పాత కత మొదలైంది!

 

-అన్నవరం దేవేందర్
~
***
 devendar
తరతరాలుగ  తనువుల ఎట్టి కనికట్టు
అంతులేని అమానవీయకరణ
చెప్పులు గొంగళ్ళు కొడవండ్లు
వశపడక ఎదురు తిరిగినయ్
నోట్లె  నాలికె లేనోళ్ళు నిప్పులు కక్కిండ్రు
సంఘాలు జెండాలు ర్యలీలై సాగినయి
శ్రమ జీవుల జబ్బలకు
అనివార్యంగా తుపాకులు చేరినయి
పెత్తనాల మీసాలు ,బొర్రహంకారాలు
పాణ భయంతో పట్నం బాట పట్టినయి
నైజాం  రాజ్యం వాళ్ళకు నీడనిచ్చింది
అప్పుడే విలీనమైన
యూనియన్ జెండా అండనిచ్చింది
మురిసిపోయిన జాగీరుదార్లు
గాంధీ టోపీలు పెట్టుకొని మల్లా పల్లెల సోచ్చిండ్రు
*                 *                     *
పాత కత మొదలైంది
ఎట్టి బానిసత్వం ఏర్పడకుంట సాగుతంది
చిదిమితే రాలేట్టుగ అయినయి ఆ అహంకారాలు
అడిలిచ్చుడు బెదిరిచ్చుడు బుసకొట్టుడు
బక్క ప్యాదోల్ల ఉసురు తీసుడు
కాలం ముప్పైఎండ్లుగా  నడుస్తూనే ఉన్నది
మల్లా  ఊరూరా సంఘాలు జెండాలు
జైకొట్టే జైత్ర యాత్రలు
ఎక్కడికక్కడ దళాల కదలికలు
సంకలల్లకు చేరిన ఏ .కె .నలబై ఏడులు
భూమి లోపల పుట్టిన విస్పొటనాలు
జెండాలు పాతిన భూములు జాగలు
పెద్ద పెద్ద డంగు సున్నం భవంతులు వదిలి
మల్లోసారి  పట్నం బాట  పట్టిండ్రు
సర్కారుకు స్వయానా సుట్టాలైండ్రు
*     *     *      *
పల్లెలు పచ్చని అడవులు కాకవికలమైనయి
వాగుల్ల వంకల్ల నెత్తురు పారింది
మొసమర్రక  దళాలు దూరం జరిగినయి
పాతిన జెండాల జాగల కనీలు  నిలిచినయి
భూములకు రెక్కలచ్చి పచ్చ నోట్లుగ  విచ్చుకున్నయి
భూస్వామ్యం రాజకీయం అల్లిబిల్లిగ అల్లుకున్నాయ్
ఎగిసిపడిన అస్తిత్వ ఉద్యమము కలిసివచ్చింది
సూస్తుండగా పదిహేనేడ్లు గిర్రున తిరిగినయి
పల్లె ఆకాశం నిండా పాత పక్షుల చక్కర్లు
పాత గడీలకు కొత్త గులాల్ రుద్దుకున్నది
*      *    *
చక్రం గిర గిర తిరిగినట్టు  అనిపిస్తంది
ఏర్పడకుంట  కనికట్టు కొత్త రూపం తీసుకున్నది

మీ మాటలు

  1. buchi reddy gangula says:

    అన్న — బాగుంది
    మన బతుకులను కళ్ళకు అద్దినట్లు చెప్పారు
    కాని 16 నెలల పాలనలో — మల్లి దొర ల పాలనే కనిపిస్తుంది — మారింది
    ఎక్కడ ??? పాలన లో మార్పు అవసరం ..
    ———————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  2. కాలాన్ని కలానికి చుట్టి గిరగిరా తిప్పినట్లుంది కవిత. కింద వడ్డా మీద వడ్డా ఒకటేనాయే …

  3. చరిత్ర ప్రహసనంలా పునరావృతమవుతుంది అంటే ఇదేనేమో. వెనక్కి తిరిగిచూస్తే ప్రతి పదేళ్ళకో పదేపదిహేనేళ్ళకో కొత్త శత్రువు కనిపిస్తున్నాడు. ముందు నిజాం , ఆ తర్వాత దొరలు, ఆ తర్వాత ఆంధ్రోల్లు, మళ్లీ దొరలు. పాఠం పాతదే. గుణ పాఠాలు పాతవే.
    -శశాంక

  4. చందు - తులసి says:

    దొరలు మల్ల వస్తే…గుతపలు సిద్ధంగనే ఉన్నాయి.
    ప్రాంతం వాడే మోసం చేస్తే..ఏం జేయాల్నో కాళోజీ సార్ చెప్పిన మాటలు యాదున్నయి.

  5. Shivarathri Sudhakar says:

    శిథిలమైన గడీలు మళ్ళా సున్నమేసుకొని పాలనకు తయారైనయ్. అందుకే.. అందుకోర గుత్పందుకో… ఈ దోపిడీ దొంగల తరిమేటందుకు…@వాళ్ళు మల్లోస్తారు… గడీలను కూల్చనీకి…..

  6. భవిష్యత్తులో మళ్ళీ కడుపు నొప్పి తప్పదేమో !

Leave a Reply to buchi reddy gangula Cancel reply

*