షరీఫూ, నేనూ – మా చమ్కీ పూల జ్ఞాపకాలు

 

 

‘చమ్కీ పూల గుర్రం’ కథ ఆంధ్రజ్యోతిలో వచ్చి రెండు వారాలైంది. ఏదో అనువాదం పనిలో వుండి నిన్న రాత్రి దాకా చదవడం కుదరలేదు. తీరా చదవడం మొదలు పెడితే నా కథ చెబుతున్నట్టనిపించింది. అవును ఇది నా కధా, జీవితంలో నా మొట్టమొదటి స్నేహితుడు షేక్ షరీఫ్ కధా, లేదా మా ఇద్దరి కథ. మున్నీయే షరీఫ్. నేను అపూ. తేడా అల్లా, అపూ వాళ్ళ నాన్న సురేష్ లా కాకుండా మా నాన్న ఏనాడూ మా స్నేహానికి అడ్డుతగల్లేదు. నిజానికి మా జీవితాల్లో, మా వూళ్ళో అప్పటికి మతం మనుషుల్ని విడదీయలేదు.

మా కుటుంబాల మధ్య ఎప్పుడూ మతం ఓ చర్చ కాలేదు, మా స్నేహానికి ఎప్పుడూ అడ్డం కాలేదు. మా కుటుంబాలు ఎన్నడూ మా స్నేహానికి అడ్డు చెప్పలేదు కానీ, మతమే నేరుగా ఆ పని చెయ్యబోయింది. కానీ, మేమిద్దరం ఆ ఎత్తుల్ని సాగనివ్వలేదు. అందుకే, దాదాపు 38 ఏళ్ల క్రితం నాలుగో క్లాసులో మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. వేరే వూరినుంచి వచ్చి నాలుగో క్లాసులో చేరిన నాకు ఏర్పడిన స్నేహితులు మల్లి, షరీఫ్. ఆ తర్వాత డేనియల్, పూర్ణా. షరీఫ్ కీ నాకూ ఎంత స్నేహామంటే, పుస్తకాలపై మా పేర్లు షేక్ కూర్మనాథ్ అనీ, కంచి షరీఫ్ అని రాసుకునేంత. స్కూలు అయిపోయినంత వరకూ స్కూల్లోనూ, స్కూల్ అయిపోయాక వాళ్ళ ఇంట్లోనూ గడిపేవాళ్లం. మల్లీ, నేనూ, షరీఫూ, డేనియల్ తిరగని వంశధార రేవులేదు. మేం తిరగని తోటల్లేవు. మేం ఆడని ఆటల్లేవు. అప్పటికప్పుడు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి మాకో సినిమా కథ చెప్పేసే వాడు ఖాళీ పీరియడ్లలో, స్లో మోషన్ షాట్లతో సహా. అన్నిట్లో క్రిష్ణే హీరో, ప్రభాకర రెడ్డి విలన్. అనకాపల్లి నూకాలమ్మ గుడి దగ్గరి నూతిలోంచి పాతాళ లోకానికి వున్న మార్గం గురించీ, అక్కడి ప్రజల జీవితం గురించి కథలెన్నో చెప్పేవాడు.

మేం ఆరోక్లాసులోనో ఏదో క్లాసులోనో వున్నపుడు మా వూళ్ళోకి (హీరమండలం, శ్రీకాకుళం జిల్లా) ఆరెసెస్ ప్రవేశించింది. ఎక్కడో మారుమూల, ‘నాగరికత’కి దూరంలో, కొండల నడుమ వున్న ఆ చిన్న వూళ్ళోకి మత పరంగా మనుషుల్ని విడదీయగల ఆరెసెస్ ప్రవేశించింది. అప్పటికే అనకాపల్లిలో మా పెదనాన్నగారి పిల్లలు ‘శాఖలకి’ వెళ్తుండడం వల్ల, సెలవుల్లో అక్కడికి వెళ్ళినపుడు నాకూ పరిచయం అయింది ‘శాఖ’. అందువల్ల మా వూళ్ళో ‘శాఖ’ పెట్టినపుడు అక్కడికి నేను వెళ్ళడం సహజంగానే జరిగిపోయింది. అంతే కాదు, షరీఫ్ ని కూడా చేర్పించా. బలిష్టుడైన, చురుకైన షరీఫ్ తొందర్లోనే కలిసిపోయాడు మాతో (ఇప్పటికీ బలిష్టుడే. గంటసేపు ఆగకుండా ఈత కొట్టగలడు). ఎక్కడో కిలోమీటర్ దూరంలో జరిగే ‘శాఖకి’ వెళ్ళేవాళ్ళం. ఇలా ఓ రెండు సంవత్సరాలు గడిచేక బీజేపీ మొట్టమొదటిసారి హిందూ సెంటిమెంటుని ప్రచారం చెయ్యడానికి గంగాజల యాత్ర మొదలుపెట్టింది. టీవీలు, ఇంటర్నెట్లూ అస్సలే లేని రోజుల్లోనే దానిగురించి ఈనాడు వంటి పత్రికలు విపరీతంగా రాశాయి.

ఆ గంగాజల యాత్ర ఎక్కడికెక్కడికొచ్చిందో, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుందో వివరంగా రాసేవి పత్రికలు. అలా ఆ గంగాజలం శ్రీకాకుళం వచ్చినపుడు దానికి రక్షణగా వుండడానికి ఏర్పాటు చేసిన బాల రక్షక దళంలో నేనూ, షరీఫూ సభ్యులం. అలా ఎన్నో ఆరెసెస్ కార్యక్రమాల్లో పాల్గొన్న షరీఫ్ క్రమంగా దూరమవడం మొదలుపెట్టేడు. దేశభక్తి గురించి మాట్లాడి మమ్మల్ని రప్పించిన శాఖల్లో తనులేని సంధార్భాల్లో విచిత్రమైన భాష వినబడేది. మనం వేరు, వాడు వేరు అన్న టోన్ వినబడేది.

బహుశా, తానక్కడ unwanted అని పోల్చుకుని వుంటాడు షరీఫ్. వాళ్ళు చెప్తున్నది మనుషుల్ని విడదీసే భాష అని గ్రహించి వుంటాడు. బాధితుడు కాబట్టి తను తొందరగా గుర్తించి వుండొచ్చు. దళితులైనా, మైనారిటీలైనా స్త్రీలైనా – బాధితులు కాబట్టి అవమానాల్ని, అసహనాల్ని, అంతర్యాల్ని లేశమంత వున్నా గుర్తించగలుగుతారు. ఎంత సహానుభూతి చెందినవాళ్ళైనా, ఆ అవమానాల, అసహనాల వల్ల కలిగిన వేదనల లోతుల్ని తెలుసుకునే అవకాశమే లేదు. ఆ లోతులు తెలిసే అవకాశం లేదుగాని సహానుభూతి చెందేవాళ్ళకి ఆ వేదన ఎంతోకొంత అర్ధం కాకుండా పోదు. వాళ్ళు దగ్గరవాళ్ళైనపుడు ఇంకొంచెం ఎక్కువే అర్ధమవుతుంది, మనసుపెడితే.

తనని ఏం గాయపరిచిందో షరీఫ్ అప్పుడు నాకు అప్పుడూ చెప్పలేదు, ఇప్పుడూ చెప్పలేదు. నేనూ అడగలేదు. కానీ, తను లేని సందర్భాల్లో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ జరిగిన సంభాషణల్లో నాకు అర్ధం అయ్యేది, ఆరెసెస్ దేశభక్తిలో ముస్లింలకు ప్రవేశం లేదని. వున్నా, అది వాళ్ళతో మమేకం అయినంతవరకూ మాత్రమేనని.

షరీఫ్ ‘శాఖ’కి దూరం కావల్సిన పరిస్థితులే మొదటి సారిగా నాలో ఆరెసెస్ పట్ల సందేహాలు కలగడానికి కారణమయ్యాయి. ఆ తర్వాత మా father బదిలీ వల్ల నేను చోడవరానికి వెళ్ళడం, అక్కడ నారాయణ వేణూ, వర్మల పూనికతో ఏర్పడ్డ ‘లైబ్రరీ స్టడీ సర్కిల్’ వల్ల ఆరెసెస్ నిజస్వరూపాన్ని పూర్తిగా అర్ధం చేసుకోగలిగేను. దానివల్ల pluralityకి హానే కానీ మేలు లేదని అర్ధం అయ్యింది. ఈ మొత్తం transformation పూర్తికావడానికి ఓ అయిదారేళ్లు పట్టింది. Undoing takes much longer time. అయితే మార్పు మొదలవడానికి కారణం మాత్రం చిన్నపుడు షరీఫ్ ఎదుర్కొన్న పరిస్థితే.

నిన్న రాత్రి అఫ్సర్ కధ చదువుతుంటే ఒక్కసారి నలబై ఏళ్ల క్రితంనాటి సంగతులు గుర్తొచ్చాయి. I felt like reliving my childhood.

మనుషుల వ్యక్తిగతమైన ప్రేమానురాగలని శాసించడానికి రాజ్యం ప్రయత్నిస్తే మన జీవితాలు ఎలా అల్లకల్లోలమవుతాయో ‘మల్లీశ్వరి’ సినిమాలో చూస్తాం. మనుషుల మధ్యలోకి మతం ప్రవేశిస్తే మనసుల్లో ఎలాటి హింస జరుగుతుందో ‘చమ్కీపూల గుర్రం’లో చూస్తాం. As it is, we make the lives of kids miserable by denying them the time they deserve to play. మత వైషమ్యాలతో సృష్టించే హింస దీనికి అదనం. నాకైతే మున్నీ, అపూలు మళ్ళీ ఎప్పటివలెనే ఆడుకోవాలని ఆకాంక్ష. ఒక్క నాకేంటి, అది చదివిన వాళ్ళందరికీ బహుశా అలాటి కోరికే కలిగివుంటుంది. ఆ సామూహిక ఆకాంక్షే, కృషే మనల్ని నిలబెడుతున్నది.

చదివేక, ఇంట్లో అందరికీ ఈ కధ చెప్పేను. “అసలు ఈ కధ నిజంగా జరిగిందా,” అని ఆరేళ్ళ మా పాప అల పదే పదే అడిగింది. ఎప్పుడూ బొమ్మలకి పేరుపెట్టుకు ఆడే అలకి సందేహం – మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటారా అని. “వాళ్ళ అమ్మ రేపు తీసుకెళ్తుందట మున్నీ వాళ్ళింటికి,” అని చెప్తే గాని సమాధానపడలేదు.

అసలు ఆ ప్రశ్నే ఇవ్వాళ దేశంలో అందర్నీ కలచివేస్తుందని, కోట్లమందికి నిద్రలేకుండా చేస్తోందని అల కి ఇప్పుడే ఎలా తెలుస్తుంది? మతం పేరుతో మనుషుల్ని విడదీసే మూకలు పెట్రేగిపోతున్నాయని, అవి మనుషుల మధ్య విద్వేషాన్ని రగిలించేపనిలో వున్నాయని అప్పుడే ఎలా అర్ధం అవుతుంది?

ఇప్పటి సందర్భం రక్తసిక్తమై వున్నది. వ్యధా భరితంగా వున్నది. ఈ దేశంలోని కొందరు పౌరులు భయం గుప్పిళ్ళో బతుకుతున్నారు. ఆటవికపాలన రాజ్యం చేస్తున్నది. ఇప్పుడు ఇలాటి కధలు ఇంకేన్నో రావాలి. అనుమానపు బీజాల్ని ఎవరు వేస్తున్నారో, అసహనపు జ్వాలల్ని ఎవరు ఎగదోస్తున్నారో, ద్వేషగీతాల్ని ఎవరాలపిస్తున్నారో రాయాలి. వాటి గురించి పిల్లలకి చెప్పాలి. వాళ్ళ మధ్య ఎవరెవరు ఎలాటి చిచ్చు పెడుతున్నారో వివరించి చెప్పాలి. పిల్లల మనసులు విరగకుండా కాపాడుకోవాలి.

 

PS: ఈరోజు పొద్దున్నే షరీఫ్ కి ఫోన్ చేశా. ఈ కథ అది మనగురించేనని, నువ్వు చదివితీరాలని.

మీ మాటలు

  1. తిలక్ బొమ్మరాజు says:

    మంచి విశ్లేషణ రాసారు మీ అనుభవాన్ని జోడించి కూర్మనాథ్ గారు.మీ స్నేహం మీ అక్షరాల మధ్యన దివిటీలా వెలుగుతోంది.యిటువంటి వున్నత ప్రమాణాలతో కూడిన ఆర్టికల్స్ ప్రచురిస్తున్న అఫ్సర్ గారికీ,సారంగకు ప్రత్యేక ధన్యవాదములు.

  2. మనల్ని మనం పోల్చుకునేలా ఉండే కథ ఏదైనా గొప్ప కథే . చమ్కీ పూల గుర్రానికి ఆ లక్షణం ఉన్నట్టుంది. కథ గురించి మాట్లాడటమే కాకుండా మీ అనుభవాన్ని కూడా ఓ మంచి కథలానే వర్ణించారు . ధన్యవాదాలు

  3. తహిరో says:

    బాగుంది కూర్మనాథ్ గారూ … సందర్భోచితమైన జ్ఞాపకం .
    అదీ సంగతి – వేణు, వర్మ తగిలారు అంటే – చెప్పేది ఏముంది :) వారి పూనిక రొంబ పారదర్శకమ్. జడత్వాన్ని సహితం జల జల పారేలా చేస్తారు :)
    మీకు గుర్తుకు వచ్చినట్టే దాదాపు చాలా మందికి బాల్యాన్ని కళ్ళ ముందు నిలిపిన కథ ” చమ్కీ పూల గుర్రం “

  4. కుర్మనాథ్ చాలా చాలా బాగుంది. కథలాగే నీ విశ్లేషణ

  5. VELDANDI SRIDHAR says:

    బావుంది కూర్మనాథ్ గారు.. అభినందనలు…

  6. ఇలాంటి అనుభవాలు మనలో చాలా మందికి ఉంటాయి. చిన్నతనం లో భయాలు వస్తే సాయిబ్బు తాత తో తాయిత్తులు కట్టించడం, పచ్చ కామెర్లు వస్తే కాచిగూడ లో మందు తీసుకోడం, ప్రతి రంజానుకి క్షీర్ కుర్మా తినడం, రంజాను నెల లో అర్ధ రాత్రి చార్మినార్ బజార్ కోలాహలం చూడటానికి వెళ్ళడం మర్చిపోలేనివి.
    పొద్దున్నే గుళ్ళో సుప్రభాతం కి ఎంతలా అలవాటు పడిపోతామో మసీదు లో నమాజు కీ అంతే అలవాటు పడిపోతాం. ఈ రోజుకి దర్గామిట్ట లో రొట్టెల పండగ చేసుకుంటారు. ఇలాంటి అనుభూతులు గుర్తు చేసిన మీకు, సారంగ సంపాదక వర్గానికి ధన్యవాదాలు. అలాగే సారంగ సంపాదక వర్గానికి ఇంకో విషయం కూడా మనవి చేసుకుంటున్నాను: నాణేనికి ఇంకో వైపు కూడా ఆలోచించాలి మీరు. దాద్రి సంఘటన తర్వాత దాదాపు ప్రతి వారం సారంగ పత్రిక లో ఆవు మాంసం మీద కథలు , కవిత్వాలు, వ్యాసాలు వస్తున్నాయి . ఇక అగ్రకులాలు అంటూ వచ్చే వ్యాఖ్యలు, కథలు చెప్పనే అక్కర్లేదు. నేను సారంగ పాఠకురాలిని. నేను ఆవుని పూజిస్తాను. శ్రీ కృష్ణుడి అంటే నా మదిలో పిల్లన గ్రోవి ఊదుతూ ఆవు పక్కన నిల్చుని మదిలో మెదులుతాడు. నాగుల చవితికి ఆవు పాలే తెచ్చి నాగ దేవత కి నివేదన చేస్తాను. నా దేవుడి మందిరం లో శివలింగం తో పాటు నందీశ్వరుడు ఉంటాడు. సంక్రాంతి అంటే గంగిరెద్దుల గురించి, కనుమ అంటే పశువుల్ని రైతు పూజిస్తాడని మా పిల్లలకి నేర్పుతాను. ఏ రాజకీయ పార్టీ గురించి, వారి పాలసీ ల గురించి నా లాంటి వారికి అవసరం లేదు. మరి నా లాంటి పాఠకులు మనోభావాల సంగతి ఏంటి? కూర్మ నాథ్ గారి స్నేహితుడు షరీఫ్ గారి మనోభావాలు కించ పరిచిన శాఖా వారికీ, సారంగ సంపాదక వర్గానికి తేడా ఏంటి ? అమెరికా నుంచి వస్తున్న వార పత్రిక కదా శుక్రవారం రాగానే వంగూరి చిట్టెన్ రాజు గారి వ్యాసాలకోసం, సత్యం మందపాటి ట్రావలాగ్ కోసం, దాట్ల లలిత గారి అత్తగారి కథల కోసం చూస్తూ సారంగ పత్రిక తలుపు తట్ట గానే మొహం మీద తలుపు వేసినట్లు గా ఉన్నాయి ఈ వ్యాసాలు.

  7. చందు - తులసి says:

    నిజమే కూర్మనాథ్ గారూ…ఒక ఇరవై ఏళ్లకింద మా ప్రాంతంలో హిందూ ముస్లిం చాలా కలగలిసి పోయి ఉండేవారు. జానపాడు దర్గాను ముస్లింల కన్నా హిందువులే ఎక్కువగా దర్శిస్తారు. సైదులు, జానయ్య, హుసేన్, మదార్…ఇవన్నీ మా దగ్గర హిందువుల పేర్లే… పీర్లపండుగ గురించి చెప్పేదేముంది…
    ఇటువంటి అపురూపమైన…..జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్నారు.కచ్చితంగా ఖండించాల్సిందే..

  8. బాగా రాసారు ..

  9. కూర్మనాథ్ గారూ చెప్పినట్లు హిందూ ముస్లిం కలగలిసి పోవడం ఆంద్ర ప్రదేశ్ అన్ని ప్రాంతాలో ఉన్నదే ! ఇప్పుడే మనుషుల మధ్య ఇనుప తెరలు మొలిచి విస్తరిస్తున్నాయి.

Leave a Reply to RAJANI Cancel reply

*