ఝుంకీలు-1: చినుకు చివర కొన్ని మాటలు 

 

 

-మోహన తులసి 

~

Title_Image_1ఇవాళ ఇక్కడ వాన నెమ్మదిగా నీ మాటలాగా కురుస్తోంది!

 

వాన రాసిపెట్టుంది కాబట్టి మబ్బు పట్టిందంటావా. దండెం మీద బట్టల్ని కాస్త స్వేచ్ఛగా చినుకులికి, మట్టి వాసనకి వదిలేయాల్సింది; అలా చివాలున లాక్కోచ్చేసే బదులు. మళ్ళెప్పుడైనా అవేసుకుని నిండుమేఘమల్లే నేల మీదే తిరగొచ్చు. ప్రతి చినుకు చివరా నామాటల్ని అంటించకు మరి. దండెం గుండె నిండా అవే వేలాడుతున్నాయిప్పుడు. వేలికొసతో వరసనే తాకుతూ వెళ్తావో ఏమో; భూకాగితమ్మీద అక్షరాలుగా చిట్లుతాయి.

 

*******

మధ్యలో నీ అందియల చప్పుడు వింటూ వుంటాను నీకే తెలియకుండా!నువ్వు కవిత్వమవుతూనే వుంటావ్! – అని దొంగచాటుగా నీడైరీలో చదివిన నెమలీక గుర్తు.

 

మంచి పుస్తకమో, హత్తుకునే వాక్యాలో చదివినప్పుడు తప్ప నాగ్గుర్తుకు రాని నువ్వు, నా సూర్యచంద్రుల్ని సైతం మీదేసుకుని తిరుగుతుంటావు. నీక్కోపమొస్తూ ఉంటుంది, అదిగో మళ్ళీ తలుపు ఓరగా జారేసి వెళ్ళిపోయావు; కానీ పూర్తిగా మాత్రం ఏనాడు మూసెళ్ళవు. తిరిగి రావడానికి నువ్వట్టిపెట్టుకున్న జాగాలోంచి నాకు పచ్చని అడవులు, ఆకాశపు నీలిరంగు, లేతెండ గాజుపొడి,ఎగిరొచ్చే ఎండుటాకులు, కొన్ని కళ్ళాపి నీళ్ళు, పాకుతూ వెళ్తున్న పసివాడి చొక్కా అంచులు, నిన్నటి కలలో అమ్మ నెయ్యి కాచిపెట్టిన గిన్నె కనబడుతుంటాయని చెబుతాలే నీకు.

 

******

 

anu

Art: Anupam Pal

ఈ ఝుంకీలకి వ్యక్తిత్వం ఎక్కువోయ్, ఉంగరాల ముంగురులొచ్చి సనజాజి పాదల్లే చుట్టుకున్నప్పుడు నువ్వన్నమాట.

బొటనేలుపై బొమ్మలు గీస్తూ పెదాల మీదకు చేరిన లాకెట్టుకి, మరి చివుక్కుమందో ఏమో మెడ మీద సర్దుక్కూచుంది చటుక్కున. మొన్నెప్పుడో ఇలానే నువ్వన్న గుర్తు, నీడ నల్లగానే వున్నప్పుడు వెన్నెలకి- ఎండకి తేడా ఏముందని. చుక్కలన్నీ చిన్నబుచ్చుకోలేదూ, ఓనాల్రోజులు చంద్రుడు మొఖం చాటేయలేదూ. పుణ్యముంటుంది, ప్రకృతిలో దేనితో మాత్రం నన్ను పోల్చకు. ఈరోజు పెట్టుకొచ్చిన ఈకొత్త ఝుంకీలు చూసావా! కాస్త వాటికి నా కధ చెప్పవూ. అప్పుడన్నావు కదా, నీ ఎడమవైపు కాసేపు నిదరవ్వమనీ.

******

 

జీవితం మరీ మరీ ఇరుగ్గా వుంది, చికాగ్గా లేనందుకు సంతోషం అనుకో! ఆలస్యమైన ఆ అమృతమే జీవితం.

 

ఎటువైపు నుండో ఒక్కోక్కళ్ళు వస్తారు; నువ్వేమీ ఆశించని, అనుకోని సమయములో నువ్వేంటో చెప్పేసి చక్కా నవ్వుతారు. నీలోకి నువు తొంగిచూసుకుంటూ నిశ్శబ్దానికి మెటికలిరిస్తూ మళ్ళీ నువ్వే. సరే, అదంతా కవిత్వపు వేదాంతం, వదిలేద్దూ. క్రిందటేడు, ఇదే సమయానికి జీవితమంత జ్ఞాపకాన్ని చేసుకుంటున్నాను. ప్రతిరోజూ పిసరంత గుర్తుతెచ్చుకుంటూ మరుజన్మ వరకు మోసుకెళ్ళేట్టున్నాను. ఇంతకీ నీకొచ్చి ఏమైనా అర్ధమైందా?! ఒక పగలు-రాత్రి కాకుండా, ఒక నవ్వు-దిగులు కాకుండా, పేరు పెట్టలేనిదేదో మిగిలిపోయిందని.

*

 

మీ మాటలు

 1. సురేష్ రావి says:

  వెన్నలంత మధురంగా ఉంది మీ భావుకత… కమనీయం

 2. బ్రెయిన్ డెడ్ says:

  మ్యూజింగ్స్ ఇంత అలవోకగా ఇంత తేలిగ్గా ఇంత హృద్యంగా రాసుకోవచ్చా , వావ్ . చాలా వాక్యాలు మళ్ళీ మళ్ళీ చదివించి కాసేపు అందులో తేలి మళ్ళీ నెల మీదకి రాలేక గిలగిలడించాయి ఇలా ” దండెం మీద బట్టల్ని కాస్త స్వేచ్ఛగా చినుకులికి, మట్టి వాసనకి వదిలేయాల్సింది; అలా చివాలున లాక్కోచ్చేసే బదులు. మళ్ళెప్పుడైనా అవేసుకుని నిండుమేఘమల్లే నేల మీదే తిరగొచ్చు. ” కదా అనిపించింది .

 3. ఆసాంతం మోహనమే !! “ప్రతిరోజూ పిసరంత గుర్తుతెచ్చుకుంటూ మరుజన్మ వరకు మోసుకెళ్ళేట్టున్నాను. ఒక పగలు-రాత్రి కాకుండా, ఒక నవ్వు-దిగులు కాకుండా, పేరు పెట్టలేనిదేదో మిగిలిపోయిందని.” …. బోలెడు అందమైన అభినందనలు :)

 4. తిరిగి రావడం కోసం తలుపులు ఓరగా జారేసి వెళ్ళడం , అందులోంచి ఎగిరొచ్చే ఎండుటాకులు …ఊహ భలే ఉంది . great musings thulasi garu

 5. Mythili Abbaraju says:

  Just beautiful !

 6. వనజ తాతినేని says:

  ఓ పదిమార్లు చదువుకున్నాక కూడా పదకొండోసారి చదువుకోవాల్సింది ఉంది అనిపించేలా ఉంది .

 7. ఏమి చెప్పాలో తెలీడం లేదు . అక్షరాలు భావాల్ని మోసుకుంటూ ఝుంకీ లకు వేలాడుతూ చలి గాలిని నిమిరినట్లు ఉంది .

 8. కిరణ్ says:

  ఇంకా చదువుతూనే వున్నాను, ఎన్ని సార్లు అని లేక్కపెట్టుకోకుండా! మీరు కవితని చివరిదాకా చదివిస్తారు, మళ్ళీ మొదటి వాక్యానికి వెళ్లేట్టు చదివిస్తారు. ఈ కవితలో మీరు పాద విభజన చేయలేదనే కాని, మీ కవిత్వ పాద నర్తనం అదే…కనిపించని మువ్వలనాదంతో!

  అన్నట్టూ, “అప్పుడన్నావు కదా, నీ ఎడమవైపు కాసేపు నిదరవ్వమనీ.” ఎడమ వైపే ఎందుకు అర్థం కాలేదు..

 9. అందంగా స్పందించడం కూడా ఒక కళే అన్నట్టు, మీ అందరి పదాల్లో మళ్ళీ కవిత్వాన్నే పలకరించమన్నట్టు, ఇంత హృద్యంగా మీ మీ అభిప్రాయాలను తెలిపిన మీకు బోల్డన్ని థ్యాంక్స్.

మీ మాటలు

*