పదుగురికీ తెలియాల్సిన నడత – వికర్ణ

cover page and back page quark4.qxd

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమ శంకర్

పురాణాలలోని కొన్ని పాత్రల గురించి చాలామందికి సమగ్రంగా తెలియదు. ముఖ్యంగా పురాణగాథలని పునః కథనం చేసేడప్పుడు ఆ యా పాత్రల స్వరూప స్వభావాలు మార్పులకు లోనవుతుంటాయి. కొన్ని పాత్రలు ప్రజల నోట్లో నానుతాయి, మరికొన్ని మరుగున పడిపోతాయి. వందల మందిలో ఒకడిని గుర్తుంచుకోవాలంటే ఆ వ్యక్తి గుణవంతుడైనా అయ్యుండాలి లేదా పరమ నీచుడైనా అయ్యుండాలి. దుష్టుల దుష్కార్యాలను ఎక్కువగా ప్రాచుర్యంలోకి తేవడం వల్ల, కొందరు మంచివాళ్ళు చేసిన  సత్కార్యాలు, చూపిన తెగువ వెలుగులోకి రావు. మహా భారతంలోని పాత్రలలో చాలా మటుకు ఇలా విస్మృతికి గురైనవే ఎక్కువ. దుస్సల కాకుండా, మిగిలిన నూరుగురు కౌరవ సోదరులలో మహా అయితే నలుగురు లేదా అయిదుగురు పేర్లు గుర్తుంటాయేమో. మిగతావారి ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటివాడే వికర్ణుడు. అతడు గాంధారి పుత్రుడు. కౌరవులలో పదిహేడవవాడు. వికర్ణుని జీవితానికి కాల్పనికతను జోడించి నవలగా సృజించారు డా. చింతకింది శ్రీనివాసరావు. రచయితకి ఇది తొలి నవల.

మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధన దుశ్శాసనులను – నేటికాలంలో మహిళలను అగౌరవపరిచేవారికి ప్రతీకలుగా వ్యవహరిస్తున్నారు. “దేశంలో సందుకో గాంధారి సుతుడు”న్నాడనే నానుడి ఏర్పడిపోయింది. దేశ రాజధానిలో జరిగిన నిర్ఘయ ఘటన పౌరులందరినీ కలచివేసింది. అదే ఈ నవల వ్రాయడానికి ప్రేరణగా మారింది. ‘‘అక్కడా ఇక్కడా అని లేదు. వారూవీరూ అని తేడాలేదు. ప్రతీ వీధిలోనూ, వాడలోనూ, కోటలోనూ, పేటలోనూ స్త్రీలమీద దాడులు దారుణంగా సాగిపోతున్నాయి. వీటన్నింటి గురించి బాగా ఆలోచిస్తున్నప్పుడే మహాభారతంలోని వికర్ణుణని ఘట్టం గుర్తుకువచ్చేది. ద్రౌపది చీర వొలిచేయాలని తలచిన దుర్యోధనునికి వికర్ణుడే అడ్డుతగలటం ఆశ్చర్యమనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ గాంధారీ సుతులు. ఏకోదరులు అప్పుడనిపించింది. అప్పటి భారతంలో ఒక వికర్ణుడున్నాడు గానీ, ఇప్పటి భారతావనిలో వీధికో వికర్ణుడుంటేనే కానీ కాంతల కష్టాలు తీరబోవని. అలా వికర్ణుడు నా మటుకు నాకు హీరో అయిపోయాడు’’ అంటారు రచయిత. అధర్మాన్ని ఎదిరించి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించేవారే నేటి భారతావనికి అవసరం. అటువంటి ఋజువర్తన కలిగినవాడే మహాభారతంలోని వికర్ణుడు.

వికర్ణుడంతటి నిజాయితీపరుడు బాల్యంలో ఎలా ఉండి ఉంటాడు. కాస్త పెద్దయ్యాక మరెలా ఉంటాడు. ఇంకాస్త పెరిగాక ఇంకెలా ఉంటాడు… వంటి అంశాలను నాలో నేనే తర్కించుకున్నాను. ఆ విధంగా ఈ పుస్తకానికో రూపం వచ్చింది” అంటారు రచయిత.

వికర్ణుడి జీవితం విలక్షణమైనది. అతని ధీరోదాత్తమైన జీవితానికి – “మహోదయం, విషభేది, ప్రతిభకు పట్టం, నీతిబాట, కణికవ్యూహం, గురి..సిరి.., తప్పిన శిక్ష, రాజ(అ)సూయం, బహిష్కరణ, పూరుడు.. పూర్వజన్మ, త్రివిష్టపం కొండల్లో, యుద్ధం యుద్ధం, పునరాగమనం, మహాభినిష్క్రమణం” అనే అధ్యాయాలతో నవలారూపమిచ్చారు రచయిత.

వికర్ణుడి జననం, తోటి సోదరుల కంటే విభిన్నంగా పెరగడం, దుర్యోధనుడి కుతంత్రాలకు అడ్డు చెప్పడం, ధృతరాష్ట్రుడికి సుఖదకు పుట్టిన యుయుత్సుని మర్యాద కోసం సభలో వాదించడం, ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో దుర్యోధనుడిని ఎదిరించి రాజ్య బహిష్కరణ శిక్షకి గురవడం, తుదకు గాంధారి మాటకు కట్టుబడాలన్న ‘ధర్మానికి’ బద్ధుడై కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన పోరాడి తనువు చాలించడం వరకూ సాగుతుంది కథ.

ధర్మాధర్మ విచక్షణ ఏ యుగంలోనైనా మానవులకు అవసరమైనదే. తాను తప్పు చేస్తున్నాడా ఒప్పు చేస్తున్నాడా అనేదీ ప్రతీ మనిషికి తెలుస్తునే ఉంటుంది. కానీ ఆ క్షణంలో మనిషిని ఏదో ఉన్మత్తత్తో లేదా దురావేశమే ఆవరిస్తుంది. ఒక్క క్షణం పాటు తనని తాను నిలవరించుకుని ఆలోచిస్తే.. ధర్మమార్గంలో చరించడానికి అవకాశం లభిస్తుంది. తనది కాని దానికి ఆశపడడం, బలవంతంగా చేజిక్కించుకోవాలనుకోవడం, విపరీతంగా కూడబెట్టాలనుకోవడం, ఎదిరించినవారిని అడ్డు తొలగించుకోవాలనుకోవడం, కుయుక్తులు పన్ని అప్రతిష్ఠ పాలు చేయడం, శారీరకంగా… కుదరకపోతే మానసికంగా వేధించడం, రాజనీతి పేరుతో తాము చేసేవాటిని సమర్థించుకోడం, పలుకుబడి సాయంతో తాము చేసిన నేరాలకు శిక్షను తప్పించుకోడం వంటివి ప్రతీ యుగంలోనూ ఉన్నాయి. ఇలాంటివి చేయకూడదు, తప్పు అని చెప్పేవాళ్ళూ అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. అయితే ఆ కాలంలో వారి గొంతులు దృఢంగా వినబడేవి. ఈనాడు బలహీనమయ్యాయి. మంచి మాటలు చెబుదామన్నా, సమాజపు పోకడలకు వెరచి మాకెందుకులే అనుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. మంచితనం చేతకానితనమైన కాలంలో వికర్ణుడిలాంటి వారి అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారు రచయిత.

ఓ ధర్మపరుడి కథని సులభమైన శైలిలో, తేలికపాటి పదాలతో ఆసక్తిగా చదివించేలా వ్రాశారు రచయిత. పౌరాణిక కథకి తగ్గట్టుగా సంభాషణలున్నాయి.

‘‘సమయం వచ్చినపుడు మాట్లాడగలగాలి. వేళ మించిపోకుండా బలం చూపగలగాలి. కలసిరాని కాలంలో సైతం మంచివైపు నిలవగలగాలి. ధర్మం మాట్లాడగలగాలి. అదీ మనిషి జీవితానికి అర్థం. మానవ జీవితానికి పరమార్థం’’ అని నిండుసభలో ధర్మరాజుతో వికర్ణుడు పలికిన మాటలు ఏ కాలంలోనైనా ఆచరించదగ్గవే.

యుద్ధం ఎటువంటి వినాశనానికి దారితీస్తుందో వికర్ణుడు గాంధారితో చెప్పిన ఈ మాటలు – యుద్ధపిపాసులందరికీ ఓ హెచ్చరిక లాంటివి. “గౌరవం యుద్ధాల వల్ల రాదమ్మా. ధర్మం వల్ల వస్తుంది. నీతి నిజాయితీల వల్ల వస్తుంది. సమరం అంటే ఏమనుకుంటున్నావమ్మా. అది కలిగినవారి కొంగుబంగారం. లేనివారి దౌర్భాగ్యం. రాజులు చేసే యుద్ధంలో ఓడిపోయేది ఎవరమ్మా. పేదలే కదా. మహా అయితే కొందరు రాకుమారులు ఈ పోరులో చనిపోవచ్చు. కానీ, అక్షౌహిణీల కొద్దీ మరణించే సైనికులు బీదలు కాదూ. మీ వద్ద సేవకులుగా పనిచేస్తున్నవారూ కాదూ. రాజ్యకాంక్ష ఎంతటి ప్రమాదకరమో తెలుసా అమ్మా. అది కన్నవారిని, తోబుట్టువులను, బంధుమిత్రులను కూడా పాము తన పిల్లల్ని తానే తిన్నట్లు కబళిస్తుంది…”.

యుద్ధం తర్వాతి పరిణామాలు ఎంత వేదనాభరితంగా ఉంటాయో అద్భుతంగా చెప్పారు రచయిత. “ఇరుపక్షాలవారు ఒక్కలానే ఉన్నారు. యుద్ధానికి ముందు వారిలో ఎన్నయినా తేడాలుండవచ్చు. ఇప్పుడు మాత్రం వారిలో సమానతలు చాలానే ఉన్నాయి. కన్నీరు. బాధ. బెంగ. యాతన… ఇవీ ఇప్పుడు వారు సాధించుకున్నవి.”

“పోరాటంలో ఓడేవాడు మనిషి, ఓడించేవాడు మనిషే. మనిషి అనగానే ఎక్కడో ఒక మూల మానవత ఉండకపోదు. అది ఏదో ఒక క్షణాన బహిర్గతం కాకనూపోదు.” అంటారు రచయిత. ఆ మానవతకి వెలికితీయడానికి దోహదం చేసే వ్యక్తుల గురించి తెలుసుకోవడం అవసరం. అటువంటి వాడే వికర్ణుడు. వికర్ణుడి జీవితాన్ని తెలియజెప్పే ఈ పుస్తకం ఆశించిన ప్రయోజనం గొప్పది.

‘‘రాజ్యాన్ని సక్రమంగా పాలించడానికి, పేదలను ఆదుకోవడానికి కొన్ని సందర్భాల్లో శాస్త్రాలు ఉపకరించకపోవచ్చు. ధర్మగుణం, నీతి నిజాయితీలు తప్పక ఉపయోగపడతాయి. స్త్రీలు గౌరవాన్ని అందుకునేచోట మానవత ప్రకాశిస్తుంది. మహిళల ఔన్నత్యాన్ని కాపాడగలిగేది వికర్ణుని వంటివారే. వీరి సంఖ్య ఎంత పెరిగితే ప్రపంచానికి అంత ప్రయోజనం. వికర్ణుని చరితను ఔదలదాల్చగల సమాజం అమ్మలను గౌరవించగలదు. ఆరాధించగలదు. అందుకే వికర్ణుని నడత పదుగురికీ తెలియజేయండి. అతని గుణగానం చేయండి. ఇదే నేను ప్రధానంగా చేయగల ధర్మబోధ. ఈ యుగానికైనా, రేపటి కలియుగానికైనా…’’అని భీష్ముడి ద్వారా నవల చివరలో పలికించిన మాటలకు క్రియారూపం ఈ నవలే.

వృత్తిరీత్యా విలేఖరి అయిన డా. చింతకింది శ్రీనివాసరావు గారు రచించిన అలివేణీ ఆణిముత్యమా, దాలప్ప తీర్థం, నవ్య కవితారూపం నానీ – వివేచన, స్వరూపసుధ పుస్తకాలు కూడా ప్రఖ్యాతిగాంచినవే.

శ్రీనిజ ప్రచురణలు, విశాఖపట్నం వారు ప్రచురించిన ఈ 160 పేజీల నవల వెల 110/- రూపాయలు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

కొల్లూరి సోమ శంకర్

ప్రచురణకర్త చిరునామా:

శ్రీనిజ ప్రచురణలు,

6-60/1, రవీంద్రనగర్, పాత డెయరీ ఫారం

విశాఖపట్నం-40

మీ మాటలు

 1. చందు - తులసి says:

  చరిత్రకు(పురాణాలకు) అందకుండా పోయిన ఇలాంటి పాత్రల గురించి ఇవాళ తెలియజేయాల్సిన అవసరం ఉంది…
  శ్రీనివాస రావు గారి ప్రయత్నం అభినందనీయం..
  సోమ శంకర్ గారూ..మీ విశ్లేషణ కూడా వివరణాత్మకంగా, చదివించేలా సాగింది..

 2. ధన్యవాదాలు చందు – తులసి గారు
  కొల్లూరి సోమ శంకర్

 3. సంతోషం

మీ మాటలు

*