అమాయకత్వం కోల్పోతున్న కొత్త జీవితాల కథలు

ఎన్‌. వేణుగోపాల్‌

~

Loss of Innocense Cover (1)కుప్పిలి పద్మ కథలను ఇరవై సంవత్సరాలకు పైగానే చూస్తున్నాను. పదిహేను సంవత్సరాల కింద తాను రాసిన సాలభంజిక కథ చదివి, సమాజంలోకి వస్తున్న కొత్త జీవితాలను, కొత్త జీవన విధానాలను అర్థం చేసుకుని రాయగలిగిన రచయితగా గుర్తించి, అటువంటి రచయితలకు ప్రోత్సాహం అవసరమని అప్పుడు నేను రాస్తున్న ఒక వారం వారం శీర్షికలో ఆ కథ గురించి రాశాను. అప్పటి నుంచి అడపాదడపా తన కథల గురించి నా అభిప్రాయాలు చెపుతున్నాను.

ఈ కథలలోకి వెళ్లేముందు అసలు ఇటువంటి కొత్త జీవితాల పట్ల, ఆ జీవిత సమస్యల పట్ల సమాజపు దృక్పథాన్ని, ప్రత్యేకించి ఆలోచనా పరుల దృక్పథాన్ని, జాగ్రత్తగా పరిశీలించవలసి ఉందనుకుంటాను. ఈ కొత్త జీవితం ఇప్పటికింకా రెండు మూడు దశాబ్దాలు గడిచి నప్పటికీ సార్వత్రికం కాలేదు. దాని స్వభావం వల్లనే అది సార్వత్రికం కాజాలదు కూడ. ఎక్కువలో ఎక్కువ అది ఎగువ మధ్యతరగతిని తాకి, ఆ కింది వర్గాల మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం వేయగలుగుతున్నది. అది అల్పసంఖ్యాకుల జీవితాల్లోకి మాత్రమే ప్రవేశించి ఉండవచ్చుగాని అంచులలో ఉన్నదని కూడ అనలేం. ప్రచార సాధనాల హడావిడి వల్ల ఒక రకంగా అదే ప్రధానస్రవంతి అనే అపోహ కలగడానికి కూడ అవకాశం ఏర్పడుతున్నది.

ఇళ్లు, ఇళ్లలో వస్తువులు, అలంకరణలు, వాహనాలు, దుస్తులు, తిను బండారాలు, సంబంధాలు, మాటతీరు, వ్యక్తీకరణలు వంటి ఎన్నో వ్యక్తిగత అంశాల మీద ఈ ప్రభావం ఉంటున్నది. సినిమాలో, టెలి విజన్‌లో, పత్రికలలో ఇదే ప్రామాణిక జీవనస్రవంతి అన్నట్టుగా చూపు తుండడం వల్ల రెండు ప్రమాదకరమైన పరిణామాలు కూడ చాప కింది నీటిలా సమాజమంతా విస్తరిస్తున్నాయి. జిలుగువెలుగులతో ఆకర్షణీయంగా చూపడం వల్ల అదే అనుసరణీయమైన జీవన ప్రమాణం అనుకుని, అనుకరించడానికి ఎక్కువమంది ప్రయత్నిం చడం ఒక పరిణామం కాగా, ఆ జీవన ప్రమాణాన్ని అందుకోలేమని తెలిసి, అందువల్ల తమ జీవితమే వ్యర్థమనే న్యూనతా భావనకు మరింతమంది గురికావడం మరొక పరిణామం. అటు అనుకరణ సంస్కృతి అయినా ఇటు ఆత్మన్యూనతా సంస్కృతి అయినా మనిషిని తన నుంచి తనను దూరం చేసేవే. అంటే మనిషిని సంఘం నుంచి, సమష్టితత్వం నుంచి దూరం చేసేవే. అలా మన సమాజంలో ఈ కొత్త జీవితాల ప్రవేశం అంతకు ముందు ఉన్న అంతరాలకు మరొక కొత్త అంతరాన్ని కలుపుతున్నది. ఒక కొత్త ఘర్షణనూ వేదననూ సృష్టిస్తున్నది. ఒక కొత్త పరాయీ కరణను ప్రవేశపెడుతున్నది.
ఈ నేపథ్యంలో ఈ కొత్త జీవనరంగాల గురించీ, వాటిలోపలా, వాటి వల్లా సమాజంలో తలెత్తుతున్న ఘర్షణల గురించీ, వాటి ప్రభావం గురించీ మరింత ఎక్కువగా అర్థం చేసుకోవలసిన, మాట్లాడుకో వలసిన అవసరం పెరుగుతున్నది. ఈ జీవితాల గురించి సాను కూలంగా, ఆకర్షణతో, మోజుతో, సమ్మోహకంగా చెపుతున్న ధోరణి పెరుగుతున్నందువల్ల, వాస్తవికంగా వాటిలోని గుణదోషాలను, సమస్య లను, ఆందోళనలను అర్థం చేసుకోవలసి ఉన్నది. ఆ జీవితాలలోని మంచిగాని, చెడుగాని సమాజంలోని ఇతర వర్గాల జీవితాల మీద ఎటువంటి ప్రభావం వేయగలవో తెలుసుకోవడానికి ఆ జీవితాల గురించీ తెలుసుకోవాలి, ఆ ప్రభావాల గురించీ తెలుసుకోవాలి. ఇంత బలమైన జీవన ప్రభావం సహజంగానే కళకూ కథకూ వస్తువు కాకతప్పదు. ఆ అత్యవసరమైన పనిని పద్మ తన కథల ద్వారా గత రెండు దశాబ్దాలుగా చేస్తున్నదని నాకనిపిస్తున్నది. ఇప్పుడిక్కడ సంకలనం చేసిన పదకొండు కథలు కూడ ఆ పనిలో భాగమే అనుకుంటాను.

 

ద లాస్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌ అనే పుస్తక శీర్షిక ఈ పుస్తకంలో భాగమైన ఒకానొక కథ శీర్షిక మాత్రమే కాదు. ఈ కథలన్నిటికీ ఆధారభూమిక అయిన సార్వత్రిక ఇతివృత్తంగా అర్థవంతమైనది. మరోమాటలో చెప్పా లంటే అది మన సమాజపు ఒకానొక స్థితి. నైసర్గికమైన, సహజమైన అమాయకత్వాన్ని కోల్పోతున్న స్థితిలో ఇవాళ సమాజంలో గణనీయ మైన భాగం ఉంది. ఈ అమాయకత్వం కోల్పోతే దాని స్థానంలో వచ్చేది ఏమిటనేది చర్చనీయాంశం కావచ్చు. కాని వలసవాద మార్కెట్‌ ప్రవేశించిన నాటి నుంచీ భారతీయ సామాజిక జీవితం అమాయ కత్వాన్ని కోల్పోతూనే ఉంది. ఆ మూడు వందల సంవత్సరాల చరిత్ర ఇక్కడ అవసరంలేదు గాని గత రెండు మూడు దశాబ్దాలలో ఈ అమాయకత్వాన్ని కోల్పోయే ప్రక్రియ వేగవంతంగానూ, విస్తారం గానూ, లోతుగానూ జరుగుతున్నది. ఒక మనిషయినా సమాజ మయినా అమాయకత్వం కోల్పోతే, ఆ స్థానంలో జ్ఞానమో, వివేకమో రావచ్చు. లేదా, తెంపరితనమో, తుంటరితనమో రావచ్చు. అజ్ఞానమూ అవివేకమూ కూడ ఆకర్షణీయమైన ముసుగులు వేసుకుని రావచ్చు. ఈ పరిణామం ఎలా జరిగినప్పటికీ, సామాజిక అమాయకత్వం కోల్పోయే క్రమం ఆసక్తి కరమైనది. అది వ్యక్తిగత జీవితాలలో ప్రతి ఫలిస్తూ వ్యక్తులు తమ అమాయకత్వం కోల్పోయే క్రమాన్ని ఒక కళారూపంలో చిత్రించడం మరింత ఆసక్తికరమైనది. ఒకరకంగా చూస్తే ఈ పదకొండు కథలూ కూడ ఒక సమాజం అమాయకత్వాన్ని కోల్పోయే క్రమానికి వ్యక్తిగతస్థాయి ప్రతిఫలనాల చిత్రణలే.

ద లాస్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌లో విహాన్‌ – దర్శనల మధ్య ఉన్న సంబంధానికి పాత పద్ధతిలో పరస్పర నమ్మకం పునాది కాదు. బహుశా పరస్పర అపనమ్మకమే, అవతలి వాళ్లు అబద్ధం చెపుతున్నారన్న నమ్మకమే పునాది కావచ్చు. అమాయకత్వం కోల్పోవడం అంటే అదే. కాకపోతే దానికి లాంగ్‌ కమిట్‌మెంట్స్‌ యివ్వలేకపోవడం అనీ, బ్యాగేజ్‌ వద్దను కోవడం అనీ, కెరీర్‌లో సెటిల్‌ కావడం అనీ కొత్త అర్థాలు చెప్పుకునే తెలివితేటలు ఇప్పుడు వచ్చాయి. ‘యే ఫీల్డ్‌ అయితేనేం కేట్‌ రేస్‌లో అందరం… యేదో రకంగా భాగస్తులమే…’ అనడం అలా అమాయ కత్వం కోల్పోతున్నవాళ్ల అంతరంగానికీ, బహిరంగ సమర్థనకీ ఒక సూచిక. అసలు ఆ కేట్‌ రేస్‌ ఎవరు సృష్టించారు, ఎవరి ప్రయోజనాల కోసం సృష్టించారు, ఆ కేట్‌ రేస్‌లోకి వెళ్లేవాళ్లు ఇష్టపూర్వకంగా వెళుతున్నారా, సామాజిక స్థితి వాళ్లను అటు నెట్టి, వాళ్ల నుంచి అమాయకత్వాన్ని కొల్లగొడుతున్నదా, అలా వెళ్లినందువల్ల వాళ్లేమి సాధిస్తున్నారు అని ఆలోచించడానికి పురికొల్పడమే కథ సాధించదలచిన ప్రయోజనం.

ఈ కొత్త తరం అమాయకత్వం కోల్పోవడాన్ని నిజానికి చాలా రంగాల్లో, కోణాల్లో, స్థాయిల్లో అర్థం చేసుకోవలసి ఉంది. అది సంఘ పరివార్‌, ఖాప్‌ పంచాయతీలు చూస్తున్న ఏకైక, సంకుచిత, పురు షాధిపత్య అర్థంలో మాత్రమే జరగడం లేదు. సంక్లిష్టమైన, అసాధారణమైన రూపాల్లో జరుగుతున్నది. నైతిక పోలీసులు చెపుతున్న సద్యోలైంగిక సంబంధం, కాజువల్‌ సెక్స్‌, వైవాహికేతర సంబంధం, స్వేచ్చాయుతమైన ప్రవర్తన వంటి పాత నైతిక అర్థాలు మాత్రమే ఈ అమాయకత్వ విచ్చేద పరిణామాన్ని పూర్తిగా వివరించజాలవు. అసలు ఆ ప్రక్రియకు ప్రతిసారీ ప్రతికూల అర్థం మాత్రమే ఉంటుం దని కూడ అనుకోలేం. ఒక్కోసారి అధ్యయనం వల్ల, స్పందనల వల్ల, భావుకత వల్ల ప్రపంచానికి కొత్త కిటికీలు తెరుచుకుని, వ్యక్తిత్వం వికసించి, జీవన సార్థకతకు వినూత్న అర్థాలు స్పురించి కూడ అమాయకత్వం కోల్పోయే పరిస్థితి రావచ్చు. ఆ సానుకూల అర్థాలలో కూడ అమాయకత్వ విచ్చేదాన్ని అర్థం చేసుకోవలసి ఉంది.

మెరుగైన ఆర్థికస్థితి ఉన్న మధ్యతరగతి కుటుంబాలలో అంతర్లీనంగా ఎంత పితృస్వామిక భావజాలం ఉన్నప్పటికీ, అమ్మాయిల పట్ల ప్రేమాభిమానాలు కనబరచడం, ముద్దు చేయడం, వాళ్ల ఇష్టాయిష్టాలు తీర్చడం కొంత మెరుగ్గానే ఉన్నాయి. కాని కూతురికి ఉండే ఆ హోదా అదే వయసులో ఉండే కోడలికి లేకపోవడంలోనే పితృస్వామ్యం బయటపడు తుంది. ‘నీకున్న ఫ్రీడవ్‌ు నాకు కూడా మా యింట్లో వుండేది. యిది నా యిల్లు అంటారు. కానీ కాదు. యిది నేను పెళ్లి చేసుకొన్న అబ్బాయి, అంటే నా భర్త యిల్లు. అదీ తేడా… నీకున్నలాంటి ఫ్రీడమ్  నాకు రాదు. పైకి కనిపించని రూల్స్‌ చాలా ఉంటాయి. మ్యారేజి అయ్యాకే నాకు యివన్నీ యెక్స్‌పీరియెన్స్‌లోకి వచ్చాయి,’ అని ‘ఫ్రంట్‌ సీట్‌’లో గ్రీష్మ తన ఆడబిడ్డ ధాన్యతో అనే మాటలు పితృస్వామిక నిర్బంధానికీ, కొత్త తరం యువతుల గ్రహింపుకూ నిదర్శనం. ఇది కూడ మరొకస్థాయిలో అమాయకత్వ విధ్వంసమే.

కొత్తతరం పోగొట్టుకుంటున్న అమాయకత్వంలో, తెచ్చుకుంటున్న కొత్త అలవాట్లలో, విలువల్లో అధికారాన్ని, సంప్రదాయాన్ని ప్రశ్నించడం అనే సానుకూల లక్షణంతో పాటే అనారోగ్యానికీ, అసాంఫిుకత్వానికీ దారితీసే అలవాట్లు కూడ ఉంటున్నాయి. మద్యపానాన్నీ, మాదక ద్రవ్యాల వాడకాన్నీ నైతిక కారణాలవల్ల వ్యతిరేకించనక్కరలేదు గాని అవి మరొకరు మప్పుతున్నందువల్ల, మరొకరి వ్యాపారం కోసం, యువతరాన్ని జోకొట్టడం కోసం వస్తున్నాయా ఆలోచించవలసి వుంది. ‘గాల్లో తేలి నట్టుందే’ కథ ఈ విలువల ఘర్షణను చిత్రిస్తుంది. ‘వో మైగాడ్‌… మమ్మీ నిజంగా నువ్వు యిన్నోసెంట్‌. క్రైమ్  యేంటి? నీకు తెలుసా 21 ఏళ్లు నిండని వాళ్లకీ డ్రింక్స్‌ యిస్తారు పబ్స్‌లో. హుక్కా క్లబ్స్‌లో, పబ్స్‌లో రకరకాల పేర్లతో గంజాయే కాదు, కొన్ని రకాల డ్రగ్స్‌ దొరుకు తాయి. యిదంతా కామన్‌. క్రైమ్ కాదు.  వీటికొచ్చే వాళ్లంతా యెలీట్‌ రిచ్‌ సెక్షన్స్‌ నుంచే. వీటిని రన్‌ చేసేది పవర్‌ఫుల్‌ పీపుల్‌. అలా వాళ్లు సర్వ్‌ చేయటం క్రైమ్  కానప్పుడు మేం తీసుకోవటం క్రైమ్ ఏలా అవుతుంది…’ అన్న సుస్మిత మాటలు కొత్త మార్పులను మాత్రమే కాదు, ఆ మార్పుల వెనుక ఉన్న, లాభ పడుతున్న శక్తులను కూడ చూపుతున్నాయి. ‘యీ జనరేషన్‌ చాలా అందమయినది. తెలివైనది. యెన్నెన్నో విషయాలని సునాయాసంగా కనిపెడ్తూ ఉంది. యిదే జనరేషన్‌లో కొంతమంది యిలాంటి అలవాట్లకి బానిసలవుతూ యిదంతా ఫన్‌ అంటారు. యిలాంటి వాళ్లు యెక్కువగా డిస్ట్రక్షన్‌ వైపు మొగ్గు చూపిస్తున్నారు. వాళ్లకసలు భయం లేదు. ప్రాణాల మీద మమకారం లేదు…. నువ్వంటున్నావు రూల్స్‌ బ్రేక్‌ చేయడాన్ని యిష్టపడుతున్నారని. అన్ని జనరేషన్స్‌లో రూల్స్‌ని బ్రేక్‌ చేయటం వుంది. కాకపోతే అప్పుడు యెక్కువగా వొక వికాసం కోసం చేసేవారు. యిప్పుడు అదంతా వొక విధ్వంసం. అదే మానసికానందం…’’ అని నందినికి వివరిస్తారు మాస్టారు.

పద్మ భాషలో సమ్మోహకమైన, ఆకర్షణీయమైన లక్షణమూ ఉంది. ఒక్కొక్కసారి అది సహజత్వానికి దూరమైందని అనుమానించడానికి ఆస్కారం ఇచ్చే లక్షణమూ ఉంది. ఆమె సృష్టించే సన్నివేశాలు, సంభా షణలు, చివరికి పాత్రల పేర్లు కూడ అసహజమైనవని అనుకునే అవకాశం ఉంది. ఒక్కొక్కచోట పాత్రల, సంభాషణల, ప్రవర్తనల ఔచిత్యం మీద కూడ సందేహం కలుగుతుంది. కళారూపానికి విశ్వ సనీయత, సంభావ్యత పునాది అంశాలు. అవి లేవని లేశమాత్రం అనిపించినా ఆ కళారూపం ఇవ్వదలచిన సందేశం కూడ దెబ్బ తింటుంది.

ఈ చిన్న లోపాలు అలా ఉంచి ఈ కథల గురించి మొత్తంగా ఆలో చిస్తే, ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో మార్క్స్‌, ఎంగెల్స్‌లు బూర్జువా వర్గ ప్రాబల్యం, మార్కెట్‌ ప్రవేశించిన చోట ఏం జరిగిందని చెప్పారో గుర్తుకొచ్చింది: ‘బూర్జువావర్గం… మత, రాజకీయ భ్రమల ముసుగులు కప్పిన దోపిడీ స్థానంలో నగ్నమైన, సిగ్గులేని, ప్రత్యక్షమైన, అమాను షమైన దోపిడీని ప్రవేశపెట్టింది. ఇంతవరకూ గౌరవనీయంగానూ, భక్తిపూర్వక మైన భయంతోనూ పరిగణించిన ప్రతి వృత్తి మీది ఆచ్చాదననూ బూర్జువావర్గం పీకి పారేసింది. వైద్యుడినీ, న్యాయవాదినీ, మతగురువునీ, కవినీ, శాస్త్రవేత్తనూ డబ్బుకోసం తనకు ఊడిగంచేసే కిరాయి కూలీలుగా మార్చివేసింది. బూర్జువావర్గం కుటుంబం నుంచి దాని రాగబంధురమైన మేలిముసుగును చించి పారవేసి కుటుంబ బంధాన్ని కేవలం డబ్బుతో కూడిన సంబంధంగా దిగజార్చింది… సమస్త సామాజిక స్థితులను ఎడ తెగకుండా కలతపెట్టడం, అనిశ్చి తత్వాన్నీ, ఆందోళననూ నిరంతర పరిణామాలుగా మార్చడం బూర్జువాశకపు ప్రత్యేకతలు… గడ్డ కట్టుకుని, తుప్పుపట్టిపోయిన సంబంధాలూ, వాటితో పాటు సనాతమైన, పూజనీయంగా చూసిన దురభిమానాలూ తుడిచిపెట్టుకుపోతాయి. కొత్తగా ఏర్పడిన సంబంధాలు గట్టిపడక ముందే పాతబడిపోతాయి. ఘనీభ వించిన ప్రతీదీ కరిగి గాలిలో బాష్పమైపోతుంది. పవిత్రమైన ప్రతిదీ మలినమై పోతుంది…’

ఈ మాటలు రాసింది 1848లో. ఆ తర్వాత గడిచిన నూట అరవై సంవత్సరాలలో ఆ స్థితి మరింత తీవ్రతరమైంది. ఆ బూర్జువావర్గం తన తొలినాటి ప్రగతిశీల స్వభావాన్నీ, సమాజాన్ని ఇలా సమూలంగా మార్చే బాధ్యతనూ వదులుకుంది. భారత సమాజం వంటి సమాజా లలో పాత, అభివృద్ధి నిరోధక వ్యవస్థలలో తనకు పనికి వస్తాయనుకునే చెడుగులతో మిలాఖత్తు పెట్టుకుంది. ఇప్పుడిది పాతనంతా ఊడ్చి పారేసే కొత్త కాదు. పాత కొత్తల మేలు కలయిక కూడ కాదు. పాత కొత్తల కీడు కలయిక. ఇక్కడ డాలర్ల వేట, ఇంగ్లిష్‌ చదువులు, అపార ప్రపంచజ్ఞానం, అందరాని జీవనశౖలివంటి అత్యాధునిక అంశాలూ, స్త్రీపురుష అసమానత, కులవివక్ష, మతోన్మాదం, మూఢనమ్మకాల వంటి ప్రాచీన అంశాలూ సామరస్యంగా సహజీవనం చేస్తుంటాయి. ఆ పాతకొత్తల కీడు కలయిక స్థితికి సూచికలు ఈ కథలు.

*

 

 

మీ మాటలు

  1. రాజశేఖర్ గుదిబండి says:

    “అటు అనుకరణ సంస్కృతి అయినా ఇటు ఆత్మన్యూనతా సంస్కృతి అయినా మనిషిని తన నుంచి తనను దూరం చేసేవే.” బాగా చెప్పారు..

    చాలా చక్కటి పరిచయం…
    పద్మ గారికి అభినందనలు….

  2. Delhi Subrahmanyam says:

    యెప్పటిలాగే చాలా విలువయిన విశ్లేషణ వేణూ కలామ్ నుంచి. “మెరుగైన ఆర్థికస్థితి ఉన్న మధ్యతరగతి కుటుంబాలలో అంతర్లీనంగా ఎంత పితృస్వామిక భావజాలం ఉన్నప్పటికీ, అమ్మాయిల పట్ల ప్రేమాభిమానాలు కనబరచడం, ముద్దు చేయడం, వాళ్ల ఇష్టాయిష్టాలు తీర్చడం కొంత మెరుగ్గానే ఉన్నాయి. కాని కూతురికి ఉండే ఆ హోదా అదే వయసులో ఉండే కోడలికి లేకపోవడంలోనే పితృస్వామ్యం బయటపడు తుంది. ‘నీకున్న ఫ్రీడవ్‌ు నాకు కూడా మా యింట్లో వుండేది. యిది నా యిల్లు అంటారు. కానీ కాదు. యిది నేను పెళ్లి చేసుకొన్న అబ్బాయి, అంటే నా భర్త యిల్లు. అదీ తేడా… నీకున్నలాంటి ఫ్రీడమ్ నాకు రాదు. పైకి కనిపించని రూల్స్‌ చాలా ఉంటాయి. మ్యారేజి అయ్యాకే నాకు యివన్నీ యెక్స్‌పీరియెన్స్‌లోకి వచ్చాయి,’ అని ‘ఫ్రంట్‌ సీట్‌’లో గ్రీష్మ తన ఆడబిడ్డ ధాన్యతో అనే మాటలు పితృస్వామిక నిర్బంధానికీ, కొత్త తరం యువతుల గ్రహింపుకూ నిదర్శనం. ఇది కూడ మరొకస్థాయిలో అమాయకత్వ విధ్వంసమే” ఇది పితృరాజ్య స్మాజానికి ఖచ్చితమయిన అర్ధం చెప్పిన విశ్లేషణ. ఇంత మంచి విశ్లేషణ రాస్డిన మిత్రుడు వేణి , అతని చేత బాగా రాయినచడానికి కారణమయిన మిత్రురాలు పద్మ లకు అభినందనలు.

  3. Akbar pasha says:

    అమాయకత్వాన్ని కోల్పోవటం అసలయిన విషాదం. పద్మ గారికి, వేణు గారికి, సారంగకూ అభివందనాలు.

  4. పద్మ గారి కథలు బాగుంటాయి . నిజమే, అమాయకత్వం ఎక్కడుంది ఇప్పుడు లోకంలో ? ఉండి ఉంటే దాన్ని కలిగి ఉన్న వారి మనుగడ కష్టతరంగా ఉంది. మంచి అంశంపై వ్రాసిన కథల గురించి మంచి వచనంలో వివరించారు . ధన్యవాదాలు సర్

  5. DEVIKA RANI says:

    పద్మగారికి అభినందనలు ..

  6. అమాయకత్వాన్ని కోల్పోవడం లోనె ఉంది అసలు విషాదం అంతా. కాని, అమాయకత్వం బాల్యం లో కొంత వరకే బాగుంటుంది. కొనసాగితే మనుగడ కష్టమే ప్రస్తుత కాలం లో (ఏ కాలం లోనైనా, ఆ మాటకొస్తే). అమాయకత్వాన్ని కోల్పోవడం అన్న పేరు పట్టడం లోనే కుప్పిలి పద్మగారి గడుసుదనమంతా ఉంది.
    చక్కటి విశ్లేషణ వేణుగోపాల్ గారూ! అభినందనలు.

  7. విశ్లేషణ బాగుంది .పుస్తకం వెంటనే చదవాలనిపించేలా
    అభినందనలండి

  8. ‘సినిమాలో, టెలి విజన్‌లో, పత్రికలలో ఇదే ప్రామాణిక జీవనస్రవంతి అన్నట్టుగా చూపు తుండడం వల్ల రెండు ప్రమాదకరమైన పరిణామాలు కూడ చాప కింది నీటిలా సమాజమంతా విస్తరిస్తున్నాయి. జిలుగువెలుగులతో ఆకర్షణీయంగా చూపడం వల్ల అదే అనుసరణీయమైన జీవన ప్రమాణం అనుకుని, అనుకరించడానికి ఎక్కువమంది ప్రయత్నిం చడం ఒక పరిణామం కాగా, ఆ జీవన ప్రమాణాన్ని అందుకోలేమని తెలిసి, అందువల్ల తమ జీవితమే వ్యర్థమనే న్యూనతా భావనకు మరింతమంది గురికావడం మరొక పరిణామం’– విశ్లేషణ ఆకట్టుకుంది. వేణుగోపాల్ గారికీ, పద్మ గారికీ అభినందనలు!

  9. రచయితలకు ప్రోత్సాహం అవసరమని అప్పుడు నేను రాస్తున్న ఒక వారం వారం శీర్షికలో ఆ కథ గురించి రాశాను.

    వేణుగోపాల్ రాసిన సుదీర్ఘ వ్యాసం వల్ల కుప్పిలి పద్మ కథల గొప్పతనం తెలుస్తోంది.
    విశేషమేమంటే కుప్పిలి పద్మ కథలు పరస్పరం కత్తులు దూసుకొనే తెలుగులోని అన్ని ప్రముఖ సాహిత్య ధోరణుల ప్రతినిదులనీ సమానంగా అలరించటం. అంతే లోతుగా అందర్నీఒకేలా స్పందింప చేయటం.
    ప్రముఖ పోస్ట్ మోదర్నిస్ట్ తిరుపతి రావు, దళిత విమర్శకులు సతీష్ చందర్, రామ్మోహన్ లు, సనాతన బ్రాహ్మణ వాదులు మరియు ప్రీమోడర్నిస్ట్ బి. చంద్ర శేఖర్ శర్మ, శంకర శర్మలు, మైనారిటీ సాహిత్య కారుడు ఖదీర్ బాబు, ఇక ఈ వరుసలో చివరిగా విప్లవ శిబిరం నుంచి రాసిన వేణుగోపాల్ అందరూ ఎంతో ప్రశంసించి ప్రోత్సహించిన కథలు అవి. ఇక స్త్రీ వాద విమర్శకుల గురించి వేరే చెప్పనవసరం లేదు. అన్ని శిబిరాల మధ్య ఇలా ఐక్యత సాధించిన అరుదయిన సంఘటన ఇది.
    -శశాంక

మీ మాటలు

*