హోమర్ ను చదువుకుంటూ అతడు-ఆమె

స్లీమన్ కథ-16

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

సోఫియా తల్లిదండ్రులు, తోబుట్టువులు, దగ్గరి బంధువులతో సహా కుటుంబం అంతా అక్కడే ఉంది. అందరూ ఒక టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. ఒకింత విషాదం తొంగి చూసే చిరునవ్వు, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, బట్టతల, వేస్టుకోటుకు వేల్లాడుతున్న బరువైన బంగారపు వాచీ చైనుతో ఉన్న ఈ విచిత్రమైన జర్మన్ వైపు అంతా కళ్ళప్పగించి చూశారు.

కాసేపటికి సోఫియా వచ్చింది. తెల్లని దుస్తులు ధరించింది. జుట్టు రిబ్బన్ తో ముడేసుకుంది. చాలా గంభీరంగా ఉంది. అందరిముందూ వైనూ, కేకులూ ఉంచారు. సోఫియా తలవంచుకుని కూర్చుంది. స్లీమన్ తన ప్రపంచయాత్రా విశేషాలను చక్కని గ్రీకులో చెప్పడం ప్రారంభించాడు. మధ్యలో ఉన్నట్టుండి సోఫియావైపు తిరిగి, “నీకు దూరప్రయాణాలు ఇష్టమేనా?” అని అడిగాడు. ఇష్టమేనని ఆమె చెప్పింది. “రోమన్ చక్రవర్తి హేడ్రియన్ ఎథెన్స్ ను ఎప్పుడు సందర్శించాడు?” అని అడిగాడు. సోఫియా తేదీతో సహా ఠకీమని చెప్పింది. “హోమర్ పంక్తులు కొన్ని అప్పజెప్పగలవా?” అని అడిగాడు. గడగడా అప్పజెప్పింది. పరీక్ష నెగ్గింది.

ఆ తర్వాతి మూడురోజులూ స్లీమన్ పగలంతా ఆ ఇంటి చుట్టూనే వేల్లాడి రాత్రి హోటల్ కు వెళ్ళేవాడు. అతని కళ్ళు తనను కనిపెట్టి చూస్తున్నాయని సోఫియాకు తెలుసు. అయినా తత్తరపడలేదు. తన చెల్లెళ్లతోనూ, బంధువుల అమ్మాయిలతోనూ ఆటపాటల్లో మునిగితేలింది. టేబుల్ సర్దడంలో సాయం చేసింది. మధ్య మధ్య, చమురు డబ్బాలు, వెన్న, ఆలివ్ లు ఉంచిన సెల్లార్ లోకి పరుగుతీసింది. ఇంటినిండా బంధువులు. స్లీమన్ ఓ చిన్న ఉత్తరం రాసి ఎలాగో ఆమెకు అందేలా చూశాడు.

ఇద్దరూ ఏకాంతంగా కలసుకున్నప్పుడు, “నన్ను పెళ్లి చేసుకోడానికి నువ్వు ఎందుకు ఇష్టపడ్డావ”ని హఠాత్తుగా అడిగాడు.

“మీరు ధనవంతులని మా అమ్మానాన్నా చెప్పారు కనుక” అని సోఫియా తటాలున సమాధానం చెప్పింది.

ఆ మాట స్లీమన్ ను నొప్పించింది. కోపంతో విసవిసా హోటల్ కు వెళ్లిపోయాడు. ఈ అమ్మాయిలో ఒక సహజమైన ఉదాత్తత ఏదో ఉందని అతను అంతవరకూ అనుకున్నాడు. కానీ తన ప్రశ్నకు ఒక బానిసలా సమాధానం చెప్పింది. హోటల్ కు వెళ్ళిన తర్వాత వెంటనే ఆమెకు ఉత్తరం రాశాడు:

మిస్ సోఫియా, నువ్విచ్చిన సమాధానం నన్ను తీవ్రంగా గాయపరిచింది. ఒక బానిస మాత్రమే అలాంటి సమాధానం ఇవ్వగలదు. అందులోనూ నీలాంటి ఒక చదువుకున్న అమ్మాయి అలాంటి జవాబు ఇవ్వడం మరింత దిగ్భ్రాంతి కలిగించింది. నేను చాలా సీదాసాదా మనిషిని. గౌరవమర్యాదలు కలిగిన ఓ ఇంటిపక్షిని. మనం పెళ్లి చేసుకోవడమే జరిగితే ఇద్దరం కలసి పురావస్తు తవ్వకాలు జరపచ్చనీ, హోమర్ మీద పరస్పరాభిమానాన్ని పంచుకోవచ్చనీ, ఏవేవో అనుకున్నాను.

నేను ఎల్లుండి నేపుల్స్ కు వెడుతున్నాను. బహుశా మనం మళ్ళీ కలసుకోలేకపోవచ్చు. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక స్నేహహస్తం కావాలనిపిస్తే నీపట్ల అంకితభావం కలిగిన నన్ను గుర్తుచేసుకో.

                                                                                                                  హైన్ రిచ్ స్లీమన్

                                                                                                               డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ,

                                                                                               స్థలం: సెయింట్  మిషెల్, 6, పారిస్ 

ఆ ఉత్తరాన్ని హోటల్ మెసెంజర్ ద్వారా సోఫియాకు పంపించాడు. అది చదివి ఆమె ఉక్కిరిబిక్కిరైంది. అతని కోపం పోయేలా ఒక ఉత్తరం రాయమని కుటుంబం అంతా ఆమెపై ఒత్తిడి తెచ్చింది. ఆమెకు సహకరించడానికి ప్రభుత్వాధికారిగా ఉన్న ఓ దగ్గరిబంధువును కూడా రప్పించారు. అప్పటికప్పుడు ఓ దుకాణం నుంచి కొని తెచ్చిన చవకబారు కాగితం మీద సోఫియా ఇలా రాసింది:

ప్రియమైన హెర్ హైన్ రిచ్:  మీరు వెళ్లిపోతానన్నందుకు విచారిస్తున్నాను. మధ్యాహ్నం నేనన్న మాటలకు కోపం తెచ్చుకోవద్దు. ఆడపిల్లలు అలాగే మాట్లాడాలేమో ననుకున్నాను. రేపు మళ్ళీ మీరు మా ఇంటికి వస్తే మా అమ్మానాన్నా, నేనూ ఎంతో సంతోషిస్తాం.

స్లీమన్ దాంతో తేలికపడ్డాడు. అయినాసరే, ఆమె తనను ఇష్టపడే పెళ్ళికి ఒప్పుకుందా లేదా అన్నది తేల్చుకోడానికి  ఉత్తరాల మీద ఉత్తరాలు రాశాడు. ఆమె ప్రతి ఉత్తరానికి జవాబిచ్చింది. అలా ఆరు రోజులపాటు సాగిన ఆ ఉత్తరాయణంలో చివరికి ఆమె తానుగా వివాహ ప్రతిపాదన చేసిన తర్వాతే అతను బెట్టు వీడాడు. పదిహేడేళ్ళ సోఫియాకు, నలభై ఏడేళ్ళ స్లీమన్ కు సెప్టెంబర్ 24న వివాహం జరిగింది,

స్లీమన్ ఫ్రాక్ కోటు వేసుకున్నాడు. సోఫియా తెల్లని దుస్తులు ధరించి, కొలొనస్ పువ్వులతో అలంకరించిన పెళ్లి కూతురి ముసుగు వేసుకుంది. ఆమె బంధువులందరూ గ్రీకు జాతీయ ఆహార్యంలో పెళ్ళికి హాజరయ్యారు. ఆ తర్వాత సాయంత్రం దాకా విందు జరిగింది. అదే రోజు రాత్రి వధూవరులు ఇద్దరూ ఎథెన్స్ రేవు ప్రాంతమైన పిరయాస్ కు వెళ్ళి, తెల్లవారుజామున మూడు గంటలకు నేపుల్స్ వెళ్ళే ఓడ ఎక్కారు. తన ఆటబొమ్మలు కూడా తెచ్చుకుంటానని సోఫియా పట్టుబట్టింది. స్లీమన్ వద్దని వాదించే స్థితిలో లేడు. అలా అతనిపై ఆమె తొలి విజయం సాధించింది. ఆ తర్వాత చివరివరకూ ఆమె విజయపరంపర కొనసాగింది.

అందంతోపాటు ఆమెలో పసితనం ఉంది. ఆమె నడకలో ఒక సహజమైన హుందాతనం ఉట్టిపడేది. ఆమె జీవితాంతమూ అది చెక్కుచెదరలేదు. అతనిమీద పెత్తనం చేస్తున్నట్టు కనిపించకుండానే పెత్తనం చేసేది. ఆమె అతన్ని తదేకంగా ప్రేమించింది. కానీ ఆ ప్రేమలో పెద్దవాళ్ళపట్ల పిల్లలకు ఉండే ఒక మంకుతనం ఉండేది. సన్నిహితమిత్రులతో కూడా అంటీ అంటనట్టు ఉండే స్లీమన్ సైతం ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె మనస్థితి వెంట వెంటనే మారిపోతూ ఉండేది. నవ్వుతూ నవ్వుతూనే అంతలో గంభీరంగా మారిపోయేది. అది కూడా పిల్లల్లో కనిపించే గాంభీర్యం. అదతనికి ఆహ్లాదం కలిగించేది. “ఆమెలో భర్తపట్ల ఒక అలౌకిక ఆరాధనాభావం ఉంది” అని అతను హానీమూన్ రోజుల్లోనే రాసుకున్నాడు.

నిజానికి, అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య తన జీవితంలోకి అనుకోకుండా అడుగుపెట్టిన ఆమెపై అతనికీ అలాంటి ఆరాధనాభావమే ఉంది. తన తుదిక్షణాలవరకూ ఆమెను అలాగే ఆరాధించాడు. అయితే, వారు కీచులాడుకున్న సందర్భాలు లేకపోలేదు. అతనిలో వెనకటి అసహనం, ఆవేశం తన్నుకొచ్చిన ఘట్టాలూ ఉన్నాయి. అతని అహానికీ, అతిశయానికీ, డాంబికానికీ ఆమెలోని ప్రశాంతతా, ఉల్లాసమూ అడ్డుకట్ట అయ్యేవి. ఆమె సాహచర్యం అతనికి మృదుత్వాన్నీ, మర్యాదనూ మప్పింది. మొత్తానికి ఆమె తన సహచరి కావడం అతనికి ఓ అంతుబట్టని అద్భుతంలా అనిపించేది. తన గొప్ప అదృష్టాన్ని చూసుకుని తనే దిగ్భ్రమ చెందేవాడిలా ఒక్కోసారి ఆమెనే చూస్తూ ఉండిపోయేవాడు.

అదో విచిత్రమైన హానీమూన్. నేపుల్స్…పాంపే…ఫ్లోరెన్స్…మ్యూనిక్…వెంట వెంటనే ఒకచోటినుంచి ఒక చోటికి నిరంతర ప్రయాణం. అందులో విధిగా మ్యూజియంల సందర్శన ఉంటుంది. వాటిలోని కళాకృతులపై స్లీమన్ పెద్ద గొంతుతో ప్రత్యక్షవ్యాఖ్యానం వినిపిస్తూ ఉండేవాడు. విని విని ఇక భరించలేక సోఫియా చెవులు మూసుకునేది. అయినా అతనలా చెప్పడం ఆమెకు ఇష్టంగానే ఉండేది. జనం ఆగిపోయి ఈ నలభయ్యేడేళ్ళ ప్రొఫెసర్ ను, అతని పడచు భార్యను వింతగా చూసేవారు. కళాకృతుల పరిశీలనలో ఇద్దరిలోనూ ఒకే గాంభీర్యం, ఏకాగ్రత. సాయంత్రం హోటల్ గదికి తిరిగి వెళ్ళాక హోమర్ నుంచి రెండువందల పంక్తులు వల్లించమని ఆమెను కోరేవాడు. ఆమె వల్లిస్తూ వల్లిస్తూనే అప్పుడప్పుడు నిద్రలోకి జారిపోయేది. ఆమె అతనిలోని అధ్యాపకుణ్ణి మేలుకొలిపింది.

ఆమెను తన అభిరుచులకు అనుగుణంగా మలచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె భాషావేత్త కావాలని పట్టుబట్టాడు. ఒక ఏడాదిలో జర్మన్, ఇంకో ఏడాదిలో ఫ్రెంచ్ నేర్చేసుకోవాలన్నాడు. అది నీకేమంత కష్టం కాదని బోధించాడు. ఆమెను పారిస్ లోని సువిశాలమైన తన అపార్ట్ మెంట్ కు తీసుకెళ్ళాడు. అది చలికాలం. బాగా మంచుపడుతోంది. ఆమెలో బంధువులకు దూరమయ్యానన్న దిగులు. భర్త రకరకాల ఫ్యాషన్ దుస్తులు తెచ్చి పడేసి వాటిని వేసుకొమంటున్నాడు. కొప్పు ధరించమన్నాడు. కొంతమంది గ్రీకు అమ్మాయిలు ఇంటికి వచ్చినప్పుడు, ఆమె కొప్పు విప్పేసి మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళకు తన ఆటబొమ్మలు చూపిస్తూ మురిసిపోయింది.

పారిస్ ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. మంచుతో వాతావరణం అంతా తడి తడిగా ఉంది. కత్తితో కోస్తున్నట్టు చలిగాలులు. అతని స్నేహాలు, ఆసక్తులు; తరచు జియోగ్రాఫికల్ సొసైటీ సందర్శనలు; ట్రాయ్ గురించీ, మైసీనియా గురించీ, గ్రీకు ద్వీపకల్పంలోని దీవుల గురించీ అతను అదేపనిగా మాట్లాడుతుండడం, అక్కడ భూమిలో కప్పడిన నిధినిక్షేపాల గురించిన అతని ఊహలూ-అన్నీ క్రమంగా ఆమెకు విసుగు తెప్పిస్తున్నాయి. స్లీమన్ బుర్రకు విశ్రాంతి అన్న ప్రశ్నే లేదు. అది గడియారంలా ఎప్పుడూ పనిచేస్తూ ఉండాల్సిందే. తనేమిటో నిరూపించుకోవాలన్న అంతులేని తపనతో ఒక కార్యక్షేత్రం కోసం ఇప్పటికీ అతను వెతుకుతూనే ఉన్నాడు.

స్లీమాన్ & సోఫియా

జనవరి చివరికల్లా మళ్ళీ అస్తిమితంలోకి జారిపోయాడు. ట్రాయ్ కి తిరిగివెళ్లే ఆలోచన ప్రారంభించాడు. అంతలో, కూతురు నడేజ్దా చనిపోయినట్టు పిడుగుపాటులాంటి వార్త! దుఃఖంతో కుప్పకూలిపోయాడు. మళ్ళీ ఏవేవో భూతాలు అతన్ని వెంటాడసాగాయి. కూతురి మరణానికి తనే కారణమనుకుంటూ తనను నిందించుకున్నాడు. ఆమెను దక్కించుకోడానికి తను ఏమైనా చేసి ఉండేవాడు. పెద్ద పెద్ద డాక్టర్లను ఇంటికే రప్పించి వైద్యం చేయించి ఉండేవాడు. అమ్మాయి అస్వస్థ గురించి ముందే తనకు చెప్పి ఉంటే ఎంత బాగుండేదనుకున్నాడు. మిగతా పిల్లల్ని ఓదార్చడానికి అప్పటికప్పుడు సెయింట్ పీటర్స్ బర్గ్ కు బయలుదేరాలనుకున్నాడు కానీ, ఇక్కడ సోఫియా జబ్బుపడింది.

మనిషి పాలిపోయి, నిస్తేజంగా అయిపోయింది. డాక్టర్లకు మాత్రం ఆమెలో ఎలాంటి లోపం కనిపించలేదు. ఫ్రెంచీ, జర్మనూ ఒకేసారి నేర్చుకోవాలని అతను ఒత్తిడి తేవడంతో ఆమె ఎక్కువ కష్టపడుతోంది. ఆమెలో ఇంత మందకొడితనం ఏమిటని అతను అనుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఆమెను సర్కస్ కు తీసుకెళ్లేవాడు, దానిని బాగా ఆనందించింది. కానీ ఎక్కువగా థియేటర్ కు తీసుకెళ్ళేవాడు. వజ్రపు నగలు వేసుకుని, బాక్స్ లో బాసింపట్టు వేసుకుని కూర్చుని, తనకు ఏమాత్రం అర్థం కాని ఉపన్యాసాలు వింటూ విసుగుతో కన్నీళ్ళ పర్యంతం అయ్యేది. చివరికి డాక్టర్లు ఇంటిబెంగ అని తేల్చారు.

ఫిబ్రవరి మధ్యకల్లా ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఉన్నట్టుండి ఏడవడం మొదలెట్టేది. ఆమెను ఎథెన్స్ లో దింపి తను ట్రాయ్ కి వెళ్లాలని స్లీమన్ నిర్ణయించుకున్నాడు. తవ్వకాలకు అనుమతిస్తూ టర్కిష్ ప్రభుత్వం నుంచి ఫర్మానా తెప్పిస్తానని కల్వర్ట్ వాగ్దానం చేశాడు. కానీ ఇంతవరకూ అది రాలేదు.  భార్యతో కలసి నీమన్ అనే స్టీమర్ మీద మార్సే నుంచి పిరయాస్ వెడుతూ, 1870 ఫిబ్రవరి 17న కల్వర్ట్ కు ఇలా ఉత్తరం రాశాడు. అందులో ఎప్పటిలా అతని అసహనం తొంగిచూసింది:

మీకు ఫర్మానా వచ్చిందీ లేనిదీ దయచేసి వెంటనే నాకు తెలియజేయండి. వచ్చి ఉంటే తక్షణమే హిస్సాలిక్ దగ్గర తవ్వకాలు ప్రారంభిస్తాను. పూర్తి అనుకూల వాతావరణం రాకుండా ఇంత ముందే పని ప్రారంభించడం అడ్డంకి అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే, ఇక్కడి వాతావరణం అనుకూలంగా, ఆహ్లాదకరంగా ఉంది. ట్రయాడ్(ట్రాయ్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు)లో ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. అదీగాక, ఆ తర్వాత నాకు వేరే అత్యవసరమైన పనులు కూడా ఉన్నాయి కనుక వెంటనే తవ్వకాలు ప్రారంభించాలనుకుంటున్నాను.

కనుక, మీకు ఫర్మానా వచ్చి ఉంటే దయచేసి అవసరమైన పరికరాలు, సాధనాల జాబితా మరోసారి రాసి పంపగలరు. పారిస్ నుంచి బయలుదేరే హడావుడిలో మీరు కిందటి సారి రాసిన లేఖలోని జాబితాను కాపీ చేసుకోవడం మరచిపోయాను…

స్లీమన్ ఎథెన్స్ కు చేరుకున్నాడు. అప్పటికీ ఫర్మానా రాలేదు. దాంతో మైసీనియాలో కొన్ని తవ్వకాలు జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు. అయితే, అప్పటికి కొన్ని మాసాల క్రితమే ఏడుగురు ఆంగ్లేయుల బృందాన్ని బందిపోట్లు హత్య చేయడంతో మారుమూల ప్రాంతాలలో ఒంటరిగా తిరిగే పురావస్తుపరిశోధకుల మీద గ్రీకు ప్రభుత్వం మండిపడుతోంది. దాంతో నిస్పృహ చెందిన స్లీమన్ ఫర్మానా వచ్చేవరకూ ఎజియన్ సముద్రపు దీవుల మధ్య పడవలో తిరుగుతూ కాలక్షేపం చేయాలనుకున్నాడు.

అదొక దుస్సాహసంగా పరిణమించింది. అతనికి పడవ ప్రయాణంలో అనుభవంలేదు. దానికితోడు, తను కుదుర్చుకున్న గ్రీకు పడవవాడి అనుభవం కూడా అంతంతమాత్రమే అనిపించింది. అపోలో(గ్రీకు దేవుడు) జన్మస్థలమైన డీలోస్ ను, పాలరాతి గుట్టలకు ప్రసిద్ధమైన పారొస్ ను, బాకస్ (రోమన్ దేవుడు)కు పవిత్రస్థలమైన నెక్సాస్ ను సందర్శించాడు. ఆ తర్వాత అతని పడవ తుపానులో చిక్కుకుంది. నాలుగురోజులపాటు రొట్టెతోనూ, మంచినీళ్ళతోనూ గడిపాడు. అక్కడినుంచి చిన్న దీవి అయిన తేరా(సెంటోరీనో)కు వెళ్లాడు. అది అన్నింటికన్నా ఎక్కువగా అతన్ని ఆకట్టుకుంది. ఎజియన్ సముద్రంలో విసిరేసినట్టు ఉన్న చిన్న చిన్న దీవుల్లో దాదాపు దక్షిణం కొసన ఉన్న ఈ దీవికి ఒక చరిత్ర ఉంది. క్రీ.పూ. 631 లో, ఆఫ్రికాలోని సంపన్న ప్రాంతమైన సైరీన్ ను తమ వలసగా మార్చుకోవడానికి గ్రీకులు ఈ దీవినుంచే బయలుదేరి వెళ్లారు. అది అగ్నిపర్వత ప్రాంతం కూడా. లావా పొరలతో; ఎరుపు, నలుపు, పసుపు, గోధుమ వంటి వివిధ రంగుల్లో ఏర్పడిన విచిత్ర శిఖరాలను చూసి స్లీమన్ ఆనందించాడు. ఈ శిఖరాలు ఏడువందల అడుగుల ఎత్తువరకూ ఉన్నాయనీ, “సంభ్రమం గొలిపే ఒక అద్భుతదృశ్యా”న్ని అవి ఆవిష్కరించాయనీ రాశాడు. ఆ దీవిలోని జనం కూడా అతనికి నచ్చారు. మూడు లావా పొరల కింద ఆమధ్యనే దొరికిన కొన్ని రాతి యుగపు కలశాలను వారి దగ్గర కొన్నాడు. అలా ఒక్కొక్క దీవినే చుట్టేసి తిరిగి ఎథెన్స్ కు వచ్చాడు.

ఇంతకుముందు గాలివాన, తుపానులాంటి ఒక పెద్ద విపత్తునుంచి బయటపడిన ప్రతిసారీ అతన్ని అదృష్టం వరిస్తూవచ్చింది. డచ్చి తీరానికి దగ్గరలో టెక్సెల్ దీవి దగ్గర అతను ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోయినప్పుడు అదే జరిగింది. అట్లాంటిక్ మధ్యలో సంభవించిన పెను తుపాను నుంచి బయటపడిన కొన్ని రోజులకే కాలిఫోర్నియా బంగారం వేటలో పెద్ద ముల్లెను మూటగట్టాడు. ఇప్పుడు కూడా తనను తేరా దీవిలోకి నెట్టుకుంటూ వెళ్ళిన నాలుగురోజుల తుపాను, ట్రాయ్ లో తనకోసం ఎదురుచూస్తున్న మరో గొప్ప అదృష్టాన్ని సంకేతిస్తూ ఉండచ్చని అతను భావించి ఉంటాడు.

అప్పటికీ కాన్ స్టాంట్ నోపిల్ నుంచి రావలసిన ఫర్మానా రాలేదు. అయినాసరే, తెగించాడు. తను ట్రయాడ్ కు వెళ్ళి తీరాలనీ, పనివాళ్ళను నియమించుకోవాలనీ, స్వయంగా చేతి గొడ్డలిని అందుకోవాలనీ, తనను ఏ శక్తీ ఆపలేదనీ నిర్ణయానికి వచ్చాడు. సోఫియాను ఎథెన్స్ లో ఉంచేసి, ఒంటరిగా, ఎవరి సాయమూ లేకుండా ట్రాయ్ మీద తుపానులా విరుచుకుపడడానికి బయలుదేరాడు.

(సశేషం)

 

 

 

 

మీ మాటలు

*