ఎవరున్నారు వాళ్ళకి?

 

-ప్రసాద మూర్తి

~

prasada

 

 

 

 

 

 

ఎవరున్నారు వాళ్ళకి

పైన ఆకాశమూ లేక

కింద నేల కూడా లేనివాళ్ళకి

 

జేనెడు పొట్ట చుట్టుకొలతల్ని

ఏ కొండలతోనో సముద్రాలతోనో

కొలుచుకునే వాళ్ళకి

ఆకుపచ్చ రాత్రులై భూగోళమంతా అల్లుకున్నా

పేగుల్లో ఆకలి మిన్నాగులు కదులుతున్న అసహాయులకు

ఎవరున్నారు?

 

సిమెంటు తూరల్లో తలదాచుకుని

 వెండి చందమామల్ని కలగనే

నిండు చూలాళ్ళకు ఎవరున్నారు

రోడ్డు పక్క దేహాలను అమ్మకానికి నిలబెట్టి

ఏ చెట్టుచాటుకో పోయి తమనే  తొంగి చూసే

ఆకాశానికి తలబాదుకుంటున్న ఆత్మలకు ఎవరున్నారు?

 

ఎవరున్నారు వాళ్ళకి

ఏ అర్థరాత్రి ఏ కాలువ  వంతెన కిందో

వందేమాతర గీతం అభ్యసించే అనాధ బాలలకు ఎవరున్నారు

ఏ కుప్పతొట్టి ఉయ్యాలలోనో

నక్షత్రగోళాలు పాడే జోలపాట వింటూ

 ఏడుస్తూ  నిద్రపోయే అభాగ్య  శిశువులకు ఎవరున్నారు?

 

జీవితాలను యంత్రాలకు తగిలించి

 చిట్లిన ఎముకల్లో జీవన రహస్యాలను అన్వేషించే

  ఖాళీ సాయంత్రాలకు ఎవరున్నారు

మట్టికింద తమను పాతుకుని  

నాగలి కర్రుకు నెత్తుటి సంతకమై వేలాడే మట్టిమనుషులకు

ఎవరున్నారు?      

 

పుట్టిన నేలపేగు పుటుక్కుమని తెగుతున్న శబ్దం

నెత్తి మీద మూటల్లో పుట్టెడు దు:ఖం పిగులుతున్న శబ్దం

వెనకెనక్కి తిరిగి చూస్తే తమ నీడలు గోడుగోడున విలపిస్తున్న శబ్దం

ఏ దిక్కూ తోచక ఎటో కదిలిపోతున్న

 కన్నీటి  కాందిశీకులకు ఎవరున్నారు?

 

తగలబడుతున్న అడవుల్లోంచి పారిపోతున్న పిట్టలకు

కారిడార్ వలల్లో చిక్కి విలవిల్లాడుతున్న సముద్రాలకు

ఎవరున్నారు..ఎవరున్నారు

 

 ఇంకెవరున్నారు

కవులుతప్ప?

*

మీ మాటలు

 1. అవును కవులే వున్నారు. మేమున్నామని శపథం చేసే కవులు ముందుకు రావాలి. All in one, One shot answer. ఎంత ఆశ్వాసం ఇయ్యవలసిన సమయమిదని గుర్తు చేశారు . కవిత బాగుందని మళ్ళీ చెప్పడమెందుకు?

 2. Sadlapalle Chidambara Reddy says:

  మీ పద చిత్రాలు కళ్ళలో కనీళ్లను పులుముతున్నాయి . అద్భుతం సార!!

 3. Sadlapalle Chidambara Reddy says:

  మీ పదచిత్రాలు కళ్ళలో కనీళ్లను పులుముతున్నాయి అద్భుతం సార్!!

 4. T.W.Sudhakar says:

  DR AMBEDKAR

 5. DrPBDVPrasad says:

  అనేక వ్యథార్థ యదార్థ జీవన దృశ్యాలను కవిగాక ఇంకెవ్వరు ఆవిష్కరిస్తారు
  కవి సమస్యలను పరిష్కరిస్తాడు కూడ
  బాధార్తులను సంఘటితం చేసి
  ప్రమూ పదునెక్కన కలాన్ని చూస్తున్నందుకు ఆనందంగా ఉంది

మీ మాటలు

*