యాదిలో ఎప్పటికీ మిగిలే దృశ్యాలు!

– కందుకూరి రమేష్ బాబు 
~
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 న బుధవారం సాయంత్రం 5.30 గం.లకు హైదరాబాద్ లోని ఐ.సి.సి.ఆర్ ఆర్ట్ గ్యాలరీ, రవీంద్రభారతిలో సుప్రసిద్ధ చిత్రకారులు శ్రీ కాపు రాజయ్య కుమారులు, దివంగత కాపు వెంకట రఘు ఛాయా చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది.
ప్రదర్శన ప్రారంభకులు ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు శ్రీ కె.వి. రమణాచారి. ముఖ్య అతిథిగా ప్రముఖ కవి  నందిని సిద్దారెడ్డి, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ శ్రీ ఎం.వేదకుమార్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు ఎం.వి.రమణారెడ్డిలు హాజరయ్యారు.
కాపు వెంకట రఘు సిద్దిపేటలో జన్మించి హైదరాబాద్ లోని జె.ఎన్.టి.యులో ఆర్కిటెక్చర్ ని అలాగే ఫొటోగ్రఫిని అభ్యసించారు. తెలంగాణకు, తెలుగు వాళ్లకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా అనేక స్థలాలను సందర్శించి వందలాది చిత్రాలను భావితరాల కోసం భద్రపర్చారు. వివిధ రాష్ట్రాల్లో ఎంతో ఘనతను సొంతం చేసుకున్న కట్టడాలు, నిర్మాణాలు, వారసత్వ సంపదను, అందమైన ప్రకృతి దృశ్యాలను ఆయన ఎంతో సహజంగా, సుందరంగా చిత్రించారు. “ఆర్కిటెక్ట్ గా ఆయన కృషి విశిష్టమైనది. అయితే, వెలుగు నీడల మాధ్యమమైన ఫొటోగ్రఫిలో ఆయన చేసిన అద్వితీయ కృషికి దృశ్యమానం ఈ ఛాయాచిత్ర ప్రదర్శన’ అని కాపు వెంకట రఘు సతీమణి రాధ అన్నారు. సుమారు నలభై చిత్రాలతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఫొటోగ్రాఫర్ గా కాపు వెంకట రఘుని పరిచయం చేసే తొలి ప్రదర్శన కావడం గమనార్హం.
2
కాపు రఘు 2010లో రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడంతో ఆయన కృషి ఒక రకంగా తెరమరుగైంది. జన సామాన్యానికి చవకగా ఇండ్ల నిర్మాణం, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు ముఖ్యంగా వారసత్వ సంపదను చిత్రించిన విధానం గురించి అసలే చర్చకు రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాపు రఘును స్మరించుకోవడం, అదీ ఆయన 52 వ జయంతి సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం పట్ల బంధుమిత్రులు హర్షం ప్రకటించారు.
కాపు వెంకట రఘు యాదిలో జరిగే ఈ ఛాయాచిత్ర ప్రదర్శన వేళలు ఉదయం 11 నుంచి సాయంత్రం 7 వరకు. ప్రదర్శన 18 వ తేది సాయంత్రం ప్రారంభమై ఆదివారం 22వ తేదీన ముగుస్తుంది.
Invitatiomn

మీ మాటలు

*