ముగింపు లేని వ్యధ-రైతు కథ

 

-వై. కరుణాకర్

~

ఇటీవల ఓ రెండు కథలొచ్చాయి. ఒకటి పింగళీ చైతన్య రాసిన ’గౌరవం’, రెండు చందుతులసి రాసిన ’ఊరవతల ఊడలమర్రి’.  రాసిన వాళ్ళిద్దరూ కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళు. ఒకరికైతే ఇదే తొలి కథ. రెండింటికీ రైతు ఆత్మహత్యలే నేపధ్యం. ఈ నేపధ్యంలో ఎన్నో కథలొచ్చినా ఈ రెండు కధలు తీసుకున్న ముగింపు వల్ల  ప్రత్యేకత సంతరించుకున్నాయి. చైతన్య ’గౌరవం’ కథలో ఆత్మహత్య చేసుకున్న రైతుభార్య పార్వతమ్మ వ్యవసాయాన్ని వదిలి, పొలం అమ్మి, రాగల అగౌరవ భయాన్ని అధిగమించి .. బ్రతకటానికి మద్యం లైసెన్సు కోసం టెండర్ వేసి దక్కించుకుంటుంది. చందుతులసి ’ఊరవతల ఊడలమర్రి’ కథలో రైతు ’నారయ్య’ అప్పులవాళ్ళ ముందు అవమానం పొంది ఆత్మహత్య తలపును జయించడానికి ఎంతో మంది ఉరిపోసుకున్న ఊడలమర్రిని నరికేస్తాడు. రెండు కథలలో ప్రధాన పాత్రలు వ్యవసాయాన్ని వదిలి వేస్తాయి. అందులో బ్రతకలేక చావడం కంటే ఏ పని చేసికొనయినా బ్రతకడం ముఖ్యమనీ, అది అగౌరవం కాదనీ చెప్తారు. నిజానికి ఈ ముగింపుల గురించి మాట్లాడుకునే ముందు వాటి ప్రారంభం దగ్గరకు వెళ్ళాలి.

ఇప్పటి రైతు ఉసురు తీస్తున్న సంక్షోభ మూలాలు వలస పాలనలోనే ఉన్నాయి. సహజ వినియోగం నుండి మార్కెట్ అవసరాలకోసం భూమిని వినియోగించడం కొంత తెల్లవాడి బలవంతగానే మొదలైనా ఆ తరువాత దేశీయ పాలకుల హరిత విప్లవ నినాదం కలిగించిన మైమరపులో రైతాంగం ఆమోదంతోనే ఈ బదలాయింపు పూర్తయింది. ఫలితంగా ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తి పెరిగింది. దానికంటే పురుగుమందులు, ఎరువులు, యంత్ర పరికరాల వినిమయం పెరిగింది. ఇవి ఎంతగా పెరిగాయో అంతగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ఎనభైలలో వందలాదిగా సాగిన పత్తిరైతుల ఆత్మహత్యలతో ఈ వైరుధ్యం బట్టబయలైంది.

chaitanya

చైతన్య పింగళి

ఈ పరిణామాల సాహిత్య ప్రతిఫలనాలను అటు ఉత్తరాంధ్రలో కారా ‘యజ్ఞం’ కథలో  సీతారాముడు కన్నబిడ్డను చంపుకోవడంగానూ, ఇటు రాయలసీమలో సింగమనేని నారాయణ ‘అడుసు’ కథలో రైతు నారాయణప్ప  రెక్కలుముక్కలు చేసి పెంచిన తోటను నరికివేయడంతోనూ ముగిసాయి. యజ్ఞం కథ ముగింపు ఆప్పుడే మొదలవుతున్న ప్రతిఘటన పోరాటాలకు సూచనప్రాయం చేస్తే, అడుసు కథ రాయలసీమలో ప్రతిఘటన రాజకీయాలు లోపించడం వల్ల వట్టి నైరాశ్యాన్ని ధ్వనించింది. ఈ రెంటికీ మధ్య కాస్త ఎడంగా ఉత్తర తెలంగాణాలో ఉవ్వెత్తున లేచిన రైతుకూలీ పోరాటాల స్ఫూర్తి అటు కార్మికుల్నే కాదు ఇటు రైతాంగాన్ని కూడా కొంతవరకు సంఘటితం చేయగలిగింది. రఘోత్తమరెడ్డి ’పగలు రేయి శ్రమ పడుతున్నా..’ కథలో రైతుకూలీ మల్లేశం రైతు రాంరెడ్డికి ‘మీ కాపుదనపోళ్ళంతా తగిన ధరల్రావాల్నాని బయటకి రాండ్రి. … ఒక్కనెల రోజులు దినుసు మార్కెటుకు కొట్టకుంట ఆపుండ్రి. – మీతోని మేం రాకపోతే అప్పుడనుండ్రి.  సర్కారోన్తోని కొట్లాడితే మీరు మీరు మేం కలిసే కొట్లాడదాం’ అంటూ ధైర్యమిస్తాడు. ’ఒక్కటైతే’ కథలో హమాలీల పొరాటం రామిరెడ్డిలాంటి రైతుకు ఒక్కటవ్వాలన్న ఆలోచన కలిస్తుంది. ఈ ఆలోచనల వల్లనే టంగుటూరులో, కాల్దారిలో రైతులు తూటాలకెదురు నడిచారు. ఉద్యమాలు ఉధృతంగా నడచిన కాలంలో ఆయా  ఉద్యమ ప్రభావిత ప్రాంతాలనుండి రైతుల ఆత్మహత్యల వార్తలు అరుదుగానే వినిపించాయి.

సమాజంలోని అన్నివర్గాలకు ప్రేరణ నిచ్చిన మౌలిక పోరాటాలు ఒకవైపు నెమ్మదించగా మరోవైపు తొంభైలనాటికి ప్రంపంచ మార్కెట్లకు తలుపులు బార్లా తెరవడంతో ఉధృతమైన వ్యవసాయిక  సంక్షోభం నేడు పరంపరగా సాగుతున్న రైతు బలిదానాలతో పరాకాష్టకు చేరింది. రైతుకు భూమితో అనుబంధాన్ని ముగింపుకు తెచ్చింది. ఎనభైలలో, తొంభైలలోనే వ్యవసాయాన్ని వీడి వ్యాపారాలలోకి అటునుంచి రాజకీయాలలోకి వెళ్ళిన వాళ్ళు ఆర్ధిక సంస్కరణల తొలి ప్రయోజనాన్ని పొందగలిగారు. ‘గౌరవం’ కధలో పార్వతమ్మతో పాటు టెండరు వేయడానికి వచ్చిన తెల్లబట్టలవాళ్ళలో వీళ్ళని పోల్చుకోవచ్చు. మరి కొంతమంది పెద్ద పెట్టుబడులతో తిరిగి వ్యవసాయంలోకి ప్రవేశించారు. ట్రాక్టర్లు, పెద్దపెద్ద యంత్రాలు, నెలల తరబడి కోల్డ్ స్టోరేజీలలో పంటని నిలవ ఉంచుకోగల పెట్టుబడి సామర్ధ్యంతో గట్టు మీద నుండి దిగనవసరంలేని కొత్త తరం రైతులు తయారయ్యారు. వీళ్ళు ఒకవైపు ఆశపెట్టగా మరోవైపు పెరిగిన ఖర్చులు, పిల్లల చదువులూ, మారిన అవసరాలూ పెద్దసంఖ్యలో రైతులు ఆ భూమిలోనే పెనుగులాడేట్టు చేశాయి. ‘ఊరవతల ఊడల మర్రి’  కథలో నారాయణలాంటి ఎకరం రెండెకరాల రైతులు మరింత భూమిని కౌలు చేసేలా చేసాయి. బీటీ పత్తి తప్ప మరో పంట వైపు కన్నెత్తి చూడకుండా చేసాయి. ఫలితంగా భూమికి డిమాండ్ పెరిగింది. కౌళ్ళు పెరిగాయి. విత్తనంలోనే చేరిన విదేశీ పెట్టుబడి, ఆపైన పురుగుమందులూ, ఎరువులూ ఆపైన మార్కెట్ ధరల జూదంలో రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తీర్చలేని అప్పులతో నష్టదాయకమైన వ్యవసాయాన్ని వదిలేయాల్సిన ఆర్ధిక అవసరాలకూ, దానిని వదిలి మరో వృత్తిలోకి వెళ్ళలేని సామాజిక అవరోధాలకూ మధ్య రైతు ఉరితాడుకు వేళ్ళాడుతున్నాడు.

IMG_20150628_105027_1447180109835

చందు తులసి

ఇది సాహిత్యంలోకి ఎట్లా ప్రతిఫలిస్తోంది? బుధ్ధిజీవులైన రచయితలు ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు? ఈ ఆత్మహత్యల పరంపరకు ఏ ముగింపు పలుకుతున్నారు? చైతన్య, చందుతులసిల కథలు జవాబు చెప్ప ప్రయత్నించాయి. రెండు కథలూ ఆరుగాలం కష్టపడే రైతు ఆత్మహత్యల నేపధ్యాన్ని మనసుకు హత్తుకునేలా చిత్రించాయి. ఒక పరిష్కారాన్నీ చెప్ప ప్రయత్నించాయి. జీవితం విలువైనది కనుక ఆత్మహత్యం పరిష్కారం కాదు. ఇక మిగిలింది వ్యవసాయాన్ని వదిలివేయడమే. రెండు కథలూ దాన్నే సూచించాయి. రైతు భూమిని వదిలి ఏ పని చేసినా తప్పుపట్టే నైతికార్హత  సమాజానికి లేదని  ‘గౌరవం’ కథ కాస్త ఆగ్రహంగా చెబితే, ‘ఊరవతల ఊడల మర్రి’ కథ ఇదే విషయాన్ని రైతుకు సానునయంగా నచ్చజెప్పింది. ఆ విధంగా అవి అనవసర ప్రాణనష్టాన్ని నివారించ ప్రయత్నించాయి. అందుకే ఇవి మంచి కథలయ్యాయి.

అదే సమయంలో భూమినుండి రైతును బయటికి తరమివేసే రాజకీయార్ధిక క్రమానికి లోబడే ఈ రెండు కథలూ వాటి  ముగింపులూ ఉన్నాయి. కాకపోతే ఆ క్రమం వీలైనంత సులువుగా సాగేందుకు వీలుగా – అయిష్టంగానే, వేరే దారిలేకే – రైతునూ, సమాజాన్ని  సిధ్ధం చేశాయి. దీనికి ఆయా రచయితలను కూడా తప్పు పట్టలేం. మొత్తం సమాజం యొక్క చైతన్య స్థాయిని, సామూహిక కార్యాచరణనూ పెంచే .. స్థిరమైన, బలమైన పోరాట కేంద్రాలు లేని సామాజిక వాస్తవికత -పరిష్కారాలు సూచించడలో వాళ్ళ సృజనకు పరిమితులు విధించి వుండొచ్చు.

అయితే సమాజం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. రైతులే కాదు కష్టజీవులందరూ వారివారి వనరులనుండి దూరంచేసే ప్రయత్నాలను తప్పక ప్రతిఘటిస్తారు. ఆలోచనపరులుగా రచయితల బాధ్యతేమంటే – ఆ ప్రతిఘటన ఎంత సూక్ష్మరూపంలో ఉన్నా, ఎంత బలహీనంగా ఉన్నాగుర్తించడం. తమ తమ సృజనతో దానిని బలపరచి స్పష్టమైన రూపమిచ్చి తిరిగి ఆయా వర్గాలకు ఆయుధంగా అందించడం.  చైతన్య, చందు తులసి కథల వెనుక వారి సంవేదన, నిజాయితీలను చూస్తే భవిష్యత్తులో ఆ బాధ్యత నెరవేరుస్తారనే ఆశ కలుగుతున్నది.

మీ మాటలు

 1. కె.కె. రామయ్య says:

  ” చైతన్య, చందుతులసి ల కథల వెనుక వారి సంవేదన, నిజాయితీలను చూస్తే భవిష్యత్తులో ఆ బాధ్యత (కష్టజీవుల ప్రతిఘటనకు, మౌలిక పోరాటాలకు, భూమినుండి రైతును బయటికి తరమివేసే రాజకీయార్ధిక క్రమానికి ప్రతిఘటనకు బాసటగా నిలిచే బాధ్యతను ) నెరవేరుస్తారనే ఆశ కలుగుతున్నది “. చాలా చక్కగా విశ్లేషించారు కరుణాకర్ గారు. ధన్యవాదాలు.

  “మొత్తం సమాజం యొక్క చైతన్య స్థాయిని, సామూహిక కార్యాచరణనూ పెంచే .. స్థిరమైన, బలమైన పోరాట కేంద్రాలు లేని సామాజిక వాస్తవికత -పరిష్కారాలు సూచించడలో వాళ్ళ సృజనకు పరిమితులు విధించి వుండొచ్చు “. వీక్షణం ఎన్. వేణుగోపాల్ గారు నుండి సీనియర్ రచయితలు గొరుసన్నల వరకూ, వర్ధమాన రచయితలు ఈ పరిమితులు అధిగమించటానికి సూచనలివ్వ వలసినదిగా, Exchange of Ideas కి తగిన ఫోరమ్స్ క్రియేట్ చెయ్యవలసినిడిగా అభ్యర్ధిస్తున్నాను.

  ప్రింటు మీడియాకన్నా ఎన్నోరెట్లు మెరుగ్గా, స్వేచ్చాయుత మేధోమదనానికి అవకాసం కల్పిస్తున్న సారంగ లాంటి అంతర్జాల పత్రికల పాత్రనూ ప్రశమ్సించాలీ సందర్భంలో.

  నిరుపేదలు, నిరక్షరాస్యులు, రైతుకూలీలు, చిన్న సన్నకారు రైతులు, గ్రామీణ ప్రజల జీవనోపాధికి అత్యవసరమైన వ్యవసాయ రంగం సాధక బాధకాలు, బాగోగుల గురించీ చర్చించవచ్చు.

  • చందు-తులసి says:

   అవును రామయ్య గారూ. నా లాంటి వాడికి ఒక దారి తెన్నూ చూపించాల్సిన బాధ్యత పెద్దల మీద ఉంది. వారి సూచనలు స్వీకరించడానికి సిద్ధంగానే ఉంటాను.

 2. ” మొత్తం సమాజం యొక్క చైతన్య స్థాయిని, సామూహిక కార్యాచరణనూ పెంచే .. స్థిరమైన, బలమైన పోరాట కేంద్రాలు లేని సామాజిక వాస్తవికత -పరిష్కారాలు సూచించడలో వాళ్ళ సృజనకు పరిమితులు విధించి వుండొచ్చు.”
  నిజంగానే ప్రస్తుతానికి ఇంతకంటే ఆశించే స్థితి లేదేమో, ఎప్పటికప్పుడు రగులుతున్న నిప్పు మీద నీళ్లు చల్లడమో, ఎగిసిపడుతున్న పిడికిళ్లను అణచి వేయడమో జరుగుతున్న ధారుణమైన వ్యవస్థలో అనివార్యమో, వ్యూహమో కాని ఒక స్తబ్ధత నెలకొని ఉంది. సర్దుకు పోవదం ఆహ్వానించక తప్పదీమో!

  • చందు-తులసి says:

   నర్శిం సార్. మీలాంటి ముందు నడవండి….స్తబ్థతను తప్పకుండా ఛేదిద్దాం.

 3. చందు-తులసి says:

  ముందుగా…కరుణాకర్ గారికి…సారంగ సంపాదక బృందానికి ధన్యవాదాలు.

  వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యం వల్లనేమో….రైతు ఆత్మహత్య వార్తలు ఇప్పుడు దినపత్రికల లోపలి పేజీలకు వెళ్లిపోయాయి కానీ రెండు నెల్ల కిందట ఏ రోజు పేపర్ చూసినా రైతు ఆత్మహత్య వార్తలే. దేశానికి వెన్నెముక, అన్నదాత లాంటి ఉపమానాలతో గొప్పలు చెప్పుకునే మనం రైతు ఆత్మహత్యలపై స్పందిస్తోంది చాలా తక్కువ. అదే ఇతర దేశాల్లో అయితే ఏ జాతీయ సంక్షోభం గానో గుర్తించాల్సిన పరిస్థితి. కానీ మన దగ్గర
  రాజకీయం పాలై…అటు ప్రతిపక్షాలకు, అధికార పక్షానికి ఓట్లు రాల్చుకునే అంశంగా మారింది . రైతుకు ఇప్పటికీ ప్రయోజనం దక్కుతోంది చాలా తక్కువ. ఒక్క రాజకీయ నాయకులే కాదు సృజన కారులూ ఎక్కువగా స్పందించలేకపోవడం నాకు మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

  ( ఇక్కడో పిడకల వేట ఏమంటే మన రాష్ట్రంలోని రైతు ఆత్మహత్యల అంశం…తమిళనాడులో సూపర్ హిట్ సినిమాకు కథగా పనికి వచ్చింది. మన దగ్గర మాత్రం పట్టించుకోలేదు కానీ ఆ తమిళ సినిమా రీమేక్ కోసం పోటీ పడ్డారు. మన దగ్గర మన కళ్లముందు జరుగుతున్న అంశాలపై మహా మహా సృజనకారులు స్పందించలేకపోవడం విచిత్రమే కాదు, విషాదం కూడా.)
  అలా రైతు ఆత్మహత్యలపై కథ రాయడానికి సిద్ధమయ్యాను. కానీ రొటీన్ రైతు కథ లాగా…ఆత్మహత్య చేసుకోవడం కన్నా, ఆత్మహత్య వెనుక ఉండే ఒత్తిడిని, మానసిక సంఘర్షణను చర్చించాలనుకున్నాను. అసలు ఏ రైతైనా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు…. ఎటువంటి మానసిక స్థితిని అనుభవిస్తాడో ఊహించుకున్నాను. అటువంటి సమయంలోనే….నా సహచరి తులసి ( జర్నలిస్టు ) ఓ రోజు ఆసక్తికరమైన రిపోర్టింగ్ చేసింది. మెదక్ జిల్లా దగ్గర ఓ రైతు….బస్టాండ్ దగ్గర పాప్ కార్న్ అమ్మడం. తనకున్న పదెకరాల వ్యవసాయం కన్నా ఇదే లాభసాటిగా ఉందని చెప్పడం. ఆ స్టోరీ చూశాక నాలో ఈ కథకు సంబంధించి పూర్తి అవగాహన వచ్చి వెంటనే కథ రాశాను. ఇదీ నా కథ వెనుక కథ.
  ఐతే నేను కథ రాయాలనుకున్నపుడే ఓరోజు ఆదివారం చైతన్యగారి గౌరవం కథ వచ్చింది. ఆ కథ ప్రభావం పడకుండా కథ రాయాలని ప్రయత్నించాను.
  కథల విషయంలో ఆంధ్యజ్యోతి ఆదివారం మీద నాక్కొంచెం గౌరవం ఎక్కువ. అందుకే నా మొదటి కథను జ్యోతికి పంపాను. నన్ను ప్రోత్సహించిన వసంత లక్ష్మి మేడమ్ గారికి, సూచనలు ఇచ్చిన గొరుసు గారికి , ఆంధ్యజ్యోతి సంపాదకులకు నా కృతజ్ఞతలు.

  ఇక కరుణాకర్ గారు చెప్పిన…రైతును భూమిని తరిమే కార్యక్రమంలో భాగంగానే ఈ కథలూ ఉన్నాయనే విమర్శకు నా వైపు సమాధానం ఏమంటే నేను కథలో చర్చించింది మానసిక సంఘర్షణ. అందుకే రైతు ఆత్మహత్య చేసుకోవడం అనే ఆలోచనను ఆధిగమించడం నాకు ప్రధాన లక్ష్యమయ్యింది. రైతు ఆ చెట్టును నరకడాన్ని సింబాలిక్ గా చూపి ముగించాను. కానీ చివరలో ఓ వాక్యంలో … భార్య పూలమ్మకు రైతు పొడిచే పొద్దులా కనపడుతున్నాడు…అంటూ ముగించాను. నా ఉద్దేశం దగ్గరదగ్గరగా అదే.

  అలాగే ప్రతిఘటన ఎంత సూక్ష్మరూపంలో ఉన్నా, ఎంత బలహీనంగా ఉన్నాగుర్తించాలని కరుణాకర్ గారు సూచించారు. తప్పకుండా సార్.
  మీ సూచనలు దృష్టిలో పెట్టుకుంటాను. నా కథను గుర్తించి , నాకు విలువైన సూచనలు ఇచ్చిన మీకు మరోసారి ధన్యవాదాలు.

 4. చందూ ,,, రామయ్య గారినే తట్టుకోలేకపోతున్నాను . ఇప్పుడు నువ్వు కూడా నన్ను బయటకి లాగుతున్నావు – నన్ను ఆల్చిప్పలో పురుగు మాదిరి గమ్మున ఉండనియ్యండి సామీ,
  రామయ్య గోరుచుట్టు అనుకుంటే నువ్వు రోకలిపోటు వయ్యావు గద దేవుడో !

  • చందు తులసి says:

   గొరుసు గారూ…
   మొత్తానికి ఆల్చిప్ప లోంచి ఒక ముత్యం రాల్చారు. అట్నే ఒక కత రాయండి సార్…

 5. కె.కె. రామయ్య says:

  గొరుసు జగదీశ్పర రెడ్డి గారికి కాదు … పాలమూరు వలసపక్షులకి మాటిచ్చిన మా గొరుసన్నకి, వినమ్రపూర్వకంగా చేసుకునే విన్నపం. ఒకసారి కలం పట్టి పోరులోకి దిగాక మళ్లీ మడమ తిప్పటానికి వీలుండదు. గాడీవమ్ జమ్మిచెట్టు మీదుంది కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అనటానికీ వీలులేదు. నువ్వుచూసిన, చూసి మనసిచ్చుకున్ననీ ముందుతరం కలం యోద్దానుయోధ్ధులకు ఆ సౌక్రిమ్ లభించలేదు. వాళ్లబాటలో నడిచిన నీకూ ఆ వీలులేదు.

  • చందు తులసి says:

   అవును రామయ్య గారూ…మేధావి మౌనం దేశానికి ప్రమాదం అన్నట్లు… కళాకారుల మౌనం సమాజానికి చాలా నష్టం చేస్తుంది.

 6. Rishi Srinivas says:

  రెండు కధలు చదివాను. ముఖ్యంగా చైతన్య గారు వ్రాసిన కధ చాలా బాగుంది. పురుగుల మందులు వాడటం వాళ్ళ రైతులు ఎదుర్కునే ఆరోగ్య సమస్యలను కూడా ప్రస్తావించడం రచయిత్రి సునిశిత దృష్టికి నిదర్శనం.

  • కనిగిరి కోదండ రామయ్య says:

   రాజుగారి రెండో భార్య చాలా మంచిది అంటే మొదటి భార్య దిక్కుమాలిందనే కదా అర్థం – ఆయ్ !

 7. వ్యాసం, చర్చోపచర్చలు ఆసక్తిగా ఉపయుక్తంగా ఉన్నాయి. అందరూ ఉద్దండులే. ఉద్యమాలు చల్లారడం వల్లనే రైతులు భరోసా కోల్పోతున్నారు .రాతలు ఒంటరిగా ఏమి సాదించగలవు? రాతలేప్పుడైన చేతలుకు ఊతమిస్తాయి. కథలు కష్టాలు చెబుతాయి కానీ కన్నీళ్లు తుడువడానికి చేతులే కావాలి. చూద్దాం కథలు కూడా కన్నీళ్లు తుడిచే చేతులని మొలకెత్తించ వచ్చు .

 8. మరోమాట ..గ్రామాలకు వెళ్లి రైతు కుటుంబాలను పలకరిస్తే ఇంకా ఎన్నో కథలు పుట్టుకొస్తాయి. ఈ దిశగా ఆలోచించవలసిన అవసరం ఉంది.

 9. వనజ తాతినేని says:

  B Narsan గారి వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను . ఎన్నో విభిన్న కథలున్నాయి జీవనపోరాటాలు, నిస్సహాయతలు రైతు,వ్యవసాయ కూలీల జీవితాలని కొండచిలువలా చుట్టుకుని ఉన్నాయి . కానీ రైతుల కన్నీళ్ళని తుడిచే చేతులే కావాలి మనకిప్పుడు. కథలకన్నా అది అవసరం.

మీ మాటలు

*